Friday 27 June 2014

అనగనగా ఒక మహానగరం లోని ఒక రద్దీ అయిన వీధిలో ఆకాశాన్ని అంటే అపార్టుమెంట్. అందులో ఒక ఇంట్లో 2,3 సంవత్సరాల ఒక పాప. పేరు మున్ని. మున్ని వాళ్ల అమ్మ ఇవాళ చాల హడావిడిగా ఉంది. ఆమె చాల అవసరంగా ఇవాళ బ్యాంకు కు వెళ్లి ఎక్కడో చదువుకుంటున్న మరిది కి డబ్బు పంపాలి. భర్తకు తీరిక లేదు. తనే తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే తనతో పాటు తీసుకెళ్ళడానికి మున్ని ని తయారు చేసి కిటికీలో కూర్చోపెట్టింది. ఇంతలో కింద నుంచి హాహాకారాలు, గొడవలు, గగ్గోలు, మత విద్వేషాలు, గృహ దహనాలు, లూటీలు, పోలీసులు, లాఠి చార్జీలు. షరా మామూలుగా నగరం లో కర్ఫ్యూ విధించారు. 3 రోజులు గడిచిపోయాయి. బ్యాంకు పని అవ్వలేదు. మతకలహలకు కారణం మొదట తెలియలేదు. తరువాత ఎవరో హిందూ కాలనీ లో నడచి వెళ్తున్న ఒక ముస్లిం మిద చెప్పు విసిరారు. అది ఇంత మరణ హోమానికి దారి తీసింది. పరిస్థితులు ఎలాగో సద్దు మణిగాయి.  ప్రశాంతత వచ్చింది. నగరం నివురు కప్పిన నిప్పులా ఉంది. మున్ని వాళ్ల అమ్మ మళ్లీ బ్యాంకు పనికి బయలుదేరింది. మున్ని ని తయారు చేసింది. చెప్పులు వేద్దామంటే కనబడలా... ఏమైనట్టు, ఈ నాలుగు రోజుల నుంచి ఎక్కడికీ వెళ్ళలేదే? అనుకుంటూ అంతా వెతికింది. ఎక్కడా లేదు. కోపం తో అసహనం తో మున్ని కి నాలుగు అంటించింది. మున్ని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపు లోనే ఏదో చెప్తోంది. వెక్కిళ్ళ మధ్యలో తల్లికి ఏమి అర్ధం కాలేదు. కానీ కొట్టినందుకు తనే మళ్లీ బాధపడుతోంది. మున్ని ని దగ్గరకు తీసుకొని మళ్లీ చెప్పమ్మా అని అడిగింది, మున్ని చెప్పింది--" ఆరోజు నా చెప్పు కిటికీలోంచి బయటకు పడిపోయింది" -- అని.

అనగనగా ఒక చెత్త ఛానల్. అది దాని రేటింగ్స్ పెంచుకోవడానికి ఏ గడ్డైనా తింటుంది. ఆ నిర్వాహకులకు రేటింగ్ పెంచుకోవడం తప్ప వేరే పని లేదు. ఆ ఛానల్ ట్యాగ్ లైన్స్ మాత్రం కోటలు దాటుతాయి. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే ఆ ఛానల్, మెరుగుగా ఉన్న సమాజాన్ని ముంచేసేందుకే పుట్టినట్టుంది.

అయన ఒక పీఠాదిపతి. అయన పని హిందుత్వాన్ని, దశదిశలా వ్యాపింపచేయడం. ఆయనను అంతటి స్థానం ఇచ్చి గౌరవించారు అంటే ఆయనకు సమాజం పట్ల అంతో ఇంతో బాధ్యత ఉంది కదా. అది పాపం అయన మర్చిపోయారు. ఒక పీఠానికి అధిపతి అయి ఉంది, కాషాయం ఎప్పుడైతే కట్టాడో, అయన అరిషడ్వర్గాలను జయించి ఉండాలి. పాపం అది అయన చేతకాలేదు.ఆయనకు ఇష్టం లేని ప్రశ్నలు వేస్తె వారి చెంప చెల్లుమనిపిస్తాడు.  అటువంటి వారికీ వాక్సుద్ధి  ఉండాలి. నోరు, మాట మన్నించ దగినవిగా ఉండాలి. కానీ అయన నోరు విప్పితే కాంట్రవర్సీ లే. అన్నిట్లోనూ వివాదమే. పీఠాధిపతి గా అయన పొందలేని గుర్తింపు వివాదాల ద్వార పొందుతున్నాడు.

ఈ బుర్ర లేని ఛానల్, ఆ పని లేని పెద్దమనిషిని చర్చా కార్యక్రమానికి పిలిచింది. ఒక పక్క, రాష్ట్రం అడ్డుగోలు విభజన, ఒకరికి లోటు బడ్జెట్, ఒకరికి మిగులు బడ్జెట్, కరంటు, నీళ్ళు, అన్నీ వివాదాస్పదం, రెండు రాష్ట్రాల వాళ్ళు సతమతం అవుతున్నారు, మాటల ఈటెలు విసురుకుంటున్నారు. ఇంకో పక్క పసిఫిక్ సముద్రం లో ఎల్ నినో, ఋతుపవనాలు ఆలస్యం, రైతన్నకు నీరు లేదు, పంటలు పండవు, ఎక్కడ మళ్ళీ కరువు కాలం వస్తుందో అనే భయం, మరో ప్రక్క జాతి ఉపయోగానికి అంటూ, రైలు చార్జీల మోత, గ్యాస్ బండ గుదిబండై మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం, --- ఇవన్ని ఇలా ఉంచి, ఆ బుర్ర లేని ఛానల్ కి ఆ చర్చకు టాపిక్ ఎవరు ఇచ్చారో తెలియదు, ఆ చర్చ వల్ల సమాజానికి ఏమి ఉపయోగమో తెలియదు కానీ, ఇప్పటికి సమాజం లో ఉన్న సంఘర్షణలు చాలవు అన్నట్లు, "శ్రీ షిరిడి సాయి బాబా దేవుడా ? కాదా?" అనే అంశం మీద ఆ సదరు పీఠాధిపతి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

