Tuesday 28 April 2015

శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం హిందువు లదే అని భావించే వారు ఒట్టి మూర్ఖులు. విజ్ఞానం ఒకరి కోసమే పరిమితం అవుతుందా? విజ్ఞానం అనేది అందరికీ ఉద్దేశించినది. భగవద్గీతను వయసు మళ్ళిన వారి కోసం, అనుకునే వారు, గీతను చదివితే, సన్యాసం పుచ్చుకున్నట్లే అనుకునేవారు వెర్రివాళ్ళు. నిజం చెప్పాలంటే, గీతను, చిన్న వయసు నుంచే చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, యవ్వనము, గృహస్తాశ్రమము, వానప్రస్తము అనే ఈ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించ వచ్చును.
మానవుని జీవితం లో కలిగే అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేది గీత. ప్రత్యక్షం గా కాకపోయినా, మానవుడు తనను తాను తెలుసుకొని, తన లోపలికి తొంగి చూసుకుని, తన అంతరంగాన్ని విశ్లేషించుకొని, తను చేసే తప్పొప్పులను కనుగొనడానికి 'గీత' ఎంతగానో తోడ్పడుతుంది. పొగడ్తలకు పొంగిపోయి, విమర్శలకు కుంగిపోకుండా, సుఖాలలో ఒళ్ళు మరచిపోయి, దుఖాలలో మనో వేదనకు గురికాకుండా, ఒక స్థిరమైన మన:స్థితిని "గీత" మనకు నేర్పిస్తుంది. దీనినే "స్థితప్రజ్ఞత" అంటారు.
మన బుద్ధిని పక్క దారులు పట్టనీయకుండా, మనలను మనము నియంత్రించుకునే పాటవం మనకు గీత చదవడం వలన లభిస్తుంది.
తాను చేసే కర్మలు అన్నీ, తన కోసం కాకుండా, భగవంతుని కోసమే అనే భావనలో, సర్వ ప్రాణి మనుగడను, సర్వ లోక హితాన్ని, బోధిస్తుంది భగవద్గీత. అరిషడ్వర్గాలను జయించి, ప్రశాంత చిత్తమును కలిగి ఉండడం ఎలాగో గీత నుంచి మనం తెలుసుకోవచ్చు.
ఇవన్నీ ఒక ధర్మనికో, మతానికో పరిమితం కాదు కదా, ఒక వయసుకు పరిమితం కాదు కదా, అటువంటప్పుడు భగవద్గీత ఒక్క హిందూ ధర్మానికే ప్రతీక అని ఎందుకు భావించాలి? ఎన్నో వ్యక్తిత్వ వికాసా గ్రంధాలు, నిపుణుల వలన పొందలేని ప్రయోజనాలు కేవలం భగవద్గీతను పఠించి, అర్ధం చేసుకుని ఆచరించడం వలన పొందవచ్చు.
మానవాళి ప్రగతికి , మానవ జాతి యొక్క వికాసానికి, ధర్మ పరిరక్షణకు భూమి మిద అవతరించిన ఒక ఉద్గ్రంధం "శ్రీ మద్భగవద్గీత". దీనిని కేవలం ఒక మతానికో, ధర్మానికో పరిమితం చేయకండి. సంకుచితం గా ఆలోచించకండి.
బాల్యం నుంచి, పురాణాలు, శాస్త్రాలలోని విషయాలు మీ పిల్లలకు చెప్తూ ఉండండి. వారు పెరిగి పెద్దవారి సమజానికి , దేశానికి ప్రయోజకులుగా తయారు అయ్యేలా పిల్లలను పెంచండి. ఇది ఈ సమయం లో ఎంతో అవసరం.
ఉమ్మడి కుటుంబాలు--కుటుంబాలలో, సమాజం లో ఒక్కరి కోసం అందరు-అందరి కోసం ఒక్కరు అనే కట్టుబాట్లు మనవి. . చెట్టు-పుట్ట, పశువు-పిట్ట, నీరు-నిప్పు, గాలి-భూమి --ఇలా ప్రకృతి లోని ప్రతి అణువునూ ప్రేమించి పూజించే పవిత్రమైన భావన మనది. పరోపకారార్ధం ఇదం శరీరం అనే ఉపనిషద్ వాక్యాన్ని రోమరోమానా ఇముడ్చుకున్నాం. అంతరిక్షం లోకి, సముద్ర గర్భం లోకి వెళ్ళగలిగిన ప్రగతిని సాధించిన మనం మరి సాటివాడి మనసును ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఇంత వేగంగా పురోభివృద్ధిని సాధించిన మనం ఎందుకు మానవ సంబంధాల విషయం లో తిరోగమనం సాగిస్తున్నాం? కుటుంబాలలో, బాధ్యతలు పంచుకోవటమే తప్ప, హక్కుల కోసం పోరాడడంతెలియని మన జీవితాలలో డబ్బు అనేది ఎలా ప్రవేశించింది? పెద్దల పట్ల గౌరవం, మమకారం, మానవత్వంచిన్నతనం నుంచి పిల్లలకు ఉగ్గుపాలతో నేర్పేమన సంస్కృతీ లో అవన్నీ ఏ కాలం లో చచ్చిపోయాయి? కాలానుగత మార్పుల్లో, ఏ మలుపులో మనం ఇంత స్వార్ధంగా మారిపోయాం? మనుషుల కన్నా, మనీ ముఖ్యం అయింది.. ప్రకృతి నుంచి పరోపకారం నేర్చుకున్న మనం ఈరోజున పొరుగువాడిని పలకరించడానికి కూడా ఎందుకు భయపడుతున్నాం? మానవ సంబంధాలు అన్నీ ఆర్ధిక సంబంధాలే అని అంగీకరిస్తున్నామా?
