Friday, 28 August 2015* శ్రావణ పూర్ణిమ (రాఖీ పూర్ణిమ)
మన పురాణాల లో ఇంద్రుదు, కృష్ణుడు ఇలా దేవతలకు కూడా రాఖీ కట్టారుట.
" యేన బద్దో బలీ రాజా దాన వేంద్రో మహా బలా
తేనత్వా మాభి బద్నామి రక్షే మా చల మా చల "
ఈ మంత్రాని పఠిస్తూ రాఖీ కడతారు.
భారతీయ సంప్రదాయంలో పెద్దలు ఏర్పర్చిన పద్ధతులు మరుగున పడి విదేశీయ సంప్రదాయ మోజులో నిరాదరణకు గురెై వాటి ప్రయోజనాలను నేటి తరం వరకు గుర్తించలేకపోతున్నారు. అటువంటి సంప్రదాయాల్లో రక్షా(రాఖీ) బంధనం ఒకటి. రక్షా బంధనంలోని ప్రయోజనాలలో ఆధునీకత చోటు చేసుకుని రాఖీ పౌర్ణమి వినోద కార్యక్రమంగా కొనసాగుతూ పిల్లలకు మాత్రమే పరిమితమవుతుంది.
* రక్షా బంధనం
పుట్టిన శిశువుకు ఏ కష్టమూ రాకుండా ఉండేందుకు హైందవులు బాల సారెనాడు దెైవాన్ని ప్రార్థిస్తూ, పురోహితుడు మంత్రోచరణ నడుమ శిశువకు కటి(మొలతాడు)రక్ష తొలిసారిగా కడతాడు. ఆ శిశువుకు ఏ దృష్టి దోషము కలుగకుండా దో(భుజానికికట్టే తాయత్తు) రక్షను తల్లి కడుతుంది. వివాహ సమయంలో వధూవరులిద్దరికి నుదిటి మీద పాల(భాషికం) రక్షలు ముతెైదువులు కడుతారు. మానవ జీవితంలో ఏ ఆపదలు సంభవించకుండా ఉంటాయన్న ప్రగాఢ విశ్వాసంతో ప్రతి ఘట్టంలో రక్షా బంధన ఆచారాన్ని మన పూర్వీకులు ఏర్పరిచారు.
*రాఖీ
శ్రావణ మాసంలో చంద్రుడు తనకున్న 15 కళల్లో విరాజిల్లుతూ నిండుగా ఉండే పూర్ణిమ రోజు ‘రాకా’ పిలువబడుతుందని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ రాకా(పూర్ణిమ రోజు) నాడు చెల్లెలు తన అన్న చేతికి రక్షా బంధనం కట్టి మిఠాయిలు తినిపించి భవిష్య జీవితానికి రక్షణగా నిలిచేలా ఆశీర్వాదం పొందుతుంది. ఈ రక్షా బంధన ఆచారం మహాభారత కాలం నుంచి కొనసాగుతుందని వేద శాస్త్ర కోవిదులు తెలుపుతున్నారు. మహా భారత యుద్ధ కాలంలో శ్రీకృష్ణుని చేతికి గాయమవ్వగా వెంటనే ద్రౌపది తన చీర కొంగును చించి ఆ గాయానికి రక్షగా కట్టిందని, కౌర వ సభలో ద్రౌపది వస్త్రాపహరణ ఆపద సమయంలో అన్న శ్రీ కృష్ణుడు చీరలు అందించి ద్రౌపదికి రక్షగా నిలిచాడని పురారణ కథనాలు వెల్లడిస్తున్నాయి. అలానే యమధర్మరాజు చేతికి యమునాదేవి రక్షా బంధనం కట్టడం ద్వారా సకల జీవుల పాప కర్మలను తొలగించే పుణ్య యుమునా నదిగా అవతరించిందని ఇతిహాసాలు చెప్తున్నాయి. ఈ రాఖీ పండుగను మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.
* జంధ్యాల పూర్ణిమ
సనాతన ఆచారాలను, నియమనిష్టలను కచ్చితంగా పాటించే కుటుంబాలలో ఉపనయనం సమయం నుంచి యజ్ఞోపవీతం(జంధ్యం) ధరించడం సంప్రదాయంగా కొనసాగుతుంది. శ్రావణ పూర్ణిమ నాడు పాత జంధ్యాన్ని విసర్జించి నూతన జంధ్యాన్ని ధరించడ ం ఆనవాయితీగా నేటికి కొనసాగుతుంది. ఈ జంధ్యాన్ని ధరించే సమయంలో గాయత్రీ మంత్రం జపిస్తారు. జంధ్యాల పూర్ణిమను పురస్కరించుకొని నగరంలో వాసవీ సేవా సమితి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి జంధ్యాలను మాజేటి గోపాల కృష్ణ అందిస్తూ దాని ప్రాశిస్త్యాన్ని, గాయత్రీ మంత్ర మహిమను తెలుపుతున్నారు.
* హయగ్రీవ జయంతి:
విద్యా బోధనలను అందించే జ్ఞాన గురువుగా అందరూ పూజించే హయగ్రీవుడి జయంతి శ్రావణ పూర్ణిమ నాడు అందరూ ఘనంగా జరుపుకుంటారు. హయగ్రీవుడు మానవ దేహంతో గురప్రు తలతో, నాలుగు చేతులలో శ్రీహరి ఆయుధాలు, చిహ్నాలను ధరించిన అవతారంలో దర్శనమిస్తారు. పురాణ కథలు ఎలా ఉన్నా జ్ఞాన ప్రధాత హయగ్రీవుడిని శ్రావణ పూర్ణిమ రోజున విద్యార్థులు పూజిస్తే చదువు బాగా కొనసాగుతుందని పండితులు చెప్తున్నారు.
* శ్రావణ పూర్ణిమ విశిష్టత
శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణమని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఏ నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటే ఆ మాసానికి ఆ పేరు పెట్టారు వేదకోవిదులు. శ్రవణం కార్యసాధక నక్షత్రమని జ్యోతిష్య శాస్త్రం వెల్లడిస్తుంది. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణార్ధం అవతరించిన మత్స్య, కూర్మ, వరహా, నారసింహ, వామన, పరుశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి జన్మలతోపాటు కలియుగ ప్రత్యక్ష దెైవంగా కొలువబడుతున్న శ్రీవేంకటేశ్వరుని అవతారంలో కూడా శ్రవణా నక్షత్రం నాడు జన్మించారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు. శ్రవణా నక్షత్రం నాడు వేంకటేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేష అలంకారాలు నిర్వహించడం అనాధిగా కొనసాగుతుంది.
* నా ముఖపుస్తకంలో నున్న అక్కచల్లెల్లందరికి రక్షాభందన్ శుభాకాంక్షాలు