1. అన్ని మతాలూ దేవుని చేరే వివిధ మార్గాలు అని అన్ని మతాలూ ఘోషిస్తున్నాయి. అందులోను,  హిందూ ధర్మం ఎంతో విశాల హృదయం తో అన్ని మతాలను ఆదరించింది. ఈనాడు, హిందూ ధర్మం, వారిని పూజించద్దు వీరిని పూజించద్దు, వీరినే పూజించాలి, ఈయనే దేవుడు అనే ఆంక్షలు పెట్టలేదు. అటువంటి హిందూ ధర్మానికి చెందిన ఒక పీఠాధిపతి, బాబా ముస్లిం, ఆయనను పూజించే వారు రాముని పూజించవద్దు అని అనటం ఎంతవరకు సబబు?

2. ప్రతి గ్రామం లోను, బాబాను పూజించే వారు ఎక్కువ అవడం వలన, షిర్డీ కి భక్తుల తాకిడి ఎక్కువ అవడం వలన, ఇదివరకు రాముని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు బాబాను పూజించడం వలన , రామునికి రావలసిన ఆదాయం అంతా బాబాకి వెళ్ళిపోతోంది అని అయన ఆక్రోశం. ఒక సన్యాసి కి డబ్బు గురించిన చింత ఎందుకండీ? రాముడి డబ్బు తగ్గిపోతే రాముడు చూసుకుంటాడు, ఆ ఆ దేవాలయాలు కట్టించిన ధర్మకర్తలు చూసుకుంటారు కదా?

3. ఒకవేళ ఈయన పూజించద్దు అని చెప్పినంత మాత్రాన బాబాను తమ దైవంగా, తండ్రిగా భావించే భక్తులు మానరు కదా? ఎవరిని పూజించాలి, ఎవరిని నమ్మాలి అనేది భక్తుల వ్యక్తిగత విషయం. దీనిని పబ్లిక్ చేయడం ఎంతవరకు సమంజసం.?

4. వేరే మతం వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు హిందూ సమాజం లో అంతర్గత కలహాలు తేవడానికి ఇదంతా చేస్తున్నారు అని ఆ స్వామిజి సెలవిచ్చారు. ఇందులో అర్ధం ఏమిటో ఆయనకే తెలియాలి.

5. ఈ చర్చ చూసిన/విన్న  సోదరులు కొందరు, సాయి భగవంతుడే కాదు, అయన ఒక గురువు మాత్రమే, ఆయనను దైవం తో సమానంగా చూడకండి, దైవం అనే హోదా ఇవ్వకండి అని మొత్తుకున్నారు. మరి చెట్టుకొకరు, పుట్టకొకరు పుట్టుకొస్తున్న స్వమీజిల గురించి ఎవరూ ఏమి మాట్లాడరే? వాళ్ళందరూ ఇంతంత బంగారాలు దిగేసుకుని, పట్టు పరుపుల మిద బంగారు సింహాసనాల మిద కుర్చుని, పడపూజకు లక్షలు లక్షలు రుసుము వసూలు చేస్తుంటే మాట్లాడరే?

6. కలియుగం లో బాబానే కాకుండా, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు ఎందఱో ఉన్నారు. ఎంతో మందికి మార్గ నిర్దేశం చేసారు. వాళ్ళందరి విషయం లో లేని దుగ్ధ బాబా విషయం లోనే ఎందుకు?

7. కొందరి ఉవాచ ఏమిటంటే, బాబా గురించి వేదాలలో లేదు కాబట్టి ఆయనను ప్రామాణికంగా తీసుకోలేము. బాబా నిన్న మొన్నటి వరకు మన మధ్యలో తిరిగిన వారు. కొన్ని యుగాల క్రితం పుట్టిన వేదాలలో అయన ప్రసక్తి ఎలా ఉంటుంది?

8. బాబా ను దైవంగా కొలిచినా, కొల్వక పోయినా, అయన నేర్పిన భక్తీ, క్రమశిక్షణ బాబా భక్తులందరికీ అలవాటు అయిపోయాయి. ఏ బాబా మందిరం లోను, ఏ పండగ నాడు కనీ, విశేష దినాలలో కనీ, ఎంత రద్దీ ఉన్నా, తొక్కిసలాట జరుగదు. భక్తులు ఎంతో నిదానంగా క్యు పాటిస్తూ నిశ్శబ్దం గా లైనులో కదులుతుంటారు.

9. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా తనను తానూ ఎప్పుడూ దేవుడిని అని చెప్పుకోలేదు. దేవుని బానిసను మాత్రమే అని చెప్పారు. నేను దక్షిణగా తీసుకునే ప్రతి పైసాకి నేను భగవంతునికి లెక్క చెప్పాలి అని చెప్పారు. నన్నే పూజించండి అని చెప్పలేదు. ఎవరు ఏ దేవుని పూజిస్తే వారికీ ఆ రూపం లో దర్శనం ఇచ్చారు. నాకు ఈ విధంగా పూజ చేయండి అని చెప్పలేదు. ఎవరి ఇష్టం అయినట్టు వారిని పూజించుకోమని చెప్పారు.

10. సదరు పీఠాధిపతి గారు ఇంకో విషయం సెలవిచ్చారు. బాబా ముస్లిం అయితే, ముస్లిములు ఎక్కువ బాబాను ఎందుకు పూజించడం లేదు అని? ముస్లిములకు నిర్గుణమైన ఆరాధన తప్ప, సగుణారాదన లేదు. ముస్లిములే కాదు, మార్వాడీలు, సిక్కులు ఎంతో మంది బాబాను పూజిస్తున్నారు. సామాన్య భక్తులు కేవలం భక్తీ తప్ప , బాబా మతాన్ని పట్టించుకోవటం లేదు. అందరికీ ఆదర్శం గా ఉండవలసిన ఆ స్వామి బాబా యొక్క మతం కులం అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు.