కొంత నడివయసు వాళ్ళు, కొంతమంది నాలాంటి చాదస్తులు, మారుతున్నా సమాజ పోకడలు చూసి సహించలేక, వీటన్నిటికీ మన సంస్కృతిని , నాగరికతను, ధర్మ గ్రంధాలను మర్చిపోవడం ఒక కారణం అని గ్రహించుకుని, మన సమాజం బాగుపడాలంటే ఇప్పటి పిల్లలకు, యువతకు మార్గనిర్దేశనం చెయ్యాలి అని భావించి, ఆ దిశగా కృషి చేస్తుంటే, అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాము అంటూ కొంతమంది భ్రష్టులు వక్ర బుద్ధితో వాటిని చదివి, ఈ పురాణాలు అన్నీ పుక్కిటి పురాణాలు అని, సమాజం లో విషం చిమ్మాలి అని ప్రయత్నిస్తున్నారు. అంటే, మన ఇంటికి అగ్గి పెట్టేవాళ్ళు మన ఇంట్లోనే ఉన్నట్టు. ఉగ్రవాదుల కన్నా మహామ్మరులు వీళ్ళు. మన పురాణాలు అన్నీ మాయలు, మంత్రాలూ కావు. అవి అన్నీ వాస్తవంగా జరిగినట్టు ఆధారాలు ఉన్నాయి. మన గ్రంధాలలోని సారాంశాలను విదేశీయులు కూడా నేర్చుకుంటుంటే, మన తెలుగు వాళ్ళకే వస్తోంది పోయేకాలం. ఇతర మతాల వాళ్ళు వారి వారి మతం మిద ఇంత రచ్చ చేసుకోవడం ఎప్పుడూ వినం మనము. ఏ ధర్మం అయినా సమాజం లో మంచిని పెంచడానికి, వ్యక్తులకు హితం చేకూర్చడానికే పాటుపడింది. అందునా ప్రత్యేకించి మన భారత దేశం లో హిందూ ధర్మం అందరూ ఒక్కటే, అని బోధించి, సమసమాజ నిర్మాణానికి ఎంత కృషి చేసిందో, చెట్టు-పుట్ట, నీరు-నిప్పు, గాలి-వాయువు, ఇవన్ని సురక్షితం గా ఉంటేనే, మనవ జాతి మనగలదు అని ఎంత చక్కగా బోధించిందో, మన " శాంతి మంత్రములు" చదివి అర్ధం చేసుకుంటే తెలుస్తుంది. అటువంటి ధర్మం మీద, ధర్మ గ్రందాల మీద, ఇన్నన్ని అభాండాలా? ఒకవేళ వాటిలో తప్పుడ్లు ఉన్నా, ఈ సంధికాలం లో వీటన్నిటి మిద చర్చ జరగటం అంత అవసరమా? భారతీయులన్దరిలోను ఐక్యత సాధించడం తక్షణ కర్తవ్యమ్ అయిన ఈ సమయం లో ఇటువంటి చర్చలు ఎంత అశాంతికి దారి తీస్తాయి? చానల్స్ కి ఏముంది-వాటి trp రేటింగ్ పెంచుకోవడానికి ఏ గడ్డి అయినా తింటాయి. దయచేసి ఇటువంటి చానల్స్ ని బాన్ చెయ్యండి. ఇటువంటి చర్చలకు ప్రోత్సాహం ఇవ్వకండి. ఇటువంటి వాటికీ వ్యతిరేకంగా తెలుగు వారు ఐక్యంగా పోరాడవలసిన సమయం వచ్చింది. దయచేసి, మీ పోస్ట్ ల ద్వారా, భరతీయ సంస్కృతిని యువతకు తెలిపి, వారిని మంచి మార్గం లో నడిపించండి. భారతీయ సంస్కృతీ వ్యాప్తికి ఇతోధికం గా కృషి చేయండి. సెలవు. నమస్కారం. _
ఆడపిల్లల వస్త్రధారణ గురించి, పెద్దవారు తెలిసినవారు ఎవరైనా చెప్పిన మాటలకు, మహిళల స్వేచ్చా స్వాతంత్ర్యాలు కోసం రోడ్డెక్కి కిస్ అఫ్ లవ్ ప్రోగ్రాం లు పెట్టే, వారిని సమర్ధించే మహిళా సంఘాల ప్రతినిధులకు ఒక్క మనవి. మీరు రోడ్డెక్కి రచ్చ చేయాల్సిన సంగతులు మన దేశం లో చాలా ఉన్నాయి.
1. ఎంతో మంది చిన్నపిల్లలను, యువతులను మోసగించి, పెద్ద పెద్ద నగరాలలోని వ్యభిచార కూపాలకు తరలిస్తున్నారు. వారందరూ, ముసలి వయసు లో దిక్కు మొక్కు లేక వివిధ వ్యాధుల బారిన పడి బ్రతికుండగానే నరకం చూస్తున్నారు. వారి జీవనాధారం విషయం లో పోరాడండి.
2. పైన చెప్పిన మహిళలు అటు ప్రజల, అటు పోలిసుల దోపిడీకి గురి అవుతున్నారు. వారి కోసం పోరాడండి.
3. బృందావనం లాంటి పుణ్య క్షేత్రాలలో అనాధలైన పెద్ద వయసు మహిళలు తినడానికి తిండి కూడా లేకుండా, అక్కడి పండాల, పోలిసుల దోపిడీకి గురి అవుతున్నారు. వారి గురించి పోరాడండి.
4. నగరాలలో కూడా పలు ప్రైవేటు , ప్రభుత్వ పాఠశాలల్లొ కనీస మరుగుదొడ్డి సౌకర్యాలు లేకుండా, నెలసరి సమయాలలో ఎంతో మంది విద్యార్ధినులు ఇబ్బంది పడుతున్నారు. వారి సౌకర్యాల కోసం పోరాడండి.
