Wednesday, 18 February 2015

రథసప్తమి - విశేషాలు
ఓం ఆదిత్యాయ నమః
జనవరి 26, సోమవారం ‪#‎రథసప్తమి‬
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 ‪#‎తెల్లజిల్లేడు‬ ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.
ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||
అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.
ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.
సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.
రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.
రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి ‪#‎దేశీ‬ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి
courtesy : Eco Ganesh.
శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం హిందువు లదే అని భావించే వారు ఒట్టి మూర్ఖులు. విజ్ఞానం ఒకరి కోసమే పరిమితం అవుతుందా? విజ్ఞానం అనేది అందరికీ ఉద్దేశించినది. భగవద్గీతను వయసు మళ్ళిన వారి కోసం, అనుకునే వారు, గీతను చదివితే, సన్యాసం పుచ్చుకున్నట్లే అనుకునేవారు వెర్రివాళ్ళు. నిజం చెప్పాలంటే, గీతను, చిన్న వయసు నుంచే చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, యవ్వనము, గృహస్తాశ్రమము, వానప్రస్తము అనే ఈ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించ వచ్చును.
మానవుని జీవితం లో కలిగే అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేది గీత. ప్రత్యక్షం గా కాకపోయినా, మానవుడు తనను తాను తెలుసుకొని, తన లోపలికి తొంగి చూసుకుని, తన అంతరంగాన్ని విశ్లేషించుకొని, తను చేసే తప్పొప్పులను కనుగొనడానికి 'గీత' ఎంతగానో తోడ్పడుతుంది. పొగడ్తలకు పొంగిపోయి, విమర్శలకు కుంగిపోకుండా, సుఖాలలో ఒళ్ళు మరచిపోయి, దుఖాలలో మనో వేదనకు గురికాకుండా, ఒక స్థిరమైన మన:స్థితిని "గీత" మనకు నేర్పిస్తుంది. దీనినే "స్థితప్రజ్ఞత" అంటారు.
మన బుద్ధిని పక్క దారులు పట్టనీయకుండా, మనలను మనము నియంత్రించుకునే పాటవం మనకు గీత చదవడం వలన లభిస్తుంది.
తాను చేసే కర్మలు అన్నీ, తన కోసం కాకుండా, భగవంతుని కోసమే అనే భావనలో, సర్వ ప్రాణి మనుగడను, సర్వ లోక హితాన్ని, బోధిస్తుంది భగవద్గీత. అరిషడ్వర్గాలను జయించి, ప్రశాంత చిత్తమును కలిగి ఉండడం ఎలాగో గీత నుంచి మనం తెలుసుకోవచ్చు.
ఇవన్నీ ఒక ధర్మనికో, మతానికో పరిమితం కాదు కదా, ఒక వయసుకు పరిమితం కాదు కదా, అటువంటప్పుడు భగవద్గీత ఒక్క హిందూ ధర్మానికే ప్రతీక అని ఎందుకు భావించాలి? ఎన్నో వ్యక్తిత్వ వికాసా గ్రంధాలు, నిపుణుల వలన పొందలేని ప్రయోజనాలు కేవలం భగవద్గీతను పఠించి, అర్ధం చేసుకుని ఆచరించడం వలన పొందవచ్చు.
మానవాళి ప్రగతికి , మానవ జాతి యొక్క వికాసానికి, ధర్మ పరిరక్షణకు భూమి మిద అవతరించిన ఒక ఉద్గ్రంధం "శ్రీ మద్భగవద్గీత". దీనిని కేవలం ఒక మతానికో, ధర్మానికో పరిమితం చేయకండి. సంకుచితం గా ఆలోచించకండి.
బాల్యం నుంచి, పురాణాలు, శాస్త్రాలలోని విషయాలు మీ పిల్లలకు చెప్తూ ఉండండి. వారు పెరిగి పెద్దవారి సమజానికి , దేశానికి ప్రయోజకులుగా తయారు అయ్యేలా పిల్లలను పెంచండి. ఇది ఈ సమయం లో ఎంతో అవసరం.
