Friday 16 September 2016

శ్రీ రమణ గారు "మిథునం" కథ ద్వారా మనందరికీ పరిచయమే.... "నాకు నచ్చిన కథ" శీర్షికన ఆయన వ్రాసిన మరో ఆణిముత్యం "బంగారు మురుగు" కథ పరిచయం చేయబోతున్నాను...నేను ఎంతవరకూ న్యాయం చేయగలనో తెలియదు..ఎందుకంటే వారి కథలను క్లుప్తీకరించి వ్రాయడం సాహసమే...అచ్చతెలుగు కథలకు మరో ఉదాహరణ ఈ " బంగారు మురుగు"..
ఈయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయస్థాయి వివేకానందా వ్యాస రచన పోటీలలో వరుసగా ఆరుసంవత్సరాలు ప్రథమ బహుమతి అందుకున్నారట..బాపు రమణలతో కలిసి చిత్రపరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేసారట...ప్రస్తుత కథ 1993 సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వార పత్రిక కోసం వ్రాసినది..ఈ కథకు "జ్యేష్ట లిటరరీ" అవార్డు లభించింది....
ఓ ఇంట్లో ఓ బామ్మకీ, మనవడికీ ఉన్న బంధం గురించి చెప్తుందీకథ. మడి, పూజ వంటివి లేకపోయినా, "మొక్కకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...ఇవే బామ్మకు తెలిసిన బ్రహ్మసూత్రాలు...గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే ఓ స్వాములారి సేవలో కొడుకుకు ఉన్న మడులూ, మాన్యాలూ అంతరించిపోగా, మనవడికి అంతా తానై పెంచుతుంది...పెరట్లో ఉన్న బాదం చెట్టు ఇద్దరికీ ఆవాసం..రాలిపడిన బాదం కాయలూ, అమ్మకి తెలియకుండా, చెట్టుతొర్రలో మిఠాయిలూ, జీళ్ళూ దాచే బామ్మే మనవడికి తోడూ, నీడా, దైవం అన్నీనూ...పరువు తక్కువగా... బయటి చిరుతిళ్ళు మనవడికోసం కొని పెడుతోందని తెలిసిన కొడుకూ కోడలూ బామ్మ చేతికి డబ్బులు అందకుండా చూస్తే,....... బియ్యం ఎదురిచ్చి జీళ్ళు కొంది బామ్మ....ఆ తరువాత బియ్యం డబ్బాకి కూడా తాళం పడితే, మనవడి పీచుమిఠాయి కోసం దేవుడిగదిలో కంచు గంటకి కాళ్ళొస్తాయి...మిఠాయిలూ, జీళ్ళూ, పీచుమిఠాయి ఆరోజుకి ఇచ్చేసి, మరుసటి వారం సంతరోజు వాడొచ్చి ఇంకా బాకీ ఉన్నానని మరిన్ని జీళ్ళూ, వగైరా ఇచాకగానీ ఇంట్లో కంచుగంట ఆచూకీ తెలియలేదు...పూజలూ, పునస్కారాలూ, స్వాములోర్లూ, సత్కారాలూ, జప తప హోమాదుల్లో మడులూ మాణ్యాలూ కరిగిపోవడం ఎలా తెలియలేదో, అంత దాకా ఒకటే కంచం, ఒకటే మంచంగా బామ్మతో బ్రతికిన మనవడికి కంచం , మంచం వేరయ్యాక గానీ, తనకి వయసొచ్చిందని తెలియలేదు...పెళ్ళీడు వచ్చాక, వరస అయిన మనవరాలు (కూతురి కూతురు) ఉన్నా కూడా ఆమే గుణం తెలిసి బయట సంబంధం చూస్తుంది బామ్మ..నాలుగు కాసుల బంగారం దగ్గర సంబంధం చేజారుతుందంటే, ఏదో మాయ చేసి, సంబంధం ఖాయం చేస్తుంది..పెళ్ళి సమయం లోనూ, మరణ శయ్య మీద ఉన్నప్పుడూ ...అసలు మనవడికి గ్రాహ్యకం వచ్చినదగ్గర్నుండీ ఎన్నో జీవిత సయ్తాలు చెప్తుంది బామ్మ....విచారించకు వెర్రి నాగన్నా....ఇప్పుడు వెళ్ళి, అటూ ఇటూ కాస్త పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అని మనవడికి భరోసా ఇచ్చి కన్ను మూస్తుంది...