5. రాజకీయంగా కొన్ని సీట్లను వివిధ స్థాయుల్లో మహిళలకు కేటాయించినా , పరిపాలన మొత్తం వారి భర్తల జులుం ప్రకారం నడిపే మహిళా నేతలు ఉన్న గ్రామాలు, పట్టణాలు ఎన్నో ఉన్నాయి. వారి కోసం పోరాడండి.
6. ఎంతో అభివృద్ది సాధించిన నగరాలలో కూడా ఈనాడు సగటు మహిళలకు రక్షణ లేదు సరికదా, అన్యాయానికి గురి అయిన మహిళకు సత్వర న్యాయం కూడా జరగడం లేదు. వారి రక్షణ కోసం పోరాడండి.
7. ప్రతి స్కూల్, కాలేజీ, రీసెర్చ్, అన్ని స్థాయుల్లో విద్యాసంస్థల్లో యువతులు, మహిళలు వంచనకు, లైంగిక దోపిడీకి గురి అవుతున్నారు. వారి క్షేమం కోసం పోరాడండి.
8. సునందా పుష్కర్ వంటి ఉన్నత వర్గానికి చెందిన మహిళ మృతిపై కూడా ఎన్నో అనుమానాలు. అటువంటి కేసులలో సత్వర పురోగతికి పోరాడండి.
9. దేశం లోని ఎన్నో గ్రామాలలో ఈనాటికీ ఇండ్లలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేక ఎంతో మంది మహిళలు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి నెలకొని ఉంది. అటువంటి వారి సౌకర్యాల కోసం పోరాడండి.
10. దొంగ స్వామిజిల మాటల మాయలో పడి ఎంతో మంది మహిళలు మోసపోతున్నారు. అటువంటి దొంగ స్వామిజిలకు వ్యతిరేకంగా పోరాడండి.
మహిళల స్వేచ్చ స్వాతంత్ర్యాలు అంటే కేవలం ఎవరికీ నచ్చినట్టు వస్త్రధారణ చేసుకోవట మెనా ? స్వేచ్చ పేరుతొ, పబ్బులకు, లేట్ నైట్ పార్టీలకు వేల్లటమేనా? అసలు మీ ఉద్దేశ్యం లో స్వేచ్చ స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ముందు మీ ఐడియా క్లియర్ గా ఉంటె, రోడ్డెక్కి తరువాత రచ్చ చేయచ్చు. మీరు రచ్చ చేయాల్సిన విషయాలు దేశం లో చాల ఉన్నాయి. వాటి గురించి కూడా కాస్త పట్టించుకోండి.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8. ఈ ఒక్కరోజే అందరికీ మహిళల గురించి గుర్తొస్తుంది. మహిళా సంక్షేమం గురించి, బాలికా సంరక్షణ గురించి, మహిళలు అన్ని రంగాల్లో పడుతున్న కష్ట నష్టాల గురించి గుర్తొస్తుంది. ఊరూరా, వాడవాడలా మీటింగ్స్ జరుగుతాయి. ప్రముఖ మహిళలు అతిథులుగా వస్తారు. ఉపన్యాసాలు ఇస్తారు. ఒక్కోచోట లంచ్ కూడా నిర్వాహకులే ఏర్పాటు చేస్తారు. స్త్రీల మిద జరుగుతున్న అత్యాచారాలు,లైంగిక హింసలు గురించి అందరూ మాట్లాడతారు. టీవీ ఛానల్స్ కూడా ఇవాళ మహిళల గురించిన సినిమాలు, మహిళల ఇంటర్వ్యూ లు, ప్రసారం చేస్తాయి. న్యూస్ పేపర్స్ ఇవాళ మహిళల కోసం ప్రత్యేకం గా ఒక పేజి కేటాయిస్తాయి. ప్రతి ఇంట్లో మహిళలకు విషెస్ అందజేస్తారు. ఇవాళ గడుస్తుంది. తెల్లవారుతుంది. రేపట్నించి అన్ని మామూలే. లైంగిక హింసలు, అత్యాచారాలు, అన్ని మాములే. రేపటి నించి మహిళల కోసం ఒక్క గొంతు పైకి లేవదు. రేప్ కేసులు విచారణ పూర్తీ కాదు. పైగా నిందితులు టీవీ లలో కనబడి ఇంటర్వ్యూ ఇస్తారు. ప్రభుత్వం చూడద్దు అని ఆంక్షలు పెడుతుంది. మూసిన గుప్పిటపై కుతూహలం ఎక్కువ అన్నట్టు, ప్రజలందరూ వెతికి వెతికి మరీ చూస్తారు. అదో రకం ప్రచారం జరిగి కూర్చుంటుంది.
ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం, బాలిక సంరక్షణ కోసం కొన్ని కోట్లు విడుదల చేస్తుంది ఈ రోజు, అయితే, రేపట్నించి అవి అమలు లోకి వస్తున్నదా లేదా అనే విషయం ప్రభుత్వం పట్టించుకోదు'
ఈ సదస్సులు వేటిల్లోను మగవాళ్ళు పాల్గోరు. సదస్సులో కనీసం మగ ప్రేక్షకులు ఉండరు. మహిళల సమస్యలకు కారణం ఒక వైపు నుంచి మగవారు కారణం అని అనుకున్నపుడు, ఆ సదస్సులలో మగవారిని భాగస్వాములను చేయకపోతే, మన గొంతు మనం ఎవరికీ వినిపిస్తాం? సమస్యలు మహిళలవే, వాటిని వినేవాళ్ళు మహిళలే అయితే, సమస్యలు తీరుతాయా?