ఉమ్మడి కుటుంబాలు--కుటుంబాలలో, సమాజం లో ఒక్కరి కోసం అందరు-అందరి కోసం ఒక్కరు అనే కట్టుబాట్లు మనవి. . చెట్టు-పుట్ట, పశువు-పిట్ట, నీరు-నిప్పు, గాలి-భూమి --ఇలా ప్రకృతి లోని ప్రతి అణువునూ ప్రేమించి పూజించే పవిత్రమైన భావన మనది. పరోపకారార్ధం ఇదం శరీరం అనే ఉపనిషద్ వాక్యాన్ని రోమరోమానా ఇముడ్చుకున్నాం. అంతరిక్షం లోకి, సముద్ర గర్భం లోకి వెళ్ళగలిగిన ప్రగతిని సాధించిన మనం మరి సాటివాడి మనసును ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇంత వేగంగా పురోభివృద్ధిని సాధించిన మనం ఎందుకు మానవ సంబంధాల విషయం లో తిరోగమనం సాగిస్తున్నాం? కుటుంబాలలో, బాధ్యతలు పంచుకోవటమే తప్ప, హక్కుల కోసం పోరాడడంతెలియని మన జీవితాలలో డబ్బు అనేది ఎలా ప్రవేశించింది? పెద్దల పట్ల గౌరవం, మమకారం, మానవత్వంచిన్నతనం నుంచి పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పేమన సంస్కృతీ లో అవన్నీ ఏ కాలం లో చచ్చిపోయాయి? కాలానుగత మార్పుల్లో, ఏ మలుపులో మనం ఇంత స్వార్ధంగా మారిపోయాం? మనుషుల కన్నా, మనీ ముఖ్యం అయింది.. ప్రకృతి నుంచి పరోపకారం నేర్చుకున్న మనం ఈరోజున పొరుగువాడిని పలకరించడానికి కూడా ఎందుకు భయపడుతున్నాం? మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే అని అంగీకరిస్తున్నామా?
కొంత నడివయసు వాళ్ళు, కొంతమంది నాలాంటి చాదస్తులు, మారుతున్నా సమాజ పోకడలు చూసి సహించలేక, వీటన్నిటికీ మన సంస్కృతిని , నాగరికతను, ధర్మ గ్రంధాలను మర్చిపోవడం ఒక కారణం అని గ్రహించుకుని, మన సమాజం బాగుపడాలంటే ఇప్పటి పిల్లలకు, యువతకు మార్గనిర్దేశనం చెయ్యాలి అని భావించి, ఆ దిశగా కృషి చేస్తుంటే, అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాము అంటూ కొంతమంది భ్రష్టులు వక్ర బుద్ధితో వాటిని చదివి, ఈ పురాణాలు అన్నీ పుక్కిటి పురాణాలు అని, సమాజం లో విషం చిమ్మాలి అని ప్రయత్నిస్తున్నారు. అంటే, మన ఇంటికి అగ్గి పెట్టేవాళ్ళు మన ఇంట్లోనే ఉన్నట్టు. ఉగ్రవాదుల కన్నా మహామ్మరులు వీళ్ళు. మన పురాణాలు అన్నీ మాయలు, మంత్రాలూ కావు. అవి అన్నీ వాస్తవంగా జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మన గ్రంధాలలోని సారాంశాలను విదేశీయులు కూడా నేర్చుకుంటుంటే, మన తెలుగు వాళ్ళకే వస్తోంది పోయేకాలం. ఇతర మతాల వాళ్ళు వారి వారి మతం మిద ఇంత రచ్చ చేసుకోవడం ఎప్పుడూ వినం మనము. ఏ ధర్మం అయినా సమాజం లో