Friday 28 February 2014

శ్రీకృష్ణుడు మరియు ఇలా చెప్పుచున్నాడు.

ఓ అర్జునా! నీకును, నాకును, పెక్కు జన్మలు గతించినవి.వాటిని నేను ఎరుగుదును, నివు ఎరుగావు. నేను నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగిపోవుచున్నప్పుడు, నన్ను నేను సృజించుకొందును. ఒక సాకార రూపముతో అవతరింతును. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్తిరపరచుటకు నేను ప్రతి యుగమునందు అవతరించెదను.  ఓ అర్జునా! నా జన్మలు, కర్మములు, దివ్యములు, నిర్మలములు, అలౌకికములు, నా తత్వ రహస్యమును తెలుసుకొన్నవాడు తనువును చాలించిన పిమ్మట మరు జన్మ లేక నన్నే చేరుకొనును. ఇదివరలో కూడా సర్వదా రాగ భయ క్రోధ రహితులైన వారు, ద్రుఢమైన భక్తీ తో స్థిర బుద్ది కలిగి, నన్ను ఆశ్రయించిన భక్తులు తప: సంపన్నులై నన్ను చేరిరి. మనుష్యులందరూ వివిధ మార్గములలో నన్ను సేవింతురు, నన్ను వారు సేవించిన రీతికి అనుగుణముగా నేను వారిని అనుగ్రహింతును. నాకు కర్మ ఫలాసక్తి లేదు. నా తత్వమును తెలిసినవారును కర్మ బద్దులు కారు.

కర్మ యందు ఆకర్మను, అకర్మ యందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి. ఎవని కర్మలు శాస్త్ర సంమతములై, కామ సంకల్ప వర్జిథములై జరుగునో, ఎవరి కర్మలు జ్ఞానగ్నిచే తగలబడునో, వానిని పండితులు అందురు.అంత:కారణమును, శరీర ఇంద్రియములను జయించిన వాడు, సమస్త భోగ సామగ్రిని త్యజించువాడు,ఆశారహితుడు అయిన వాడు కేవలము శారీరిక కర్మలను ఆచరించినప్పటికి పాపమును పొందడు. తనకు లభించిన పదార్ధములతో సంతుష్టుడైన వాడు, అసూయా లేనివాడు, హర్ష శోకములకు అతీతుడైన వాడు, సిద్దియండును, అసిద్దియండును సమదృష్టి కలిగి ఉండును.అట్టి యోగి కర్మలను అచరించుచున్నను వాటి బంధములో చిక్కు పడడు పరమాత్మ జ్ఞానమునందే దృష్టి ఉంచు వాడు, యజ్ఞార్ధమే కర్మలను నిర్వహించువాని కర్మలు విలీనమగును.
యజ్ఞ కార్యములందు వినియోగింపబడు సాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్త బ్రహ్మము. హవనక్రియ బ్రహ్మము. ఇట్లు బ్రహ్మ కర్మ యందు స్థితుడై ఉండు యోగి ద్వారా పొందిన యజ్ఞ ఫలము కుడా బ్రహ్మమే.
యజ్నవిడులైన సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపు మాపుదురు.యజ్ఞసెశమును అనుభవించు యోగులకు పరమాత్మా యొక్క లాభము కల్గును. యజ్ఞము చేయని వారికీ ఈలోకమే సుఖప్రదము కాదు, ఇక పరలోకము సంగతి చెప్పనేల?

Monday 24 February 2014

10. పెద్దలు:


ఈ వధువు పాడి పంటలతోను, ఇండ్లతోను, భూములతోను, సంపదలతోను, మమ్ములను అభివృద్ది చేయు గాక. ఈ దంపతుల సర్వ సంవృద్ది తో దేనికిని ఇతరులను అపేక్షించకుండా ఉందురు గాక.

11. పెద్దలు:



ఈ నూతన దంపతులిద్దరూ, కుమారులు, కుమార్తెలు కలిగి పరిశుద్ధమైన బంగారుకాంతితో మంచి పనులు చేస్తూ, సిరిసంపదలు సంపాదించి మంచి ఆయుష్షును పొందుదురు గాక!

మంచి వ్రతము కల కన్యా! పురుషత్వం కల పుత్రులను కనుము. మరియు సూనృతం కలిగి సంపద రుపులైన పుత్రులను కనుము.
4. వరుడు:

మామ యందు, అత్తా యందు, ఆడబిడ్డల యందు, బావల యందు, మరదుల యందు సముచిత ప్రేమాభిమానములతో ఉండుము.

5. వరుడు:

తోడి కోడళ్ళను , అత్తమామలను, నీ సంతానాన్ని, సిరి సంపదలను, భర్త అయిన నన్ను, బావాను, మరదులను మా వంశం లోని వారందరిని, అనేక విధముల పొషించుచు, అందరికి తలలో నాల్క వాలే మంచి పేరును సంపాదించుము.

6. వరుడు:

ఓ మనసా! బ్రహ్మ ఈ వధువును నాకు భార్యగా సృష్టించెను. నన్ను ఈ కన్యకు భర్త గా సృష్టించెను. ఆ బ్రహ్మ దేవుడు మా ఇద్దరికీ సకల సంపదల నిచ్చి చిరాయువును కలిగించు గాక!

సుమంగళిగా చాల కాలముండు ఈ వధువును మీరందరూ వచ్చి చూచి, దీనికి ఆయుష్షును సౌభాగ్యమును ఇచ్చి మీ మీ ఇండ్లకు వేల్దురు గాక!

8. వధువు:

నిన్ను నా అభిప్రాయము తెలిపిన వాని గాను , మంచి సంస్కారంతో పుట్టినవాని గాను, మంచి నియమాలతో పెంచుకొన్న తేజస్సు గల వానిగార్ను, నేను గ్రహించాను. ఓ సంతానాభిలాషి, నివు నాకు సంతానాన్ని కానీ, సిరి సంపదల నిచ్చి సుఖపడుము.

9. ఇద్దరు:

విశ్వా దేవులు, పవిత్రోదకాలు, వాయువు, బ్రహ్మ మన మనసులను ఎల్లప్పుడూ స్నేహంతో కుడునట్లు చేయుదురు గాక. అనుకూలంగా మాట్లాడు కోనేతట్లు చూచెదరు గాక. !
సప్తపది--మంత్రాలూ-- వాటి వివరణ...

భారతీయ వివాహ సంప్రదాయంలో వరుడు, వధువు కలిసి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు, అప్పుడు మంత్రాలూ చెపుతారు కదా.... వాటికీ వివరణ ఇది....

1. వరుడు:

ఓ కన్యా! నీవు నా వెంట నడువుము. నివు వేసే మొదటి అడుగువల్ల విష్ణుమూర్తి అన్నాన్ని, రెండవ అడుగు వల్ల బలాన్ని, మూడవ అడుగు వల్ల మంచి కార్యాలను, నాల్గవ అడుగు వల్ల సౌఖ్యాన్ని, అయిదవ అడుగు వల్ల పశు సమృద్ధిని, అరవ అడుగు వల్ల రుతు సంపదలను, ఏడవ అడుగు వల్ల ఏడుగురు హోతలను నీకు ఇచ్చు గాక.

2. వరుడు:

నాతో ఏడడుగులు నడచి నాకు స్నేహితురలవు కమ్ము. ఏడడుగులు కూడా మనమిద్దరం నడిస్తే మనం స్నేహితులమవుతం. అప్పుడే నేను నీ స్నేహాన్ని పొందుతాను. నీ స్నేహన్నుంచి ఎప్పుడు వియోగం పొందను. నా స్నేహన్నుంచి నీవెప్పుడు వ్యోగం పొందకు. పరస్పరం ప్రేమతో, అనుకూల దాంపత్యంతో ప్రకాశిస్తూ నిండు మనసుతో ఆహారాని, బలాన్ని కలిసి పొందుతూ కలిసి ఉందాం. కలసి అలోచిన్చుకుందాం. అలాగే అన్ని నియమాలలోను బాహ్య ఇంద్రియాలు కూడా కలిసి ఉండేట్లు నడచుకుందాం.

3. వరుడు:

వెనుక స్త్రీలు అగ్ని దేవుని పూజించి కోరిన భర్తను పొందిరి. లోకోపకారి అయిన ఆ అగ్నిదేవుడు ఈ చిన్నదానికి వివాహమయిన తరువాత పుట్టింటి మీద మమకారం తగ్గించి అత్తింటి మీద విసేషానురాగం కల దానిగా చేయును గాక.....

(ఇంకా వుంది )
సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మం గ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.

1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.

2. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.

3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.

4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.

5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.

6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.

7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.

8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.

9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.

11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.

12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.

13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.

14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.

15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు.
మండల దీక్ష:

మండల దీక్ష ఎందుకు చేస్తారు? భక్తులు అందరు తమ తమ ఇష్ట దైవాల ప్రీతి కొరకు దీక్షలు చేపడతారు. ఈ దీక్షలు ఏ వారమో, నెలో కాకుండా మండలం రోజులే ఎందుకు చేస్తారు? మండలం అంటే 41 రోజులు.

ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల మందులు తయారు చేయడానికి , కొన్ని రకాల చికిత్సలకు మండల రోజులే కాల పరిమితి ఉంటుంది. అసలు ఈ 41 రోజుల పరిమితి ఏమిటి?

మన శరీరం మనం తినే ఆహార పదార్థాలను బట్టి పని చేస్తుంది. మన మనస్తత్వం కూడా మనం తినే ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. శరీరం రోగ గ్రస్తం అయినపుడు శరీరంలో నుంచి అనారోగ్యానికి కారణమైన toxins తొలగించి, శరీరాన్ని మాములు స్థితికి తేవడానికి కనీసం 40 రోజులు పడుతుంది. అప్పుడే రోగం మూలం నుంచి తొలగించబడి శరీరం ఆరోగ్యవంతం ఔతున్ది.

అలాగే మన మనసు కూడా నానా వికారాలకు లోను అవుతుంటుంది. మనసు, బుద్ది, సరిగా ఉండాలి అంటే అరిషడ్వర్గాలను జయించాలి. ఎవరో యోగులకు తప్ప మాములు మానవులకు , మన లాంటి వాళ్లకి అది సాధ్యం కానీ పని. మనలోని వికారాలు, అహంకారం తొలగిపోయి అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అనే భావన నిలుపుకోవటం సాధన ద్వారానే సాధ్యం అవుతుంది. ఈ సాధనకు కనీసం 41 రోజులు అవసరం. ఈ దీక్షలను అందుకే 40 రోజుల కాల పరిమితి తో పాటిస్తారు.

దీక్ష చేసేవారు మగవారిని స్వామి అని, ఆడవారిని మాతా అని పిలవడం కూడా అందరిలోనూ భగవంతుడిని చూసే ప్రయత్నమే. అలాగే, భూ శయనం, ఒంటి పుట భోజనం కూడా మనలో రాజసాన్ని అరికట్టి సాత్వికులుగా చేసే ప్రక్రియ. అలాగే చెప్పులు లేకుండా నడవడం, క్షవరం, లేకుండా , గోళ్ళు తీసుకోకుండా ఉండడం మన దేహంపై మనకు ఉన్న ప్రేమని తొలగించి రెండు పూటలా భజన, దైవ పూజ ద్వారా దైవానికి సన్నిహితంగా ఉండడం కొరకే. అలాగే పరుష వాక్యాలు మాట్లాడక పోవడం అనే నియమం అందరి తోను సద్భావనతో ఉండడానికే. అలాగే చన్నీటి స్నానం, మనలో కోరికలను నశింప చేయడానికే. మొత్తం ఒకే రంగు దుస్తులు ధరించడం కూడా మన దేహం మిద, అలంకరణ మిద మనకు ఉన్న ప్రీతిని తగ్గించడానికే. మరి సాత్వికమైన భోజనం, మద్య మంసాలకు దూరంగా ఉండడం జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో జీవించడానికే.