మహిళల ఆత్మా గౌరవం గురించి మాట్లాడే పెద్దలు సినిమాలలో మహిళలను ఎలా చూపిస్తున్నారో గమనించరు. వాటిపై నిషేధం ఉండదు. మరీ మన నట్టింట్లోకి వచ్చేసిన టీవీ లలో సీరియల్స్ లో మహిళలు ఎలాంటి భావజాలం తో ఉన్నారో, ఆ పాత్రల ప్రభావం చిన్న, పెద్ద అందరి మీద ఎలా ఉందొ ఎవరికీ అక్కర్లేదు. సినిమాలలో, ఇంట, బయట స్త్రీల వస్త్రధారణ ఎలా ఉందొ ఎవరికీ పట్టదు. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తమ పిల్లవాడు, ఎవరితో స్నేహం చేస్తున్నారో, బయట ఎలా behave చేస్తున్నారో తల్లితండ్రులే పట్టించుకోరు.
ఏదైనా సమస్యను పరిష్కరించే ముందు వాటి మూలాల నుంచి పరిష్కరించ గలిగితేనే తొందరగా మార్పు వస్తుంది. మార్పు ముందు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంట్లో మగపిల్లలను పెంచడం లో తల్లి తండ్రులు ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంట్లో తండ్రి , తన భార్యను గౌరవంగా చుస్తే, పిల్లలకు స్త్రీలను గౌరవించడం అలవాటు అవుతుంది. మగపిల్లలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఆడపిల్లలను తక్కువ చూడటం చాల తప్పు. ఒకవేళ ఇంట్లో మగవాళ్ళు ఇతర స్త్రీల గురించి, తక్కువగా మాట్లాడితే, వెంటనే గట్టిగా ఖండించాలి. ఇంటా, బయటా స్త్రీలు ఎంత కష్టపడుతున్నారో మగపిల్లలకు గమనించుకోవడం నేర్పాలి. పిల్లల ఎదురుగా మరొకరిని విమర్శించుకునే అలవాటు తల్లితండ్రులు మానుకోవాలి. తల్లి తండ్రులు చేసే ఏ చిన్న పనైనా పిల్లల మీద ప్రభావం చూపుతుంది అని మరువకూడదు.
కూతురి తప్పులను సమర్ధించిన తల్లి కోడలి తప్పులను సమర్ధించదు. కోడలి వైపు నుంచి కంప్లైంట్ వచ్చినపుడు అందుకు తన కొడుకు కాని, ఇతర కుటుంబ సభ్యులు కాని, ఎంత వరకు బాధ్యులు అనే విషయం అత్తగార్లు ఆలోచించాలి. అటువంటి విశాల హృదయం అలవరచుకోవాలి.
ఆడపిల్లలకు కూడా (మనం ఏనాడో వదిలేసిన) సంస్కృతీ సంప్రదాయాల గురించి కొంచెం నేర్పించాలి. ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కాని, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండే విధంగా మంచి చెడులు నేర్పాలి. ఆడపిల్లల్ని చదివించండి. మన ఇంటి పిల్ల్లల్నే కాదు, పేద బాలికలకు చదువుకునేందుకు సహాయం చేయండి. అందరికీ ఆత్మస్థైర్యం నేర్పండి. ( అది స్రుతి మించి విచ్చల విడి తనం కాకూడదు.) వారి భయాలను, సందేహాలను ఓపికగా తీర్చండి. వారికీ అండదండగా ఉన్నాము అనే భరోసా కల్పించండి. మహిళలను కించపరిచే సినిమాలు, టీవీ సీరియల్స్, ప్రకటనలను ఖండించండి.
మహిళల కు జరిగే అన్యాయాలకు మగవారే ఎక్కువ బాధ్యులు కాబట్టి, ముందు మార్పు మగవారి నుంచే రావాలి. స్త్రీలను గౌరవించాలి అనే విజ్ఞత వారికీ ఉండాలి. ఆ మగవారిని పెంచేది తల్లులే కాబట్టి, తల్లులే మగవారిలో మార్పు తేవాలి. మనం ఎన్నో గ్రంధాలూ చదువుతున్నం, ఎన్నో సినిమాలు చూస్తున్నాం, అన్ని విని, చదివి వదిలేస్తున్నాం. ఆ సూక్తులు అన్నీ ఆచరణలో పెట్టినపుడే మార్పు సాధ్యం. అంతవరకు ఈ దినోత్సవాల వల్ల మహిళలకు ఒరిగేది ఏమి లేదు.
నా తోటి మహిళలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...
