Wednesday, 27 August 2014

అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు...

భారతీయులు అనాదిగా ప్రకృతిని పూజిస్తున్నారు. చెట్లు, చేమలు, నీరు, నిప్పు, నదులు, సముద్రాలు వీటన్నిటినీ పూజించడం మన సంప్రదాయం. దీని వెనుక పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడే గొప్ప ఆలోచన ఉంది. దేవుడి పేరు చెప్తేనే కానీ మనుషులు వినరు అనే ఉద్దేశ్యంతో పెద్దలు దేవుడికి, ప్రకృతికి , పర్యావరణానికి లింక్ పెట్టి ప్రకృతిని పూజించే అలవాటు చేసారు. రాను రాను మనిషికి తెలివి తేటలు( మూర్ఖత్వం), స్వార్ధం పెరిగి తను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు, తను నివశిస్తున్న భూమిని, తన చుట్టూ ఉన్న ప్రకృతిని తనే నాశనం చేసుకుంటున్నాడు.

మనం జరుపుకునే పండగలు అన్నీ పర్యావరణానికి ఎంతో కొంత దోహదం చేసేవే. మరీ ముఖ్యంగా వినాయక చవితి. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పూజ విధానం పత్రీ పూజ ఎంతో ముఖ్యం. వానలు కురిసే ఈ ఋతువులో చెట్ల ఆకులను ఈ పత్రిపూజ పేరుతొ కోయడం వల్ల చెట్లు మళ్లీ చక్కగా చిగురించి చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పూజలో చెప్పే 21 రకాల పత్రాలు ఎంతో ఔషధ గుణాలతో కూడి ఉన్నవి కనుక, అవి స్వయంగా సేకరించి పూజ చేయడం వలన చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.

 ఈ పండుగ నాడు వినాయకుడికి, ఎక్కువ పులుపు, కారం లేకుండా, నూనె లేకుండా కేవలం నెయ్యి తోనే వండే పదార్థాలు నివేదించి, మనం ఆ ప్రసాదాన్ని సేవించడం ద్వారా, ఎండలు తగ్గి, వానలు పడుతూ ఉన్న ఈ సమయం లో వాతావరణ మార్పుల ద్వారా వచ్చే అనారోగ్యాలు దూరం అవుతాయి. కొత్తగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు.

ఈ పండుగకు మొట్ట మొదటగా సామాజిక గుర్తింపును తెచ్చి ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఒక్క తాటి మిద నడపడానికి శ్రీ బాలగంగాధర తిలక్ గారు వీధులలో పందిళ్ళు వేసి, వినాయక విగ్రహాలు నెలకొల్పి సాముహిక పూజలు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించారు. దీనివల్ల ప్రజలలో ఐక్యత సిద్ధిస్తుంది.

అన్నిటి కన్నా ముఖ్యంగా మనం పూజించే వినాయక విగ్రహాలను కేవలం మట్టితోనే తయారుచేయడం వెనుక ప్రకృతి పరంగా గొప్ప ఆలోచన ఉంది. చెరువుల లోని మట్టితో అందరికీ కావలసిన వేల వేల వినాయక ప్రతిమలను తయారు చేయడం వల్ల చెరువులలో మట్టి పూడిక తీసినట్టు అవుతుంది. చెరువులు శుభ్రపడతాయి. ఇది పర్యావరణానికి గొప్ప మేలు చేస్తుంది.

కానీ మనం ఈనాడు ఏమి చేస్తున్నాం? గొప్పలకు పోయి పోటాపోటీగా ఒకరి కంటే ఒకరు గొప్ప అని నిరూపించుకోవాలని పెద్ద పెద్ద విగ్రహాలను మట్టి తో కాకుండా, ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసి, వాటికీ రసాయన రంగులు వేసి వాటిని ఊరి చెరువులలో నిమజ్జనం చేస్తున్నాం. దాని ద్వారా నీటి కాలుష్యనికీ, నీటిలో నివశించే అనేక జీవుల మరణానికి కారణం అవుతున్నాం. ఆ రసాయన రంగులు నీటిలో కరగకుండా అవి వెదజల్లే వాయువుల ప్రభావానికి గురి అవుతున్నాం. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తున్నాం. మన నాశనాన్ని మనమే ఆహ్వానిస్తున్నాం. ఇలా మరికొన్ని సంవత్సరాలు జరిగితే వచ్చే ఆపదను మనం గ్రహించలేక పోతున్నాం.

ఈ ఆపద నుంచి బయట పడాలి అంటే అందరూ దయచేసి మట్టి విగ్రహలనే పూజించండి. స్థానిక కళాకారులను ప్రోత్సహించండి. మన ఊరి చెరువులను మనం కాపాడుకుందాం. పర్యావరణాన్ని కాపాడుదాం.....

వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభా,
నిర్విఘ్నం కురుమే దేవా, సర్వ కార్యేషు సర్వదా.....

Wednesday, 20 August 2014

మా తరం వాళ్ళం చాల అదృష్టవంతులం. (అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు ) ఎందుకంటే, మేము ప్రయాణాలకు పాసెంజర్ రైళ్ళు, బొగ్గు రైళ్ళు, ఎక్స్ప్రెస్స్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ళు అన్నీ ఉపయోగించాము. అలాగే చిన్నతనాల్లో జనరల్ కంపార్ట్మెంట్ లు, తరువాత రిజర్వేషన్ , ఫస్ట్ క్లాసు కోచ్ లు, ఇప్పుడు AC  కూడా ఎక్కుతున్నాం. ఇప్పటి వాళ్ళకి బొగ్గు రైళ్ళు తెలియదు, రాక్షసి బొగ్గు కాలుతుంటే వచ్చే ఆ కమ్మటి వాసనా తెలియదు. అలాగే మేము సమాచారం తెలియడం కోసం, ఉత్తరాలు, ఫోన్ అయితే, ట్రంక్ బుకింగ్, STD , ఇప్పుడు మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్, whatsapp  అన్నీ వాడాము. ఇప్పటి వాళ్ళకు ఉత్తరాలు వ్రాసి మనసులో భావాలూ తెలియపరుచుకోవడం, మళ్లీ తిరుగు టపాలో జవాబు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడడం, అసలు postman  అంటేనే ఒక చుట్టం లాగా ఫీల్ అవ్వడం తెలియదు. అలాగే పుట్టినరోజు పేరంటాలు, శ్రావణ మాసం పేరంటాలు, వినాయక చవితి కి పత్రీ స్వయంగా కోసుకుని రావటం,  ఒక కాలనీ పిల్లలు అందరూ కలిసి ఆషాఢమాసం లో గోరింటాకు కోసం, ఉగాది ముందు రోజు వేపపువ్వు కోసం గుంపులు గుంపులు గా వెళ్లి స్వయంగా కోసుకునే ముచ్చట్లు ఏవి ఈ తరం వాళ్ళకు తెలియవు. ఏదో బజారుకు వెళ్లి 10 రూపాయలు పెట్టి కొనుక్కురావడమే కానీ, గుంపులుగా వెళ్తూ అల్లరి చేస్తూ వెళ్ళే మజా వీళ్ళకు తెలియదు.

  ఈ తరం పిల్లలకు సూర్యోదయం, సూర్యాస్తమయం స్వయంగా చూసి అనుభవించడం తెలియదు. ఆరుబయట వెన్నెల్లో కథలు వింటూ పడుకోవడం, డాబా మిద వెన్నెల్లో భోజనం చేయడం, వేసవి సెలవులలో ఆరుబయట ఆడుకోవడం, సూర్యోదయం తో పాటు ఆహార వేటకు వెళ్ళే పక్షుల గుంపులు చూడడం, వీటిలోని అందాలు ఏ మాత్రం తెలియవు.

పక్కింటి వాళ్ళ జామ చెట్టునో, మామిడి చెట్టునో రాళ్ళతో కొట్టి కాయలు తినడం (ఎందుకో అలా తింటే చాలా రుచిగా ఉండేవి ), స్కూల్ కు నడిచి వెళ్తూ ఇల్లు కట్టుకోవడానికి ఎవరో తెప్పించుకున్న ఇసుక గుట్టలు, కంకర గుట్టలు ఎక్కుతూ, దిగుతూ వెళ్ళడం, ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఈరోజుల్లో వాళ్ళకు తెలియదు.

ఇంకో విషయం ఏమిటంటే, మా తరం వాళ్ళకు ఉద్యోగాలు చిన్నవే, జీతాలు చిన్నవే. అయినా మాకు అసంతృప్తి లేదు. ఒక్కో రూపాయి దాచుకొని కొనుక్కున్న వస్తువులు మాకెంతో అపురూపం. పాత టీవీ అమ్మేసి, రిమోట్ కంట్రోల్ ఉన్న టీవీ కొనుక్కున్నపుడు పాత టీవీ ఎవరికో ఇచ్చేస్తుంటే ఎంతో విలవిల లాడిపోయాం. మా వస్తువులతో మాకు అంత attachment . సంవత్సరాల తరబడి ఉన్న ఇల్లు మారాలన్నా, transfer అయి, ఊరు మారాలన్నా, ఏదో ఎమోషన్. ఇపుడు ఉద్యోగాలు పెద్దవి, జీతాలు పెద్దవి. పాతిక సంవత్సరాలు రాకుండానే సొంత స్థలాలు, ఇల్లు కొనుక్కున్నా మీకు  సంతృప్తి లేదు, వేటి మీదా మమకారం లేదు, ఇంకా ఏదో లేదు అనే వెలితి భావనే.

ఒకప్పుడు ఇంట్లో పెద్ద కొడుక్కు ఉద్యోగం, సంపాదన వస్తే, ఇంటి సమస్యలు అన్నీ తీరినట్టే అని భావించే వారు. తన కన్నా చిన్నవాళ్ళను పెద్ద కొడుకే చదివించేవాడు. తల్లితండ్రులు కూడా నిశ్చింతగా ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ముల సంగతి సరే,భార్యా భర్తల మధ్యనే నీది, నాది అనే బేధాలు. ఎవరి జీతం వారిది, ఎవరి లోన్లు వాళ్ళవి, ఎవరి ఖర్చు వారిది, ఎవరి బ్రతుకు వాళ్ళది. మనది అనే భావన లేదు ఇప్పుడు. ఇక ఇలాంటివాళ్ళు తల్లితండ్రులను, అన్న దమ్ములను, అక్క చెల్లెళ్ళను ఏమి చూస్తారు? నీ చుట్టాలు వస్తే నీ ఖర్చు. నా చుట్టాలు వస్తే నా ఖర్చు. ఇదీ ఇవాల్టి పోకడ.

మొత్తం మీద మేము కష్టపడినా జీవితం లో ఉండే ఆనందాన్ని అనుభవించాము. కష్టం వెనకాల ఉండే సుఖాన్ని చూసాము. అత్తమామలతో గొడవలు ఉన్నా, వారి నీడన ఉండే సౌఖ్యం చూసాము. గొడవలు వస్తాయి అని వాళ్ళను వద్దు అనుకోలేదు. ఆడపడుచులు, మరుదులు బాధ్యతలు తీర్చాము, ఇపుడు వాళ్ళ నుంచి గౌరవమూ పొందుతున్నాము. ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ బాధ్యతలు నావి అని అనుకోని నిర్వర్తిన్చాము.

ఇపుడు పుట్టుక తోనే అన్ని సౌఖ్యాలు అమరిపోతున్నాయి కాబట్టి ఈ తరం వాళ్ళకు కష్టం అంటే తెలియడం లేదు, దాని ద్వారా సుఖం యొక్క విలువా తెలియడం లేదు. అందుకే మీకు ఎన్ని ఉన్నా తృప్తి లేదు. మీరు డబ్బు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. దానిని ఖర్చు పెట్టడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. కానీ ఆ డబ్బు మీకు ఆనందాన్ని , తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ అయింది కాబట్టి. తల్లి తండ్రుల ప్రేమ కూడా మీకు ఎక్కువ దొరుకుతోంది కాబట్టి మీకు ఆ మమకారం యొక్క విలువ కూడా తెలియడం లేదు. మీకు పెద్ద పెద్ద సమస్యలు లేవు, బాధ్యతలు లేవు అందుకనే మీకు చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా కనబడతాయి. అవి మీరు పరిష్కరిచుకో లేకపొతున్నారు. అందుకే ఈరోజుల్లో, ఆత్మహత్యలు, విడాకులు ఎక్కువ అయినాయి. ఈ విషయం మీద ఇంకోసారి చర్చించుకుందాం.

సెలవు.

Sunday, 10 August 2014

మిత్రులకు వందనం...

ఈ మధ్య నేను ఒక మంచి పుస్తకం చదివాను. పుస్తకం పేరు, రచయిత్రి పేరు ఇక్కడ అప్రస్తుతం . అందులో విషయం ఏమిటంటే, సమాజం లో ఎంతో అట్టడుగు వర్ణం బాలికలు, ఆర్ధికం గా చాల వెనుకబడిన కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఎంత అంటే కనీసం రెండు రోజులకు ఒకపూట కూడా తినడానికి దొరకని పరిస్థితి. కుటుంబంలో ఆడపిల్ల కన్నా, మగపిల్లవాడు ఎక్కువ అనే నేపధ్యం నుంచి వచ్చిన బాలికలు, ఎవరి స్పూర్తి లేకుండా, వారి స్వంత ఆలోచనలతో, మనకు ఇటువంటి జీవితం వద్దు, మనం కూడా ఏదైనా సాధించాలి అనే తపనతో, పుస్తకాలు కూడా లేకుండా, కేవలం చదువు మీద, భవిష్యత్తు మీద ఉన్న నమ్మకంతో నానా కష్టాలు పడి చదువుకుని, సంఘం లో ఉన్నతమైన స్థితిలో నిలిచినా మహిళల గాధలు అవి. అందులో ఒకరు అమెరికాలో సైంటిస్ట్ గా, ఒకరు డాక్టర్ గా,కవయిత్రిగా , ఒకరు ప్రొఫెసర్ గా ప్రసిద్ధి పొందారు. వాళ్ళ జీవితాల గురించి చదువుతుంటే ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, మనుషులు ఇంత దుర్భర పరిస్థితులలో కూడా జివిస్తారా? అనిపించింది. ఉన్న ఒక్క ముద్ద కోసం కొట్టుకునే బ్రతుకులు కూడా ఉంటాయా? అనిపించింది. అటువంటి ప్రతికూల  పరిస్థితులలో, ఎందుకురా ఈ జీవితం అనుకోకుండా, చదువుకుని అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన మహిళలకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయాను. అటువంటి వారిని ప్రతి బాలికా, ప్రతి స్త్రీ స్పూర్తి గా తీసుకోవాలి. అన్నీ అమర్చి పెట్టినా, చిన్న చిన్న విషయాలకే చికాకు పడడం, ఏంటి ఈ వెధవ జీవితం అనుకోవడం, ఉన్న సౌకర్యాలలో ఏమాత్రం కొరత వచ్చినా ఆందోళన పడిపోవడం ఈ తరం పిల్లలకు బాగా అలవాటు అవుతున్నాయి. దీనికి కారణం, మానసిక స్థైర్యం లేకపోవడం, తల్లి తండ్రుల ఆలోచనా ధోరణి, సంపాదన ఎక్కువై, పెద్ద పెద్ద సమస్యలు లేకపోవడం వలన, బ్రతుకును గడపడానికి ఎక్కువ సంఘర్షణ అవసరం లేకపోవడం వలన, చిన్న చిన్న సమస్యలే, పెద్ద పెద్ద విషయాలుగా పరిగణించి అనవసర ఆందోళన పడుతున్నారు. ఈరోజుల్లో పిల్లలకు ఒక పార్టీకి వెళ్ళలేక పొతే బాధ, అనుకున్న రోజున పిజ్జా తినలేక పోతే బాధ, స్నేహితుల పుట్టిన రోజుకి బహుమతి ఇవ్వలేకపోతే బాధ, వేసుకునే డ్రెస్ పైకి మాచింగ్ జెవేల్లరీ లేకపోతే బాధ. మనకన్నా డబ్బు ఉన్నవాళ్ళను చూసి వాళ్ళలా మనం ఉండలేక పోతున్నాం అనే బాధ. దీనికి కారణం జీవితం పైన సరి అయిన అవగాహనా లేకపోవడమే. ఇందులో తల్లితండ్రుల తప్పు కూడా ఉంది. నిజానికి చాల శాతం తల్లితండ్రులు ఈ రోజున మంచి స్థితిలో ఉన్నా కూడా, వారు జీవితం మొదలు పెట్టిన తోలి రోజుల్లో, ఆర్ధికంగా, ఇతరత్రా కష్టాలు పడినవారే. వారు ఏమనుకున్తున్నారంటే, మేము కష్టాలు పడ్డాము కాబట్టి, మా పిల్లలు ఆ కష్టాలు పడకూడదు అని ముద్దుగా, గారాబంగా చూస్తూ అడిగిన వన్నీ అందజేస్తున్నారు. దానితో, పిల్లలకు అసలు బాధ్యత తెలియకుండా పోతోంది. చిన్న చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారు. వివాహానంతర జీవితం లో కూడా సమస్యలకు ఇదే కారణం అవుతోంది. ప్రతి చిన్న విషయానికి అవగాహనా లేకుండా గొడవలు పడడం, నీతో నాకు సరిపడదు, విడిపోదాం అనే నిర్ణయానికి రావడం. ఫలితంగా జీవితం లో అంతులేని అశాంతి.

పరిష్కారం లేని సమస్యలు ఉండవు. సమస్య యొక్క మూలాన్ని వెతుక్కొని, నిదానంగా, సహనంతో ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక్కటి గమనించుకోండి. తిండికి కూడా లేని వారు, సరి అయిన ఆరోగ్యం లేనివారు, సరి అయిన రవాణా సౌకర్యాలు కూడా లేని మారుమూల గ్రామాల వాళ్ళు , వికలాంగులు ఎంతోమంది చదువులోనే కాక, వివిధ రంగాలలో రాణిస్తున్నారు. వారందరిదీ జీవన పోరాటం, ఎంతో శ్రమించి  వారి గమ్యాన్ని చేరుకుంటున్నారు. దానిలో విజయం సాధిస్తున్నారు. వారితో పోలిస్తే చాల మంది జీవితం అమర్చి పెట్టినట్టు ఉంటోంది. దానిని గౌరవించండి.  జీవితాన్ని ప్రేమించండి. సమస్యల నుంచి పారిపోకుండా పోరాడండి. విజయం సాధించండి.