Sunday 28 June 2015

మా ఇంటి దగ్గర ఒక చిన్నారి బుజ్జాయి గాడు ఉన్నాడు. మా అపార్ట్మెంట్స్ ఎదురుగా ఉన్న ఒక కార్పొరేట్ స్కూల్ లో నర్సరీ చదువుతున్నాడు. అసలు ఆ స్కూల్లో చేర్పించడం కోసమే మా దగ్గర ఫ్లాట్స్ కొనుక్కున్నారు అంటే సబబుగా ఉంటుంది. ఇంచుమించు ప్రతి క్లాస్ పిల్లలూ ఉన్నారు మా ఫ్లాట్స్లో. ఈ బుజ్జాయిగాడు ప్రతిరోజూ ఉదయాన్నే ఏడుస్తూ నిద్ర లేస్తాడు. నిద్ర లేవడానికే ఏడుస్తాడు. లేచిన దగ్గర్నుంచి వాల్ల అమ్మ, "స్కూల్ కి వెళ్ళాలి లే." అంటూ సతాయిస్తుంది.  చక్కగా తయారవుతాడు పేచీ పెట్టకుండా. ఇక స్కూల్ కి వెళ్ళాలంటే మొదలు పెడతాడు మళ్ళీ. వాళ్ళ అమ్మ, "టీచర్ని పిలవనా?" అంటూ మొదలెడుతుంది. అసలు అక్కడే ఉంది కిటుకంతా అనిపిస్తుంది నాకు. పిల్లల్ని స్కూల్ లో చేర్పించక ముందు, వాళ్ళు కొంచెం అల్లరి చేసినా సరే, "స్కూల్ లొ వేసేస్తే వదులుతుంది గొడవ...వీడి అల్లరి కొంతైనా తగ్గుతుంది" అని పక్కవాళ్ళతో చెప్పడమో, "ఇలాగే అల్లరి చేసావంటే స్కూల్ లో వేసేస్తాను వెధవా" అని పిల్లలతోనో చాలా మంది తల్లులు అంటూ ఉంటారు. ఇక అక్కడినుంచి వాళ్ళకు స్కూల్ అన్నా, టీచర్లు అన్న ఒక శిక్షలాగే కనపడుతుంది. పాపం ఈకాలంలో వాళ్ళు మాత్రం ఎప్పుడు అల్లరి చేస్తారు? 2 సంవత్సరాలు నిండకుండానే, ప్లే స్కూల్ లో పడేస్తున్నారు. తరువాత +2, ప్రొఫెషనల్ కోర్సులు, అందులొ మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లు అయిన వెంటనే, చదువు అవ్వకుండానే వారికోసం ఒక ఉద్యోగం ఎదురుచూస్తూ ఉంటుంది. అంత చిన్న వయసులో నెలకు 50,000 ఇచ్చే కంపెనీ వీరిని స్థిమితంగా ఎక్కడ ఉండనిస్తుంది? తీవ్రమైన పని ఒత్తిడి తో కాలం గడిచిపోతుంది. కష్టపడకుండా విద్యార్థి దశలోనే వచ్చిన ఉద్యోగాన్ని వదలలేరు, ఆ పని ఒత్తిడి భరించలేరు. అదో టెన్షన్. ఇక పెళ్ళి, తరువాత జీవితం అందరికీ తెలిసినదే కదా...మరెప్పుడండీ వాళ్ళు అమ్మా, నాన్న దగ్గర స్వేచ్చగా అల్లరి చేసేది?ఆడుకొనేది? ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఇంట్లొ ఉన్న సభ్యులందరూ తలో మూల అవి పట్టుకునే కూర్చుంటున్నారు కదా.. ఈ బుజ్జాయి గాడి తల్లిని, కింద పిల్లలందరూ ఆడుకుంటున్నారు కదా, అక్కడికి పంపచ్చుకదా మీ వాడిని అని అడిగితే, ఆమె చెప్పిన సమాధానం...పిల్లలందరూ వీడిని పడేస్తారేమొ అని భయం ఆంటీ, అయినా ఫోన్ ఇస్తే అల్లరి చేయకుండా ఆడుకుంటాడు మావాడు. అన్నం కూడా అడగడు. అని చెప్పింది. అంటే, ఆకలి కూడా తెలియనంతగా ఆ పిల్ల వెధవకి ఫోన్ తో ఆడుకోడం అలవాటు అయ్యిందన్న మాట. తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటే మానసిక వికాసం కలుగుతుంది అని ఆమెకు అర్ధం అయ్యేలా చెప్పలేక పోయాను నేను. ఇక మన విద్యావ్యవస్థ కూడా మార్కులు, ర్యాంకులు తప్ప విజ్ఞానాన్ని అందించేలా లేదు.  ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థులకే కాదు, టీచర్లకు కూడా ఎన్ని నిబంధనలో...పిల్లలతో మనం గడిపే కాలాన్ని వాళ్ళు అప్పటికి ఆనందించడమే కాకుండా పెద్దయ్యేవరకు గుర్తు పెట్టుకుంటారు కూడా..వాళ్ళ కోసం మనం చేసే ప్రతి పని వాళ్ళు గమనించుకుంటారు. పిల్లల కోసం డబ్బు ఖర్చుపెట్టడం కాకుండా, మీ విలువైన సమయాన్ని "నాణ్యమైన" విధంగా వారికి ఖర్చుపెట్టండి. వారు మంచి వ్యక్తులుగా ఎదుగుతారు. తీరిక లేకపోవడం కాదు, తీరిక చేసుకుని వారితో గడపండి. మనం ప్రతి రోజూ బయటి వ్యక్తుల కోసం ఎన్నో పనులు చేస్తున్నాం. మన పిల్లల కోసం ఆమాత్రం చేయలేమా?  

Friday 26 June 2015

ఒక మంచి కథ...(ఇది కూడా అనువాదమే)
స్టీఫెన్ అనే ఒక ప్రఖ్యాత డాక్టర్, వైద్య రంగంలో తాను చేసిన పరిశోధనలకు తాను పొందిన ఒక గొప్ప అవార్డును అందుకోవడానికి వెరే నగరానికి బయలుదేరాడు. రెండూ గంటల ప్రయాణం తరువాత అతను ఎక్కిన విమానం కొన్ని సాంకేతిక లోపాల వల్ల ఆగిపోయింది. కాన్‌ఫరెన్సుకు ఆలస్యం అవుతోంది అన్న ఆందోళనతో అతను ఒకా కారు అద్దెకు తీసుకుని ప్రయాణం కొనసాగించాడు. మళ్ళి కొంతసేపు అయిన తరువాత, విపరీతమైన గాలివాన, వర్షం..దానితో ఈ వాతావరణంలో ముందుకు సాగలేక ఆగిపోయాడు. భరించలేని ఆకలి, అలసట, వేళకు వెళ్ళలేకపోతున్నాను అనే చికాకులతో ఉన్నాడు ఆ డాక్టరు. కొంతదూరం ముందుకు వెళ్ళాక, అతనికి ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లోకి వెళ్ళి వారి ఫోను ఉపయోగించుకుందాము అనుకున్న ఆ డాక్టరుకు ఆ ఇంటి తలుపు తీసిన ఒక ముసలామె తన ఇంట్లో కరంటు, ఫోను సౌకర్యాలు లేవు అని, బాగా వర్షంలో తడిసిపోయినందున తన ఇంట్లో కొంత సేపు విశ్రాంతి తీసుకోమని, వెచ్చగా ఉండేందుకు టీ, కొంత ఆహారం తేబుల్ మీద పెట్టి తను ప్రార్ధన చేసుకోవడానికి వెళ్ళింది. ఆమె పక్కన ఉయ్యాలలో ఒక పసివాడు ఉన్నాడు. ఆమె గురించిన వివరాలు తెలుసుకుందామనుకున్నా, ఆమె ప్రార్ధనలు ఎంతకీ పూర్తి అవటం లేదు. ఎట్టకేలకు ఆమె ప్రార్ధనలు ముగించి వచ్చిన తరువాత, ఆమె మంచి మనసుకు ఆమె చేసిన ప్రార్ధనలు అన్నీ ఆ భగవంతుడు వింటాడు అని భరోసా ఇచ్చాడు. ఆ ముసలామె చిరునవ్వు నవ్వి, భగవంతుడు నేను కోరిన అన్ని కోరికలూ తీర్చాడు ఒక్కటి తప్ప, ఎందుకనో ఈ కోరిక మాత్రం తీర్చడం లేదు అని చెప్పింది.