అసలు సమాజానికి ఒక్క పైసా మేలు చేయని ఇటువంటి చర్చలను ప్రోత్సహించే చానల్స్ ను బాన్ చెయ్యండి. అక్కర్లేని విషయాలకు ధర్నాలు, స్త్రైకులు చేసే వాళ్ళు, ఇటువంటి చర్చలు బాన్ చ్యడానికి ధర్నాలు చేయండి.

Thursday 26 June 2014

దాదాపు 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే దాదాపుగా ఈ కార్పొరేట్ కాలేజీ లు మొదలు ఐన నాటి నుండి కేవలం రాంకులు, మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు, అందుకోసం సైన్స్ సబ్జక్ట్స్ తప్పఇంగ్లీషు, తెలుగు భాషలకు విలువ, ప్రాధాన్యం ఇవ్వక పోవడం మూలాన ఇప్పుడు వాటి పరిస్తితి అధ్వాన్నంగా తయారయింది. మా తరం అంటే తెలుగు మీడియం లో చదువు కున్నం కాబట్టి ఇంగ్లీషు grammer మాకు సరిగా రాలేదంటే అర్ధం ఉంది. కానీ అంతంత డబ్బులు పోసి ఇంగ్లీషు మీడియం లలో చదివించినా కుడా ఒక పేరా వ్రాస్తే అందులో పది గ్రామర్ తప్పులు. దానికి తోడు ఇప్పుడు వచ్చిన ఈ దిక్కుమాలిన sms భాష ఒకటి. అన్ని పదాలు సగం సగం వ్రాయటమే. abt ,hw , u , r , thnx , ఇలా. పరీక్ష పేపర్లు దిద్దుతుంటే ప్రాణం పోతోందండి అని వాపోయింది ఒక ఇంగ్లీషు లెక్చరర్ ఆ మధ్య.
ఇక తెలుగు గురించి ఏమి చెప్పాలి? 20 ఏళ్ళ క్రితం నుంచి సరి అయిన బోధనా లేకపోవడం మూలంగా ఇపుడు ఏ signboard చూసినా, ఏ షాప్ ముందు నేమ్ బోర్డు చూసినా, అందులో సవాలక్ష తప్పులు. ఇంక టీవీ లో స్క్రీన్ అడుగు భాగం లో వచ్చే స్క్రోలింగ్ చుస్తే ప్రతి వాక్యానికి ఒక తప్పు తప్పనిసరి. ఇంక వార్తలు చదివే వాళ్ళు, ఎంకర్స్ సంగతి ..... అందరికి తెలిసినదే. మొన్న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం నాడు ఒక ప్రముఖ ఛానల్ లో రాత్రి ప్రైమ్ టైం న్యూస్ చదువుతున్న అయన "భాద్యతలు" అంటుంటే "బాధితులు" అని వినపడింది. మొదట నేను తప్పు వింటున్నానా అని అనుకొన్నా. శ్రద్ధగా విన్నా అదే పరిస్థితి. పంటి కింద రాయిలా. anchors లో చాల మందికి "ళ", "ణ" పలకదు. వెల్లి. పెల్లి, గననీయం అని చదువుతుంటే వినడానికి చాలా బాధగా ఉంటుంది. దానికి తోడూ, కొత్తదనం పేరిట అన్ని భాషలు కలిపేసి ఏదో వెర్రి మొర్రి పదాలు, సంకర భాషాను.
ఇప్పటికీ డిడి నేషనల్ లో శుద్ధమైన హిందీ, డిడి సప్తగిరి లో శుద్ధమైన తెలుగు మాట్లాడతారు. ఇదివరకు ప్రైవేటు చానల్స్ లో కూడా ఇంగ్లీష్ మాటలు పరిమితంగా వాడేవారు. ఇప్పుడు తెలుగు పొదుపుగా వాడుతున్నారు అనిపిస్తుంది. ఈ ప్రైవేటు చానల్స్ లో తెలుగు తనం ఉట్టిపడే కార్యక్రమాలే ఉండవు. ఏదో సంక్రాంతి పండుగకో, ఉగాది పండుగకో మనం తెలుగు వాళ్ళం అనే సంగతి గుర్తు వస్తుంది వాళ్ళకు.
మా పిల్లలు చదువుకునే కాలంలో తెలుగు లో ఇచ్చిన అన్ని పద్యాలూ భావార్ధలతో సహా నేర్పించేవాళ్ళం. ఇపుడు తెలుగు, ఇంగ్లీషు సబ్జక్ట్స్ లో కేవలం పరీక్షకు వచ్చే పాఠాలు మాత్రమే చెప్పి, అందులో ప్రశ్నలు మాత్రమే చెప్పి మిగతావి వదిలేస్తున్నారు. ఇక పిల్లలకు తెలుగు గురించి ఏమి తెలుస్తుంది?
ఇపుడైనా మించిపోయింది లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలకు తెలుగు గురించి, చెప్పండి. సామెతలు, పొడుపు కథలు , నీతి కథల ద్వారా తెలుగును పరిచయం చేయండి. నాకు తెలిసి తెలుగు ను మొదటి నుంచి నేర్చుకోవడానికి గొల్లపూడి వారి పెద్ద బాల శిక్ష బాగా పని చేస్తుంది. ముందు మీరు నేర్చుకొని, పిల్లలకు ఇంట్లో ఆడుతూ పడుతూ చెప్పండి. పద్యాలూ, చమత్కారాలు తెలుగులో చాల ఉన్నాయి. అవి చెప్పండి. లేదంటే, కొన్నాళ్ళకు ఈ భాష లోని అందమైన పదాలన్ని మనం మర్చిపోతాం. ఆఖరికి కొన్నేళ్ళకు తెలుగు మృత భాషల జాబితాలో చేరిపోతుంది.
ఈరోజు ఒక గ్రూప్ లో ఒక మహిళా సభ్యురాలు నన్ను ఒక ప్రశ్న అడిగారు. వాళ్ళ పిల్లలు అసలు పనిలో సహాయం చేయడం లేదు అని, ఉద్యోగిని అయిన ఆవిడా అన్ని పనులు చేయటం కష్టం గా ఉంది అని, ఏదైనా సలహా చెప్పండిఅని.
పిల్లలకు ఇంట్లో పని చేయడం చిన్నతనం నుంచే అలవాటు చేయాలి. బాటిల్స్ లో నీరు నింపడం, భోజనాల సమయం లో టేబుల్ సర్దడం, ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టి ఇల్లు నీట్ గా ఉంచడం, ఉతికిన బట్టలు మడత పెట్టి ఎవరివి వారికీ సర్దడం, ఇంకా తల్లులు ఉద్యోగస్తులు అయితే, కూరలు కడిగి పెట్టడం, కొంచెం పెద్ద వయసు పిల్లలు అయితే, కూరలు తరిగి ఇవ్వడం, బియ్యం కడిగి పెట్టడం, వారి టిఫిన్ బాక్స్ లు వారు సర్దుకోవడం, ఏదైనా టూర్ వెళ్ళినపుడు వారి సూట్ కేసులు వారు సర్దుకోవడం, ఇటువంటి పనులు పిల్లల చేత చేయించవచ్చు. కానీ అత్యధికంగా తల్లులు చేసే పొరపాటు ఏమిటంటే, తమ పిల్లలు ఇంకా చిన్నపిల్లలు అని, వారికీ ఏమి తెలియదు అని అనుకోవటం. పిల్లలు ఏ వయసు వారైనా చాల తెలివిగా ఉంటారు. వాళ్ళకు చెప్పే విధంగా చెప్తే చిటికెలో అర్ధం చేసుకుంటారు.ఇందులో ఒక చిన్న కిటుకు ఉంది. మనం వాళ్ళకి చెప్పే పనులు, మనం చేస్తున్నావే అయి ఉండాలి. ఉదాహరణకు, మనం బట్టలు మడత పెట్టేటప్పుడు వారి చేత కూడా చిన్న బట్టలు కానీ, వాళ్ళ బట్టలు కానీ మడత వేయమని చెప్పాలి. మనం వంట గదిలో పని చేసేటప్పుడు, మనం కూరలు తరిగేటప్పుడు ఆ కూరలు ఒక్కొక్కటీ కడిగి ఇవ్వమని చెప్పాలి. మనం బాటిల్స్ లో నీరు నిమ్పినపుడు, రెండు మనం నింపి, మిగతావి వారిని నింపమని చెప్పాలి. ఈ పనులు చేస్తూ ఉన్నంతసేపు మనం వారిని కబుర్లతో, కథలతో , జోక్స్ తో ఎంగేజ్ చేయాలి. ఒకవేళ ఉద్యోగినులు అయితే, మీరు ఎంత బిజీ గా ఉన్నారో, వాళ్ళు చేసే చిన్న చిన్న సహాయాల వల్ల ఎంత సమయం మీకు అదా అవుతోందో చెప్పాలి. వాళ్ళు సహాయం చేసిన ప్రతిసారి వాళ్ళకు థాంక్స్ చెప్పాలి. చిన్నతనం లోనే వాళ్ళకు మీ వెనకాలే పని చేయటం, మీకు సహాయం చేయటం అలవాటు చేస్తే ఆ అలవాటు వాళ్ళు పెరిగిన తరువాత కూడా మర్చిపోరు.