మంచిని పెంచడానికి, వ్యక్తులకు హితం చేకూర్చడానికే పాటుపడింది. అందునా ప్రత్యేకించి మన భారత దేశం లో హిందూ ధర్మం అందరూ ఒక్కటే, అని బోధించి, సమసమాజ నిర్మాణానికి ఎంత కృషి చేసిందో, చెట్టు-పుట్ట, నీరు-నిప్పు, గాలి-వాయువు, ఇవన్ని సురక్షితం గా ఉంటేనే, మనవ జాతి మనగలదు అని ఎంత చక్కగా బోధించిందో, మన " శాంతి మంత్రములు" చదివి అర్ధం చేసుకుంటే తెలుస్తుంది. అటువంటి ధర్మం మీద, ధర్మ గ్రందాల మీద, ఇన్నన్ని అభాండాలా? ఒకవేళ వాటిలో తప్పుడ్లు ఉన్నా, ఈ సంధికాలం లో వీటన్నిటి మిద చర్చ జరగటం అంత అవసరమా? భారతీయులన్దరిలోను ఐక్యత సాధించడం తక్షణ కర్తవ్యమ్ అయిన ఈ సమయం లో ఇటువంటి చర్చలు ఎంత అశాంతికి దారి తీస్తాయి? చానల్స్ కి ఏముంది-వాటి trp రేటింగ్ పెంచుకోవడానికి ఏ గడ్డి అయినా తింటాయి. దయచేసి ఇటువంటి చానల్స్ ని బాన్ చెయ్యండి. ఇటువంటి చర్చలకు ప్రోత్సాహం ఇవ్వకండి. ఇటువంటి వాటికీ వ్యతిరేకంగా తెలుగు వారు ఐక్యంగా పోరాడవలసిన సమయం వచ్చింది. దయచేసి, మీ పోస్ట్ ల ద్వారా, భరతీయ సంస్కృతిని యువతకు తెలిపి, వారిని మంచి మార్గం లో నడిపించండి. భారతీయ సంస్కృతీ వ్యాప్తికి ఇతోధికం గా కృషి చేయండి. సెలవు. నమస్కారం. _
ఆడపిల్లల వస్త్రధారణ గురించి, పెద్దవారు తెలిసినవారు ఎవరైనా చెప్పిన మాటలకు, మహిళల స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోసం రోడ్డెక్కి కిస్ అఫ్ లవ్ ప్రోగ్రాం లు పెట్టే, వారిని సమర్ధించే మహిళా సంఘాల ప్రతినిధులకు ఒక్క మనవి. మీరు రోడ్డెక్కి రచ్చ చేయాల్సిన సంగతులు మన దేశం లో చాలా ఉన్నాయి.
1. ఎంతో మంది చిన్నపిల్లలను, యువతులను మోసగించి, పెద్ద పెద్ద నగరాలలోని వ్యభిచార కూపాలకు తరలిస్తున్నారు. వారందరూ, ముసలి వయసు లో దిక్కు మొక్కు లేక వివిధ వ్యాధుల బారిన పడి బ్రతికుండగానే నరకం చూస్తున్నారు. వారి జీవనాధారం విషయం లో పోరాడండి.
2. పైన చెప్పిన మహిళలు అటు ప్రజల, అటు పోలిసుల దోపిడీకి గురి అవుతున్నారు. వారి కోసం పోరాడండి.
3. బృందావనం లాంటి పుణ్య క్షేత్రాలలో అనాధలైన పెద్ద వయసు మహిళలు తినడానికి తిండి కూడా లేకుండా, అక్కడి పండాల, పోలిసుల దోపిడీకి గురి అవుతున్నారు. వారి గురించి పోరాడండి.
4. నగరాలలో కూడా పలు ప్రైవేటు , ప్రభుత్వ పాఠశాలల్లొ కనీస మరుగుదొడ్డి సౌకర్యాలు లేకుండా, నెలసరి సమయాలలో ఎంతో మంది విద్యార్ధినులు ఇబ్బంది పడుతున్నారు. వారి సౌకర్యాల కోసం పోరాడండి.