courtesy: Soma Sekhar
* హయగ్రీవ జయంతి
మహావిష్ణువు హయగ్రీవుడిగా- గుఱ్ఱపు తల కలిగిన మానవాకారంగా రూపొందిన పుణ్యదినం. ఈ వృత్తాంతాన్ని దేవీభాగవతంలోని ప్రథమ స్కంధం చక్కగా వివరించింది.
ఒకానొక సమయంలో మహావిష్ణువు రాక్షసవీరులతో పదివేల సంవత్సరాలపాటు భీకరంగా యుద్ధం చేసి అలసిపోయాడు. అల్లెతాడు గట్టిగా బిగించి ఉన్న శార్ఞ్గం అనే తన ధనుస్సును నేలమీద నిలబెట్టి, దాని కోపు మీద తన గడ్డాన్ని ఆనించి నిలబడే నిద్రపోయాడు. ఆ సమయంలో విష్ణుమూర్తిని వెతుకుతూ అక్కడికి వచ్చిన దేవతలు అతడిని నిద్రలేపటానికి జంకారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక వమ్రిని (చెదపురుగును) సృష్టించి ఆ వింటినారిని కొరకవలసిందిగా చెప్పాడు. 'నిద్రపోతున్నవారిని లేపటం బ్రహ్మహత్యతో సమానమైన పాపం కనుక నేను ఆ పనిని చేయను' అన్నది వమ్రి. ఆ మాట విన్న బ్రహ్మదేవుడు 'అగ్నిహోత్రంలో హవిస్సును వేసే సమయంలో పక్కన పడినదాన్ని నీకు ఆహారంగా ఇస్తాను. ఈ దైవకార్యాన్ని చేయి!' అన్నాడు.
ఆ పవిత్రాన్నం తనకు దొరుకుతున్నందుకు వమ్రి ఎంతగానో సంతోషించి ఆ నారిని కొరికింది. దానితో ఆ ధనుస్సు విసురుగా తుళ్లి, ఆ వింటికోపు విష్ణుమూర్తి మెడకు తగిలి అతడి శిరస్సు తెగి, ఎగిరి ఎక్కడో పడ్డది. ఈ తల తెగటానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి ఇచ్చిన శాపమే కారణం కావటం మరొక విశేషం. అనుకోకుండా జరిగిన ఈ దారుణానికి దేవతలు చాలా బాధపడ్డారు. బ్రహ్మదేవుడు వారినోదార్చి మహాదేవిని ధ్యానించ వలసిందిగా సూచిం చాడు. వారు అట్లాగే చేశారు. ఆమె ప్రత్యక్షమైంది. దేవతలందరూ కలిసి ఆమె సూచించిన విధంగానే ఒక గుర్రాన్ని వధించి, దాని తల తీసుకు వచ్చారు. దేవశిల్పియైన త్వష్ట దాన్ని విష్ణుమూర్తి మొండానికి అతికించాడు. బ్రహ్మదేవుడు ప్రాణం పోశాడు. ఆ విధంగా విష్ణుమూర్తి హయగ్రీవుడైనాడు.
హయగ్రీవుడు అనే రాక్షసుడున్నాడు. అతడు దేవికోసం తపస్సు చేసి, తాను మరణం లేకుండా చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని కోరాడు. ఆమె కుదరదన్నది. అతడు తనవంటి ఆకారం కలవాడి చేతిలోనే మరణించే విధంగా వరాన్ని ఇమ్మని అడిగి దాన్ని పొందాడు. ఆమె 'సరే!' అని అంతర్థానం చెందింది. ఆ వరగర్వంతో అతడు చతుర్దశ భువనాలనూ హింసించసాగాడు. ఇతడిని వధించటానికే విష్ణుమూర్తి ఇంతకు ముందు మనం చెప్పుకొన్న విధంగా హయగ్రీవుడైనాడు.
హయగ్రీవుడు చంద్రమండల నివాసి, మహానంద స్వరూపుడు. ప్రకృష్ట ప్రజ్ఞాశాలి. అతడి నాసిక నుంచే వేదాలు ఆవిర్భవించాయని పురాణగాథ. ఆయన విరాట్ స్వరూపాన్ని ధరించినప్పుడు- సత్యలోకం అతడికి శిరస్సు. భూలోకం నాభి. పాతాళం పాదాలు. అంతరిక్షం కన్ను. సూర్యుడు కంటి గుడ్డు. చంద్రుడు గుండె. దిక్పాలకులు భుజాలు. అగ్ని ముఖం. సముద్రాలు ఉదరం. నదులు నాడులు. పర్వతాలు ఎముకలు. మేఘాలు కేశాలు. అంటే హయగ్రీవుడు సమస్త దేవతా స్వరూపుడని తాత్పర్యం.
హయగ్రీవుడు తెల్లని శరీరం కలవాడు. అతడు లక్ష్మీదేవిని తన ఎడమ తొడపై కూర్చోబెట్టుకొని తెల్లని పద్మం మీద కూర్చొని ఉంటాడు. అతడి పై కుడి చేతిలో చక్రం, పై ఎడమ చేతిలో శంఖం, కింది ఎడమ చేతిలో పుస్తకం ఉంటాయి. కింది కుడిచేయి చిన్ముద్ర. వీటిలో తెల్లని పద్మం సమస్త ఐశ్వర్యాలకు చిహ్నం. చిన్ముద్ర జ్ఞానానికీ, పుస్తకం సమస్త విద్యలకు, శంఖం సకల జగత్ సృష్టికి కారణభూతమైన నాదానికీ, చక్రం అజ్ఞాన సంహారానికీ చిహ్నాలు. కనుక హయగ్రీవుడిని ఉపాసించినవారికి పైన తెలిపిన ఐశ్వర్యాదులన్నీ కరతలామలకాలని తాత్పర్యం.
'హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ' అంటూ ఎవరైతే హయగ్రీవ నామాన్ని జపిస్తుంటాడో వారికి జహ్నుకన్య అయిన గంగానదీ ప్రవాహంతో సమానమైన వాగ్ధార సిద్ధిస్తుంది లభిస్తుందని రుషి వచనం. అందువల్లనే వైష్ణవులకు ఆధ్యాత్మిక విద్యాభ్యాసం హయగ్రీవ నామోపదేశంతోనే ప్రారంభమయ్యే సంప్రదాయం ఏర్పడింది.
ఏ దేవతకైనా అతని నామమే అతడి శరీరం. ఆ నామంలోని అక్షరాలే అతడి అవయవాలని మంత్రశాస్త్రం చెబుతున్నది.
హయగ్రీవనామం దివ్యశక్తి సంభరితమైనది. ఆ నామాన్ని స్మరించినవాడు శివస్వరూపుడవుతాడంతారు. పలికినవాడు విష్ణుస్వరూపుడవుతాడనీ విశ్వసిస్తారు. విన్నవాడు తన స్వరూపుడవుతాడన్నాడట బ్రహ్మదేవుడు స్వయంగా. హయగ్రీవ నామం అంత విశిష్టమైనది.