ఈ అన్ని నియమాలు 40 రోజులు పాటించడం వల్లమనలోని అహంకారం, వికారాలు నశించి, అరిషడ్వర్గాలను జయించి, సాత్వికులుగా మారతాం. అందరు ఇలా మారటం వల్ల సమాజం లో శాంతి , సమభావనలు వెల్లి విరుస్తాయి.

కానీ, ఈ దీక్షల వెనుక ఉన్న ఉద్దేశ్యం ఈ రోజుల్లో ఎంతవరకు fulfil అవుతోంది? ఎంతమంది దీక్ష పూర్తీ అయిన తర్వాత తమ అహంకారాన్ని వదులుకుంటున్నారు? ఎంత మంది సమ భావాన్ని అలవరచు కొంటున్నారు? దీక్ష పూర్తీ అయిన కూడా, ఎంత మంది మద్య మాంసాలకు దూరంగా ఉంటున్నారు? దీక్ష అయిపోయి మాల తీసిన తరువాత అంత షరా మాములే. ఈ పధ్ధతి మారనంత వరకు ఎన్ని దీక్షలు చేసిన ప్రయోజనం లేదు . ఆలోచించండి.
— with Raj StudentofVihe.
లోకంలో శని అన్న పేరు వినగానే అందరం భయపడతాము. నవ గ్రహాలలో ఒకడైన శనిని మనం భక్తీ పూర్వకంగా ఆరాధిస్తాము. సూర్యునికి, చాయకు పుట్టిన కుమారుడు శని. యముడు, యమునలకు అన్నగారు. యముడు, శని ఇద్దరూ కుడా జీవుల పాప పుణ్యాల ఫలితాలను ఇచ్చేవారే. యముడు జీవి చనిపోయిన తరువాత శిక్షిస్తే, శని జీవుడు బ్రతికి ఉండగానే పాపకర్మలకు తగిన శిక్ష ని వేస్తాడు. ఏలినాటి శని, అర్దాష్తమ శని, అష్టమ శని రూపంలో ఈ శిక్షలు ఉంటాయి. శని సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. అంత నెమ్మదిగా తిరుగుతుంది. అందుకనే ఈయనకు మంద గమనుడు అని ఇంకొక పేరు. ఈయన నల్లటి దేహం కలవాడు, నల్లని వస్త్రాలు ధరించిన వాడు, కాకి వాహనంగా కలవాడు. ఈయనకు నలుపు రంగు, నువ్వులు, అశుభ్రత, మందకొడి తనం.అంటే ప్రీతి. అందుకే అశుభ్రం గ లేదా మందకొడిగా ఉన్నవాళ్ళ దగ్గర శని దేవుడు హాజరు అవుతాడు. కానీ నల్లటి వస్త్రం, నువ్వులు, నువ్వుల నునె సమర్పించిన వాళ్ళని అనుగ్రహిస్తాడు అంటారు. ఈ శని ప్రభావం నుంచి తప్పించుకోవటానికి కొన్ని మార్గాలు ఉన్నయి. అవేమిటో చూద్దాం.:

1. ప్రతి శనివారము తలకు, ఒంటికి నువ్వుల నునె రాసుకుని స్నానం చేస్తే శని శాంతిస్తాడు.

2. శనివారం నాడు శివునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా మంచిదే.

3. శని త్రయోదశి నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి, నల్ల నువ్వులు, నునె, మినుములు దానం చేస్తే మంచిది.

4. దశరధ ప్రోక్త శని స్తోత్రం పఠించి, రావిచెట్టుకు ప్రదక్షిణాలు చేసి, ఒంటిపూట భోజనం చేయడం వలన శనిని శాంత పరచ వచ్చు.

5. శనివారం నాడు 8 మంది భిక్షకులకు, వికలాంగులకు సహాయం చేయడం, వస్త్రదానం చేయడం వలన శని దోషనివారణ జరుగుతుంది.

6. హనుమాన్ చాలిసా, దుర్గ స్తోత్రం, రామనామం జపించాలి.

7. అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి. కాళీ పూజ చేయాలి.

పైవాటిలో వీలు కుదిరినవి ఏవి పాటించినా, శని దేవుడు ప్రసన్నం అయి. మన బాధలు తగ్గిస్తాడు అని అంటారు. మన రాష్ట్రం లో మందపల్లి లో శని దేవుడికి గుడి ఉంది. దేశం మొత్తం మిద ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. మహారాష్ట్ర లోని షిర్డీ దగ్గరలో శని శింగనపుర్ ఈ మధ్య అందరికి పరిచయమైన శని క్షేత్రం.

నీలాంజన సమాభాసం, రావిపుత్రం యమాగ్రజమ్,
చాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ....
ఉత్తరాయణ పుణ్య కాలం :

ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశి లోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే మార్పు. మనకి రాశులు 12. ( మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల,వృశ్చిక, , ధనుస్సు, మకర, కుంభ, మీన) సూర్యుడు ఒక్కో మాసంలో ఒక్కో రాశిలో ప్రవేశిస్తాడు. అల సంవత్సరంలో 12 సంక్రతులు వస్తాయి. రవి ధను రాశి నుండి మకర రాశి లోకి మారిన సమయమే మకర సంక్రాంతి. దీనితో ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభం అవుతుంది. భూమధ్య రేఖకి ఉత్తరదిక్కుగా సూర్యుడు ప్రయాణం చేయడాన్ని ఉత్తరాయణం అంటారు. సూర్యుడు ఒక్కో రాసిలో ప్రవేశించినపుడు ఆ రాశి యొక్క పేరుతో సంక్రమణం అంటారు. కానీ అన్నిటి కన్నా మకర రాశి లో ప్రవేశించిన మకర సంక్రమణం మనకు ఎంతో ముఖ్యమైనది.

ఈ కాలం లో ప్రక్రుతి సంపద అయిన పంటలు, ముఖ్యంగా ఆహార పంటలు చేతికి అంది వస్తాయి. చేమంతి, బంతి వంటి పువుల పంటతో తోటలు కళకళ లాడతాయి. హేమంత గాలులతో, ఎటు చూసినా ప్రక్రుతి వింత శోభతో అలరారుతుంది. ఏడాది పొడవునా కష్టపడి పెంచిన పంట, ధాన్యం చేతికి వస్తుంది కాబట్టి రైతులు కూడా ఆనందోత్సాహాలతో ఉంటారు. ఈ మాసంలో పొలం పనులు ఏవి ఉండవు కాబట్టిఇంటి దగ్గర అందరు తీరికగా ఉంటారు. ఇంతకు ముందు మాసాలైన ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం మాసాలలో పెళ్లి ముహుర్తాలు ఉంటాయి, కాబట్టి కొత్తగా పెళ్లి అయిన కూతుర్లు, అల్లుళ్ళు, ఇంటికి వస్తారు కాబట్టి ఇల్లంతా సందడిగా ఉంటుంది. పండుగ జరుపుకోవటానికి ఇంత కన్నా మంచి సమయం ఏమి ఉంటుంది?

ఈ మకర రాశిలో విష్ణు నక్షత్రం అయిన శ్రవణం ఉంది. శ్రీమన్నారాయణుడు అనంత పద్మనాభ స్వామిగా సాక్షాత్కరించినది ఈ నక్షత్రం తోనే. అందుకే మకర రాశిని విష్ణు రాశి అంటారు. వామనావతారంలో స్వామి బ్రహ్మండమంతా రెండు అడుగులతో కొలిచి, మూడవ పాదంతో బలిని పాతాళానికి పంపినది ఉత్తరాయణ పుణ్యకాలం లోనే. దేవతలకు ముఖ్యమైన ఈ రోజులలో చేసే పుణ్య కార్యాలు, దాన ధర్మాలు, పూజలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి అంటారు. అందుకే భీష్మ పితామహుడు కూడా దక్షిణాయనంలో అంపశయ్య చేరినప్పటికీ, ఉత్తరాయణ పుణ్యకాలం లోనే తనువూ చాలించాడు.

ఉత్తరాయణం లో చేయవలసినవి ముఖ్యంగా, నదీస్నానం, సూర్య నమస్కారం, వేదాధ్యయనం, నూతన గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం, వంటి పుణ్య కార్యాలు. ఉత్తరాయణం ఉండే ఆరు నెలలలో పవిత్ర నదులైనటువంటి గంగ, గోదావరి వంటి నది స్నానం చేసి, నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరకు, విసనకర్ర, బంగారం, గోవులు వంటివి దానం చేస్తే ఉత్తమ గతులు పొందుతారు అని శాస్త్రం. గుమ్మడి కాయను దానం చేస్తే సాక్షాత్తు బ్రహ్మాండాన్నే దానం చేసిన ఫలం పొందుతారుట.
ఈ ఫోటోలు ఎవరో ప్రకృతి ప్రేమికులు పెంచిన ఒక తోట లోవి అనుకుంటున్నారా...?

తమిళనాడు లోని హిల్ స్టేషన్ "ఊటీ" లో ఉన్న ఒక garden ఇది. కానీ ఇది సహజమైన garden కాదు. joseph anthony అనే అయన కలల ప్రతిరూపం ఇది. ఈ పూలు అన్ని దారాలతో చేతితో చేసినవి అంటే నమ్మ బుద్ది కావటం లేదు కదా.... కళ్ళారా చూసినా కూడా నమ్మలేము. అంత సహజంగా ఉంటాయి ఇవి.

కేరళకు చెందిన Joseph Anthony అనే వ్యక్తి ఇండియాలోని ప్రముఖ దారాల కంపెనీ "Coats India " వారి దారాలతో ఈ పూలు తయారు చేయడం కనిపెట్టారు. తరువాత ఊటీ లో స్థానికంగా ఉన్న మహిళలకు 50 మందికి శిక్షణ ఇచ్చారు. మొత్తం 50 మంది కళాకారులు 12 సంవత్సరాల పాటు కష్టపడి ఈ పూలతోట తయారు చేసారు. ఇందులో మొక్కలు, ఆకులూ, పూలే కాకుండా సరస్సులు, అందులో నాచు, అవి కూడా ఎంతో సహజంగా ఉండేలా తయారు చేసారు.

బకరం గుడ్డను కావలసిన ఆకారంలో అంటే== పువ్వు రేకలు, ఆకులు ఇలా == కత్తిరించుకొని దానికి ఒక క్రమపధ్ధతిలో రంగు రంగుల దారాలు చేతితో చుట్టడం ద్వార ఈ పువ్వులు తయారు చేస్తారు. ఎంత కష్టమో కదా...దాదాపు 400 రంగుల --ఏకాండీ, కలనేత --దారాలను ఉపయోగించి ఈ గార్డెన్ ను రూపొందించారు.