ఇక్కడ చాల మంది ఒక ప్రశ్న అడుగుతారు. ఇలా ఇంటి పనులలో పడి తిరిగితే వాళ్ల చదువు ఏమి కాను? అని,1. ఈ చిన్న చిన్న పనులకు ఎంతో టైం పట్టదు. 2. చదువు మధ్యలో వాళ్ళకు రిలాక్స్ కావడానికి ఇవి తోడ్పడతాయి. 3. ఇల్లు, ఉద్యోగం రెంటినీ అమ్మ ఎంత శ్రమ తీసుకుని నిర్వహిస్తోంది వారికీ అర్ధం అవుతుంది. కనుక వాళ్ళు మర్నాటి నుంచి స్వచ్చందంగా ఇంటి పనులు చేస్తారు. ఆ సమయానికి తగ్గట్టు వారి చదువుల వేళల్లో మార్పు చేసుకుంటారు. ఇందాకే చెప్పా కదా పిల్లలు తెలివైన వారు అని. 4. కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ పనులు చేసుకోవటం వలన మీకు, మీ పిల్లలకు మధ్య ఇంటరాక్షన్ పెరుగుతుంది. ఇది భవిష్యత్ లో మీ అనుబంధాలు గట్టిపడడానికి చాల ఉపయోగపడుతుంది. 5. ఇలా చిన్న చిన్న పనులు పెంచుకోవటం వలన వాళ్ళకు బాధ్యత తెలిసివస్తుంది.
కాబట్టి, ఇలా చేసి చుడండి. పది రోజుల్లో మార్పు మీరే గమనిస్తారు.
దేశం లో ఎన్నో సమస్యలు, చర్చకు రాదగిన విషయాలు ఎన్నో ఉండగా, సాయి బాబా దేవుడా, కాదా అని ఒక ప్రైవేటు ఛానల్ లో చర్చ. దానికి ఒక వక్త ఒక పీఠాధిపతి. ఈ చర్చ వల్ల ఎవరికైనా ఒక పైసా ఉపయోగం ఉందా, ఆ ఛానల్ కి తప్ప. ఏదో ఒక గంట కాలక్షేపం. పోనీ ఇటువంటి ప్రోగ్రామ్స్ వల్ల కొంచెం అయినా నాలెడ్జ్ వస్తుందా, అక్కర్లేని గొడవలు, తప్ప. ఇటువంటి దిక్కుమాలిన చర్చలు ఎందుకు పెడతారో తెలియదు. ఇదివరకు రోజుల్లో ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు ప్రైవేటు చానల్స్ ప్రోగ్రామ్స్ నియంత్రిన్చినపుడే బాగుండేది. ఇపుడు 24 గంటలు ప్రోగ్రామ్స్ అనేసరికి ఏ ప్రోగ్రామ్స్ చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు.
అయన ఒక పీఠాధిపతి. మతాలూ అన్ని దేవుని వద్దకు చేర్చే వివిధమైన మార్గాలు అని ఆయనకు తెలియదా? భారతదేశం ముఖ్యంగా హిందూ దేశం అయినప్పటికీ, కొన్ని శతాబ్దాలుగా అనేక మతాలూ ఈ భక్తీ ప్రవాహం లో కలిసాయి. అన్ని మతాల వాళ్ళు కలిసి మెలిసి ఎన్నో శతాబ్దాలుగా ఈ దేశం లో ఉంటున్నారు. రాజ్యాంగం కూడా అందరూ సమానం అని చెప్పింది. బాబా కూడా సమాధి చెంది 100 సంవత్సరాలు కావొస్తోంది. ఇపుడు కొత్తగా బాబా దేవుడా, కాదా అనే పాయింట్ ఎందుకు వచ్చింది? అసలు ఈ ప్రశ్న ఎవడి బుర్రలో పుట్టింది?
షిరిడి బాబా ఏనాడూ నాకు బంగారం, వెండి, కానుకలు ఇవ్వండి అని చెప్పలేదు. కనీసం నాకు ఈ నైవేద్యం పెట్టండి అని కూడా చెప్పలేదు. ఇంకా తన దగ్గరకు వచ్చిన అసహాయులకు అయన ఎదురు సహాయం చేసారు. నివేదనకు కూడా ఒకసారి నివేదన చేసిన దైనా పర్వాలేదు, ఇంట్లో ఏది ఉంటె అదే అని కూడా చెప్పారు. అప్పు చేసి, షిర్డీ రావద్దని, నన్ను మనస్పూర్తిగా తలచుకుంటే ఎక్కడ అయినా ప్రత్యక్షం అవుతానని కూడా అయన జీవించి ఉన్నపుడే భక్తులతో చెప్పారు. ఆయన జీవించి ఉన్నపుడు, సమాధి చెందినా తరువాత కూడా ఎన్నో నిదర్శనాలు భక్తులకు చూపించారు. కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇటువంటి చర్చలు ప్రజలకు అవసరమా?
ఎంతసేపు, రకరకాల సంస్థల వాళ్ళు టీవీల్లో హిందువుల ఆచార వ్యవహారాలు, నమ్మకాల మీదనే ఆధారపడి చర్చలు సాగిస్తారు కాని, ఇతర మతాల జోలికి పోరెందుకు? ఎందుకంటే వాళ్ళంటే భయం. వాళ్ల మతాలలో మాత్రం నమ్మకాలు, మూఢ నమ్మకాలూ లేవా? ఇంకా మన నమ్మకాలూ శాస్త్రీయంగా కూడా రుజువు అయ్యాయి కూడా. అయినా హిందువులే అన్ని చర్చలకి టార్గెట్. ఎందుకంటే ఎవరి పాపాన వాళ్లే పోతారు అని నిమ్మకు నీరెత్తినట్టు ఉండే జాతి ఇది అని.
బాబా దేవుడు కాదు అని సదరు స్వామి వారు చెప్పినపుడు, పుట్టకొకరు, చెట్టుకొకరు అని పుట్టుకొస్తున్న స్వామిజిల మాటేంటి మరి? ఇది ఎవరూ అడగరు? వాళ్ళకు భక్తులు బంగారం, వెండి కానుకలు ఇవ్వడం లేదా? వాళ్ళకు పెద్ద పెద్ద మహాల్స్ ఉండటం లేదా? వాళ్ళు AC కారుల్లో తిరగడం లేదా?
ఏది ఏమైనా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే ఇలాంటి దిక్కుమాలిన చర్చా కార్యక్రమాలను ప్రేక్షకులు ఖండించాలి. ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు చానల్స్ రూపొందించాలి. వాళ్ల రేటింగ్ పెంచుకోవడానికి అక్కర్లేని చచ్చు, పుచ్చు ప్రోగ్రామ్స్ చేయొద్దని టీవీ చానల్స్ వాళ్ళకు నా మనవి. ప్రపంచం లో ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రజలను educate చేయడానికి. అవి చేయండి. అందరు సంతోషిస్తారు.