courtesy: Soma Sekhar


* హయగ్రీవ
శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమయే ‘హయగ్రీవ జయంతి’. హయగ్రీవుడనగానే సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించి, గుఱ్ఱపు మోముగల ఒక వేదాపహారియైన రాక్షసుని సంహరించి వేదాలను ఉద్ధరించినవాడని మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువుయొక్క అవతారాలలో పది అవతారాలు మాత్రం దశావతారాలుగా ప్రసిద్ధికెక్కినప్పటికీ, మహాభాగవతంలో ఇరవైకి పైగా అవతారాలు పేర్కొనబడి ఉన్నాయ. ఆ అవతారాలలో ‘హయగ్రీవావతారం’ విశిష్టమైనది. ‘హయం’ అనగా గుఱ్ఱం, ‘గ్రీవం’ అనగా కంఠం. అశ్వ ముఖంతో మానవ శరీరంతో వామాంకమున శ్రీ లక్ష్మీదేవితో తెల్లని శరీర ఛాయతో, చతుర్భుజాలతో, శంఖ, చక్ర చిన్ముద్ర పుస్తకాలను దాల్చిన శ్రీమన్నారాయణుడి గురురూపమే హయగ్రీవ స్వరూపం.
రాక్షసులు దొంగిలించిన వేదాలను ఈ హయగ్రీవుడే తిరిగి తెచ్చినట్టు విష్ణు ధర్మోత్తరం చెబుతోంది. శ్రావణపూర్ణిమ రోజున హయగ్రీవుని విశేషంగా అర్చించాలి. ఈ స్వామిని పూజించడంవల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి. భూవివాదాలు పరిష్కరించబడతాయి. న్యాయ పోరాటాలలో విజయం లభిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు హయగ్రీవుని పూజించడంవల్ల చదువు బాగా వస్తుంది. శత్రు వినాశనం కూడా జరుగుతుంది. ప్రతిరోజు హయగ్రీవుని స్తుతి చేస్తే లక్ష్మీనారాయణుల శుభాశీస్సులతోపాటు సకల దేవతలు సంపూర్ణ శుభాశీస్సులు కూడా సంప్రాప్తమవుతాయి. ఈ క్రింది సోత్త్రాన్ని హయగ్రీవ జయంతి రోజున ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు పఠించడం వల్ల శుభాలు కలుగుతాయ.
" జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే "
జ్ఞానం, ఆనందం, మూర్త్భీవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము. దేవీ పురాణం, స్కాంధ పురాణం, శ్రీమద్భాగవతంతోపాటు ఆగమ శాస్త్రాల్లో హయగ్రీవుడి ప్రస్తావన ఉంది. వేద విద్యాభ్యాసాన్ని కూడా హయగ్రీవ జయంతినాడే ప్రారంభిస్తారు. విద్యార్థులందరూ ఈ రోజున హయగ్రీవుని అర్చించాలి. లౌకిక, పారలౌకిక విద్యలు సిద్ధించేందుకు హయగ్రీవార్చన శీఘ్ఫ్రలకరం.
హయగ్రీవ జయంతి రోజున స్వామిని షోడశోపచారాలతో, అష్టోత్తరాలతో పూజించాలి. హయగ్రీవునికి యాలకులు ప్రీతికరమైనవి. యాలకుల మాలను ధరింపజేసి శనగలు, గుగ్గుళ్ళను తయారుచేసి నివేదించాలి. మరియు తెల్లపూవులతో పూజించాలి. మరీ ఎక్కువ వాసన కలిగించే పుష్పాలతో పూజించకూడదు. ఇలా శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవ పూజ చేయడం సర్వశ్రేష్ఠం. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది. సకలైశ్వర్యాలను కలిగించే హయగ్రీవ పూజ చేయడానికి స్ర్తి పురుష తారతమ్యం లేదు. కానీ ఈ రోజు ఉప్పులేని ఆహారాన్ని మాత్రం స్వీకరించాలి. సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు. హయగ్రీవోపాసన వాక్‌శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది. అందుకే శుద్ధ పూర్ణిమనాడు హయగ్రీవారాధన విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది.
శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని, స్తోత్ర ప్రాశస్త్యాన్ని అగస్త్య మహామునికి హయగ్రీవుడే బోధించాడని బ్రహ్మపురాణ విదితం.
ఆదిశంకరాచార్యులు, శ్రీరామానుజాచార్యులు వంటి మహనీయులు కూడా హయగ్రీవుని పూజించి తరించారు. విశ్వశ్రేయోదాకమైన వేదాలను రాక్షసుల చేతిలో పడనీయక హరియే హయగ్రీవునిగా అవతరించిన ఈ రోజు మనం కూడా హయగ్రీవుని పూజిద్దాం.
విద్యావంతులుగా మారి ధర్మ సంస్థాపనం చేద్దాం.

courtesy: soma Sekhar 
* హయగ్రీవ మాధవ ఆలయం, హజో
హయగ్రీవ మాధవ ఆలయం కేవలం హజోలో మాత్రమే కాకుండా ఈ ప్రాంతం మొత్తంలో కూడా చాలా ప్రసిద్ది చెందిన, తప్పక సందర్శించదగిన ఆలయం. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది, ఈ హయగ్రీవ మాధవ ఆలయం, పూరీలోని జగ్గనాద స్వామి ఆలయాన్ని పోలి ఉంటుందని నమ్మకం.
ఈ ప్రదేశంలో, బుద్ధుడు నిర్వాణం చెందాడని నమ్మకం. అయితే, ఈ హయగ్రీవ మాధవ ఆలయాన్ని ప్రతి ఏటా హిందువులతో పాటు అనేకమంది బౌద్ధ మతస్తులు కూడా సందర్శిస్తారు. మార్చ్ నెలలో నిర్వహించే హోలీ పండుగ ఈ ఆలయ ప్రధాన ఆకర్షణ. ఈ హోలీ పండుగ సమయంలో భక్తులు, పర్యాటకులు గుంపులుగా ఈ ఆలయానికి వస్తారు. ఇతర పండుగలైన బిహు, జన్మాష్టమిని కూడా అదేవిధంగా జరుపుకుంటారు.
అయితే, ఈ ఆలయం ఏ సంవత్సరంలో నిర్మించారనేది సరిగా చెప్పలేము, ఆధారాల ప్రకారం 1543 వ సంవత్సరంలో పాత నిర్మాణాన్ని ముస్లింలు నాశనం చేసిన తరువాత కోచ్ రాజు రఘుదేవ్ దీనిని పునర్నిర్మించాడు.

courtesy: Soma Sekhar
* హయగ్రీవ స్తవం
" పూర్ణచంద్ర సమ ప్రభాయ
ఆది మధ్యాంతరహితాయ
సర్వ వాగీశ్వరేశ్వరాయ
శ్రీ హయ గ్రీవాయనమః "
చంద్రునితో సమానమైన తేజస్సు గలవాడు. ఆది మధ్యాంతాలు లేని వాడు. వాక్కునకు అధిపతి అయిన హయగ్రీవనకు నమస్కరిస్తున్నాను. హయగ్రీవుడ్ని భక్తితో ప్రార్ధిస్తే తప్పక కోరికలు నెరవేరుతాయి. జ్ఞానం వృద్ధి చెందుతుంది.భోగభాగ్యాలు చేకురతాయి. ఆరోగ్యవంతులైవుతారు.

Thursday, 27 August 2015
సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని పాడుకున్న సంస్కృతి మనది. రాజ్యం అంటే రామ రాజ్యం, కొడుకు అంటే రాముడిలా ఉండాలి, ప్రభువు అంటే రాముడిలా ఉండాలి, అని నమ్మే సంప్రదాయం. ఆఖరికి ఎవరి మంచితనాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు, రాముడు మంచి బాలుడు అనే చెప్తాము.  ప్రతి భారత యువతీ రాముని లాంటి భర్తనే కోరుకుంటుంది. విష్ణువు యొక్క ఎన్నో అవతారాలు ఉన్నా, కష్టం వచ్చినప్పుడు " రామా! ఎక్కడున్నావయ్యా ? " అనో, " రామచంద్ర ప్రభూ" అనో రాముణ్ణే స్మరిస్తాము. ఇక సీతమ్మవారి విషయానికి వస్తే, సహనానికి మారుపేరు సీతమ్మ, భర్తను ప్రేమించడానికి, భర్త అడుగుజాడల్లో నడవడానికి,  భర్త కోసం, రాజ్యాన్ని, సంపదనూ తృణప్రాయంగా వదిలేసిన మహాసాధ్వి ఆమె. భారత స్త్రీలందరకూ ఆమె ఆదర్శం. మరి ఈరోజున ఈ తరం వారందరూ "రాముడు సీతమ్మకు ఏమి చేసాడు? కడుపుతో ఉన్న భార్యని అడవులకు పంపడమేనా? శీలపరీక్ష కోసం అగ్నిలో ప్రవేశపెట్టడమేనా? మహాసాధ్విని అనుమానించడమేనా ఆయన గొప్పతనం? ఒక చాకలి వాని మాట పట్టుకుని భార్యను అనుమానించాడే?" ఇటువంటి మాటలు క్రిందటి తరం నుంచి వినబడబట్టి కదా, నేడు ఈ తరంలో భారతీయ వివాహ వ్యవస్థ ముక్కలైపోతోంది!

రాముడు శ్రీ మహావిష్ణు అవతారం అని అందరికీ తెలిసినదే...అవతారం అనగా లోకంలో చెడు పెచ్చుమీరినప్పుడు, భగవంతుడు ఆయా కాలాలకు అనుగుణంగా రూపం ధరించి, ఆ చెడును అంతమొందించడానికి పూనుకుంటాడు. ఇక్కడ రావణుడు, మహాశివభక్తుడు. అత్యంత ధైర్యశాలి. ప్రజలు ఆరాధించే ప్రభువు. శక్తిసంపన్నుడు. అటువంటివాడి దగ్గర పరస్త్రీ వ్యామోహం అనే ఒక దుర్గుణం ఉంది. పైగా, నరులు, వానరులు తప్ప మరెవ్వరి వలన చావు రాకూడదు అని వరం పొందినవాడు. అందువలన భగవానుడు నరుని అవతారం ఎత్తాలి. అన్ని నీతినియమాలు ఉన్న రావణునితో యుద్ధం రావాలి అంటే, అతను ఏదో ఒక తప్పు చేయ్యాలి. అది అతని బలహీనత కారణంగా సీతమ్మవారిని ఎత్తుకెళ్ళాలి. వానరుల వలన కూడా చావు రాకుండా కోరుకున్నాడు కాబట్టి ఈ క్రతువులో వానరులు కూడా భాగం పంచుకోవాలి.  రావణుడు సీతాసాధ్విని ఎత్తుకెళ్ళాలంటే రాజభవనం లో ఉంటే కుదరదు. ఆవిడ ఏకాంతంగా ఉండాలి. అందుకే వనవాసం. అందుకు కైకమ్మ వరాల ప్రహసనం. మామూలుగా దశరథుడు అనుకున్నట్టు రాజ్యాభిషేకం జరిగిపోతే, ఇవన్నీ జరగవు. రాజ్యాభిషేకం తెల్లారి అనగా కైక భర్తను వరాలు అడుగుతుంది. ఇంకా ముందు అడిగి ఉంటే, సమయం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి, రాజ్యాభిషేకం ఎలాగో అలాగ జరిగిపోయి ఉండేది. లేదా, రాముణ్ణి చిన్నతనం నుంచి పెంచిన ప్రేమ కారణంగా తన మనసే మారిపోయి ఉండేది. అలా జరిగినప్పుడు అవతార లక్ష్యం నెరవేరదు.   అయోధ్యా ప్రభువైన దశరథునికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా  కైక సమయం మించిపోయిన తరువాత దశరథుణ్ణి వరం అడిగి  మారుమాట్లాడకుండా దిగ్బంధనం చేసింది. పాపం ఈ అవతార లీలలో తన వంతు పాత్ర పోషించినప్పటికీ, మొత్తం రామాయణంలో చెడ్డపేరు మిగిలినది కైకమ్మకే.  రాముడు సీతమ్మను శీలపరీక్ష కోరినది కూడా ఒక భర్తగా కాదు. ఒక ప్రభువుగా. ఈరోజు తాను ధర్మ ప్రకారం నడుచుకుంటే, రేపు ప్రజలకు తీర్పు చెప్పగలడు. శిక్షలు విధించగలడు. ఈరోజు ధర్మం తప్పితే, రేపు ప్రజలే ప్రశ్నిస్తారు. ఆ అవకాసం ప్రభువన్నవాడు ప్రజలకు ఇవ్వకూడదు. ప్రభువు ఎట్టి పరిస్థితులలోనూ ధర్మం వీడకూడదు. తన భార్య, సహధర్మచారిణి, ఎటువంటి తప్పు చేయదని ఆయనకు తెలుసు. ఆ మాట అగ్నిహోత్రుడంతటివాడు చెప్తే ఆ మాటకు విలువ ఎక్కువ. అందుకనే ఆమె మీద ఉన్న నమ్మకం కారణంగానే, అగ్ని ప్రవేశం చేసినప్పటికీ ఆమె సురక్షితంగా ఇవతలికి రాగలదు అన్న నమ్మకంతోనే రాముడు కేవలం ప్రజల తృప్తి కోసం, తన ధర్మాచరణ కోసం సీతను అగ్ని పరీక్షను కోరాడు. తన భర్త తన శీలపరీక్షను కోరినప్పుడు కాని, గర్భిణిగా ఉన్న సమయములో అడవులకు పంపినప్పుడు కానీ, సీతమ్మ మారుమాట్లాడలేదు. గంగా నది ఒడ్డున సీతారోదనం విన్న భూదేవి రాముడిని శపించబోతే, నన్నేమైనా అను కానీ రాముడిని మాట్రం ఏదైనా అంటే సహించను అని సమాధానం ఇస్తుంది. ఆమెకు లేని అభ్యంతరం మనకెందుకండీ? ఏదో వితండవాదం చేయటం తప్ప. మన ఇతిహాసాలు, గ్రంధాలు, ఎప్పుడూ మన మంచిని కోరే వ్రాయబడినాయి. వాటిని నమ్మి ఆచరించిన రోజున మన ధర్మం నిలుస్తుంది. "ధర్మో రక్షతి రక్షిత:" అనే వాక్యానికి అర్ధం ఇదే..ధర్మాచరణ తప్పిననాడు మానవుడు అధోగతి పాలవుతాడు. అటువంటి వ్యక్తులతో కూడిన సమాజం కూడా నాశనమైపోతుంది.

Thursday, 20 August 2015

మానవతా దినోత్సవం అనేది ఒకటి జరుపుకోవడమే మానవుల దౌర్భాగ్యం. నాగరికత తెలియని రాతియుగం లో మానవులు తిండి కోసం కొట్టుకునేవాళ్ళు.  ఇప్పుడు కావలసినంత తిండి ఉంది. అయినా కొట్టుకోవడం మానలేదు. ఇప్పుడు నాగరికత పెరిగింది కాబట్టి ఏకంగా చంపుకోవడమే. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, తల్లి, తండ్రి, స్నేహితులు ఇలా ఏ బంధాలు, మమకారాలు లేవు. అందరూ అన్నింటికీ ఘర్షణ పడటమే. ఒకరినొకరు చంపుకోవడమే. ముఖ్యంగా ఆస్తి, డబ్బు వీటి గురించే కొట్లాటలు. మానవత్వాన్ని మర్చిపోయేలా చేసేది ఈ డబ్బే. డబ్బు బ్రతకడానికి అవసరమే, కానీ డబ్బే జీవితం కాకూడదు. పేదవాడు తన పక్కన ఉన్న ఇంకొకడికి తనకు కలిగినంతలో పెడుతున్నాడు. కలిగినవాడు పక్కవాడిది కూడా లాక్కుంటున్నాడు. లేనివాడు తిండి కోసం తాపత్రయ పడితే, ఉన్నవాడు ఇంకా డబ్బు, ఆస్తి, సంపాదించాలని ఆట్ర పడతాదు. ఇంకా అధికారం, పలుకుబడి ఉన్నవాడు  రాజ్యాలనే మింగేయాలని చూస్తాడు.  మనుషులు తాము మనుషులమని మర్చిపోతూ ఉన్నారు. దీనికి ముఖ్య కారణం అందరిలో పేరుకుపోయిన మితిమీరిన స్వార్ధం. అన్నీ నాకే కావాలి, అంతా నాకే సొంతం కావాలి అనే తపన. అసలు అరిషడ్వర్గాలకన్నిటికీ మూలం ఈ స్వార్ధమేనేమో. ఈ స్వార్ధానికి మూలం, విలువలు లేని చదువులు, నియమం లేని బ్రతుకులు. మనుషుల ప్రాధాన్యతలు మారాయి. కోరికలు పెరిగాయి. కోరికలే దు:ఖానికి మూలం అనే మాట అక్షర సత్యం అయింది. ఎన్ని పరుగులు పెడుతున్నా, ఎంత సంపాదిస్తున్నా, మనిషుల్లో తృప్తి అనేది కనిపించడం లేదు. ఆ అసంతృప్తి పర్యవసానమే స్వార్ధం, దానినుంచి మొదలౌతున్న మానసిక సంఘర్షణ. ఫలితం....మానవతను, విలువలను కోల్పోవడం. ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరూ అనే మాట మర్చిపోతున్నాం. ప్రతిదానికీ పక్కవాడితో పోటీ. పోటీ ఆరోగ్యకరమైనది అయితే, సమాజానికి, వ్యక్తికి ప్రయోజనం. లేనినాడు అది సృష్టించే అనర్ధాలు ఎన్నో.  ఈ పోటీలో పడి, పక్కవాడి దు:ఖానికి, సుఖానికి, బాధకు, భయానికి స్పందించే గుణం పోగుట్టుకున్నాం. రాతి మనుషులం అయిపోతున్నాం. హృదయంలో ఆర్తి లేదు, గుండెల్లో తడి లేదు, మాటల్లో మమకారం లేదు. వెరసి, చెట్టూ , చేమా, కొండా, బండా, వాటితో పాటు  మనం...పెద్దగా తేడా ఏమీ లేదు. అవసరమైన వాళ్ళకు ఒక చిన్న సాయం, కొంచెం సహానుభూతి, నేనున్నాననే భరోసా, ఇవన్నీ ఇప్పుడైనా మనం నేర్చుకుందాం. మన పిల్లలకూ నేర్పుదాం. మన కాలం సగం గడిచిపోయింది. పిల్లలకు మానవత్వాన్ని, మనిషి తత్వాన్ని నేర్పలేకపోతే, ముందు తరాలని మనమే పాడుచేసిన వాళ్ళం అవుతాము. భవిష్యత్ లో జరిగే పరిణామాలకు మనమే బాధ్యులం అవుతాం.

Monday, 17 August 2015

ఎక్కడ చూసినా మన సంస్కృతి,సంప్రదాయాలు, అడుగంటిపోతున్నాయి, బ్రాహ్మణ్యం మంటకలిసిపోయింది అని అందరం మొత్తుకుంటున్నాము. కాలం మారింది. మనుషులూ మారుతున్నారు. ఫేషన్స్ మారాయి. పిల్లలూ వాటినే పాటిస్తున్నారు. అనేక కారణాలవల్ల ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలకు వెళ్ళక తప్పని పరిస్థితి.  ఈకారణంగా సమాజం లో, పధ్ధతులలో చాలా మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాలు అంతరించాయి. ఇంట్లో మంచి, చెడూ చెప్పే నాథులు కరువైనారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వీలు వాళ్ళది. ఒకప్పుడు ఇంట్లో తల్లితండ్రులు ఏదైనా చెప్తే, ఇష్టమున్నా లేకపోయినా, పెద్దవాళ్ళు చెప్పారు కదా అని పిల్లలు విని పాటించేవారు. ఇప్పుడు ఆ ముచ్చట లేదు. పెద్దలు ఏమి చెప్పినా పిల్లలు వారికిష్టమైనవే వింటున్నారు. తల్లితండ్రులు కూడా పోన్లే, వాళ్ళకు ఎలా ఇష్టమైతే అలాగే ఉండని అనుకుని వదిలేస్తున్నారు. దీనివలన, పిల్లలకు అసలు పధ్ధతులు అంటూ తెలియడం లేదు. నలకంత బొట్లు పెట్టుకోవడం, జుట్టు గాలికి వదిలేసి తిరగడం ఇవన్నీ కూడా పెద్దలు అడ్డుకోలేకపోతున్నారు. మన పధ్ధతి కాదు అని చెప్పలేక పోతున్నారు. ఇతర మతాల వాళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతులు మరీ ఇంతగా నాశనం చేసుకోవటం లేదు. పిల్లలు మన మాట వినేటట్టు, మనం చెప్పిన పధ్ధతులలో నమ్మకం ఉంచి, మన ధర్మం పట్ల, ఆసక్తిని, విశ్వాసాన్ని ఉంచి, చక్కటి పధ్ధతులు పాటించేటట్లు మనమే వారికి అలవాటు చెయ్యాలి. ఏమి చెప్పినా అబ్బ! మళ్ళీ మొదలెట్టారురా బాబూ అని అనుకోకుండా కొంచెం సేపు నిలబడి మన మాటల మీద శ్రధ్ధ చూపేటట్టు మనం చిన్నతనం నుంచి అలవాటు చెయ్యాలి. ఇందుకు మనం చిన్నతనం నుంచి వారితో కొంతసేపు గడపడం అలవాటు చేసుకోవాలి. ఈరోజుల్లో ఎంతమంది తల్లులు వారి పిల్లలకు ఒక్క అరగంట సమయం వెచ్చించి, కథలో, చిన్న చిన్న శ్లోకాలో అలవాటు చేస్తున్నారు? ఎంతమంది తండ్రులు పిల్లలతో కలిసి వారానికి ఒక్కసారైనా  ఆడుకుంటున్నారు?   ఎంతమంది భోజనాల దగ్గర టీవీ చూడకుండా సరదాగా కుటుంబం అంతా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నారు? (కనీసం ఆదివారం నాడైనా).. ఇవన్నీ మన పిల్లలకు అలవాటు చేసినప్పుడు పధ్ధతులు వాటంతట అవే అలవాటు అవుతాయి. ఇంట్లో వయసు మళ్ళిన పెద్దవాళ్ళు ఉంటే, ఆ పెద్దలనూ, పిల్లలనూ కొంతసేపు కలిపి వదిలెయ్యాలి. వారేమి చెప్పినా, వీరేమి వినినా మనం పట్టించుకోకూడదు. చాలా మంది తల్లితండ్రులు చేసే మరో తప్పు, ఇంట్లో ముసలి వళ్ళని (అత్తామామల్ని) బంధువులని పిల్లల ఎదురుగానే విమర్శించడం. దీనివల్ల, వారికి ఎవరిమీదా గౌరవం, ప్రేమ కలుగదు. చివరికి అది అలాగే కొనసాగితే మనమీద కూడా నమ్మకం కోల్పోతారు. ఇవన్నీ చిన్న చిన్న సూత్రాలు. మన జీవితాలను, మన పిల్లల జీవితాలను క్రమశిక్షణలొ ఉంచేవి.  

Friday, 14 August 2015

వేదాలు విలసిల్లిన భూమి
నాగరికత నేర్పిన భూమి
ఎందరో వీరుల త్యాగఫలంగా
దేశపౌరుల సంకల్ప బలంగా
దాస్య శృంఖలాలను తెంచుకుని
స్వేచ్చా ఊపిరులందిన భూమి
ఆకలి, అవినీతి,
ఉగ్రవాదం, నిరుద్యోగం,
అత్యాచారాలు,మతకల్లోలాలు లేని
ఒక సుందర భారతం
కనులముందు నిలవాలని
కళల్లో, క్రీడల్లో,
సాంకేతికతలో, సైన్స్ లో,
పరిశోధనల్లో, పాడిపంటల్లో
సాటిలేని ప్రగతిని సాధించి
ప్రతి భారతీయుని ఎదలో ఉప్పొంగే
దేశభక్తి నిరంతర గంగా ప్రవాహమై
అకుంఠిత దీక్ష, క్రమశిక్షణ
పెట్టుబడులై
ప్రపంచానికి తలమానికమై
నా దేశం నిలవాలని
మనసారా ఆశిస్తూ....

భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
Friday, 7 August 2015

ఆషాఢమాసం దాదాపుగా అయిపోవస్తోంది. వచ్చేది శ్రావణ మాసం. మహిళలకు ప్రత్యేకమైన మాసం..ఆ వివరాలు మీ కోసం...
తెలుగు సంవత్సరములో 5వ మాసముగా వచ్చేది శ్రావణమాసం. ఈ మాసం లో సౌభాగ్యం కోసం మంగళ గౌరిని, సిరిసంపదల కోసం శ్రీ మహాలక్ష్మిని పూజిస్తారు. ఈ మాసం సందడి అంతా మహిళలదే... కొత్తగా పెండ్లి అయిన ఆడపిల్లలు ఈ మాసంలో మంగళ గౌరి నోములు పడతారు. ఈనోము 5 సంవత్సరాల పాటు సాగే నోము. భర్త యొక్క అఖండ ఆయుష్షు కోసం సుమంగళి స్త్రీలు ఆచరించిఏ నోము ఇది. శ్రావణ మాసంలో వచ్చే మంగళ వారం నాడు తెల్లారే లేచి, తలంటు స్నానం చేసి, పీఠం ఏర్పాటు చేసి, పసుపు తొ గౌరి దేవిని చేసి, షోడశోపచార విధులతో పూజ చేసుకొంటారు. ముందురోజు నానబెట్టిన శనగలు, ఆరోజు ఉదయమే, బియ్యం నానబెట్టి, పిండి కొట్టి, బెల్లం కలిపి చేసిన చలిమిడి, తాంబూలం, పసుపు కుంకుమలతో సహా ముత్తైదువలకు వాయనం ఇస్తారు. పూజ చేసేటప్పుడు మొదటి సంవత్సరం 5, రెండవ సంవత్సరం 10, మూడవ సంవత్సరం 15, నాలుగవ సంవత్సరం 20, ఐదవ సంవత్సరం 25 చొప్పున చలిమిడి పిండి తోనే ప్రమిదలలాగా చేసి, అందులో ఆవునెయ్యి వేసి, వత్తులు వెలిగించి, ఆ వత్తులపై ఒక ఇత్తడి గరిటెను పట్టుకొని, మసిబారేలా చేస్తారు. ఆ నుసిని, కర్పూరం, ఆవునెయ్యి కలిపి ముద్దలా చేసి, ఆడపిల్లలు కంటికి కాటుకలా పెట్టుకుంటారు. ఇది కంటికి ఎంతో మంచిది. మంగళ గౌరి వ్రతం చేసుకున్న వారికి వైధవ్యం రాదు అని నమ్ముతారు.
పెండ్లి అయిన వారే కాకుండా, పెండ్లి కాని, రజస్వల కాని ఆడపిల్లలు కూడా 5 సంవత్సరముల పాటు కన్నెగౌరి వ్రతం పేరిట మంగళ గౌరి నోమును ఆచరిస్తారు. అలా చేసిన వారికి మంచి భర్త దొరికి, చక్కటి భవిష్యత్తు లభిస్తుందని తెలుగు ప్రజలు నమ్ముతారు.
శ్రావణ మాసం శనగలు, తడి బియ్యం, బెల్లం కలిపి చేసిన చలిమిడిని, ముత్తైదువలకు వాయనంగా ఇవ్వడంలో గొప్ప ఆరోగ్య విశేషం ఉంది. నానబెట్టిన శనగలలో ప్రోటీన్లు ఎక్కువ శాతంలో ఉంటాయి. బెల్లం లొ ఐరన్ శక్తి ఉంటుంది. బెల్లం ను, ఆవునెయ్యితో వేడిచేసి తీసుకున్నప్పుడు శరీరం ధృఢంగా తయారవుతుంది. మన పెద్దలు వాయనాల రూపం లో ఈ వస్తువులను అందరికీ పంచిపెట్టాలి అని చెప్పటంలో అంతరార్ధం, ఈ శనగలు, చలిమిది వలన కలిగే ఆరోగ్య లాభాలు, మహిళల ద్వారా ఆ యా కుటుంబాలకన్నింటికీ చేరాలనే.....
ఇక శ్రావణ శుక్రవారము నాడు శ్రీ మహాలక్ష్మిని ఆరాధిస్తారు. ఇంటిలొ ఒకచోట, పీఠాన్ని ఏర్పరచి, దానిపై బియ్యం, దానిపై ఒక కొత్త గుడ్డ పరిచి, కలశం స్థాపించి, అందు శ్రీ వరలక్ష్మి దేవిని ఆవాహన చేసి షోడసోపచారాలతో పూజ చేస్తారు. తొమ్మిది పిండివంటలు చేసి దేవికి నైవెద్యం పెడతారు. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు మహాలక్ష్మీ దేవిని, కోరిన వరాలనిచ్చే వరలక్ష్మీ దేవి రూపంలో కొలుస్తారు. పూజ చేసుకునేవారు, తమ శక్తి కొలది వెండి, బంగారాలు కొనుక్కుని, పూజలో పెట్టుకుని, వాటిని కూడా పూజిస్తారు.
కొంతమంది ఉత్తి కలశమే కాకుండా అమ్మవారి రూపాన్ని కూడా తయారు చేస్తారు. అమ్మవరి రూపానికి పట్టుచీర అలంకరించి, జడ వేసి, నగలతో అలంకరించి, సాక్షాత్తూ ఆ అమ్మవారు ఇంట్లోనే కొలువై ఉన్నదా అనిపించేటట్లు అమ్మవారిని తీర్చిదిద్దుతారు. మహిళల కల్పనా శక్తికి ఈ రూపాలు ఒక తార్కాణంగా నిలుస్తాయి.
శ్రావణ శనివారం శ్రీ వేంకటేస్వరునికి ప్రీతికరమైన రోజు. ఆరోజు శ్రీవారి అనుగ్రహం కోసం వేంకటేస్వరునికి దీపారాధన చేయటం ఎంతో మంచిది.
ఇవే కాకుండా, శ్రావణ మాసంలో ఇంకా ఎన్నో ప్రశస్తమైన రోజులు, పూజలు ఉన్నాయి.
శ్రావణ పంచమి; ఈరోజును నాగపంచమి అని కూడా అంటారు. ఈరోజు ఉత్తరభారత దేశంలోనూ, దక్షిణ భారతం లో కొన్నిచోట్ల నాగదేవతలకు పూజలు చేసి, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు. జైన పురాణాలలో కూడా నాగపంచమి ప్రసక్తి ఉంది.
రాఖీ పౌర్ణిమ: తమ రక్షణ కోరుతూ, సోదరీమణులు వారి అన్నదమ్ములకు రక్షాబంధనం చేసేది ఈ రోజే. ఉపనయనం చేసుకున్న ప్రతివారూ ఈరోజు పాత జంధ్యములు తీసివేసి, కొత్తవి ధరిస్తారు. ఈ పూర్ణిమను జంధ్యాలపూర్నిమ అని కూడా అంతారు.
శ్రీకృష్ణాష్తమి: వెన్న దొంగ, నల్లనయ్య అయిన కృష్ణుడు జన్మించిన ఈ రోజును దేశ ప్రజలందరూ ఎంతో వైభవంగా జరుపుకుంటారు. పాలు, పెరుగు, అటుకులు, మిఠాయిలు నైవేద్యం గ సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కృష్ణ మందిరాలలో అర్చనలు చేస్తారు. సాయంత్రం వేళల్లో, ఆ దేవదేవుని స్మరించుకుంటూ, ఉట్లు కొడతారు.
పోలాల అమావాస్య:
శ్రావణ అమావాస్య ను పోలాల అమావాస్యగా చెప్తారు. పోల అంటే ఎద్దు. కాబట్టి ఈ పండుగ పశువులకు సంబంధించిన పండుగగా చెప్పబడుతోంది. ఎక్కువగా రైతులు దీన్ని ఆచరిస్తారు. ఈ రోజున ఆవులను, ఎద్దులను పూజించాలని శాస్త్ర వచనం. రైతులు తమ వద్ద పనిచేసే కూలీలకు ఈ రోజుననే కూలి కొలిచేవారు. అంటే, ముందటి పోలాల అమావాస్య నుండి ఈరోజు వరకు కూలి లెక్క వేసేవారు. అంటే, రైతులకు ఇది నూతన సంవత్సరంతో సమానం. రాను రాను పోలేరమ్మ అనే గ్రామదేవత పూజగా కూదా జరుపుకోవడం ప్రారంభించారు. ఈ అమావాస్య నాడు పోలాంబ (పోలేరమ్మ)ను ప్రత్యేకంగా కొలుస్తారు. కొన్ని చోత్ల కందమొక్కను పూజిస్తారు. కందమొక్కకు ఎంత త్వరగా పిలకలు వచ్చి మొక్కలు వస్తాయొ, అంత త్వరగా ఇంద్లలో పసిపాపలు పారాడాలి అని, పుట్టిన పిల్లలు ఏ అరిష్టాలు లేకుండా చల్లగా పెరగాలి అని ఈ పూజను చేస్తారు.
ఈ శ్రావణ మాసం మీ అందరికీ ఆ శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు నిడుగా ఉండాలని కోరుకుంటున్నాను.


"సెక్యులర్" అంటే అన్ని మతాలను సమదృష్టితో చూడడం. కానీ హిందు ధర్మం అనాదిగా విలసిల్లిన ఈ దేశం లో "సెక్యులరు" అనే పదానికి అర్ధం మారిపోయింది. ఇప్పుడు "సెక్యులర్" అంటే, మన ధర్మాన్ని విడిచి, అన్య మతాలకు ప్రాధాన్యం ఇవ్వడం. మన దేశంలో హిందువులకు, ముఖ్యంగా బ్రాహ్మణులకు జరుగుతున్న అన్యాయాలు అన్నీ ఇన్నీ కావు. మనలను ఎవరో వచ్చి బాగుచేయాలి అనుకోకుండా, మన బాగుకు,మన భవిష్యత్తుకు మనమే మార్గదర్శకులం అవాలి. ప్రతి కులం లోను, వారి వారి విద్యార్ధులకు ప్రతి నగరం లోను వసతి గృహాలు ఉంటున్నాయి. వారిలో వెనుకబడిన వాళ్ళకు ఉపకార వేతనాలు కూడా ఇస్తున్నారు. మనలో ఆ విధంగా లేకపోవటం ఒక లోటే. అయితే, ఈ మధ్య హైదరబాదులో సుల్తాన్ బజార్ లో బ్రాహ్మణులకు ఒక సంగం ఏర్పాటు చేసి, దూరప్రాంతాల నుండి నగరానికి వచ్చే బ్రాహ్మణులకు వసతి ఏర్పాట్లు, పేద బ్రాహ్మణుల పిల్లల వివాహాలకు కావలసిన ఆర్ధిక సహాయం చేస్తున్నారు అని ఒక గ్రూప్ ద్వారా తెలిసింది. ఇంకా మన వర్గం లో ధనికులైన వారు, పేద బ్రాహమణ పిల్లల చదువులకు, వివాహాలకు ఇతోధికంగా సహాయం చేయడానికి పూనుకోవాలి. ఇంటికి పది రూపాయలు చొప్పున వేసుకున్నా, పెద్ద మొత్తం అవుతుంది. ఒక ట్రస్ట్ వంటిది ఏర్పాటు చేసుకుని నిర్వహిస్తే బాగుంటుంది. ఇవన్నీ నా ఆలోచనలు. మీరే చెయ్యచ్చు కదా అని అడుగుతారేమో, మా వారిది బదిలీలు అయ్యే ఉద్యోగం, ఒకచోట స్థిరంగా ఉండేవాల్లు, ఇటువంటి ట్రస్ట్ల నిర్వహణలో అనుభవం ఉన్నవాల్లు, విశ్రాంత ఉద్యోగులు ముందుకు వస్తే బాగుంటుంది. లేదంటే, ఈ గ్రూప్ లో ఉన్న అనద్రు సభ్యులు కలిసి చందాలు వేసుకుని, ఇప్పటికే పనిచేస్తున్న ట్రస్ట్లకు పంపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశ్యం. అలాగే మనలో ఉన్నత స్థాయిలలో ఉన్నవారు, ఉద్యోగాలు అవసరమైన బ్రాహ్మణ యువతీయువకులకు ఉద్యోగార్ధులకు కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది.

Thursday, 6 August 2015

. కెంద్రప్రభుత్వం ఈరోజును అనగా 7, ఆగస్ట్ ను జాతీయ చెనేత దినం గా ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని శ్రీ నరేంద్ర మొడి గారు క్రితం నెల 31 న ఒక ప్రకటన చేసారు.  ఈ చేనేత దినాన్ని లాంచనంగా చెన్నై లో ప్రధాని ప్రారంభిస్తారు. మన దేశం లో దాదాపు 43 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నరు. ఇది 2009=10 లెక్కల ప్రకారం. వీరందరి కష్టాలు, ఇబ్బందులు తీర్చి, వారి అభివృధ్ధికి పాటుపడే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. ఈ కళలో పేరెన్నిక గన్న వారికి 2012,13,14 సంవత్సరాలకై "కబీర్" అవార్డు ప్రదానం చేస్తారు. చేనేత యొక్క గొప్ప భవిష్యత్తుకై ఒక నూతన జాతీయ చేనేత లోగోను కూడా ఇవాళ ప్రధానమంత్రి గారు ఆవిష్కరిస్తారు. వారానికి ఒకరోజు తప్పనిసరిగా చేనేతను ధరించాలని ప్రభుత్వం ఎప్పటినుంచో చెబుతోంది. ప్రకటనలు చేస్తోంది. కానీ, ప్రస్తుత కాలంలో దుర్భరమై పోయిన చేనేత కళాకారుల , కార్మికుల వెతలు తీరడానికి, మనందరం ఒక్కరోజు చేనేత ధరిస్తే సరిపోతుందా? ప్రభుత్వ పరంగా ఏమి చర్యలు ఉండవా? అన్ని బట్టల దుకాణాలలాగే, చేనేత దుకాణాల్లో కూడ ఇంకా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్ లు ఇవ్వాలి.  ఇప్పుడు ఇస్తున్న 20 % సరిపోవటంలేదు. చేనేత మామూలుగానే ఎక్కువ ధర ఉంటుంది. ఆ ఎక్కువ ధర చూసి, ప్రజలు కొనడానికి సంశయిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు వాయిదాల పైన అమ్మకాలు జరగాలి. చేనేత ఉత్పత్తుల గురించి ఇంకా చాలా విస్తృతంగా ప్రచారం జరగాలి. ప్రజలు చేనేతను ధరించడానికి, కొనడానికి ఆసక్తి చూపేలా  ప్రకటనలు ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళాలి . ఇప్పుడు కూడా చేనేతను వాడే వారు తక్కువేమీ కాదు. కాని, వారు బయట దుకాణాల్లో కొనుక్కుంటున్నారు. చేనేత కార్మికులకు సహాయపడేలా ప్రతి పెద్ద పట్టణం లోను, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి. కార్మికులకు నూలును తక్కువ ధరలకు అందివ్వాలి. ఇటువంటి చర్యలు ప్రభుత్వం సత్వరం చేపడితే, ఈ ప్రత్యేక దినాలకు సఫలత చేకూరుతుంది. ప్రజలు కూడా చేనేత కళాకారులకు చేయూత నివ్వగలిగేలా సంవత్సరానికి రెండుసార్లైనా చేనేత ఉత్పత్తులు కొనుగోలు చెయ్యాలి.

చేనేత కళాకారులకు పించను ఇవ్వడం, నూలును రాయితీ మీద సరఫరా చేయడం, వారి పిల్లల భవిష్యత్తుకు భరోసా నివ్వడం, పక్కా ఇళ్ళు, ఉచిత వైద్య సదుపాయాలు కల్పించడం, కాలానుగుణంగా చేనేత లో వస్తున్న మార్పులకు అనుగుణంగా కళాకారులకు వర్క్ షాపులు నిర్వహించడం లాంటి అభివృధ్ధి చర్యలు చేపట్టకపోతే, ఈ కళ ఈ తరంతో అంతరించిపోయే అవకాశం ఉంది. చేనేత కార్మికుల పిల్లలే కాకుండా, బయటివారు కూడా ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపగలిగేలా ప్రభుత్వం పెద్ద యెత్తున వారికి సహాయ, సంక్షేమ చర్యలు తీసుకోవాలి.  

Wednesday, 5 August 2015

మిత్రులకు నమస్తే.....నేను ఈరోజె ఈ సమూహం లోకి కొత్తగా వచ్చాను. బ్రాహ్మణులను సినిమాలలోను, కార్టూన్లలోను అందరూ చాలా హేళనగా మాట్లాడుతున్నారు. అది మనందరికీ నిజంగా బాధ కలిగించే విషయం. అయితే, దీనికి మనం ఎంతవరకు బాధ్యులం అని మనం ఆలోచించాలి. ముఖ్యంగా ఇతర మతాల వారికి ఉన్న ఐక్యత, మనలో ఎందుకు లేదో ఆలోచించుకోవాలి. మన సంప్రదాయాన్ని మనమే వదిలేసుకుంటున్నాము అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. కాలం ఎంత మార్పు చెందినా, ఇతర మతాలవారిలో మన హిందువులలో వచ్చినంత మార్పు రావటంలేదు. మనమే ఎందుకు అన్నివిధాలుగా నాగరికత అంటూ మన సంప్రదాయాల్ని చిన్నబుచ్చుతున్నాం?

1. ముస్లింస్ శుక్రవారం, క్రిస్టియన్స్ ఆదివారం తప్పనిసరిగా వారి వారి ప్రార్ధనా స్థలాలకు వెళతారు. మనలో ఎంత శాతం మందికి ఆ అలవాటు ఉంది?

2. క్రిస్టియన్స్ కాని, ముస్లింస్ కానీ, వారి సంస్కృతిలో బొట్టు పెట్టుకోవడం లేదు కాబట్టి ఎట్టిపరిస్థితులలోను, బొట్టు పెట్టుకోరు. కనీసం కాలేజ్ ఫంక్షన్స్ లో కూడా..మరి మనం మన ఆడపిల్లలు బొట్టు, కాటుక విడిచేస్తుంటే ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం?

3. మనలో ఎంతమంది పిల్లలకు చిన్నతనం నుంచి, స్కూల్ పాఠాలల్తో పాటుగా తెలుగు పద్యాలు, శ్లోకాలు, పురాణ గ్రంధాలలోని విషయాలు నేర్పుతున్నాం?

4.స్నేహితుల పుట్టినరోజులనీ, పెళ్ళిళ్ళనీ, పార్టీలకు వెళ్ళి అడ్డమైన ఆహార పదార్థాలు తినడం లేదా?

5. మన సంస్కృతిని మన స్నేహితులు కించపరుస్తూ మాట్లాడుతుంటే, ఎంతమంది నిరోధించగలుగుతున్నాం? వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అని వదిలేయటం లేదా?

6. ఇతర మతాల వాళ్ళు మన ధర్మాన్ని అవమాన పరుస్తున్నప్పుడు వాదించి వారి నోళ్ళు మూయించడానికి తగిన గ్రంధ పరిజ్ఞానం మన దగ్గర ఉందా?

7. సినిమాలలో, బ్రాహ్మణులను లేకివారిగా, డబ్బుకోసం ఏపనైనా చేసేవారిగా చూపిస్తుంటే మనం ఎందుకు తిరగబడలేకపోతున్నం?

8. ముస్లిములు మాంసాహారులైనప్పటికీ, వారి సంప్రదాయం ప్రకారం, హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే భుజిస్తారు. ఇతర మాంసాహారుల ఇళ్ళల్లో హలాల్ చేయని భోజనాన్ని వారు స్వీకరించరు. మరి మనం స్నేహితుల ఇళ్ళల్లో, వారు కులాంతరమైనా సరే, శాకారమే అవ్వనీ, తింటున్నామా లేదా? ఎందుకు తిరస్కరించలేకపోతున్నాం?


ముందు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల మనం గౌరవం పెంచుకుని, మన పిల్లలకు నేర్పించడం మన ఇంటి నుండి ఆరంభిస్తే, మన బ్రాహ్మణ కులం ప్రకాశవంతమైన వెలుగులీనడానికి ఆట్టే సమయం పట్టదు.

నా పోస్ట్ లో ఏమైనా తప్పులుంటే మన్నించగలరు.Saturday, 1 August 2015

రక్త సంబంధం తో పనిలేదు. ...చుట్టరికాల గొడవ లేదు....కులం, మతం, భాష--వీటి ముచ్చట మొదలే లేదు.....డబ్బుందా, లేదా --- ఆ పట్టింపే లేదు...ఉన్నదంతా---నీకు నేను, నాకు నువ్వు,....అందరి కోసం ఒక్కడు...ఒక్కడి కోసం అందరూ...నీ కష్టం నాది...నీ అనందం మనందరిదీ......పుస్తకాలు, చదువులు, ఆటలు, పాటలు,  హాస్పిటలు, హాస్టలు, ఫీజులు, పరీక్షలు, ప్రాజెక్టులు, సెమినార్లు, సినిమాలు, షికార్లు.....కాంపస్ లు, సెలెక్షన్లు, .....ఇదికాదు, అదిలేదు అనే చింత లేదు.....అన్నిటికీ వాళ్ళే.....అన్నిట్లో వాళ్ళే....కార్పొరేట్ చదువులు మనుషులను మరబొమ్మలను చేసేసాయి.....కానీ వాళ్ళల్లో స్నేహం అనే "చిప్" ఎప్పుడూ ఆక్టివ్ గానే ఉంటుంది.  బంధాలను  భగవంతుడు కలిపితే, మనం మనకుగా వెతుక్కుని పొందేది స్నేహబంధం......మన చిరునవ్వు వెనుక బాధను గుర్తించేది స్నేహితులు....ఎవరూ తోడు రాని చోట నేనున్నానంటూ తోడుండేది స్నేహితులు......మన సుఖాలకు, దు:ఖాలకు ఒకేలా ఫీల్ అయ్యేదీ వాళ్ళే..... మన నిరాశలో ధైర్యాన్నిచ్చేదీ, మన గొప్పతనానికి మురిసిపోయేదీ, మన బలహీనతలను ఎత్తిచూపేదీ కూడా వాళ్ళే.....ఒక్క మాటలో మన బలం, బలహీనత కూడా వాళ్ళే....ఏ బంధం లేకపోయినా, మన ప్రాణాలకు ప్రాణం అడ్డువేసేదీ వాళ్ళే.....నిజమైన స్నేహితులకు ప్రతిరోజూ పలకరింపులు, పరామర్శలు అవసరం లేదు....మనకు ప్రతి క్షణం గుర్తొచ్చేదీ, హృదయంలో అణువణువునా నిండి ఉండేదీ కూడా వాళ్ళే.... కాలం గడుస్తున్న కొద్దీ ఎవరి మధ్య స్నేహం మసకబారకుండా ఉంటుందో, వారు నిజమైన స్నేహితులు. అలాంటి స్నేహం పొందడం ఒక వరం....మంచి స్నేహితులను అపార్ధాల వల్లనో, అహంకారం వల్లనో కోల్పోవడం కన్నా పెద్ద తప్పు మరొకటి లేదు.... నిష్కల్మషమైన స్నేహం కలకాలం నిలుస్తుంది....