Sunday 10 January 2016

అరిషడ్వర్గాల ప్రభావం వలన, మనసా వాచా కర్మణా మనం చేసే పాపాలకు నివృత్తి దానం వలనే జరుగుతుందంటారు. దానము వలన పూర్వజన్మల నుంచి వస్తున్న పాపాలను కూడా పోగొట్టుకోవచ్చు. అయితే దానము ఎప్పుడూ పాత్రుడైన వాడికే ఇవ్వాలి. మన ఇచ్చిన దానాన్ని దుర్వినియోగం చేసేవాడికి ఇచ్చిన దానం మనకు సత్ఫలితాలను ఈయదు. అలాగే ఎవరైనా మన సహాయం కోరి వచ్చినపుడు, వారికి నిజంగా అవసరమేనా అని ఆలోచించాలి. మనం చేసిన దానము వలన గ్రహీత చెడు మార్గాన్ని పడితే ఆ దోషం మనలను అంటుకుంటుంది. కీర్తిని ఆశించో, అహంకారం వలననో చేసే దానాలు దాతకు మంచి చేయకపోగా చెడును కలుగజేస్తాయి. దానము చేసి దానిని ప్రచారం చేసుకోవడం, దానము పుచ్చుకున్న వారి దగ్గర్నుంచి ప్రతిఫలాన్ని ఆశించడం పనికి రాదు. అందుకే కుడిచేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియరాదు అన్నారు. అలాగే ఒకసారి దానము చేయాలి అని నిర్ణయించుకున్న తరువాత ఆ ఆలోచన నుండి విరమించుకోరాదు. విద్యా దానం, భూం,గో, సువర్ణ దానాలు, అవయవదానం ఎన్ని ఉన్నా, అన్నిటిలో అన్నదానం గొప్ప మహత్యం కలది. ఎందుకంటే, మిగిలిన దానాలన్నిటిలోను గ్రహీత ఇంకాకొంచెం దక్కితే బాగుండును అని తలచే అవకాశం ఉంది. అలా ఆశించినప్పుడు దాతకు దానాం పూర్తి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అన్నదానం లో మాత్రం ఒకసారి కడుపు నిండిన తరువాత ఇంక ఏమి పెట్టినా తినలేడు. దాన గ్రహీత సంతృప్తి చెందుతాడు. మరింత ఆశించే వీలుండదు. ఇది దాతకు శ్రేయోదాయకం. దేశ కాల పరిస్థితులననుసరించి ఉత్తమ గ్రహీతకు చేసిన పాత్రమైన దానం దాతకు అన్నివేళలా శుభాలను చేకూరుస్తుంది.
కీర్తి, అధికారం, ధనం ఈ మూడిటినీ కోరుకోని మానవుడు ఉండడు. అయితే, వీటిని సంపాదించడంలో మనిషి తనకు తాను కొన్ని పరిమితులు విధించుకోవాలి. ఈ మూడు విషయాలలో ఒక స్థాయిని పొందిన తరువాత తృప్తి చెందాలి. అలాకాక, ఇంకా ఇంకా కావాలకునే వారు ఆ దాహంలో వాటి పరిమితులు తెలియక నష్టపోతారు. ఎందుకంటేఉన్నత స్థాయిని చేరిన తరువాత క్రిందకి దిగటమే కాని, పైకి ఎక్కడానికి మరి సోపానాలు ఉండవు. క్రిందకి దిగడం మొదలుపెట్టామో, అవి జారుడుమెట్లను తలపిస్తాయి. కీర్తి దాహం, అధికార దాహం, ధన దాహం ఈ మూడూ ఒక స్థాయిని దాటిన తరువాత అడ్డదారులు తొక్కుతాయి. మనిషి సన్మార్గాన్ని వీడిపోతాడు. దుష్ట ఆలోచనలు ప్రవేశిస్తాయి. ఈ మూడిటినీ పొందడానికి, పొందిన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు.  ఆ క్రమంలో ఎన్నో పాపాలు, దుర్మార్గాలు చేస్తాడు. మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. మనిషికి అన్నిటికన్నా ముఖ్యమైనది, అలవరచుకోవలసినది మన:తృప్తి...ఇది తెలిసిన వాడు పై మూడిటినీ తన చెప్పుచేతల్లో ఉంచుకోగలుగుతాడు. అతడే ఉత్తమ మానవుడు. 

Friday 8 January 2016

హిందు ధర్మ పరిరక్షణ 2.

మన పూర్వులు మనకు అందించిన ప్రతి సంప్రదాయం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంది. స్త్రీలు కాళ్ళకు పసుపు పూసుకోవాలని, ఇంటి గడపకు పసుపు పూయాలని, వాకిట్లో ఆవుపేడ కలిపిన కళ్ళాపి చల్లాలని చెప్పిన ప్రతి ఆచారం వెనుక చెడు బ్యాక్టీరియా నుంచి, విషపురుగులనుంచి మనలను రక్షించే ప్రయత్నం జరిగింది. ప్రతి పండుగకు మనం దేవునికి నివేదించే ఆహారపదార్ధాల వెనుక మారే ఆయా కాలలను బట్టి మన శారీరిక ఆరొగ్యాన్ని కాపాడడమే వారి ముఖ్యోద్దేశం. శ్రావణమాసం సెనగలు, వినాయక చవితికి ఉండ్రాళ్ళు, సంక్రాంతి పండుగకు అరిసెలు, కార్తీక మాసం ఉపవాసాలు, శ్రీరామనవమికి వడపప్పు, పానకం ఇవన్నీ నివేదించడం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. అలాగే రామాయణం, భారతం, భగవద్గీత మొదలైన పురాణ గ్రంధాలు, అనేక శతాబ్దాల క్రితం రచించబడిన నీతి చంద్రిక వంటి గ్రంధాలు పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని, పెంపొందిస్తాయి. ఏ ఇతర భాషా గ్రంధాలు ఇవ్వలేని వ్యక్తిత్వ వికాసం మన ఈ గ్రంధాలు ఇస్తాయండంలో సందేహం లేదు. చెట్లను, నదులను, సముద్రాలను, పశుపక్ష్యాదులను పూజించడం ద్వారా ప్రకృతికి మనం ఋణం తీర్చుకుంటున్నాం. రాముడు, కృష్ణుడు, పరిపూర్ణ అవతారాలు, జన్మనెత్తినది మొదలు, మరణాన్ని కూడా పొంది, మొత్తం జీవితకాలం, తమ ఆచరణ, ఆలోచనల ద్వారా లోకానికి ఆదర్శం గా ఉన్నవారే ఇరువురూ...ఇవన్నీ మనం సంపూర్ణం గా  అర్ధం చేసుకోగలిగితేనే, ధర్మ పరిరక్షన చేయగలము. ఇతరమతాలలోకి వలస వెళుతున్న వారిని సరి అయిన మార్గానికి మళ్ళించగలము.  మొదటి అడుగు మన ఇంటి నుంచే మొదలు కావాలి. మనం ధర్మాన్ని ఆచరించి మన పిల్లలకు కూడా నేరిపిద్దాం...హిందు ధర్మ విశిష్టతను చాటి చెబుదాం.
హిందు ధర్మ పరిరక్షణకు నేతలు, సామాన్యులు, భక్తులు ఎంతో సేవ చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్క హిందువు తన వంతుగా ఏం చేస్తున్నాడు అని మనలను మనమే ప్రశ్నించుకోవాలి. హిందుధర్మ పరిరక్షణకు మనం ముందుగా మూడు పనులు చేయాలి. 1. వీలైనంతగా ధర్మాన్ని స్వయంగా ఆచరించడం 2. చిన్నతనం నుంచే పిల్లలకు అలవాటు చేయడం 3. ఇతరమతస్థులు మనలను విమర్శిస్తున్నపుడు మనదారిని మనం వచ్చేయకుండా వారికి తగిన సమాధానం చెప్పడం. అయితే మొదటి రేండూ ఆచరించడానికి తేలికైనవే అయినప్పటికీ, మూడవ అంశం మాట్రం ఆచరణలో చాలా కష్టం. ఎందుకంటే, ఎదుటివారికి సంతృప్తికరంగా సమాధానం చెప్పగలగాలి అంటే ముందు మన ధర్మం గురించి మనం కూలంకషంగా తెలుసుకోవాలి. మన పురాణాల్లోని ధర్మసూక్ష్మాలు అర్ధం చేసుకోవాలి. అప్పుడే మనలను విమర్శించే ఇతర మతస్థులకు మనం దీటైన జవాబులు ఇవ్వగలుగుతాము.


1. మన ధర్మం స్త్రీ పురుషులను కుంకుమ/తిలక/విభూతి ధారణ చేయమని చెప్తోంది. కనీ స్త్రీలే తిలక ధారణను మానివేస్తున్న ఈ కాలంలో ఎంతమంది పురుషులు ఈ అలవాటును కొనసాగిస్తున్నారు? తిలకధారణ కేవలం అందం కోసం కాదు. భ్రూమధ్యం లో పెట్టుకునే తిలకం వలన కొన్ని నాడులు ఉత్తేజితం అవుతాయని, కుంకుమ దృష్టి నివారిణి గా పనిచేస్తుందని ఆధారాలు ఉన్నాయి.

2. బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం చాలా అరోగ్యకరం అని చెపుతారు. ఆ సమయంలో దేవతలు భూమి మిదకు వస్తరు అని చెపుతారు. శాస్త్రరీత్యా కూడా ఆ సమయంలో మనసు, పరిసరాలు ప్రశాంతంగా ఉండి చదివినది మనసుకు హత్తుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే సాధకులు బ్రాహ్మీముహూర్తం లో పూజలు చేయాలి అని చెపుతారు. ఈనాడు మారుతున్న జీవనశైలి వల్ల రాత్రి పొద్దుపోయి పడుకొని, ఉదయం పొద్దెక్కాక లేస్తున్నారు. దానితో మన జీవ గడియారం దెబ్బతిని, రకరకాల అనారోగ్యాలు చోటు చేసుకుంటున్నాయి.

3. సూర్యోదయాత్పూర్వమే స్నాన సంధ్యాదులు, దేవాలయ దర్శనం పూర్తి చేసుకోవాలని శాస్త్రం. ఈ అలవాట్లు పోవడానికి కూడా మారిన జీవన శైలులే కారణం. మన పూర్వులు అందించిన స్తోత్రాలు కొన్ని నిర్దిష్ట రాగాలలో కూర్చినవి. వాటిని ఉదయం సమయంలో పఠించినట్లైతే, మనసుకు ప్రశాంతత, మెదడుకు ఆరొగ్యం కలిగి, చదివే చదువు మీద, చేసే పనుల మీద ఏకాగ్రత కుదురుతుంది. ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం రోజూ ఉదయాన్నే వినడం వలన ఏకాగ్రత కుదిరి, బుధ్ధి కుశలత ప్రాప్తిస్తుంది అంటారు.

4. (ఇంకా ఉంది )

Thursday 7 January 2016

విజయం సాధించాలి అనుకున్నప్పుడు గట్టి సంకల్పమే కాకుండా కఠిన పరిశ్రమ కూడా ఎంతో అవసరం...మన లక్ష్యం పెద్దది అయినపుడు సాధించే మార్గంలో ఎన్నో అవరోధాలు వస్తాయి. వాటిని అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితేనే అమృతం వంటి విజయం మనకు సిధ్ధిస్తుంది. మన దేశం ఎన్నో పురాణాలకు పుట్టిల్లు. ఈ ఉత్తమ గ్రంధాలన్నీ మనకు మరే ఇతర వ్యక్తిత్వ వికాస గ్రంధాలూ బోధించనివెన్నో బోధిస్తున్నాయి. పైన చెప్పిన మాటకు మంచి ఉదాహరణ మనందరికీ తెలిసిన క్షీరసాగర మథనం. అమృతం కోసం దేవదానవులు చేసిన మథనం లో ముందు హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ తరువాత మిగిలినవెన్నో ఉద్భవించిన తరువాతే అమృతం చివరికి లభించింది. హాలాహలం వచ్చిన వెంటనే ప్రయత్నం ఆపివేసి ఉంటే అమృతం దొరికేది కాదు. క్షీరసాగర మథనం మనకు ఇంకో విషయాన్ని కూడా చెపుతుంది. అదే సమిష్టి కృషి. ఒక బృహత్కార్యం సాధించాలి అనుకున్నపుడు ద్వేషభావం మాని ఇష్టం లేకపోయినా సరే, శతృవులనైనా కలుపుకుపోవాలి. ఆ కృషి ఫలితాలు ధర్మం ఉన్న వైపే నిలుస్తాయి.  క్షీరసాగరాన్ని చిలకడానికి శ్రీమహావిష్ణువును వేడుకొని ఆయన కూర్మావతారంలో ఉండి మందర పర్వతాన్ని  పైకెత్తి ఉంచగా మాత్రమే సాగరాన్ని మధించడం పూర్తి అయింది. అంటే ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు మహనీయుల అవసరం కూడా మనకు ఉంటుంది. వారిని ప్రసన్నం చేసుకొని వారి సూచనలు సలహాలు పాటిస్తే విజయం సాధించగలం. అలాగే మొదట హాలాహలం ఉద్భవించినప్పుడు సృష్టినంతటిని నాశనం చేయగల ఆ మహా కాలకూటాన్ని శివుడు తన గరళమందు నిలిపి లోకులను రక్షించాడు. ఆ తరువాతే అమృతం దేవదానవుల సొంతం అయింది. అనగా మన సంకల్పానికి కృషి మాత్రమే కాకుండా దైవబలం కూడా అవసరం. దైవానుగ్రహం తోడున్నప్పుడు సత్కార్యాలను సాధించడంలో ఎన్నటికీ విఫలం కాము.