Monday 16 June 2014

మా టీవీ లో గత వారం మొదలైన " మీలో ఎవరు కోటీశ్వరుడు" కార్యక్రమం చాల బాగుంటోంది. హిందీ ఛానల్ లో అమితాబ్ చేసిన కార్యక్రమాన్ని తెలుగులో నాగార్జున గారు చేస్తున్నారు. యావద్భారత ప్రేక్షకులకు సుపరిచితమైన అమితాబ్ నిర్వహించిన ఈ కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి అయన నటిస్తూ ఉండడం, ఇపుడు వయసులో పెద్దవారు అవటం వల్ల అయన కార్యక్రమంలో పాల్గొనే వారికీ, ప్రేక్షకులకు కూడా ఒక ఆత్మీయుడు గా అనిపించారు. ఇపుడు అదే కార్యక్రమం అదే నిర్మాతలతో తెలుగు లో రూపు దిద్దుకుంది. హిందీ లో ప్రోగ్రాం ని చుసిన వారికీ ఇది కొత్తగా అనిపించడం లేదు. బాగా అలవాటు అయిన ప్రోగ్రాం చూస్తున్నట్టే ఉంది. నిర్మాతలు ఒకరే అవడం వలన, సెట్టింగ్స్ లో కాని, background music లో కానీ ఏమి తేడా లేదు. ఇది కూడా ఈ ప్రోగ్రాం మనకు సుపరిచితం గా ఉండడానికి ఒక కారణం. అమితాబ్ కన్నా చిన్నవారు అయినప్పటికీ, నాగార్జున ఈ కార్యక్రమాన్ని చాల పరిణతి తో నిర్వహిస్తున్నారు. వచ్చిన వారిని పలకరించడం, వారితో సరదాగా మాట్లాడడం ఈ ప్రోగ్రాం కి వన్నె తెచ్చాయి.

ఈ కార్యక్రమం ద్వారా, మంచి విజ్ఞాన దాయకమైన విషయాలు తెలియడమే కాకుండా, మనుషుల జీవితాలలో ఉన్న ఎత్తుపల్లాలు కూడా తెలుస్తున్నాయి. ఒక విధంగా ఈ ప్రోగ్రాం విజ్ఞానం +స్పూర్తి ని కలిగిస్తోంది. మొట్టమొదటి భాగం లో ఒక టీచర్ వచ్చారు. అయన కల ఒక సొంత ఇల్లు కట్టుకోవటం. దానికి 3,4 లక్షలు సరిపోతుంది అన్నపుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. ఎంత సంపాదించినా, సరిపోవట్లేదు అనుకునే వారికీ ఇది నేర్చుకోవలసిన విషయం అనిపించింది.  అయన కల తీరేందుకు సరిపడా డబ్బును గెల్చుకున్నారు కూడా.

ఇంకొక అభ్యర్ధి తండ్రి చెప్పులు కుట్టే వృత్తిలో ఉన్నారు. అయన నాగార్జున గారికి అయన సైజుకు సరిపడా, చెప్పులు కుట్టి తెచ్చారు. అవి ఎంతో అందంగా ఉన్నాయి. నాగార్జున ఎంతో అభిమానంగా అవి స్వీకరించారు కూడా.

అన్నిటికన్నా, ఒక స్పూర్తిదాయకమైన మహిళను నిన్నటి భాగం లో చూసాము. ఆమె ఒక HIV పాజిటివ్ వ్యాధిగ్రస్తురాలు. 14 సంవత్సరాల వయసులోనే పెళ్లి అయిన ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టాక ఆమె భర్త ఆ వ్యాధితో చనిపోయారు.  ఆమెకు కూడా ఆ వ్యాధి సోకింది. అప్పటినుంచి జీవితం లో పోరాడుతూ, ఉపాధి కోసం తెలిసిన వారి సహాయంతో ఒక ఆటో కొనుక్కొని, నడపడం నేర్చుకొని దాని మిద ఆదాయం పొందుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు ఆమె. కేవలం స్త్రీ కావడం వలన ఆమె ఎన్ని బాధలు పడ్డారో చెపుతుంటే చూస్తున్న వాళ్ళకే కాదు, అక్కడ ఉన్న నాగార్జున గారికి కూడా కళ్ళు చెమర్చాయి. ఆటో నేర్పడానికి ఆమె శరీరాన్ని బేరం పెట్టినవారు కొందరు. ఆమె HIV  పాజిటివ్ అని తెలియగానే, మళ్లీ పత్తా లేకుండా పోయారు. ఒక అతను ఈమె బలహీనతను గమనించి ఆటో డ్రైవింగ్ నేర్పడానికి రోజుకు వెయ్యి రూపాయలు అడిగాడట. అంత డబ్బు ఇవ్వలేని ఆమె, ఒక్క రోజులోనే డ్రైవింగ్ నేర్చుకున్నారట. ఇంత జరిగినా, ఆమె తన భర్తను కొంచెం కూడా కించపరచలేదు, విధిని కూడా ఆమె తప్పు పట్టడంలేదు. అది మనం అందరం నేర్చుకోవలసిన విషయం...ఆమె లక్ష్యం పిల్లలను బాగా చదివించడం. ఆమె 40,000 మాత్రమే గెలుచుకున్నారు. ఆమె లక్ష్య సాధన కోసం మరి కొంత మొత్తం గెలుచుకుని ఉంటె బాగుండేది.

గత వారం విజయవాడ నుండి ఒక పెద్దావిడ పాల్గొన్నారు. ఆమె ఒక మహిళా హాస్టల్ నడుపుతున్నారు. ఆమె లక్ష్యం ఆ హాస్టల్ ను ఇంకా అభివృద్ది చేయడం. ఆమె దగ్గర్నుంచి మనం నేర్చుకోవలసినది ఆత్మ విశ్వాసం. ఆవిడా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఎంతో ఆత్మ విశ్వాసం తో , నేను ఈ బహుమతి గెలుచుకుని వెళ్ళాలి, నా హాస్టల్ పిల్లలకు ఎంతోకొంత చేయని అనే ధృఢమైన నిశ్చయంతో పాల్గొన్నారు అనిపించింది. ఆఖరున క్విట్ అయేటప్పుడు కూడా అదే ఆత్మవిశ్వాసం తో క్విట్ అయారు ఆవిడా. ఆవిడ అనుభవాల నుంచి ఎంతో నేర్చుకోవచ్చు అనిపించింది.

ఇదివరకు తెలుగులో చాలా quiz షో లు వచ్చాయి. ముందు చెప్పినట్టు, ఇది అందరికీ పరిచయం అయిన ప్రోగ్రాం అవడం, పరిణతి చెందిన నటుడు దీనిని నిర్వహించడం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చాయి. ఎప్పుడూ ప్రైవేటు చానల్స్ లో సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలే కాకుండా ఇటువంటివి కూడా ప్రసారం చేస్తే, విజ్ఞానం, వినోదం తో పాటు మన జీవితాలకు ఒక స్పూర్తి కూడా కలుగుతుంది.