స్థూలంగా ఇదీ కథ...అయితే, కథ ఆద్యంతం, తెలుగు భాష తీయదనం ప్రవహిస్తూ ఉంటుంది...బామ్మల దగ్గర బాల్యాన్ని గడిపిన అదృష్టవంతులందరూ ఈ కథలో తమ బాల్యాన్ని పోల్చుకుంటారు.
"పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ, వేధింపులూ బామ్మ దగ్గరలేవు"...
ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తీ రెండూ లేవు అంటే " దయ కంటే పుణ్యం లేదు..నిర్దయ కంటే పాపం లేదు...చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం,....నాకు తెలిసిందివే" ...
"మండువా లోగిలి పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువలా ఉండేది"...
"పిచ్చి సన్నాసీ! దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేవైనా ఉందీ!! మేలుకొలుపులూ మనకోసమే, చక్కెర పొంగలీ మనకోసమే!!"
"బాదం చెట్టు భోషాణం"..
"విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయిలు"...
"నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"...
"దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది---దిక్కులేని వాళ్ళకి"...
"ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నావరించింది"..
"ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?"..
" పిల్ల పొందిగ్గా ఉంది...పచ్చగా దొరసానిలా ఉంది...కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి...నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు..."
"అరటి దూట కూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, నైపుణ్యం కావాలి...అలాంటి అమ్మాయి సంసారాన్ని చక్కదిద్దుగోగలదు.."
"ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి.. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి...అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి"...
ఇలాంటి మనసు నిండే వాక్యాలు ఇంకా ఎన్నో ఈ కథలో, అన్నీ చెప్పాలంటే మొత్తం కథ చెప్పాలి...ఈకథని ఈపాటికి మీరందరూ చదివే ఉంటారు. చదవకపోతే తప్పనిసరిగా ఒక్కసారైనా చదవండి....ఒక్క సారి చదివాక, ఆరోజే మరో నాలుగైదు సార్లు చదవకుండా ఉండలేరు...ఇంత మంచి కథను చదవడం మిస్ అయ్యరంటే మాత్రం జీవితంలో కొన్ని అనుభూతులను మిస్ అవుతున్నట్లే...
మీ స్పందనని తెలియపర్చడం మర్చిపోవద్దు...
చిన్నతనంలో మేము చదివిన స్కూల్ లో ప్రతిరోజూ మూడు భాషల్లోనూ, డిక్టేషన్ వ్రాయించేవారు....ఈ మూడు భాషల టీచర్లూ క్లాసులోకి రాగానే ముందు డిక్టేషన్ చెప్పవలసిందే..ఆ తరువాత హోం వర్కులు చూసి, అప్పుడు కొత్త పాఠం మొదలుపెట్టడం...మూడు భాషలోనూ డబల్ రూల్ పుస్తకాల్లో కాపీ రైటింగ్ వ్రాయాల్సిందే....అందువల్ల మాకు ఇప్పటికీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వ్రాయడం వస్తుంది. మిగిలిన గ్రూప్ సబ్జెక్ట్స్ కి ఎంత విలువ ఇచ్చేవారో, తెలుగు, హిందీ, ఇంగ్లీషు కీ అంత ప్రాధాన్యత ఇచ్చేవారు...