5. రాజకీయంగా కొన్ని సీట్లను వివిధ స్థాయుల్లో మహిళలకు కేటాయించినా , పరిపాలన మొత్తం వారి భర్తల జులుం ప్రకారం నడిపే మహిళా నేతలు ఉన్న గ్రామాలు, పట్టణాలు ఎన్నో ఉన్నాయి. వారి కోసం పోరాడండి.
6. ఎంతో అభివృద్ది సాధించిన నగరాలలో కూడా ఈనాడు సగటు మహిళలకు రక్షణ లేదు సరికదా, అన్యాయానికి గురి అయిన మహిళకు సత్వర న్యాయం కూడా జరగడం లేదు. వారి రక్షణ కోసం పోరాడండి.
7. ప్రతి స్కూల్, కాలేజీ, రీసెర్చ్, అన్ని స్థాయుల్లో విద్యాసంస్థల్లో యువతులు, మహిళలు వంచనకు, లైంగిక దోపిడీకి గురి అవుతున్నారు. వారి క్షేమం కోసం పోరాడండి.
8. సునందా పుష్కర్ వంటి ఉన్నత వర్గానికి చెందిన మహిళ మృతిపై కూడా ఎన్నో అనుమానాలు. అటువంటి కేసులలో సత్వర పురోగతికి పోరాడండి.
9. దేశం లోని ఎన్నో గ్రామాలలో ఈనాటికీ ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఎంతో మంది మహిళలు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి నెలకొని ఉంది. అటువంటి వారి సౌకర్యాల కోసం పోరాడండి.
10. దొంగ స్వామిజిల మాటల మాయలో పడి ఎంతో మంది మహిళలు మోసపోతున్నారు. అటువంటి దొంగ స్వామిజిలకు వ్యతిరేకంగా పోరాడండి.
మహిళల స్వేచ్చ స్వాతంత్ర్యాలు అంటే కేవలం ఎవరికీ నచ్చినట్టు వస్త్రధారణ చేసుకోవట మెనా ? స్వేచ్చ పేరుతొ, పబ్బులకు, లేట్ నైట్ పార్టీలకు వేల్లటమేనా? అసలు మీ ఉద్దేశ్యం లో స్వేచ్చ స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ముందు మీ ఐడియా క్లియర్ గా ఉంటె, రోడ్డెక్కి తరువాత రచ్చ చేయచ్చు. మీరు రచ్చ చేయాల్సిన విషయాలు దేశం లో చాల ఉన్నాయి. వాటి గురించి కూడా కాస్త పట్టించుకోండి.
తెలుగు చిత్రసీమ లో తిరుగులేని నిర్మాతగా, మూవీ మొఘల్ గా పేరొందిన డా. డి. రామానాయుడు గారు కాన్సర్ వ్యాధి తో ఈ రోజు మరణించారు. పట్టినది బంగారం అనే నానుడికి చక్కని ఉదాహరణ రామానాయుడు గారు. ప్రముఖ భారతీయ భాషలు అన్నిటిలో చిత్రాలు నిర్మించిన ఘనత ఆయనది. ఒకే ఒక వ్యక్తీ శతాధిక చిత్రాలను నిర్మించి ప్రపంచ రికార్డును కూడా స్థాపించారు. అందులో అధిక శాతం విజయ వంతం అయ్యాయి. నంది అవార్డు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు, జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్ర నిర్మాత అవార్డు లతో పాటు, పద్మ భూషణ్ అవార్డు ను కూడా పొందిన గొప్ప నిర్మాత మన తెలుగు వాడు కావటం మన అందరికీ గర్వకారణం. బాపట్ల నుండి లోక్ సభకు ఎన్నికై రాజకీయాలలో కూడా సేవ చేసారు. చలన చిత్ర పరిశ్రమలో మంచి నిర్మాతగా నే కాకుండా, కార్మికుల మంచి చెడ్డలు చూసే వ్యక్తిగా, వారి సంక్షేమం కోసం పనిచేసిన మంచి వ్యక్తీ గా ఆయనకు మంచి పేరు ఉంది. అయన ఆత్మ కు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ..