Sunday 15 June 2014

రామనామ సంకీర్తన 6

రామనామము రామనామము రమ్యమైనది రామనామము

శాంతిగా ప్రార్ధించు వారికీ సౌఖ్యమైనది రామనామము
రామనామ స్మరణ చేసిన క్షేమమోసగును రామనామము
పెద్దలను ప్రేమించు వారికీ ప్రేమనిచ్చును రామనామము
ఆత్మా శుద్ధిని కన్నవారికి అధిక మధురము రామనామము

గుట్టుగా గురుసేవ చేసిన గుణములోసగును రమణము
బ్రహ్మ విష్ణు మహేస్వరులకు నిష్టమైనది శ్రీ రామనామము
పరమ పదము చేరుటకు దారి చూపును శ్రీ రామనామము
తల్లివలె రక్షించు సుజనుల తావళము శ్రీ రామనామము

జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే శ్రీరామ నామము
మంగళం బగు భక్తితో పాడిన శుభకరమ్బగు శ్రీ రామనామము

రామనామము రామనామము రమ్యమైనది రామనామము......


                   //////////    శ్రీరామ   ////////
రామనామ సంకీర్తన 5

రామనామము రామనామము రమ్యమైనది రామనామము

బ్రహ్మపుత్ర కరాబ్జ వీణా పక్షమైనది రామనామము
భక్తితో ప్రహ్లాదు డడిగిన వారము నొసగెను రామనామము
నీలమేఘ శ్యామలము నిర్మలము శ్రీ రామనామము
ఎందు జూచిన ఏకమై తా వెలయుచున్నది రామనామము

రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము
రామ తత్వమూ నెరుగు వారికీ ముక్తి తత్వమూ రామనామము
వేదవాక్య ప్రమాణములచే అలరుచున్నది రామనామము
శరణు శరణన విభీషణునకు శరణ మొసగిన రామనామము

శాంతి సత్య అహింస సమ్మేళనమే శ్రీ రామనామము
సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము
సోహం అను మంత్రార్ధ విదుల దేహముక్తియే రామనామము
ఉపనిషద్ వాక్యంముల చేతను యోప్పుచున్నది రామనామము

దాసులను రక్షించు దయగల ధర్మ నామము రామనామము
నాదమే బ్రహ్మాన్దమంతయు నావరించును రామనామము
రాక్షసులను తరిమికొట్టిన నామమే శ్రీరామ నామము
మోక్షమివ్వగా కర్త తానై మ్రోగుచున్నది రామనామము

(ఇంకా ఉంది)
రామనామ సంకీర్తన 4

రామనామము రామనామము రమ్యమైనది రామనామము

పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము
నిజ స్వరూపము బోధకంబగు తారకము శ్రీ రామనామము
రజితగిరి పతికినేప్పుడు రమ్యమైనది రామనామము
శివుడు గౌరికి బోధ చేసిన చిన్మయము శ్రీ రామనామము

సకల సద్గుణ నిలయమగు పరిపూర్ణ తత్వమే రామనామము
అంబరీషుని పూజలకు కైవల్యమొసగిన శ్రీ రామనామము
అల కుచేలుని చేతి అటుకుల నారగించిన రామనామము
ఆత్మలో జీవాత్మ తానై అలరుచున్నది రామనామము

అత్మతపమును సల్పువారికి ఆత్మ యజ్ఞము రామనామము
కర్మ నేత్ర ద్వయము చేతను కానరానిది శ్రీ రామ నామము
జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము
చిత్త శాంతిని కలుగ చేసేది చిత్స్వరూపము రామనామము

చావు పుటుకలు లేని పరమ పదమై వెలయుచున్నది రామనామము
ముక్తి రుక్మాంగదున కొసగిన మూలమంత్రము రామనామము
మూడు నదులను దాటువారికి మోక్షలక్ష్మియే రామనామము
మొహమను మంత్రార్ధ విధులకు సోమపానము రామనామము

చూపు మానస మొక్కటై చూడవలసినది రామనామము
త్రిపుట మధ్యమునందు వెలిగే జ్ఞానజ్యోతియే శ్రీ రామనామము
దూరద్రుష్టియే లేనివారికి దుర్లభము రామనామము
బంధ రహిత విముక్తి పధమగు మూలమంత్రము శ్రీ రామనామము

(ఇంకా ఉంది )

Friday 6 June 2014

పార్టీల్లో లేదా ఫంక్షన్స్ లో ఎంతమంది ఉన్నా, అందరి దృష్టి ఇద్దరు ముగ్గురి మిద ఉంటుంది. వాళ్ళే ఆ పార్టీ కి కేంద్ర బిందువులా ఉంటారు. వారి చుట్టూ ఒక విధమైన చైతన్యం, ఉత్సాహం తొణికిసలాడుతూ ఉంటాయి. వారిలో ఏదో ఒక ప్రత్యెక ఆకర్షణ ఉంటుంది. అది ఖచ్చితంగా ఏమిటో చెప్పలేము. వారి ప్రభావం మాత్రం ఖచ్చితంగా అందరి మిద ఉంటుంది.

ఇలా ఒక గుంపులో అందరి మీద ప్రభావం చూపించే వ్యక్తులలో అందం, ఆకర్షణ, మాటతీరు, హుందాతనం, ప్రవర్తన, ప్రతిభా పాటవాలు ఇవన్ని లేదా కొన్ని లక్షణాలు ఉండవచ్చు.

