Thursday, 30 January 2014

మాఘ మాసం లో సుర్యారాధనకు మరి కొన్ని శ్లోకాలు, సూర్య నమస్కార మంత్రాలూ:

ధ్యేయ: సదా సవిత్రు మండల మధ్య వర్తీ,
నారాయణ సరసిజానన సన్నివిష్ట:
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ,
హరీ హిరణ్మయ వపు: ద్రుత శంఖ చక్ర:

సూర్య నమస్కార మంత్రాలూ:

1. ఓం మిత్రాయ నమ:
2. ఓం రవయే నమ:
3. ఓం సూర్యాయ నమ:
4. ఓం భానవే నమ:
5. ఓం ఖగాయ నమ:
6. ఓం పూష్ణే నమ:
7. ఓం హిరణ్య గర్భాయ నమ:
8. ఓం మరీచయే నమ:
9. ఓం ఆదిత్యాయ నమ:
10. ఓం పవిత్రే నమ:
11. ఓం అర్కాయ నమ:
12. ఓం భాస్కరాయ నమ:

ఈ మంత్రాలూ చదువుతూ సూర్య నమస్కారాలు చేసిన తరువాత ఈ క్రింది శ్లోకమును చదువ వలెను.

ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వన్తి దినే దినే
జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే..

 క్రింద చెప్పిన మంత్రమును చదువుతూ ముమ్మారు సూర్యునకు అర్ఘ్యము నీయవలెను.

ఏహి సూర్య! సహస్రాంశో ! తేజోరాశే! జగత్పతే!
అనుకమ్పయ మాం భక్త్యా గృహాణార్ఘ్యం దివాకర !


మాఘ మాసంలో సముద్ర స్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. మాఘ పూర్ణిమ నాడు అందరు తప్పనిసరిగా సముద్ర స్నానం చేస్తారు. సముద్ర స్నానమే కాకుండా, ఏదైనా నదిలో కానీ, జలాశయం లో కానీ, మనకు ఎక్క్కడ వీలుంటే అక్కడ పుణ్యస్నానాలు చేసేటప్పుడు ఆ జలములో గంగాదేవి వసించి ఉన్నది, గంగా స్నానం పాపాలను తొలగిస్తుంది ,  విష్ణు లోక ప్రాప్తిని కలిగిస్తుంది అని భావించి స్నానం చేస్తాము. అటువంటి సందర్భాలలో చదువుకోవలసిన శ్లోకాలు:

1. గంగా గంగే తి యో బ్రుయాత్ యోజనానాం శతైరపి, 
    ముచ్యతే సర్వ పాపెభ్యో, విష్ణు లోకం సగచ్చతి.

2. అంబ: త్వ ద్దర్శన్నాన్ముక్తి: న జానే స్నానజం ఫలం
    స్వర్గారోహణ సౌపానౌ మహా పుణ్య తరంగినే

3. యౌ సౌ సర్వగతో విష్ణు: చితస్వరుపే నిరంజన:
    న ఏవ ద్రవ రూపేణ గంగాంభో నాత్ర సంశయ:

4.నందిని, నళినీ, సీతా, మాలిని, చ మహాపగా
   విష్ణు పాదాబ్జ సంభూత, గంగా, త్రిపథ గామినీ,
   భాగిరథి, భోగవతి, గంగా త్రిదశేశ్వరి,
   ద్వాదశైతాని నామాని, యత్ర యత్ర జలాశయే,
   స్నానకాలే పఠెన్నిత్యమ్, మహా పాతక నాశనం.మాఘ మాసం సూర్యునికి ప్రీతికరమైనది అని అందరికి తెలుసు. ప్రత్యక్ష దైవం అయిన సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత అని ప్రతీతి.  ఈ మాఘ మాసం లో సూర్యుని నుంచి వచ్చే కిరణాలూ మన శరీరం లోని అన్ని రుగ్మతలను తొలగిస్తాయి అని అంటారు. మాఘమాసం లో వచ్చే అన్ని ఆది వారాలలొను , ముఖ్యంగా రధ సప్తమి నాడు సూర్యుడిని ఎర్రటి పుష్పాలు, ఎర్రని గంధము, జిల్లేడు పూవులతో పూజిస్తారు. చిక్కుడు కాయలతో రథం చేసి, రాగి పళ్ళెం లో సూర్యుడిని ఆవాహన చేసి ఆవు పాలతో నైవేద్యం వండి చిక్కుడు ఆకులలో పెట్టి  సూర్యునికి నివేదిస్తారు.

ఈ మాసం అంతా ఆదిత్య హృదయం, సూర్య నమస్కార స్తోత్రాలు,  చదువుకుంటారు. చిన్న పిల్లలు కూడా చదువుకోనేందుకు వీలుగా 4 శ్లోకాలు ఇక్కడ  ఇస్తున్నాను . గమనించ గలరు. ఆదిత్య హృదయం, సూర్యుని స్తోత్రాలు చదువుకోవడానికి వీలు లేని వాళ్ళు, ఓపిక, తీరిక లేని వాళ్ళు.  ఈ మాసం ఆంతా ఇవి చదువుకొన్నా చాలు.

సూర్యనారాయణ మూర్తిని బ్రహ్మ విష్ణు, మహేశ్వర రూపంగా కూడా భావిస్తారు.

1. నమ: సవిత్రే జగదేక చక్షుసే, జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే
    త్రయీ మయీ త్రిగుణాత్మ ధారిణే, విరించి నారాయణ శంకరాత్మనే.

2. భానో భాస్కర మార్తాండ చండ రశ్మి దివాకర:
    ఆరోగ్య మాయు ర్విజయమ్ శ్రియం పుత్రాంశ్చ దేహిమే

3.  బ్రహ్మ స్వరూప ముదయే, మధ్యహ్నెతు మహేశ్వరం,
     సాయం సంధ్యా యెత్సదా విష్ణుం , త్రిమూర్తిశ్చ దివాకర:

4. ఓం నమ: సూర్యాయ శాంతాయ సర్వ వ్యాధి నివారినే,
    సర్వొపద్రవ నాశాయ భాస్కరాయ నమో నమ:
Wednesday, 29 January 2014

సర్వ కార్య సిద్ధికి హనుమాన్ చాలీసా పారాయణము:

రామచరిత మానసము అనే గ్రంధము వ్రాసిన శ్రీ తులసి దాసుకు  హనుమంతుని దర్శనము జరిగిన పిదప ఆ ఆనందములో హనుమాన్ చాలీసా వ్రాసారని ప్రతీతి. కేవలం హనుమంతుని స్మరించటం వలన బుద్ది, బలం, యశస్సు, ధైర్యం, నిర్భయత్వం, రోగము లేకపోవుట ,వాక్సుద్ధి,  సాధ్యం కాని పనులు సాధ్యమగుట మున్నవి కలుగును.

బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వ మరోగతా:
అజాడ్యం, వాక్పటుత్వం చ హనుమత్ స్మరణా ర్భవెత్.

అని కదా శాస్త్ర వచనం.

హనుమంతుని అరటి తోట మధ్యలో కాని, అరటి చెట్లతో ఏర్పరిచిన మందిరంలో కాని పుజించినచొ విశేష ఫలములు కలుగును. స్వేతార్క పుష్పాలను హనుమ పూజలో ఉపయోగించ వచ్చును. శ్వేతార్క పుష్పములతో అరటి తోటలో హనుమను పూజించు వార్కి విశేష ఫలములు కలుగును. హనుమను పుజించువారు సమస్త దేవతలను పూజించిన ఫలమును పొందెదరు. వారికీ భోగ మోక్షములు నిలిచి యుండును. రోజుకు 11 పర్యాయములు హనుమాన్ చాలీసా నలభై రోజులు పారాయణ చేసిన వారికీ హనుమ అనుగ్రహముతో, వివాహం, ఉద్యోగం, ఆరోగ్యం, గ్రహ దోష నివారణ మొదలగునవి నిశ్చయముగా ప్రాప్తించును.

యుద్ధములో మూర్చ పోయిన లక్ష్మణునకు సంజీవని పర్వతమును తెచ్చి ఆరోగ్యమును నిలిపిన హనుమను రామచంద్రుడు చిరంజీవి అని ఆశీర్వదించెను. అందువలననే ఈయన చిరంజివులలొ ఒకడైనాడు.

అశ్వద్ధామ బలిర్వ్యాసో, హనుమన్స్చ విభీషణ,
కృప, పరశురామశ్చ, సప్తైతే: చిరజివిన:

ఈ శ్లోకం చదువుకోను వారికీ అన్ని వ్యాధులు పోయి సుఖముగా దీర్ఘాయువుతో జివించెదరు.

పరమ పవిత్రమైన హనుమంతుని నామం భక్తి శ్రద్ధలతో 12 పర్యాయములు స్మరణ చేయువారికి ఏ కార్యమైనను నిశ్చయముగా సిద్ధించును. అని పరాశర మహర్షి స్వయముగా చెప్పెను.

1. అతులిత బలధామమ్ స్వర్ణ శైలాభ దేహం,
    దనుజ వన క్రుశానుం జ్ఞానిన మగ్రగన్యమ్
    సకల గుణ నిదానం, వానరానా మదీశం
    రఘుపతి ప్రియ భక్తం వాత జాతం నమామి.

2.  గోష్పదీకృత వారాసిం మశకి కృత రాక్షసమ్
     రామాయణ మహామాలా, రత్నం వందే అనిలాత్మజమ్

3.  యత్ర యత్ర రఘునాథ కీర్తనం
     తత్ర తత్ర క్రుతమస్తకాంజలిమ్
     భాష్పవారి పరిపూర్ణ లోచనం
     మారుతిం నమత రాక్షసాంతకం.

             శ్రీ హనుమతే నమ:Tuesday, 28 January 2014

ప్రతి సందర్భానికి, ప్రతి విశేషానికి ఒక డే అని సంబరాలు చేసుకోవటం విదేశీయులకు అలవాటు. అందులో భాగం గానే mothers  day , fathers  day , friendship day , valentines day  ఇలా ఎన్నో వింటున్నాం.

ఈ రోజు puzzles day  అండీ. మనలో ఎంతో మందికి puzzles  అంటే చాల ఇష్టం. మొదట్లో crossword puzzles మాత్రమే అందరికి తెలిసినవి. గత కొంత కాలంగా సు-డో-కు puzzle అందరికి favourite ఐపోయింది. సుడోకు దినపత్రిక లో కానీ, వారపత్రికలలో కానీ కనిపిస్తే అందరి చేయి, మెదడు, మనసు అటువేపు లాగేస్తోంది.

ఈ puzzle day  ని 1995 నుంచి జనవరి 29 న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఎక్కువ ఆదరణ పొందిన puzzles ఏమిటంటే : jigsaw ( అంటే ఒక బొమ్మని కత్తిరించి విడి ముక్కలను మళ్లీ యదాతధం గా కలపడం ), ఆధారాలను బట్టి పదాలు కనుక్కొనే పద ప్రహేళికలు (crossword ), అంకెలతో ఆడుకునే సుడోకు, గజిబిజి అక్షరాల సముదాయంలో పదాలు కనుక్కునే word  search , బొమ్మల్లో తేడాలు కనుక్కునే find the  difference , గజిబిజిదారి  కనిపెట్టే maze , రంగు రంగుల ఘనాలతొ ఆడే rubic cube .

ఈ puzzles వల్ల మంచి కాలక్షేపమే కాక, మెదడుకు మంచి వ్యాయామం అందిస్తుంది. మెదడు చక్కగా పదును పెట్టుకోవచ్చు.

తెలుగు లో కూడా, పొడుపు కథలు, చిక్కు లెక్కలు అని ఎన్నో రకాల puzzles ఇంట్లో పెద్దవాళ్ళు ఖాలీ సమయాల్లో పిల్లల చేత ఆడించేవారు. వీటన్నిటి ఉద్దేశ్యం పిల్లల బుర్రలకు పదును పెట్టటమే.


(ఈనాడు సౌజన్యం తో )

సతి సావిత్రీ కృత యమాష్టకం


తపసా ధర్మ మారాధ్య పుష్కరో  భాస్కర: పురా
ధర్మం సూర్య: సూడం ప్రాప  ధర్మరాజం నమామ్యహం

సమతా సర్వభూతేషు యస్య సర్వస్య సాక్షిన:
అతొయన్నమ్ సమనమితి తమ్ ప్రణమామ్యహం

ఏ నామ్థస్చ కృతో విశ్వే సర్వేషాం జీవినామ్ పరం
కర్మాను రూపం కాలేన తమ్ క్రుతాన్తకమ్ నమామ్యహం

పిభర్ర్తి దండం ద్నదాయ పాపినాం శుద్ది హేతవే
నమామి తమ్ దండ ధరం యస్చాస్తా సర్వ జివినాం

విశ్వం చ  కలయద్యేవ య స్సర్వేషు చ సన్తతమ్
అతీవ దుర్నివార్యమ్ చ తమ్ కాలం ప్రణమామ్యహం

తపస్వీ బ్రహ్మ నిష్టోయ సంయమే సంజితెంద్రియ:
జివానాం కర్మ ఫలశ్త: తమ్ యమం ప్రణమామ్యహం

స్వాత్మా రామశ్చ సర్వజ్ఞో మిత్రం పుణ్యకృతాం భవేత్
పాపినాం క్లెశతొ యస్తం పుణ్య మిత్రం నమామ్యహం

యజ్జన్మ బ్రహ్మ మనొమ్యెసెన జ్వలంతం బ్రహ్మ తేజసా
యో ధ్యాయతి పరం బ్రహ్మ తమ్ ఈశం ప్రణమామ్యహం

యమాష్టకం ఇదం నిత్యం ప్రాతరుథ్థాయ య: పథెథ్
యమాత్తస్య భయం నాస్తి సర్వ పాపాత్ విముచ్యతే

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు. ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.

"అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్!
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!

ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది....ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు.
భస్మ ధారణ:

విభుతి పరమేశ్వరునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ విభుతి ధరించిన వారికి పరమేశ్వరుడు అనుక్షణం కాపాడుతు ఉంటాడు. నరక బాధలు లోనుకాకుండా చూస్తాడు. కాల్చిన పేడను (ఆవు పేడ) ఈ భస్మం లో ఉపయోగిస్తూ ఉంటారు. భస్మ ధారణ చేయకుండా చేసే జపతపాలు ఫలితాలను ఇవ్వవని శాస్త్ర వచనము. మన శరీరములో 32 చోట్ల భస్మ ధారణ చెయ్యాలి అని శాస్త్రము చేప్తోంది, కాని ఈ కాలము లో అలాగ చెయ్యటము వీలుపడని పక్షములో కనీసము శిరస్సు, రెండు చేతులు, గుండే, నాభి అనే ఐదు ప్రదేశాలలో భస్మాన్ని ధరించవచ్చు. త్రిపుండ్రాలుగా (ముడు గీతలు) అడ్డముగా భస్మ ధరణ చెయాలి. ఇలాగ చేస్తే జన్మ జన్మల పాపాలు నసించి పోతాయని పెద్దల వాక్కు.
ఈ భస్మ ధారణ చేయడానికి కొన్ని మంత్రాలు చెప్పబడ్డాయి శాస్త్రాలలో.
బ్రాహ్మణ, క్షత్రీయులు "మానస్తోకే మంత్రము " తో, వైశ్యులు " త్ర్యయంబక " మంత్రము తో , ఇతరులు శివపంచాక్షరి తో భస్మ ధారణ చెయాలి.
ఈ విభుతి మహిమను వివరించే కధ దేవి భాగవతము పదకొండవ స్కందము లో ఉంది.
మహిమాన్వితమైన విభుతిని వివిధ పద్ధతులలో తయారు చేస్తారు. ఆవుపేడను కింద పడనీయకుండా, చేత్తోపట్టుకుని, వేదమంత్రాల మధ్య హోమము చేసి తయారు చేసుకున్న భస్మాన్ని "శాంతికము " అని అంటారు.
షడాక్షరి మంత్రముతో హొమము చేసి తయారు చేసుకునే భస్మాన్ని "పౌష్ఠికం" అని అంటారు. బీజాక్షరాలతో హొమము చేసి తయారు చేసిన భస్మాన్ని "కామదం" అని అంటారు..

భస్మం తయారు చేసుకునే ముందే ఆవుపేడను సేకరించి, చిట్టు, లేక పొట్టును కలుపుతూ ముద్ద చేసి, ఆ ముద్దను పిడకలుగా చేసి అతి శుభ్రమైన ప్రదేశములో ఎండబెట్టాలి.

యాగాలు చేస్తున్నప్పుడు అరణిని మధించడం ద్వార వచిన అగ్నితో గాని, మంత్ర పూర్వకముగా పిడకలను హొమ గుండము లో వేసి హోమము చెయ్యాలి.
అనంతరం శుబ్ర్హమైన పాత్రలో విభుతిని నింపాలి.
హర హర మహా దేవ శంభో శంకర
భోజనసమయమున మౌనఫలము:

శ్లోకము: మౌనేన భుంజమానాస్తు స్వర్గం ప్రాప్తా న సంశయ:, సంజల్పన్ భుంజతే యస్తు తేనాన్నమశుచిర్భవేత్,
పాపం స కేవలం భుంక్తే తస్మాన్మౌనం సమాచరేత్
ఉపవాస సమం భోజ్యం ఙ్ఞేయం మౌనేన నారద! (పద్మపురాణము)

తాత్పర్యము: మౌనముగా భోజనము చేయువారు స్వర్గమును పొందుదురు. మాటలాడుచు భుజించిన అన్నము అపవిత్రమగును. కావున అతడు పాపమునే తినుచున్నాడు. కనుక మౌనముగానే భుజింపవలెను. మౌనముగా భుజించిన ఉపవాసముతో సమానమగును.
కొబ్బరి, అరటి, మామిడి,బంతి,తులసి,బిల్వ వృక్షాలలో లక్ష్మిదేవి నివసిస్తుంది. ప్రకృతి ఔదార్యానికి కొబ్బరి చెట్టు ప్రతీక. దానిని ప్రత్యేక పోషణలు అవసరం లేదు. ఇట్టే పెరిగి పోతుంది. చెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనది. అరటి చెట్టుకు ఎంతో ఆర్ధిక విలువలు ఉన్నాయి. అరటి ఆకులో భోజనాలు చేస్తాం. ఏ శుభకార్యాలు అయినా, పూజలు జరిగినా అరటిపండ్లు ఉండాల్సిందే. మామిడితోరణాలు ఇంటిగుమ్మాలకు కడతాం. వసంతంలో వచ్చే మామిడిపూత మన్మధునికి ప్రీతి. లక్ష్మి పుత్రుడు మన్మధుడు. బంతి పువ్వులను గుమ్మాలకు కట్టి లక్ష్మి దేవికి స్వాగతం పలుకుతాము. అలాగే తులసి చెట్టుతోను దేవికి బాంధవ్యముంది. తులసీ దళాలు లేకుండా విష్ణుమూర్తికి చేసే పూజ సంపూర్ణం కాదు. మారేడు పండులోనూ లక్ష్మిదేవి ఉంటుంది అంటారు. ఒకసారి లక్ష్మిదేవి శివుడికి వెయ్యి కలువ పువ్వులతో పూజ చేసుకుంటాను అని సంకల్పం చేసుకుంటుంది. శివుడు ఆమె భక్తిని పరీక్షించేందుకు ఒక పూవును తీస్కుంటాడు. అలాగ ఒక పువ్వు తక్కువయిన విషయాన్ని గమనించిన లక్ష్మి దేవి భూమి అంతా గాలించిన ఒక్క పువ్వు కుడా దొరకదు. అప్పుడు ఆ తల్లి తన ఒక స్తనాన్ని కలువపువ్వుగా సమర్పించదలుస్తుంది. ఆమె సాహసానికి ,భక్తికి ముగ్ధుడైన శివుడు అమ్మవారి స్థనాన్ని మారేడుపండుగా మార్చి,తనకి మారేడు పత్రాలతో పూజ చేస్తే ప్రీతి పొందుతాను అని ప్రకటిస్తాడు. అలాగే తమలపాకు,వక్కల్ని కూడా లక్ష్మీదేవి పూజకు సంబంధించినవి !!!!!!!!!!!!!
అదాన దోషేణ దరిద్రదోషః, దరిద్రదోషాత్ కరోతి పాపం |
పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్దరిద్రే పునరేవపాపీ ||

పుష్కలంగా చేతిలో అవకాశం ఉన్నప్పుడు దానం చెయ్యక పోవడం అనే దోషంతో దారిద్ర్యం వస్తుంది. దరిద్రుడై జీవించ లేక పాపాలు చేయడం మొదలు పెడతాడు. ఫలితంగా నరకానికి వెళతాడు. పాపఫలితాన్ని అనుభవించి, మంచిసంస్కారం లేని కారణంగా మళ్లీ భూలోకంలో దరిద్రునిగానే జన్మిస్తాడు. మళ్లీ పాపాన్ని చేస్తాడు. పునఃదరిద్రుడౌతుంటాడు. ఈ చక్ర భ్రమణంలో పడకుండా ఉండాలంటే ధనం చేతిలో ఉన్నప్పుడు పుష్కలంగా దానాలు చేస్తూ ఉండాలి.
సత్యేన బ్రహ్మచర్యేణ వ్యాయామేనాథ విద్యయా |
దేశ భక్త్యాత్మ త్యాగేన సమ్మానార్హః సదాభవ ||

(1) నిజాన్నే మాట్లాడండి (2) బ్రహ్మచర్యాన్ని పాటించండి (3) నిత్యం వ్యాయామం చేయండి (4) మంచి చదువులు చదవండి (5) దేశభక్తిని చక్కగా కల్గి ఉండండి (6) ఇతరుల సాయంకోసం ఎంత త్యాగానికైన సిద్ధపడండి.

ఈ ఆరు సూత్రాలు పాటించినవారు లోకంలో గౌరవాన్ని, కీర్తిప్రతిష్ఠలు తప్ప పొందుతారు. ఇందులో సందేయం లేదు.

ఒకానొకప్పుడు యమదూతలు మోక్షము పొంది జన్మ రహిత్యమును పొందు వారెవరు? మరియు, నరకార్హులై సంసారమున మగ్గు వారెవరు అని అడిగినపుడు విష్ణు దూతలు ఈ విధముగా సమాధానము ఇచ్చారట.

దుష్ట జన సాంగత్యము వీడి సాదు జనులను ఆశ్రయించు వారు, అనుక్షణము భగవత్ స్మరణతో నుండు వారు, స్నాన, సంధ్యా, జప, హోమ స్వాధ్యాయము లు ఒనరించు వారు, సర్వ భూతములను సమ భావముతో చూచువారు, నిత్యమూ అన్న దానము చేయువారు, గో, హిరణ్య, విద్య , కన్య దానము చేయువారు, పరోపకార పారిణులు, జ్ఞాన మార్గ నిష్ణాతులై, ఇతరులకు  ఉపదేశించు వారు, కపట రహితులై శ్రద్ధా భక్తులతో భగవత్ ఆరాధనా చేయువారు, నిర్ధనులకు ఉపనయన, వివాహాది సుభ కార్యములు చేయువారు, అనాధలకు సుశ్రుష చేయువారు, నిత్యమూ సాలగ్రామ తీర్ధము సేవించువారు, తులసి మాలను ధరించి, విష్ణు అర్చన చేయువారు, తులసి వనము పెంచువరు, గృహములందు నిత్యమూ దేవతారాధన, గీత పారాయణము, నామ సంకీర్తన జరుపువారు, గృహమందు, భాగవత గ్రంధమును పూజించు వారు , సూర్యుడు తుల, మకర, మేష రాశులందు ఉన్నపుడు స్నానము చేయువారు, మణికర్ణికా ఘట్టము నందు మరణించు వారు, పవిత్ర భగవన్నామ స్మరణ చేయుచు మరణించు వారు, పంచ మహా పాతకములు చేసిన వారుకూడా నామ సంకీర్తన మాత్రమున వైకుంఠమును చేరగలరు.

త్యాగ శీలురు, సత్య అహింస లనే ఆధారముగా చేసికొని సాత్వికపు వృత్తిలో జీవితము గడుపువారు, హృదయ సదనమున పరమాత్మను పూజించువారు దేవాలయములు, గోవులు, ఆశ్రమములు, బ్రాహ్మణులూ కనపడినపుడు దండ ప్రణామములు చేయువారు ముక్తిని పొందగలరు.

ముక్తికి జాతి, మత, వయో బేధములు లేవు. జన్మ పరమ్పరలను తొలగించుకొనుతయె ముక్తి పొందుట. కావున సర్వులు ముక్తిని పొందుటకు సర్వదా త్రికరణ శుద్ధిగా ప్రయత్నించ వలెను.

(సశేషం)

పంచతంత్రము అనే గ్రంథం గురించి మనకు అందరికి తెలిసినదే. అందులో విష్ణుశర్మ తన శిష్యులైన రాజకుమారులకు ధనం గురించి చెప్పిన మాటలు ఆలకించండి.

ధనము లేకపోతే ఆర్జించాలి.
ఆర్జించిన ధనమును జాగ్రత్తగా రక్షించుకోవాలి.
రక్షించుకున్న సంపదను వృద్ధి చేయాలి.
వృద్ది చేసిన ధనమును సద్వినియోగం చేయాలి.

ఇలా చేయని వాణి ఇంట్లో ధనము నిలువదు.
సంరక్షణ చేయని ధనము వెంటనే నశిస్తుంది.
వృద్ది చేయని సంపద కొంచెం ఆలస్యంగా--కాటుకలా--కరిగిపోతుంది.

అనుభవానికి రాని డబ్బు ఉన్నా లేనట్లే.... సుఖమునివ్వదు.
ఒకరికి ఇచ్చుట, తను అనుభవించుట, దొంగిలించుట-- ఈ మూడు డబ్బు పోయే మార్గాలు.
కనుక , తన ధనమును ఒకరికి ఈయక, తానూ అనుభవించని వాని ధనము ఎవరైనా దొంగిలించుకు పోతారు.

మూర్ఖులు ఈ విషయము తెలుసుకోలేరు.

Monday, 20 January 2014

హిందూ ధర్మం లో తిలక ధారణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. భ్రూ మధ్యములొ ధరించే ఈ కుంకుమ వల్ల కొన్ని నాడులు ఉత్తేజితము అవుతాయి అని శాస్త్ర పరిశోధనలలో తేలింది కూడా. అలాగే ఎదుటివారు మన ముఖము చూడగానే కనిపించే ఈ కుంకుమ వల్ల దృష్టి దోషం కూడా ఉండదు అని చెపుతారు. అలాగే వివాహిత మహిళలకు సౌభాగ్యచిహ్నాలుగా  మంగళ సూత్రం, నల్ల పూసలు, మెట్టెలు, పసుపు, కుంకుమ, పూవులను చెపుతారు. మంగళ సూత్రం, నల్లపూసలు ధరించిన స్త్రీని చూడగానే ఆమె వివాహిత అని అర్ధం అవుతుంది ఎవరికైనా. ఆమె మిద వెంటనే గౌరవభావం వస్తుంది. పసుపులో ఎన్ని ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయో కొత్తగా చెప్పక్కరలేదు. అలాగే మెట్టెలు ధరించడం వల్ల కూడా కొన్ని నాడులు సక్రమంగా పని చేస్తాయి. ఇవన్ని శాస్త్రీయంగా నిరుపితమైన సత్యాలు.