శరన్నవరాత్రుల పుణ్య కాలం వచ్చేసింది. అమ్మవారి పూజలలో కేవలం తెలుగు ప్రజలే కాక, యావత్ దేశం అంతటా దేవి పూజలు జరుపుకుంటారు. అమ్మ దయ ఉంటె, అన్ని ఉన్నట్టే అని చెప్పుకుంటాం మనం, తమ బిడ్డలను అమ్మ కాక ఇంకెవరు కడుపులో పెట్టుకొని చూసుకోగలరు?
త్రిమూర్తుల అంశతో జగన్మాత ఆవిర్భవించింది అని చెప్తారు. అంటే, సృష్టి, స్థితి, లయ కారకులు కదా త్రిమూర్తులు అంటే,!ప్రతి ఇంటిలోనూ, సృష్టి చేసేది అమ్మ, అంటే జన్మ నిచ్చేది అమ్మ. మన పోషణ, పెంపకం విషయాలు చూసుకునేది అమ్మ. ఆ జగన్మాత భూమి మిద జనుల క్షేమం కోసం, రాక్షసులతో పోరాడి విజయం సాధించినట్లే, ఇంటిలో అమ్మ కూడా, మన లో ఉన్న దుష్ట భావాలు, దుష్ట గుణాలు అనే రాక్షసులతో పోరాడి మనను పెంచి పెద్ద చేయడం లో విజయం సాధిస్తుంది.
మనం సాధారణంగా వసంత ఋతువులో వసంత నవరాత్రులు, శరదృతువు లో జరుపుతాము. వసంత కాలం లో చెట్లు చిగిర్చి, ప్రక్రుతి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. అలాగే శరదృతువులో వెన్నెల ఎంతో ఆహ్లాదంగా ఉండి మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అన్ని రుతువులలోకీ శరదృతువు వెన్నెల ఆ తల్లి కరుణ వలెనే ఎక్కువ చల్లగా, ఎక్కువ కాంతితో కూడి ఉంటుంది. వాతావరణం కూడా ఎక్కువ ఎండా, ఎక్కువ చలి లేకుండా చక్కటి సమతూకం తో ఉంటుంది. అమ్మ మనం ఎక్కువ కష్టపడకుండా ఈ ఏర్పాటు చేసింది అనుకోవాలి.
ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండుగకు కొన్ని చోట్ల బొమ్మల కొలువులు పెడతారు. అనేక ప్రాంతాలలో జరిగే ఈ పండుగ జాతరలలో , పులి వేషాలు, ఇంకా ఎన్నో ఇతర జానపదా కళా రూపాలను చూడవచ్చు. తెలంగాణా ప్రాంతం లో బతుకమ్మ పండుగ చాలా ఘనంగా చేస్తారు. విదేశాలలో ఉన్న ఆడపిల్లలు కూడా, ఈ పండుగకు పుట్టింటికి వస్తారు. రంగురంగుల తంగేడు పూలు, బంతి పూలు వరుసగా పేర్చి బతుకమ్మలను చాల అందంగా పేరుస్తారు. 9 రోజులూ ఆ బతుకమ్మల చుట్టూ ఆడవారు పాటలు పాడుతూ, చేతులు తడుతూ, చాలా వైభవంగా పండగ చేసుకుంటారు.
