Monday 14 April 2014

హనుమంతుడి సందేశం
హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.
హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.
హనుమత్ జయంతి శుభాకాంక్షలు

Tuesday 8 April 2014

ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కొండొకచో అవి వడగల్లై జనాలకే తగులుతున్నాయి. ప్రతి పార్టీ మేనిఫెస్టో చూసిన సామాన్యుడు ఇప్పుడు నిజంగానే నాయకుల బుట్టలో పడి ఎన్నికలయ్యాక ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా తన్నుకుంటాడు. అసలు  ఈ మేనిఫెస్టో లు పార్టీలకు కాకుండా వోటు వేసే వోటరుకు ఉండి ఉంటె..... నా మేనిఫెస్టో లో నా ఓటు అడిగే పార్టీలను నేను ఇలా అడుగుతాను. :

1. మాకు ఉచిత బియ్యం, సరుకుల సంచులు వద్దు. మొత్తంగా అన్ని సరుకుల ధరలు కొద్దిగానైనా తగ్గించండి.

2. మాకు రిజర్వేషన్స్ వద్దు, చదువుకున్న ప్రతి యువతీ, యువకులకు ఉద్యోగ/ఉపాధి కల్పించండి. ఉద్యోగ భద్రతా కూడా కల్పించండి.

3. మాకు కార్పొరేట్ స్కూల్స్, కాలేజీ లు వద్దు. ప్రభుత్వ విద్య సంస్థలలో ప్రైవేటు యాజమాన్యాలకు దీటుగా ప్రమాణాలు పెంచండి.

4. విద్యాసంస్థలలో ఆడపిల్లలకు కావలసిన ప్రత్యెక సదుపాయాలు కల్పించండి.

5. హేమమాలిని బుగ్గల్లాంటి నున్నటి రహదారులు కాకపోయినా, రాష్ట్రం లోని ప్రతి ఏజెన్సీ, గిరిజన ప్రాంతం నుంచి, గ్రామాల నుంచి రవాణా వ్యవస్థ మెరుగు పరచండి.

6. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ లోని విద్యార్థులు ఆతీ గతీ పట్టించుకోండి.

7. మాకు డబల్ డెక్కర్ బస్సులు, బులెట్ రైళ్ళు వద్దు, ఉన్న రైళ్ళలో బోగీలు పెంచి, రైలు మార్గాలు పెంచి, టికెట్లు సులభంగా అందరికి దొరికేలా చూడండి. బస్సుల సంఖ్యా  పెంచి, వాటి నిర్వహణ లోపాలు అరికట్టండి.

8. ఆడపిల్లల రక్షణకు ప్రత్యెక విభాగం ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష విధించడం ద్వారా బాధిత ఆడపిల్లలకు న్యాయం చేయండి. ఆడపిల్లలకు, మహిళలకు, ధైర్యాన్నివ్వండి.

9.రైతులకు ఉచిత విద్యుత్ తరువాతి మాట, ముందు నాణ్యమైన నిర్ణీత సమయాల్లో విద్యుత్, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, అందించండి.

10. మారుమూల ప్రాంతాలకు కుడా మంచి నీటి సరఫరా ఇవ్వండి.

11. కోతలు లేని కరంటు సరఫరా చేయండి.

12. సంప్రదాయేతర ఇంధన వనరులను అన్ని రంగాల్లో ప్రోత్సహించండి.

13. రాష్ట్రం అంతటా పోరంబోకు స్థలాలు ( ఉపయోగం లో లేనివి) ఎన్నో ఉన్నాయి. వాటిని సరి అయిన విధానం లో  ఉపయోగం లోకి తీసుకు వచ్చి, ప్రజలకు మేలు చేయండి.

14. మీ మీ నియోజక వర్గాల్లో చెత్త పేరుకు పోకుండా వారానికి ఒకసారి అయినా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టండి.

15. మీ మీ నియోజక వర్గాల్లో ఉన్న చెరువులు, కాలువలు శుభ్ర పరచి, ఉపయోగకరంగా తీర్చి దిద్దండి.

16. ఆరోగ్యశ్రీలు, బంగారు తల్లులు పధకాలు తర్వాత.   చేతిలో పైసా లేని పేదల వైద్యానికి వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రమాణాలు పెంచండి. ప్రభుత్వ వైద్యులలో జవాబుదారీ విధానాన్ని తీసుకురండి.

17. వయసు అయిపోయి ఎటూ కదలలేని పేద కుటుంబాలలోని వృద్ధులకు జీవన భ్రుతి ఏర్పాటు చేయండి.

18. నడుములు విరిగె గుంటలు, వర్షాకాలం లో మనుషుల ప్రాణాలు తీసే manholes లేకుండా రహదారులను మరమ్మత్తు చేయండి..

19. మీరు మా సొమ్ము స్వాహా చేస్తే చేసారు, మాకు కుడా కొంత లాభం చేకూరే పనులు చేపట్టండి.

20. ముఖ్యంగా రాజకీయ స్వార్ధంతోనో, లేదా పార్టీల మధ్య సమన్వయము కొరవడడం తోనో, లేదా ఎవరికో పేరు, హోదా దక్కుతుందేమో అనే దుర్బుద్దితోనో మన రాష్ట్రానికి రావలసిన కంపెనీలను ప్రక్క రాష్ట్రానికి పోనివ్వకండి. మనకు ప్రతిభా వంతులైన యువత ఎంతోమంది ఉన్నారు. వారి మేధస్సును ఉపయోగించుకోండి.

