Thursday, 24 December 2015

కోరికలు దు:ఖానికి హేతువులు....మహనీయులు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. దేనిమీద అయితే కోరిక కలిగి ఉన్నామో దానిని సాధించలేనపుడు దు:ఖం వస్తుంది. అది ఆగ్రహం గా మారుతుంది. మనిషి ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాడు. ఆక్షణంలో మరిన్ని తప్పులు చేస్తాడు. భగవద్గీతలో భగవానుడు బోధించినది కూడా ఇదే. కోరికలను జయించాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాలు జ్ఞాన సముపార్జనకు అడ్డంకులు అవుతాయి. కనుక ముందుగా అరిషడ్వర్గాలను జయించగలగాలి. అట్టి స్థితిని సాధించిన  వారు జ్ఞాన సంపన్నులవుతారు.  యుక్తాయుక్త విచక్షణ కలిగిఉండాలి. ఏది ఎంతవరకు మనకు అవసరమో గ్రహించగలిగి ఉండాలి. పరుల సొమ్మును ఆశించకూడదు. పరుల సొమ్ముపై మనకు హక్కు ఎందుకు ఉంటుంది? మనకు లభించిన దానితో సంతృప్తి చెందే లక్షణం అలవాటు చేసుకోవాలి... సంతృప్తి ఉన్న చోట ఆశలకు, కోరికలకు, స్థానం లేదు. ప్రశాంతమైన జీవితం గడపడానికి మార్గం ఇదే.
సర్వేత్ర సుఖిన:స్సంతు , సర్వేస్సంతు నిరామయా, సర్వేభద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దు:ఖమాప్నుయాత్....అందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఉండాలి, ఎవ్వరూ దు:ఖానికి లోను కాకూడదు అని భావించే గొప్ప బారతీయ సంస్కృతి మనది. సర్వజీవుల లోనూ భగవంతుడున్నాడని, కనుక ప్రతి ప్రాణినీ ప్రేమించాలని, ఏచిన్న ప్రాణికీ కీడు తలపెట్టరాదనీ బోధించాయి మన శాస్త్రాలు. దీనుల యెడ కరుణ కలిగి ఉండాలని, మానవసేవయే మాధవ సేవ అని కూడా మన సంస్కృతి మనకు చెప్తుంది. దయ, కరుణ కలిగిన వారు పరుల దు:ఖాలలో పాలుపంచుకుంటారు. భగవంతుడు మనలను సృష్టించినప్పుడు ఎంతో నిష్కల్మషంగా ఈ భూమి మీదకు పంపాడు. కానీ,మనం ఎదుగుతున్న క్రమంలో మానవతను కోల్పోతున్నాం...హృదయాలను పాషాణాలుగా మార్చేసుకుంటున్నాం. మనకు తరతరాలనుండీ వస్తున్న ఆస్థి మన పురాణాలు, ధర్మ శాస్త్రాలు. వాటిని నిర్లక్ష్యం చేయడం వలన మన సంస్కృతి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ఆదర్శదైవం శ్రీరాముడు 16 కళలతో విలసిల్లిన పూర్ణపురుషుడు. కరుణారస సాగరుడు. రామసేతు నిర్మాణంలో పాలుపంచుకున్న ఉడుత వంటి చిన్నప్రాణిని సైతం దయతో అనుగ్రహించాడు. ఇక శ్రీకృష్ణుడు ఎన్ని రకాలుగా దీనజనులను ఆదరించాడో లెక్కేలేదు..కుబ్జ, కుచేలుడు, వీరందరినీ కరుణతో బ్రోచినవాడు మాధవుడు. ఇంకా బలి, శిబి చక్రవర్తి, మనకు కరుణ, దయ గురించి తమ ప్రవర్తనల ద్వారా నేర్పించారు. ఈ కాలానికి వస్తే, క్రీస్తు, గాంధీజీ, రమణమహర్షివంటివారు దీనజన సేవను చేసి చూపించి మనకు ఆదర్శమూర్తులైనారు. అసహాయులను ఆదరించడంలో గొప్ప తృప్తి ఉంది. మనకు ఎంతో అదృష్టం ఉంటేనేకాని, దీనజన సేవాభాగ్యం లభించదు..అటువంటి సేవా అవకాశాల్ని లభించేలా చేయమని ప్రార్ధించడమే మానవజన్మకు సార్ధకత నిస్తుంది.
కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు...సాధించాలనే పట్టుదల, సత్సంకల్పం, అవిరామమైన కృషి ఉన్నప్పుడు విజయం తప్పక సిద్ధిస్తుంది..కార్యోన్ముఖులైనవారు మార్గమధ్యంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా కృంగిపోక తమ కృషిని కొనసాగిస్తారు....పరాజయం పాలైనా మరల మరల తమ ప్రయత్నాన్ని కొనసాగించే ధీరులను మాత్రమే విజయం వరిస్తుంది. ఈనాడు పేరుప్రఖ్యాతులు పొందినవారంతా వారి వారి రంగాలలో అవిరళ కృషిచేసిన ఫలితంగానే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం సాధించడానికి సంకల్పం, కృషితోపాటు దైవబలం కూడా అత్యవసరం....దైవకృపను పొందడానికి దర్మాచరణ ఒక్కటే మార్గం....దర్మమార్గం ద్వారా సాధించే విజయం శాశ్వతం గా నిలబడుతుంది...అర్జునుని వలే లక్ష్యం మీదనే చెడని ఏకాగ్రతతో దృష్టి నిలిపిన సాహసులే విజయానికి అర్హులు అని శాస్త్రవచనం.

Wednesday, 23 December 2015

ఎల్లప్పుడూ పెదవుల మీద చిరునవ్వుతో కనిపించేవాళ్ళు అందరి మనసులలో స్థానం సంపాదించుకుంటారు. ధర్మబధ్ధమైన జీవితం గడిపేవారిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంటుంది. ఆ ప్రసన్నత , ఆ ఆనందం యొక్క కాంతి వారి వదనంపై ప్రతిఫలిస్తుంది. ఇటువంటి ఆనందం కలిగిన వెంటనే వారిలోని విరుధ్ధభావాలు తొలగిపోతాయి. పొరుగువారిని ప్రేమించే లక్షణం అలవడుతుంది. పాపకర్మలు చేయడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవసరం లేని ప్రశాంత జీవనం అలవాటు అవుతుంది. మనసా, వాచా, కర్మణా పాపకర్మలు చేయకుండా నియంత్రించుకోగలిగే సామర్థ్యం పట్టుబడుతుంది. నిర్మలమైన అంత:కరణ కన్నా మించిన జ్ఞాన సంపద మరొకటిలేదు...  ఈ స్థితిని పొందినవారందరూ ముముక్షువులే....ఇది ఒక మహాయోగం,....ఇది సాధించినవారందరూ యోగసాధకులే....
లక్ష్మిదేవి అనుగ్రహం పొందడానికి మనం ఎన్నెన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అష్టలక్ష్మి రూపాల్లో పూజలు అందుకునే లక్ష్మీదేవి ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుధ్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపునిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగల ఆరోగ్యం --=ఈ అన్నిటి రూపాల్లోనూ విలసిల్లుతోంది. కేవలం, డబ్బు, బంగారమే కాక, వీటిలో ఏ కొన్ని మనకు లభించినా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు లభించినట్టే. అన్నిటినీ మించి "నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను, అందుకు భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడను." అని ఎవరు సంతృప్తిగా ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం మిక్కిలిగా లభించినట్టు అర్ధం. ఈ ఆత్మతృప్తి ఉన్నచోటును లక్ష్మీదేవి వదిలిపోదుట. ఆమే అనుగ్రహం పొందాలంటే కొన్ని అర్హతలు సంపాదించవలసి ఉంటుంది. ప్రియభాషణం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమాభిమానాలు, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ, మితభోజనం, మితనిద్ర, ఇవన్నీ ...గట్టి గట్టిగా అరచుకోవడం, అందరితో పోట్లాటలు పెట్టుకోవడం, ఇతరులను చులకనగా చూడడం, ఆత్మస్తుతి, పరనింద ఇవన్ని మన గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి చోట లక్ష్మి నివసించదు అని పెద్దలు చెపుతారు. పూజలు,  నోములు చేయలేకపోయినా, పై మంచి లక్షణాలను అలవరచుకుంటే, కావలసినంత మన:తృప్తి, అఖండమైన లక్ష్మీకటాక్షం లభిస్తాయి.

Monday, 30 November 2015

మన జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఇందులో ఎన్నో స్టేషన్లు, ఎన్నో దారులు, కొన్ని ముచ్చట్లు, కొన్ని ప్రమోదాలు, కొన్ని ప్రమాదాలు... మనం పుట్టినప్పుడే ఈ జీవితరైలు ని ఎక్కుతాము. మన తల్లితండ్రులు మనకి టిక్కెట్టు కొని ఎక్కించారన్నమాట. వారు మనతో మన జీవితాంతం ఉంటారనుకొని మనం భ్రమపడతాం. కాని, మనలను ఒంటరిగా వదిలేసి, వారి సమయం వచ్చినపుడు వాళ్ళు రైలు దిగిపోతారు......ఇదంతా జరిగేలోపే మరికొంతమంది రైలు ఎక్కుతారు. అందులో కొంతమంది, మన తోబుట్టువులుగా, చుట్టాలుగా, స్నేహితులుగా, పిల్లలుగా గుర్తిస్తాం మనం....చాలామంది మన జీవితాలలో శాశ్వతమైన శూన్యాన్ని మిగిల్చి, వారు వారి గమ్యాలు వచ్చినపుడు రైలు దిగిపోతారు.... మరికొంతమంది, వారెప్పుడు ఖాళీ చేసారో కూడా మనం గుర్తించకుండానే వెళ్ళిపోతారు.... ఈ ప్రయాణంలో సంతోషం, దు:ఖం, ఆశ, నిరాశలు, పలకరింపులు, వీడ్కోళ్ళు, అన్ని కలగలిపి ఉంటాయి....తోటి ప్రయాణీకులతో సరదాగా ఉంటూ, వారికి అవసరమైన సహాయం చేస్తూ, ప్రేమగా, ఆదరణగా, వారికి సౌకర్యవంతంగా మెలిగినపుడు మన ప్రయాణం సాఫీగా జరిగింది అని చెప్పొచ్చు.... అటువంటి ప్రయాణీకులను అందరూ ప్రయాణమంతా గుర్తుపెట్టుకుంటారు కూడా...మన గమ్యం ఎంతసేపేట్లో వస్తుందో, ఎక్కడ మనం దిగిపోవాలో మనకు తెలియదు. ...ఇదే ఈ ప్రయాణంలోని రహస్యం..అందుకే మనం మనకు సాధ్యమైనంత సౌహార్ద్రత తో ప్రయాణించాలి......తోటి ప్రయాణీకులతో చిన్న చిన్న సర్దుబాట్లు, క్షమాపణలు---ఇవన్నీ తప్పనిసరి......మందగ్గరున్నది మనం పంచుకోవడం నేర్చుకోవాలి.....ఎందుకంటే, మనం వీడ్కోలు చెప్పవలసిన సమయం వచ్చినపుడు, మనం మన మధుర స్మృతులన్నిటినీ, వెనుక మిగిలిన వాళ్ళకు వదిలేసి, ఈ జీవితప్రయాణం లో సెలవు తీసుకుంటాం. ...మన జ్ఞాపకాలు మిగిలిన వారికి కూడా మధురంగా ఉండి, మనల్ని వారు గుర్తుపెట్టుకోవాలి కదా......
నా ప్రయాణంలో నాకు కలిసిన నా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు.....నా ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చినందుకు......
నమస్తే...
మనందరికీ తెలిసిన "టైటానిక్" షిప్ సముద్రంలో మునిగిపోయేటప్పుడు అక్కడ మరో మూడు నౌకలు ఉన్నాయట...అందులో ఒక నౌక పేరు శంప్సన్....ఇది టైటానిక్ కు కేవలం 7 మైళ్ళ దూరంలో ఉందిట. ప్రమాదం జరిగునప్పుడు నౌక సిబ్బంది ప్రమాదానికి సంకేతంగా వదులుతున్న తెల్లటి మంటలను ఈ నౌకలోని సిబ్బంది గుర్తించారు...అయినప్పటికీ వారు దొంగతనంగా సముద్రంలో వేట చేస్తున్నందువలన వారు దగ్గరలోనే ఉన్నప్పటికీ సహాయం చేయటానికి జంకారు...తమ నేరం ఎక్కడ బయటపడుతుందో అని...అందుకే టైటానిక్ లొని వారు గుర్తించకుండా సరిగ్గా దానికి వ్యతిరేకదిశలో వెళ్ళిపోయారు. ...ఇక అక్కడ ఉన్న రెండవ షిప్ "కాలిఫోర్నియ"14 మైళ్ళ దూరంలో ఉందిట..ఈ నౌక సిబ్బంది కూడా ప్రమాద సంకేతమైన తెల్లని మంటలను చూసినప్పటికీ, చుట్టూ మంచుగడ్డలు ఉండడం వలన, అక్కడికి చేరలేమేమోనని సంశయించి, రేపు తెల్లారాక చూద్దాములే అని వెళ్ళి పడుకున్నాడట ఆ నౌక కేప్టెన్.....ఇక అక్కడ ఉన్న మూడో నౌక 58 మైళ్ళ దూరంలో ఉన్న "కార్పతియా"...టైటానిక్ నుంచి వెలువడుతున్న ఆక్రందనలను రేడియో లో విని, ఎదో ప్రమాదం శంకించి ఆ నౌక కేప్టెన్ వెంటనే తనకు అక్కడికి వెళ్ళే దిశను, మార్గాన్ని చూపమని దేవుడిని ప్రార్ధించి, మంచు గడ్డలు అడ్డం వస్తున్నా సరే వాటిని నేర్పుగా తప్పించుకొని, టైటానిక్ వద్దకు చేరుకుని అందులో ప్రమాదంలో ఉన్న 705 మందిని రక్షించగలిగాడు.