అయినా ఏదో మొహమాటానికి చెప్పుకోవడమే కానీ, మనకి ఈ ఒక్కరోజు కేటాయించినది ఎవరండి అసలు? అన్ని రోజులు మనవే అయితే! ఆకాశం లో సగం అంటూనే, భూమి మిద దాదాపు అన్ని రంగాలలో అడుగుపెట్టి ఆక్రమించేసిన మనకి మహిళా దినోత్సవం అంటూ సంవత్సరం లో ఒక్కరోజు కేటాయించడం ఎంత అసమంజసం? నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిచ్చేది మనం.... రోజంతా ఇంట్లో ఉంటూ, వాళ్ళ పెరుగుదలను, వారి ఆటపాటలను చూసి ఆనందించేది మనం......( మగవాళ్ళు రోజంతా ఇంట్లో ఉండరుగా!) వాళ్ళకు విద్యాబుద్ధులు, సంస్కారం నేర్పేది మనం. పెరిగి పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయ్యేదాకా వారి బాధ్యత తీసుకునేది మనం... అటు మన తరం లో అత్తగారితో, మన మగపిల్లల పెళ్ళిళ్ళు అయ్యాక, మన ఇంటికి వచ్చిన కోడళ్ళతో సర్దిపెట్టుకునేది మనం.....(మహిళలు)....ఇంటికి వచ్చిన అతిధి అభ్యాగతులకు స్వయంగా వండి పెట్టేది మనం.... ( ఇంట్లో మగవారి పని సరుకులు తీసుకురావటమే కాని వారి చేతులతో వండి పెట్టలేరు కదా).. ఇంట్లో ఎవరు అనారోగ్యం పాలైనప్పటికీ కనిపెట్టుకుని సేవలు చేసేది మనం..( అదే ఒక్క 10 రోజులు మనకు అనారోగ్యం వస్తే, ఇక చూడాలి ఆ ఇంటి సొగసు...) పోనీ, ఇవన్ని పాత తరం వాళ్ళ మాటలు అనుకున్నా, ఎంత మంది మహిళలు ఎంతో ప్రయాసతో కూడుకున్న రక్షణ రంగంలో పనిచేస్తున్నారు! ఆఖరికి అమెరికా అధ్యక్షుడికి గౌరవ వందనం చేసినది కూడా మన ఆడకూతురేగా! ఎంత మంది లోకో డ్రైవర్స్ గా, పైలట్ లు గా, కష్టపడుతున్నారు!ఎంతమంది మహిళలు వ్యాపార రంగం లో కూడా తమదైన ముద్ర వేస్తూ ముందుకు పోతున్నారు... ఇంతా చేస్తున్నా కూడా కుటుంబ బాధ్యతలను విస్మరించకుండా అటు ఇటు సమ న్యాయం చేస్తున్నారే! ఎవరండీ మహిళలను అబలలు అన్నది ? అసలు మనకు ఉన్నంత మానసిక బలం పురుషులకు ఉన్నదా అని డౌట్. ఖచ్చితం గా ఉండదు.మనలో మన మాట. ... అసలు, ఇంటికి, మగవాడికి మనమే కదండీ ఆధారం.... ( ఆడదే ఆధారం అని పాటలే వ్రాసారుగా) మహిళలు మల్టీ టాస్కింగ్ ( ఒకే సమయంలో ఎక్కువ పనులు చేయడం) లో నిపుణులు అని పెద్ద పెద్ద సర్వే లలోనే ఒప్పుకున్నారు. ఎన్ని రకాలుగా చూసినా పురుషుల కన్నా మహిళలు నిజాయితీ, ధైర్యం, నిబ్బరం, మానసిక స్థైర్యం కలవారు అని ఒప్పుకుని తీరవలసినదే. మన ప్రజ్ఞా పాటవాలకి ఇలా ఒక్కరోజు, రెండు రోజులు ఉత్సవాలు జరుపుకోవటం అవమానం. ఎందుకంటే సంవత్సరం లోని అన్ని రోజులూ మనవే. ఏమంటారు ఫ్రెండ్స్?
పెద్దవయసులో ఉన్నవారు అందరికీ ఒక విన్నపం. ఈ వయసులో మీకు శారీరిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఈ వయసులో ఒంటరిగా (పిల్లలతో కలిసి ఉండకుండా) ఉండడం మీ ఆరోగ్యం మీద చాలానే ప్రభావం చూపిస్తుంది. పిల్లలు తప్పు చేసినా, పంతాలకు పోకుండా కొంచెం సర్దుకుని ఉండగలిగితే, మీకు ఒంటరి తనం ఉండదు. రెండు చేతులూ కలిస్తేనే కానీ చప్పుడు రాదు. మీ వైపు కూడా కొన్ని తప్పులు మీ పిల్లలకు కనిపించవచ్చు. కూర్చొని సామరస్యం గా మాట్లాడుకోవడం వల్ల చాల సమస్యలు పరిష్కరించు కోవచ్చు. అందరిలో ఉండడం వల్ల మీకు కొంత కాలక్షేపం, ధైర్యం గా కూడా ఉంటుంది.
అలాగే పెద్ద వయసులో ఉన్నవారు, భార్య భర్త ఒకరికి ఒకరు అన్నట్టు సమన్వయము తో మెలగడం చాలా ముఖ్యం. వయసులో ఉన్నపుడు ఎవరు ఎవరి మీద ఆధిపత్యం చూపించినా, పెద్ద వయసు వచ్చాక, ఒకరి మాట ఒకరు మన్నించి సమన్వయము తో ఉండడం వల్ల చాలా చీకాకులను తప్పించుకోవచ్చు. ఈ వయసులో పంతాలకు పోకుండా, బంధువులు అందరితోను contact లో ఉండడం, స్నేహితులను కలవడం, ఇరుగు పొరుగున ఉన్న పిల్లలను పలకరించడం వంటివి జీవితం నిస్సారం కాకుండా కాపాడతాయి.
ఇంకా ఒంట్లో ఓపిక ఉంటె, ఉదయమో, సాయంత్రమో, గుడికి వెళ్లి రావడం , బజార్లో నడిచి రావడం వలన కొంత కాలక్షేపం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా ఇంకా మాకు ఏమి చేయడానికీ ఓపిక లేదు, పిల్లల పైన మేము ఆధార పడము అని గిరి గీసుకుని కూర్చుంటే, మీ శారీరిక ఆరోగ్యం తో పాటు, మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
అనగనగా ఒకసారి ఒక తాబేలు, ఒక కుందేలు ఎవరు వేగంగా పరుగేత్తగలరు అని వాదించుకున్నాయి. ఒక పరుగు పందెం పెట్టుకున్నాయి. అవి రెండూ పందేనికి ఒక దారి నిశ్చయిన్చుకున్నాయి. పందెం ప్రారంభించాయి. కుందేలు కొంతసేపు వేగంగా పరుగెత్తింది. తానూ తాబేలు కన్నా చాలా ముందు ఉన్నాను అని అనుకోని, ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుని మళ్లీ పరుగేడదాం అనుకొంది. ఒక చెట్టు క్రింద అలాగే నిద్రపోయింది. తాబేలు మెల్ల మెల్లగా వచ్చి కుందేలు నిద్ర లేచేలోపు గమ్యానికి చేరుకొంది. కుందేలు నిద్ర లేచి, తాను పందెం ఓడిపోయాను అని గ్రహించింది.ఇది మనం చిన్నతనాల్లో నేర్చుకున్న కథ. తెలివి, పట్టుదల ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం, అతి విశ్వాసం వాళ్ళ విజయం చేజారుతుంది అని నీతి.