ప్రతి సబ్జెక్ట్ లోనూ పాఠాలు వివరంగా చెప్పటం, పద్యాలు అయితే రాగయుక్తంగా పాడటం, పిల్లలచేత పాడించటం చేసేవారు మా టీచర్లు...మా హెడ్మిస్త్రెస్స్ పిల్లలతో ఎంత చనువుగా ఉండేవారో, తప్పు చేస్తే అంతగానూ శిక్షలు ఉండేవి...పిల్లల్తో చాల కలిసిమెలిసి ఉండేవారు ఆవిడ. ప్రతి విద్యార్థీ ఏ క్లాసు, ఏ సెక్షను అనేది ఆవిడకి ఎప్పుడూ గుర్తే...ప్రైవేటు స్కూల్ అయినా కూడా ఆవిడ మమ్మల్ని అన్ని పోటీలకూ పంపేవారు, అన్ని పరీక్షలూ వ్రాయించేవారు. ఏవో కేంద్ర ప్రభుత్వ పరీక్షలూ, తి.తి.దే. వారి పరీక్షలూ ..ఏమిటో చాలా చాలా వ్రాసేవాళ్ళం...ఒక్క చదువే కాకుండా చాలా ఇతర వ్యాపకాలలోనూ, ఆటల్లోనూ కూడా చాలా పోటీలకు వెళ్ళి, మా స్కూల్ పిల్లలు ఎన్నో బహుమతులు గెల్చుకునే వారు. ...మా హెడ్మిస్టెస్ టీచర్లను ఎలా సెలెక్ట్ చేసుకునేవారో కానీ, ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యం... పుస్తకాల్లో పాఠాలే కాక, ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్చుకున్నాం వారి దగ్గర...ఈరోజుకి, మేము ఉద్యోగాలు చేయకపోయినా, మా పిల్లలకు ట్యూషన్లు లేకుండా సొంతంగా ఇంట్లో చదువుచెప్పుకుని, వాళ్ళకు ఇంత క్రమశిక్షణ నేర్పగలిగాము అంటే అదంతా మా టీచర్లు, హెడ్మిస్ట్రెస్ చలవే...ఆ స్కూలు 1983 లో వదిలేసినా, ఈరోజుకి తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు...ఇప్పటికీ మా స్కూల్ మీద, మా టీచర్ల మీద గౌరవభావం , ప్రేమ అలాగే ఉన్నాయి నాకు..నాకే కాదు, మా స్కూల్ పిల్లలందరికీ అంతే బహుశా...
ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదూ..కాకినాడలో అప్పట్లో పేరెన్నిక గన్న స్కూల్....టాగూర్ కాన్వెంట్ హై స్కూల్...హెడ్ మిస్టెస్ పేరు శ్రీమతి సి.ఎం. ఇందిరా దేవి గారు. తెలుగుకి సుబ్బలక్ష్మి టీచర్, లెక్కలికి జోసెఫ్ మాస్టారు, సైన్స్ కి రాఘవలక్ష్మి టీచర్, పి.వి. శర్మ గారు, సోషల్ కి సావిత్రి మేడం, హిందీకి పద్మావతి టీచర్, పి.టి. సర్ సూర్యనారాయణ గారు, డ్రాయింగ్ కి సత్యనారాయణ సర్, ఇంగ్లీషుకి ఛార్లీ మాస్టారు...అబ్బబ్బ....అందరూ ఎంత బాగా చెప్పేవారో....
ఇవీ మా స్కూల్ విశేషాలు...ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా మా జీవితాలను తీర్చిదిద్దిన ఆ గురువులందరికీ పాదాభివందనాలు...
మీ అందరి స్కూల్ విశేషాలు కూడా పంచుకోండి మరి...
శ్రీ గురుభ్యో నమ:
ఈ సమూహం లో సభ్యులుగా ఉన్న ఉపాధ్యాయులకు నా మన:పూర్వక "ఉపాధ్యాయ దినోత్సవ "శుభాకాంక్షలు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దటం లో తల్లితండ్రుల తర్వాత మీ పాత్ర అమోఘమైనది. విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ, మంచి నడవడిక నేర్పి ఉన్నత సంస్కారాలను విద్యార్ధులలో పాదుకొల్పడం లో మీ కృషి శ్లాఘనీయం . ఒక దేశ భవిష్యత్తు ఆ దేశం లోని యువత మీదనే ఆధారపడి ఉంది. అటువంటి యువతను తయారు చేసేది మీరు. అంటే పరోక్షంగా ఒక దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉంది.