మిత్రులారా, మీలో ఎంతమంది నాతొ ఏకీభవిస్తారు? మీ మీ మేనిఫెస్టో లలో ఏ ఏ అంశాలు చేరుస్తారు?

మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు:--
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర మాసంలో, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రములో, త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరుపుకున్నది ఈ రోజునే. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
భద్రగిరి పర్వతరాజు తపస్సువల్ల, అక్కమాంబ త్యాగంవల్ల, భక్తరామదాసు పట్టుదలవల్ల త్రేతాయుగం నాటి అయోధ్యరాముడు మళ్ళీ మనకు ఈ కలియుగంలో భద్రాచలరామునిగా అవతరించాడు. కానీ త్రేతాయుగం గుర్తులు నేటికి భద్రాచలంలో పవిత్ర గోదావరీ తీరాన ఒడ్డున, పంచవటి వద్ద మనకు దర్శనమిస్తున్నాయి. అక్కడ రావణుడు... సీతమ్మను అపహరించిన వైనం, మాయలేడి, సీతమ్మతల్లి ఆరవేసిన నారచీరల ఆనవాళ్ళు, సీతమ్మ స్నానమాచరించిన గుండము మొదలగునవి, మనం చూడవచ్చును.
సీతారాముల కళ్యాణం అనగానే మనకు ముందుగా భద్రచలమే గుర్తుకువస్తుంది. ఆకాశమంత పందిళ్ళుతో, ఎటుచూసినా విసినకర్రలతో సందడి చేసే జనం, మనఇంటి పెళ్ళివలె సందడితో, అందరూ ఎంతో ఆనందంగా ఎదురుచూసే సీతారామ కళ్యాణం చూడటానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఈ రోజు రామయ్య పెళ్ళికొడుకై, సీతమ్మ పెళ్ళికూతురై మనందరికీ కనువిందు చేస్తున్నారు.
సీతారామ కళ్యాణ రహస్యాలని కొన్నిటిని మనం తెలుసుకుందాము. ఒకానొక రోజున దశరధుడు తన నలుగురు కొడుకులకు వివాహము చేయదలచి, ఒక సమావేసము ఏర్పాటు చేసాడు. సరిగ్గా అదే సమయానికి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడు. దశరధుడు-- విశ్వామిత్రునికి సకల మర్యాదలు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. విశ్వామిత్రుడు దశరధునితో "నేను రాముణ్ణి అడవులకి తీసుకుపోవటానికే వచ్చాను" అనెను. కొంతసమయం దశరధునితో వాదన జరిగింది. పిమ్మట వశిష్ట మహర్షి దశరధునిని ఒప్పించి, రామలక్ష్మణులని .... విశ్వామిత్రునితో అడవులకి పంపెను. అసలు రహస్యం ఇక్కడే ఉంది.
శ్రీ మహావిష్ణువు రామునిగాను---లక్ష్మీదేవి సీతమ్మగాను ఈ భూమిపై అవతరించారనే రహస్యం---దేవతలకి, మహర్షులకి మాత్రమే తెలుసు. దశరధునికి తెలియదు. అందుకే ఆటను అందరిలాగే తన నలుగురి పిల్లలికి వివాహం జరిపించాలని సమావేశం ఏర్పాటు చేసాడు.
దేవలోకంలో ----- సీతారాముల కళ్యాణము జరిపించే బాధ్యత విశ్వామిత్రునిదే అని శ్రీ మహావిష్ణువు అధ్యక్షతన జరిగిన సమావేశంలోదేవతలంతా తీర్మానించారు. అందుకే రామలక్ష్మణుల వివాహ సమావేశం జరుగుతుంది అని తెలియగానే విశ్వామిత్రుడు వచ్చి, సభని ఆటంకపరిచి, రాముణ్ణి తనతో తీసుకెళ్ళి, సీతమ్మతో వివాహం జరిపించేవరకు రాముణ్ణి విడిచిపెట్టకుండా, అంటిపెట్టుకుని కళ్యాణము జరిపించి అయోధ్యకు తీసుకువచ్చాడు.
ఎవ్వరూ ఎత్తలేని విల్లుని సునాయాసంగా కదిపిన సీతమ్మకి---- ఆ ధనుస్సుని ఎత్తుతూనే వంచి, విరగకొట్టిన రామునికి పెళ్లి అనగానే, అందరు ఈడు --జోడు కుదిరింది అని అనుకున్నారు.
రాముడు పుట్టింది, సీతమ్మ జన్మించింది రావణ వధ కోసం మాత్రమే. ఆ రావణుణ్ణి సంహరించాలి అంటే, శివుడూ--శక్తీ ఏకం కావాలి. ఇక్కడ రాముడు శివ స్వరూపము అయితే, సీత శక్తి స్వరూపం. ఈ రెంటినీ ఏకం చేసినవాడు-- విశ్వామిత్రుడు.
ఇన్ని మహత్యాలు ఉన్న రామాయణాన్ని చదివిన, విన్న, సీతారాముల కళ్యాణాన్ని చూసిన మన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.
శ్రీరామ జయరామ జయజయ రామ.........
ఓం శ్రీ రామాయ నమః
8-4-2014, మంగళవారం, శ్రీరామనవమి
ఎవరైన ఒక వ్యక్తిని అతని మిత్రులు పొగుడుతుంటారు. కానీ, అతని చేతిలో దెబ్బలు తిన్నవారు, శతృవులు పొగిడితే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడు.
మారీచుడు దగ్గరకు రావణుడు వచ్చి రాముడు గురించి చాలా చెడ్డరీతిలో రాముడి మీద లేనిపోనివన్నీ మాట్లాడుతాడు. అప్పుడు మారీచుడు "రావణ! నువ్వు వీరుడు, గుణవంతుడైన రాముడిని పొగడకపోవచ్చు, కానీ రాముడు నీలాగా చపలుడు కాదు, తొందరపడి మాట్లాడేవాడు అంతకన్నా కాదు. ఇంద్రుడు, వరుణ దేవుడికి సమానమైనవాడు.
రాముడు తన తండ్రి చేత అడవులకు వెళ్ళగొట్టబడ్డాడు అని అనుకుంటున్నావా? కాదు. రాముడు మర్యాద లేనివాడనుకుంటున్నావా? కాదు. శీలవంతుడు కాదంటావా? పచ్చి అబద్ధం. స్వార్ధపరుడు అనుకుంటున్నావా? కాదు. అల్పమైన క్షత్రియుడు అనుకుంటున్నావా? కానేకాదు. ధర్మహీనుడు, గుణహీనుడు అసలేకాదు. తనకంటే చిన్నవైన జీవులను బాధిస్తాడు అనుకుంటున్నావా? కాదు. రాముడు సర్వ జీవుల మేలు కోరేవాడు.