  కొంతమంది నలుగురినీ ఆకర్షించే అందం, ముఖ సౌందర్యం కలిగి ఉన్నా, అదొక్కటే ప్రభావితం చేయడానికి సరిపోదు. నిటారుగా , ఆత్మవిశ్వాసం తో నడవడం, ఖరీదైన వస్త్రాలు ధరించక పోయినా, చక్కగా శరీరానికి నప్పే దుస్తులు ధరించడం, ( అన్ని ఫేషన్లు అందరికీ నప్పవు. అది గమనించుకొని మన వస్త్ర ధారణా ఉండాలి. ) శరీర నిర్మాణానికీ, దుస్తులకూ నప్పే విధంగా నగలు అలంకరించు కోవటం, చక్కటి హెయిర్ స్టైల్, తగినంతగా అలంకరణ ఇవన్ని అందాన్ని, ఆకర్షణను ఇనుమడింప చేసేవే.  అందరికీ శరీర నిర్మాణం, ముఖ సౌందర్యం చక్కగా లేకపోయినా, బయటకు కనిపించే తీరు, మన స్వభావం, మాటతీరు చక్కగా ఉంటె గుర్తింపు అధికంగా ఉంటుంది.

 ఇతరుల వద్ద మనం గుర్తింపు పొందడానికి ముఖ్యమైన కారణం మన మాట తీరు. చక్కని చిరునవ్వు, చక్కగా చిన్న, పెద్ద అందరిని పలకరించడం, వయసులో పెద్ద వారికి నమస్కరించడం, వారి పట్ల గౌరవ భావం తో ఉండడం, ఇటువంటివి మనకు వెంటనే గుర్తింపు తెస్తాయి. పార్టీ కి పిలిచినా వారితోనే కాకుండా, వచ్చిన మిగతా అతిధులను కూడా చక్కగా పలకరించడం, వారి యోగ క్షేమాలు, వారి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు కనుక్కోవడం ఎంతో బాగుంటుంది. అతిథులలో ఎవరితో అయినా మనకు బేధాభిప్రాయాలు ఉన్నా , అవి బయట పడనీయకుండా వారితో కూడా అవసరానికి నవ్వుతూ మాట్లాడాలి. వారి గురించి ప్రక్క వారితో చులకనగా మాట్లాడడం, వ్యంగ్యమైన మాటలు విసరడం ఇటువంటివి మన ప్రవర్తనను దిగజారుస్తాయి. ఏదైనా విషయం మీద మాట్లాడేటప్పుడు సూటిగా స్పష్టంగా, వినేవారికి చక్కగా అర్ధం అయ్యేలా, స్పుటమైన గొంతుతో మాట్లాడాలి. నలుగురిలో మాట్లాడడానికి భయంగా ఉన్నపుడు మనకు బాగా తెలిసిన వాళ్లతో కొంచెం సేపు మాట్లాడి అపుడు కొత్త వారితో మాట్లాడాలి. మాటల్లో, అతిశయం, పిల్లల చదువుల గురించో, కొత్తగా కొన్న ఆస్తి గురించో గర్వం ఉండకూడదు.అన్నీ నాకే తెలుసు అన్నట్లు మాట్లాడడం, నా మాటే చెల్లాలి అన్నట్టు మాట్లాడడం తగదు. మనం మాట్లాడేటప్పుడు వినేవాళ్ళకు వినసొంపుగా ఉండాలి. అలాగే ఇతరులు మాట్లాడేటప్పుడు మనం కూడా శ్రద్ధగా వినాలి. ఏదో చెప్పావులే,  నువ్వు చెప్పేదేంటి, నేను వినేదేంటి అన్నట్టు వినకూడదు. మన హావభావాలు కూడా సంస్కారంతో ఉండాలి. అలాగే దూరంగా ఉన్నవారి గురించి చాడీలు చెప్పడం, నెగటివ్ గా మాట్లాడడం మన సంస్కార లేమిని తెలియజేస్తాయి.

 గోళ్ళు కొరకడం, తల గోక్కోవడం, మాటిమాటికీ ఊత పదాలు వాడడం, పక్క వాళ్లకు చిరాకు తెప్పిస్తాయి. ఆహారం తీసుకునే విషయం లో కూడా, మొదట్లోనే ఎక్కువ వడ్డించు కోకుండా అన్నిటినీ కొంచెం కొంచెం రుచి చూసి బాగా నచ్చినది మరి కొంచెం వడ్డించుకోవాలి. ముందే ఎక్కువ తీసుకుని పళ్ళెం లో వృధా చేయడం సరికాదు. అలాగే తినేటప్పుడు శబ్దం చేస్తూ తినడం, ప్రతి పదార్ధానికీ వ్యాఖ్యలు చేస్తూ తినడం సరికాదు.

మనకు గానం, నృత్యం ఇటువంటి వాటిల్లో ప్రవేశం ఉన్నపుడు ఎవరైనా అడిగిన వెంటనే పాడాలి. మొహమాటం ఉంటె సున్నితంగా తిరస్కరించాలి. అంతే కానీ, ఎక్కువ సేపు బ్రతిమాలించు కోవడం, ఆఖరికి పాడడం, ఇలా చేయకూడదు. మరోసారి మీ మీద వారు దృష్టి పెట్టరు.

చిన్న పిల్లలను పార్టీలకు, ఫంక్షన్లకు తీసుకేల్లినపుడు వారు కూడా అందరితో కలుపు గోలుగా, స్నేహంగా ఉండేటట్టు ఇంటివద్దనే అలవాటు చేయాలి. వారికీ కూడా అందరినీ పలకరించడం నేర్పాలి. ఏదో ఒక విషయం గురించి, మొండి పట్టు పట్టడం, మిగిలిన పిల్లలతో పోట్లాడడం,  ఇటువంటివి జరిగినపుడు పెద్దలు సున్నితంగా వ్యవహరించాల్లి. పిల్లల్లో ఎవరిదో ఒకరిదే తప్పు అని నిర్ణయిన్చాకుండా అందరికీ సర్ది చెప్పాలి.

ఈ విధంగా చేస్తే, పార్టీల్లో, మీరు అందరికీ కేంద్ర బిందువై, అందరి మన్ననలు పొందుతారు. ఏమంటారు?