ఆమెకు అభ్యంతరం లేకపోతే, ఆమెకు కల కోరిక ఏమిటో చెప్పమని, తాను సాధ్యమైనంత సహాయపడతానని చెప్పాదు వైద్యుడు. ఆమె ఇలా చెప్పటం ప్రారంభించింది. "ఈ ఉయ్యాలలో ఉన్నవాడు నా మనుమడు. అతనికి ఒక అరుదైన క్యాన్సర్ వ్యాధి సోకింది. ఎంతో మంది వైద్యులకు చూపించాము. ఎవ్వరూ నయం చేయలేకపోయారు. ఒక్క స్టీఫెన్ అన్న ఆయన మాత్రమే ఈ వ్యాధి తగ్గించగలడు, ఆయన ఇక్కడికి చాలా దూరంలో ఉన్నాడు. అందుకే వైద్యం మీద ఆశ వదిలేసి, భగవత్ ప్రార్ధనలతో జీవితం గడిపేస్తున్నాను అని చెప్పింది. వింటున్న డాక్టరు కళ్ళల్లో నీళ్ళు. "భగవంతుడు దయామయుడు. ఆయన మీ ప్రార్ధనలు వినడమే కాదు, ఆ డాక్టరును మీ వద్దకే తీసుకువచ్చాడు కూడా. విమానం పాడయ్యి, గాలివానలో చిక్కుకుని, నేను మీ ఇంటికి వచ్చాను. కాదు కాదు, ఈ పరిస్థితి సృష్టించి ఆయనే నన్ను మీ వద్దకు పంపాడు. ఆ డాక్టర్ స్టీఫెన్ ను నేనే." అని బదులిచ్చాడు. అప్పుడు ఆ క్షణం అతను అందుకోవలసిన అవార్డు అతనికి గుర్తు రాలేదు.
భగవత్ ప్రార్ధన లోని మహత్యం అదే. మనం వెళ్ళలేని చోటుకు కూడా దాని శక్తి వెళుతుంది. కావలసినది నమ్మకం అంతే. 1.అడగడం, 2. నమ్మడం, 3.అందుకోవడం...ఇవే ప్రార్ధనకు కావలసిన అంశాలు. భగవంతుని నమ్మి మనం ప్రార్ధిస్తే, మనకు కావలసినది ఆయన తప్పక మనకు లభింపచేస్తాడు.
కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది....
అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.
కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్ధం అయింది. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.
నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి.
అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది.
మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.
కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది..
నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...