దీనికి కొనసాగింపు ఎలా ఉంటుందో చూద్దాం.
కుందేలు ఓడిపోయినందుకు నిరుత్సాహ పడి ఏమి చెయ్యల అని ఆలోచించింది. తాను కేవలం నిర్లక్ష్యం, అధిక ఆత్మ విశ్వాసం, వల్లనే ఓడిపోయాను అనుకుని, తను అలా ఉండకపోతే, తాబేలు ఎన్నటికీ గెలిచేది కాదు అని, తాబేలుకు గెలిచే అవకాశం తనే ఇచ్చాను అనుకుని బాధపడింది.మళ్లీ తాబేలును పందేనికి పిలిచింది. తాబేలు ఒప్పుకుంది.ఈసారి కుందేలు మధ్యలో ఎక్కడా ఆగకుండా ఒక్కబిగిన పరుగెత్తింది. తాబేలు కన్నా ఎంతో ముందు గమ్యం చేరి పందెం గెలిచింది. ఇందులో నీతి ఏంటంటే, పట్టుదల, పరిశ్రమ ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగా ఉండేవాడి పైన విజయం సాధిస్తాడు.
ఈ కధకు మరింత కొనసాగింపు...
పందెం ఇదేవిధంగా ఉంటె తాను ఎప్పటికీ కుందేలును గెలవలెను అని తాబేలు అనుకుంది.
ఇలా అలోచించి, కుందేలు తో ఇంకో దారిలో పందెం వేసుకుందాం అని పిలిచింది. కుందేలు ఒప్పుకుంది.
పందెం మొదలయ్యింది. ఈసారి కూడా గెలవాలి అనే పట్టుదలతో, కుందేలు ఎప్పట్లాగే వేగంగా పరుగెత్తింది. అయితే మధ్యలో ఒక నది అడ్డువచ్చింది. ఆ నదికి ఆవలి వైపున రెండు కిలోమీటర్లు దాటితే, వాళ్ళ గమ్యస్థానం వస్తుంది. కుందేలు కుదేలయ్యి, నదిని ఎలా దాటడమా అని ఆలోచిస్తూ ఉండగానే, తాబేలు మెల్లగా వచ్చి నదిలోకి దూకి, నదిని దాటి ఆవలి వొడ్డుకు వెళ్లి, పందెం ముగించింది. ఈ కధలో నీతి, ముందు మన ప్రత్యర్ధి శక్తి ని అంచనా వేసి, మనకు సరిపోయే విధంగా యుద్ధ క్షేత్రాన్ని , వ్యూహాన్ని మార్చుకోవాలి.
ఈసారి కుందేలు, తాబేలు మంచి స్నేహితులు అయ్యాయి. అంతకు ముందు వేసుకున్న పందెం ఇంకా కొంచెం బాగా చేద్దాము అనుకున్నాయి. ఈసారి ఒక్కొక్కరు కాకుండా, ఇద్దరూ కలిసి ఒక టీం గా ఏర్పడి లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నాయి. నది ఒడ్దు వరకు, కుందేలు తాబేలును మోసుకుని వెళితే, నదిని దాటడంలో కుందేలుకు తాబేలు సహాయం చేసింది. నది దాటాక, మళ్లీ కుందేలు తాబేలును వీపు మిద ఎక్కించుకుని గమ్యస్థానం వరకు మోసుకెల్లింది. ఈసారి కుందేలు తాబేలు, పందెం ముగిసిన తర్వాత రెండూ గెలిచినందుకు చాలా తృప్తి పడ్డాయి, ఆనందించాయి.
ఈకథలో నీతి, : వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కో రంగం లో ప్రావీణ్యులే. పందెం అనగానే, ఒక గమ్యం చేరుకోవాలి అనగానే, ఎవ్వరూ వారి వారి బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోలేరు. లక్ష్యం పూర్తీ చేయడం లో ఒత్తిడికి గురి అవుతారు. అయితే, బలమైన ప్రత్యర్ధి తో కలిసి వారి బలాన్ని, తెలివితేటలను సామర్ధ్యాన్ని కూడా ఉపయోగించుకుని ఒక బృందంగా కలిసి పని చేసినపుడు విజయాన్ని సాధించగలరు. అయితే, బృందం లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని, పరిస్థితులకు తగ్గట్టు ఆలోచన చేయగలవారిని నాయకుడుగా ఎన్నుకున్నపుడు ఫలితాలు ఎప్పుడూ సంతృప్తికరంగానే ఉంటాయి.
ఈ కథ మన చుట్టూ ఉన్న పరిస్థితులకు చక్కగా అన్వయిస్తుంది. ఈ కథ చదవగానే, మనకు ప్రస్తుతం నడుస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుర్తొస్తారు. రాజకీయాల్లో చుస్తే, ప్రస్తుతం పరిస్థితి ఇలాగె ఉంది. ;చక్కటి సమన్వయము తో పని చేయవలసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే అవగాహనా లేకుండా ఉంది. ఒక రాష్ట్రం అభివృద్ది సాధించాలంటే, ఒక బలమైన నాయకునితో పాటు కేంద్ర సహకారం కూడా ఉండాలి. భారత దేశం లో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా అంటే కొంచెం ఆలోచించాలి. కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేయవలసింది పోయి, తన బలాన్ని అన్ని రాష్ట్రాలలోను పెంచుకోవడం గురించి ఆలోచించటం తప్పు. కుందేలు తాబేలు లాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే రాష్ట్రాలు, దేశాలు కూడా అభివృద్ది సాధిస్తాయి.