ఎవరికైనా బహుమతిగా ఇవ్వటానికి, మనం సొంతంగా ఇంట్లో అలంకరించుకోవడానికి ఈ మొక్కల కుండిలను అద్దాల పెట్టెల్లో పెట్టి అమ్ముతారు. ఈసారి ఊటీ వెళ్ళినపుడు అందరి మనసును దోచే Thread garden ( దారాల పూదోట) ను చూడడం మర్చిపోకండి..
విభూతి అంటే ధనము, బలము, మహిమ, లీల, మహాత్మ్యం అనే అర్ధాలు ఉన్నాయ్. విభూతి ధరిస్తే సకల సారీరక, మానసిక రోగాలు తొలగిపోయి, పరిపూర్ణ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల దోషాలు తొలగి, సర్వపాపాలు పటాపంచలు కావాలన్నా, సంపూర్ణ ఆయురరోగ్ర్యాలు, సిరిసంపదలు లభించాలన్నా, ప్రతిరోజూ విభూతిని ధరించడమే మార్గమని శాస్త్రవచనం. రోజు పూజలు చేయలేని వారు, ఆలయ సందర్శన చేయలేని వారు ప్రతి నిత్యం నుదుటన విభూతి ధరిస్తే , సహస్త్ర నామాలతో దైవాన్ని పూజించి, నిత్యం ఆలయదర్శనం చేసుకున్నంత ఫలం పొందుతారు. విభూతిని ధరించే వారి భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంటుందని పెద్దలు చెప్తారు.

విభూతిని ధరించేతప్పుడు మూడువేళ్ళతో తీసుకోని ముందు నుదుటన, తరువాత భుజాలకు, , చేతులకు, హృదయము పైన, ఉదరము పైన.... ఇలా వరుసగా ధరించాలి. వేసుకున్న బట్టలపైన కానీ, నేలపైన కానీ పడకుండా జాగ్రత్త వహించాలి, ఒకవేళ పడితే, వస్త్రంతో తీయాలి కానీ, చీపురు తో తుదవకూడదు. పురుషులు విభూతిని స్త్రీల చేతికి ఇవ్వరాదు. స్త్రీలు వారె తీసుకోని ధరించాలి.

పురుషులు, సుమంగళులైన స్త్రీలు విభూతిని తడిపి పెట్టుకోవాలి. పూర్వ సువాసినులు పొడి విభూతిని ధరించాలి. ఎప్పుడు మధ్య వేలు లేదా ఉంగరము వేలుతో పెట్టుకోవాలి . చూపుడు వేలుతో పెట్టుకోరాదు.

స్త్రీలు విభూతి ధరించే టపుడు వారు రోజు పెట్టుకునే కుంకుమ పైన విభూతిని, కింద దేవునికి పూజ చేసిన కుంకుమ ను ధరించాలి.

విభూతిని ధరించేతపుడు ఈ కింది శ్లోకం పఠించడమ్ వాళ్ళ మరింత మంచి ఫలితాలు పొందవచ్చు.

శ్రీకారం చ పవిత్రం చ శోక రోగ నివారణం
లోకే వశీకరణం పుంసాం భస్మం త్రైలోక్య పావనం ...
రామాయణం భారత దేశం ప్రపంచానికి అందించిన ఒక మహత్తర కావ్యం. ఇది ఒక కావ్యమే కాదు, భారతీయుల జీవన విధానం. భారత దేశం లో ఊహ తెలిసిన చిన్నపిల్లవాడి కి కూడా రామాయణం అంటే రాముడి కథ అని తెలుసు. ఇది అంతగా భారతీయుల జీవితంతో పెనవేసుకుపోయింది.

ఎవరైనా ఒక మంచి వ్యక్తి గురించి చెప్పాలంటే " అయన సాక్షాత్తు రామచంద్రుడే" అంటాం. ఒక మంచి కొడుకు గురించి చెప్పాలంటే " రాముడిలాంటి అబ్బాయండి " అంటాం. ఇంక ఒక మంచి భర్త గురించి చెప్పాలి అంటే రాముడిని మించిన పోలిక లేనే లేదు. మరి రాముడు ఇంత గొప్పవాడు అవడానికి రామునిలో ఉన్న లక్షణాలు ఏమిటి? వాల్మీకి చెప్పిన విషయం ఇక్కడ మనం గుర్తు చేసుకొందాం.

వాల్మీకి రామునికి 16 సుగుణాలు ఉన్నాయి అన్నాడు. అవి ఏమేమిటి? 1. గుణవంతుడు. 2. వీరుడు 3. ధర్మజ్ఞుడు. 4. కృతజ్ఞుడు 5. సత్య వాక్య పరిపాలకుడు 6. ధ్రుఢవ్రతుదు 7. ఉత్తమ చరిత్ర కలవాడు 8. సర్వ భూతముల హితము కోరేవాడు 9. విద్వాంసుడు 10. సమర్ధుడు 11. ప్రియవర్తనుడు 12. ఆత్మవంతుడు `13. జితక్రోధుడు 14. ద్యుతిమంతుడు 15. అసూయ లేనివాడు 16. ఈ సృష్టిలో ఎవరి కోపాన్ని చూసి దేవతలు కూడా భయపడతారో అటువంటి వాడు.

ఈ పదహారు లక్షణాలు ఒక మనిషిలో ఉండడం ఏ కాలం లో నైనా అరుదు. ఇన్ని మంచి గుణాలు కలవాడు కాబట్టే రాముడు మర్యాదా పురుషోత్తముడు అయ్యాడు. ఒక మంచి కొడుకు, ఒక మంచి భర్త, ఒక మంచి అన్న, ఒక మంచి పాలకుడు అయ్యాడు. రాముని గురించి చెప్పే ఏ పదమూ కూడా సామాన్యమైనది కాదు. ప్రతి శబ్దమూ విసేషమైనదే. "రామ" పదం హిందువుల రోమ రోమానా నాటుకొని వుంది. ఏ చిన్న కష్టం వచ్చినా' "అయ్యో రామ " అనే మాట మన నోట్లోంచి వస్తుంది. అలసిన వేళల కూడా "శ్రీరామ చంద్ర" అని స్మరిస్తాము. అంతగా మనం రాముణ్ణి మన సొంతం చేసుకున్నాం.
బాబా ప్రవచనములు:

1. భక్తులకు కావలసినది మంత్రోపదేశం కాదు: భగవంతునిపై లేదా తన గురువుపై స్థిరమైన విశ్వాసం. (శ్రద్ధ) , మరొకటి సంతోషం, పట్టుదలతో కూడిన ఓరిమి (సబూరి). ఈ రెండు దేవునిపై లేదా గురువుపై నిలిపిన నాడు వారి మనోద్రుష్టి భక్తునిపై నిలిపి భక్తుని ఉద్దరిస్తారు.

2. శ్రద్ధ, ఓరిమి ఉన్ననాడు వేరే విజ్ఞానం, శాస్త్రాలు అవసరం లేదు.

3. ఆత్మజ్ఞానానికి నిరంతర ధ్యానం అవసరం. ధ్యానం వలన మనసు స్థిరమౌతున్ది. ధ్యానించే నివే, ధ్యానింపబడే నేను, ధ్యానం అనే క్రియ వేరే వేరేగా కాక సర్వగతమైన చైతన్యం అనుభవం అవుతుంది.

4. ఇతరుల దోషాలు ఎంచకు. ఆలా చేస్తే భగవంతుడు నీ దోషాలు ఎంచుతాడు. సాటివారిని కొద్దిగా నిందించినా, నరకంలో శిక్షలు తప్పవు.

5. సుఖదు:ఖాలు మనోకల్పితాలు. సర్వం ఈశ్వర మయము అని, ఈశ్వర ప్రసాదం అని తలచేవాడు ఏ పరిస్తితిలో అయినా ఆనందంగా ఉంటాడు.

6. చేసిన కర్మకు అనుభవించక తప్పదు. కష్టాలకు భయపడి ముందే చావాలి అనుకుంటే, చేసిన పాపాలకు తోడు ఆత్మహత్య పాతకం కూడా తోడు అవుతుంది.

7. అర్హత లేని వారికీ ఆత్మజ్ఞానం లభించదు . లౌకిక విషయాల పైన మోహం నశిస్తే కానీ ఆత్మజ్ఞానం లభించదు.

8. జ్ఞానం కావాలంటే, పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ది, అహంకారము -- విటన్నిటిని భగవంతుడికి సమర్పించాలి.

9. సద్గురువు మిద ప్రీతీ పెరిగిన కొద్ది, భక్తులకు ధనమ్ మిద ప్రీతీ తగ్గుతుంది.

10. నా వద్దకు ఎవరు వారికి వారు రాలేరు. నేనే అనేక రీతుల వారిని రప్పించుకుంటాను.

11. నా వద్దకు మొదట అందరు కోర్కెల తోనే వస్తారు. కానీ, కోరికలు తీరి ఒక స్థాయికి వచ్చాక, నన్ను అనుసరించి మంచి మార్గానికి వస్తారు.

ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
రతి జీవికి జన్మనిచ్చేది తల్లి. పోషించేది తండ్రి. విద్యాబుద్ధులు చెప్పి సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించేవాడు గురువు. కష్ట సుఖాలలో తోడు ఉండి, సహాయ సహకారాలు అందించేవాడు స్నేహితుడు.

గురువు కోరిన విధంగా కష్టపడి గురుదక్షిణ చెల్లించడం ద్వారా గురు ఋణం, వివాహం చేసుకుని సంతానం కానీ వంశ వృద్ది కలిగించడం ద్వార పితృ ఋణం, యజ్ఞ యాగాల ద్వార దైవ ఋణం, ఉపకారానికి ప్రత్యుపకారం చేయడం ద్వార స్నేహితుని ఋణం తీర్చుకోవచ్చు కానీ, నవమాసాలు మోసి, మన మలముత్రాదులు ఏమాత్రం అసహ్యించుకోకుండా శుభ్రం చేసి సదా మనం వృద్ధిలోకి రావాలని కోరుకునే అమ్మ ఋణం మనం తీర్చుకోవటం ఎప్పటికి సాధ్యం కాదు.

ప్రతి జీవికి మొట్టమొదటి దైవం తల్లి. వేదం కూడా అమ్మకు మొదటి స్థానం ఇచ్చి "మాతృదేవో భవ" అని గౌరవించింది. తనకు తినడానికి లేకపోయినా, పిల్లల కడుపు తడిమి అన్నం పెట్టె అమ్మ ప్రేమకు విలువ కట్టగలమా! అందుకే వేదాలు అమ్మను సేవించుకోవడం గురించి ఇలా చెప్పాయి.

భూప్రదక్షిణ షట్కెన కాశీయాత్రా యుతెన చ
సేతు స్నాన శతైర్యస్చ తత్ఫలం మాతృ వందనే...

ఆరుసార్లు భూమికి ప్రదక్షిణం చేసే ఎంత పుణ్యమో, పదివేల సార్లు కాశీ దర్శిస్తే ఎంత ఫలమో, వందల సార్లు రామేశ్వరం లో సేతుదర్శనం చేసి స్నానం చేస్తే ఎంత పుణ్యమో, ఒక్కసారి తల్లికి నమస్కరిస్తే ఆ ఫలమంతా ఒక్కసారి కలుగుతుందిట. అమ్మ అంటే నడిచే దైవం. అమ్మకు ఒకసారి నమస్కరిస్తే, ఈ భూమి మిద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, యోగులు, మహర్షులు అందరికి ఆరుసార్లు నమస్కరించిన పుణ్యం దక్కుతుంది.

ఒక్కసారి కాశీ యాత్ర చేయాలంటేనే ఎంతో పెట్టి పుట్టాలి. అటువంటిది పదివేల సార్లు కాశీని దర్శించుకున్న పుణ్యం తల్లికి నమస్కరిస్తే కలుగుతుంది.