***********
బాగుంది కదా....తరం వెనుక తరం ఆడపిల్లలు తాము పుట్టిన ఇల్లు వదిలి, పరిచయమే లేని మరో ఇంటికి వచ్చి వంశాభివృధ్ధికి, వంశం యొక్క గౌరవం ఇనుమడించడానికి కృషి చేస్తారు. ఇంట్లొ ఆడపిల్లలు గలగలలాడే సెలయేటి సంగీతం వంటివారు. వారు ఎడతెగకుండా మాట్లాడుతున్నంతసేపు ఎక్కువ మాట్లాడకు నోరు ముయ్యి అంటారు. అదే ఒక్కనిముషం మాట్లాడకుండా ఉంటే ఎవరికీ తోచదు. రకరకాల సందేహాలు వస్తాయి. అమ్మ "ఏం? ఒంట్లో బాగాలేదా?" అని కంగారు పడుతుంది. నాన్న "ఏంటి? ఇల్లు ఇంత నిశ్శబ్దంగా ఉంది" అని ఆశ్చర్యపోతారు. అన్న "కోపం వచ్చిందా?" అని ఆందోళన పడతాడు. ఇంక ఒకేసారి పెళ్ళి అయ్యి అత్తవారింటికి వెళ్ళిపోతే, ఇంట్లో వెలుగే ఉండదు.
ఇది మనందరి కథ. మీరు, నేను, మన అమ్మాయిలు, మన కోడళ్ళ కథ....అవునంటారా....
ఆడపిల్ల...
అమ్మకు యువరాణి.
నాన్నకు చిన్నారి దేవత..
అన్నలకు గారాల చిట్టి చెల్లి..
భర్తకు అతని శ్వాస, హృదయ స్పందన...
ఆడపిల్లగా పుట్టినందుకు గర్విద్దాం. ఎందుకంటే ఈ సృష్టి మన వలనే మనుగడలో ఉంది. ఇంటి పరువు ప్రతిష్ట, గౌరవం, సౌఖ్యం, సంతోషం మన చేతుల్లోనే ఉన్నాయి.
ధన్యవాదములు.
ప్రతి రొజూ ఇల్లు, బట్టలు, గిన్నెలు శుభ్రం చేస్తుంటాం. ఆరునెలలకో, మూడు నెలలకో ఒకసారి ఇల్లంతా బూజులు దులిపి శుభ్రం చేస్తూ ఉంటాం. మరి మన మనసును, మెదడును శుభ్రం చేసుకోవడం ఎలా? అక్కర్లేని విషయాల నుంచి తప్పించుకోవడం ఎలా? మన చుట్టూ ఉండే చెత్తను వదిలించుకోవడం ఎలా?
1. మన చుట్టూ ఉన్నవారిలో నెగెటివ్ ఆటిట్యూడ్ ఉన్నవారి స్నేహం ముందు వదులుకోవాలి.
2. కోపము, చికాకు తెప్పించే వాదనలనుండి తప్పించుకోవాలి.
3. మన విలువను గుర్తించలేని వారి విమర్శలను పట్టించుకోకూడదు.
4. మనము మొదలుపెట్టే పనులను సరి అయిన కారణం లేకుండా నిరుత్సాహపరిచే వారినుంది తప్పించుకోవాలి.
5. మన ఉన్నతిని చూసి ఈర్ష్య పడేవారి స్నేహం వదులుకోవాలి.
6. మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు గొప్ప గొప్ప పనులే మనకు సాధ్యం అవుతాయి. కావలసినది నేను చేయగలను అనే నమ్మకం.
7. మనం ఏ పని చేసినా, అది మంచైనా, చెడైనా, మనలను విమర్శించేవారు తప్పక ఉంటారు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
8. మరొకరి గురించి చెడుగా చెప్పేఅవరి సాంగత్యం కూడా వదులుకోవాలి. అలా చెప్పడం అలవాటు అయినవారు మన గురించి కూడా వేరొకరికి చెప్తారు. ఉన్న విషయానికి మరో నాలుగు కలిపి మరీ చెప్పే అలవాటు ఉన్నవారితో మరీ ప్రమాదం...
మనం ప్రతి విషయం లోనూ పాజిటివ్ గా ఆలోచించడం నేర్చుకొని, మన చుట్టూ కూడా అటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలి. మనసు, మెదడు ప్రశాంతంగా ఉంటుంది.