మైసూరు లో కర్ణాటక ప్రభుత్వం, ప్రబుత్వ లాంచనాలతో 9 రోజుల ఉత్సవాలు ఘనంగా చేస్తారు. రాజవంశం వారి కులదేవత శ్రీ చాముండి అమ్మవారి మందిరం నుంచి ఈ ఉత్సవాలు మొదలు అవుతాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందినా అనేక మంది కళాకారులను ఈ ఉత్సవాలలో సత్కరిస్తారు.
శరన్నవరాత్రులు వైభవంగా జరిగే ఇంకో ప్రాంతం పశ్చిమ బెంగాల్. ఇక్కడ కూడా మనం గణపతి విగ్రహాలను నిలబెట్టి ఉత్సవాలు జరిపినట్టు అక్కడ ఈ నవరాత్రులలో అమ్మవారి విగ్రహాలను నిలబెట్టి సామూహికంగా పూజలు చేస్తారు. సంప్రదాయ బద్దంగా శంఖనాదం తో మొదలయ్యే ఈ ఉత్సవాలలో, విదేశాలలో స్థిరపడిన వారు అందరూ కూడా వచ్చి పాల్గొంటారు. అడ, మగ అందరూ వారి వారి సాంప్రదాయ దుస్తులలో ఈ ఉత్సవాలలో పాల్గొంటారు.
ఇంకా గుజరాత్ లో గర్బా అనే నాట్య రీతులతో ఈ పండగ జరుపుకుంటారు. ప్రతి కాలనీలో ఒక ఇంటిలో కానీ, ఒక తోట లో కానీ, అమ్మవారిని నిలబెట్టి 9 రోజులూ సాయంత్రం గర్బా నృత్యం చేస్తూ, ఆడా మగా అందరూ ఉత్సాహంగా పూజలు చేస్తారు. మిగిలిన రోజులలో ఆధునిక వస్త్రాలలో కనబడే యువత ఈ 9 రోజులూ తమదైన సాంప్రదాయ రీతిలో కన్నులకు ఇంపుగా కనబడతారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ నవరాత్రులు ఎంతో ఉల్లాసభరితంగా జరుగుతాయి. మహిళలు తమ ఇంటిలో అమ్మవారికి లలితా సహస్ర నామం తో కుంకుమ పూజలు జరుపుతారు. అలా వీలు కాని మహిళలు దేవాలయాలలో జరిగే సామూహిక అర్చనలలో పాల్గొంటారు. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీ ఆరాధన చేస్తారు. 9 రోజులూ వివిధ రకములైన పదార్దములు అమ్మకు నివేదిస్తారు. ప్రతి రోజు ఎవరో ఒకరి ఇంటిలో సామూహిక లలితా సహస్త్ర నామ పారాయణ చేస్తారు.
అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు...
సాధారణంగా హిందువుల పండుగలు అన్నీ ప్రకృతి తో ముడిపడి ఉంటాయి. ఆ యా ఋతువులలో పూచే పూలు, పండే పంటలు , ఆ ఋతువు యొక్క నేపధ్యంతోనే చాలా వరకు మనం పండుగలు జరుపుకుంటాము. మన దేశం వ్యవసాయ ప్రధానమైన దేశం కనుక ఆ యా పంటలు ఇంటికి వచ్చేవేళ, వ్యవసాయ పనులు అయిపోయి, రైతులు ఖాళీగా ఉండే వేళ మనకు పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది. ముఖ్యంగా తెలుగు వారికీ సంక్రాంతి, బతుకమ్మ పండుగలు, పంజాబీ వారికీ బైశాఖి, అస్సాం వారికీ బిహు పండుగలు ఇలా వచ్చినవే.