అల్లాగే బ్రహ్మ హత్యాది పాతకాలు నశించడానికి రామేశ్వరం దర్శించి పూజలు చేస్తారు. అటువంటి వందల స్నానాలు మాతృ వందనము తో సరి సమానం అంటే, అమ్మని మించిన దైవం ఉందా లోకంలో! దివిలోని ఆ జగన్మాతే ఇలలో అమ్మగా అవతరించింది అని ప్రతి ఒక్కరు భావన చెయ్యాలి అని చెబుతుంది శాస్త్రం. ఆమె పెద్దతనంలో ఆమెను సేవించే భాగ్యాన్ని ఏ ఒక్కరు దూరం చేసుకోకూడదు. ఏ కార్యం సఫలం కావాలన్నా తల్లికి నమస్కరించి ఆమె దీవెన తిసుకున్నపుడే ఆ కార్యం చక్కగా నెరవేరుతుంది. ఈ రహస్యం గ్రహించినవాడు కాబట్టే, గణపతి కూడా తల్లి తండ్రులకు ప్రదక్షిణం చేసి , గణాధిపత్యాన్ని పొంది, మనకు కూడా అందులోని గొప్పతనాన్ని గుర్తు చేసాడు.
— with Raj StudentofVihe.
కుటుంబం లో స్త్రీ పాత్ర:

హిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.
ఇతర సంస్కృతుల కన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతీ మహిళకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టినది ఆమెను ఇంట్లో కట్టిపడేయ దానికి కాదు. కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది.

కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చినది ఆమె యొక్క ప్రజ్ఞను గమనించే. శుచి, శుభ్రత వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్ని ఆమె పాటించి, కుటుంబ సభ్యుల చేత పాటింప చేయడం ద్వార ఆమె ఒక వైద్యురాలు. పిల్లలకు విద్య బుద్ధులునేర్పి మంచి గుణములు, నడవడిక అలవాటు చేసి, సమాజమునకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వార ఆమె ఒక గురువు. భర్తకు అనుగుణంగా నడచుకొని, అతని ఆజ్ఞలు పాటించి, ఆతను చెడు దారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి.

అదే విధంగా సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉండాలి అన్నాడు మనువు. వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్ధిక వేత్త. ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. ఇంట్లో ఎంతో అవసరమైన ఖర్చు వచ్చినపుడు పిల్లలతో సహా, భర్తకు కూడా ఎక్కడో అక్కడనుంచి తీసి డబ్బు సర్దగల సమర్ధురాలు స్త్రీ. అలాగే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది.

ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను గౌరవించే వేళ ఆమె అన్నపూర్ణ. పిల్లల సంరక్షణ, పెద్దవారి సేవ, అతిథి అభ్యాగాతుల సేవ, ఇలా ఎన్నో పనులు ఒకేసారి చేయగల సామర్థ్యం ఆమె సొత్తు. ఇలా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర.

ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, కుటుంబం మిద ప్రభావం చూపుతాయి. ఆమె పాత్ర వాళ్ళ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడిన, లేదా చెడిపోయిన దానికి బాధ్యురాలు స్త్రీయే.

స్త్రీ శారీరిక శక్తీ లో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ, మానసిక శక్తి లో ఆమెకు ఎవరు సాటిలేరు. కుటుంబాలు అన్ని సంతోషంగా ఉంటె సమాజంలో సంతోషం నిండుతుంది. లోకంలో ఇబ్బందులుండవు. ఇది స్త్రీకి మన సంస్కృతీ ఇచ్చిన అసలు స్థానం. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న కొద్దీ, సమాజంలో స్త్రీకి గౌరవం లేకుండా పోతోంది. ఆమె మిద ఎన్నో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొని మళ్లీ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంపోదించే దిశగా అందరు కృషి చేయాలి.
భూమి మిద ప్రత్యక్ష దైవం శ్రీ సూర్య భగవానుడు. ప్రతిరోజూ ఉదయిన్చినప్పటినుంచి అస్తమించే వరకు బంగారు వన్నెలతో తన వెలుగును భూమికి పంపుతాడు. ఒక ఘడియ బంగారు రంగు అయితే ఇంకో ఘడియ తెల్లని తెలుపు, ఒక నిముషం వెండి వెలుగులు అయితే, మరొక నిముషం ముత్యాల మెరుపుతో కనిపిస్తాడు. ఈ చక్కని విషయాన్ని ఒక కవి ఒక పాటలో ఎంత చక్కగా వర్ణించారో చుడండి.

ఈ పాట అల్ ఇండియా రేడియో లో ప్రతి ఆదివారం ఉదయం వచ్చేది మా చిన్నపుడు. ఇపుడు రేడియో వినటం లేదు కదా. వస్తోందో లేదో తెలియదు. భక్తీ టీవిలో ఉదయం 6 గంటలకు వస్తోంది.

శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్య నారాయణా,

పొడుస్తూ భానుడు పొన్నపువు చాయ,
పొన్నపువ్వు మిద పొగడపువు ఛాయా.

ఉదయిస్తూ భానుడు ఉల్లిపువు చాయ
ఉల్లిపూవు మిద వుగ్రంపు పొడి చాయ ll

గడిఎక్కి భానుడు కంబపువ్వు చాయ
కంబ పువ్వు మిద కాసారి పూ చాయ 11

జామేక్కి భానుడు జాజిపూవు చాయ
జాజిపూవు మిద సంపెంగ పొడి చాయ ll

మధ్యాహ్నభానుడు మల్లె పువు చాయ
మల్లెపూవు మిద మంకెన్న పూ చాయ ll

మూడు జాముల భానుడు మునగ పువు చాయ
మునగ పువు మిద ముత్యంపు పొడి చాయ ll

అస్తమాన భానుడు ఆవపూవు చాయ,
ఆవపూవు మిద అద్దంపు పొడి చాయ ll

వాలుతూ భానుడు వంగపూవు చాయ
వంగపూవు మిద వజ్రంపు పొడి చాయ ll

క్రుంకుతూ భానుడు గుమ్మడి పూ చాయ
గుమ్మడి పువు మిద కుంకంపు పొడి చాయ.

శ్రీ సూర్య నారాయణా, మేలుకో హరి సూర్య నారాయణా....

పైన పాటలో పేర్కొన్న పూవులు అన్ని తెలుపు లేదా పసుపు రంగులో ఉండేవే. కానీ అందులో వివిధములైన shades లో ఉంటాయి. ఉదయించి నప్పటి నుంచి పొద్దు గుంకే వరకు ఉన్న అన్ని వర్ణనలు పసుపు లేదా తెలుపు లో ఉన్నాయి. కానీ మధ్యాహ్నం, మంకెన్న పువ్వు.( ఇది ఎర్రగా ఉంటుంది), క్రున్కుతున్న సమయములో కుంకంపు పొడి ( ఇది కూడా ఎర్రగానే ఉంటుంది కదా) అని వర్ణించడం ఎంత గొప్పగా ఉందొ కదా.. వ్రాసిన కవికి పాదాభివందనములు.

ఈ పాటను మాఘ మాసంలో ప్రతి రోజు పాడుకోవటం తెలుగు మహిళలకు అలవాటు.

గమనిక: ఈ పాట వ్రాసిన రచయితా ఎవరో, ఎవరికైనా తెలిస్తే దయచేసి చెప్పగలరు.
ఏకాదశి ఫలములు:

ఏకాదశి వ్రతమును గురించి తెలియని వారు ఉండరు. శ్రీ మహావిష్ణువు ప్రీతీ కొరకు ఏకాదశి వ్రతమును పాటిస్తారు. ఆషాఢమాసం లో వచ్చే తొలి ఏకాదశి మొదలుకొని సంవత్సరం లో వచ్చే అన్ని ఎకాదశులకు వివిధ నామాలు, వాటియొక్క ఫలితములు తెలుసుకొందాం;

1. ఆషాఢ శుద్ధ ఏకాదశి: శయనైకాదశి.: (తొలి ఏకాదశి ): దక్షిణాయన ప్రారంభం: ఆయుర్వృద్ధి.

2. ఆషాఢ బహుళ ఏకాదశి : కామ్యైకాదశి : ఇష్ట కామ్యార్ధ సిద్ది.

3. శ్రావణ శుద్ధ ఏకాదశి: పుత్రదైకాదశి: పుత్ర సంతాన ప్రాప్తి.

4. శ్రావణ బహుళ ఏకాదశి: అజైకాదశి: సమస్త దు:ఖల నుండి విముక్తి

5. భాద్రపద శుద్ధ ఏకాదశి: పరివర్తన ఏకాదశి: అసంపూర్ణంగా ఉండిపోయిన పనులు పూర్తి అగును.

6. భాద్రపద బహుళ ఏకాదశి. ఇంద్ర ఏకాదశి: ఇంద్ర భోగములు సమకూరును

7. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి. మహార్జయ ఏకాదశి: సర్వత్రా విజయం;

8. ఆశ్వయుజ బహుళ ఏకాదశి: రామైకదసి: ఎంచుకున్న రంగంలో విజయం;

9. కార్తీక శుద్ధ ఏకాదశి: ఉత్థాన ఏకాదశి: ఈరోజు చేసే దాన ధర్మాల వాళ్ళ అనంతమైన పుణ్యం లభిస్తుంది.

10. కార్తీక బహుళ ఏకాదశి : ఉత్పత్తైకాదశి : అఖండమైన పుణ్యం .

11. మార్గశిర శుద్ధ ఏకాదశి: ఉత్తమైకాదశి: ( ధ్రువ ఏకాదశి) తృప్తి, స్థిర చిత్తం; కలుగుతాయి.

12. మార్గశిర బహుళ ఏకాదశి: సఫలైకాదసి అనూహ్య ఫల ఏకాదశి ): జీవిత గమనాన్ని మార్చివేసే ఉపకారం జరుగుతుంది.

13. పుష్య శుద్ద ఏకాదశి: మోక్షన్య ఏకాదశి: వైకుంఠ మోక్షం, విష్ణు సాయుజ్యం.

14. పుష్య బహుళ ఏకాదశి: షట్ తిలైకదసి: శని దోషాలు హరించును.

15. మాఘ శుద్ధ ఏకాదశి: జయ ఏకాదశి: }
16. మాఘ బహుళ ఏకాదశి: విజయ ఏకాదశి } సర్వత్రా విజయం.

17. ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి: పతితోద్ధారణం

18. ఫాల్గుణ బహుళ ఏకాదశి: పాప విమోచన ఏకాదశి: పాప సంహారము.

19. చైత్ర శుద్ధ ఏకాదశి: కామదా ఏకాదశి: అభిష్ట సిద్ది:

20. చైత్ర బహుళ ఏకాదశి: వరూధిని ఏకాదశి: గో సహస్ర దాన ఫలం

21. వైశాఖ శుద్ధ ఏకాదశి: మోహిని ఏకాదశి: వశీకరణ శక్తి

22. వైశాఖ బహుళ ఏకాదశి: అపర ఏకాదశి: తీర్థ యాత్రా ఫలం

23. జ్యేష్ట శుద్ధ ఏకాదశి: నిర్మల ఏకాదశి: }
24. జ్యేష్ట బహుళ ఏకాదశి: యోగిన్యేకదశి: } సర్వరోగ హరణం..

ఇవి సంవత్సరం లోని ఏకాదశి ఫలితములు.
భారతదేశం, వేదాలు, ఉపనిషత్తులను కన్న కర్మ భూమి. హిందూ ధర్మం ఎంత విశాలమైనదో, ఈ భూమి మిద ప్రకృతికి, బ్రాహ్మణులకు, దేవతలకు ఎంతటి ఉత్తమ స్థానం కల్పించారో, మన పూర్వులు ఎంతటి విశాల హృదయంతో అందరి మేలు కొరకు వేడుకోన్నారో మనకు వేదాలు, ఉపనిషత్తులు చదవడం ద్వార తెలుస్తుంది. ఉపనిషత్తుల లోని శాంతి మంత్రములు ఈ కోవకి చెందినవే....

1. ఓం సహనావవతు, సహనౌభునక్తు,
సహవీర్యం కరవావహై, తేజస్వినా వధీతమస్తు, మావిద్విశావహై:

2. ఓం సర్వ్వేశాం స్వస్తిర్భవతు, ఓం సర్వేషాం శన్తిర్భవతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు, ఓం శాంతి: శాంతి: శాంతి:

3. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేన మహీం మహీశం
గో బ్రహ్మనేభ్య: శుభమస్తు నిత్యం లోకా: సమస్తా సుఖినోభవంతు.

4. ఓం సర్వే భవంతు సుఖిన: సర్వేస్సంతు నిరామయా:
సర్వే భద్రాణి పస్త్యంతు , మాకశ్చిదుఃఖ: మాప్నుయాత్.

5. ఓం సర్వస్తరతు దుర్గాణి, సర్వో భద్రాణి పస్యతు
సర్వ సద్భుద్ది మాప్నోతు, సర్వ స్సర్వాత్ర సందతు.

6 .ఓం దుర్జన స్సజ్జనో భూయాత్, సజ్జన శాంతి మాప్నుయాత్
శాంతో ముచ్యేత బందేభ్యో, ముక్తస్చాన్యా న్విమోచానాత్.

7. కాలేవర్షతు పర్జన్య: పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితో, బ్రహ్మణా స్సంతు నిర్భయ:

8. ఓం శంనో మిత్ర: శం వరుణ: శంనో భవత్వర్యమా:
శం నో ఇంద్రో బృహస్పతి: శంనో విష్ణు రురుక్రమ:

గురుశిష్యులు పరస్పరం విద్య ఆరంభించేటప్పుడు చదివే మంత్రం " దేవుడు మమ్ముల రక్షించు గాక. మమ్ములను పోషించు గాక. అన్ని గ్రంథములను, శాస్త్రములను చదివి బాగుగా అర్ధం చేసుకునే శక్తి మాకు ఇచ్చు గాక. మమ్ములను విద్యలో ప్రావీణ్యుల చేయు గాక. మా మధ్య ద్వేషము, కలహములు రాకుండు గాక. "

అన్ని వేళలా సర్వత్రా సుఖమయమగు గాక. సర్వత్ర శాంతి నెలకొను గాక. సర్వత్ర విజయము చేకూరు గాక. సర్వత్రా మంగళమగు గాక.

ప్రజలందరూ న్యాయ మార్గమున నడిచి, పాలకుల న్యాయమైన పరిపాలనలో సుఖముగా నుందురు గాక. ప్రతి నిత్యం, గోవులకు, బ్రాహ్మణులకు శుభమగు గాక. లోకములన్నియు సుఖమును పొందు గాక.

లోకములో ప్రజలందరూ, ఆయురారోగ్యములతో కూడి, పాలకుల రక్షణలో సంతోషముగా, ఏ దు:ఖము లేకుండా ఉందురు గాక.

ఈ పుడమిని మేఘములు సరిఐన సమయములో కురియు గాక. భూమి సస్యస్యామలమగు గాక. దేశములో ఏ సంక్షోభములు లేకుండు గాక. బ్రాహ్మణులకు సరిఐన గౌరవం లభించు గాక.

జీవకోటికి ఆధారమైన సూర్యుడు, పంటలకు కారణమైన వరుణుడు, ధర్మాధికారి ఐన యముడు, వీరందరికీ ఆధారభూతమైన ఇంద్రుడు, బుద్ధిని పెంపొందించే బృహస్పతి, జీవుల పోషణకు ఆధారమైన విష్ణువు, మనకు అనుకూలముగా ఉండి, మన జీవితాలను సుసంపన్నం చేయుదురు గాక.

చూసారా. ఎంత అర్ధం ఉన్నదో, ఈ శాంతి మంత్రాలను, ఇంట్లో కానీ, లేదా ఏదైనా దేవాలయములో, వేరే ఇతర ప్రదేశాల్లో, ఏదైనా పూజలు, హోమాలు చేసినపుడు సర్వత్రా శుభం కోరి చదువుతారు. నేను, నా వాళ్ళు అనే సంకుచితత్వం లేకుండా మన పూర్వులు, అందరు బాగుండాలి అని కోరుకునేవారు. ప్రకృతికి, గోవులకు బ్రాహ్మణులకు సమాజంలో ఒక సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు.

ఈ శాంతి మంత్రములు మనం కూడా చదివి ఆచరిద్దాం.
ప్రతి హిందువు తప్పక పాటించవలసిన విధులు:

సూర్య నమస్కారములు.
విభూది లేదా కుంకుమ ధారణ.
ఇష్ట దేవతా ప్రార్ధన.
ఇంటింటా తులసి.
ప్రతి ఇంట భగవద్గిత.
దేవాలయ దర్శనం.
గోపూజ.
సమిష్టి ప్రార్థన.

ప్రతి హిందువు తప్పనిసరిగా సూర్య నమస్కారములు ప్రతి ఉదయం చేయవలెను. వీలు కాకపోతే కనీసం ప్రతి ఉదయం ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కరించి " శ్రీ సవిత్రే నమః " అని 11 సార్లు స్మరించవలెను.

ప్రతి హిందువు తప్పని సరిగా నుదుటన విభూది కానీ, కుంకుమ గానీ ధరించవలెను.

ప్రతిరోజూ దైవ ప్రార్థన, శ్లోకములు , స్తోత్రములు పఠించ వలెను.

ప్రతి ఇంట తులసి చెట్టును పెంచవలెను. ప్రతి రోజు తులసికి నమస్కరించి, తులసి మొక్కకు రాగి చెంబులోని నీళ్ళు పోయవలెను.

యన్ములే సర్వతీర్థాని, యన్మధ్యే సర్వదేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వామ్ నమామ్యహం.

అను శ్లోకమును పఠిస్తూ నిరు పోయవలెను. తులసిమొక్క మూలములో, అన్ని తీర్థ క్షేత్రాలు, మధ్యలో సర్వ దేవతలు, చివరల అన్ని వేదములు కొలువై ఉండును కనుక ఆ తులసికి నమస్కారము చేయుదును అని భావము.

శాస్త్రీయంగా కూడా తులసి నుంచి వచ్చే గాలి, అన్ని రకాల బాక్టీరియా ను నాశనం చేస్తుంది అని కనుగొన్నారు. తులసి కలిపిన నీటిలో floride శాతం బాగా తగ్గింది అని కూడా ఇటీవల కనుగొన్నారు.అందువల్ల తులసి పూజ నిమిత్తం తులసి మొక్క దగ్గర ప్రతి రోజు కొంత సేపు గడపడం ఆరోగ్యదాయకం.

ప్రతి ఇంట్లోను భగవద్గీత తప్పనిసరిగా ఉండాలి. ఉండడం అంతే పూజ గృహం లో ఉంచడం కాదు. చదివి, అర్ధం చేసుకొని అందులో చెప్పిన విషయాలు తప్పని సరిగా పాటించడం అలవాటు చేసుకొంటే జీవితం సుఖమయం ఔతున్ది. చాలామంది భగవద్గిత పారాయణ అనగానే, మాకు యింకా అంత వయసు రాలేదు అంటారు. భగవద్గిత, రామాయణం వంటి గ్రంధాలూ చదవడానికి వయసు నిమిత్తం లేదండి. యింకా చెప్పాలంటే, చిన్న వయసులో చదివి అర్ధం చేసుకోగలిగితే, భావి జీవితం సుఖమయం ఔతున్ది. పెద్ద వయసులో ప్రశాంతంగా బ్రతకొచ్చు.

ప్రతి హిందువు ప్రతి రోజు, వీలు కాకపోతే వారానికి ఒకసారైనా, దేవాలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. ఇంట్లో దేవుడు లేదా అని కొందరు ప్రశ్నించవచ్చు కానీ, దేవాలయంలో కొన్ని శాస్త్రాల ప్రకారం దేవుని ప్రతిష్ట జరుగుతుంది. ప్రదక్షిణల వల్ల, దైవదర్శనం వల్ల మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. మనసుకు శాంతి కలుగుతుంది.

హిందువులకు గోవు పరమ పూజనియమైనది. గో పోషణ చేయడం ద్వారా ఉత్తమ గతులు కలుగుతాయి.

సమిష్టి ప్రార్థనల వల్ల ఇరుగు పొరుగు తో స్నేహబంధం ఏర్పడుతుంది. సమైక్య భావం పెంపొందుతుంది. దేవాలయాల్లో భజనలు, మహిళలు పాల్గొనే లలిత సహస్ర నామ పారాయణాలు ఈ కోవకిందకే వస్తాయి.
కర్ణాటక సంగీతానికి ఆద్యుడు శ్రీ త్యాగరాజ స్వామి . ఈయన అసలుపేరు త్యాగబ్రహ్మం. 1767లొ శ్రీ కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరి అసలు జన్మస్థలం మన ఆంధ్ర దేశంలోని ప్రకాశం జిల్లా ఖంభం అయినప్పటికిని, వీరి పూర్వీకులు తమిళనాడుకు వలస వెళ్లారు. ఈయన తండ్రి రామబ్రహ్మం తంజావూరు సంస్థానాదీషుడు శ్రీ శరభోజి మహారాజు గారి కొలువులో ఉండేవారు. త్యాగరాజు గారి విద్యాభ్యాసం అంతా తిరువయ్యూరు లో జరిగింది. ఆయన చిన్నతనం లోనే వేదాలు, ఉపనిషత్తులలో ప్రావీణ్యం సంపాదించారు. ఈయనకు రాముని మిద అచంచలమైన విశ్వాసం ఉండేది. త్యాగరాజు గారికి సంగీతం లో ఉన్న అభిరుచిని కనిపెట్టి శొంటి వెంకట రమణయ్య గారు తమ శిష్యునిగా అంగీకరించారు. ఆయనకు సంగీతంలో మెళకువలు శ్రద్ధగా నేర్పించారు.

శ్రీ శరభోజి మహారాజు త్యాగయ్య సంగీత ప్రతిభను గురించి విని రాజాస్థానంలో పాడవలసినడిగా కోరుతూ, అనేకమైన ధన కనక వస్తు వాహనములను త్యాగయ్య ఇంటికి పంపుతారు. కానీ అఖండ రామభక్తుడైన త్యాగయ్య వాటన్నిటిని తిప్పి పంపేసి, తనకు ధనము కంటే, రాముని వాత్సల్యమే గొప్పది అని చెప్తారు. అయన సంగీతాన్ని ధన సంపాదనకు మార్గంగా కాక, భగవంతుని లీలలు గానం చేసే సాధనము అని నమ్మిన వ్యక్తి.

అయితే, రాజుగారి కానుకలను తిప్పి పంపడంతో ఆగ్రహించిన వారి అన్నగారు జపేశుడు, ఆస్తి పంపకం చేసేస్తారు. తన వంతుకు వచ్చిన సీతా, రామ , లక్ష్మణ విగ్రహాలను అయన ఆనందంగా అందుకుంటారు. సాక్షాత్తు రాముడే తన వంతుకు వచినప్పుడు ఇంకా విచారించ వలసిన పని లేదు అని భార్యకు, శిష్యులకి తెలియచేప్తారు. త్యాగరాజుకు వస్తున్న ఆదరణ చూసి ఈర్ష్య చెందిన వారి అన్నగారు దీనికంతటికి కారణం దేవుని విగ్రహాలే అని, దేవుని కరుణ వల్ల త్యాగయ్య ఇంతటి ఆదరణ పొందుతున్నారని భావించి ఆ విగ్రహాలను కావేరి నదిలో విడిచిపెడతారు. త్యాగయ్య తన రాముని అన్వేషణలో దక్షిణ దేశ యాత్రలకు వెళ్లి, అనేక తీర్థ యాత్రలు చేస్తారు. ఆ యా సందర్భాలలో ఆ యా క్షేత్రాలలో ఉన్న దేవుళ్ళ మిద ఆయన ఎన్నో కృతులను రచించారు. ఆ రాముని కృప వలన మళ్లీ విగ్రహాలను నదిలోనే కనుక్కొంటారు.