తన తండ్రిమాటను కైకేయి ద్వారా విని, "మా నాన్నా మాటను నిజం చేస్తా" అని వనవాసానికి బయలుదేరాడు. కైకెయి కోరిక తీర్చడం కోసం సమస్త రాజభోగాలను వదులుకుని వనవాసానికి వెళ్ళాడు. భరతుడు రాజ్యం ఇస్తానని చెప్పినా, తండ్రి మాట నిలబెట్టడం కోసం భరతుడి విన్నపాన్ని తోసిపుచ్చాడు.
రాముడు కర్కషుడు కాదు. అవిద్యావంతుడు అంతకంటేకాదు. ఇంద్రియాలను జయించనివాడు కాదు. రాముడు గురించి వినకూడనివి, ఊహించలేని మాటలను మాట్లాడ్డం నీకు తగదు రావణ.
"రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవి వాసవః"
ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే రాముడు, సాధుపురుషుడు, పరాక్రమవంతుడు, సర్వలోకాలకు, దేవతలకు ప్రపంచానికి రాజు.
విశ్వామిత్రుడి యాగాన్ని పాడుచేయడానికి నేను వెళ్ళినప్పుడు రాముడు 12 ఏళ్ళ బాలుడు. సరిగ్గా ఆయుధాలు వాడడం కూడా రానివాడు. ఈ పిల్లవాడేం చేస్తాడులే అనుకున్నా. రాముడికి నా మీద వేసిన బాణానికి వందయోజానాల దూరంలో సముద్రంలో పడ్డాను. నన్ను చంపద్దు అనుకున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నాను.
అప్పటినుంచి ఏ చెట్టు పక్కన రాముడు ఉన్నాడో, ఎటునుంచి వస్తాడో అని భయపట్టుకుంది. ఎవరిని చూసిన రాముడే కనిపిస్తున్నాడు, కలలో రాముడు వచ్చిన హడలిపోతున్నా. నీకో విషయం చెప్పనా రావణా! "ర"తో మొదలయ్యే ఏ పేరు విన్నా గుండెలు జారిపోతున్నాయి" అంటాడు.
ఎక్కడైనా శతృవును ఎదుటివారి తిడుతుంటే తెగ సంతోషపడతారు. కానీ, రాముడు చేతిలో చావుదెబ్బ తిన్న మారీచుడు రావణాసురుడు రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సహించలేకపోయాడంటే రాముడు ఎంత గొప్ప వాడు. అటువంటి శ్రీ రామచంద్రుడిని మనం ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాముడిలా గొప్పగా బ్రతకాలి.
ఓం శ్రీ రామాయ నమః
రమ్యమైనది శ్రీరామ నామం!
"శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"
రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము అంటారు. కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి, సోదరమైత్రికి లక్ష్మణుడు, వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి, ప్రభుసేవ, వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి. కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!
రాముడు సీతని ఎందుకు వదిలేసాడు?
ఇది మనిషి అంతరంగానికి వాల్మీకి వేసిన అనంతబ్రహ్మాండమైన చిక్కుముడి.
రామాయణ పరమార్ధం తెలియని, తెలుసుకోలేని ప్రతీ ఒక్క అజ్ఞాని లేవనెత్తే
మొదటి ప్రశ్న ఇది.
రామున్ని దేవుడిలా, రామాయణాన్ని పుస్తకం లా చూసినన్ని రోజులు ఈ చిక్కుముడిని
మనిషి విప్పలేడు.
సీత స్వయంవరంలో అందరు అనుకున్నట్టు రాముడు శివధనుస్సు విరచలేదు. అది
విరిగింది. తీగని లాగి ధనుస్సుని కట్టడం వరకే రాముడు అనుకున్నాడు. ఆ
సమయంలో ఒక్క క్షణం సీత గురించి ఆలోచిస్తూ, తన కనురెప్పలు చూస్తూ ఆ
ఎమరపాటులో బలం ఎక్కువై, అదుపు తక్కువై ధనుస్సు విరిగింది. రాముడు సీతని
గెలిచాడు అని అందరూ ఆనందంగా ఉంటే, రాముడు మాత్రం మళ్ళీ ఇంద్రియాల చేతిలో
ఓడిపోకూడదని నిర్ణయం తీసుకుంటాడు. దాన్నే ఒక సూత్రంగా మలుచుకుంటాడు.
అదే...ధర్మం కోసం కోరికలని వదిలెయ్యడం.
ఆ సూత్రమే రామాయణానికి పునాధి. రాముడి వ్యక్తిత్వానికి ఆయువుపట్టు.
బంధాలని త్యజించి బాధ్యతలని పూర్తి చేయడమే మనిషి కర్తవ్యం.
రామాయణంలో రాముడు ఇదే చేశాడు. గీతలో కృష్ణుడు ఇదే చెప్పాడు.
సీత మీద తన ప్రేమని ప్రపంచానికి చెప్పాల్సిన, నిరూపించాల్సిన
అవసరం రాముడికి లేదు.
చరిత్రలో భార్య కోసం యుద్దం చేసిన ఏకైక వ్యక్తి రాముడు.
వయసులో ఉండి కూడా 13 సంవత్సరాలు, ప్రతీ రాత్రి, తనకీ సీతకి మధ్యలో
కోదండం పెట్టి పడుకున్న వ్యక్తి రాముడు.
శత్రువులని కూడా చంపిన తరవాత తన చేతులతో గౌరవంగా దహన సంస్కారాలు చేసి
ఆత్మకు శాంతి కోరుకునే యోధుడు రాముడు.
అడుక్కునే వాడికి రూపాయి వేయడానికే వెయ్యి సార్లు ఆలోచించే వేదాంతులం మనం.
అలాంటిది మాట కోసం రాజ్యాన్ని, స్నేహం కోసం నియామాన్ని, ప్రజల
కోసం భార్యని త్యజించిన వాడు రాముడు.
ఇదే వాల్మీకి సమాజం నుండి కోరుకున్నది. ఇందుకే రామాయణంలో రామున్ని