పురాణం కాలం నుంచి రామ లక్ష్మణులను, కౌరవ పాండవులను మరెంతో మంది శిష్యులను ప్రతి యుగం లోను ఉన్నతమైన వ్యక్తులుగా రూపొందించిన గురువులు కలిగిన వేదభూమి మనది. ఈ ఆధునిక కాలం లో కూడా శ్రీ రాధాకృష్ణన్ వంటి ఎంతో మంది గురువుల నీడలో పెరిగిన ఎంతో మంది నేడు ప్రముఖులై దేశమాత సేవలో తరిస్తున్నారు.
. యువత మార్గనిర్దేశనం లో మీ పాత్ర ఎంతో విలువైనది. ఈ సమాజ నిర్మాణంలో మీ భాగస్వామ్యం విలువ కట్టలేనిది. మీ ఋణం తీర్చుకోలేనిది. దేశం లోని ప్రతి పౌరుడు మీకు సదా కృతజ్ఞులై ఉంటారు....
గురుర్బ్రహ్మా, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమ:
పిల్లలను ఎప్పుడూ మరొకరితో పోల్చే పొరపాటు చేయకండి..అది ఇంట్లో ఉండే మిగిలిన పిల్లలతో అయినా సరే, ఇతరుల పిల్లలతో అయినా సరే..ఒక్కొక్కరిలో ఒక్కో నైపుణ్యం ఉండచ్చు...దానిని కనుక్కొని వెలికితీసి ప్రోత్సహించడం తల్లితండ్రులుగా మన విధి...పెద్దవాడికి చదువులో ఆసక్తి ఉంటే, చిన్నవాడికి పాటల్లో ఉండచ్చు....చాలా ఇళ్ళల్లో సాధారణంగా వినబడే మాట ఏంటంటే, అన్న లాగా నువ్వు ఎందుకు ఉండవు?, అక్క లాగా ఎందుకు ఉండవు? ఇద్దరూ ఎందుకు ఒకలాగా ఉండాలి? ఉండరు కూడా....అలా పోల్చి తిట్టడం వలన వాళ్ళ మనసుల్లో ఏర్పడే న్యూనతా భావం కొన్ని సంవత్సరాల వరకూ ఉండిపోవచ్చు...దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి...ఇంట్లో పెద్దవాళ్ళు అలా అనడమే కాకుండా...ఎవరితో అయినా చెప్పేటప్పుడు కూడా, పెద్దవాడు చాలా బాగా చదువుతాడండీ, చిన్నవాడికి అంత శ్రధ్ధ లేదు, ఆటల్తోనూ, టీవీ తోనూ సరిపోతుంది ...ఇలా చెప్పడం వలన, పెద్దపిల్లలు చిన్నవాళ్ళను చులకన చేయడం, బయటి వాళ్ళు కూడా చులకనగా చూడడం జరుగుతాయి. దీని ప్రభావం చిన్న వాళ్ళ మీద చాలా ఎక్కువగా ఉంటుంది..ఇంట్లో ఎంతమంది సంతానం ఉంటే, వారందరి మధ్యన, ఒక బంధం, ఐకమత్యం ఉండేలా పెద్దవాళ్ళే జాగ్రత్తలు తీసుకోవాలి..ఇలా సంతానం మధ్యన పోల్చి చూడటం వల్ల, వాళ్ళ మధ్యన ఉండే ఐకమత్యం, ప్రేమ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రతి బిడ్డా ప్రత్యేకమే..ఏ ఇద్దరూ ఒక్కలాగా ఉండరు. ..రేండో సంతానాన్ని కనేటప్పుడు తల్లి తండ్రులు గుర్తుంచుకోవలిసిన ముఖ్యమైన విషయం ఇది.