ఇది నిజంగా జరిగినదా లేదా కల్పనా అనే విషయం పక్కన పెడితే, ఈ నౌకల కేప్టేన్ల మాదిరిగానే మనలో కూడా మూడు రకాలైన మనుషులు ఉన్నారు. మొదటిరకం, ఎవరు అవసరంలో ఉన్నాకాని, తమ పని తాము చూసుకునే రకం...రెండవవారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవులే, ఇప్పుడు ఎలా సహాయం చేయడం, ఇప్పుడు కుదరదు, ఇంకోసారి చూద్దాంలే, అనుకుని తమకు తామే సర్ది చెప్పుకుని, సమస్య నుంచి తప్పించుకునే రకాలు....ఇక మూడవ రకం వారు, ఎట్టి పరిస్థితులలోనైనా అడిగిన వారికి తప్పకుండా సాయం చేసేవారు. ఈ కథలో మూడవ నౌక కేప్టెన్, పని పూర్తి అయ్యాక, వెనక్కి తిరిగి తాను వచ్చిన దారిలో ఉన్న మంచు గడ్డలను చూసి, ఈ కార్యం సఫలం అయిందంటే తానొక్కడి వలన కాదని, కనిపించని భగవంతుడే నాకు చేయూత నిచ్చి, అంతమంది ప్రాణాలు కాపాడాడని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుని మీద భారం వేసి, తాను చెయదలచుకున్న మంచి పనిని ఏమాత్రం సంశయం లేకుండా చేయడానికి ముందుకు దూకే వారికి ప్రతీక ఈ నౌక కేప్టెన్. అలాగే ఉత్తములు తాము ఇతరులకు చేసిన సహాయాన్ని తమ ప్రతిభ అని చెప్పుకోకుండా, భగవంతుడే తమను ఈ కార్యానికి ఎన్నుకున్నాడు అని వినయంతో ఉంటారు, తమ వలన కొంతమందికి అవసరాలు తీరాయి అని సంతృప్తి పడతారు....

మనమేమి చేసినా, మనస్సాక్షి గమనిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మెళకువతో, జాగరూకతతో వ్యవహరించటమే....


ఇంకో చిన్న కథ....

ఒకరోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియం లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు...ఆ హాలు నిండా అద్దాలు ఉండడం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్ళు బయటపెట్టి అరిచింది....చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేసాయి. గట్టిగా అరిచింది...అద్దాలలో కూడా అలాగే కనిపించింది. ఖాళీ గా ఉండడం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్ళు వచ్చి చూసే సరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటి నిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిధ్ధంగా ఉంది. కాపలావాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవ్వరు దీనిమీద దాడి చేసారు అని....

ఆకుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది....వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది.

ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే.....అది మనకు మంచి కాని, చెడు కాని, చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన చుట్టూ జరుగుతునది అంతా మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు...ఈ దర్పణం ముందు ఆనందంగా పోజు ఇవ్వండి....అంతా ఆనందంగానే ఉంటుంది.

Saturday, 28 November 2015

ఇక వినాయక చవితి సందడే వేరు...ఇల్లిల్లూ తిరిగి బోలెడు పత్రి సేకరించుకొని వచ్చేవాళ్ళం. పాలవెల్లిని అలంకరించడం ఎంతో సరదా అయిన పని. ఆరోజు 9 మంది వినాయకులను చూడాలి అనే వంకతో ఇల్లిల్లూ తిరిగేసేవాళ్ళం...అప్పుడు బయట ఇన్ని పందిళ్ళు, ఇంత రచ్చ ఉండేది కాదు. కార్తిక మాసం పెద్దవాళ్ళతో సమానంగా ఉపవాసాలు, తెల్లారే లేచి స్నానలు చేసేసేవాళ్ళం...ఆ అలవాటు మార్గశిరం లో కూడా కంటిన్యూ చేసి, గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకునేవాళ్ళం. ఇక సంక్రాంతి కి భోగిపళ్ళ పేరంటాలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, పట్టుపరికిణీలు, పూలజడలు....ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే...

ధనుర్మాసం మా ఇంటి దగ్గర వేంకటేశ్వరస్వామి గుళ్ళో తిరుప్పావై చదివేవారు.మాకు దానిమీద అంత శ్రధ్ధ లేకపోయినా తరువాత పెట్టే ప్రసాదం మీద భక్తి బాగా ఉండేది. ఆ రుచి ఇంట్లో చేసుకునె దద్దోజనం, చక్కెరపొంగలి కి వచ్చేది కాదు ఎందుకో...బాదం ఆకుల్లో వేడివేడిగా పెట్టి ఇచ్చేవారు....పూజార్ల ఇళ్ళల్లో పుడితే చక్కగా అన్ని తినచ్చు అనుకునేవాళ్ళం. హరిదాసులు, కొమ్మదాసరి వాళ్ళూ, గంగిరెద్దుల వాళ్ళు, పిట్టల దొరలు, బుడబుక్కల వాళ్ళు, అందరూ వచ్చేవారు...గంగిరెద్దుల వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం, హరిదాసుకు ఒక వీధి తిరగగానే గిన్నె బియ్యంతో నిండిపోయేది...ఇప్పుడు వాళ్ళెవ్వరూ ఎక్కువ రావటంలేదు. బుడబుక్కల వాడు డమరుకం వాయించుకుంటూ వచ్చేవాడు...తలమీద ఇన్ని పక్షి ఈకలు పెట్టుకొని, నల్ల అంగీ తొడుక్కుని, అతన్ని చూస్తేనే భయం వేసేది....ఇంత పొడుగ్గా ఉండేవాడు...పిట్టలదొర మాటలు వింటుంటే కడుపుబ్బ నవ్వు వచ్చేది.....మాటలు కోటలు దాటించేసేవాడు. భోగిరోజు వస్తోందంటే ఇంటి వసారాలో ఉన్న చెక్కా ముక్కాకి కాపలా కాయవలసి వచ్చేది. ఎప్పుడొచ్చేవారో మగపిల్లలు చటుక్కున ఎత్తుకుపోయేవారు. అందరిళ్ళల్లో డబ్బులు అడిగి పెద్ద పెద్ద దుంగలు కొని తెచ్చి మంటలు వేసేవారు. ఆ చిరుచలిలో నులివెచ్చని భోగిమంట వేడిలో చలి కాచుకోవటం భలే సరదాగా ఉండేది.....సెలవులు కూడా పదేసి రోజులు ఇచ్చేవారు. పండుగ వస్తోందంటే పెద్ద పెద్ద డబ్బాల నిండుగా జంతికలు, సున్నుండలు, అరిసెలు, కజ్జికాయలు అవీ చేసి ఉంచేవారు. అందరూ అవన్నీ తిని అరాయించుకోగలిగేవారు. ఇప్పుడు ఇవాళ వండితే మర్నాటికే ఎవరూ తినడంలేదు.
అప్పుడు సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక టిఫిన్ తినేసి చీకటి పడేవరకు ఆడుకునేవాళ్ళం. వీధిలో ఉన్న పిల్లలందరూ స్నేహితులే...అందరం కలిసి ఆడుకునేవాళ్ళం....ఇక అట్లతద్ది ముచ్చట్లైతే చెప్పనే అక్కర్లేదు. అదో సందడి.....ఆ రోజు మాకు స్కూల్ ఓ గంట లేటుగా మొదలయ్యేది.అట్లతద్ది ఆటలు, సంక్రాంతి ముగ్గులు, కార్తీకమాసం కాలువల్లో దీపాలు వదలడాలు.. (పెద్దవాళ్ళు వదులుతుంటే మేము చూసేవాళ్ళం ), ధనుర్మాసం గుళ్ళో ప్రసాదం, వేసవికాలం సెలవుల్లో ఫిల్మ్ లతో సినిమాలు వేసుకోవడం....అబ్బాయిలతో సమానంగా గోళీలాటలు, దీపావళికి చిచ్చుబుడ్లు, మతాబులు,సిసింద్రీలు, తారాజువ్వలు కూరడం, శ్రావణమాసం.. వానల్లో పేరంటాలు, వినాయక చవితి పత్రి ఏరుకొని తెచ్చుకోవడం, ఆషాఢమాసం గోరింటాకు కోసుకుని, రుబ్బుకొని పెట్టుకోవడం, శ్రీరామనవమి పందిళ్ళు, పానకం, పందిట్లో సినిమాలు, ఎండాకాలం మామిడిపళ్ళు తెచ్చి ఇంట్లోనే కావేయడం, సంక్రాంతి గొబ్బెమ్మలు, పండక్కి పట్టుపరికిణీలు, పూలజడలు, రథసప్తమి చిక్కుడు ఆకుల్లో ప్రసాదం, ఎన్ని మధురానుభూతులో....గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నట్టు ఆ రోజుల జ్ఞాపకాలే వేరు....నాలుగైదేళ్ళ నుంచి మార్కెట్లో దీపావళికి మతాబులు కనబడడంలేదు. గుల్లలు (గొట్టాలు) విడిగా, మందు విడిగా అమ్మేవారు...ఆ మందులో ఆముదం కలిపి కూరేవాళ్ళం...ఇప్పుడు అవి కాల్చటమే లేదు. మా పక్కింటివాళ్ళ అబ్బాయి తారాజువ్వలు చేసి అమ్మేవాడు...వాళ్ళ తమ్ముడు సిసింద్రీలు చేసి అమ్మేవాడు....మేమందరం సరదాగా అవి తయారుచేసేవాళ్ళం. చేసినందుకు వాళ్ళు మాకు ఏమీ ఇచ్చేవారు కాదు కాని, వాళ్ళు అర్ధికంగా కొంచెం తక్కువ వాళ్ళు అని మా అమ్మ మేము కొనుక్కున్న వాటిల్లో కొన్ని టపాకాయలు వాళ్ళకు ఇచ్చేసేది...మాకు ఎంత కోపం వచ్చేదో....
మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు హోటల్ కి వచ్చేవారు కాదు. చాలా కాలం తరువాత అలవాటు అయ్యింది అమ్మకి. మాకు స్కూల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేవారు కాదు. అందరి ముందూ భోజనం చెయ్యకూడదు అని. మా ఇంట్లో కొత్తగా డైనింగ్ టబిల్ కొన్నప్పుడు కూడా అన్నం గిన్నెలు దానిపైన పెట్టినప్పుడు, ఊరగాయలు, నెయ్యి, నూనె గిన్నెలు పెట్టేవారు కాదు. మా నానమ్మ కచిక తో పళ్ళు తోముకునే వారు. మాకు "గోపాల్" పళ్ళ పొడి వచ్చేది చిన్న బ్రౌన్ కలర్ ప్యాకెట్లో...10 పైసలు దాని వెల....తియ్యతియ్యగా ఉండేది. అందులో ఉండేది కూడా కచికేనేమో.....సర్ఫ్ ఇప్పట్లా పోలిథీన్ ప్యాకెట్లో కాకుండా, గట్టి అట్టపెట్టెలో వచ్చేది....కొన్నాళ్ళు "జాలీ " ఫేస్ పౌడర్ వచ్చేది. చిన్న అట్టపెట్టెలో...దాని వెల కూడా రెండు రూపాయలే...బసంత్ మాలతి తరువాత అందరూ ఎక్కువగా వాడిన క్రీం ల్యాక్టో కాలమైన్....ఆ పరిమళం ఇప్పటికీ గుర్తే... వీధికి ఒక టీవీ....సాయంత్రం అయ్యేసరికి అర్ధం అయినా, కాకపోయినా ఆ హిందీ ప్రొగ్రాములే చూసేవాళ్ళం. అప్పట్లో లైఫ్ బాయ్,లక్స్ మధ్యతరగతి వాళ్ళ సబ్బులు. ఎర్ర కాగితం ప్యాక్ లో వచ్చే సింథాల్ సబ్బు కొంచెం ఉన్నవాళ్ళ సబ్బు. ఇప్పుడు దాదాపు అన్ని ఒకే ధరలో ఉన్నాయి. ఆ లైఫ్ బాయ్ సబ్బు యాడ్ సినిమాహాల్ లో తప్పకుండా వేసేవారు. ఎంతకీ అరిగేది కాదు....నెలంతా వాడుకునేటట్లు ఉండేది పెద్దగా, బరువుగా....సినిమా హాల్ అంటే గుర్తొచ్చింది. సినిమా మొదలయ్యే ముందు ఫిలంస్ డివిజన్ వాళ్ళ డాక్యుమెంటరీ వేసే వారు ఒక పావుగంట. బాగుండేది...అది వేయడం మానేసిన తరువాత కొన్నాళ్ళు సినిమా చూసినట్లు ఉండేది కాదు. అందులో వాయిస్ ఓవర్ ఇచ్చిన వారి గొంతు ఎంతో గంభీరంగా ఉండేది. (ఎవరైనా ఆయన పేరు తెలిస్తే చెప్పండి)
అప్పుడు రేషన్ లో గుడ్డముక్కలు కూడా ఇచ్చేవారు...బాగా చిన్నప్పుడు. అందుకని ఆ వివరాలు మాకు తెలియవు.
మా చిన్నతనంలో మద్రాసు నుంచి మార్కెటింగ్ కి ఒక PONDS టీం వచ్చారు. ఒక కూపన్ ఇచ్చి, ఆన్సర్ వ్రాసి పోస్ట్ చేసి, డ్రా ద్వారా గెలిచిని ఒక్కరికి మొదటి బహుమతి 365 చీరలు, నలుగురికి 52 చీరలు, 10 మందికి 30 చీరలు, 50 మందికి 7 చీరలు చొప్పున బహుమతి అని అనౌన్స్ చేసారు...తీరా కూపన్ తీసుకున్నాక, క్రీం తీసుకోవాలని చెప్పారు. అప్పట్లో ఆ క్రీములు అవీ మన సౌత్ వాళ్ళకు కొత్త. ఈ డ్రా లు అవీ కూడ కొత్తే...అలా అప్పుడు అసలు ఫేస్ క్రీ అంటే ఏంటో తెలిసింది. అప్పట్లో అప్సర నెయిల్ పాలిష్ వచ్చేది ధర 2 రూపాయలు. ఒక్క ఎర్ర రంగు లోనే దొరికేది. ఈ షాంపూ లు, అవీ అప్పుడు తెలియదు. చక్కగా మందార ఆకులు వేసి, కుంకుడు కాయతో తలంటుకోవడమే..అప్పుడు జుట్టు బాగుండేది....అంతవరకూ వాడే సర్ఫ్ ( వాషింగ్ పౌడర్ పేరు సర్ఫ్...ఆ పేరు జనానికి ఎంత అలవాటు అయిందంటే, మార్కెట్లో కొత్త వాషింగ్ పౌడర్ లు వచ్చినపుడు వాటికి అలవాటు పడలెకపోయారు. ఇప్పటికీ కూడా బట్టలు ఉతికే పౌడర్ అది ఏ కంపెనీదయినా సరే, సర్ఫ్ అనె అనడం అందరికీ అలవాటు.) కేవలం నీలం రంగులోనే ఉండేది. నిర్మా వాషింగ్ పౌడర్ పసుపు రంగులో పోలిథీన్ పాక్ లో వచ్చినప్పుడు చాలా మంది దానిని శనగపిండి గా భ్రమపడేవారు...అప్పట్లో మిగిలిన అన్ని వాషింగ్ పౌడర్ ల కన్నా నిర్మా చవక...ధర ఎంతో గుర్తు లేదు. మా చిన్నతనం లో అయొడైజ్ద్ ఉప్పు లేదు. అందరికీ ఆర్. సి. ఆర్ అనే కంపెనీ ఉప్పే...ఎక్కడికెళ్ళినా అదే దొరికేది. వెల 15 పైసలు. లక్స్ సబ్బు ధర రూపాయిన్నర. చిన్నప్పుడు బళ్ళ మీద రాళ్ళ ఉప్పు తెచ్చి అమ్మేవారు. అదే ఎక్కువ వాడేవాళ్ళు..తరువాత, భారతీయులకు అయొడిన్ తక్కువగా ఉంటుంది, అందుకని రాళ్ళ ఉప్పు బదులు సాల్ట్ వాడాలి అని ఊదరగొట్టి, అమ్మకాలు పెంచుకున్నారు..మార్కెట్ మాయలో పడి అందరూ సాల్ట్ కి అలవాటుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ రాళ్ళ ఉప్పే మంచిది అదే తినండి అంటున్నారు.....వెనకటి రోజుల్లో కచిక, బొగ్గు పొడితో పళ్ళు తోముకునేవారు...కొన్నాళ్ళకి అది అనాగరికం అయ్యింది, ఇప్పుడు టూత్ పేస్టుల్లో బొగ్గు వాడుతున్నార్ట మళ్ళీ....ఈమధ్యలో పాత అలవాట్లు మానేసుకుని మనం పిచ్చోళ్ళమయ్యాం.
ఇంకామా స్కూల్ ముచ్చట్లు చెప్పుకోవాలంటే, మాస్కూల్ దగ్గర ఒకతను చిన్న కొట్టు పెట్టుకుని ఉండేవాడు. అప్పట్లో ఇంక్ పెన్నులు వాడేవాళ్ళం కదా....పెన్ లో ఇంక్ అయిపోయిందంటే, టీచర్లు చితక్కొట్టేవారు.అలాంటి వారికి ఆపద్భాందవుడు అతను. 5 పైసలు తీసుకుని పెన్ను నిండా ఇంక్ పోసి ఇచ్చేవాడు. అప్పట్లో కేంలిన్ (Camlin )పెన్ వాడటం అంటే గొప్ప...20 రూపాయలు ఉండేది ఆ పెన్... ఇంక స్కూల్ దగ్గర ఇంటర్వెల్ లో ఊరవేసిన ఉసిరికాయలు, ఉప్పు, కారం వేసిన నారింజ బద్దలు, జీళ్ళు, నారింజ మిఠాయి అన్నీ అమ్మేవాడు.. మా ఇంట్లో అవి కొనుక్కోవడం నిషిద్ధం... వద్దు అన్న దానిమీద ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా....కానీ ఎప్పుడూ కొనుక్కోలేదు. ఇప్పటికీ ఆ కోరిక అలాగే ఉండిపోయింది...ఫ్రెండ్స్ తో కలిసి కొనుక్కుని తినడం, ఫ్రెండ్స్ తో కలిసి మధ్యాహ్నం కేరేజి తెచ్చుకుని తినడం....ఇంక ఇప్పుడు తీరవు కదా ఆ కోరికలు!

Monday, 12 October 2015

విదురనీతి 52

ఉత్తముల లక్షణాలు:

ఉత్తమజనులు తమదగ్గరున్న సంపదలు కేవలం తమకు, తమ కుటుంబం కోసం మాత్రమే అనుకోరు. ఉదారబుధ్ధితో తమ సంపద్లను ఆపదలో చిక్కుకున్నవారి కోసమూ వినియోగిస్తారు. కుటుంబం అంటే తమ ఇంట్లో నివ్సించే నలుగురు లేదా అయిదుగురు అని భావించకపోవడమే అందుకు కారణం. తనది వసుధైకకుటుంబమనే భావనతో వరు జీవిస్తూ ఉంటారు.

పండ్లతో నిండిన చెట్ల కొమ్మలు కోసుకునేవారి సౌకర్యం కొరకు వంగి ఉంటాయి. నీటితో నిండిన మేఘాలు భూమి దగ్గరలోనే వేలాడుతుంటాయి. అలాగే ఉత్తములు గర్వాన్ని దరిచేరనీయకుండా, తమ సంపదలను పరోపకారానికై వెచ్చిస్తారు. "ఉత్తముల సంపదలు సమస్యల వలయంలో చిక్కుకున్నవారి దు:ఖాన్ని ఉపశమింపచేయడమే లక్ష్యంగా వినియోగపడుతుంటాయి " అన్నది ప్రాచీన సూక్తి.

ఎవరూ ప్రార్ధించకుండానే సూర్యుడు పద్మాల్ని, చంద్రుడు కలువల్ని వికసింపచేసినట్లు, సముద్రంలోని రత్నాలు, మనయపర్వతానికి చెందిన చందనవనాలు, వింధ్య పర్వత పరిసరాల్లోని ఏనుగులు జనుల ఉపయోగం కొరకే ఉన్నట్లు, సత్పురుషుల సంపదలూ పరోపకారం కొరకే అధికంగా వినియోగమవుతాయి. వారు వారి సంపదను జ్ఞానన్ని, ఇత్రుల రక్షణ, పోషణలకై, సమాజాభివృధ్ధికై ఉపయోగిస్తారు. జనులందరూ సుఖసంతోషాలతో ఆరోగ్యంతో సర్వశుభాలతో జీవనాన్ని కొనసాగించాలని, ఎవరికీ ఎటువంటి దు:ఖాలు, నష్టాలు, కష్టాలు కలగరాదని కాంక్షించడం పరోపకారుల లక్షణం.

ఉపకారాన్ని మించిన ధర్మం లేదు. అపకారాన్ని మించిన పాపం లేదు. ఎవరు పరోపకారం కొరకు పాటుపడతారో వారి జీవితమే సఫలమైనట్లు అని బ్రహ్మాండపురాణం కూడా ప్రబోధిస్తుంది. ఈ సత్యాన్ని గుర్తించి మానవులందరూ పరోపకారులై జీవించాలి.

(ఇంకా ఉంది )
విదురనీతి 51
జీవిత పరమార్ధం:
తాను చనిపోయిన తరువాత కాలగర్భంలో కలిసిపోకుండా తన గురించిన జ్ఞాపకాలు,జనం మధయలో మరపురాని గుర్తులుగా ఉండిపోతాయనీ చరిత్రలో తాను కీర్తిశేషుడిగా మిగిలిపోతాననీ ప్రగాఢమైన నమ్మకం కలిగిన మనిషి మరణ సమయంలోనూ ఆనందంగానే ఉంటాడు. జీవితం శాశ్వతం కాదు. యౌవనమూ అంతే. ధనం ఎప్పుడూ అస్థిరమే. భార్య, బిడ్డలు శాశ్వతంగా ఉండిపోరు. ఈలోకంలో శాశ్వతంగా నిలిచేవి తాను చేసిన ధర్మం, సంపాదించినా కీర్తి మాత్రమే...
చందనం, తగరం, మల్లిక వంటి పుష్పాల సువాసన గాలివాటంగా వస్తుంది. పరిసరాలను పరిమళభరితం చేస్తుండి. గొప్పవారూ, సుగుణవంతుల కీర్తి ప్రచండవయువుల్ని సైతం చీల్చుకుని సర్వవ్యాప్తి అవుతుంది. వారి కీర్తి విశ్వమంతటా వ్యాపించి కలకాలం నిలచిఉంటుంది.
నరజన్మ లభించడమే ఎంతో అదృష్టం అనుముంటే ఆ జన్మను సార్ధకం చేసుకోవాలంటే, కొన్నిఉత్తమ లక్షణాలను కలిగి ఉండవలసిందేనని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. మానవ జన్మా ఆత్మ, బుధ్ధి, శరీరం అనే మూడు ప్రధాన అంశాలను కలిగి ఉంటుంది. శరీరం జంతువులకు కూడా ఉంటుంది. కానీ బుధ్ధి కలిగిఉన్న ప్రాణి మానవుడు మాత్రమే. అందువలన బుధ్ధితో ఆలోచించి, ఆత్మావలోకనం చేసుకుంటూ మానవుడు జీవనం సాగించాలి.
(ఇంకా ఉంది )
విదురనీతి 50
మనిషికి తాను పరిష్కరించుకోలేని సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు రావచ్చు. తనలోని అన్ని శక్తి యుక్తులు ఉపయోగించినా ఆ క్లిష్ట సమస్య పర్ష్కారం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో దైన్యం ఆవహిస్తుంది. నడిసముద్రం మధ్య చిక్కుకుని తీర కనిపించని రీతిలో కుంగిపోయే పర్స్థితులు ఎదురవుతుంటాయి. సరిగ్గా ఇలాంటి దీనస్థితిలో దైవం ఆధారమవుతాడు.
శరణాగతి అంటే అహంకార నాశనం. అది భగవత్ కృపతోనే సాధ్యం. సకల కార్యాలను ఒక భగవత్ శక్తి నడుపుతోంది. అందువల్ల మనం దనికి లోబడి ఉండట ఉత్తమం. ఎంతెంత వినయంగా ఉంటామో అంతంత శుభం కలుగుతుంది.
చేసిన మేలు మరిచిపోవడం మహాపాపం. పాపకార్యాలైన గోహత్యకు, సురాపానానికి, దొగతనానికి, వ్రభంగానికి సత్పురుషులు ప్రాయశ్చిత్తం చేప్పారు కాని, కృతఘ్నతకు ప్రాయశ్చ్చిత్తం లేదని బ్రహ్మ శాసనం. కృతఘ్నుడి మాంసాన్ని కుక్కలు కూడా ముట్టుకోవని భారతం చెప్తుంది.
త్రికరణ శుధ్ధి:
మనం మనస్సుతో ఏమి ఆలోచిస్తున్నామో వాక్కుతో అదే మాట్లాడాలి. వాక్కుతో ఏం మాట్లాడుతున్నామో కర్మ ద్వారా అదే చేసి చూపించాలి. ఆ శుభకర్మ ఫలితాలను సర్వత్రా దర్శించాలని సనాతనులు ప్రబోధించారు. త్రికరణ శుధ్ధిగా మనోవాక్కాయ కర్మలతో పవిత్రంగా ఉండాలని ఋషులు ఉపదేశించారు.
ఆచరణ చాలా ముఖ్యం. ఏది మనం ఇతరులకు ఉపదేశిస్తున్నామో అదే మనం నిశ్చయంగా ఆచరించి ఇతరులకు చూపించాలి. అప్పుడే పరులకు మనమీద విశ్వాసం, గౌరవం ఏర్పడతాయి. సమాజంలో అధికులు చెప్పడమే కాని, ఆచరించడం లేదు. లోకంలోకి మన ప్రవేశం, నిష్క్రమణం రెండూ మధురంగా ఉండాలి అంటే జీవనం, మరణం దేనికదే ఇతరులకు మార్గదర్శనం చేసేవిధంగా ఉండాలి. జీవన విలువలు తెలిసి సన్మార్గంలో నడిచేవారికి అద్ ఒక అద్భుత వరంలా కనిపిస్తుంది. జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని ప్రేమించని వారికి ఈ జీవితం ఒక నరకంగా కనిపిస్తుంది.
కన్ను, ముక్కు, జిహ్వ, చెవి, చర్మము ఈ అయిదు ఇంద్రియముల సముదాము తలతో పుట్టినదగు మనస్సును లాగుచుండును. అట్టి దీనికి లోబడినవానికి, శుక్ల పక్షమున చంద్రుడు వృధ్ధినొందిన విధముగా ఆపదలు వృధ్ధినొందును.
జీవితకాలము అతిస్వల్పము. తెలిసికొనవలసిన ధర్మములు పెక్కు కలవు. ఆచరించవలసిన సాధనలు అనేములు ఉన్నవి. విఘ్నములు లెక్కలేనన్ని వచ్చి పడుచున్నవి. ఇట్టి స్థితిలో జీవుడు ఎంత త్వరితముగ తన లక్స్యమును సాధింపగలడో అంత శ్రేయస్కరం.
మృత్యువు ప్రతినిముషము జీవుని కబళీంచుటకై పక్కనే వేచియున్నది. వార్ధక్య, రోగము మొదలయినవి హుంకరించుచు మీదపడబోతున్నవి. కావున వాని వలన అపకారము కలుగకపూర్వమే, మృత్యువు దాపురించకమునుపే ఇంద్రియముల శక్తి ఉడుగకమునుపే వైరాగ్య శమదమాది సాధనలను అబ్యసించి స్వస్వరూపానుభవమును పొందవలసియున్నది.
(ఇంకా ఉంది )
మాట-మౌనం
పంచేంద్రియాలు కలిసి మనస్సును విషయాదుల వైపుకు తిప్పుతాయి. అప్పుడు ఏర్పడే భావపరంపర మఔనాన్ని భంగపరుస్తుంది. అనుద్కే మౌనం అలంకారప్రాయమూ కాదు. అంగీకారమూ కాదు. ంపరుషపదజాలాన్ని నియంత్రించే మౌనం పరిపూర్ణత కలిగిన ఆలోచనా విధానానికి తొలిమెట్టు. దాన్నుచి సాత్వికత ఏర్పడుతుంది. సాత్విక స్వభావం మంచి చెడులను నిర్దేశిస్తుంది. ప్రమాదరహితంగా చరించే విధాన్నాన్ని సూచిస్తుంది. ముందు చూపును కలిగి ఉంటుంది. భవిష్యత్తును ఊహించగలుగుతుంది. కారణాకారణాలను తృటిలో విశ్లేషించగలుగుతుంది. మనోఫలకంపై దృశ్యాదృశ్యాలను ఆవిష్కరింపచేసే శక్తిని పొందగలిగి ఉంతుంది. అందుకే యోగులు, ఋషులు, మౌనధారణ కలిగి ఉంటారు
మౌనాన్ని అభ్యసించాలి. అధ్యయనం చెయ్యాలి. దైనందిన జీవితం ఆటుపోట్లకు ఆలవాలం. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు, సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు, విరుధ్ధవిషయాలను చర్చిస్తున్నప్పుడు మౌనం గట్టున పడవేసే ఆయుధం. ప్రశాంతమైన పరిసరాలు మౌనధారణకు తోడ్పడతాయి. అయితే అవసరమైన వేళల్లో మౌనధారణ అగచాట్లు తెస్తుంది. మౌనం దివ్యాయుధం. సందర్భ శుధ్ధిగా ప్రయోగించినప్పుడే అది లక్ష్యాన్ని భేదిస్తుంది.
(ఇంకా ఉంది )
విదుర నీతి 48
మాట-మౌనం
సమయం చూసి మాట్లాడాలి. నొరుంది కదా అని అనవసర, అసందర్హ ప్రసంగాలెప్పుడు చెయ్యకూడదు.
మౌనం వచించడంవల్ల భద్రత, శుభం కలుగుతాయి. వర్షాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తున్నప్పుడు కోకిలలు మౌనంగా ఉండడమే మంచిది. కోకిల వసంతకాలంలో కమ్మగ పాడుతుంది. వర్షాకాలం రాగానే కప్పల సంఖ్య పెరుగుతుంది. అవి బెకబెకమని కర్ణ కఠోరంగా అరుస్త్యాఇ. ఆ సమయంలో కోకిల కమ్మగా పాడినా ఎవరికీ వినిపించదు. అందుకని వానాకాలంలో కోకిల మౌనంగా ఉండటమే మంచిది. మనుష్యులకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.
కొందరు మూర్ఖులు తాము చెప్పేది తప్పైనా ఒప్పుకోక అడ్డదిడ్డంగా వాదిస్తుంటారు. అటువంటి వారికి ఎంత చెప్పినా ఏది మంచో, ఏది చెడో అర్ధంకాదు. తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అటువంటి సమయంలో మౌనం వల్లనే భద్రత, రక్షణ, శుభం కలుగుతాయని విజ్ఞులు గమనించాలి.
మనం మన కర్మేంద్రియముల ద్వారా మన కర్మలు నిర్వర్తించుతున్నాము. ఏమీ మాట్లాడకుండా ఉండటమే కాదు. ఏమీ ఆలోచించకుండా ఉండటం కూడా మౌనమే. ఎటువంటి ఆలోచనలు లేకపోవడంతో మెదడుకు కూడా కాస్త విశ్రాంతి దొరికి కొత్త శక్తిని సంపాదించుకుంటుంది. దాని చురుకుదనం పెరుగుతుంది. మౌనం కూడా ఒకరకంగా ధ్యానమే...కాబట్టి కాసేపు మౌనంగా ఉండటం వల్ల ఏకాగ్రత సాధించడానికి కావలసిన నైపుణ్యం దొరుకుతుంది. ఆలోచనల పట్ల నియంత్రణ సాధించగలుగుతాము. ఒక స్పష్టత ఏర్పడుతుంది. జరుగుతున్న విషయాల పట్ల సదవగాహన కలుగుతుంది. పరిణతి కలిగిన ఆలోచలనకు ఆస్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి మౌనం రాచమార్గమని గ్రహించాలి.
మౌనం ఆత్మశక్తిని పెంచుతుంది. మౌనధారణ సంస్కారవంతమైన భూషణం. పరిణతి చెందిన మనస్తత్వానికి ఆలోచనాపరిధికి అది నిదర్శనం. చలించే భావసముదాయం వాచకంగా పెదవులు ద్వారా బహిరంగమౌతుంది. సంభాషణ, లేదా చర్చ గాడి తప్పే గడ్డు సమస్యలు ఎదురైనప్పుడు మౌనం కవచంలా కాపాడుతుంది.
(ఇంకా ఉంది)
విదురనీతి 54

ఒకవ్యక్తి దీనావస్థలోను, దయనీయమైన స్థితిలోను ఉంటే , ఆ దు:ఖాన్ని తనదిగా భావించి, ఊహించుకొని ఆవహించుకొని అనుభవించి పడే తపనే 'సానుభూతి"  అవుతుంది. అటువంటి సానుభూతి కోసం కష్టాల్లో ఉన్నవారు, దు:ఖంలో పరితపించేవారు దీనాతిదీనావస్థలో ఉన్నవారు ఎదురుచూస్తుంటారు. కనీసం ఓ సానుభూతి వచనం కోసం ఎదురుతెన్నులు చూస్తారు.

తన కు:హాన్ని పంచుకునేవారు పదిమంది ఉన్నారని తెలిసినప్పుడు ఆ బాధితునికి ఊరట కలుగుతుందట. ఓదార్పు వలన అతనికి దైన్యం తరుగుతుంది. ధైర్యం పెరుగుతుంది. మనోబలం చేకూర్చుతుంది. ఆత్మవిశ్వాసం, ఆతంస్థైర్యం రెట్టింపవుతుంది. సానుభూతి, సత్వప్రవృత్తి, పరగతమై సుఖ దు:ఖాదె భావనలచే కరుణ్త్వం పెరుగుతుందని పెద్దలు చెబుతారు. ధృతరాష్ట్రుడు ఆశిస్తున్నదీ ఇదే!

పండితుల సంగమము వలన విద్య లభిస్తుంది. విద్య వలన వినయము లభిస్తుంది. వినయమువలన లోకానురాగము లభిస్తుంది. లోకులు తనను అభిమానించుచున్నప్పుడు సర్వము సిధ్ధిస్తుంది. అధర్మ మార్గమున పొందిన ధనముతో ఏ లొసుగు కప్పిపుచ్చినా అది దాగనే దాగదు. దానివలన తక్కినది కూడా చేల్లాచెదరగును. నీకొడుకులు సధ్ధర్మమగు పనిని చేయటంలేదు. న్యాయము తప్పిన మార్గమున సుఖము పొందగోరుచున్నారు. కనుక ఇది విపరీతము, ప్రమాదకారి అని విదురుడు స్పష్టంగా చెబుతున్నాడు.

అసూయకలవాడు, ఆయువుపట్టులందు హింసించువాడు, అప్రియములు పలుకువాడు, పగపెట్టువాడు, మోసకాడు--అగు వీరు పాపము చేసిన వెనువెంటనే తగుఫలితమును పొందుతారు. అసూయ లేనివాడు, ప్రజ్ఞను పెంపొందించగోరు వాడు, మంచి పనులను ఎల్లవేళల చక్కగా చేయువాడు గొప్ప సుఖమును పొందుదురు. అందరకు ఇష్టులగుదురు.

రాత్రి సుఖముగా ఉండు ఏర్పాటును పగటియందే చేసికొనవలయును. నావాకాలమున సుఖముగానుండు ప్రయత్నమును తక్కిన యెనిమిది నెలల ముందు చేయవలయును. ముసలితనమునందు సుఖమునకై పడుచుదనముననే ప్రయత్నించవలయును. చనిపోయిన తరువాత సుఖమును, కీర్తిని బొందుటకై జీవితమంతయు ప్రయత్నించవలయును.

(ఇంకా ఉంది )

విదుర నీతి 53

ఇంద్రియ విషయ సుఖములకు లోబడువారు తపస్సును చేయలేరు. పరమాత్మ సుఖమును గాంచజాలరు. దేహసుఖమును లక్ష్యమందుచుకొనని ధీరులు మాత్రమే ఏకాగ్ర చిత్తంతో దైవ సామ్రాజ్య పట్టాభిషిక్తులు కాగలుగుతారు. ఇంద్రియములను అదుపున పెట్టుకొని, మనస్సును చెదరిపోనీక, వికారములు పొందినపుడు చక్కగా శిక్షించుచు, పరీక్షించి పనులు చేయు ధీరుని లక్ష్మీదేవి అంటిపెట్టుకుని ఉంటుంది. (నిగ్రహము లేని నీవు కొడుకులు ఆడించినట్లు ఆడుచున్న కారణమున లక్ష్మి నీయందు నిలువదని విదురుని సూచన)

రాజా! పురుషునకు శరీరము రథము, మనస్సును, వశమైన ఇంద్రియములు దానికి గుర్రములు. ఏమరుపాటులేక, నేర్పుగలవాడై తనకు లొంగిన ఆ మంచి గుర్రములతో ధీరుడు రథికుని వలె సుఖముగ ప్రయాణించును.

సాధువులను ఎవరు నిందించెదరో వారు తమను తామే దూషించుకొనువారగుదురు. ఎటులనగా ఆ కాశములోనికి ఎవరైనా బూడిదను ఎగురవేసినచో అది వచ్చి వారి తలమీదనే పడును కదా!

అధమజనులకు బ్రతుకుతెరువు లేకపోవుట భయము. మధ్యములకు చావు భయము. ఉత్తములగు నరులకు అవమానములంటే కహాభయము.

త్రాగుడు, మదము మొదలగు మదములన్నింట్లో ఐశ్వర్య మదము అన్నింటికన్న మిన్న. ఐశ్వర్యముచే పొగరెక్కినవాడు మొత్తముగా పతనము చేందాక కానీ తెలివినొందడు. ఐశ్వర్యము, ధనము, అధికారము అను వానివలన కలిగిన మదము తక్కిన పాపములకెల్ల మించిన పాపమని తెలుసుకోవాలి.  పరస్త్రీ వ్యామోహం, జూదం, తాగుడు, వేట, కఠినంగా మాట్లాడటం, కఠినంగా ప్రవర్తించడం, డబ్బు కుర్వ్యయం చేయటం ఇవి సప్తవ్యసనాలుగా మన పెద్దలు పరిగణీంచారు. వ్యసనం మానవునికి చిత్తసమ్యమనం లేకపోవడం వల్లనే వస్తుంది. ఈ సప్తవ్యసనాల వల్ల నశించిపొయినవారి గురించిన కథలు చరిత్రలో ఎన్నెన్నో...

(ఇంకా ఉంది )

Tuesday, 6 October 2015

విదురనీతి 47

చిత్తప్రసన్నత

మానసిక ఒత్తిళ్ళనుంచి దూరంగా ఉండాలంటే మనసును ప్రసన్నంగా, శాంతంగా ఆరోగ్యంగా ఉంచడం నేర్చుకోవాలి. మనిషి మరణ ధర్మానికి ఎదురీదలేడు. అందుకే కర్తవ్యమనే జ్యోతినందుకొని ముందుకు సాగిపోవాలి. సృష్టి ధర్మాన్ననుసరించి కాలధర్మముంటుంది. ఎవరికోసం ఏదీ ఆగదు. కాలచక్రం తిరిగిపోతూ ఉంటుంది. ఈ కాలగతిలో మనం సుఖంగా బ్రతుకుతూ, ఇతరులకు  ప్రశాంతంగా బ్రతకనివ్వాలి.

ముళ్ళ మధ్యలో ఉండి కూడా పువ్వు వికసిస్తుంది. అలాగే మనం కూడా కష్టసమయంలో కూడా చిరునవ్వును విడవకూడదు. సంతోషం లేకపోతే, ప్రశానతతలేదు. ప్త్రశాంతత లేకపోతే మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేకపోతే సరియైన జీవనయాత్ర లేదు. అందుకే ముళ్ళ మధ్య పుష్పాన్ని వేదం ప్రమాణంగా చూపిస్తుంది. ఈ సంసారమనే యాత్రలో మనకు సుఖదు:ఖాలతో మిళితమైన ఎన్నో అనుభవాలు ఎదురవుతాయి. వాటిని మనసులోనికి రానీయకుండా ఆత్మధైర్యంతో ఎదుర్కొని ప్రసన్నంగా జీవించే అలవాటు చేసుకోవాలి. మానసికంగా మనిషి నలిగిపోతే, దానికి వైద్యశాస్త్రంలో కూడా మందు లేదు.


దీనులైనవారికి మాత్రమే ధనాన్ని దానం చెయ్యాలి. యౌవనాన్ని భార్యకు మాత్రమే అంకితం చెయ్యాలి. యజమాని కోసం పనిచెయ్యడంలో ప్రాణాన్ని సైతం త్యాగం చెయ్యాలి. ఎవరైనా సరే, భగవంతుని సన్నిధిలో ఒక పని చేస్తానని నిశ్చయించుకుని ఆ పనికి కట్టుబడి ఉండాలి. అలా నిశ్చయించుకోవలసిన కర్తవ్యాలలో కొన్ని:

ఎవరికి పడితే వారికి డబ్బుని దానం చెయ్యకూడదు. అర్హులు, పాత్రులైనవారికే దానం చెయ్యాలి. కొందరు విలాసాలకై యాచన చేస్తారు. దొరికిన డబ్బుతో జూదగృహాలకూ, పానశాలలకూ వేశ్యావాటికలకూ వెళ్తారు. అటువంటివారికి కాకుండా నిజంగా దీనస్థితిలో ఉన్నవారికి దానమిచ్చిన ధనం సద్వినియోగమవుతుంది అంటుంది శాస్త్రం.

ప్రతి పురుషుడూ భార్యకు ద్రోహం చెయ్యనని ప్రతిజ్ఞ చెయ్యాలి. చేసిన ప్రతిజ్ఞను నిలుపుకోవాలి. యౌవనం భార్యకే అంకితం చెయ్యాలి తప్ప పరస్త్రీలతో, వేశ్యలతో గడపరాదు. అలా చెయ్యడం వలన ధర్మం, అర్ధం కామ కూడా నశిస్తాయి. విధినిర్వహణలో యజమానికి హితకరమైన పనే చేయ్యలి, ప్రాణాన్ని సైతం లెక్కచేయక విధిని నిర్వర్తించాలి తప్ప యజమాని చెప్పిన పనిని ఎల ఎగ్గొడదామా అని ఆలోచించకూడదు. విధి నిర్వహణలో కష్టాలు ఎదురైతే వెనుకంజ వెయ్యకూడదు. ఈ నిర్ణయాలను తీసుకోవడం అందరికీ శ్రేయోదాయకం.
విదురనీతి 46

కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తి ఓ చక్కని మార్గం.

ఈలోకంలో త్వరగా అంతరించిపోతున్న అంశం 'తృప్తి". మానవుడికి తృప్తి అనేది లేకపోవడం వల్లనే లోకంలో శాంతి సుఖాలు కరువవుతున్నాయి. కోరికలు అనంతం. కోరుకున్నవి ఎన్ని ఇచ్చినా ఇంకా ఏదో కావాలంటారు. ఒక కోరిక తీరగానే మరో కొత్తకొరిక పుట్టుకొస్తుంది. ఈ కోరికలకు అదుపు లేకపోతే జీవితం నాశనమవుతుంది. పురాణేతిహాసాలలో ప్రతినాయకుల ద్వారా మనకు అందించిన సందేశం అదే. ఎందరెందరో మహామహులు సైతం తృప్తిలో ఉండే ఆనందాన్ని తెలుసుకోలేక పతనం చెందారు. ఆధ్యాత్మిక జీవన విధానంలో తృప్తిగురించి  పదేపదే ప్రస్తావించడానికి కారణం అదే.సుఖాల సంపదలమీదే మోజు పెంచుకుని వాటి కోసమే జీవిస్తే చివరికి అసంతృప్తి మిగులుతుంది. తృప్తిలేని మనుషులకు ఈ లోకమంతా అందించినా ఇంకా ఏదో లోటు కంపిస్తుంది. అందిన దానితో తృప్తిపడటం అలవాటు చేసుకోవాలి.

జీవహింస, దొంగతనము, పరదారాగమనము, పిసినారితనము, పరుషవచనము, అసత్యవచనము, అసందర్భ ప్రేలాపనము, జీవద్రోహచింత, ఇతరుల మేలుకు సహకరింపకుండుట, శాస్త్రముల యందు ద్వేషము అను ఈ పది పాపకార్యములు త్రికరణశుధ్ధిగా విడిచిపెట్టేయాలి. దర్మార్ధ కార్యక్రమముల కొరకు నిరంతరము ప్రయత్నము జరుగుతున్న చోట నివాసముండాలి. వాస్తు లోప భూయిష్టమైన ఇంటిలో నివాసముండకూడదు. ఇతరులకు అపకారము కలిగించి ధనమును సంపాదించరాదు. ధర్మపధ్ధతిలో సంపాదించిన ధనమే మనదగ్గర నిలుస్తుంది. అట్లు సంపాదించిన ధనమును తాను అనుభవించుచు, పాత్రత నెరిగి దానము చేసినవాడు ఇహపరములందు సుఖములను పొందును.

(ఇంకా ఉంది )

Monday, 14 September 2015

విదురనీతి 44

కొన్నిసార్లు తను నమ్మిన విలువలకి భిన్నమైన పనులు చేయాల్సిరావడము అనివార్యమవుతుంది. మనిషి ఆశించినది ఆశించినట్లుగా జరగదు. తాను చేయాలనుకున్న పనులకి భిన్నమైన పని చేయాల్సివస్తుంది. ప్రతిచోట తను తలచిన విషయాన్ని ఆమోదించే సమ్యమనం సమాజానికి కానీ, మనుషులకు కానీ ఉండకపోయే సందర్భాలుంటాయి. అయితే ఇతరులకు అపకారం జరగనంతవరకు తను నమ్మిన పనిని చేయడం తప్పుకాదు.  ఎదుటివారికి సత్యాల్ని విశదం చెత్యలేకున్నా తన ఆత్మ ముందు తను నిజాయితీగా ఉంటే మంచిది. ఇతరులకు సాద్యమైనంత ఎక్కువ ఉపకారం, తక్కువ అపకారం జరిగే విధంగా మన పనులు ఉండాలి. అంతరాత్మ సాక్షిగా వ్యవహరించేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే ఒక మనిషికి దీక్షాదక్షతలతో పాటు నిజాయితీగా ఉండటం, అవిశ్రాంతంగా పరిశ్రమించడమే ప్రధానం.

మనోనిగ్రహమూ, సయ్తపరాయణత్వమూ, ధర్మపాలన నిరతీ, జీవితానికి అవశ్యమైనవి అని నేను విన్నాను. పురుషుడు హృదయకవాటం తెరచి ధైర్యంగా ప్రియాప్రియాలను సమదృష్టితో చూదగలగాలి. ఇతరులు నిందించినా తిరిగి నిందించకూడదు. అందువలన ఎదుటివారి క్రోధం వారినే హరిస్తుంది. ఆ క్రోధం వారి పుణ్యాన్ని కూడా నశింపచస్తుంది. పరులను అవమానించరాదు. మనను గురించి ఎవరైనా పరుషంగా భాషిస్తూంటే అకారణంగా మనను నిందిస్తుంటే వాడు మన పుణ్యఫలాన్ని పెంపొందిస్తున్నాడని సంతోషించాలి. వాస్త్రం ఏరంగు నీటిలో ముంచబడితే ఆ రంగునే పొందుతుంది. అదే విధంగా సజ్జనుడైన వానిని దుర్జనుడు సేవిచి సజ్జనుడౌతాడు. మహాతపస్వి అయి ఉండి కూడా చోరునీ, మూర్ఖుని సేవిస్తే ఆ తపస్వి కూడా మూరుఖుడే అవుతాదు. పరిసరాలు, పరిజనులూ తమ ప్రభావాన్ని ప్రసరింపచేస్తూంటారు.

ఇతర్ల విషయంలో పరుష ప్రసంగాలు చెయ్యనివాడు, ఇతరులచేత అవమానితుడై కూడా ప్రతీకారాన్ని తలపెట్టనివాడూ, ఏ అవమానమూ పొందికూడా ఇతరులపై ప్రతీకారచర్యలకు ఆలోచించనివాడూ, స్వర్గానికి వస్తున్నప్పుడు దేవతలు వానికి స్వాగతం పలుదుతారు. మౌనం కంటే సత్ధర్మం ఇంకొకటి లేదు. ప్రియభాషణం ద్వితీయ స్థానము. సత్యంతో పాట్ అది ప్రియంగా ఉంటే, ధర్మసమ్మతం అయితే, ఆ వాక్కు సర్వవిధాలా ఉత్తమమైనది.

(ఇంకా ఉంది )

విదురనీతి 40
మన ప్రతి ఆలోచనా, ప్రతి చర్యా స్వార్ధంతో కూడుకున్నది. "నేను", మీద ఆధారపడి ఉంటున్నాం. కాబట్టే హింస లేకుండా జీవించలేకపోతున్నాం. స్వార్ధరహితంగా ఆలోచించినప్పుడే హింసలేకుండా చేసుకోగలం.
స్వార్ధం ఉండడం మంచిదే కాని అది పరిమితి మించకూడదు. పరిమితి మించిన స్వార్ధం హిన్సకు దారితీస్తుంది. స్వార్ధం లేకపోతే జీవితం ప్రశాంతంగా గడుస్తుంది.
దయ అంటే శత్రువునైనా ఆపదలఒ ఉంటే కాపాడటం, క్షాంతి: అంటే ఎవడైనా తనకు దు:ఖం కలిగిస్తే, మనసులో గాని, బయటగాని వాడిపై కోపం లేకుండా ఉండటం.
గుణవంతుల గుణాలను వెల్లడి చేయకుండా ఉండాటం అసూయ. శౌచం అంటే పతితుల సొమ్మును గ్రహించకుండా ఉండటం, తిన తగని పదార్ధాలను తినకుండా ఉండటం.
శరీరాన్ని అలసటకు గురిచేసే తప్పుడు పనులకు దూరంగా ఉండటం, అనాయాసమైఅతే, నింధించబడే పనులను విడచి ప్రశస్తమైన పనులు చెయ్యటం మంగళదాయకం.
మనలో చాలామంది ఎవరికి వాళ్ళమే అధికులమనే అహంకారంతో ఉంటారు. ఈ అహంకారం వలన ఏ కార్యమూ సానుకూలంగా జరగదు. కార్యం సానుకూలమవ్వాలంటే ప్రతివ్యక్తీ ముఖ్యంగా వినయం, విధేయత అలవరచుకోవాలి.
(ఇంకా ఉంది )
విదుర నీతి 39
అన్నం జీవనాధారం. దేహానికి, శరీర మనుగడకు ముఖ్యమైన, ప్రాథమికమైన, ప్రముఖమైన ఇంధనం. మానవుడు జీవించాలంటే ఆహారం కావలి. ఆహారం ద్వారా మాత్రమే శరీరం శక్తివంతమౌతుంది. తేజోవంతమఔతుంది. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండాఅలంటే సరిపోయే తగు ఆహారము లభించాలి. దేహం బలిష్టంగా ఉంటేనే ధర్మకార్యాలు చేయగలుగుతాము. చతుర్విధ పురుషార్ధాలు సాధించగలుగుతాము. ఆ దర్మకార్యాలతోనే స్వయం సమృధ్ధినీ, అభివృధ్ధిని, సమాజ పురోభివృధ్ధినీ ప్రోత్సహించగలుగుతాము. అందుకే అన్నం అత్యంత ప్రధానమైనది. అన్నముంటేనే దేహముంటుంది. దేహముంటేనే ధర్మసాధన సాధ్యమౌతుంది.
కోరిక దుర్వినియోగానికైతే అది రాక్షసమౌతుంది. సద్వినియౌగ నిమిత్తమైనది దైవికమైన కోరిక అవుతుంది. దేహాన్నినిలబెట్టుకునేందుకు ఆహార పానీయాలు స్వీకరించాలన్న కోరిక ఉండాలి. అది దైవసంభవమైనది. కేవలం జిహ్వచాపల్యం కోసం ఆహారపానేఅయల మీదకు మనస్సు పోనీయరాదు.
అధికముగా భుజించు వానికి, బొత్తిగా బుజింపని వానికి అట్లే అధికముగ నిద్రించువానికి, ఎల్లప్పుడూ మేలుకొని ఉండువానికి మేలు కలుగదు. అధికముగా భోజనం చేస్తే శరీరం మత్తుగా ఉంటుంది. నిద్ర ఆవహిస్తుంది. కడుపు బరువుగా ఉంటుంది. దేహ భావనను వదిలిపెట్టడం అసాధ్యమవుతుంది. అదే విధంగా పూర్తిగా ఆహారం మానేసిన పక్షంలో శరీరం బలహీనమై, క్షీణీంచిపోతుంది. అప్పుడు దేనిమీదా ఏకాగ్రత కుదరదు.
(ఇంకా ఉంది )
విదురనీతి 38
అతిథిసేవ:
అతిథి అనగా తిథి, వార నియమాలు లేకుండా ఇంటికి వచ్చినవడు, అంటే ముందస్తు సమాచారం లేకుండా హఠాత్తుగా మన ఇంటికి వచ్చినవాడన్నమాట. అతిథిని దైవంగ భావించి సగౌరవంగా సేవించి సాగనంపడం భారతీయ సనాతన సంస్కృతిలో భాగం. ఇది పెద్దల ఆచరణ ద్వారా తరువాతి తరాలకు అందుతున్న సంస్కార భాగ్యం.
అతిథికి ఎదురువెళ్ళి స్వాగతం పలికి ఇంటిలోనికి తీసుకురావాలి. అభిమానం గౌరవం మేళవించి అతిథి యోగక్షేమాలు ప్రశ్నించాలి. కుటుంబ సభ్యులందరికీ అతిథిని పరిచయం చేసి పిల్లలచే మ్రొక్కించి వారి దీవెనలను స్వీకరింప చేయాలి. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు అందించాలి. ఆ తరువాత సుఖాసీనుణ్ణి చేయాలి. ప్రయాణపు శ్రమ పోగొట్టాలి. చల్లని నీళ్ళు అందించి దాహం తీర్చాలి. అతిథికి స్నానం ఏర్పాట్లు చూడాలి. స్నానానంతరం అతిథికి ఏకాంతతను సమకూర్చాలి. ఆయన అధ్యాత్మిక భావనలకు తగు ఏకాంత వాతావరణం కల్పించాలి.
శక్తిమేరకు కాలానుగుణంగా దొరికే ఫలాలతో మధుర భక్ష్య భోజ్యాలతో అతిథికి అన్నం పెట్టాలి. ఇంటి ఇల్లాలు అన్నపూర్ణాదేవియై అతిథికి ఆప్యాయంగా వడ్డిస్తూ ఆదరంతో మెలగాలి. అతిథికి ఇష్టమైన పదార్థాలేవో గ్రహించి వడ్డించాలి. సన్యాసులకు మౌనంగాను, మిగిలినవారికి ఆహ్లాదకరమైన సంతోషదాయకమైన సంభాషణలతోనూ ఎలాంటి తర్క వితర్కాలకు తావివ్వని విధంగా భోజనం పెట్టాలి.
భోజనానంతరం శయ్యను ఏర్పాటు చేయాలి. కాస్సేపు సుఖనిద్ర పోనీయాలి. ఆ సమయంలో యజమాని కూడా భోజనం పూర్తి చేసుకొని వచ్చి అతిథి తమ ఇంటికి వచ్చిన పనేమిటో, తాను చేయగలిగిందేమిటో అడిగి తెలుసుకుని శక్త్యానుసారం అతిథి కోర్కెను తీర్చాలి. సంతుష్టుడై ఇల్లు వదిలివెళ్ళే అతిథి, ఆతిథ్యం ఇంచ్చిన ఇంట్లో పుట్టెడు భోగభాగ్యాలు వదిలివెళతాడని పెద్దల నమ్మకం.
(ఇంకా ఉంది)
విదురనీతి 42

విదురుడు ఇంకా ఇలా చెప్తున్నాడు

శుభకర్మల వల్ల లక్ష్మి ప్రభవించి, ధర్మంతో వర్ధిల్లి, చాతుర్యంలో  విస్తరించి సమ్యమనంతో సురక్షితమౌతుంది. బుధ్ధీ, కులీనతా, దమమూ, శాస్త్రజ్ఞానమూ, పరాక్రమమూ, మితభాషిత్వమూ, దానమూ, కృతజ్ఞతా అనే గుణాలు పురుషుని కీర్తిని వృధ్ధిపొందిస్తాయి. ఎదుటి వ్యక్తిని గౌరవించడం అన్నిటికంటే ఉత్తమమైన గుణం. సత్పురుష సాంగత్యంవలన ఈ గుణసంపదలు  లభిస్తాయి. తపో, యజ్ఞ, దాన అధ్యయనాదులు సజ్జన సాంగత్యమువలననే కలుగుతాయి. సజ్జనులు సత్యవ్రతంతో, మృదుస్వభావంతో, కోమల హృదయులై, ఇంద్రియ నిగ్రహంతో చరిస్తారు. ఉత్తములు దయ,క్షమ, నిర్లోభము, సత్యము ను అనుష్టిస్తారు. దాన హోమ పూజ ప్రాయశ్చిత్తాది ఇహలోక కర్మలను  నిర్వహించేవాడు పురోభివృధ్ధి గాంచుతాడు. వివాహము , స్నేహము,  వ్యవహారము, సమానులతోనే సాగించాలి. సద్గుణసంపన్నుల మార్గంలో పోయేవాడు నీతివంతుడు, శాస్త్రవిశారదుడవుతాడు.

క్రోధము, తొందరపాటు, పురుషార్ధం లేకపోవడము, అసత్యభాషణము, దు:ఖ కారణాలు. హితులక్షేమం కోసం యుధ్ధం చెయ్యనివాడూ, ఆదరించినవారి మీద కోపం చూపేవాడూ, వివేకం లేనివాడూ, పరులయందు దోషాలను చూసేవాడూ, దయలేనివాదూ, అధికంగా భాషించేవాడూ, ఈ విశ్వంలో పేరుప్రఖ్యాతులు పొందలేరు. వేషాడంబరం లేకుండా ఆత్మస్తుతి చేసుకోకుండా, కోపం వచ్చినా కఠినంగా మాట్లాడకుండా ఉండేవాడు సర్వులకూ ఆదరణీయుడు అవుతాడు. గర్వంలేనివాడూ, హీనంగా ప్రవర్థించనివాడూ,  శాంతించిన శత్రుత్వాన్ని ప్రకోపింప చెయ్యనివాడూ, ప్రమాదాలు పైన పడుతున్నా, అనుచింతంగా ప్రవర్తించన్వాడూ, పరుల దు:ఖానికి సంతోషించనివాడూ, దానం చేసిన తరువాత బాధపడనివాడూ, సత్పురుషులలో శ్రేష్ఠులుగా  ఖ్యాతి చెందుతారు. దేశవ్యవహార అవసరాదులూ, జాతి ధర్మాలూ తెలిసిన వారికి ఉత్తమ-అధమ వివేకం కలుగుతుంది.

పురోభివృధ్ధి కోరేవారు గతాన్ని మరచిపోరాదు. అప్పుడే హృదయంలో మహోన్నతభావం ఉదయిస్తుంది. అంతేకాక తన పురోగతికి ఏఏ ఆటంకాలున్నాయో అవన్నీ నశింపచేసుకుంటాడు.
 
(ఇంకా ఉంది)
విదురనీతి 41
పొరపాటు చేయటం అనేది మానవస్వభావం. ఆ పొరపాటును తెలుసుకొని ఇక ముందు అలాంటి పనులు చేయనని, దృఢంగా అనుకుని మంచి మార్గంలో నడవడమే జ్ఞానమున్న వ్యక్తి ఆచరింపదగిన ధర్మం. అదే ప్రాయశ్చిత్తం. పాపంచేసిన వ్యక్తి దానినుండి బైటపడడానికి మార్గాలు ఉన్నాయి. చేసిన తప్పును దాచకుండా ఉన్నది ఉన్నట్లు ఇతరులతో చెప్పడం వలన, జరిగిన దానిని గుర్తించి ఖేదపడడం వలన దోషవిముక్తి కలుగుతుంది.
కోరికలు మనిషిని మానవత్వం నుంచి దానవత్వానికి దిగజారుస్తాయి. మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సంతృప్తియే ఏకైక మార్గం.
మానవుడు వ్యక్తి పురోభివృధ్ధికీ, సంఘ పునరుజ్జీవనానికీ దారితీసేలక్షణాలు కలిగి ఉండాలి. అవి ఏమిటంటే ఉత్సాహంతో కూడిన క్రియాసీలత, మొక్కవోని ధైర్యం, శక్తి ఉత్సాహాలు, వీటన్నింటికీ మించి పరిపూర్ణమైన విధేయత ముఖ్యం. ఎవరైతే సద్గుణాలు అలవరచుకుని తన జీవన గమనాన్ని మలుచుకుంటారో వారు వినయ విధేయతల వలన అందరికీ ఆదర్శప్రాయులవుతారు.
ఇవి ఒక్క ధృతరాష్ట్రునికే కాదు, మానవజన్మ ఎత్తిన ప్రతివారు తెలుసుకోదగ్గవి. ఆచరించి తరించదగ్గవి. చెప్పేటప్పుడు వినక, ఆనక చెప్పేవారు లేరని ఏడవడం తగదు. కాలమాన పరిస్థితులను బట్టి, బాధ్యతలు, బరువులు పెరుగుతుండటమో, మారుతుండటమో జరుగుతున్నాయి. కానీ, కాలం మారడం లేదు. ధర్మం మీరడం లేదు. అందుకనే విచక్షణను ప్రసాదించిన పరమాత్మ, వివిధ మార్గాలతో ధర్మప్రబోధం, ప్రకాశం చేస్తూ తరించమంటున్నాడు. అందుకే దీనిని మహామహుడైన పరిపూర్ణ ధర్మస్వరూపమైన యమధర్మరాజు, తరించే జ్ఞానవిజ్ఞానాలు ప్రసాదించిన దివ్య విదురునిగా ప్రకాశం, తత్వసారాంశం గ్రహిస్తే మనం ధన్యులం.
(ఇంకా ఉంది )

Friday, 11 September 2015క్షిప్రం భవతి ధర్మాత్మా
శశ్వచ్చాంతిం నిగచ్చతి:
కౌతేయ!ప్రతిజానీహి
న మే భక్త ప్రణశ్యతి||
"నన్నాశయించినవాడు శీఘ్రంగా ధర్మబుధ్ధి గలవాడవుతున్నాడు. శాశ్వతమైన శాంతిని పొందుతున్నాడు. ఓ అర్జునా! న భక్తుడు ఎన్నటికీ చెడడు" అని శ్రికృష్ణుని అభయవచనం.


శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళీన తర్వాత యశోద రాధ దగ్గరకు వెళ్ళీంది. రాధ ధ్యానమగ్నయై ఉంది. నేను ఆద్యాశక్తిని. ఏదైనా వరం కోరుకో అంది రాధ. " మనోవాక్కాయ కర్మలచే శ్రీకృష్ణునే సేవించునట్లు అనుగ్రహించు, ఈ కళ్ళతో కృష్ణ్ భక్తులను దర్సించునట్లు , మనస్సుతో అతనిని మాత్రం ధ్యానించునట్లు, ఈ లానుక ఎల్లప్పుడూ అతని నామగుణకీర్తన చేయునట్లు" వరము ఇమ్మంది యశోద.
ఇంతకన్నా మానవమాత్రులమైన మనకు మాత్రం వేరే ఏమి కోరికలు ఉంటాయి? యశోద మనకు అందరికీ చక్కని మార్గం చూపింది.


సత్పురుషుల సహవాసం జనులకు సత్యవాక్కులను నేర్పుతుంది. బుధ్ధిమాంద్యమును తొలగిస్తుంది. గౌరవాన్ని కలిగిస్తుంది. పాపములను నశింపచేస్తుంది. కీర్తిని పెంచుతుంది. బుధ్ధిని వికసింపచేస్తుంది. సత్సంగము సకల కార్యాలను సాధిస్తుంది.
****మహమ్మద్, క్రీస్తు, బుద్ధుడు, అందరూ మంచివాళ్ళే.. అయితే నీకేమిటి ప్రయోజనం? నీవు మంచివాడివి కానప్పుడు నిన్నెవ్వరూ రక్షించలేరు.
****సాధారణ వ్యక్తి తొంభై శాతం శక్తియుక్తులను వృధా చేసుకొంటాడు. మనసుపై అదుపు సాధించినవాడు తప్పుచేయడు. విజేతకు, పరాజితునికి ఉన్న ముఖ్య బేధం ఇదొక్కటే.


మతం మనిషిని సక్రమ మార్గంలో నడిపించేందుకు రూపొందించబడిన విధానం.మనిషిలో ఉన్న దైవత్వాన్ని మరవకుండా, ఇతరులలో కూడా దైవత్వాన్ని చూడగిలిగే నైతిక ఆద్యాత్మిక విలువలను ప్రసాదించినది హిందూ ధర్మం. మతానికి సంబంధించిన అసలు అర్ధం మరచిపోయి, అది తమ సొంత ఆస్తిగా, తాము చెప్పిందే వేదంగా కొందరు ప్రవర్తించి మతానికి చెడ్డపేరు తెస్తున్నారు.
మానవత్వాన్ని మరచిపోయి, పశువాంచలు పేరుకుపోతున్నాయి. ధన, వస్తు వాహనాల వ్యామోహంలో పడి భగవంతుడిని , ఆయన చూపిన మార్గాన్ని మరచిపోయారు. సామాన్యుడిలా జీవించడంలో ఆనందముంది. కోరికల మీద నియంత్రణ ఏర్పరుచుకోవడంలో తృప్తి కలుగుతుంది. తృప్తి పొందిన ఆత్మ సక్రమమైన మార్గంలో పయనిస్తుంది. స్వచ్చమైన ఆలోచన కలిగి ఉంటుంది. అదే అసలైన మత సారాంశం.
(స్వామి శివానంద )
భగవంతుని శక్తిని గుర్తించి మోకరిల్లటం,గుర్తించక ధిక్కరించడం అనేది వారి వారి మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది. తనని నమ్మని వారిని నమ్మించడం కోసం భగవంతుడు తన విశ్వరూపాన్ని వారి ముందు ప్రత్యేకంగా ప్రదర్శించటం జరగదు. ఇది భగవంతునికే కాదు, ఆయన తత్వాన్ని మన మధ్య ప్రచారం చేసే మహాపురుసులకు వర్తిస్తుంది.
శంకరాచార్య, రామానుజాచార్యుల మొదలుకొని ఏ తత్వభోధకుడు తన గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నం చేయలేదు. వారిలోని విజ్ఞానాన్ని, వారు వెతికిన కొత్త మార్గాన్ని ఇతరులు గమనించి వారిని మహాత్ములుగా పూజించారు. అదే విధంగా భఘవత్ బోధన చేస్తున్నవారు నేటి సమాజంలో కూడా ఉన్నారు. వారిని గుర్తించి, ఆదరించాల్సిన బాద్యత సమాజానిది. మనం గుర్తించినంత మాత్రాన నిజానికి వారికి పొయేదేం లేదు. వారి బోధనలు వినలేకపోవటం ద్వారా మనమే దురదృష్టవంతులుగా మిగిలిపోతాం.
అన్ని ఆశ్రమాలలోకి గృహస్థాశ్రమం ఉత్తమమైనది. గృహస్తు ద్వారానే ఇతర ఆశ్రమస్థులకి ఆహారం లభిస్తోంది. సామాజిక సాంస్కృతిక సంపద కాపాడబడేది గృహస్థు వల్లనే. పరస్పర సహకారం. చ్చిపుచ్చుకోవడం వీటి ద్వారా సామాజిక బంధం దృఢమయ్యేది గృహస్థాశ్రమం వల్లనే.
1. అపరిగ్రహ (ఇతరులనుంది ఉచితంగా ఏమీ స్వీకరించకపోవడం ), 2. సహనం. 3. విశాలభావం. $. ఇంద్రియనిగ్రహం. 5. చిత్తశుధ్ధి, 6. మనోనిఘ్రహం 7. లౌకికజ్ఞానం, 8. తాత్విక ఆలోచన, 9. సత్యమైన జీవితం 10. కోపం లేకపోవడం అనే పది గుణాలు ఉన్న గృహస్థు మహాత్ముడే.
నిత్యజీవితంలో పవిత్ర హృదయంతో ధర్మాచరణ చేసే గృహస్థు ఏ యోగికీ, జ్ఞానికీ తీసిపోడు. దేవునియందు ఏకాగ్రమైన భక్తి ఉన్న గృహస్థుకి భగవంతుని అభయము. ఆశ్రయం ఉంటాయి. భగవంతుని యందు విశ్వాసముంచి, ప్రతికర్మా ఆయనకే అర్పించి, అతిథి అభ్యాగతులను సేవించే కుటుంబీకుడు, దైవానికి ఎంతో ప్రీతిపాత్రుడు. గృహస్థుకి ఇంద్రియభోగాలు లక్ష్యం కాకూడదు.

సద్గురు వాణి...
మనమందరం బిచ్చగాళ్ళమే. మనమేపని చేసినా దానికి ప్రతిఫలం కోరుతూ ఉంటాం. మనమందరం వర్తకులం. మనకు జీవితంలో వ్యాపారదృష్టి, సుగుణాలలో వ్యాపార దృష్టి, మతంలో వ్యాపారదృష్టి, చివరికి ప్రేమలో కూడా వ్యాపారదృష్టేకదా!
మనం చిక్కుకుంటాము.. ఏ విధంగా? మనమిచ్చేదాని వల్ల కాదు. మనమాశించేదాని వల్ల. ప్రెమకు ప్రతిఫలంగా దు:ఖం సంప్రాప్తమవుతుంది. అది మనం ప్రేమించడం వల్ల కాదు. ప్రేమకు ప్రతిఫలంగా ప్రేమకోసం ఎదురుచూడడంవల్ల.
ఆశలేని చోట దు:ఖం లేదు. కోర్కె నుండే ఆశ నుండే సమస్త దు:ఖాలు పుడుతున్నాయి. ఆశలు జయాపజయాల నియమాలకు బధ్ధపడినవే..నిజమైన విజయంలోనూ, నిజమైన సౌఖ్యం లోనూ గల రహస్యమిది. ఎవరు ప్రతిఫలమాశించరో, ఎవరు సంపూర్ణంగా నిస్వార్ధులో వారు ఆందరికంటే అధిక విజయవంతులు.
ప్రతిఫలమాశించవద్దు. నువ్వియ్యవలసిందేదో ఇచ్చివేయి. అది తిరిగి నీ దగ్గరకు వస్తుంది. కానీ ఆ తలంపు నీకిప్పుడు వద్దు. అది వేయింతలై మళ్ళీ నీకు దక్కుతుంది.కానీ నీ దృష్టి దానిమీద ఉండదూడదు. ఇవ్వడానికి నీకు శక్తి ఉండాలి. నువ్వీయాలి. అంతటితో అది సరి. జీవితమంతా ఇవ్వడమే అని తెలుసుకోవాలి.
సూర్యుడు సముద్రమ్నుంది నీటిని గ్రహిస్తున్నది. మనకు వర్షరూపంలో తిరిగి ఇవ్వడానికే. పుచ్చుకోవడనికి, ఇచ్చివేయడానికి నీవు ఒక యంత్రం మాత్రమే. ఇచ్చివేయడానికే నీవు పుచ్చుకుంటావు కనుక ప్రతిఫలం కోరకు.


విదురనీతి 37
ధర్మం గా నిడిచేవారు, కోపం లేనివారు, జితేంద్రియులు, శుచులు,శీలము, విద్య కలవారు వీరిని పాత్రులు అంటారు. దాతకి అటువంటి లక్షణాలు కలవాడు దొరికితే అదృష్టంగా బావించి దానం చేయాలి. ధనము అవసరమయి ఇబ్బంది పడే సజ్జనులు కూడా పాత్రులుగా పరిగణించవచ్చు. అపాత్రుడు అంటే వ్యసనపరుడు, అధర్మపరుడు, అల్పబుధ్ధులు కలవాడు...అలాంటివాడికి దానం చేస్తే వాడు చేసిన పాపాల్లో భాగం దాతకి కూడా వస్తుంది. అందుకే అపాత్రదానం చేయకూడదు అని అర్ధం.
కూడబెట్టిన ధనం ఇతరుల పాలగును. అంతేగాక దానమీయకపోతే వైరాగ్యం అలవడకుండా సంసార బంధనం లోనే చిక్కుకుంటారు. బాహ్య వస్తువులను త్యజించలేని వాడు అంత:శత్రువులైన కామక్రోధాదులను ఎలా జయించగలడు?
"దానం చేయడం కర్తవ్యం" అనే బావంతో ప్రత్యుపకార భావన తలంపక కురుక్షేత్రాది పుణ్యప్రదేశాలలో సూర్యగ్రహణాది పుణ్యకాలాల్లో విద్యాతపస్సంపన్నులకు అర్పింపబడే దానాన్ని సాత్విక దానమంటారు. ప్రత్య్పకారం ఆశించీ, స్వర్గఫలం ఆషిచో, లేక ఇష్టంలేకుండా ఇచ్చే దానాన్ని తాజసిక దానమంటారు. అపవిత్ర స్థానాలలో, అశౌచాది స్థితిలో అయోగ్యులైన వారికి, వేశ్యాలోలురకూ, ఆటపాటలతో కాలక్షేపం చేసేవారికీ, తిరస్కార పూర్వకంగా చేసేదానిని తామసిక దానం అంటారు.
దానం చేయాలంటే ధనమే అక్కర్లేదు. మనసుంటే చాలు. పాత్ర ఎరిగి, ప్రత్యుపకారం ఆశించకుండా అవతలివారికి చేసే ఏ సాయమైనా దానంకిందకే వస్తుంది. దీన్నే ఉపకారం అని అనవచ్చు కానీ, ఉపకారానికి, దానానికి తేడా ఉంది దానం చేసే శక్తి కొందరిలోనే ఉన్నా, ఉపకారం చెయ్యగల సమర్ధత మారం అందరిలోను ఉంటుంది. సమస్యలతో కొట్టుమిట్టాడేవాడికి ఒక ఉపయోగ పడే సలహా ఇచ్చినా అది ఉపకారమే అవుతుంది. ఆపన్నులకు నేనున్నాను అని ధర్యం చెప్పడం, ఉపకారం చేసేవారికి సాయం చేయడం, ఫలనా వారు ఉపకారాలు చేస్తారు అని చెప్పడం, అక్షర జ్ఞానం కలిగించడం , వృధ్ధులకు వికలాంగులకు చేయూతనివ్వడం ఇలాంటివన్నీ ఉపకారాల క్రిందకే వస్తాయి.
చెట్లు, నీళ్ళు, గాలి, భూమిని సృష్టించిన దేవుడు, మనుషులకు వివేకాన్ని ఇచ్చాడు. ఆ వివేకం ద్వారా "పరోపకారం ఇదం శరీరం" అని తెలుసుకోవాలి. భగవంతుడు అనుకొన్నదాన్ని మనుజులు చేస్తే, వారు భగవంతునికి ఇష్టులు అవుతారు.
(ఇంకా ఉంది )
విదురనీతి 36
శీల సంపద:
ఆధ్యాత్మిక జ్ఞానానికి శీలం ముఖ్యమని కేనోపనిషత్తు చెబుతుంది. పుస్తకజ్ఞానం వల్లనో, పాండిత్యం వల్లనో ఆధ్యాత్మిక జ్ఞానసంపదలభించదు. మానవుడు శీలవంతుడు అనిపించుకోవాలంటే మంచి చెడు, ధర్మ-అధర్మ విచక్షణ కలిగి నడచుకోవాలి. విచక్షణ కలిగిన హృదయంలోనే ఆధ్యత్మికతకు చోటు వుంటుంది. ఎవరిలో కల్లాకపటంలేదో, ఎవరికి వక్రబుధ్ధిలేదో వారికే ఆధ్యాత్మికత సాధ్యమట.
బ్రహ్మసాక్షాత్కారమంటే పరిపూర్ణమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందడం. ఇంద్రియాలను తృప్తిపరిచే అల్పవిషయాలు తాత్కాలిక, అశాశ్వతమైన ఆనందాన్ని మాత్రమే ఇస్తాయి. స్వార్ధబుధ్ధిని విడనాడినపుడే అమనసు నిర్మలమవుతుంది. మానవునికి ధార్మిక చింతన అవసరం. వాక్కు గోవు కంటే పవిత్రమైనది. మంచి వాక్కు వలన శీలము, సంపదలు కలుగుతాయి. దానము వలన భోగము కలుగుతుంది. వృధ్ధులకు సేవ చేయుటవలన బుధ్ధిమంతులవుతారు. అహింస వలన దీర్ఘాయువు సిధ్ధిస్తుంది.
పద్మాలు సూర్యుని చేత ప్రకాశమైనట్టు, మనిషి ఉత్తమగుణాల చేత ప్రకాశవంతుడై కీర్తికాయుడవుతాడు. శాస్త్రీయ కర్మలను, లౌకిక కర్మలను నీవు భుజిచు వానిని, నీవాచరించే తపఒ, దాన హోమకర్మలను నాకర్పించు. ఇలా చేస్తే కర్మబంధనాల నుండి విడివడి జీవన్ముక్తిని పొందుతావు. ఇది శ్రీకృష్ణుని ఉవాచ.
దానధర్మములతో పాటు త్యాగము కూడా అవసరం. శిభి చక్రవర్తి, బలి తమకు ప్రాణం పోతుందని తెలిసి కూడ సత్యానికి, ధర్మానికి కట్టుబడి త్యాగశీలురైనారు. మనం ఇతరులకు ఏది ఇస్తే, అదే తిరిగి భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు. ఈ ధార్మిక సూత్రాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. అందుకే మనం పరులకు ఏమి ఇచ్చినా మంచివి, ఉపయోగపడేవే ఇవ్వాలి. మనకు అక్కరలేనివి ఇతరులకు ఇస్తే అది దానం కింద లెక్కలోకి రాదు. అది ధర్మం కూడా కాదు.
ధర్మంగా సంపాదించిన ధనం పాత్రులైనవారికే దానం చేయాలి కాని, అపాత్రులకు చేయకూడదు. పాతుర్లకు ఇవ్వకపోయినా, అపాత్రులకిచ్చినా కీడు లభిస్తుంది.
(ఇంకా ఉంది )
విదుర నీతి 35
కొందరికి ఎప్పుడూ దు:ఖమే. దు:ఖం వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఎందుకంటారా? వాళ్ళెపూడూ ఈర్ష్య, అసూయలతో రగిలిపోతూ ఉంటారు. పరహితం గిట్టదు. దీనంగా ఉంటారు చూడడానికి. వాళ్ళ మీద వాళ్ళకే జాలి, సానుభూతి, ఎంతౌన్నా లేదనో, సరిపోదనో, అసంతృప్తితో అల్లలాడుతుంటారు. వాళ్ళకి ఎప్పుడూ అసంతృప్తే ఎప్పుడూ పరగడుపే. అస్తమానూ కోపంతో ఉంటారు. శాంతంగా ఉండడం చాతకాదు. పైగా నిత్యశంకితులు. అందరిమీదా అనుమానం. అన్నిటిమీదా అనిమానం. ఈఅ అవలక్షణాలకు తోడు, ఇతరుల సొమ్ముమీద బ్రతికేయాలని నీచ స్వభావం. ఇక చెప్పేదేముంది? వీళ్ళు పనికిమాలిన వాళ్ళను సహాయకులుగా నియమించుకొని, వారి సలహాలు వింటుండడం వలన పాలకులుగా పాడైపోతారు.
గారం చేయడం వలన కొడుకు పాడైపోతాడు. కొరగాని కొడుకువల్ల కులం చెడిపోతుంది. చెడ్డవాళ్ళని సేవించడం వల్ల మనుషుల్లో మంచితనం పోతుంది. త్రాగితే సిగ్గుపోతుంది. భర్యాభిడ్డలకు దూరంగా, దేశంకాని దేశంలో ఏళ్ళ తరబడి ఉంటే ప్రేమానురాగాలు సన్నగిల్లుతాయి. దుడుకుతనం వలన సజ్జన స్నేహం చెడుతుంది. అవినీతివల్ల ఐశ్వర్యం పోతుంది. అజాగ్రత్త వలన పరాకు వలన డబ్బు పోతుంది. ఈ మాట విదురుడు పదే పదే చెపుతాడు.
గోవులు, సేన, వ్యవసాయం, భార్య, విద్య, స్నేహం అనే ఆరింటిని జాగ్రత్తగా కాపాడుకోవాలిట. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చెడిపోతాయట. గోవులకు మంచి గ్రాసాన్ని , పుష్టికరమైన పదార్ధాలను పెట్టి రక్షించుకోవాలి. అయోగ్యుల, సేవించరాని వారి సేవ చేయకుండా ధర్మపరుల్ని ఉత్తముల్ని సేవించాలి. సరైన పెత్తనంతో వ్యవసాయాన్ని రక్షించుకోవాలి. భార్య పట్ల ప్రేమకలిగి ఉండి ఆవిడ అచ్చట ముచ్చట తీరుస్తూ ఆమెను దగ్గర చేసుకోవాలి. అబ్యాసంతో విద్యను పెంపొందించుకోవాలి. ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, మంచి స్నేహితులుండటం నిజంగా గొప్ప. సజ్జనస్నేహాన్ని నిలుపుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆస్నేహం అమృతసమానం కాబట్టి.
(ఇంకా ఉంది )
విదురనీతి 34
చేయాల్సినవి--చేయకూడనివి.
వట్టి వదరుబోతుల్ని, వాజమ్మల్ని, పొల్లు మాటలు, చచ్చు మాటలు మాట్లాడే వాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని శీలం లేని వాళ్ళని, నీతిలేని వాళ్ళని, దగాకోరుల్ని, గుణహీనుల్ని, గద్దెనెక్కిస్తే, ప్రజలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు అని విదురుడు హెచ్చరించాడు. అవసరకాలంలో ఆపద సమయంలో ఆదుకోని రాజును తక్షణమే వదిలేయాలని కూడా విదురుడు చెప్పాడు. ఒక్క రాజే కాదు, అలా తక్షణం వదిలించికోవలసిన జాబితా ఒకటి ఇచ్చాడు ఆయన.
"గు" అంటే చీకటి, "రు" అంటే నిరోధించడం. అజ్ఞానాంధకారాన్ని తొలగించాల్సినవాడు, జ్ఞానాన్ని కలిగించాల్సిన వాడు గురువు. సర్వార్ధాలను చెప్పవలసిన వాడు, బోధ చేయల్సినవాడు గురువు. అలాంటివాడు నేను నా ధర్మాన్ని నిర్వర్తించలేను అంటే కుదరదు. అలాంటి వారిని వదిలించుకోవాలి.
అంతేకాక, యజ్ఞ యాగాది క్రతువులు చేయని ఋత్విక్కును, ఎప్పుడూ అప్రియాలు పలికే ఆలిని, ఊరొదిలి వెళ్ళటానికి ఇష్టపడని పశులకాపరిని, వెంటనే వదిలించుకోవలిట. అలా చేయకపోతే, వారిని వారి ధర్మాలు నిర్వర్తించడంలో అడ్డుకున్నవాళ్ళం అవుతాము. దాని ఫలితం మనమె అనుభవించాలిట. సరీయిన మనుషులను, సరి అయిన వృత్తిలో నియమించి, వారు ఆ వృత్తుల్ని సక్రమంగా నిర్వహిస్తున్నదీ లేనిదీ ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. దీన్నే కార్యనిర్వహణ అంటారు.
మనిషై పుట్టాక వదిలిపెట్టకూడని గుణాలు ఆరు ఉన్నాయి. అవి 1. సత్యాన్నే పలకడం, 2. దానబుధ్ధి లకిగియుండటం, 3. సోమరితనం లేకుండా ఉండటం, 4. అసూయ లేకుండా ఉండటం 5. ఓర్పు, 6. ధైర్యం కలిగి యుండడం. ఇవి విడువరానివి, మరువరానివి.
(ఇంకా ఉంది )
విదురనీతి 33
అహమే మూలం:
"అన్నింటికి మంచి ఆలఒచనలే మూలం. మొట్టమోదటిది ఇతరులనుండి ఆశించడం కంటే ఇతరులకు ఇవ్వడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. ఇది గుర్తిస్తే, ఎవరిమీద ఎటువంటి ద్వేషభావం, కోపం ఉండదు." అన్నాడు విదురుడు.
అదెలా సాద్యం? అని అడిగాడు ధృతరాష్ట్రుడు.
"ఎటువంటి విపరీత పరిస్థితులలోనయినా కృంగిపోకూడదు. ఇతరుల సానుభూతి కోసం వెంపర్లాడకూడదు. మనో నిబ్బరాన్ని కోల్పోకూడదు. మన మనోస్థైర్యమే అన్ని సద్గుణాలకు ఆలంబన అవుతుంది. కోపం, అహంకారం వల్ల పరాజితులం అవుతామని తెలుసుకోవాలి. అహమే అన్ని అవలక్షణాలకు మూలం. అహంవల్ల ఇతరులను ప్రేమించలేము. ఇతరులు చెప్పింది సహనంతో వినలేము. ఇతరుల పట్ల దయగా ఉండలేము. కనుక మొట్టమొదట పోగొట్టుకోవలసినది అహమే". వివరించాడు విదురుడు.
(ఇంకా ఉంది)
విదురనీతి 32
కార్యసిధ్ధి ఎలా ఉండాలి?
ఒక కార్యాన్ని మనం చేపట్టి దాన్ని సిధ్ధింపచేసుకునే ప్రయత్నం లో పొందే ఫలితం ఉభయతారకంగా ఉండాలి. ఏకపక్షంగా ఉండరాదు.
ఉదాహరణకు, పక్వం కాని ఫలాన్ని కోయడం వల్ల అది తినడానికి రుచిగా ఉండకపోవడమే కాక దానిలోని విత్తు మరో చెట్టు పుట్టడానికి కూడా ఉపయోగపడకుండాపోతుంది. ఇలాంటి కార్యం చేయడం వల్ల తనకూ ప్రయోజనం ఉండదు. ఇలాంటి కార్యం సరైంది కాదు. కార్యసిధ్ధికి మనం కొన్ని ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మహాభారతంలో విదురుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా చెప్తున్నాడు.
పూలతోటను ఎంతో శ్రధ్ధతో పెంచి పెద్దచేసిన తోటమాలికి పూలు ఎలాగ కోయాలో తెలుసు. అతడు నేర్పుగా పూలను కోస్తాడే తప్ప, కొమ్మలు విరచడమో, రెమ్మలు తుంచడమో, మొగ్గలను చిదమడమో చేయడు. చెట్టుకు ఎలాంటి హానీ జరుగకుండా తన పని తాను చేస్తూ చెట్టుకు చేటు లేకుండా ఉభయతారకంగా పనిచేస్తాడు.
అలాగే తేనెటీగ కూడా తోటంతా తిరిగి, వివిధ రకానైన పూలమీద వాలి వాటిలోని మకరందాన్ని అతినేర్పుగా తీసుకుంటుందే తప్ప, పూలకేలాంటి హానీ చేయకుండా, ఉభయ తారకంగా "ఫలదీకరణ" జరగడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే మనం కూడా ఏదైనా ఎదుటివాడికి హాని జరుగకుండా ఉండేలా నడుచుకుంటూ అతని మనసు రంజింపచేస్తూ మనకార్యం సిధ్ధింపచేసుకోవాలే కాని, బొగ్గులకోసం ఎవరైనా కల్పవృక్షాన్ని మొదలంటా నరుక్కుంటారా? అని విదురుడు ధృతరాష్ట్రునికి నీతిబోధ చేస్తాడు.
ఇక్కడ అర్ధం...పాండవులు కల్పవృక్షాలవంటి వారు. వారితో ఎవరైనా విరోధం తెచ్చుకుంటారా? నీవె మధ్యవర్తిగా ఉండి ఈ కార్యాన్ని ఉభయతారకంగా ఉండేలా చేయవచ్చు కదా! మహాబలులైన భీమార్జునులు తలచుకొంటే చేయలేని పనిలేదు. వారి అండ నీకెంతో అవసరం కూడాను. వారు న్యాయసమ్మతంగా వారికి రావలసిన రాజ్యభాగాన్ని కూరుతున్నారే తప్ప, మీకెలాంటి హాని చేయాలని తలపెట్టలేదు కదా!ఇటువంటప్పుడు నీవు పెద్దవాడిగా ఈ కార్యాన్ని ఇరుపక్షాలకు మేలు కలిగేలా చేయక, వారి రాజ్యాన్ని వారికివ్వక, మౌనంగా హితోక్తులు వింటున్నావు అని విదురుడు అంటాడు.
(ఇంకా ఉంది )
విదురనీతి 31
మానవ స్వభావం గురించి విదురుడు చెప్తున్న సంగతులు ఇలా ఉన్నాయి.
ప్రతిమన్సిహికి ఒక స్వభవం ఉంటుంది. అది మనుషుల మానసిక దృక్పథాని, వారు సమయాన్ని గడిపే తీరును కలబోస్తే తయారవుతుంది. ఒక మనిషి స్వభావమే మంచి చెడుల్ని నిఋనయిస్తుంది. ఒకసారి రూపుదిద్దుకున్న స్వభావాల్ని మార్చడం అంత సులువు కాదు. కనుకనే ఎవరికైనా ఒక మూర్తిమత్వం ఏర్పడే దశలోనే నిర్దిష్ట స్వభావం రూపెందేలా ప్రయత్నించాలి.
ఖమాగుణంలో ఎందరో చరిత్రలో మానవత్వానికి ప్రతీకలుగా నిలిచిపోయారు. అనాదిగా శాస్త్రాలు, వేదాలు మనిషి శాంతియుత సహజీవనంతో మెలిగేందుకు ఉద్భోదలు, ఉపదేశాలు చేసాయి. వాటిలో కొన్ని:
1. సహాయం చేసినవారికి తిరిగి సహాయం చేయడం కాదు, అపకారం చేసినవాడికే మేలు చేయాలి.
2. శాంతాన్ని మించిన తపస్సు లెలదు. సంతోషానికి సమానమైన సుఖం లేదు. తృష్ణను మించిన అనారోగ్యం లేదు, కరుణను మించిన ధర్మం లేదు.
3.తమకన్నా బలవంతుణ్ణి, భయం వలన క్ష్మిస్తారు. సహచరుణ్ణి లోకనిందకు భయపడి, సాటివాడనే దృష్టి తో క్షమిస్తారు. తనకన్నా బలహీనుడు చేసే తప్పిదాలను క్షమించే మనిషి, మనిషి కాదు, మహనీయుడే! అని గ్రహించాలి.
(ఇంకా ఉంది )
విదుర నీతి 30
పాపపుణ్యాల గురించి మన రోజూ చాలా మాటలు వింటూ ఉంటాం. మనకు నచ్చిన పనికి పుణ్యమనీ, నచ్చని పనికి పాపమనీ పేర్లు పెట్టి తృప్తిపడుతుంటాం. సత్యం, అహింస, పరోపకారం,న్యాయం, ధర్మం, ప్రేమ, ఇల్లంటివన్నీ పుణ్యకార్యాలకు ప్రేరణ గుణాలనీ, అసత్యం, అపకారం, అధర్మం, హింస ఇలాంటివన్నీ పాపకార్యాలకు ప్రేరక లక్షణాలనీ నిర్వచిస్తాం. అన్ని తెలిసీ, పాపమే చేస్తుంటాం. ప్రవచనం విన్న కాసేపు మనస్సు నిర్మలంగా ఉంతుంది. మంచినే ఆలోచిస్తుంది. పుణ్యమ చేయాలనిపిస్తుంది. ఒకసారి తెలియక పొరపాటున తప్పటడుగు వేసినప్పటికీ ఇది తప్పు అని తన అంతరాత్మతో తెలుసుకుని, భవిష్యత్తులో ఆ తప్పును మరోసారి చేయని వాడే నీతిమంతుడు. తాను చేసిన తప్పును ఇతరుల ముందు వ్యక్తీకరించి ప్రాయశ్చిత్తం చేసుకుంటే మనిషి పవిత్రుడవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందరో మహానుభావులు ఈ సూత్రాన్ని పాటించి పావనులై లోకానికి ఆదర్శవంతులైనారు. పదేపదే తప్పు చేస్తూ పాపకూపంలో కూరుకుపోయేవాణ్ని ఎవరూ రక్షించలేరు. తాను చేస్తున్న తప్పుల్లో పాలుపంచుకునేవారంతా "నీ పాప ఫలితాన్ని నీవే అనుభవించు" అని దూరంగా వెళ్ళిపోతారు. అప్పుడు అతని పశ్చాత్తాపానికి హద్దుండదు.
(ఇంకా ఉంది )
విదుర నీతి 29
పాపపుణ్యాల విచక్షణ :
మానవులు ఎలాంటి పుణ్యకార్యాలనూ చేయడానికి ఇష్టపడరు. కాని పుణ్యఫలాన్ని మాతం ఆశిస్తారు. పాపఫలితాన్ని ఆశించరు. కాని పాపకార్యాలను మాత్రం ప్రయత్నపూర్వకంగానే చేస్తారు.--అని ధర్మ నీతి శాస్త్ర నిర్వచనం.
ఇంతకీ పాపం అంటే ఏమిటి? పుణ్యం అంటే ఏమిటి?
" పరోపకారాయ పుణ్యాయ, పాపయ పరపీడనం"..అంటే, ఇతరులకు చేసిన మేలు పుణ్యం అనీ, ఇతరులను పీడించడం వలన పాపం సంక్రమిస్తుంది అనీ శాస్త్రవచనం.
పూర్వజన్మల్లో చేసిన పాపదోషాలవల్లనే ఈ జన్మలో శారీరక, మానసిక వ్యాధులు వచ్చి పీడిస్తున్నాయి అని మనం గ్రహించాలి. పాపం వలననే దు:ఖాలు వస్తాయి. పాపము లేనప్పుడు ఆనందం కలుగుతుంది. ఏకొంచెం దు:ఖం కలిగినా అది పాప ఫలమే కాక వేరొకటి కాదు. పాపదోషం అనుభవించితే తప్ప పోదు.
అడవుల్లో ఉన్నపుడు, యుధ్ధంలో శత్రువుల మధ్య, నీటి మధ్య, అగ్నిమధ్య ఉన్నపుడు, సముద్రంలో సాగుతున్నపుడు, పర్వత శిఖరాలను ఎక్కుతున్నప్పుడు, నిద్రలో, అజాగ్రత్తలో , సంకటపరిస్థితులలో మానవుడిని తాను పూర్వ జన్మలో చెసిన పుణ్యాలే కాపాడుతాయి.
"ఒరులేయని యొనరించిన
నరవర యప్రియము తన మనంబునకగుదాన్
ఒరులకు నవి సేయకునికి
పరాయణము పరమధర్మ పధములకెల్లన్"
"ఇతరులు తనయందు ఏ విధంగా ప్రవర్తిస్తే, తన మనస్సు కలత చెందుతుందో అదే విధమైన ప్రవర్తనను ఇతరుల యందు నీవు కలిగియుండకుండుటే అన్ని ధర్మములలోకి కూడా ఉత్తమమైన ధర్మము". అని విదుర వాక్కు.
పుణ్యం చేయడం చేతకాకున్నప్పటికీ ఈ ధర్మాన్ని ఆచరిస్తే చాలు.
ఈ లోకంలో పుణ్యం కాని, పాపం కాని, ఇతరుల నుంచి మనం తీసుకోలేము. తాను చేసిన పాపకర్మవల్లనే దు:ఖం కలుగుతుంది. తాను చేసిన పుణ్య కర్మ వల్లనే సుఖము కలుగుతుంది. ఈనాడు నవ్వుతూ చేసిన పాపకర్మకి రేఉ ఏడుస్తూ దు:ఖాన్ని అనుభవించకతప్పదనే సత్యాన్ని మన గ్రహించాలి.
(ఇంకా ఉంది )
విదుర నీతి 28
8. ఈ మూడింటిపట్ల మమకారం కలిగి ఉండు!
1. ఈశ్వరుడు 2. సదాచారము 3. పేదలు
9. ఈ మూడింటిని హృదయమండు ఉంచుకో!
1. దయ 2. క్షమ 3. వినయము
10. ఈ మూడు వ్రతాలు పాటించు !
1. పరస్తీని మోహించకుండుట. 2. పర ధనము పట్ల ఆసక్తి లేకపోవుట 3. అసహాయులకు సేవ చేయుట.
11. ఈ ముగ్గురిని పోషించడం నీకర్తవ్యం గా భావించు!
1. తల్లితండ్రులు 2. భార్యాబిడ్డలు 3. దు:ఖమునందున్నవారు.
12. ఈ ముగ్గురిపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపు !
1. వితంతువు 2.అనాధలు 3. నిరాధారులు
13. ఈ మూడింటిని లెక్క చేయవద్దు!
1. ధర్మాన్న్నిపాటించే సమయంలో కలిగే కష్టాన్ని. 2. పరుల కష్టాన్ని తోల్గించునపుదు కలుగు ధన నష్టాన్ని 3. రోగికి సేవ చేయునపుడు పొందే శరీర కష్టాన్ని.
14. ఈ మూడింటిని మర్చిపో !
1. నీవు ఇతరులకు చేసిన సాయం 2. ఇతర్లు నీకు చేసిన కీడు 3. దబ్బు, గౌరవం, సాధనల వల్ల సమాజంలో నీకు కలిగిన ఉన్నత స్థితిని
15. ఈ మూడు విధాలుగా మారకు
1. కృతఘ్నుడు 2. డాంబికుడు 3. నాస్తికుడు.
(ఇంకా ఉంది )