తాను ఎక్కడా దేవుడు అని చెప్పలేదు. మనలాగే, మనిషిలాగే చూపించాడు.
బంగారు లేడిలా రామున్ని మోసం చేశాడు. సీతని ఎత్తుకెళ్ళి రామున్ని ఏడిపించాడు.
కుటుంబం నుండి దూరం చేశాడు. వర్షంలో తడిపించాడు. కానీ అక్కడే, ఆ ప్రయాణంలోనే,
సీత కోసం ఇద్దరితో మొదలైన వేటని ఒక అఖండ సేనగా, ప్రాణాలిచ్చే బంటులతో
దిగ్విజయంగా ముగించి ఒక మనిషి దేవుడు లా ఎలా మారుతాడో చూపించాడు.
రాముడిని శ్రీరాముడుగా మలచాడు.
దేన్ని దేని కోసం వదులుకోవచ్చో తెలుసుకొని పాటించిన రోజు...మనమే రాముడు, మన
ఆత్మే సీత, మన ఇల్లే అయోధ్య!
#‎రామాయణం‬ మన రక్తంలో ఉంది.
రాముడు మనలాంటి మాములు మనిషే. రామాయణంలో రాముడు ఎక్కడా మహిమలు చూపలేదు. ఒక మాములు వ్యక్తిగా పుట్టిన వ్యక్తి దాదాపు 10,00,000 నుంచి 18,00,000 సమవత్సరాలు గడిచిపోయినా, ఇంకా అదే వైభవంతో వెలగడానికి కారణం రాముడి సత్యనిష్ట, ధర్మ నిబద్ధత.
రాముడు తన బాణాలతో 18,000 మంది కరదూషణాదులను చంపాడు కానీ తనకు అమోఘమైన శక్తి ఉన్నదని గర్వించలేదు. వాలి ప్రపంచంలో ఉన్న వానరసైన్యాన్ని ఏక తాటిపైకి తీసుకువచ్చి, సమన్వయ పరిచాడు. వాలి ఎంత శక్తివంతుడంటే, వాలికి రావణాసురుడు కూడా భయపడ్డాడు. అటువంటి వాలితో స్నేహం చేస్తే, సీతమ్మను క్షణంలో లంక నుంచి తీసుకురావచ్చని తెలిసినా, వాలి తన ధర్మం తప్పడాని అతని సాయం కోరలేదు. వాలిని చూసి భయపడుతున్న సుగ్రీవునికి అండగా నిలబడ్డడు. వాలిని చంపి, రాజ్యాన్ని సుగ్రీవుడికి అప్పజెప్పాడు కానీ తాను రాజ్యంలో కొద్ది భాగం కూడా తీసుకోలేదు.
శత్రువు తమ్ముడైనా, తనను శరణు వేడుకున్నాడని విభీషణుడికి గౌరవం ఇచ్చాడు, స్నేహం కుదిరిని వెంటనే విభీషణునికి లంకాధిపతిగా పట్టాభిషేకం చేశాడు శ్రీ రాముడు. అప్పుడు అక్కడున్న వారికి ఒక ప్రశ్న తలెత్తింది. విభీషణుడు శరణుజొచ్చాడని అతనికి పట్టాభిషేకం చేశావు, మరి రేపు రావణుడు శరణు వేడితే ఏం చేస్తావు రామా?! అని అడిగారు అక్కడున్న వారు. నేను ఆడినమాట తప్పను, అదే జరిగితే, విభీషణుడిని అయోధ్యకు రాజును చేస్తాను అన్నాడు. ఇంత ధైర్యంగా ఈ మాటను ఎవరు చెప్పగలరు ఒక్క మన రాముడు తప్ప!
రామరావణ యుద్ధం అప్పట్లో ఒక ప్రపంచ యుద్ధంగా చెప్పచ్చు. రావణుడు సమస్తప్రపంచాన్ని హడలుగొట్టిన వీరుడు. అటువంటి రావణుడితో యువకుడైన రాముడు పోరాటం చేయడానికి పూనుకోవడం, అది కూడా వైరంతో కాదు, తన భార్య కోసం ఒక చారిత్రాత్మిక సంఘటన. రాముడు అందగాడు, రాకుమారుడు, ఆజానుబాహుడు, తను కోరుకుంటే ప్రపంచంలో ఉన్నా సుందరీమణులందరూ రాముడిని వివాహం చేసుకోవాడానికి సిద్ధపడతారు. అయినా, కట్టుకున్న భార్యను కాపాడటం భర్త విధి. ధర్మార్ధకామాలలో నేను నీ చేయి విడిచి పెట్టను అని వివాహసమయంలో చేసిన ప్రమాణాన్ని గట్టిగా పాటించి, లోకానీకి మార్గం చూపినవాడు శ్రీ రాముడు.
తన భార్య కోసం రావణుడితో భీకరయుద్ధానికి సిద్ధమయ్యడు. అది మాములు యుద్ధం కాదు, అందులో అణ్వస్త్రాలు (న్యూక్లియర్ వెపన్లు), మిస్సైల్స్, రాడర్లకు అంతుచిక్కని విధంగా తయారు చేయబడిన యుద్ధ విమానాలు మొదలైనవి రావణుడి చెంత ఉన్నా, వాటికి బెదరలేదు శ్రీరాముడు. ఎదురించి, యుద్ధం చేసి గెలిచాడు, రావణుడి చెంత బంధీలుగా ఉన్నా అందరో స్త్రీలను విడిపించాడు, సీతమ్మను గ్రహించాడు. ఇంత చేసినా, లంక నుంచి రూపాయి తీసుకోలేదు, రాజ్యంలో వాటా అడగలేదు. లంకలో ధర్మస్థాపన చేసి, విభీషణుడిని లంకాధిపతిని చేశాడు.
అప్పటికి రాముడికి రాజ్యం మీద ఆసక్తిలేదు. భరతుడి మనసు మారిందేమో, భరతుడు రాజ్యపరిపాలన చేయాలనుకుంటున్నాడేమో, ఒక వేల అదే నిజమైతే, తాను తన జీవితాన్ని అడవిలోనే గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ పరిస్థితి చూసి రమ్మని హనుమను పంపారు, భరతుడు రాముడి రాక ఆలస్యమైందని ఆత్మాహుతికి సిద్ధం అవుతున్నాడని తెలుసుకుని, తన తమ్ముడి ప్రాణం కోసమే రాముడు అయోధ్య చేరాడు.
ఒక్కసరి చరిత్ర గమనిస్తే మన దేశం మీద ఎందరో దాడి చేశారు, సంపదను దోపిడి చేశారు, కానీ చరిత్రలో ఎప్పుడైనా హిందుస్థాన్(భారత్) ఏ దేశం మీదనైనా దందయాత్ర చేసిందా? ఏ దేశసంపదనైనా దోచుకుందా? రాముడి డి.ఎన్.ఏ మనది. అందుకే దోచుకోవడం, దోపిడి చేయడం, దండయాత్ర చేయడం మన హిందూ చరిత్రలో లేదు. ఇతర దేశాల్లో వారి ధర్మస్థాపన కోసం కలగజేసుకోవాలి. వారి దేశసంస్కృతిని మనం కాపాడాలి. అంతవరకే మన కర్తవ్యం. అదే మనకు రాముడు నేర్పాడు. రాముడు, రామాయణం మన రక్తంలో ఉన్నాయి.