త్యాగయ్య 96 కోట్ల శ్రీరామ జపం చేసారు. ఈయన సంగీత ప్రావీణ్యాన్ని, రామభక్తిని మెచ్చిన నారద మహాముని స్వయంగా ప్రత్యక్షమై ఈయనకు స్వరర్నవం అనే గ్రంథాన్ని బహుమతిగా ఇచ్చినట్లు చెప్పుకొంటారు. ఈయన గాత్ర సంగీతంలోనే కాక, గొప్ప వైణికుడు కూడా...

త్యాగరాజు మొత్తం మిద 24 వేల కీర్తనలు, కొన్ని ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ప్రహ్లాద భక్తీ విజయము, నౌకా చరితము అనే సంగీత నాటకాలు కూడా వ్రాసిరి. ఈయన వ్రాసిన 5 పంచరత్న కీర్తనలు బహు ప్రసిద్ది చెందినవి. ఈయనకు వారసులు లేకపోయినా, వారి సంగీత వారసత్వం ఈనాటికి కొనసాగుతూనే ఉంది. 1847 పుష్య బహుళ పంచమి నాడు శ్రీ త్యాగరాజు గారు పరమపదించారు. ఈయన సమాధి చెందిన తిరువయ్యుర్లో ప్రతి సంవత్సరం శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు చాల విశిష్టంగా జరుపుతారు. ఆయన సమాధి వద్ద అయన రచించిన పంచరత్న కీర్తనలు ప్రముఖ సంగీత విద్వాంసులు అందరు బృంద గానం చేస్తారు. ఎందఱో జంత్ర, తంత్ర, గాత్ర విద్వాంసులు ఇందులో పాల్గొంటారు.
బంధాలు-బాంధవ్యాలు:

మనిషి జీవితంలో జన్మనిచ్చిన తల్లి, తండ్రి, తోడబుట్టిన అన్న దమ్ములు, జీవితం పంచుకునే భార్య, వారసులైన కొడుకులు, కూతుళ్ళు, --ఇలా ఎందఱో బంధువులు తారసపడతారు. వీరందరూ ఎల్లప్పుడూ తనతో ఉంటారని, కష్ట సుఖాల్లో తోడు వస్తారని భావించడం మానవ సహజం.

కానీ ఈ బంధాలు అన్ని శాశ్వతం కాదు అని, మనకు జీవితంలోను, తరువాత కూడా తోడు వచ్చే బంధువులు ఎవరో, వారి గురించి చాణక్యుడు ఒక చిన్న శ్లోకంలో ఎంతో చక్కగా వివరించాడు.

సత్యం మాతా, పితా జ్ఞానం, ధర్మో భ్రాతా, దయా సఖా
శాంతి: పత్నీ, క్షమా పుత్రా: షఢెతె మమ బాంధవా:

సత్యమే తల్లి, జ్ఞానమే తండ్రి, ధర్మమే సోదరుడు, దయా స్నేహితుడు, శాంతి భార్య, వోర్పే పుత్రుడు. ఈ ఆరే మానవునకు నిజమైన బంధువులు అని అర్ధం.

ఏ జివికైన జన్మనిచ్చేది తల్లి. తల్లి స్థానం మారదు. ఎటువంటి పరిష్టితులలో నైనా, తల్లి ప్రేమ మారదు. అలాగే, సత్యం ఒక్కటే. అది ఎన్నటికి, మారదు.

జ్ఞానం తండ్రి. తండ్రి ఎలాగైతే విద్యా బుద్ధులు నేర్పించి జివించె ఉపాయాలు నేర్పడం ద్వార, సుఖవంతమైన జీవితానికి మార్గదర్శకుడు అవుతున్నాడో, జ్ఞానం కూడా మనిషికి సంతోషం గ జీవించడం నేర్పుతుంది. మనిషి పురోగతికి మూలం జ్ఞానమే.

సోదరుడు ఎలాగైతే ఎప్పుడు అండగా నిలుస్తాడో, తోడుగా ఉంది, అభివృద్ధికి బాటలు వేస్తాడో, ధర్మం ఎప్పుడు మనిషికి వెంట నుండి ఆత్మీయతను, అనురాగాన్ని పంచి, ధర్మాన్ని పాటించిన వాడికి అమృత ఫలాలను అందిస్తుంది.

దయ మిత్రుని లాంటిది. మిత్రుని వలే మంచి చెడులను ప్రభోదిస్తుంది.

శాంతి భార్య వంటిది. భార్య సుగుణ శీలి అయితే, ఆ మనిషి జీవితం పూలపాన్పు లాగా ఉంటుంది. భార్య గయ్యాళి అయితే ఆ మనిషి జీవితం నరక ప్రాయం ఔతున్ది. అలాగే జీవితంలో శాంతి ఉన్నవాడికి ఇంక ఏ లోటు ఉండదు. శాంతిని అలవరచుకోని మనిషి జీవితం నరకంతో సమానం.

ఓర్పు పుత్రునిలాంటిది. పుత్రుడు ఎలాగైతే నరకం నుండి రక్షిస్తాడు అని నమ్ముతామో, అలాగే ఓర్పు ఉన్న వ్యక్తి యొక్క జీవితం స్వర్గాతుల్యమే.

పై శ్లోకం ద్వారా చాణక్యుడు ఒక మనిషి తన జీవితంలో బంధువులు ఎంత ముఖ్యం అని అనుకుంటాడో, అంతకన్నా, సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పు అనే ఆరు గుణాలు అంతే ముఖ్యం అని చెప్తాడు.. ఊహ తెలిసిన దగ్గరనుంచి, మరణించే వరకు ఎలాగైతే బంధువులను వీడి పోలేమో, అలాగే ఈ ఆరు గుణాలను ఆజన్మాంతం పాటించాలి అని ఉపదేశించాడు.
చందమామ పిల్లల మాస పత్రిక గురించి తెలియని క్రిందటి తరం భారతీయులు లేరు అని అంటే అతిశయోక్తి కాదు. 1947 జులైలో ప్రముఖ సినీ నిర్మాతలు, విజయ సంస్థ అధినేతలు అయిన శ్రీ బి. నాగిరెడ్డి, చక్రపాణి ల మానస పుత్రిక ఈ పత్రిక. మొదట్లో తెలుగు, తమిళ భాషల్లో ఆరంభమైన ఈ పత్రిక మొత్తం 13 భారతీయ భాషలు, ఇంగ్లీషు, ఒక గిరిజన (సంతల్ ) భాష, సింహళ భాషలలో ప్రచురితమౌతొన్ది. అందులకోసం తెలుగు, ఇంగ్లీషు బ్రెయిలీ లిపిలో వెలువడుతున్న ఏకైక పత్రిక చందమామ. television , కంప్యూటర్ లేని ఆ రోజుల్లో పిల్లలకు, పెద్దలకు ఒక వినోద సాధనం చందమామ. పెద్దలు కూడా నెల తిరిగేసరికి కొత్త సంచిక మార్కెట్లోకి ఎపుడు వస్తుందా అని ఎదురు చూసేవారు.

ప్రఖ్యాత తెలుగు రచయిత శ్రీ కొడవటిగంటి కుటుంబరావు గారు సంపాదకుడిగా పనిచేసిన ఈ పత్రికలో కథలు, ధారావాహికలు పిల్లలతో పాటు పెద్దలను కూడా అలరించేవి. వివిధ దేశాలకు చెందినా జానపద గాధలు, నీతి కథలు పిల్లలకు వినోదాన్ని అందించేవి. ప్రతి సంచికలో వచ్చే బేతాళ కధలు పిల్లలకు తెలివితేటలను, విజ్ఞానాన్ని అందించేవి. ఇక సీరియల్స్ సంగతి సరే సరి. శిధిలాలయం, రాకాసి లోయ, మాయ సరోవరం, భల్లుక మాంత్రికుడు, గ్రీకు పురాణాల ఆధారంగా వచ్చిన రుపధరుని యాత్రలు, భువన సుందరి -- వీటిని ఎవరైనా మర్చిపోగలరా? దాదాపు అన్ని భారతీయ పురాణాల మిద చందమామలో సీరియల్స్ వచ్చాయి.

ఇక ప్రతినెల ప్రతి సంచికలో వచ్చిన దెయ్యాల కథలు అన్ని శ్రీ మాచిరాజు కామేశ్వర రావు గారు రచించినవే. చందమామలో దెయ్యాలు ఎవరికీ హాని చేసేవి కావు. ఇవి రెండు రకాలు. ఒకటి పరులకు మేలు చేసేవి, రెండు అల్లరి చేసి ఆట పట్టించే చిలిపి దెయ్యాలు. ప్రజలలో మూఢ నమ్మకాలూ తొలగించేందుకు చందమామలో ప్రముఖ ఇంద్రజాలికుడు పి,సి. సర్కార్ తో ఇంద్రజాల మహిమల పైన కథలు వచ్చేవి.

పిల్లల పుస్తకంలో బొమ్మలు వేయడం చందమామతోనే మొదలు. శంకర్, చిత్ర గిసిన బొమ్మలు ప్రతి పేజీలోను ఆ సన్నివేశానికి అనుగుణంగా చక్కటి హావభావాలతో ఉండేవి. ఒక్క ఇంగ్లీషులో తప్ప మిగిలిన అన్ని భాషల చందమామలకు శ్రీ వడ్డది పాపయ్య గారు గిసిన ముఖ చిత్రాలు పత్రికకే వన్నె తెచ్చాయి.

చందమామ పత్రికలో రచన శైలి జాతీయాలు, సామెతలు నుడికారాలతో కూడి ఉండి, పిల్లలకు ఎంతో సులభంగా అర్ధమయ్యేలా ఉండేది. అసలు తెలుగే కాక, ఏ భారతీయ భాషనైనా నేర్చుకోవటానికి చందమామ శైలి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. శైలి, సంచిక కూర్పు వంటి విషయాలలో చందమామ మిగిలిన పిల్లల పత్రికలకు ఆదర్శం అయింది.