ఈ ఆశ్వయుజ మాసంలో దేశం అంతటా దసరా నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటారో, తెలంగాణా ప్రజలు "బతుకమ్మ పండుగ" ను ఇంకా వైభవంగా జరుపుకుంటారు. వారికీ పెద్ద పండుగ ఇది. ఈ పండగ హడావిడి అంతా స్త్రీలదే. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఉన్న, విదేశాలలో ఉన్న అడపడుచులందరూ కూడా పుట్టింటికి వస్తారు. చుట్టాలు, బంధువుల కలయిక తో అన్ని గృహాలు కళకళ లాడుతూ ఉంటాయి. ఈ సమయం లోనే జొన్న, మొక్కజొన్న, వంటి పంటలు చేతికి వస్తాయి. గునుగు, తంగేడు, వంటి పూలు పూస్తాయి. అటు ఎక్కువ చలి లేకుండా, ఎక్కువ ఎండా లేకుండా , ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది.
బతుకమ్మ పండుగను 10 రోజులు జరుపుతారు. పూర్వము దక్షిణ దేశాన్ని పాలించిన ధర్మాంగదుడు అనే ఒక చక్రవర్తికి సంతానం లేకపోతె, అయన ఎన్నో పూజలు నోములు చేశాడుట. చివరికి లక్ష్మి దేవి అనుగ్రహం తో అయన భార్య ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. చిన్న తనం నుంచీ ఆమె ఎన్నో గండాలు దాటింది. అందుకు ఆమెకు ఈ విధమైన గండాలు లేకుండా, చల్లగా బతకాలని , ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేసారుట. అందుకే ఈ పండుగ నాడు కన్నెపిల్లలు తమకు చక్కని భర్త, చక్కని సంతానం లభించి తమ బ్రతుకు చల్లగా సాగిపోవాలి అని ప్రార్ధిస్తారు.
ఈ పండుగను పితృ అమావాస్య నాడు ప్రారంభిస్తారు. రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి , గులాబి పూవులు, తో ఒక రాగి పళ్ళెం లో వరుసగా పూవులు పేర్చి ఒక గోపురం లా తయారు చేస్తారు. దానిపై ఒక చిన్న పళ్ళెం లో పసుపు ముద్దను ఉంచుతారు. అదే బతుకమ్మ. గౌరీదేవికి ప్రతీక. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మహిళలు అందరూ సాయంత్రం బతుకమ్మను పేర్చి, తమ ఇంటివద్ద ఉన్న దేవాలయాలలో ఈ బతుకమ్మను పెడతారు. అలాగే ప్రతి రోజు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మను పేర్చి, ఇంటిలో పూజ మందిరం లో ఉంచి 9 రోజులు తొమ్మిది రకాల సద్దులు నివేదిస్తారు. జొన్న, రాగి, మొక్కజొన్న, వేరుసెనగ లాంటి గింజ ధాన్యాలను కొద్దిగా వేయించి , పొడి కొట్టి, వాటిని బెల్లం కలిపి ముద్దగా చేసిన పదార్ధాన్ని సత్తులు లేదా సద్దులు అంటారు. ఈ పండుగ లో ఈ సద్దులే ముఖ్యమైన నివేదన బతుకమ్మకు.
ఇక పండుగ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ మొత్తం తెలంగాణలో అత్యంత మనోహరమైన పండుగ రోజు. స్త్రీలందరూ తమకు ఉన్నంతలో ఘనంగా అలంకరించుకొని, పట్టు చీరలతో కళకళ లాడుతుంటారు. ఈరోజు బతుకమ్మలను మిగిలిన రోజుల కన్నా వైవిధ్యంగా, పెద్దగా అమరుస్తారు. దగ్గర లోని దేవాలయం లలో కానీ, తోటలలో కాని, లేదా చెరువుల వద్ద ఉన్న ఖాళీ స్థలాలలో కానీ, మహిళలు పెద్ద సంఖ్యలో చేరి, వారి వారి బతుకమ్మలను అక్కడ ఉంచుతారు. మధ్యలో బతుకమ్మలను పెట్టి, స్త్రీలందరూ వాటి చుట్టూ తిరుగుతూ, చేతులు తడుతూ , బతుకమ్మ పాటలు పాడుతారు. బాగా రాత్రి అయినాక వాటిని పక్కన ఉన్న చెరువులలో, లేదా కుంటలలో నిమజ్జనం చేస్తారు. ఒకరి కొకరు తమ ఇంటివద్ద నుండి తెచ్చిన వివిధ రకాల సత్తులను వాయనంగా అందించుకుంటారు. మహిళలు అందరూ గొంతు కలిపి పాడే ఈ బతుకమ్మ పాటలు ఎంతో వినసొంపుగా ఉంటాయి.
ఈ పండుగ తెలంగాణా యొక్క వైభవానికి ప్రతీక. ఈ 10 రోజులూ మార్కెట్స్ అన్ని కిటకిట లాడుతుంటాయి. వెండి , బంగారం, వస్త్ర దుకానాలే కాక, పల్లెల నుంచి తెచ్చి అమ్మే గునుగు, తంగేడు, బంతి, చామంతి పూల అమ్మకం దారులతో, రంగు రంగుల పూవులతో, రోడ్లు అన్ని ఎంతో శోభాయమానంగా ఉంటాయి. ప్రజలు అందరూ ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ వైభవాన్ని చూసి తీరవలసినదే.
విజయ దశమి నాడు తమ తమ వాహనాలకు, పనిముట్లకు పూజలు చేస్తారు. దేవాలయ సందర్శన చేసిన తరువాత, జమ్మి ఆకులను సేకరించుకొని, పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి వద్ద నుండి, కానుకలు, ఆశీర్వచనాలు తీసుకొంటారు. పాలపిట్టను చూసి, మిత్రులను కలుసుకొని, పండుగను ముగిస్తారు. ఈ పండుగలో మగవారు కూడా అత్యంత శ్రద్ధా భక్తులతో పాల్గొంటారు. ఎక్కడెక్కడో స్థిరపడిన తమ పాత మిత్రులను, సావాసగాళ్ళను కలుసుకునే తరుణం ఇదే. ఈ పండుగ లో అందరూ పేద గొప్ప బేధాలను, కుల బేధాలను పక్కన పెట్టేస్తారు. ఎంత గొప్పవాళ్ళు అయినా, ఎంత ధనికులు అయినా అందరితో పటు బతుకమ్మను పేర్చి, పాటలు పాడతారు.
భగవంతుడు మనలను చాలా నిష్కల్మషంగా, మంచి మనసు నిచ్చి, ఆ మనసు నిండా ప్రేమ నింపి, ఈ భూమి మీదకు పంపిస్తాడు.మనం కూడా కొంత వయసు వచ్చేవరకు, నీతి, నిజాయితీ, ప్రేమ, అనే భావనలతో పెరుగుతాము. కాలం గడిచేకొద్దీ ఈ సమాజం నుంచి, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్ని నేర్చుకొంటాము. అథవా..... ఒకవేళ మన పూర్వ జన్మ పుణ్యం వలన వాటి వాసనలు అంటుకోకుండా ఏదో మన ప్రయత్నం కొద్దీ మన జన్మ సంస్కారాన్ని బట్టి మనం బ్రతుకుదాము అనుకుంటే, ఊహు....కుదరదే..... చుట్టూ ఉండే మనుష్యులు, మనలను యధాశక్తి దిగాజార్చేసి, అధ:పాతాళానికి తొక్కేసి, మరి మనం ఇక లేవకుండా తోక్కిపెట్టేస్తారు...ఇదీ లోకం తీరు. ఈ సమాజం లో బతకాలి అనుకుంటే, మన సహజత్వాన్ని మనం కోల్పోవాలి. నటనలు నేర్చుకోవాలి, పోనిలే పాపం అనుకోకుండా, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సిద్ధాంతం నేర్చుకోవాలి. నేర్చుకోలేకపోతే ... అది మన ఖర్మ. ...మనకు మనుగడ ఉండదు.....మనోవేదన తప్ప