కానీ మనం ఎం చేస్తున్నాం? అత్యంత ముఖ్యమైన తిలకాన్ని పెట్టుకోవడం మానేస్తున్నాం. ఫాషన్ అంటూ నుదుటిన బొట్టు లేకుండానే బయటికి వెళ్ళిపోతున్నాం. మగవారైనా, ఆడవారైనా స్నానం చేసిన వెంటనే నుదుటిన బొట్టు ధరించాలి అని శాస్త్రం. ఇది ఎవరు పట్టించుకోవటం లేదు. పూజ చేసుకునే ముందు కాళ్ళకు పసుపు రాసుకొని కూర్చోవాలి అంటుంది శాస్త్రం. బొట్టే లేకపోతే, ఇంకా పసుపుకు స్థానం ఎక్కడ? మహా అయితే పూజ , లేదా నమస్కారం అయ్యే వరకు బొట్టు పెట్టుకొని ఇవతలకి రాగానే తుడిచెస్తున్నారు ఈకాలం అమ్మాయిలు .ఒకవేళ పెట్టుకొన్నా కనీ కనపడకుండా చిన్న నల్ల రంగు బొట్టు పెట్టుకుంటున్నారు. నల్ల రంగు బొట్టు ఎప్పుడు పెట్టుకొంటారో వారికి ఎవరు చెప్పటం లేదు.

 కొన్ని మతాలలో బొట్టు పెట్టుకునే అలవాటు లేదు. విదేశీయులు కూడా పెట్టుకోరు. వారిని అనుకరించి మనం మన పధ్ధతి మార్చుకోవడం ఎంత సబబు? ఇతర మతాల వాళ్ళు వాళ్ల అలవాట్లు, సంప్రదాయాలు వదులుకోవటం లేదే? మనకెందుకు ఆ అనుకరణ!విదేశీయులు మన భగవద్గిత, పురాణాలూ, ఇతిహాసాలలో ఉన్న గొప్పదనం గ్రహించి వాళ్ళు నేర్చుకుంటున్నారు. మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం.

మగవారు కూడా బొట్టు పెట్టుకునే ఈ దేశంలో ఆడపిల్లలు బొట్టు మానేయటం ఎంత తప్పో ఎవరైనా అలోచించారా? అమ్మా!  దయచేసి మీ పిల్లలకు బొట్టు పెట్టుకోవడం నేర్పించండి. మీ పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నారు. ఇది కూడా బాధ్యతగా నేర్పించండి.

వివాహ మంత్రాల లోని అర్ధాలు.:  (క్రిందటి భాగం తరవాయి)

బ్రహ్మముడి వేయుటలోని అంతరార్ధం:

 వధూవరుల కొంగులు ముడి వేస్తూ --ఈ దాంపత్య సామ్రాజ్యమును ధరించునట్టి మీకు వరుణుడు, బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని స్తిరత్వమును కలుగజేయుదురు గాక. తరువాత వరుడు వధువు చేయి పట్టుకొని " ఇంటి యజమనురలవుగా సర్వమునకు పెత్తనము వహించి తీర్చి దిద్దుకొను దానవుగా ఇంటికి రమ్ము" అని పలుకును.

ాణిగ్రహణము:

పెద్దలు ఎట్లు ఆచరిన్చిరో అట్లే నేనునూ, మంచి సంతతి కొరకు నీ హస్తమును గ్రహించు చున్నాను. మన పూర్వులు శిరొధార్యమగు శీలముతో ఎట్లు వెలుగొన్దిరొ అట్లు వెలుగొన్దునత్లు ఈమెను సరస్వతి సమగ్రముగా రక్షించు గాక! లోకములోని జీవులకు ఈమెను అగ్రగన్యగా చేయుగాక! అని వరుడు పలుకును.

సప్తపది ఘట్టము లోని మంత్రాల అర్ధములు ఇదివరకే చెప్పుకొని ఉన్నాము.

ఇట్లు మన హిందూ వివాహ కార్యక్రమములోని అన్ని ఘట్టములలో స్త్రీకి ప్రముఖ పాత్ర ఇచ్చి యున్నారు.వివాహ బంధముతో ఆమెను ఒక కుటుంబములోనికి ఆహ్వానించి ఆమెను సర్వానికి అధిపతిని చేయుచున్నారు. ఒక ఇంటికి ఇల్లాలే అధిదేవత. ఆమె చేతి మీదుగానే కుటుంబ కార్యక్రమములు జరుగవలెను . ఇవన్ని ఈ మంత్రముల వల్ల స్పష్టము అవుతున్నాయి. ఇవి తెలియని వారు మన వివాహ తంతు గురించి పెడగా మాట్లాడుతున్నారు. యొక్త్ర ధారణ విషయములో, కాడి నుంచి జలమును పంపే విషయములో, ఇలా ఎన్నో రకాలుగా పెడార్ధాలు తీసి మాట్లాడుతున్నారు. వారందరూ ఈ మంత్రముల అర్ధం తెలుసుకొంటే బాగుంటుంది. ఇవన్ని పెద్దవాళ్ళు చిన్నవల్లకు చెపితే బాగుంటుంది. కానీ చెప్పే ఆసక్తి, పెద్దలకు గానీ , పురోహితులకు గాని, వినే జిజ్ఞాస పిల్లలకు, వధూవరులకు కానీ  ఉండడం లేదు. వేదకాలం నుంచి స్త్రీకి సమాజంలో ఎంతో విలువ ఇచ్చారు. దురదృష్ట వశాత్తు ఈరోజుల్లో మగవారికి, ఆడువారికి విలువ ఇవ్వడం చేతకావట్లేదు. ఇచ్చిన విలువని నిలుపుకోవటం ఆడువారికి చేతకావట్లేదు.

దయచేసి మన వివాహ పద్ధతిని అపహాస్యం చేయకండి. వేరే మతాల వాళ్ళు అపహాస్యం చేస్తే ఒప్పుకోకండి. సమాధానం చెప్పండి.

Sunday, 19 January 2014

సాధారణంగా మనందరం నిత్య పూజ చేస్తాము. పూజ కుదరని వాళ్ళు కనీసం రోజు కొన్ని స్త్రోత్రాలు, దైవానికి సంబంధించిన శ్లోకాలు చదువుకుంటారు. వీటిలో ప్రాత: స్మరణ శ్లోకాలు అని కొన్ని ఉన్నాయి. నదులు, వృక్షాలు, పర్వతాలు--ఇలా ప్రకృతికి సంబంధించిన అన్ని అంశాలను పూజించే సంస్కృతీ మనది. భారతంలో  "మహనీయ జపము " అనే పేరుతో ధర్మరాజుకు  భీష్ముడు వివరించాడు. ప్రతిరోజూ మహనీయుల స్మరణ ఇలా చేయాలి అన్నాడు.

ముందుగ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను,  తరువాత వినాయకుడు, కుమారస్వామి, వాయువు, సూర్యచంద్రులు, ఇంద్ర, వరుణ,  యమ, కుబేరులు, కామధేనువు, సప్త సముద్రములు, గంగాది మహానదులు,వసు రుద్రాది దేవతలు, పితృదేవతలు, వాలఖిల్యులు, ( వీరు అంగుశ్త ప్రమానములో ఉంది వేలాది సంఖ్యలో నిరంతరమూ తపస్సులో ఉండే మునులు, ) వేదవ్యాస నారదాది మహర్షులు, రంభ మెనకాది దెవతాంగనలు, దివారాత్రములు,  తారకలు, మాస, రుతు, సంవత్సరములు, గరుత్మంతుడు, వాసుకి మొదలయిన మహానాగములు, కాశీ కురుక్షెత్రాది పుణ్య ప్రదేశాలు, నైమిశాది అరణ్యాలు, మేరు, కైలాస, హిమాచాలాది పర్వతాలు, భూమి, దిశలు, ఆకాసము, పుణ్య వృక్షములు, మాంధాత మొదలైన షట్ చక్త్రవర్తులు, ఇత్యాదులను ప్రతి దినము స్మరించడం వలన ఆయురారోగ్యాది సంపదలు మనుష్యునికి లభించడమే కాకా దారిద్ర్యము, వ్యాధి, శోకము నశిస్తాయని భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించాడు.

ప్రతి రోజు, ప్రతి వారు పథించ వలసిన విష్ణు స్తోత్రము ఇలా చెప్పాడు.

ఓం నమో భగవతే వాసుదేవాయ , నమ: పురుశొత్తమ్మయ,
నమ: సర్వలోక గురవే, నమ: సర్వలోక పిత్రే,
నమ: సర్వలోక పితామహాయ, నమ: సర్వలోక ప్రపితామహాయ,
నమ: సర్వలోక ప్రదానాయ, నమ:సర్వ లోకేశ్వరా

నమ: సర్వలోక విశిష్టాయ, నమ: సర్వ లోక సుఖప్రదాయ
నమ: సర్వ లోక హర్త్రే, నమ: సర్వలోక నిధయే
నమ:సర్వ లోక నిదానాయ, నమ: సర్వ లోక హితాయ
నమ: సర్వ లోక హితకరాయ, నమ: సర్వ లొకొద్భవాయ
నమ: సర్వ లొకొద్భవ కారాయ, నమో విష్ణవే, ప్రభవిష్ణవే !!

దీనిని స్మరించడం ద్వారా, ఘోరపాపాలు నశించడం, శుభాలు పొందడం మాత్రమే కాక, ధర్మాచరణ యందు కోరిక కలుగుతుంది అని భీష్ముడు దీని ఫలితాన్ని చెప్పాడు.

అనాయాస మరణం, పరం లో సౌఖ్యం కావాలి అంటే , ఇహం లో ధర్మ మార్గం అనుసరించడం ఎంతో ముఖ్యం. ఇట్టి ధర్మాచరణకు నిష్ఠ కలగడానికి భగవంతుని అనుగ్రహం ఎంతో అవసరము. ధర్మమూ, సౌశీల్యము, లేకుండా చేసే పుణ్య కార్యాలు, జపతపాలు, వినయం లేని పాండిత్యము, శ్రద్ధ లేని దానము, ఇవేవి మంచి ఫలితాలను ఇవ్వలేవు. కనుక ప్రతి మానవుడు ధర్మ మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నించాలి.

కేయురాణి న భూషయంతి పురుషం, హారాన చంద్రోజ్జ్వలా,
న స్నానం, న విలేపనం, న కుసుమం, నాలంకృతా ముర్ధజా,
వాణ్యేకా సమలంకరోతి పురుషం, యా సంస్కృతాధార్యతే,
క్షీయంతే ఖిల భూషణాని సతతం, వాగ్భూషణం భూషణం,

భర్తృహరి చెప్పిన సుభాషితం ఇది. ఎంత చక్కగా చెప్పాడో చూసారా? ఒక వ్యక్తికీ చంద్రుని కాంతి, అంటే వెన్నెలతో సమానమైనటువంటి బంగారు ఆభరణాలు, స్నానం చేసి, ఒంటికి లేపనాలు పూసుకోవటం, శిరోజాలు చక్కగా దువ్వుకొని పూవులు ముడుచుకోవడం ఇటువంటి వన్నీ అలంకరణలు కావు, ఇవన్ని కొద్ది రోజులలో నశించేవే, కానీ శాశ్వతమైన భూషణం, సంస్కారం కలిగిన మాట ఒక్కటే అని ఈ సుభాషితం యొక్క అర్ధం.

ఇది దాదాపుగా మనం అందరం చిన్నతనంలో చదువుకొన్న పద్యమే. కానీ దీనిని ఆచరించడమే కష్టం. ఒక మనిషిని చూడగానే అతని వస్త్రాలంకరణ, అతని బాడీ లాంగ్వేజ్ చూసి మనం మొట్టమొదట ఒక అభిప్రాయం ఏర్పరచుకొన్నా, అతని మాట , పలకరింపు వినగానే అతని యొక్క వ్యక్తిత్వాన్ని అంచనా వెయగలము. అంటే మన మిద ఎదుటివారికి ఒక అభిప్రాయాన్ని కలిగించేది మాట.. ..

కొంతమంది ఉంటారు.ఒకటే చెప్పిందే చెప్పి మన తలకాయలు తినేస్తారు. కానీ అందులో విషయం ఉండదు. ఇంకొంతమంది మాట్లాడితే ఆత్మస్తుతి, పరనింద తప్ప వేరే పనికొచ్చే విషయం ఉండదు. మన గొప్ప అవతలి వాళ్ళు చెప్పుకోవాలి కానీ, మనమే చెప్పుకుంటే బాగోదు కదా. అలాగే, ఎదుటి వారిలోనూ, మంచి, చెడు రెండూ ఉంటాయి. చెడు గురించి చెప్పుకోవచ్చు కానీ, అదేపనిగా వారిలోని చెడు గుణాలే చెప్తూ పోతే వినేవాళ్ళకి కూడా విసుగు పుడుతుంది.

కొంత మంది మనం ఒక విషయం మాట్లాడుతుంటే, వాళ్ళు వేరే టాపిక్ తెస్తారు.మధ్యలో. వింటున్న వాళ్ళకి ఎ టాపిక్ మిద స్పందించాలో తెలియకుండా. ఇది కూడా మంచి పధ్ధతి కాదు. అలాగే కొంతమంది స్నేహితులు కానీ, బంధువులు కానీ కలిసినపుడు అక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా చాల హేయమైన విషయం. అలాగే పిల్లల గురించి, భార్య / భర్త గురించి గొప్పలు చెప్పుకోవటం కూడా నలుగురిలో విమర్సలకు తావిచ్చే విషయం.

ఇంకా కొంతమంది ఏదైనా పెళ్ళిళ్ళు , పేరంటలలో ఆందరూ కలిసినపుడు ఎవరో ఒకరిని కానీ, ఆ ఫంక్షన్ లో జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ ఒకటే విమర్శిస్తూ ఉంటారు. వారు తమ ఉనికిని తెలుపుకొవటానికి అలా చేస్తుంటారు. కానీ అది ఇవతలి వాళ్ళకి ఎంత irritation గ ఉంటుందో గ్రహించరు.