1947లొ ప్రారంభమైన చందమామ అనివార్య కారణాల వల్ల 1998లొ ఆగిపోయింది. కానీ మళ్ళి 1999లొ పునః ప్రారంభం అయింది. కానీ చక్రపాణి, నాగిరెడ్డి ల కుటుంబ సంస్థగా ఉన్న విజయ పబ్లికేషన్స్, చందమామ యాజమాన్యం 2009 నాటికీ ముంబైకి చెందినా జియోదేశిక్ అనే software సంస్థ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చందమామ online లో కూడా దొరుకుతోంది.
పూర్వపు రోజుల్లో విద్యాభ్యాసం అంటే మగపిల్లలకు గురుకులం లో జరిగేది. శిశువు పుట్టిన తర్వాత 5 సంవత్సరముల వయసు వరకు తల్లి తండ్రులతో చక్కగా గడిపి 5 సంవత్సరములకు గురువు వద్దకు వెళ్లి దాదాపు 15-20 సంవత్సరాలు విద్య నేర్చేవారు. తరువాత కాలక్రమేణ గురుకులాలు పోయి బడులు మొదలయ్యాయి. అపుడు కూడా 5 ఏళ్ళు వయసుకే బడిలో చేర్చేవారు. ఒక 20-25 ఏళ్ల క్రిందటి వరకు పిల్లలను 5 ఏళ్లకే బడిలో వేసేవారు. అప్పుడు ఎక్కువగా మాతృభాషలోనే బోధన జరిగేది. తరువాత కాలంలో ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చాక kg ( అంటే కిండర్ గార్టెన్ ) చదువులు వచ్చాక 3 ఏళ్లకే LKG లో చేరిపించి 15 ఏళ్లకు 10థ్ క్లాసు ముగిసేది. మన ఆంధ్ర లో ఎక్కువగా 10+2+3 చదువు ఎక్కువ ప్రాచుర్యం లో ఉండేది. అంటే, ఒకటి నుంచి పదవ తరగతి వరకు 10 ఏళ్ళు, ఇంటర్మీడియట్ 2 ఏళ్ళు, తరువాత డిగ్రీ 3 ఏళ్ళు---మళ్లీ ఇందులో 1 నుంచి 5 వరకు ప్రాధమిక విద్య, 6 నుంచి 10 వరకు ఉన్నత విద్య. తరువాత మనకు ఇష్టమైన సబ్జెక్టు తో ఇంటర్మీడియట్, డిగ్రీ లేదా వృత్తి విద్య ( ప్రొఫెషనల్ కోర్స్) . ఇదంతా అయ్యేసరికి పిల్లవాడికి 18-20 సంవత్సరాల వయసు వచ్చేది.

అంటే ఏమిటి అన్న మాట? ఒక పిల్లవాడి మెదడు, మనసు, బుద్ది, 5 ఏళ్ల నుంచి మొదలు పెట్టి 18-20 సంవత్సరాల వరకు వికసిస్తుంది అన్న మాట. ఫలానా ఇన్ని subjects , ఇన్ని పాఠాలు ఒక సంవత్సర కాలంలో చదివి, ఆఖరున పరీక్ష వ్రాసి తన జ్ఞానాన్ని పరిక్షిన్చుకుంటాడు ఒక విద్యార్ధి. అంటే మెల్ల మెల్లగా ఒక పిల్లవాడి సమర్ధతని బట్టి పై క్లాసులకు వరుసగా వెళ్ళేవాడు.

కానీ ఇప్పుడు ఏమి జరుగుతోంది? నర్సరీలు కూడా పోయి ప్లే స్కూల్స్ వచాయి. అంటే అమ్మఒడిలో ఉన్న పాపాయిని కూడా తీసుకెళ్ళి ప్లే స్కూల్ లో జాయిన్ చేస్తున్నారు. అదిగో అక్కడ మొదలుతోంది బాల్యం చిదిమేయడం అనే concept , తరువాత నర్సరీ. తరువాత kg చదువులు.

ఇంక 9 th వరకు వస్తే అదో కథ. 9 th పరిక్షలు వ్రాసాక వారికీ ఒక వారమే సెలవులు . మర్నాటి నుంచి 10 తరగతి కి ప్రిపేర్ చేసేస్తారు. అంటే 9 లోకి వచ్చాక వారికీ వేసవి సెలవులు ఉండవు. మండే ఎండల్లో మూలుగుతూ వెళ్ళాలి స్కూల్ కి.

ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ వాళ్ళకి 2 సంవత్సరాలు సబ్జెక్టు చదవాలి అని ఉంటె, మొదటి సంవత్సరం లోనే 2 ఏళ్ల సబ్జెక్టు పూర్తి చేసేసి, ఏడాది తర్వాత వచ్చే ఎంట్రన్స్ కి రెండవ సంవత్సరం అంతా ప్రిపేర్ చేస్తారుట. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు క్లాసులు. పిల్లలకు అంత ఓపిక ఉంటుందా? ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా వేసవి సెలవులు ఉండవు. ప్రభుత్వం ban చేసిన సరే, క్లాసులు నడుస్తూనే ఉంటాయి. అంటే ఇంటర్మీడియట్ లో చేరాక దాదాపు 600 రోజులు పిల్లలు నిరంతరం చదువుతూనే ఉండాలి.

పిల్లల సంగతి సరే, వాళ్ళ భవిష్యత్ కోసం కష్టపడతారు అనుకుందాం. మరి ఇంట్లో ఉండి, వండి వార్చే తల్లుల సంగతి ఎంటండి? పిల్లలతో బాటు వాళ్ళు కూడా దాదాపు 1200 రోజులు నిరంతరం కష్టపడాలి. ( 9,10,+ 2 years ఇంటర్మీడియట్ ) సెలవులు లేకుండా. పిల్లలు 15 ఏళ్ల వాళ్ళు అయితే, తల్లులు దాదాపు 35 సంవత్సరాల వయసు దాటినా వారై ఉంటారు సహజంగా. వారికీ కూడా వేసవి సెలవులు ఉండవు. పిల్లలకు లీవ్ దొరకదు కాబట్టి వీళ్ళు కూడా ఏ పెళ్ళికి పేరంటానికి వెళ్ళడానికి ఉండదు. మరి ఏ రిక్రియేషన్ లేకుండా, పిల్లల చదువులకోసం కష్ట పడే తల్లుల ఆరోగ్యం సంగతి ఎవరైనా ఆలోచిస్తున్నార?

ఇక కార్పొరేట్ స్కూల్స్ సంగతి సరే సరి. మార్కులు తక్కువ వస్తే వెనక సెక్షన్ లో వేస్తారు అనే భయం చేత మరీ ఎక్కువగా చదివేస్తారు వీటిలో పిల్లలు. ఇంటికి ఎవరు వచ్చినా, వెళ్ళినా వీళ్ళకి తెలియనే తెలియదు. వాళ్లేమో వాళ్ళ లోకమేమో అన్నట్లు ఉంటారు. దీనివల్ల సామాజిక బంధాలు తెగిపోతున్నాయి. స్నేహితులు తప్ప బంధుగణం లో ఎవరు తెలియట్లేదు. అయినవారిని పలకరించడం కూడా చేతకావట్లేదు.

ఇవన్ని కూడా సహజంగా జరుగుతున్న పరిణామాలు కాదు. మనం గమ్యం తెలియకుండా పరుగులు తీస్తున్నాం. దీనివల్ల మన పిల్లల బాల్యం మనమే పోగోడుతున్నాం. వాళ్ళకు తెలియని tensions మనం అలవాటు చేస్తున్నాం. బంధాలు, విలువలు మనమే చేడగోడుతున్నాం. అడుకోవలసిన వయసులో వారిని బలవంతంగా చదువుకు అలవాటు చేస్తున్నాం. దీనివల్ల వాళ్లు మెరిట్ స్టూడెంట్స్ అవ్వచ్చు కానీ, మంచి పౌరులు కాలేరు. చిన్నప్పటి నుండి tensions కు అలవాటు పడ్డ ఈ పిల్లలు రేపు మంచి జీవిత భాగస్వాములు కాలేరు.

మనం ఇంత కష్ట పడుతున్నాం. కొంతమంది బలహీన మనస్కులు tensions భరించలేక చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనివల్ల మనం ఏమి ఆశించి పిల్లలని అంత బలవంత పెట్టి చదివిస్తున్నామో ఆ ప్రయోజనం నెరవేరటం లేదు.

తల్లిదండ్రులారా... దయచేసి మీ పిల్లలను బాగా బలవంత పెట్టకండి. ప్రతిరోజూ వార్తల్లో ఒక స్టూడెంట్ ఆత్మహత్య అని చదువుతున్నాం. మీ పిల్లల శక్తి, ఓపిక ఎంత ఉందొ అంతే చదివించండి. వేరొకరితో పోటీకోసం పిల్లలని బలవంత పెట్టకండి. అందరికి ఇదొక్కటే నా విన్నపం.
ఏడువారాల నగలు అంటే తెలుసా?

భారతీయ సంప్రదాయంలో నగలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఈరోజుల్లో నగలు ఆడవారికి పరిమితం ఐనా వేద కాలంలో మగవారు కూడా నగలు ధరించేవారు.ఆడవారు వివిధ రకాలైన ఆభరణాలు ధరించడంలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. నుదుట పాపిట బిళ్ళ, నడినెత్తిన సూర్య చంద్రులు, జుట్టుకు నాగరం, చెవులకు జూకాలు, లేదా కమ్మలు, ముక్కుకు పుడక, మెడలో హారాలు, భుజాలకు దండ వంకీలు, చేతులకు కడియాలు, గాజులు, నడుముకు వడ్డానం, వేళ్ళకు ఉంగరాలు, కాళ్ళకు పట్టీలు, కాలి వేళ్ళకు మట్టెలు... ఇలా ఒక స్త్రీ యొక్క ప్రతి అవయవానికి నగలు ఉద్దేశ్యించబడ్డాయి. అవన్నీ కూడా స్త్రీల ఆరోగ్యం ను దృష్టిలో పెట్టుకుని నియమింప బడ్డాయి.

మళ్ళి ఇందులో రక రకాల గ్రహాలను బట్టి రకరకాల విలువైన జాతి రత్నాలతో కూడిన నగలు ఉంటాయి.

ఆదివారం : సూర్యుని కోసం కెంపుల ఆభరణాలు
సోమవారం: చంద్రుని కోసం ముత్యాల ఆభరణాలు,
మంగళవారం:కుజుని కోసం పగడాల ఆభరణాలు
బుధవారం : బుధుని కోసం పచ్చల ఆభరణాలు
గురువారం : బృహస్పతి కోసం పుష్యరాగ ఆభరణాలు
శుక్రవారం: శుక్రుని కోసం వజ్రాల ఆభరణాలు
శనివారం : శని కోసం నీలమణి ఆభరణాలు

ఇలా రోజుకి ఒక రత్నం తో చేసిన నగలు నిలువెల్లా ధరించేవారు. వీటినే "ఏడువారాల నగలు " అని అంటారు.
దేశ సంస్కృతీ సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను పాలకులనుప్రజలందరూ గౌరవించలి. ప్రజల బలం, బలహీనతలను అంచనా వేసి దేశ సర్వతోముఖ వికాసానికి పాలకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

కేకయ దేశాధిపతి ఆశ్వపతి మహారాజును కొందరు దర్శించారు. రాజును రాజ్యం గురించి అడుగగా తన రాజ్యం గురించి ఆయన ఇలా చెప్పారు.

నమస్తేనో జనపదే,
నకదర్యో నమద్యపః
నన హితగ్నిర్
నా విద్వాన్న స్వైరో స్వైరినీ కుతః:

నమేస్తేనో--- నా రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల వర్ధిల్లుతోంది. ఈ దేశంలో దొంగలు లేరు. ప్రజలందరూ కష్టపడి పనిచేసి దనం సంపాదించి, అన్న వస్త్రాలకు లోటు లేకుండా జీవిస్తున్నారు.వారికీ అధికమైన కోరికలు లేవు. కనుక దుఃఖాలు లేవు. ఆశలు, అధికమైన ఆపేక్షలు లేవు. పరుల వస్తువుకు ఆశపడరు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తారు.

నకదర్యో--- నా రాజ్యంలో లోభులు లేరు. ప్రజలు ధార్మిక జివనులు. ఉన్నంతలో పదిమందికి పెట్టి తినే భాగ్యవంతులు. వంద చేతులతో సంపాదించి, వేయి చేతులతో దానం చేయాలి అని శాస్త్ర వాక్యం. దీనిని నా ప్రజలు విశ్వసిస్తారు.

నమద్యపః --నా దేశ ప్రజలు మద్యపానం చేయరు. జూదం ఆడరు. వ్యసనపరులు కారు. సత్ప్రవర్తనులు, నితిమంతులు, త్యాగధనులు, నిరాడంబరులు. నా ప్రజలు శీలసంపదకు వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తారు.