Sunday 6 April 2014

                                               /// శ్రీరామ ///

రామాయణం గురించి, రాముడి గురించి తెలియని భారతీయులు ఉండరు. కానీ, శ్రీరామ నవమి సందర్భంగా నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.

ధర్మ స్థాపన కొరకు ఎన్నో అవతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఒక మానవుడిగా పుట్టి ఒక సామాన్య మానవుడు అనుభవించే కష్టాలు అన్ని అనుభవించాడు ఎందుకు, తను స్వయంగా దేవుడే కదా, అ కష్టాలు లేకుండా చేసుకోలేడా? చేసుకొగలడు కానీ, . మానవుడు తన కష్టాలన్నిటికీ భయపడకుండా, దేవుడైన రాముడే అన్ని కష్టాలు పడగా లేనిది మనం ఎంతవాళ్ళం అనే నిబ్బరాన్ని సమకుర్చుకోవడానికి తను ఒక సామాన్య  మానవుడిగా జీవించాడు. రామాయణం జరిగి కొన్ని వేల ఏళ్ళు ఆయినా రాముడిని మనం ఒక ఆదర్శ పురుషుడిగా గౌరవిస్తున్నాం అంటే అయన మనకు చూపించిన జీవన విధానమే అందుకు కారణం. తల్లి తండ్రులు, పెద్దల యెడల భక్తీ, తమ్ముల మిద ప్రేమ, స్నేహితులు, దాసులు, సహచరుల మిద అనురాగం, ప్రజల మిద మమకారం, ధైర్యం, శౌర్యం, వీరం, క్షమా, సత్యం, వాక్పరిపాలన, నిబద్ధత ఇవన్ని కలబొసిన మూర్తి రాముడు. మనం ఈరోజుకు కూడా ఒక కుమారుని, లేదా భర్త యొక్క సుగుణాలు చెప్పడానికి రాముడితో పోల్చడానికి కారణం అదే.

ఒక రాజవంశం లో పుట్టి, తన తండ్రి తరువాత రాజ్యం తనదే అని తెలిసీ, ఇక పట్టాభిషేక ముందు ఘడియలలో  కైక వనవాసానికి ఆజ్ఞ ఇచ్చినపుడు రాముడు కించిత్ కుడా క్రోధపడలేదు. వెంటనే అంగీకరించాడు. తన కన్నతల్లి కాకుండా కైక అజ్ఞాపించినపుడు నా కన్నతల్లి చెప్పలేదు కదా, ఈవిడ మాట పట్టుకుని నేను ఎందుకు వనములకు వెళ్ళాలి అనుకోలేదు. అక్కడ తండ్రి కైకకు ఇచ్చిన మాట రామునికి ముఖ్యం. కైక వద్ద తండ్రి వరం అబద్ధం కాకూడదు. ఒక కొడుకుగా తండ్రి మాట నిలబెట్టడం తన బాధ్యత. అందుకనే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు.

అలాగే సమాజంలో ఒక నిమ్న వర్గానికి చెందిన చాకలి మాట పైన సీతమ్మవారిని అడవులకు పంపాడు. భార్యను, పైగా గర్భవతిని వనవాసం చేయించాడు. అంటే రామునికి జాలి లేదా? లేక కాదు. సీత మిద పూర్తీ నమ్మకం ఉన్నవాడు రాముడు. కానీ, తను పరిపాలించే రాజ్యంలో ఇక ముందు ఇటువంటి ఘటనలు జరిగితే తను ఏమని తీర్పు ఇస్తాడు? ఒక మచ్చ తనమీద ఉంటె తనకు తీర్పు ఇవ్వగలిగిన అర్హత ఏముంది? అందుకనే తనకు నమ్మకం ఉన్నా కూడా, ప్రజలకు సీత యొక్క సచ్చీలతను నిరూపించడం ఒక రాజుగా తనకు ముఖ్యం. అందుకనే సీతను అడవులకు పంపి తన ఆదర్శాన్ని నిరూపించుకున్నాడు. రావణ వధ తరువాత సీతను అగ్ని ప్రవేశం చేయించడానికి కూడా అదే కారణం.

శత్రు వర్గం లోని వాడు అయినప్పటికీ, రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణు కోరిన వెంటనే ఆదరించాడు. తనను శరణు జొచ్చిన శత్రువు నైనా ఆదరించే నిర్మల హృదయుడు రామ చంద్రుడు.

ఇంటికి వచ్చిన భరతుడు రాముని వనవాస దీక్ష తెలుసుకొని స్వయంగా తనకు రాజ్యం వద్దు అని, రాముడినే ఏలుకొమ్మని ప్రార్ధించినా, కైకకు ఇచ్చిన మాటకు కట్టుబడి తమ్ముని సౌమ్య వచనాలతో అనునయించిన ప్రేమమూర్తి.

ఇంతగా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టే, ఈరోజుకి కూడా రాముణ్ణి తలచు కుంటున్నాం. మన దేశం లో రాజ్యం అంటే రామ రాజ్యమే, రాజు అంటే రాముడే. ప్రతి ఊరులోను, ప్రతి పేట లోను రాముడికి గుడి కట్టి పూజిస్తున్నాం. కష్టాల్లో ఉన్నపుడు రామా! ఎక్కడున్నావయ్యా అని స్మరించు కుంటున్నాం. రామ కథ చదివి అందులో లీనమైపోయినపుడు రాముడంతటి వాడికే తప్పలేదే అని కన్నీరు పెట్టుకుంటున్నాం.

భార్య అయిన సీతను అడవులకు పంపినప్పటికీ, అగ్ని ప్రవేశం చేయించి నప్పటికీ, ఈ దేశం లో పుట్టిన ప్రతి ఆడపిల్లా తనకు రాముడి లాంటి భర్తే కావాలి అని ప్రార్ధిస్తుంది. ఎందుకంటే రాముడు సుగుణాల రాశి. అటువంటి వాడు భర్త అయితే తన జీవితం నిర్విచారంగా సాగిపోతుంది.

రాముడిని మనం ఎంతగా సొంతం చేసుకున్నామంటే, రాముడి పెళ్లికి ఊరంతా సందడి.
ఊరంతా పందిళ్ళు,  మా రాముడు, మా సీతమ్మ అనే పిలుపులు తప్పితే దేవుడి పెళ్లి అని అనరు. ఎక్కడెక్కడినుంచో తలంబ్రాలు కానుకగా వస్తాయి. కళ్యాణం అయిన తర్వాత ఆ తలంబ్రాలే ఊరూరా, వాడవాడలా రాముని ఆశీర్వచనంగా పంచి పెట్ట బడతాయి.

రాముడు మనవాడు. మన ఇంటి వాడు, మన కంట నీరు తుడిచే వాడు. కష్టాల్లో మనకు తోడుగా ఉండే వాడు. ఆ రాముని పెళ్ళికి అందరు సిద్ధం కండి.

సర్వే జనా సుఖినో భవంతు.

                                    /// శ్రీ రామ ///

Friday 4 April 2014

అబ్బా, ఎండలు మండిపోతున్నాయి, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.... ఈ ఎండలు అసలు భరించలేకుండా ఉన్నాము..... ఇప్పుడు అందరి నోటా ఇవే మాటలు....నిజమే ఎండలు మండిపోతున్నాయి. మరి దీనికి కారణం ఎవరు?
ఆధునికత పేరుతొ చెట్లు కొట్టేసి ఫ్లాట్స్ కట్టేస్తున్నాం. రెండు చేతులా సంపాదిస్తున్నాం కదా అని ఒకటికి నాలుగు ఇళ్లు కోనేస్తున్నాం, లేదా కట్టేస్తున్నాం. సౌకర్యం పేరుతొ వాన నీరు భూమి లోకి ఇంకే వీలు లేకుండా ఇంటి పరిసరాలన్నీ సిమెంట్ చేయిన్చేస్తున్నాం. కనీసం ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టించాలి అనే ధ్యాస లేకుండా ఉంది మనకు. శుభ్రత పేరుతొ నీళ్ళను అడ్డు అదుపు లేకుండా వాడేస్తున్నాం. అంతగా నీరు సరిపోకపోతే, 700, 800 అడుగుల లోతుకి భూమిని తవ్వేస్తున్నాం.
ఒకప్పుడు గ్రామాల్లో ఉండే తాగునీటి చెరువులను కూడా కలుషితం చేసేసి అవి కూడా కనీసం వాడుకోవడానికి కుడా ఉపయోగపడకుండా చేసేసాం. ఫాషన్ మోజుతో మినరల్ వాటర్ కొనుక్కొని ఎముకలు పొడి పొడి చేసేసుకున్తున్నాం. పల్లెల్లో కూడా ఇదే పరిస్తితి. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా చెరువులని పాడు పెట్టేస్తున్నాం. అవసరానికి చెట్లు కొట్టేసినా మళ్లీ మరిన్ని మొక్కలు పెంచాలి అనే ధ్యాస లేదు మనకు.
నీరు అనేది ఫ్యాక్టరీలలో తయారు చేసేది కాదు, పోనీ అష్టకష్టాలు పడి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి. పంటలాగా పండించేది కాదు, ఎరువులో, మందులో వేసి ఎక్కువ పండించడానికి. పూర్తిగా భూమినుంచి రావలసినదే కదా... మరి ఏళ్ళ తరబడి అవసరానికి మించి వాడేసుకుంటే రాబోయే తరాల మాట ఏమిటి? పరిస్తితి ఇలాగె ఉంటె ముందు తరాల వాళ్ళు నీటి కోసం యుద్ధాలు చేసుకోవాలేమో? అప్పుడు కూడా డబ్బు ఉన్న వాడికే నీళ్లు అనే పధ్ధతి వస్తుంది. డబ్బు పెట్టినా భూమిలో నీరు ఉండాలి కదా?
నీరు నిత్యావసరం. నీరు లేకుండా రోజులో ఒక్క పని కూడా గడవదు. ఈ విషయం తెలిసినప్పటికీ మనం కొంచెం కూడా జాగ్రత్త తీసుకోవటం లేదు. ప్రభుత్వాలకు మన సంక్షేమం ఎలాగు పట్టదు సరే, మనకైన మన భవిష్యత్ పట్ల జాగ్రత్త ఉండాలి కదా! పెరిగే ఎండలు, వాతావరణ మార్పులు మనం చేతులారా చేసుకోన్న పాపాలే. మన దేశానికి పెట్టని గోడలుగా ఉన్న హిమాలయాలు కూడా కరిగి పోతున్నాయి అంటే మనం ఎంత ప్రమాదకర పరిస్తితులలో ఉన్నామో గమనించు కోవాలి.
నీటి వాడకం తగ్గించండి. వాననీరు భూమి లోకి ఇంకే ఏర్పాట్లు ప్రతి ఇంటిలోనూ చేసుకోండి. ఇప్పుడు ఇంకే నీరు మీ వారసులకి నీటి ఎద్దడి రానివ్వదు. వీలైనన్ని ఎక్కువ చెట్లు పెంచండి. ప్రభుత్వం మిద ఆధారపడకుండా స్వచ్చంద సంస్థల సాయం తో మీ ఊరిలోని చెరువులను, ప్రక్షాళన చేయండి. చేయి చేయి కలిపితే సాధించలేనిది ఏది లేదు. ఈనాడు నాటిన విత్తనం చెట్టై పెరిగి మీ వారసులకు ఫలాలను ఇచ్చినట్లే, మీరు ఈనాడు జాగ్రత్త చేసే ప్రతి నీటి బొట్టు మీ వారసుల అవసరాలు తీరుస్తుంది.
రామనామ సంకీర్తన --2
సృష్టి స్థితి లయ కారణంబగు సూక్ష్మ రూపము రామనామము
శిష్ట జనముల దివ్యద్రుష్టికి స్పష్టమగు శ్రీ రామనామము
సాంఖ్య మేరిగేడి తత్వవిడులకు సాధనము శ్రీ రామనామము
యుద్దమందు మహోగ్రరాక్షాస యాగ ధ్వంసము రామనామము