కుటుంబ విషయాలలో వస్తే, ఒకప్పుడు మనకు ఈ నీతి కధలో వలె ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కష్టం సుఖం అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెళ్ళిళ్ళు, చదువులు, పండుగలు అన్నిటికీ ఖర్చులు అందరూ పంచుకునే వారు. సలహాలు, సంప్రదింపులు అన్నీ పెద్దవాళ్ళే చూసుకునే వారు. ఎవరికీ ఏ ఖర్చులో తలకు మించిన భారంగా తోచేవి కావు. ఎవరికీ ఏ పనిలోనూ, ఏ విషయం లోను ఒత్తిడి ఉండేది కాదు. అసలు ఉమ్మడి కుటుంబం కన్నా మించిన "టీం వర్క్ " ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అంతా వ్యక్తిగతం. ఒకరి విషయాలు ఒకరికి తెలియవు. ఒకరికి మించి ఒకరికి సంపాదన ఉండాలి, ఆస్తులు సమకూర్చుకోవాలి అనే ఆత్రం. ఒకరికి మించి ఒకరికి వత్తిడి,
భార్యా భార్తలైనా, కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే, కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఒకరిపై ఒకరు పోటీ పడి సాధించేది ఏమి లేదు.
మాసాలలో ప్రశస్తమైన మాసం వైశాఖ మాసం. ఈ మాసం లో వచ్చే అక్షయ తృతీయ కు మంచి ప్రాధాన్యం ఉంది. ఈ రోజును పరశురామ జయంతి గాను, లక్ష్మి దేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందగలిగే రోజు గాను పెద్దలు చెప్తారు. ఈరోజుననే విశాఖ జిల్లా సింహాచలం లో శ్రీ లక్ష్మీ వరాహ నృసింహ స్వామివారికి రోజూ పూసే చందనం ఒలిచి నిజ రూప సందర్శనానికి అనుమతిస్తారు. ఈరోజున విష్ణు మూర్తికి చందన లేపనం చేసిన వారికి మహావిష్ణువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు, శ్రీ మహావిష్ణువును కృష్ణ తులసి దళాలతొ అర్చించడం విష్ణువుకు మహా ప్రీతిదాయకం. అక్షయ తృతియ రోజున మహావిష్ణు ప్రీతిగా విష్ణు అర్చన, సహస్ర నామ పారాయణ చేసి, వడపప్పు, పానకం దానం చెయ్యడం మంచిది. వేసవి ముదురుతూ ఉంటుంది కాబట్టి, నీరు, పలుచని మజ్జిగ, చెప్పులు, వస్త్రము, గొడుగు, బెల్లం, మొదలైనవి కూడా దానం చేయడం వలన పుణ్యం లభిస్తుంది అని పెద్దల ఉవాచ. కొంథమంది ఈ మాసం లో వచ్చే మామిడి పళ్ళను, ఒక విసనకర్రతో పాటు, దక్షిణ తాంబూల సహితంగా బ్రాహ్మణులకు దానం చేస్తారు. ఈ మాసం లో చేసిన గంగా స్నానం విశేష ఫలాలను ఇస్తుంది.
ఈ మాసం లో మొదట వచ్చే తదియ రోజు చేసిన పుణ్య కార్యాలు అక్షయమైన ఫలితాలను ఇస్తాయి కాబట్టి, ఈ రోజును అక్షయ తృతీయ అని అంటారు. ఈరోజు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం, తమ ఇండ్లలొ ఆ దేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం కోసం మహిళలు ఈరోజున లక్ష్మీదేవిని బంగారం, వెండి తదితర రూపాలలో కొనుగోలు చేస్తారు. ఈరోజున చేసే పితృకార్యాలు కూడా అక్షయమైన ఫలితాలను ఇస్తాయి.
శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా మన మీద ప్రసరించాలి అంటే, ప్రతి ఒక్కరూ చేయవలసిన మరికొన్ని పనులు:
1. ఉదయం, సాయంత్రం పూజా మందిరం లోను, తులసి కోట వద్ద దీపారాధన చేయతం.
2. ప్రతి శుక్రవారం ఇంటి గడపను, తులసి కోటను, పసుపు, కుంకుమ లతో అలంకరించడం,
3. మృదుభాషణ కలిగి, ఇతరులపై అసూయ, ద్వేషం, చులకన భావం, లేకుండా ఉండడం,
4. పువ్వులు, గోవు, దీపములు మొదలైన వాటిలొ లక్ష్మీదేవి అంశ ఉంటుంది కాబట్టి వాటిని అనాదరించరాదు.
5. లక్ష్మీదేవి సత్యప్రియ కాబట్టి అసత్యము పలకని వారి యందు, దైవభక్తి కలవారి యందు, ప్రియముగా మాట్లాడేవారియందు, పెద్దలను ఆదరించే వారియందు, ఇతరుల పట్ల దయ, కరుణ చూపు వారియందు, లక్ష్మీదేవి స్థిరముగా ఉంటుంది అని శాస్త్ర ప్రమాణం.
ధూర్తులైన క్షత్రియులను సంహరించి, ధర్మ సంస్థాపన చేసిన పరశురామ జయంతి ఈరోజే. తండ్రి కిచ్చిన మాట కోసం, తల్లినె వధించి, మరల ఆ తండ్రి దీవెనలతో తల్లిని బ్రతికించుకున్న మాతాపిత భక్త పరాయణుడు పరశురాముడు. పరశురాముడు విష్ణువు అవతారం కాబట్టి, ఈ రోజున విష్ణు అర్చన, చేయడం రివాజు.
.
అందరికీ అక్షయ తృతియ శుభాకాంక్షలు.
తుషి" అనేది మహారాష్ట్ర కు చెందిన ఒక కంఠాభరణ డిజైను. ఈ మోడల్ లో చిన్న చిన్న బంగారు పూసలలో గాలిని పంపించి, వాటిని దగ్గర దగ్గరగా గుచ్చి చేస్తారు. పూసల అల్లికలో, ప్లాస్తిక్ దారం తప్ప, బంగారు తీగను ఉపయోగించరు. ఇవి సాధారణంగా పొడవైన హారాల వలె కాకుండా, మెడకు అంటిపెట్టుకుని ఉండే చోకర్ నెక్లస్ మాదిరిగా ఉంటాయి. వీటి తయారీ మహారాష్ట్రలోని పైథాన్ లో పీష్వాల కాలం నుండీ జరుగుతున్నది. మహారాష్ట్ర మహిళలు సంప్రదాయంగా ధరించే "నవారి పైథాని" ( 9గజాల పైథాని చీర) పైన ఈ నెక్లేస్ ధరిస్తారు. ఒకప్పుడు మహారాష్ట్రకే పరిమితమైన ఈ ఆభరణాలు ఇప్పుడు మన అంధ్రప్రదేశ్ లో కూడా దొరుకుతున్నాయి. విశేషం ఏమిటంటే, ఇవి చాలా తక్కువ తూకం లోనే చేయించుకోవచ్చు. వెనక చైన్ లేకుండా 4 గ్రాముల నుంచి లభిస్తాయి.
మన మనస్తత్వాల్లోనూ, ప్రవర్తన లోనూ మార్పు రావాలి అంటే, మనం పెద్ద పెద్ద గ్రంధాలే చదవనక్కర లేదు. ఒక్కొసారి, చిన్న చిన్న మాటలు , కథలే మన జీవితంలో ఎంతో మార్పు తెస్తాయి. అందుకు ఉదాహరణ ఈ కథ. ఈ కథ మీలో చాలా మందే చదివి ఉంటారు. కానీ, నాకు నా హద్దులేంటో నేర్పించి, నాలో ఎంతో మార్పు తెచ్చిన ఈ కథను మీ అందరితో పంచుకోవాలి అనిపించింది.
అనగనగా ఒక కప్ప, ఒక నీళ్ళ కాగులో కూర్చొంది. ఆ కాగు క్రింద, ఒకడు నిప్పు పెట్టాడు, నీళ్ళు కాచుకోవాలి అని. మొదట్లొ, నీళ్ళు వేడెక్కుతున్నా, ఆ కప్ప బయటికి రాకుండా సహిస్తూ అందులోనే కూర్చుంది. మెల్లగా నీళ్ళు వేడెక్కటం మొదలయ్యింది. కప్ప తను భరించగల వేడి ఉన్నంతవరకూ అందులోనే కూర్చుంది. ఒక్కసారి భరించలేనంతగా నీళ్ళు కాగేసరికి ఒక్క ఉదుటున కప్ప కాగు బయటికి గెంతింది. అయితే ఆసరికే కప్ప ప్రాణం పోయింది. కప్ప ప్రాణం పోవడంలో తప్పెవరిది? మనందరం కాగులో ఉన్న కప్పను చూసుకోకుండా నిప్పు పెట్టినవాడిది అని అనుకుంటాం. కాని, ఈ కథలో తప్పు కప్పది. ఎందుకంటే, నీళ్ళు వేడి అవుతున్నయి అని తెలిసినప్పటికీ, సహిస్తూ అందులోనే కూర్చుంది కానీ, అందులోంచి తప్పించుకోవాలి అని అనుకోలేదు. సరిగా ఏ పాయింట్ దగ్గర తప్పుకోవాలో కప్పకు తెలియలేదు.
సరిగా మనలొ చాలా మంది ఈ కథలో కప్ప లాగే అన్నిటినీ భరిస్తాము. చుట్టాలో, స్నేహితులో, ఇరుగుపొరుగు వారో, ఎవరైనా కానీ, మనను దూషిస్తున్నా, లోకువ చేస్తున్నా, అపనిందలు వేస్తున్నా, మనలను శారీరికంగా, మానసికంగా, అర్ధికంగా, సామాజికంగా హింసిస్తున్నా నోరు మూసుకుని కూర్చుంటాం. ఎంతో అణగదొక్కుతున్నా సహిస్తాము. అది మన చేతకాని తనం కావచ్చు, మంచితనం కావచ్చు, ఇంకా చెప్పాలంటే, స్నేహము, బంధుత్వాల పట్ల మనకు ఉన్న గౌరవం, ప్రేమ కావచ్చు, కారణం ఏదైతేనేం, మనం ఎదుటివారి అణిచివేతను నవ్వుతూ, (లోపల్లోపల ఏడుస్తూ) భరిస్తాము. ఎక్కడ, ఏ పాయింట్ లో వారిని అడ్డుకోవాలో మనం గమనించుకోము. మనం సహించి ఊరుకున్నన్నాళ్ళూ ఎదుటివారు మనలను అణగదొక్కుతూనే ఉంటారు.
మన మీద ఎదుటివారి అనవసర ఆధిపత్యాన్ని, మన విషయాలలో ఎదుటివారి అనవసర జోక్యాన్ని అవసరమైన చోట అడ్డుకునే ధైర్యం మనకు రావాలి. అటువంటి విజ్ఞతను ఈ కథ మనకు నేర్పిస్తుంది.