కొంతమందికి నలుగురిలో ఉన్నపుడు అవతలివారిని చిన్నబుచ్చడం, లోకువగా మాట్లాడడం సరదా. వారు స్నేహితులైనా, బంధువులైనా అంతే. ముఖ్యంగా ఆస్తి, అంతస్తు విషయాలలో, పిల్లల చదువులు , ఉద్యోగాల విషయాలలో ఇటువంటివి జరుగుతుంటాయి. కానీ వారు గమనించుకొనిది ఒక్కటే. నలుగురిలో ఉన్నపుడు ఆందరూ వారి మాటలు విని సమర్ధించినా, తరువాత వారితో మాట్లాడడానికి ఇష్టపడరు.

మనం మాట్లాడుతున్నాము అంటే వినేవాళ్ళకి వినసొంపుగా వుండాలి. మళ్లీ మళ్లీ మాట్లాడాలి అని వారు అనుకోవాలి. మరి బిగ్గరగా కాకుండా, మరి మెల్లగా కాకుండా ఒక నిర్దిష్టమైన స్వరంలో మాట్లాడాలి. అలాగే ఎదుటివారికి చక్కగా అర్ధమయ్యేలా మరి స్పీడుగా కాకుండా, మరి నెమ్మదిగా కాకుండా, క్రమ పద్ధతిలో మాట్లాడాలి. మనం మాట్లాడే విషయం అందరికి ఆమోదయోగ్యంగా ఉండాలి. సూటిగా, స్పష్టంగా ఉండాలి. మన మాటల్లో పరుష పదాలు కానీ, పరుష వాక్యాలు కానీ దొరలకూడదు. మన మాటలు అవతలి వారిని ఎట్టి పరిస్తితులలొను నొప్పించకూడదు. కాలు జారితే తీసుకోగలము కానీ, మాట జారితే తీసుకోలేము అని ఉరికే అన్నారా? శరీరానికి నొప్పి కలిగితే మందు వేయొచ్చు. కానీ, మాట వల్ల మనసు విరిగిపోతుంది. అటువంటి మనసు నొప్పించె మాటలు ఎప్పుడు మాట్లాడకూడదు. మన గురించి, మన మాట గురించి ఆందరూ సంతోషంగా చెప్పుకోవాలి.

ఈ సృష్టిలో భగవంతుడు సకల ప్రాణికోటి లోను మనిషికి మాత్రమే మాట్లాడే శక్తిని ఇచ్చాడు. అలాగే ఆలోచించే మెదడు కూడా మనకే ఇచ్చాడు. స్పందించే మనసును కూడా ఇచ్చాడు. మనం ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడ కూడదో మెదడుతో అలోచించి , మనసుతో స్పందించి, మన మాటను సద్వినియోగం చేసుకుందాము.

Saturday, 18 January 2014

ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు అంటారు. ఈ లోకోక్తి వచ్చిన రోజుల్లో ఎలా ఉండేదో తెలియదు కానీ, ఇప్పుడు మాత్రం ఈ మాట అక్షరాల నిజం. ధనం చుట్టూనే లోకం తిరుగుతోంది. సంపాదన, ఆస్తులు సమకూర్చుకోవడం అనేవి అందరి వ్యక్తిగత విషయాలు. దాని గురించి మాట్లాడక్కరలేదు. కానీ, సమాజంలో ఇప్పుడు డబ్బు ఉన్నవాడికే గౌరవం. అది ఎలా సంపాదించినా సరే.  వాళ్ళ మనసు, మంచితనం ఎలా వున్నా లెక్క లేదు. అలాగే పెళ్ళిళ్ళు ,పేరంటలలో నగలు ఒంటి నిండా వేసుకున్న వారికే ప్రధమ తాంబూలం. ఎందుకు సమాజం ఇలా మారిపోతోంది? ఇదివరకు రోజుల్లో ఇరుగు పొరుగు వాళ్ళు కూడా అన్న, వదిన, మామయ్య, అత్తయా, పిన్నిగారు అంటూ వరసలు కలిపి  పిలుచుకునేవారు. ఇపుడు వరసైన వాళ్ళు కూడా డబ్బు మూలంగా విడిపోతున్నారు. అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఏ బంధుత్వం మిగలటం లేదు. ఎవరో చెప్పినట్టు ఏ బంధుత్వం కూడా సహజంగా చెడిపోదు. అహంకారం, చిన్న చూపు, అపార్ధాల వల్లనే రిలేషన్స్ చెడిపోతాయి. మరి ఒక కడుపున పుట్టిన వాళ్ళలో కూడా ఎందుకు ఈ రాగ ద్వేషాలు పెరుగుతున్నాయి? ఒక అనుబంధం, అభిమానం లని మించి మనకు అహంకారం, అపార్ధాలు చోటు చేసుకుంటున్నాయి? ఇదిఇంచుమించు  ప్రతి ఇంట్లోను జరుగుతోంది. కాలం మారుతోందా? లేక మనుషులు మారుతున్నార? నిజంగా ఇది డబ్బు చేస్తున్న మాయేనా? లేక మనుషుల మనసులు పెడదార్లు తొక్కుతున్నాయ?

Friday, 17 January 2014

సుముహుర్త సమయమున కన్యాదాత శచిదెవిని  పూజించుచూ, దేవేంద్రుని ప్రియురాలవగు ఓ శచిదెవీ, నీకు నమస్కారము. వీరిరువురికి వివాహ భాగ్యము, ఆరోగ్యము, సంతానము కలిగిమ్పుము. అని ప్రార్థించును.  తరువాత, వధువును తెరకు తూర్పున, వరుని పశ్చిమమున కూర్చోబెట్టి, తెరను తొలగింతురు. ఆ సుముహుర్త సమయమున వధూవరులు ఒకరి భ్రూ మాధ్యమును మరొకరు చూడవలెను. వెంటనే జీలకర్ర, బెల్లము మిశ్రమము ఒకరి శిరసున మరియొకరు ఉంచెదరు. వరుడు ఈ క్రింది మంత్రములను చెప్పును.:

ఓ వరుణ! ఈమె యొక్క సోదరులకు వృద్ధి కలిగించును గాక. బృహస్పతీ! ఈమె యొక్క భర్త వృద్ది పొందును గాక. ఓ ఇంద్ర! ఈమెకు పుత్రా సంతానము కలుగు గాక. ఓ కన్య!శుభ  దృష్టి కలదానవు కమ్ము. సౌభాగ్యవతివి కమ్ము. మన పశు సంపదకు శుభము కల్గునట్లు మంచి మనసుతో, తెజసుతొ వర్ధిల్లుము. వీరులగు పుత్రులను కనుము. దేవతలు ముచ్చట పడునట్లు వేలుగుము. మనకు,  మన జనులకు, మన పశువులకు శాంతి కలుగు గాక.

కాడి రంధ్రము నుండి జలమును వదలుట:

ఉత్తర దక్షిణముగా కాడిని పట్టుకొందురు. దక్షిణమున ఉన్న రంధ్రము గుండా జలము వరుడు చల్లును. ఈ పవిత్ర జలముచే వధువు పవిత్రురాలు అగును. వీరులైన సంతతికి అరిష్టము కలుగకుండా ఈ జలములు క్షలనము  చేయుగాక అని వరుడుచెప్పును.

ఓ శచీపతి!ఇంద్ర! ఇంతకూ ముందు ఎవరి పాలనలో లేని ఈమెను సూర్య తేజస్సు కల దానివిగా చేయుము. అని కాడి  చిల్లులొ గుండా బంగారము మాపున నిరు చల్లుతూ బంగారు వెలుగులు మెల్లగా జలములన్దు ప్రవేశించు గాక. జలములు సారవన్తమగు గాక. శాంతి  కలుగు గాక. నూరు రెట్లు ఈమెను పవిత్రము చేయు గాక.  ఇటుపై భర్తతో వర్ధిల్లునత్లు ఈ జలములు సంకల్పించు గాక.  అను మంత్రములు చెప్పును.

యోక్త్రధారణ:

వధువు నడుమును ధర్భలతొ చేసిన త్రాటితో వరుడు చుట్టుచు, ఈ విధముగా పలుకును.
మంచి మనస్సును, మంచి సంతతిని, సొవ్భగ్యమును, మంచి తనువును కలిగియుండి అగ్నిహోత్రమున నాకు సహచారినివై సత్కరములకు సమ్సిధ్ధవు కమ్ము.

మంగళ సూత్రా ధారణము:

వరుడు సంకల్పించి మాంగల్య దేవతను ఆహ్వానించి షోడశోపచారములతో మంగళ సూత్రమును పుజించును. సభలోని పెద్దలు, ముత్తైదువలు దానిని స్ప్రుశించెదరు. వరుడు ఈ క్రింది మంత్రమును చెప్పుచు సూత్రధారణ కావించును.
" నా జీవనమునకు హేతువైన ఈ సూత్రము చేత నేను ని మెడ యందు మాంగల్యమును కట్టుచున్నాను. నీవు నూరు సంవత్సరములు జీవించుము."

తలంబ్రాలు:

పెద్దలకు, పిల్లలకు వేడుకగా ఉండే ఈ తలంబ్రాల కార్యక్రమం వెనుక ఎంత రహస్యం దాగి ఉందొ, ఈ మంత్రముల అర్ధం చుస్తే తెలుస్తుంది.

తలంబ్రాలు పోసుకున్నప్పుడు వధూవరులు క్రింది మంత్రాలను చెప్పుచు పొసుకున్దురు.

1. నేను కోరిన సంతానము సమృద్ధిగా ఉండు గాక. ( వధువు)
2. నాకిష్టమైన పాడి పంటలు సమృద్ధిగా నుండు గాక ( వరుడు)
3. నాకిష్టమైన యజ్ఞములు సమృద్ధిగా నుండు గాక. (వరుడు )
4. మాకు కావలసిన దానం సమృద్ధిగా నుండు గాక (వధూవరులు ఇద్దరు )

(సశేషం)

Monday, 13 January 2014

మార్గశిర మాసము: వేదములలో సామవేదమును, రుద్రులలో శంకరుడను, చందస్సులో గాయత్రిని, మాసాలలో మార్గశీర్షమాసాన్ని అన్నడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. మహాభారతకాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి. కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది. అట్లే ఈమాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములన్నియు మహాఫలమును ఇచ్చునవిగా శాస్త్రములయందు చెప్పబడినది. శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుజ్ఞయా! ఆరభేత వ్రతమిదం, సార్వకామిక మాదతః!! వివాహిత యువతి క్రొత్తగా కాపురమునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిరమాసమునందలి శుక్లపక్షమున పతియనుమతితో ’పుంసవన వ్రతము’ను ఆచరింపవలెను. అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమునందు చెప్పబడినది. ఈమాసమునందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణము కావింతురు. దీనినే ’అన్నయజ్ఞము’ అందురు. వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను, ఆ సంవత్సరమునకే అలంకార ప్రాయముగాను చెప్పబడినది. అంతేకాక కలువపూలతో శివుని అర్చించిన అది మహాఫలమునొసగును. ఈమాసములో ఒకపూట భుజించి, తనశక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధులనుండి, పాపాలనుండి విముక్తినందగలడు. సర్వకళ్యాణ సంపూర్ణుడై, అన్నిరకాల ఓషధులను పొందగలడు. ఈమాసములో ఉపవసించినవాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు, బలశాలి కాగలడు. వ్యవసాయంలో భాగస్వామియై బహుధనధాన్య సంపన్నుడు అవుతాడు. ఈమాసములో రోజంతా ఉపవాసముండి కేశవుని అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆవ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది. ఈవిధముగా ఇతరమాసములకంటె మార్గశిరమునందు అనేక వశిష్ట లక్షణములు గలవు. కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తెల్పెను
ప్రతి జీవికి జన్మనిచ్చేది తల్లి. పోషించేది తండ్రి. విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించేవాడు గురువు. కష్ట సుఖాలలో తోడు ఉండి, సహాయ సహకారాలు అందించేవాడు స్నేహితుడు.

గురువు కోరిన విధంగా కష్టపడి గురుదక్షిణ చెల్లించడం ద్వారా గురు ఋణం, వివాహం చేసుకుని సంతానం కానీ వంశ వృద్ది కలిగించడం ద్వార పితృ ఋణం, యజ్ఞ యాగాల ద్వార దైవ ఋణం, ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం ద్వార స్నేహితుని ఋణం తీర్చుకోవచ్చు కానీ, నవమాసాలు మోసి, మన మలముత్రాదులు ఏమాత్రం అసహ్యించుకోకుండా శుభ్రం చేసి సదా మనం వృద్ధిలోకి రావాలని కోరుకునే అమ్మ ఋణం మనం తీర్చుకోవటం ఎప్పటికి సాధ్యం కాదు.

ప్రతి జీవికి మొట్టమొదటి దైవం తల్లి. వేదం కూడా అమ్మకు మొదటి స్థానం ఇచ్చి "మాతృదేవో భవ" అని గౌరవించింది. తనకు తినడానికి లేకపోయినా, పిల్లల కడుపు తడిమి అన్నం పెట్టె అమ్మ ప్రేమకు విలువ కట్టగలమా! అందుకే వేదాలు అమ్మను సేవించుకోవడం గురించి ఇలా చెప్పాయి.

భూప్రదక్షిణ షట్కెన కాశీయాత్రా యుతెన చ
సేతు స్నాన శతైర్యస్చ తత్ఫలం మాతృ వందనే...

ఆరుసార్లు భూమికి ప్రదక్షిణం చేసే ఎంత పుణ్యమో, పదివేల సార్లు కాశీ దర్శిస్తే ఎంత ఫలమో, వందల సార్లు రామేశ్వరం లో సేతుదర్శనం చేసి స్నానం చేస్తే ఎంత పుణ్యమో, ఒక్కసారి తల్లికి నమస్కరిస్తే ఆ ఫలమంతా ఒక్కసారి కలుగుతుందిట. అమ్మ అంటే నడిచే దైవం. అమ్మకు ఒకసారి నమస్కరిస్తే, ఈ భూమి మిద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, యోగులు, మహర్షులు అందరికి ఆరుసార్లు నమస్కరించిన పుణ్యం దక్కుతుంది.

ఒక్కసారి కాశీ యాత్ర చేయాలంటేనే ఎంతో పెట్టి పుట్టాలి. అటువంటిది పదివేల సార్లు కాశీని దర్శించుకున్న పుణ్యం తల్లికి నమస్కరిస్తే కలుగుతుంది.

అల్లాగే బ్రహ్మ హత్యాది పాతకాలు నశించడానికి రామేశ్వరం దర్శించి పూజలు చేస్తారు. అటువంటి వందల స్నానాలు మాతృ వందనము తో సరి సమానం అంటే, అమ్మని మించిన దైవం ఉందా లోకంలో! దివిలోని ఆ జగన్మాతే ఇలలో అమ్మగా అవతరించింది అని ప్రతి ఒక్కరు భావన చెయ్యాలి అని చెబుతుంది శాస్త్రం. ఆమె పెద్దతనంలో ఆమెను సేవించే భాగ్యాన్ని ఏ ఒక్కరు దూరం చేసుకోకూడదు. ఏ కార్యం సఫలం కావాలన్నా తల్లికి నమస్కరించి ఆమె దీవెన తిసుకున్నపుడే ఆ కార్యం చక్కగా నెరవేరుతుంది. ఈ రహస్యం గ్రహించినవాడు కాబట్టే, గణపతి కూడా తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసి , గణాధిపత్యాన్ని పొంది, మనకు కూడా అందులోని గొప్పతనాన్ని గుర్తు చేసాడు..

కుటుంబం లో స్త్రీ పాత్ర:

హిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.
ఇతర సంస్కృతుల కన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతీ మహిళకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టినది ఆమెను ఇంట్లో కట్టిపడేయ దానికి కాదు. కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది.

కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చినది ఆమె యొక్క ప్రజ్ఞను గమనించే. శుచి, శుభ్రత వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్ని ఆమె పాటించి, కుటుంబ సభ్యుల చేత పాటింప చేయడం ద్వార ఆమె ఒక వైద్యురాలు. పిల్లలకు విద్య బుద్ధులునేర్పి మంచి గుణములు, నడవడిక అలవాటు చేసి, సమాజమునకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వార ఆమె ఒక గురువు. భర్తకు అనుగుణంగా నడచుకొని, అతని ఆజ్ఞలు పాటించి, ఆతను చెడు దారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి.

అదే విధంగా సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉండాలి అన్నాడు మనువు. వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్ధిక వేత్త. ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. ఇంట్లో ఎంతో అవసరమైన ఖర్చు వచ్చినపుడు పిల్లలతో సహా, భర్తకు కూడా ఎక్కడో అక్కడనుంచి తీసి డబ్బు సర్దగల సమర్ధురాలు స్త్రీ. అలాగే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది.

ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను గౌరవించే వేళ ఆమె అన్నపూర్ణ. పిల్లల సంరక్షణ, పెద్దవారి సేవ, అతిథి అభ్యాగాతుల సేవ, ఇలా ఎన్నో పనులు ఒకేసారి చేయగల సామర్థ్యం ఆమె సొత్తు. ఇలా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర.

ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, కుటుంబం మిద ప్రభావం చూపుతాయి. ఆమె పాత్ర వాళ్ళ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడిన, లేదా చెడిపోయిన దానికి బాధ్యురాలు స్త్రీయే.

స్త్రీ శారీరిక శక్తీ లో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ, మానసిక శక్తి లో ఆమెకు ఎవరు సాటిలేరు. కుటుంబాలు అన్ని సంతోషంగా ఉంటె సమాజంలో సంతోషం నిండుతుంది. లోకంలో ఇబ్బందులుండవు. ఇది స్త్రీకి మన సంస్కృతీ ఇచ్చిన అసలు స్థానం. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న కొద్దీ, సమాజంలో స్త్రీకి గౌరవం లేకుండా పోతోంది. ఆమె మిద ఎన్నో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొని మళ్లీ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంపోదించే దిశగా అందరు కృషి చేయాలి.
భూమి మిద ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు. ప్రతిరోజూ ఉదయిన్చినప్పటినుంచి అస్తమించే వరకు బంగారు వన్నెలతో తన వెలుగును భూమికి పంపుతాడు. ఒక ఘడియ బంగారు రంగు అయితే ఇంకో ఘడియ తెల్లని తెలుపు, ఒక నిముషం వెండి వెలుగులు అయితే, మరొక నిముషం ముత్యాల మెరుపుతో కనిపిస్తాడు. ఈ చక్కని విషయాన్ని ఒక కవి ఒక పాటలో ఎంత చక్కగా వర్ణించారో చుడండి.

ఈ పాట అల్ ఇండియా రేడియో లో ప్రతి ఆదివారం ఉదయం వచ్చేది మా చిన్నపుడు. ఇపుడు రేడియో వినటం లేదు కదా. వస్తోందో లేదో తెలియదు. భక్తీ టీవిలో ఉదయం 6 గంటలకు వస్తోంది.

శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్య నారాయణా,

పొడుస్తూ భానుడు పొన్నపువు చాయ,
పొన్నపువ్వు మిద పొగడపువు ఛాయా.

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువు చాయ
ఉల్లిపూవు మిద వుగ్రంపు పొడి చాయ ll

గడిఎక్కి భానుడు కంబపువ్వు చాయ
కంబ పువ్వు మిద కాసారి పూ చాయ 11

జామేక్కి భానుడు జాజిపూవు చాయ
జాజిపూవు మిద సంపెంగ పొడి చాయ ll

మధ్యాహ్నభానుడు మల్లె పువు చాయ
మల్లెపూవు మిద మంకెన్న పూ చాయ ll

మూడు జాముల భానుడు మునగ పువు చాయ
మునగ పువు మిద ముత్యంపు పొడి చాయ ll

అస్తమాన భానుడు ఆవపూవు చాయ,
ఆవపూవు మిద అద్దంపు పొడి చాయ ll

వాలుతూ భానుడు వంగపూవు చాయ
వంగపూవు మిద వజ్రంపు పొడి చాయ ll

క్రుంకుతూ భానుడు గుమ్మడి పూ చాయ
గుమ్మడి పువు మిద కుంకంపు పొడి చాయ.

శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్య నారాయణా....

పైన పాటలో పేర్కొన్న పూవులు అన్ని తెలుపు లేదా పసుపు రంగులో ఉండేవే. కానీ అందులో వివిధములైన shades లో ఉంటాయి. ఉదయించి నప్పటి నుంచి పొద్దు గుంకే వరకు ఉన్న అన్ని వర్ణనలు పసుపు లేదా తెలుపు లో ఉన్నాయి. కానీ మధ్యాహ్నం, మంకెన్న పువ్వు.( ఇది ఎర్రగా ఉంటుంది), క్రున్కుతున్న సమయములో కుంకంపు పొడి ( ఇది కూడా ఎర్రగానే ఉంటుంది కదా) అని వర్ణించడం ఎంత గొప్పగా ఉందొ కదా.. వ్రాసిన కవికి పాదాభివందనములు.

ఈ పాటను మాఘ మాసంలో ప్రతి రోజు పాడుకోవటం తెలుగు మహిళలకు అలవాటు.

గమనిక: ఈ పాట వ్రాసిన రచయితా ఎవరో, ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పగలరు.
కర్ణాటక సంగీతానికి ఆద్యుడు శ్రీ త్యాగరాజ స్వామి . ఈయన అసలుపేరు త్యాగబ్రహ్మం. 1767లొ శ్రీ కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి అసలు జన్మస్థలం మన ఆంధ్ర దేశంలోని ప్రకాశం జిల్లా ఖంభం అయినప్పటికిని, వీరి పూర్వీకులు తమిళనాడుకు వలస వెళ్లారు. ఈయన తండ్రి రామబ్రహ్మం తంజావూరు సంస్థానాదీషుడు శ్రీ శరభోజి మహారాజు గారి కొలువులో ఉండేవారు. త్యాగరాజు గారి విద్యాభ్యాసం అంతా తిరువయ్యూరు లో జరిగింది. ఆయన చిన్నతనం లోనే వేదాలు, ఉపనిషత్తులలో ప్రావీణ్యం సంపాదించారు. ఈయనకు రాముని మిద అచంచలమైన విశ్వాసం ఉండేది. త్యాగరాజు గారికి సంగీతం లో ఉన్న అభిరుచిని కనిపెట్టి శొంటి వెంకట రమణయ్య గారు తమ శిష్యునిగా అంగీకరించారు. ఆయనకు సంగీతంలో మెళకువలు శ్రద్ధగా నేర్పించారు.

శ్రీ శరభోజి మహారాజు త్యాగయ్య సంగీత ప్రతిభను గురించి విని రాజాస్థానంలో పాడవలసినడిగా కోరుతూ, అనేకమైన ధన కనక వస్తు వాహనములను త్యాగయ్య ఇంటికి పంపుతారు. కానీ అఖండ రామభక్తుడైన త్యాగయ్య వాటన్నిటిని తిప్పి పంపేసి, తనకు ధనము కంటే, రాముని వాత్సల్యమే గొప్పది అని చెప్తారు. అయన సంగీతాన్ని ధన సంపాదనకు మార్గంగా కాక, భగవంతుని లీలలు గానం చేసే సాధనము అని నమ్మిన వ్యక్తి.

అయితే, రాజుగారి కానుకలను తిప్పి పంపడంతో ఆగ్రహించిన వారి అన్నగారు జపేశుడు, ఆస్తి పంపకం చేసేస్తారు. తన వంతుకు వచ్చిన సీతా, రామ , లక్ష్మణ విగ్రహాలను అయన ఆనందంగా అందుకుంటారు. సాక్షాత్తు రాముడే తన వంతుకు వచినప్పుడు ఇంకా విచారించ వలసిన పని లేదు అని భార్యకు, శిష్యులకి తెలియచేప్తారు. త్యాగరాజుకు వస్తున్న ఆదరణ చూసి ఈర్ష్య చెందిన వారి అన్నగారు దీనికంతటికి కారణం దేవుని విగ్రహాలే అని, దేవుని కరుణ వల్ల త్యాగయ్య ఇంతటి ఆదరణ పొందుతున్నారని భావించి ఆ విగ్రహాలను కావేరి నదిలో విడిచిపెడతారు. త్యాగయ్య తన రాముని అన్వేషణలో దక్షిణ దేశ యాత్రలకు వెళ్లి, అనేక తీర్థ యాత్రలు చేస్తారు. ఆ యా సందర్భాలలో ఆ యా క్షేత్రాలలో ఉన్న దేవుళ్ళ మిద ఆయన ఎన్నో కృతులను రచించారు. ఆ రాముని కృప వలన మళ్లీ విగ్రహాలను నదిలోనే కనుక్కొంటారు.

త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ జపం చేసారు. ఈయన సంగీత ప్రావీణ్యాన్ని, రామభక్తిని మెచ్చిన నారద మహాముని స్వయంగా ప్రత్యక్షమై ఈయనకు స్వరర్నవం అనే గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొంటారు. ఈయన గాత్ర సంగీతంలోనే కాక, గొప్ప వైణికుడు కూడా...

త్యాగరాజు మొత్తం మిద 24 వేల కీర్తనలు, కొన్ని ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ప్రహ్లాద భక్తీ విజయము, నౌకా చరితము అనే సంగీత నాటకాలు కూడా వ్రాసిరి. ఈయన వ్రాసిన 5 పంచరత్న కీర్తనలు బహు ప్రసిద్ది చెందినవి. ఈయనకు వారసులు లేకపోయినా, వారి సంగీత వారసత్వం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. 1847 పుష్య బహుళ పంచమి నాడు శ్రీ త్యాగరాజు గారు పరమపదించారు. ఈయన సమాధి చెందిన తిరువయ్యుర్లో ప్రతి సంవత్సరం శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు చాల విశిష్టంగా జరుపుతారు. ఆయన సమాధి వద్ద అయన రచించిన పంచరత్న కీర్తనలు ప్రముఖ సంగీత విద్వాంసులు అందరు బృంద గానం చేస్తారు. ఎందఱో జంత్ర, తంత్ర, గాత్ర విద్వాంసులు ఇందులో పాల్గొంటారు.
బంధాలు-బాంధవ్యాలు:

మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, --ఇలా ఎందఱో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.

కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు.

సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖా
శాంతి: పత్నీ, క్షమా పుత్రా: షఢెతె మమ బాంధవా:

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయా స్నేహితుడు, శాంతి భార్య, వోర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.

ఏ జివికైన జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిష్టితులలో నైనా, తల్లి ప్రేమ మారదు. అలాగే, సత్యం ఒక్కటే. అది ఎన్నటికి, మారదు.

జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి జివించె ఉపాయాలు నేర్పడం ద్వార, సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషం గ జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.

సోదరుడు ఎలాగైతే ఎప్పుడు అండగా నిలుస్తాడో, తోడుగా ఉంది, అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం ఎప్పుడు మనిషికి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి, ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.

దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.

శాంతి భార్య వంటిది. భార్య సుగుణ శీలి అయితే, ఆ మనిషి జీవితం పూలపాన్పు లాగా ఉంటుంది. భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం ఔతున్ది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు. శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.

ఓర్పు పుత్రునిలాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గాతుల్యమే.

పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యం అని అనుకుంటాడో, అంతకన్నా, సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు.. ఊహ తెలిసిన దగ్గరనుంచి, మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు.
చందమామ పిల్లల మాస పత్రిక గురించి తెలియని క్రిందటి తరం భారతీయులు లేరు అని అంటే అతిశయోక్తి కాదు. 1947 జులైలో ప్రముఖ సినీ నిర్మాతలు, విజయ సంస్థ అధినేతలు అయిన శ్రీ బి. నాగిరెడ్డి, చక్రపాణి ల మానస పుత్రిక ఈ పత్రిక. మొదట్లో తెలుగు, తమిళ భాషల్లో ఆరంభమైన ఈ పత్రిక మొత్తం 13 భారతీయ భాషలు, ఇంగ్లీషు, ఒక గిరిజన (సంతల్ ) భాష, సింహళ భాషలలో ప్రచురితమౌతొన్ది. అందులకోసం తెలుగు, ఇంగ్లీషు బ్రెయిలీ లిపిలో వెలువడుతున్న ఏకైక పత్రిక చందమామ. television , కంప్యూటర్ లేని ఆ రోజుల్లో పిల్లలకు, పెద్దలకు ఒక వినోద సాధనం చందమామ. పెద్దలు కూడా నెల తిరిగేసరికి కొత్త సంచిక మార్కెట్లోకి ఎపుడు వస్తుందా అని ఎదురు చూసేవారు.

ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు సంపాదకుడిగా పనిచేసిన ఈ పత్రికలో కథలు, ధారావాహికలు పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరించేవి. వివిధ దేశాలకు చెందినా జానపద గాధలు, నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించేవి. ప్రతి సంచికలో వచ్చే బేతాళ కధలు పిల్లలకు తెలివితేటలను, విజ్ఞానాన్ని అందించేవి. ఇక సీరియల్స్ సంగతి సరే సరి. శిధిలాలయం, రాకాసి లోయ, మాయ సరోవరం, భల్లుక మాంత్రికుడు, గ్రీకు పురాణాల ఆధారంగా వచ్చిన రుపధరుని యాత్రలు, భువన సుందరి -- వీటిని ఎవరైనా మర్చిపోగలరా? దాదాపు అన్ని భారతీయ పురాణాల మిద చందమామలో సీరియల్స్ వచ్చాయి.

ఇక ప్రతినెల ప్రతి సంచికలో వచ్చిన దెయ్యాల కథలు అన్ని శ్రీ మాచిరాజు కామేశ్వర రావు గారు రచించినవే. చందమామలో దెయ్యాలు ఎవరికీ హాని చేసేవి కావు. ఇవి రెండు రకాలు. ఒకటి పరులకు మేలు చేసేవి, రెండు అల్లరి చేసి ఆట పట్టించే చిలిపి దెయ్యాలు. ప్రజలలో మూఢ నమ్మకాలూ తొలగించేందుకు చందమామలో ప్రముఖ ఇంద్రజాలికుడు పి,సి. సర్కార్ తో ఇంద్రజాల మహిమల పైన కథలు వచ్చేవి.

పిల్లల పుస్తకంలో బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. శంకర్, చిత్ర గిసిన బొమ్మలు ప్రతి పేజీలోను ఆ సన్నివేశానికి అనుగుణంగా చక్కటి హావభావాలతో ఉండేవి. ఒక్క ఇంగ్లీషులో తప్ప మిగిలిన అన్ని భాషల చందమామలకు శ్రీ వడ్డది పాపయ్య గారు గిసిన ముఖ చిత్రాలు పత్రికకే వన్నె తెచ్చాయి.

చందమామ పత్రికలో రచన శైలి జాతీయాలు, సామెతలు నుడికారాలతో కూడి ఉండి, పిల్లలకు ఎంతో సులభంగా అర్ధమయ్యేలా ఉండేది. అసలు తెలుగే కాక, ఏ భారతీయ భాషనైనా నేర్చుకోవటానికి చందమామ శైలి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. శైలి, సంచిక కూర్పు వంటి విషయాలలో చందమామ మిగిలిన పిల్లల పత్రికలకు ఆదర్శం అయింది.

1947లొ ప్రారంభమైన చందమామ అనివార్య కారణాల వల్ల 1998లొ ఆగిపోయింది. కానీ మళ్ళి 1999లొ పునః ప్రారంభం అయింది. కానీ చక్రపాణి, నాగిరెడ్డి ల కుటుంబ సంస్థగా ఉన్న విజయ పబ్లికేషన్స్, చందమామ యాజమాన్యం 2009 నాటికీ ముంబైకి చెందినా జియోదేశిక్ అనే software సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చందమామ online లో కూడా దొరుకుతోంది.
పూర్వపు రోజుల్లో విద్యాభ్యాసం అంటే మగపిల్లలకు గురుకులం లో జరిగేది. శిశువు పుట్టిన తర్వాత 5 సంవత్సరముల వయసు వరకు తల్లి తండ్రులతో చక్కగా గడిపి 5 సంవత్సరములకు గురువు వద్దకు వెళ్లి దాదాపు 15-20 సంవత్సరాలు విద్య నేర్చేవారు. తరువాత కాలక్రమేణ గురుకులాలు పోయి బడులు మొదలయ్యాయి. అపుడు కూడా 5 ఏళ్ళు వయసుకే బడిలో చేర్చేవారు. ఒక 20-25 ఏళ్ల క్రిందటి వరకు పిల్లలను 5 ఏళ్లకే బడిలో వేసేవారు. అప్పుడు ఎక్కువగా మాతృభాషలోనే బోధన జరిగేది. తరువాత కాలంలో ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాక kg ( అంటే కిండర్ గార్టెన్ ) చదువులు వచ్చాక 3 ఏళ్లకే LKG లో చేరిపించి 15 ఏళ్లకు 10థ్ క్లాసు ముగిసేది. మన ఆంధ్ర లో ఎక్కువగా 10+2+3 చదువు ఎక్కువ ప్రాచుర్యం లో ఉండేది. అంటే, ఒకటి నుంచి పదవ తరగతి వరకు 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, తరువాత డిగ్రీ 3 ఏళ్ళు---మళ్లీ ఇందులో 1 నుంచి 5 వరకు ప్రాధమిక విద్య, 6 నుంచి 10 వరకు ఉన్నత విద్య. తరువాత మనకు ఇష్టమైన సబ్జెక్టు తో ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా వృత్తి విద్య ( ప్రొఫెషనల్ కోర్స్) . ఇదంతా అయ్యేసరికి పిల్లవాడికి 18-20 సంవత్సరాల వయసు వచ్చేది.

అంటే ఏమిటి అన్న మాట? ఒక పిల్లవాడి మెదడు, మనసు, బుద్ది, 5 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 18-20 సంవత్సరాల వరకు వికసిస్తుంది అన్న మాట. ఫలానా ఇన్ని subjects , ఇన్ని పాఠాలు ఒక సంవత్సర కాలంలో చదివి, ఆఖరున పరీక్ష వ్రాసి తన జ్ఞానాన్ని పరిక్షిన్చుకుంటాడు ఒక విద్యార్ధి. అంటే మెల్ల మెల్లగా ఒక పిల్లవాడి సమర్ధతని బట్టి పై క్లాసులకు వరుసగా వెళ్ళేవాడు.

కానీ ఇప్పుడు ఏమి జరుగుతోంది? నర్సరీలు కూడా పోయి ప్లే స్కూల్స్ వచాయి. అంటే అమ్మఒడిలో ఉన్న పాపాయిని కూడా తీసుకెళ్ళి ప్లే స్కూల్ లో జాయిన్ చేస్తున్నారు. అదిగో అక్కడ మొదలుతోంది బాల్యం చిదిమేయడం అనే concept , తరువాత నర్సరీ. తరువాత kg చదువులు.

ఇంక 9 th వరకు వస్తే అదో కథ. 9 th పరిక్షలు వ్రాసాక వారికీ ఒక వారమే సెలవులు . మర్నాటి నుంచి 10 తరగతి కి ప్రిపేర్ చేసేస్తారు. అంటే 9 లోకి వచ్చాక వారికీ వేసవి సెలవులు ఉండవు. మండే ఎండల్లో మూలుగుతూ వెళ్ళాలి స్కూల్ కి.

ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ వాళ్ళకి 2 సంవత్సరాలు సబ్జెక్టు చదవాలి అని ఉంటె, మొదటి సంవత్సరం లోనే 2 ఏళ్ల సబ్జెక్టు పూర్తి చేసేసి, ఏడాది తర్వాత వచ్చే ఎంట్రన్స్ కి రెండవ సంవత్సరం అంతా ప్రిపేర్ చేస్తారుట. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు. పిల్లలకు అంత ఓపిక ఉంటుందా? ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉండవు. ప్రభుత్వం ban చేసిన సరే, క్లాసులు నడుస్తూనే ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ లో చేరాక దాదాపు 600 రోజులు పిల్లలు నిరంతరం చదువుతూనే ఉండాలి.

పిల్లల సంగతి సరే, వాళ్ళ భవిష్యత్ కోసం కష్టపడతారు అనుకుందాం. మరి ఇంట్లో ఉండి, వండి వార్చే తల్లుల సంగతి ఎంటండి? పిల్లలతో బాటు వాళ్ళు కూడా దాదాపు 1200 రోజులు నిరంతరం కష్టపడాలి. ( 9,10,+ 2 years ఇంటర్మీడియట్ ) సెలవులు లేకుండా. పిల్లలు 15 ఏళ్ల వాళ్ళు అయితే, తల్లులు దాదాపు 35 సంవత్సరాల వయసు దాటినా వారై ఉంటారు సహజంగా. వారికీ కూడా వేసవి సెలవులు ఉండవు. పిల్లలకు లీవ్ దొరకదు కాబట్టి వీళ్ళు కూడా ఏ పెళ్ళికి పేరంటానికి వెళ్ళడానికి ఉండదు. మరి ఏ రిక్రియేషన్ లేకుండా, పిల్లల చదువులకోసం కష్ట పడే తల్లుల ఆరోగ్యం సంగతి ఎవరైనా ఆలోచిస్తున్నార?

ఇక కార్పొరేట్ స్కూల్స్ సంగతి సరే సరి. మార్కులు తక్కువ వస్తే వెనక సెక్షన్ లో వేస్తారు అనే భయం చేత మరీ ఎక్కువగా చదివేస్తారు వీటిలో పిల్లలు. ఇంటికి ఎవరు వచ్చినా, వెళ్ళినా వీళ్ళకి తెలియనే తెలియదు. వాళ్లేమో వాళ్ళ లోకమేమో అన్నట్లు ఉంటారు. దీనివల్ల సామాజిక బంధాలు తెగిపోతున్నాయి. స్నేహితులు తప్ప బంధుగణం లో ఎవరు తెలియట్లేదు. అయినవారిని పలకరించడం కూడా చేతకావట్లేదు.

ఇవన్ని కూడా సహజంగా జరుగుతున్న పరిణామాలు కాదు. మనం గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్నాం. దీనివల్ల మన పిల్లల బాల్యం మనమే పోగోడుతున్నాం. వాళ్ళకు తెలియని tensions మనం అలవాటు చేస్తున్నాం. బంధాలు, విలువలు మనమే చేడగోడుతున్నాం. అడుకోవలసిన వయసులో వారిని బలవంతంగా చదువుకు అలవాటు చేస్తున్నాం. దీనివల్ల వాళ్లు మెరిట్ స్టూడెంట్స్ అవ్వచ్చు కానీ, మంచి పౌరులు కాలేరు. చిన్నప్పటి నుండి tensions కు అలవాటు పడ్డ ఈ పిల్లలు రేపు మంచి జీవిత భాగస్వాములు కాలేరు.

మనం ఇంత కష్ట పడుతున్నాం. కొంతమంది బలహీన మనస్కులు tensions భరించలేక చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల మనం ఏమి ఆశించి పిల్లలని అంత బలవంత పెట్టి చదివిస్తున్నామో ఆ ప్రయోజనం నెరవేరటం లేదు.

తల్లిదండ్రులారా... దయచేసి మీ పిల్లలను బాగా బలవంత పెట్టకండి. ప్రతిరోజూ వార్తల్లో ఒక స్టూడెంట్ ఆత్మహత్య అని చదువుతున్నాం. మీ పిల్లల శక్తి, ఓపిక ఎంత ఉందొ అంతే చదివించండి. వేరొకరితో పోటీకోసం పిల్లలని బలవంత పెట్టకండి. అందరికి ఇదొక్కటే నా విన్నపం.
దేశ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాలకులనుప్రజలందరూ గౌరవించలి. ప్రజల బలం, బలహీనతలను అంచనా వేసి దేశ సర్వతోముఖ వికాసానికి పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

కేకయ దేశాధిపతి ఆశ్వపతి మహారాజును కొందరు దర్శించారు. రాజును రాజ్యం గురించి అడుగగా తన రాజ్యం గురించి ఆయన ఇలా చెప్పారు.

నమస్తేనో జనపదే,
నకదర్యో నమద్యపః
నన హితగ్నిర్
నా విద్వాన్న స్వైరో స్వైరినీ కుతః:

నమేస్తేనో--- నా రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల వర్ధిల్లుతోంది. ఈ దేశంలో దొంగలు లేరు. ప్రజలందరూ కష్టపడి పనిచేసి దనం సంపాదించి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా జీవిస్తున్నారు.వారికీ అధికమైన కోరికలు లేవు. కనుక దుఃఖాలు లేవు. ఆశలు, అధికమైన ఆపేక్షలు లేవు. పరుల వస్తువుకు ఆశపడరు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తారు.

నకదర్యో--- నా రాజ్యంలో లోభులు లేరు. ప్రజలు ధార్మిక జివనులు. ఉన్నంతలో పదిమందికి పెట్టి తినే భాగ్యవంతులు. వంద చేతులతో సంపాదించి, వేయి చేతులతో దానం చేయాలి అని శాస్త్ర వాక్యం. దీనిని నా ప్రజలు విశ్వసిస్తారు.

నమద్యపః --నా దేశ ప్రజలు మద్యపానం చేయరు. జూదం ఆడరు. వ్యసనపరులు కారు. సత్ప్రవర్తనులు, నితిమంతులు, త్యాగధనులు, నిరాడంబరులు. నా ప్రజలు శీలసంపదకు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు.

నానా హితగ్ని-- నా రాజ్యంలో వేదాది కర్మలు, హోమాలు నిరంతరం జరుగుతాయి. చేయని వాళ్ళు ఎవరు లేరు. ధూమపానం చేసేవారు, దుష్టులు లేరు.

నా విద్వాన్-- ఈ దేశంలో అందరు విద్యావంతులే. మూర్ఖులు,మూధులు లేరు. ప్రజలు విద్యావినయ

సంపన్నులు. సంస్కారులు.

నస్వైరీ-- ఈ దేశంలో వ్యభిచారులు లేరు. ప్రజలు సర్వగుణ సంపన్నులు. జితెన్ద్రియులు, నీతికోవిడులు. పురుషులు పరస్త్రీలను తల్లితో సమానంగా గౌరవిస్తారు. . స్త్రీలు పరపురుషులను రక్షకులుగా భావిస్తారు.

తన దేశ ప్రజలు ధర్మజ్నులనీ, వ్యసనాలకు బానిసలూ కారు అని గర్వంగా చెప్పుకున్నాడు అశ్వపతి మహారాజు.

ప్రస్తుతం మనదేశ పరిస్తితి పూర్తీ వ్యతిరేకంగా ఉంది. దేశంలో దొంగలు యదేచ్చగా సంచరిస్తున్నారు. పాలకులే దొంగలు ఔతున్నరు. ప్రజలకు ఏమి సౌకర్యలు లేవు. నీళ్లు దొరకకపోయినా, మద్యం యదేచ్చగా ప్రవహిస్తోంది. నీతినియమాలు లేని జీవనం, సర్వత్ర అవినీతి, దుర్వ్యసనాలు, విచ్చలవిడి వ్యభివ్చారం, మానభంగాలు, దేశాని పట్టి పీడిస్తున్నాయి. అశ్వపతి మహారాజుల మనం మన దేశాన్ని గురించి గర్వంగా చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో!
భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మానవుడు సంపూర్ణంగా, సంతృప్తిగా ,ఆదర్శప్రాయంగా జీవించడానికి మన పూర్వులు మనకు ఆశ్రమ ధర్మాలను బోధించారు. ఇక్కడ ఆశ్రమములు అంటే జీవితంలోని stages అంటే స్థాయులు. ఆశ్రమములు 4. అవి, బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, మరియు సన్యాస ఆశ్రమములు.

శిశువు పుట్టిన దగ్గర్నుంచి 5 సంవత్సరాలవరకు ఇంట్లో తల్లితండ్రుల దగ్గర పెరిగి తరువాత గురుకులమునకు వెళ్తాడు. అక్కడ వివిధ శాస్త్ర అధ్యనం చేస్తాడు. 24 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక శిష్యుడిగా గురువుకు సేవ చేస్తూ విద్య అభ్యసిస్తాడు. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం.

తరువాత యోగ్యురలైన కన్యను వివాహమాడి, సంతానమును కని, వారిని పెంచి పెద్ద చేస్తాడు. తన బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇది గృహస్తాశ్రమం.

పిల్లల బాధ్యతలు పూర్తీ అయిన తరువాత ఇక సంసారం లంపటము నుండి మనసును వేరుచేసుకొని, బాధ్యతలు పిల్లలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుంటాడు. ఇది వానప్రస్థ ఆశ్రమము.

చివరిది సన్యాస ఆశ్రమము. సన్యాసము అంటే కాషాయ వస్త్రాలు ధరించి అడవులకు వెళ్లి తపస్సు ఆచరించ నవసరం లేదు. బంధాల నుండి దూరం అయ్యి, దైవ స్మరణలో మరణించేవరకు కాలం గడపడం సన్యాస ఆశ్రమం.

అయితే ఈ అన్ని ఆశ్రమ ధర్మలలోను గృహస్తాశ్రమం ఉత్తమమైనది అని శాస్త్రోక్తి. ఎందుకంటే, గృహస్తు ద్వారానే ఇతర ఆశ్రమస్తులకు ఆహారం లభిస్తోంది. గృహస్తాశ్రమం వల్లనే వంశాభివృద్ది జరుగుతుంది. అతిథి అభ్యగతులు గృహస్తు ద్వారానే ఆదరింప బడతారు, యజ్ఞ యాగాదులు, హోమాలు, పూజలు, వీటన్నిటిని చేయడం వల్ల ధర్మం నిలబడుతుంది. ధర్మం ఉన్నచోట కరువు కాటకాలు ఉండవు. దేశం సంమృద్ధిగా ఉంటుంది. ఈ కార్యలన్నిటికి గృహస్తే ఆధారం.

గృహస్తు లక్షణాలు... 1.సహనం, 2.విశాలభావం,3. ఇంద్రియ నిగ్రహం,4. చిత్తశుద్ది, 5.మనోనిగ్రహం, 6.లౌకిక జ్ఞానం,7. తాత్విక ఆలోచన, 8.సత్యమైన జీవితం,9. కోపం లేకపోవడం, 10.అపరిగ్రహం (ఇతరుల నుండి ఉచితంగా ఏమి స్వీకరించక పోవటం )... ఈ పది లక్షణాలు ఉన్నవాడు ఉత్తమమైన గృహస్తు.

గృహస్తు నిత్యజీవితంలో పవిత్ర హృదయంతో, ధర్మాచరణ చేయాలి. ఇలా చేస్తే భగవంతుని అందుకోన్నట్లే. సమాజానికి, దేశానికి, అతని సేవలు ఎంతో ముఖ్యం.
తపస్సు అంటే ఏమిటి అనే ప్రశ్నకు 'స్వధర్మ వర్తనమే తపస్సు, స్వధర్మాన్ని చిత్తశుద్ధితో, భగవదర్పణ భావంతో, అహంకార మమకారాలకు అతీతంగా ఆచరించడమే తపస్సు' అని మహాభారతం సమాధానం ఇచ్చింది.

కౌశికుడనే బ్రహ్మచారి నిరంతరం అధ్యయనం, జపధ్యానాల వంటివి చేస్తూ అరణ్యాలలో సంచరించేవాడు. ఒకసారి ఒక వృక్షం కింద కూర్చొనే వేదాలను గుణిస్తున్దగా, , పై కొమ్మల నుంచి ఒక పక్షి రెట్ట వేసింది. ఆగ్రహంతో పైకి చూసాడు. అతని నేత్ర దృష్టి వల్ల ఆపక్షి ప్రాణాలు కోల్పోయింది. కౌశికుడు హింసాత్మకమైన తన చర్యకు సిగ్గుపడ్డాడు.

మధ్యాహ్నవేళ ఒక గృహస్తు ఇంటికి వెళ్లి భిక్ష అడిగాడు. భిక్షను సిద్ధం చేస్తున్న గృహిణి, అప్పుడే ఇంటికి చేరిన గృహస్తును చూసి, భిక్ష వేసే పనిని పక్కన పెట్టి భర్తకు కావలసిన ఏర్పాట్లు చేసి, తర్వాత భిక్ష తీసుకువచ్చి వేసింది. ఆకలి, అహంకారం కలిసిన కౌశికుడు, తపస్సులమైన మా కన్నా, ని భర్త , ని పనులే ఎక్కువ అయ్యాయా నీకు అని కోపంగా అడిగాడు.

నేను ప్రధానంగా గృహిణిని. గృహకార్యం, భర్తకు వలసినవి సమకూర్చడం నా ప్రధాన ధర్మాలు, అతిథులను సేవించడం నా పనే. కానీ ప్రధాన బాధ్యతల్ని నిర్వహించిన తరువాతే అవన్నీ. ఐన నువ్వు కోపంగా చూస్తె మాదిపోవడానికి నేను పక్షిని కాదు అని చెప్పింది ఆ గృహిణి.

ఎక్కడో అరణ్యంలో జరిగిన సామగ్రి ఆమెకు ఎలా తెలిసిందో అని ఆశ్చర్యపడ్డాడు కౌశికుడు. అదే ప్రశ్న ఆమెని అడిగాడు. "నాయన! నా స్వధర్మ నిర్వహణ అనే తపస్సు వల్ల లభించిన శక్తీ చేత దీనిని గ్రహించాను. క్రోధం, మొహం, ఈ రెండూ సాధనకు, ధర్మానికి, శత్రువులు, మిథిలా నగరంలో ధర్మవ్యదుడనే మహాత్ముడు ఉన్నాడు. ఆయనను దర్శించి ధర్మాలు తెలుసుకో అని బోధించింది ఆ ఇల్లాలు.

కౌశికుడు మిథిల చేరాడు. ఆ ధర్మవ్యాదుడిని చూడ బోయాడు. అతడు ఒక మాంస విక్రేత అని తెలిసి ఆశ్చర్యపోయాడు.

మహానుభావ! సాధ్వీమణి పంపగా వచ్చావు కదూ! అన్నాడు ధర్మ వ్యాధుడు. తీరిక దొరికాక, కౌశికునికి తగిన మర్యాదలు చేసి ధర్మాలను వివరించాడు.

నేను మాంస విక్రేతను. వంశధర్మంగా ఈ వృత్తిని చేపట్టినా, నేను జంతువులను వాదించాను. మాంసాన్ని కొని అమ్ముతాను. నేను మాంసం తినను. అమ్మకాలలో, కొనుగోళ్లలో మోసం చేయను. నా తల్లిదండ్రులను ఇసుమంత కూడా కష్టపెట్టను. నన్ను నమ్ముకున్న వారిని వంచించను. బాధ పెట్టను. పెద్దలను, జ్ఞానులను గౌరవిస్తాను. ఆహార నియమాలు, వ్రతాలూ, పాటిస్తాను. భార్యను తప్ప పర స్త్రీలను కోరను. నిందాస్తుతులకు సముడను. కరకుదనం, అసత్యం, అప్రియం, అహితం, పలకను.ఈర్ష్య, ఆశ అసూయలను మనసులోకి రానీయను. స్వద్ర్మాలను విడువను. ఇదే నా సాధన. అని వివరించాడు.

ఆ సాధ్వి పంపిన కారణంగా నీతో మాట్లాడను. కానీ, నివు మాట్లాడడానికి తగిన వాడవు కావు. ఎన్ని జపధ్యానాలు చేసిన, నువ్వు స్వధర్మాన్ని వదిలేసావు. తల్లిదండ్రుల మాట వినకుండా వారిని విడిచి పెట్టావు. నువ్వొక్కడివే సంతానమని, నీకోసం శ్రమించిన పెద్దలు వారు. వారు వ్రుద్దులై ఉండగా, వారిని విడిచి నువ్ అధ్యయనం కొనసాగిస్తున్నావు. వారిని కొలుచుకో, అదే తపస్సు. స్వధర్మ నిర్వహణె, నాకు దివ్య శక్తులను ఇచ్చింది. అని బోధించాడు.

ఈ కథ భారతంలో అరణ్య పర్వంలో మార్కండేయుడు ధర్మరాజుకు చెప్పినది. దిని తాత్పర్యం జప తపాది సాధనాలు కూడదు అని కాదు. స్వధర్మ వర్తనను విడకుండా చేసే సాధనలకే సత్ఫలం ఉంటుంది అని దిని అంతర్యం...
మిత్రులారా... మన రాష్ట్రం లోనే ఉన్న విహార యాత్రా స్థలాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు 'అరకులోయ' గురించి తెలుసుకుందాం.

అరకు లోయ విశాఖకు దగ్గరలో సుమారు 120 కి.మీ. దూరంలో ఉన్న ఒక hillstation . ఇక్కడికి రైలు, రోడ్ మార్గం ద్వారా చేరుకోవచ్చు. రైలు అయితే, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు కిరండొల్ పాసెంజర్ ఉంది. అరకు చేరడానికి ఇది ఒక్కటే రైల్. అయితే అరకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ రైలు ప్రయాణం మాత్రం మిస్ కావద్దు. ఎందుకంటే కొండల మిద వేసిన రైల్వే ట్రాక్ కారణంగా ఈ రైలు సుమారు 58 సొరంగాలు, 84 వంతెనల మిద సాగుతుంది. ఇది ఒక అద్భుతమైన అనుభవం. జీవితంలో మర్చిపోలేము. మళ్లీ రాత్రికి ఇదే రైలు తిరుగు ప్రయాణం ఔతున్ది.

ఇక రోడ్ ద్వార వెళ్ళాలి అనుకునే వాళ్ళకి విశాఖ నుంచి, విజయనగరం నుంచి ఎన్నో బస్సు సర్వీసులు ఉన్నాయి. విశాఖ నుంచి ఐతే 3 గంటలు, విజయనగరం నుంచి అయితే సుమారు గంటన్నరలో అరకు చేరుకోవచ్చు. విజయనగరం నుంచి వెళ్ళే వాళ్ళు దారిలో తాటిపూడి జలాశయం కూడా చూడవచ్చు.

రోడ్ ద్వారా వెళ్ళే వాళ్ళు ఉదయం సుమారు 9 గంటలకు tyada రోడ్ చేరుకుంటే, రోడ్ ప్రక్కనుంచి టన్నెల్ లోంచి వెళ్ళే కిరండొల్ express ను చూడవచ్చు. తరువాత అనంతగిరి వెళ్ళే దారిలో కాఫీ ప్లాంటేషన్స్ రోడ్ కు ఇరువైపులా మనం చూడవచ్చు. స్థానిక గిరిజనులు పండించే అనంతగిరి కాఫీ అంతర్జాతీయం గ ప్రసిద్ధి పొందినది. ఇక్కడి 'గాలికొండ వ్యూపాయింట్ ' దగ్గర స్థానిక గిరిజనులు కాఫీ గింజలు, కాఫీ పొడి, మిరియాలు, మసాలా దినుసులు అమ్ముతారు. పచ్చి మిరియాలు కూడా చూడవచ్చు. ఒక్క పచ్చి మిరియం గింజ నోట్లో వేసుకొని కొరికి నమలండి. ఆ చలి వాతావరణం లో పచ్చి మిరియం ఘాటు అనుభవించండి. కాఫీ ప్రియులు ఇక్కడి కాఫీ పొడి కొనుక్కోండి. ఆ కాఫీ రుచి చాల బాగుంటుంది.

ఇక అరకు లో పద్మాపురం గార్డెన్స్, చాపరాయి జలపాతం, ట్రైబల్ museum , బొర్రా గుహలు చూడదగిన ప్రదేశాలు. పద్మాపురం గార్డెన్స్ లో వివిధ రకాల, వివిధ సైజుల గులాబీలు చూడవచ్చు. అలాగే ఎన్నో రకాల పుష్ప జాతులు చూడవచ్చు. ఇక్కడ bamboo tree houses ఉన్నాయ్. రాత్రి బస చేసేవాళ్ళు అద్దెకు తీసుకోవచు.

చాపరాయి దగ్గర కొండ ఎత్తుగా ఉండకుండా చాప లాగా సమతలంగా ఉంటుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.

APTDC వాళ్ళు ఇక్కడి గిరిజన జాతులకు సంబంధించిన చరిత్ర, వారి ఆచార వ్యవహారాలూ తెలియ చేసేందుకు వీలుగా ఫైబరు తో చేసిన బొమ్మలతో ఒక museum నెలకొల్పారు. ఇక్కడ షాపింగ్ కూడా చేయవచు.

ఇక అరకుకు కొద్ది దూరంలో ఉన్న బొర్రా గుహలు చూడడం ఒక మంచి అనుభవం. ఈ గుహలను విలియం కింగ్ అనే ఆంగ్లేయుడు 1807 లో కనిపెట్టాడు. ఇవి ఒక మిలియన్ సంవత్సరాల క్రితం భూమిలో ఉండే లోహాలు, రసాయనాల వల్ల సహజంగా రూపు దిద్దుకున్న గుహలు. వీటిలో APTDC లైటింగ్ ఏర్పాటు చేసి ఇంకా అందంగా తయారు చేసారు.

ఇక్కడ బస చేయడానికి APTDC హరిత హోటల్స్ నడుపుతోంది. బయట మన అదృష్టం కొద్ది ఒకే ఒక శాకాహార భోజన హోటల్ ఉంది. హరిత హోటల్స్ లో శాకాహార భోజనం దొరుకుతుంది.

అరకు దర్శించడానికి అనువైన కాలం వర్షాకాలం అయిపోయిన తర్వాత అక్టోబర్ నుంచి january మధ్య కాలం. ఇక్కడ ఈకాలం లో వలిసే పూవులు పూస్తాయి. లోయ అంతా ఈ పూవుల పచ్చ రంగుతో పసుపు పచ్చ తివాచి పరిచినట్లు ఉంటుంది. ఆ అందం తప్పనిసరిగా చూడవలసినదే.

ఈకాలం లో అరకు లోని landscapes మనలను కట్టిపడేస్తాయి. వానాకాలంలో అరకు రైలు లో వెళ్ళే సాహసం చేయకండి. కొండచరియలు విరిగి పడుతుంటాయి. ప్రమాదం కూడా.
ఈరోజు ఒక మంచి పుస్తకం గురించి తెల్సుకుందాం. నేను చదివిన పుస్తకాలలో నాకు నచ్చిన పుస్తకం.. సత్యం శంకరమంచి గారు వ్రాసిన అమరావతి కథలు. ఇందులో దాదాపు 100 కథలు ఉన్నాయ్. అన్ని చాల సరళమైన భాషలో పిల్లలకు కూడా సులభంగా అర్ధం అయ్యేలా ఉంటై.

బ్రాహ్మణ అగ్రహారం లో అప్పటివరకు కులాలు పట్టింపు ఉన్నా, అమాంతం వరద వచ్చేసరికి ఊరి జనం అందరు కుల భేదం లేకుండా ఊరి అవసరాలు ఎలా తీర్చారు అనేది 'వరద' కథ.

బాగా తిండి పుష్టి ఉన్న అప్పంభోట్లు ఊరిలో ఉన్న మామ్మగారికి మనవడు పుట్టినట్లు శుభవార్త మోసుకేల్తే, అంత వయసులోనూ, ఆవిడ అప్పంభోట్లు కి ఎలా వండి వడ్డించింది అనేది 'అప్పంభోట్లు' కథ. చాల సొగసుగా మునివేళ్ళతో రెండు మెతుకులు తీసుకోని నోట్లో వేసుకొని భోజనం ఐపోయింది అనుకునే ఈతరానికి సుష్టు గ భోజనం చేసే అప్పంభోట్లుని చుస్తే ఆశ్చర్యమే మరి.

కార్తీకమాసం వనభోజనాలకి వెళ్ళినపుడు అందరికి కొసరి కొసరి వడ్డించిన వంటవాడు ఆఖరున మిగిలిన కొద్ది పదార్థాల్ని విస్తర్లో వడ్డించుకుని తిని బ్రేవ్ మని త్రేన్చి, అందరు తృప్తి గ తింటే చాలు నా ఆకలి తీరినట్లే అనుకొన్న కథ ఒకటి. ఇందులో ఈకాలం పిల్లలకి తెలియని అచ్చ తెలుగు వంటల పేర్లు తెలుసుకోవచ్చు.

ఆస్తికుడు, నాస్తికుడు, వారి వారి ద్రుక్పథములు వివరించిన కథ మరొకటి. గుడిలో పూజారి ఇచ్చిన తీర్థం భగవత్ప్రసాదం అని ఆస్తికుడు అనుకుంటే, నోరు తడిపి దాహం తీర్చింది అని నాస్తికుడు అనుకుంటాడు. ఎవరి భావాలు వాళ్ళవి....

ఇవే కాక మరెన్నో కథలు, మనసులు స్ప్రుశించేవి, మనని ఆలోచింప చేసేవి, దాదాపు అన్ని కథలు ఆణిముత్యాలు.... ఎన్ని సార్లు చదివినా మళ్లీ మళ్లీ చదవాలి అనిపించేవి..

ఇప్పటికే ఈపుస్తకం చదివిన వాళ్లకి ధన్యవాదములు. ఇంకా చదవని వారు తప్పక ఒకసారి చదవండి. వీలైతే పిల్లల చేత కూడా చదివించండి.. సిటీ బ్రతుకులు, ఇంగ్లీష్ చదువులు అలవాటైన పిల్లలు ఒకసారి తెలుగు గురించి, తెలుగులో ఉన్న మంచి సాహిత్యం గురించి తెలుసుకుంటారు.
ప్రాతస్మరణ శ్లోకాలు

క్రింది రెండు శ్లోకాలు త్రిమూర్తుల గురించి, నవగ్రహాల గురించి, మన ఋషుల గురించి చెప్పినవి. వీటిని కూడా ఉదయాన్నే స్మరణ చేసుకోవడం మంచిది.

బ్రహ్మ మురారి త్రిపురాన్తకారి, భాను భూమిసుతో బుధశ్చ,
గురుశ్చ, శుక్ర, శని రాహుకేతవహ కుర్వంతు సర్వే మమ సుప్రభాతం.

సనత్కుమార సనక సనన్దనహ సనాతనౌ ప్యాసురి పింగలౌ చ,
సప్తస్వరా సప్త రసాతలాని కుర్వన్తు సర్వే మమ సుప్రభాతం.

మన నాగరికతలో మనం గిరులను, నదులను, సముద్రాలను కూడా పూజిస్తాం. మన దేశ ఔన్నత్యన్ని తెలిపే కొన్ని శ్లోకాలు. ఇవి అందరికి సులభంగా అర్ధం అవుతాయి. పిల్లలకు సులభం గ వివరించి అర్ధం చెప్పవచ్చు.

సప్తార్నవా సప్తకులాచలశ్చ, సప్తర్శ్యో ద్వీపవనాని సప్తః,
భూరాదికృత్వా, భువనాని సప్తః, కుర్వన్తు సర్వే మమ సుప్రభాతం.

మహేంద్రో మలయస్సహ్యో, దేవతాత్మా హిమాలయః
ధ్యేయో, రైవతకో విన్ధ్యో, గిరిశ్చారావలీ తథ

గంగేచ యమునైచైవ గోదావరీ సరస్వతీ,
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు

అయోధ్య మధుర మాయ, కాశీ కాంచీ అవంతికా,
పూరి ద్వారావతీ చైవ సప్తైతే మోక్షదాయికాహ.

రత్నాకర దౌత పదం. హిమాలయ కిరీటినీం
బ్రహ్మ రాజర్షి రాత్నాభ్యం వందే భారత మాతరం.ల్
ఆంధ్ర కాష్మీరం....

మంచు పరదాల వెనుక దాగిఉన్న సూర్యోదయాలు, త్రోవ పక్కన పూలబాలల స్వాగతాలు... వెన్ను వణికించే చలి చలి రాత్రులు..... ఇవన్ని చూడాలి అనుకుంటే ఎక్కడో మన దేశ ఉత్తరాన ఉన్న హిమాలయాలకో, కాశ్మీర్ కో వెళ్ళాలి అనుకుంటున్నారా.... ఇంక అంత దూరం అవసరం లేదు... మన రాష్ట్రానికి కూడా ఒక కాశ్మీర్ ఉంది... ఎక్కడ అనుకుంటున్నారా....

విశాఖ జిల్లా చింతపల్లి మండలం లో విశాఖకు పశ్చిమ దిశలో, తూర్పు కనుమలలో, దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది "లంబసింగి". ఇది ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఒక కుగ్రామం.

సముద్ర మట్టానికి సుమారు 1500 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గ్రామంలో ఏడాది పొడవునా చాల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. నిండు వేసవిలో కూడా ఎండ 10 డిగ్రీలకు మించదు. మరి ఇంక శీతాకాలంలో ఐతే 4 డిగ్రీలకి పడిపోతుంది ఉష్ణోగ్రత. సితాకాలంలో ఉదయం 10 గంటల వరకు పొగమంచు కప్పి ఉంటుంది. దారి కూడా సరిగా కనబడదు.

ఈకాలంలో లంబసింగి లో ప్రకృతి చాల అందంగా ఉంటుంది. చాల రకాలైన పువ్వులు మనకు కనువిందు చేస్తాయి.

లంబసిన్గికి కొద్ది దూరంలో ఉన్న "తాజంగి" లో ఒక చెక్ డాం ఉన్నది. తజంగి గ్రామానికి దిని ద్వారానే తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈ సరస్సు పక్కన చుట్టూతా కొండలతో ప్రకృతి ఎంతో మనోహరంగా ఉంటుంది.

ఈ క్రింది ఫోటోలు చూసి ఐన ఒప్పుకుంటారా, లంబసింగి ఆంధ్ర కాష్మీరం అని.....
సూర్య భగవాన్ ద్వాదశ నామావళిః
( ప్రతి నిత్యం పాటించిన నేత్ర, చర్మ, హృదయ బాధలు తొలగును.. ఆరోగ్యము చేకూరును)

ఓం మిత్రాయ నమః
ఓం రవయె నమః
ఓం సూర్యాయ నమః
ఓం ఖగయే నమః
ఓం భానవే నమః
ఓం పుష్నే నమః
ఓం హిరణ్య గర్భాయ నమః
ఓం మారీచాయే నమః
ఓం ఆదిత్యయె నమః
ఓం సావిత్రే నమః
ఓం ఆర్కాయ నమః
ఓం భాస్కరాయ నమః

ఛాయా - సంధ్యా సమేత శ్రీ సూర్య దేవాయ నమః.
గృహస్తు ధర్మాలను పాటిస్తే చాలు, సత్ఫలితాలన్నీ వాటంతట అవే చేకూరుతాయని శాస్త్రాలు చెపుతున్నాయి. భర్తకు అనుకులవతి అయిన భార్య దొరకడం ఒక మహా భాగ్యం. గృహస్తు విజయం అతని భార్యపైనే ఆధారపడి ఉంటుంది. మంచి భార్య ఉన్నవాడు ఎంతటి ఆపదనైనా సులభంగా దాటగలడు. మహాభారతం ప్రకారం ధర్మపత్ని-- ధర్మార్ధ కామ సాధనకు ఉపకరణం, గృహనీతి విద్యకు నిలయం, సత్ప్రవర్తన నేర్పే గురువు, వంశ అభివృద్ధికి మూలం, సద్గతికి ఊతం--ఇవన్ని పురుషులు గ్రహించాలి.

గృహస్తు- గృహిణి సహాయంతోనే అతిథులను సంతోశాపెత్తగాలుగుతున్నాడు. ఆశ్రమ ధర్మాలేన్ని ఉన్నా, గృహస్త ఆశ్రమం తో ఏదీ సమానం కాదు. భార్యతో పరితృప్తి చందే గృహస్తు అశ్వమేధ ఫలాని పొందగలడు. ఏ ఇతర ఆశ్రమమూ కూడా, గృహస్తాశ్రమం లో పదహారో వంతు కుడా కాదు.

మంచి భార్య వల్ల భర్తకు ధర్మార్ధ సుఖాలు కలుగుతాయి. అధర్మంగా ప్రవర్తించే భార్యలను అసురి, పైశాచి, రాక్షసి అనే పేర్లతో సనాతన సంస్కృతీ ఈసడించింది. అటువంటి వారి వాళ్ళ వంశ నాశనం సంభవిస్తుంది.

భర్త అభిప్రాయాన్ని అనుసరించేది, సుగుణవతి, సంతానవతి అయిన భార్యను అవమానించే భర్తకు సద్గతులు ఉండవు అని శాస్త్ర వచనం. ధర్మపత్ని యెడల ప్రేమ, గౌరవాన్ని చూపటం భర్త యొక్క ప్రథమ కర్తవ్యమ్.

ఆధునికులు సైతం ఆచరించవలసిన సనాతన ధర్మం ఇది.