ఒకసారి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రి రవిశంకర్ గారు యూరోపియన్ పార్లమెంట్లో ప్రసంగిస్తున్నపుడు, అక్కడి సభ్యుడు ఒకరు లేచి రవిశంకర్ గారిని ఇలా అడిగారు. యోగా అనేది హిందూ మతానికి సంబంధించినది. మేము క్రైస్తవులు అవడం వలన మీ యోగా ను అంగీకరించడానికి, ఆచరించడానికి మాకు ఇబ్బందిగా ఉంటుంది అని. దానికి శ్రి రవిశంకర్ గారు ఇలా సమాధానం ఇచ్చారు.
మొదటగా...హిందూ అనేది ఒక మతం కాదు. ఒక జీవన విధానం. చైనీస్ ఆహారం తినడం వలన ఎవరూ చైనా జాతీయుడు అయిపోరు. బీతోవెన్ (ప్రసిధ్ధ జర్మన్ సంగీత కళాకారుడు )సంగీతం వినటం వలన జర్మన్ దేశస్థులు అయిపోరు. మరి మనం ఇతర దేశాలకు చెందిన ఆహారాన్ని, సంగీతాన్ని ఇష్టపడి ఆస్వాదిస్తున్నప్పుడు, భారత దేశానికి చెందిన, ఒత్తిడిని, ఆందోళనను తగ్గించే వ్యాయామం అయిన యోగాను ఇష్టపడడంలో అభ్యంతరం ఏమిటి?
నిజమే కదా...
రకరకాల దేశాలకు చెందిన వైద్య విధానాల లాగానె, యోగా కూడా మానసిక స్థైర్యాన్ని పెంచి, మానసిక ఆందోళనలను, ఒత్తిడిని తగ్గించే ఒక ప్రక్రియ. దీనికి మతం రంగు పూయడం ఎంత వరకు సబబు?
సూర్య నమస్కారాలకు కూడా మతం పేరుతో వంకలు పెట్టడం ఈ దేశం లోనే చూస్తాం బహుశా...సూర్యుడు సకల జనావలికి ఆరోగ్య ప్రదాత. ఆయన అందరి మీదా సమానంగానె తన కిరణాలను ప్రసరిస్తాడు. ఆయనకు అందులో కులమత బేధం లేదు. ఆయన పేరిట వచ్చిన వ్యాయామ ప్రక్రియకు మనం మతం పేరు పెట్టేసి రచ్చ చేసేస్తాం.

Saturday 6 June 2015

 సభ్యులు, పెద్దలు కృష్ణప్రసాద్ ఆలూరి గారు ఒక గ్రూప్ లొ పోస్ట్ చేసిన లేపాక్షి గారి కార్టూన్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఇది. నిజమే కదా, మనం మనకోసం కన్నా, ఎదుటివారి కోసమే ఎక్కువ బతికేస్తున్నాం. పెళ్ళిళ్ళకి వెళ్ళెటప్పుడు, " ఇది ఒకసారి కట్టేసుకున్నాను వాళ్ళ ఇంటికి, ఇప్పుడు కూడా అదే కట్టుకుంటే నవ్వరూ" అనే డైలాగ్ చాలా మంది దగ్గర విన్నాను నేను. పక్క వాళ్ళ కన్నా పెద్ద టీవీ మన ఇంట్లో ఉండాలి. పొరుగు వారింట్లో కారు ఉంటే మనమూ కొనేయ్యాలి, లేకపోతే "కారు కూడా లేదు అనుకుంటారేమో",  కొంత మంది మరీ చనువుగా, ఇంకా కారు కొనలేదా, ఈపాటికి ఉండాల్సిందే మీ ఇంట్లో...అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ఎంత వేసవి కాలం లో అయినా, ఎంత ఉక్కపోతలో అయినా, గరగరలాడుతూ పెద్ద జరీ అంచు పట్టు చీరలే కట్టుకోవాలి., మన సౌకర్యం కోసం నేత చీరలు కట్టుకుంటే, "ఏమనుకుంటారో అందరూ"? ---- మన ఆలోచనలు ఇంతవరకే పరిమితం. దీనిని మించి ఆలోచించలేము. ఒక విధంగా మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పట్టుచీరల, నగల ప్రదర్శన వేదికలు. కొంచెం తక్కువగా ప్రదర్శించిన వాళ్ళకి తరువాతి ఫంక్షన్ లో విలువ ఉండదు. వాళ్ళను పన్నెత్తి పలుకరించరు... ఆఖరికి మన పిల్లల చదువుల విషయం లో కూడా ఇలాగె ప్రవర్తిస్తున్నాం మనం. ఇంజినీరింగో, మెడిసినో తప్ప, ముఖ్యంగా తెలుగు ప్రజలకు వేరే ఏదీ ఉన్నత చదువు కాదు. బయట ప్రపంచం లో ఎంత పోటీ ఉన్నా సరే, ఉద్యోగాలు దొరకక పోయినా సరే, మనకు చదువు అంటే ఆ రెండు కోర్సులే. మన పిల్లవాడికి చదివే మేధ ఉందా లేదా మనకు అనవసరం. పక్కవాళ్ళు అదేదో కార్పొరేట్ కాలేజ్ లో చేర్పిస్తే, మనం స్తోమత ఉన్నా, లేకపోయినా, అప్పు చేసి మరీ అదే కాలేజ్ లొ జాయిన్ చేస్తాం. తీరా వాళ్ళు ఎంట్రన్స్ లు పాస్ అయ్యి, ప్రొఫెషనల్ కాలేజ్ కి వెళ్ళాకా అ చదువు బుర్రకు ఎక్కక, మధనపడి, మానసిక సంఘర్షణ పడిన విద్యార్థులు ఎందరో....పుట్టినరోజు పార్టీలు, ఆఖరికి శ్రావణ మంగళవారం నోములలోకి కూడా ఈ కార్పొరేట్ కల్చర్ చొచ్చుకు వచ్చేసింది. వచ్చిన పేరంటాళ్ళకు జ్యూసులు, టిఫిన్లు, కాఫీలు, అంతా అదో వేలం వెర్రి అయిపోయింది. ఇంక మన ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మన డబ్బు, దర్పం, హోదా ప్రదర్శించడానికి అవి ప్రధానమైన వేదికలు. ఒక్కో పెళ్ళికి 20 నుంచి 25 లక్షల వరకూ ఖర్చు అవుతోంది అంటే, జీవితాంతం సంపాదించినది అంతా ఒక్క పెళ్ళి ఖర్చుతో సరి అన్నమాట. ఒకళ్ళు 40 ఆధరువులు, మరొకరు 60, మరొకరు 100, ఇంకొకరు 150.....60 వంటకాలలో ఎంతమంది ఎన్ని తింటారు? 60 ముద్దలు తినడానికి పొట్ట పడుతుందా అసలు....అవసరమైన చోట ఖర్చు పెట్టడం లో తప్పు లేదు. మండపం అలంకరణకి విదేశీ పూవులు, ఇన్నిన్ని ఆహార  పదార్థాలు అవసరమా? ఉత్తర భారతం లోని వేడుకలు అయిన మెహెందీ, సంగీత్ మన పెళ్ళిళ్ళలో కూడా చోటు చేసుకుంటున్నాయి.  డబ్బు ఉన్నది ఖర్చు పెట్టుకోవడానికే కదా అని సాగతీతలు. డబ్బు ఉన్నవారు ఖర్చు పెట్టుకొంటున్నారు సరే, లేనివాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడుతోందిగా...ఇప్పుడు పెళ్ళికూతురే, అలా చేయకపోతె బాగుండదు, నా ఫ్రెండ్స్ నవ్వుతారు అంటే ఎం చేయాలి? అలాగే జరుగుతోంది కూడా.  మనం మనలాగా, మన కుటుంబ పధ్ధతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం  జీవించడం మర్చిపోయాము. మన జీవితం పక్కవాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి నడుస్తోంది. మనకు ఉన్న డబ్బు, సంపద హోదా మీద ఆధారపడి నడుస్తోంది.