రాకడయు పోకడయు లేనిది రమ్యమైనది రామనామము
ఆత్మా సంయమ యోగసిద్ధికి ఆయుధము శ్రిరామనామము
నిర్వికారము నిర్వికల్పము నిర్గుణము శ్రీ రామ నామము
కోటి జన్మల పాపమేల్లను రూపుమాపును రామనామము
సత్వ రజస్తమో గుణముల కతీతమైనది రామనామము
ఆగామి సంచిత ప్రారబ్దములను హరియిన్చునది రామనామము
కామక్రోధ లోభ మోహముల కాల్చునది శ్రీ రామనామము
ఆశ విడచిన త్రుప్తులకు ఆనందమొసగును రామనామము
ప్రణవమను ఓంకార నాదబ్రహ్మమే శ్రీ రామ నామము
మనసు స్థిరముగా నిలుపగలిగేడి మంత్రరాజము రామనామము
జన్మ మృత్యు రహస్యమెరిగి జపియించవలే శ్రీరామ నామము
విషయ వాసనలేల్ల విడచిన విదితమగు శ్రీరామ నామము
పసితనమున నభ్యసించిన పట్టుబడు శ్రీరామ నామము
సర్వమతములలోని తత్వసారమే శ్రీ రామ నామము
నిర్మలంబుగా శోధ చేసిన నేర్వదగు శ్రీ రామనామము
విజ్నుడగు గురు నాశ్రయించిన విశాదమగు శ్రిరమనమము
(ఇంకా ఉంది)
శ్రీ రామ నామ సంకీర్తన ---3

రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము

జివితంబున నిత్యజపమున చేయవలె శ్రీరామ నామము
మరణ కాలము నందు  ముక్తికి మార్గమగు శ్రీ రామ నామము
పాలు మీగడ పంచదారల పక్వమే శ్రీరామ నామము
ఎందఱో మహానుభావుల డెందమాయెను శ్రీరామ నామము

తుంటరి కామాదులను మంట గలుపునది రామనామము
మేరుగిరి శిఖరాగ్రమందున మేరయుచున్నది రామనామము
సిధ్ధముర్తులు మాటిమాటికి చేయునది శ్రీరామ నామము
వెంట తిరిగెడి వారికేల్లను కంటిపాపే రామనామము

ముదముతో సద్భక్తి పరులకు మూలమంత్రము  రామనామము
కుండలిని చేదించి చూచిన పండువెన్నెల రామనామము
గరుడ గమనాదులకైన కాదు రమ్యమైనది రామనామము
విధాత వ్రాసిన వ్రాత తుడిచేడి దైవమె శ్రీరామ నామము

పుట్ట తానై, పాము తానై, బుసలు కొట్టును రామనామము
అష్ట దళముల కమలమందున అమరియున్నది రామనామము
అచలమై ఆనందమై పరమాణువైనది రామనామము
జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామ నామము

జ్ఞాన భూముల నేడు గడచినా మౌనదేశము రామనామము
తత్వ శిఖరమునందు వెలిగే నిత్యసత్యము రామనామము
దట్టమౌ గాఢఅంధకారమును  రూపుమాపును శ్రీరామ నామము
పంచ భుతాతీతమగు పరమాత్మ తత్వము రామనామము.


(ఇంకా ఉంది)

Wednesday 2 April 2014

మన అమ్మమ్మలు, నానమ్మలు పూర్వం ఈ రామ నామ సంకీర్తన చేస్తూ వుండేవారు, పనులు చేసుకుంటూ... ఆ రామ నామ సంకీర్తన  శ్రీ రామ నవమి సందర్భంగా మీ అందరి కోసం:



రామ నామము రామ నామము రమ్యమైనది రామనామము.

శ్రిమదఖిల రహస్య మంత్రం విశేష దామము  రామనామము
దారి నొంటిగా నడచువారికి తోడునీడే  రామనామము
నారదాది మహా మునీంద్రులు నమ్మినది శ్రీ రామనామము
కోరి కొలిచిన వారికేల్లను కొంగుబంగారు రామనామము

అండపిండ బ్రహ్మాండంబుల కాదారమైనది రామనామము
గౌరికిది ఉపదేశ నామము  కమలజుడు జపియించు నామము
గోచారంబగు జగములోపల గొప్యమైనది రామనామము
బ్రహ్మ సత్యము జగన్మిధ్యా భావమే  శ్రీ రామనామము

వాద బెదాతీతమగు వైరాగ్యమే శ్రీరామ నామము
భక్తీ తో భజియించు వారికి ముక్తి నొసగును రామనామము
భగవదర్పిత కర్మపరులకు పట్టుబడు శ్రీ రామనామము
ఆది మధ్యాన్తాది రహితం అనాది సిద్ధము రామనామము

సకల జీవులలోన వెలిగే సాక్షి  భూతము రామనామము
జన్మ మృత్యు జరాది వ్యాధుల జక్కబరచును రామనామము
ద్వేష రాగ లోభ మొహములను త్రెంచునది శ్రీ రామనామము
ఆంజనేయుని వంటి భక్తుల కాశ్రయము శ్రీ రామ నామము..


(ఇంకా ఉంది)