నానా హితగ్ని-- నా రాజ్యంలో వేదాది కర్మలు, హోమాలు నిరంతరం జరుగుతాయి. చేయని వాళ్ళు ఎవరు లేరు. ధూమపానం చేసేవారు, దుష్టులు లేరు.

నా విద్వాన్-- ఈ దేశంలో అందరు విద్యావంతులే. మూర్ఖులు,మూధులు లేరు. ప్రజలు విద్యావినయ

సంపన్నులు. సంస్కారులు.

నస్వైరీ-- ఈ దేశంలో వ్యభిచారులు లేరు. ప్రజలు సర్వగుణ సంపన్నులు. జితెన్ద్రియులు, నీతికోవిడులు. పురుషులు పరస్త్రీలను తల్లితో సమానంగా గౌరవిస్తారు. . స్త్రీలు పరపురుషులను రక్షకులుగా భావిస్తారు.

తన దేశ ప్రజలు ధర్మజ్నులనీ, వ్యసనాలకు బానిసలూ కారు అని గర్వంగా చెప్పుకున్నాడు అశ్వపతి మహారాజు.

ప్రస్తుతం మనదేశ పరిస్తితి పూర్తీ వ్యతిరేకంగా ఉంది. దేశంలో దొంగలు యదేచ్చగా సంచరిస్తున్నారు. పాలకులే దొంగలు ఔతున్నరు. ప్రజలకు ఏమి సౌకర్యలు లేవు. నీళ్లు దొరకకపోయినా, మద్యం యదేచ్చగా ప్రవహిస్తోంది. నీతినియమాలు లేని జీవనం, సర్వత్ర అవినీతి, దుర్వ్యసనాలు, విచ్చలవిడి వ్యభివ్చారం, మానభంగాలు, దేశాని పట్టి పీడిస్తున్నాయి. అశ్వపతి మహారాజుల మనం మన దేశాన్ని గురించి గర్వంగా చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందో ఏమో!
భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మానవుడు సంపూర్ణంగా, సంతృప్తిగా ,ఆదర్శప్రాయంగా జీవించడానికి మన పూర్వులు మనకు ఆశ్రమ ధర్మాలను బోధించారు. ఇక్కడ ఆశ్రమములు అంటే జీవితంలోని stages అంటే స్థాయులు. ఆశ్రమములు 4. అవి, బ్రహ్మచర్య, గృహస్త, వానప్రస్థ, మరియు సన్యాస ఆశ్రమములు.

శిశువు పుట్టిన దగ్గర్నుంచి 5 సంవత్సరాలవరకు ఇంట్లో తల్లితండ్రుల దగ్గర పెరిగి తరువాత గురుకులమునకు వెళ్తాడు. అక్కడ వివిధ శాస్త్ర అధ్యనం చేస్తాడు. 24 సంవత్సరముల వరకు బ్రహ్మచర్యం పాటిస్తూ ఒక శిష్యుడిగా గురువుకు సేవ చేస్తూ విద్య అభ్యసిస్తాడు. ఇది బ్రహ్మచర్య ఆశ్రమం.

తరువాత యోగ్యురలైన కన్యను వివాహమాడి, సంతానమును కని, వారిని పెంచి పెద్ద చేస్తాడు. తన బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ఇది గృహస్తాశ్రమం.

పిల్లల బాధ్యతలు పూర్తీ అయిన తరువాత ఇక సంసారం లంపటము నుండి మనసును వేరుచేసుకొని, బాధ్యతలు పిల్లలకు అప్పగించి తను విశ్రాంతి తీసుకుంటాడు. ఇది వానప్రస్థ ఆశ్రమము.

చివరిది సన్యాస ఆశ్రమము. సన్యాసము అంటే కాషాయ వస్త్రాలు ధరించి అడవులకు వెళ్లి తపస్సు ఆచరించ నవసరం లేదు. బంధాల నుండి దూరం అయ్యి, దైవ స్మరణలో మరణించేవరకు కాలం గడపడం సన్యాస ఆశ్రమం.

అయితే ఈ అన్ని ఆశ్రమ ధర్మలలోను గృహస్తాశ్రమం ఉత్తమమైనది అని శాస్త్రోక్తి. ఎందుకంటే, గృహస్తు ద్వారానే ఇతర ఆశ్రమస్తులకు ఆహారం లభిస్తోంది. గృహస్తాశ్రమం వల్లనే వంశాభివృద్ది జరుగుతుంది. అతిథి అభ్యగతులు గృహస్తు ద్వారానే ఆదరింప బడతారు, యజ్ఞ యాగాదులు, హోమాలు, పూజలు, వీటన్నిటిని చేయడం వల్ల ధర్మం నిలబడుతుంది. ధర్మం ఉన్నచోట కరువు కాటకాలు ఉండవు. దేశం సంమృద్ధిగా ఉంటుంది. ఈ కార్యలన్నిటికి గృహస్తే ఆధారం.

గృహస్తు లక్షణాలు... 1.సహనం, 2.విశాలభావం,3. ఇంద్రియ నిగ్రహం,4. చిత్తశుద్ది, 5.మనోనిగ్రహం, 6.లౌకిక జ్ఞానం,7. తాత్విక ఆలోచన, 8.సత్యమైన జీవితం,9. కోపం లేకపోవడం, 10.అపరిగ్రహం (ఇతరుల నుండి ఉచితంగా ఏమి స్వీకరించక పోవటం )... ఈ పది లక్షణాలు ఉన్నవాడు ఉత్తమమైన గృహస్తు.

గృహస్తు నిత్యజీవితంలో పవిత్ర హృదయంతో, ధర్మాచరణ చేయాలి. ఇలా చేస్తే భగవంతుని అందుకోన్నట్లే. సమాజానికి, దేశానికి, అతని సేవలు ఎంతో ముఖ్యం.
కలియుగంలో వెలసిన షిర్డీ సాయినాథుని గురించి అందరికి తెలుసు. అయన బోధలు సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండేవి. ఆత్మ, పరమాత్మా, బ్రహ్మజ్ఞానం అంటూ కఠినమైన విషయాలు కాకుండా, మానవుడు క్రమశిక్షణతో మెలగడానికి కావలసిన సూత్రాలు చెప్పారు. అయన తన జీవితంలో వివిధ సందర్భాలలో ప్రవచించిన సూక్తులను అయన సన్నిహితులు, భక్తులు సేకరించి మనకు అందించారు. అందుకే ఆయన చరిత్ర చదివి, ఆచరిస్తున్న భక్తులకు క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఒక నిరాడంబరమైన జీవితం అలవాటు ఔతున్ది.. అయన బోధలలో కొన్ని ఈరోజు చూద్దాం.

ఎవరి సేవను ఉచితంగా తీసుకోవద్దు. పొందిన సేవకు తగిన ప్రతిఫలం చెల్లించు.
పరుషమైన మాటలు మాట్లాడడం, ఒకరి మనసును గాయపరచడం తగదు.
ఎవరైనా ని సహాయం కోరి వచ్చినపుడు నీవల్ల జరిగితే సహాయం చేయి లేదా సహాయం చేసే వ్యక్తిని చూపించు.
ఎవరైనా నిన్ను ఏదైనా అడిగినపుడు ఉంటె ఇవ్వు. లేకుంటే లేదు అని చెప్పు. అంతేకాని దూషణ చేయకు.
పరుల గురించి చెడుగా మాట్లాడేవారిని నేను స్వీకరించను.
అందరిని ప్రేమించు. ఎవరితోనూ పోట్లడకు. ఇతరుల మంచి చెడులు చర్చిస్తూ కాలాన్ని వృధా చేయకు.
చెడు చేసిన వారికీ కూడా మంచి చేసే మనసు నీకు ఉన్నప్పుడు ఇతరుల నిందలు నిన్ను బాధించవు.
నింద, ప్రతినింద, ద్వేషం, కోపం వంటివి పతన కారణాలు.
ఎన్ని గ్రంథాలు చదివినా, గురుబోధతో సమానం కాదు.
ధర్మబద్ధమైన జీవితం గడిపెవాడికి జీవితంలో ఏఆటంకాలు రావు.
సదా నన్ను స్మరించేవారికి, నా చరిత్ర గానం చేసేవారికి నేను బద్దుడను.

మరికొన్ని తరువాత తెలుసుకుందాం.
ఈ రోజు ఈ గుడి చరిత్ర తెలుసుకుందాం....

ఈ గుడిలో అమ్మవారి విగ్రహం.. నడుము పైభాగం మాత్రమే ఉంటుంది. అమ్మవారి ఎడమచేయి సగం తెగిపోయి ఉంటుంది. దిని వెనుక ఒక కథ ఉన్నది. పూర్వం ఒక బ్రాహ్మణుడు కాశీకి కాలినడకన బయల్దేరాడు. బురుజుపేట వరకు వచేసరికి మధ్య్యహ్నంకావడంతో సమీపంలోని బావి వద్దకు వెళ్లి స్నానం చేసి సూర్యనమస్కార చేసుకుందామని అనుకున్నాడు. అక్కడి బావిలోనుంచి "నేను బావిలో ఉన్నాను. నా విగ్రహాన్ని బయటకి తెసి ప్రతిష్టించు" అని లక్ష్మి దేవి అతనితో చెప్పిందట." నేను శివుడిని తప్ప ఎవరిని పూజించను" అన్నాడట. అంతేకాక, నేను కాశీకి వెళ్ళే తొందరలో ఉన్నాను, విగ్రహం తీసేంత సమయం నాకు లేదు అని అన్నాడట. అమ్మవారికి కోపం వచ్చి తన ఎదమచేతిలోని ఆయుధంతో బ్రాహ్మణుడిని శిక్షించాలి అనుకున్నదట. అపుడు అతని ఇష్టదైవమైన శివుడు ఆమె ఆగ్రహాన్ని తగ్గించేందుకు ఆమె ఎడమచేతిని ఖండించాడుట. తరువాత ఆమెతో "నువ్వు ఈ ప్రాంతంలోనే కనక మహాలక్ష్మిగా పూజలు అందుకుంటావు " అని చెప్పాడుట.

ఈ ప్రాంతాన్ని విశాఖ రాజులూ పరిపాలించే కాలంలో అమ్మవారి విగ్రహం ఒక పక్క పడి ఉన్నదిట. ఆ రాజులు వీధిని వెడల్పు చేయాలనే ఉద్దేశ్యంతో విగ్రహాన్ని వేరేచోటకు జరిపారు. అప్పటినుంచి స్థానికులకు రకరకాల అనారోగ్య సమస్యలు , ముఖ్యంగా ప్లేగు వ్యాధి ప్రబలిందట. దాంతో భయపడిన ప్రజలు విగ్రహాన్ని యధాస్థానంలో పెట్టేసారు. వెంటనే సమస్యలు అన్ని సమసిపోయయిట.

అక్కడ ఆలయ నిర్మాణం జరిగితే ఎప్పటిలా సామాన్యులు స్వయంగా పూజలు జరుపుకోలేరు అని భావించి ఆ ప్రయత్నం మానుకున్నారు. అందుకే ఈ గుడిలో గర్భగుడి ఉండదు. ప్రత్యెక పూజల సమయంలో తప్ప ఇక్కడ పూజారులు ఉండరు. భక్తులు స్వయంగా పసుపు కుంకుమలతో అర్చించుకొవచ్చు.1997లొ కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి సూచనలతో ఇక్కడ శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారు.

మార్గశిర లక్ష్మివారాల్లో ఇక్కడ విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. పుష్యమాసం మొదట్లో అమ్మవారి రథయాత్ర జరుగుతుంది.