Thursday 4 June 2015

అందరికీ తిక్క కుదిరింది....ఇన్నాళ్ళూ ఎంతమంది ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు మొర్రో అని చెవికి ఇల్లు కట్టుకుని పోరినా వినని వాళ్ళు ఇప్పుడు మ్యాగీ మీద నిషేధం వచ్చాక నాలుక కొరుక్కుంటున్నారు. మ్యాగీ ఒక్కటే కాకుండా రెడీమేడ్ గా దొరికే ఏ ఆహారపదార్థం లో అయినా ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి అని అందరూ గమనించు కోవాలి. పిల్లల శారీరిక మానసిక ఆరోగ్యాలు కుటుంబం లో తల్లి మీదనే ఆధారపడి ఉంటాయి. శారీరికంగా ఆరోగ్యంగా లేని పిల్లలు చదువు మీద, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేరు. ఇక ఆటలు, వ్యాయామం సంగతి సరే సరి. పిల్లలు ఆరోగ్యకర వాతావరణం లో పెరగకపోతే, ఒక తరం నిర్వీర్యం అయిపోతుంది. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. దేశం వరకూ ఎందుకు? కుటుంబం లోనే, ఒక్కరు అనారోగ్యం పాలైనా కూడా ఆ కుటుంబం యొక్క ఆర్ధిక వ్యవస్త మీద ఎంతో ప్రభావం ఉంటుంది. అందుకె మాతౄమూర్తులు అందరూ పిల్లల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి.  బయట దొరికే రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడకుండా, మన తరతరాల సంప్రదాయ వంటలు అయిన సున్నుండలు, నువ్వుల ఉండలు, వేరుశెనగ చిక్కీలు వంటివి పిల్లలకు తినిపించాలి. వీటన్నిటిలో పిల్లల ఎదుగుదలకు పనికి వచ్చే ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. మీకు చేయడం రాకపోయినా, చేసేందుకు సమయం లేకపోయినా, ఇవి కూడా బయట దొరుకుతాయి కాబట్టి అవి కొని పెట్టచ్చు. బయట కొన్నవి అయినప్పటికీ, వీటిలో ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉండవు. ప్రతి ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ తిండి అయిన ఈ నూడుల్స్, అలూ చిప్స్, కుర్‌కురే వంటివి మన ప్రాంత ఆహారపదార్థాలు కానేకావు. తినడానికి పనికి వచ్చే పదార్థాలు ఎప్పుడైతే నిలువ ఉండేలా ప్యాకెట్స్ లో వస్తాయో, నిలువ ఉండేందుకు అందులో ఏవో కొన్ని రసాయనాలు కలుపుతారు, అటువంటి రసాయనాలు అన్నీ ఆరొగ్యానికి తప్పకుండా హాని చేస్తాయి అనే ఆలోచన ఎవ్వరికీ రాదు ఎందుకని? మన పిల్లల ఆరోగ్యం గురించి మనం ఆలోచించడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి, ఎవరో కోర్టుల్లో దావాలు వేసి, కోర్టు నిషేధిస్తేనే కానీ, మనకు స్పృహ రాదన్నమాట. ఎవరో చెప్తేనే వింటాము, మనకు సొంత ఆలోచన ఉండదన్నమాట. మళ్ళీ అందరూ చదువుకున్నవాళ్ళే....ఇకనైనా కళ్ళు తెరిచి, ప్యాకింగ్ లో వచ్చే ఆహారాన్ని పిల్లలకు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇవాళ మ్యాగీ....కొన్నీళ్ళ తరువాత ఇంకోటి....తీరా నిషేధించిన తరువాత, అప్పటివరకు జరిగిన హానిని మనం తీసివెయ్యలేము. తల్లులందరూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి.