Friday 16 May 2014

 ఈ మధ్య  అదేదో సినిమాలో " దేశం లో ఎవరితో పెట్టుకున్నా, ఏ భాష వాడితో పెట్టుకున్నా ఆంధ్ర వాడితో, తెలుగు వాడితో పెట్టుకోవద్దు"  అని యముడు తన కుమారుడికి చెప్తాడు. సోనియా ఆ సినిమా చూసుంటే బాగుండేది. . రాష్ట్ర విభజన తో కడుపు మండిన ఆంధ్ర వోటరు ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ కు రాకుండా చేసాడు. వోటర్లు వెర్రి గొర్రెలు అనుకునే రా.కీ.నా. లకు చుక్కలు చూపించాడు. ఆంధ్ర వాడి సత్తా ఏమిటో దేశానికి తెలిసేలా చేసాడు. కాంగ్రెస్ కు చెందినా ఏ ప్రముఖ వ్యక్తీ కుడా బరిలో గెలవలేక పోయాడు. సామాన్యుడు సామాన్యుడు అని అనుకున్న వోటరు అసామాన్య తెలివి తేటలు చూపించి తనకు ఏమి కావాలో, ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నాడో స్పష్టం చేసాడు. ఇక ముందు వచ్చే ప్రభుత్వాలు అయినా ప్రజల వైపు నుంచి అలోచించి పాలిస్తేనే వాటికీ మనుగడ.

Thursday 15 May 2014

ఆ రోజుల్లో.....7


ఎన్నికలు.....ఫలితాలు...


మాకు బాగా ఊహ తెలిసిన తరువాత వచ్చిన ఎన్నికలు 1984.  అప్పుడు కొత్తగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ హవా నడుస్తోంది. మా పెద్దవాళ్ళు అందరు కాంగ్రెస్ కు కాకుండా తెలుగు దేశం పార్టీ గెలవడం జీర్ణించు కోలేక పోయారు. మాకు మాత్రం సంతోషం. అయితే ఈ ఎన్నికలు, ఫలితాలు వచ్చినపుడు మాకు ఇంకో విధంగా ఆనందంగా ఉండేది. అప్పుడు టీవీ లు లేవుకదా, అన్నిటికీ రేడియో నే ఆధారం. ప్రతి పావుగంటకు ఎలక్షన్ బులెటిన్ వచ్చేది. మిగిలిన ప్రోగ్రాములు అరగంట నిడివి లో ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికల స్పెషల్ బులెటిన్ మధ్యలో రెగ్యులర్ ప్రోగ్రాములు వేయడానికి అవకాసం ఉండదు. అందుకని బులెటిన్ మధ్యలో మీరా భజన్స్, తులసి దాస్ భజన్స్, లలిత గీతాలు, జానపద గీతాలు  వంటివి వేసేవారు. మా సంబరం అందుకు. అవి నేర్చుకోవడానికి మాకు అది చక్కటి అవకాశం. పెన్ను, పుస్తకం దగ్గర పెట్టుకొని ఆ పాట వస్తున్నంత సేపు చక చక వ్రాసుకునే వాళ్ళం. దాంతో పాటే ట్యూన్ కుడా నేర్చుకోవాలి. వినేవాళ్ళకు ఇది అతిశయోక్తి గా అనిపించవచ్చు కానీ, మేము ఎన్నో పాటలు, లలిత గీతాలు అలాగే నేర్చుకొన్నాము. అలాగే బులెటిన్ లో ఎవరు ఎప్పుడు ఆధిక్యం లో ఉన్నారు?, ఎన్ని స్థానాల్లో గెలుపొందారు? వంటివి ప్రతి పావుగంటకి , ప్రతి బులెటిన్ విశేషాలు టైం తో సహా నోట్ చేసుకునేవాళ్ళం.

అలాగే, భారత్ లోను, దాని మిత్ర దేశాల లోను ప్రముఖులు చనిపోయినపుడు  సంతాప దినాలు 3 రోజులు పాటించే వారు. రేడియో లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాములు ఉండేవి కావు. అప్పుడు కూడా ఈ భజనలు, గీతాలు వేసేవారు. ఒక్కోసారి అయితే  ఈ పాటల కోసం స్కూలు మానేసే వాళ్ళం . ఆయతుల్లా ఖోమైనీ చనిపోయినపుడు 2 తులసి దాస్ భజనలు, ఒక మీరా భజన్ నేర్చుకున్నా నేను. వినాయక చవితి పందిళ్ళలో, అయ్యప్ప స్వామి భజన లలో పెట్టే భక్తీ పాటలు కూడా అలాగే నేర్చుకునే వాళ్ళం. ఒక్కోసారి అయితే, ఆ పందిళ్ళ దగ్గరికి వెళ్లి ఆ కేసెట్ వివరాలు అడిగి తెలుసుకొని, కొనుక్కోవడం, లేదా ఒకటో, రెండో తెలియని పాటలు ఉంటె, ఆ పందిళ్ళ వాళ్ళని బ్రతిమాలి ఆ కేసెట్ తెచ్చుకొని ఆ రెండు పాటలు ఒకటి రెండు గంటల్లో నేర్చుకొని వాళ్ళకు ఇచ్చేయడం. కనీ మేము ఈ రకంగా నేర్చుకుంటున్నాము అని మా ప్రత్యర్ధులకు తెలియనిచ్చే వాళ్ళం కాదు. అదో దేవరహస్యం. ఈ రకంగా మేము ఎలక్షన్ బులెటిన్ లు, సంతాప దినాలు, పండుగలలో పందిళ్ళు, అన్నీ  మా కోసం ఉపయోగించేసుకునే వాళ్ళం.

Wednesday 14 May 2014

మా రోజుల్లో.....6


మా దూరదర్శన్ క(వ్య)ధలు......


ఈరోజుల్లో డిష్ లు, 150, 200 కు మించి ఛానల్స్ చూసే పిల్లలకు మేము ఒకటే ఒక ఛానల్ అందునా ఉదయం 6 నుంచి రాత్రి 11 వరకు మాత్రమే పనిచేసే ఛానల్ చూసేవాళ్ళము అంటే ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. 1980 లలో దూరదర్శన్ హైదరాబాద్ లోనే కాకుండా రాష్ట్రం లోని మిగతా ప్రాంతాలలో కుడా ప్రసారాలు మొదలు పెట్టింది. రిలే ద్వారా డిల్లీ నుంచి మాత్రమే కొన్నాళ్ళు ప్రసారాలు వచ్చేవి, అవి కుడా కేవలం హిందీ భాషలో. కొత్త ఒక వింత కదా, అర్ధం అయినా అవకపోయినా అవే చూసేవాళ్ళం. అందులోను, టీవీ చూడడం అలవాటు అయిపోతే యింక వదలలేరు , అదొక జాడ్యం లా పట్టుకుంటుంది అనే పెద్దవాళ్ళ భయం తోటి మాకు ఒక టైం లిమిట్ ఉండేది టీవీ చూడడానికి. యింక ఆ టైం లో ఏ ప్రోగ్రాం వచ్చినా చుసేసేవాళ్ళం. అది జైకిసాన్ అయినా, కవి సమ్మేళనం అయినా, ( కవి సమ్మేళనాలు ఎక్కువగా ఉర్దూ భాషలో వచ్చేవి. అవి కుడా వదిలేవాళ్ళం కాదు.) ఆరోజుల్లో వీధికి ఒక టీవీ ఉంటె గొప్ప. వీధిలోని పిల్లలు అందరూ తొందరగా హోం వర్కులు, చదువు పూర్తి చేసుకుని 6,7 గంటల కల్లా టీవీ ఉన్న ఇంటికి చేరేవారు. యింక ఆ వచ్చే కార్యక్రమాలు అర్ధం అయినా, అవ్వకపోయినా గుడ్డిగా చుసేయటం. వారానికి రెండు సార్లు వచ్చే హిందీ గీతాల కార్యక్రమం "చిత్రహార్" కు ఇల్లు హౌస్ ఫుల్. ఆదివారం సాయంత్రం మాత్రం తెలుగు సినిమా వచ్చేది . అప్పుడూ ఇల్లు హౌస్ ఫుల్లే. ఆ వీధి లో మాది టీవీ ఉన్న రెండో ఇల్లు. ఆదివారం వచ్చే తెలుగు సినిమా కోసం వచ్చే ప్రేక్షకుల కోసం మేము ఆదివారం బయటకు వెళ్ళే ప్రోగ్రాం కుడా వాయిదా వేసుకునే వాళ్ళం.  హిందీ వార్తలు కూడా చుసేసే వాళ్ళం.

కొన్నాళ్ళ తర్వాత రోజుకు అరగంట తెలుగు ప్రసారాలు ఇచ్చేవారు. 10 నిముషాలు రైతుల కోసం, 10 నిముషాలు ఏదైనా డాక్యుమెంటరీ లాగా ఇచ్చి, ఆఖరి పది నిముషాలు ఏదో ఒక నాటిక ఇచ్చేవారు. లేదా హాస్య కార్యక్రమం ఉండేది. ఆ ఆఖరి పది నిముషాల ఎంటర్టైన్మెంట్ కోసం ముందు 20 నిముషాలు భరించేవాళ్ళం. ఆ అరగంటా చదువుకు సెలవు. అప్పట్లో కార్టూన్లు వచ్చినట్లుగానే, రైతుల కోసం ప్రోగ్రాం లో ఎప్పుడూ, పందుల పెంపకం, ఈము పక్షుల పెంపకం, సుబాబుల్ చెట్ల పెంపకం,... డాక్యుమెంటరీ లో పొగ లేని పొయ్యిల తయారీ , మహారాష్ట్ర లోని పిమ్పాల్ బట్టి అనే గ్రామం లో సౌర వ్యవస్థ ద్వారా పూర్తిగా గ్రామ విద్యుదీకరణ గురించి, ఇవే చెప్పేవాళ్ళు. చూసి, చూసి, మాకు అవి నోటికి వచ్చేసేవి. నేటి మేటి హాస్యనటుడు శ్రీ బ్రహ్మానందం గారు ఆ అరగంట తెలుగు కార్యక్రమం లోనే మా అందరికీ పరిచయం. కితకితలు అనే ప్రోగ్రాం ద్వార అయన మిమిక్రి చేసేవారు. ఇక ఈనాటి ప్రముఖ ఏంకర్లు సుమ, ఝాన్సీ, వంటి వారు తొలిసారిగా బుల్లితెరకు పరిచయం అయిన సీరియల్ కూడా అప్పుట్లో మొదలు అయ్యింది. న్యూస్ రీడర్స్ శాంతి స్వరూప్, రోజారాణి, కనక దుర్గ, రేవతి వంటి వారు మా ఇంటి సభ్యుల్ల అయిపోయారు. ఈ మధ్య ఏదో పుస్తకం లో రోజారాణి గారు స్వర్గస్తులయ్యారు అని చదివి చాల బాధ కలిగింది.

ప్రతి గురువారం ప్రాంతీయ భాషా చలన చిత్రాలు వేసే వారు. ఇవికూడా డిల్లీ నుంచే వచ్చేవి. కింద ఇంగ్లీషు సబ్ టైటిల్ తో. కొన్నాళ్ళకు ప్రతి శుక్రవారం తెలుగు చిత్ర గీతాల కార్యక్రమం "చిత్రలహరి" వచ్చేది. ఆరోజు కూడా ఇల్లు ఫుల్లే.

కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో టీవీ మాధ్యమం ద్వారా నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు కానీ, మేము మాత్రం హిందీ భాషనూ టీవీ ద్వారానే నేర్చుకున్నాము. ఇది అతిశయోక్తి కాదు. ఉర్దూ కవి సమ్మేళనాలు కూడా చూడడం వల్ల ఉర్దూ భాష లోని అందం, ఆ భాష పలుకడం లోని మెళకువలు తెలుసుకున్నాం. ప్రతి నెలా మొదటి తారీకున  భారత్, దాని చుట్టుపక్కల ఉన్న దేశాలు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్, (సార్క్) దేశాల నుంచి కార్యక్రమాలు ప్రసారం అయ్యేవి. వాటి నుంచి ఆ యా దేశాల సంస్కృతీ, సంప్రదాయాలు, ఆర్ధిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఆ యా దేశాల కల్చరల్ heritage , వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. మేము హిందీ ప్రోగ్రాం లు చూసి హిందీ మాట్లాడడం నేర్చుకున్నాం కాబట్టి, మా ఉచ్చారణలో దక్షిణ భారత యాస కనబడదు. subtitles తో ప్రాంతీయ భాష చిత్రాలు చూసాము కాబట్టి, ఇంగ్లీషు కూడా మేము టీవీ ద్వారానే నేర్చుకున్నాము అని చెప్పాలి. అలాగే ఆ చిత్రాలు చూడడం వలన ఆ యా రాష్ట్రాల కల్చరల్ heritage గురించి తెలుసుకున్నాము. అప్పట్లో ప్రసారం అయిన సురభి కార్యక్రమం ద్వారా ఎంతో జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాము. అలాగే, రంగోలి, చిత్రహార్ ద్వారా  గుల్జార్, జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖ రచయితల రచనా శైలి తెలుసుకున్నాము. టీవీ మాధ్యమం ద్వారా మేము మంచే నేర్చుకున్నాము కానీ, చెడిపోలేదు.

వీధిలోని పిల్లలు అందరూ టీవీ చూడడానికి ఒకచోటకు చేరేవారు అని చెప్పా కదా, ఇందులో ఎవరి పుట్టిన రోజులు అయినా, ఎవరైనా పరీక్షలు పాస్ అయినా, ఆ ఇంట్లో చిన్న గెట్ టుగెదర్ లాంటిది జరిగేది. అసలు అప్పటి నుంచే ట్రీట్ ఇవ్వడం అనేది అలవాటు అయింది అందరికి. అంతవరకు అలాంటివి చిన్న చిన్న ఊళ్ళల్లో అలవాటు లేదు. తరువాత తరువాత అందరి ఇళ్ళల్లోను టీవీలు వచ్చేసాయి. మనుషుల మధ్య దూరం పెరిగి పోయింది. ఈ 24 గంటలు చానల్స్ వచ్చాక అన్ని సినిమా ఆధారిత కార్యక్రమాలే. చూడడానికి, నేర్చుకోవడానికి ఏమి మిగల్లేదు. ఇప్పటి ఏంకర్ల భాష మరీ ఘోరం, ఎంత తక్కువ చెప్పుకుటే అంత మంచిది.

>>>>> మీలో ఎంతమందికి, పొగ లేని పొయ్యిలు, ( స్మోక్ లెస్ చుల్హ ), పిమ్పాల్ బట్టి గ్రామం గురించి గుర్తు ఉంది,? గుర్తు ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి. ఏదో సరదాకి.

Tuesday 13 May 2014

ఆరోజుల్లో..... 5

మా వేసవికాలం సెలవులు.....

మా వేసవి సెలవుల సందడి పరీక్షల చివరి రోజు నుంచే మొదలయ్యేది. కానీ ఆఖరి పరీక్ష వ్రాసి వచ్చిన రోజు ఏమి తోచేది కాదు. మరునాడు ఉదయాన్నే కుర్చుని సగం వ్రాసి ఉన్న నోటు పుస్తకాల నుంచి ఖాళీ కాగితాలు తీసి, వాటిని మరుసటి సంవత్సరానికి చిత్తు పుస్తకాలుగా కుట్టుకునే వాళ్ళం. పరీక్షల ముందరే మా పై క్లాసు వాళ్ళు ఎవరెవరు  ఉన్నారో చూసుకుని పరీక్షల మరునాడు వాళ్ళ దగ్గరి నుంచి టెక్స్ట్ పుస్తకాలూ తెచ్చుకుని వాటిని కొంచెం రిపేరు చేసుకుని మరుసటి సంవత్సరానికి తయారుగా ఉండేవాళ్ళం. మేము చదివిన టెక్స్ట్ పుస్తకాలు ఎవరికైనా ఇచ్చేయడం కుడా ఆరోజే. వాడేసిన నోటు పుస్తకాలు తూకానికి అమ్మేయడం. ఎవరైనా కావాలంటే ఇచ్చేయడం అన్ని ఆరోజే. లేట్ చేస్తే మళ్లీ మర్నాటి నుంచి ఆడుకునే టైం తగ్గిపోతుంది కదా....

ఇంకా మరుసటి రోజు నుంచి మా ప్రతాపం మొదలు. స్కూలు ఉన్నరోజుల్లోను, లేనప్పుడు కూడా తెల్లవారి 4,5 గంటలకే లేచేవాళ్ళం. సెలవలలో కుడా 5 కి లేచి పనులు అన్నీ ముగించుకుని , అన్నం తినేసి 7 కల్లా లైబ్రరీ కి వెళ్ళిపోయే వాళ్ళం. మళ్లీ 11కి వాళ్ళు మేము మూసేస్తున్నాము మీరు వెళ్లి రండి అనేంత వరకు అక్కడే కుర్చుని, పాత చందమామలు, ఇంకా చిన్న పిల్లల పుస్తకాలు చదవడమే. వచ్చి ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేవాళ్ళం. మధ్యాహ్నం పడుకోవడం ఆ తరం లో నిషేధం. అందుకని మధ్యాహ్నం ఎండవేళ ఇంట్లో కుర్చుని ఆడుకునే ఆటలు చదరంగం. అష్టా చెమ్మా, చింతపిక్కలు, ఇవ్వన్ని. మళ్లీ 4 గంటలకల్లా లైబ్రరీ కి తయారు. మళ్లీ 7కి వాళ్ళు మా మొహం మీదే తలుపులు వేసేదాకా ఉండి కొన్ని పుస్తకాలూ ఇంటికి తెచ్చుకోవడం. ఇంటికి వచ్చి మళ్లీ అవి చదువుకోవడం. అప్పట్లో టీవీ లు లేవు కదా.....రేడియో లో వచ్చే ప్రోగ్రాములు విని రాత్రి 9కల్లా పడుకొని మళ్లీ 4 కు లేవడం. ఇదీ మా దినచర్య.

పరిక్షలు ఇంకా కొన్ని రోజుల్లో అయిపోతున్నాయి అనగా మా అమ్మగారు చిన్న నోటు పుస్తకం లో హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయం, నిత్య ప్రార్ధనా శ్లోకాలు ఇటువంటివి వ్రాసి రెడీ చేసే వారు. సెలవులు మొదటి రోజు నుంచి ఆ 50 రోజుల్లోనూ అవి అన్ని నేర్చుకోవాలి అన్నమాట. ఏరోజు చదవక పోయినా బడితె పూజే. తప్పించుకునే వీలు లేదు. అలాగే, రామాయణం, భాగవతం వచనం లో చదివించే వారు. మధ్యాహ్నం ఖాలీ ఉన్నపుడు అవి చదవ వలసినదే. అందులో ఎక్కడ ప్రశ్న అడిగినా చెప్పాల్సిందే. ఇంట్లో అంత క్రమశిక్షణ ఉండేది. ముద్దు చేసే చోట ముద్దు చేయడం, చేతికి పని చెప్పాల్సిన చోట చెప్పడం. ఇది ఆ రోజుల్లో పెంపకం తీరు. రెంటికీ కొరత ఉండేది కాదు.

మా లైబ్రరీ అలవాటు ఏ ఊరు వెళ్ళినా మారేది కాదు. సెలవులలో అమ్మమ్మగారి ఊరు వెళ్ళినా, ఇంకెక్కడికి సరదాగా వెళ్ళినా లైబ్రరీ షెడ్యులు మాత్రం మారేది కాదు. సంవత్సరం అంతా బడికి వెళ్లి వచ్చిన తర్వాత రోజూ ఆడుకునే వాళ్ళం కాబట్టి సెలవులలో ఆడుకోవాలి అనే తాపత్రయం ఉండేది కాదు.

స్కూలు ఉన్న రోజుల్లో కూడా సాయంత్రం స్కూలు నుండి ఇంటికి వచ్చి, టిఫిన్ తినేసి, హాయిగా 2,3 గంటలు ఆడుకునే వాళ్ళం. ఆ తరువాత స్నానం, చదువు. తెల్లవారి లేచి సంగీత సాధన, ఇంటి పనులు మాములే. ఎంత పెద్ద క్లాసులో ఉన్నా,,వార్షిక పరీక్షలు అయినా, ఇంటి పనికి డుమ్మా కొట్టడానికి వీలు లేదు. పని నేర్చుకోక పొతే ఎలా అని కేకలేసేవారు.

మా చిన్నతనం లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అంటే ఇప్పటిలా వేడి వేడి టిఫీనులు కాదు. చద్దన్నం లో ఇంత చింతకాయ పచ్చడో, మరేదైనా ఊరగాయో, వేసుకుని, పెరుగు వేసుకుని తినేయడమే. మళ్లీ మధ్యాహ్నం వంట అయ్యేవరకు పెద్దవాళ్ళని నస పెట్టకుండా మా ఆటలు మావి. సైకిల్ తొక్కడం, ఎవరి ఇంట్లో అయినా పెద్ద పెద్ద చెట్లు ఉంటె ఉయ్యాలా కట్టుకోవడం, వీధంతా మా సందడే. ఎవరి ఇంట్లో అయినా గోరింటాకు చెట్టో, దబ్బ చెట్టో ఉంటె, మా లోని కోతులు నిద్ర లేచేవి. నామకః వారి అనుమతి తీసుకోవడం, చెట్టు అంత దులిపి పారేయడం. దబ్బ ఆకులు పలుచని మజ్జిగ లో వేసి ఉప్పు, జీలకర్ర వేసుకొని తాగితే ఎండ దెబ్బ తగలదు. గోరింటాకు చెట్టు ఉన్నవాళ్ళు కోసుకోవడానికి ఒప్పుకున్నట్టే ఒప్పుకొని తీరా అంతా కోశాక, సగమే ఇచ్చేవారు. మిగతాది వాళ్ళే ఉన్చేసుకునే వారు. అప్పుడు చూడాలి మా ఉక్రోషం. ఆ గోరింటాకు రుబ్బదానికి కూడా వంతులే. ఎందుకంటే రుబ్బే వారికీ కుడి అరచేయి అంతా పండుతుంది కదా....

ఇంకా ఎవరైనా చుట్టాలు వస్తే అదోరకం సందడి. ఇల్లంతా గోల గోల. మాకు అన్నం తినడం లో ఒక రాయితీ ఉండేది. మాతో పెట్టుకుంటే తొందరగా అవదని పెద్ద వాళ్ళు అందరికి అన్నం కలిపి చేతిలో ముద్దలు పెట్టేసేవారు. అలా తినడం చాలా సరదాగా ఉండేది.

మళ్లీ స్కూళ్ళు తెరవడానికి 20 రోజుల ముందు నుంచి పై క్లాసుల పుస్తకాలూ చదవ వలసినదే. స్కూళ్ళు తెరిచేసరికి సగం సిలబసు వచ్చేసి ఉండాలి. అందులో పాఠాలు అర్ధం కాలేదనుకోండి, ఆ వీధిలో ఎవడో అన్నయ్యో, అక్కో ఉంటారు కదా పెద్ద క్లాసులు చదివే వాళ్ళు, వాళ్ళ దగ్గర చెప్పిన్చుకోవలసినదే. ఆ అన్నో, అక్కో వీక్లీ రిపోర్ట్ ఇవ్వడం, మేము ఎలా చదువుతున్నామా అని. అప్పట్లో అదో పెద్ద నస అని భావించే వాళ్ళం.

మాకు వేరే సమ్మర్ కోచింగ్ క్లాసులు ఉండేవి కాదు. ఏవి నేర్చుకోవాలన్నా ఇంట్లోనే. కుట్లు, అల్లికలు, వంటలు, ముగ్గులు, డ్రాయింగ్, అన్నీ. ఆడుతూ, పాడుతూ చదువుకోవడం. కడుపు నిండా తినడం, చేతి నిండా పని చేయడం. అవే మాకు తెలిసిన సూత్రాలు.

(సశేషం)

Saturday 10 May 2014

ఆ రోజుల్లో......4

ఉమ్మడి కుటుంబాలు.

ఆరోజుల్లో అంటూ అన్ని విషయాలు ముచ్చటించు కుంటూ ఉమ్మడి కుటుంబాల గురించి చెప్పుకోకపోతే ఎలా? ఉమ్మడి కుటుంబాలు అంటే ఒకే ఇంట్లో రెండు మూడు తరాలకు చెందిన అన్నదమ్ముల కుటుంబాలు నివసించడం. పూర్వం రోజుల్లో అందరికి వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి ఇంట్లోని అన్నదమ్ములందరూ ఒకే చోట ఉండడానికి వీలు ఉండేది. ఇంట్లో రెండు మూడు తరాల వాళ్ళు ఉండే వారు కాబట్టి ఇల్లంతా సందడిగా ఉండేది. ఈ ఉమ్మడి కుటుంబాల వల్ల చాల లాభాలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవారి అజమాయిషీ ఉంటుంది కాబట్టి పిల్లలు మంచి క్రమశిక్షణ తో పెరుగుతారు. పిల్లలకు చిన్నతనం నుంచి, వినమ్రత, పెద్దలంటే గౌరవం, భయం, భక్తీ, పంచుకునే స్వభావం, సంయమనం, ఆత్మ స్థైర్యం  అన్నీ అలవడతాయి. ఆదాయం  పలు మార్గాల ద్వారా వచ్చినా ఇంటి ఖర్చుఅంతా ఒక చేతి మీదనే జరుగుతుంది కాబట్టి, అనవసర ఖర్చులు, ఆడంబరాలు, ఉండడానికి అవకాసం లేదు. ఇంట్లో పిల్లలకు కానీ, పెద్దలకు కానీ చెడు అలవాట్లు రావు. పిల్లలకు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, తాత, నానమ్మలు కానివ్వండి, పెద్దమ్మా, పెద్దనాన్నలు కానివ్వండి, మంచి మనో వికాస వైద్యులుగా ఉండేవారు. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలలో పెరిగిన పిల్లలకు ఆత్మ న్యూనతా భావం ఏర్పడదు. నాకు ఏ ఇబ్బందులు వచ్చినా, ఇంతమంది నా వాళ్ళు ఉన్నారు అనే ధైర్యం ఉంటుంది. అలాగే ఇంట్లో ఏ శుభ కార్యాలు, అవసరాలు వచ్చినా ఆర్ధిక బలం, అంగ బలం ఉంటుంది. అయితే ఉమ్మడి కుటుంబాలను నడిపే పెద్ద, మంచి సమర్ధత కలిగి ఉండాలి. ఇంట్లోని కొడుకులు అంటే రక్త సంబంధీకులు కానీ రెండు, మూడు తరాలకు చెందిన కోడళ్ళు అంటే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ నేపధ్యాల నుంచి వచ్చిన వారు ఉంటారు కాబట్టి వారి మధ్య సయోధ్య కుదర్చడం అనేది అసలైన పరీక్ష. ఇంట్లో ఏ ఇబ్బందులు, గొడవలు వచ్చినా ఇంటి పెద్ద తీర్చేవాడు. తండ్రి కానీ, ఇంటి పెద్ద కొడుకు కానీ ఇంటి బాధ్యతలు తీసుకునే వారు. మిగిలిన వారు కూడా వారి మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. వారికి ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చేవారు. ఇంటి పనుల పంపకం, డబ్బు పంపకం, ఇంటి ఖర్చు అంతా వారి చేతుల మీదుగానే జరిగేది. ఇంట్లో అంత మంది ఉన్నా, ఎవరికీ అసంతృప్తి ఉండేది కాదు. పెద్ద కోడలికి అత్తగారి తర్వాత అంత మర్యాద జరిగేది. పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణ, ఇవన్ని ఎంతో సులువుగా సహజంగా జరిగిపోయేవి. నేను అందరి కోసం, నా కోసం అందరూ అనే భావం అందరిలోనూ ఉండేది.

ఇంట్లో ఆడవారికి చేతినిండా పని ఉండేది. ఆ రోజుల్లో సంతానం కుడా ఎక్కువగా ఉండేది కాబట్టి, ఆడవారికి నడివయసు వచ్చేవరకు పిల్లల పెంపకం, పోషణ తోనే సరిపోయేది. అదనంగా ఇంట్లో పెద్దవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉంటే ఆ పని కుడా ఉండేది. కడగొట్టు పిల్లల చదువు, బాధ్యత తీరింది అనుకొనే లోపు పెద్ద పిల్లల పెళ్ళిళ్ళు, వారి పురుళ్ళు, సంతానం బాధ్యత మళ్లీ వచ్చి చేరేది. వాళ్ళు ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా ఉండేవాళ్ళు, అందువల్ల నడివయసు వచ్చినా ఒంటరి తనం  అన్న మాటే ఉండేది కాదు. అలాగే ఎక్కువ కాన్పులు ఉండేవి కాబట్టి, అనవసరపు సర్జరీలు ఉండేవి కాదు కాబట్టి వారిలో హార్మోన్ల అసమతుల్యత అనే మాటే లేదు. అందువల్ల అప్పటి స్త్రీలు శారీరికంగా మానసికంగా కుడా బలంగా ఉండేవారు. ఇంటి బాధ్యత అంతా ఎక్కువగా మగవారే చూసుకునే వారు కాబట్టి కొంచెం వెసులుబాటు గా ఉండేవారు. ఇప్పుడు చుడండి, పిల్లలు 8,9 క్లాస్సులకు వచ్చేసరికి హాస్టల్ కి వెళ్ళిపోతున్నారు, అక్కడి నుంచి పై చదువులు, ఉద్యోగాలు, పెళ్లిల్లు, ఇంక వాళ్ళు ఇంట్లో ఉండేది ఎప్పుడూ? ఇంట్లో తల్లులకు ఒంటరి తనం. దాని నుంచి అనేక రకమైన మానసిక వ్యాధులు. ఉమ్మడి కుటుంబాలలో ఉండే స్త్రీలకూ ఈ రకమైన బాధలు ఉండేవి కావు. అలాగే పెద్దల సంరక్షణ గురించి వచ్చేసరికి, అందరు కలిసే ఉండేవారు కాబట్టి వాటాలు, వంతులు ఉండేవి కావు.

అయితే ఉమ్మడి కుటుంబాలు సరిగా నడవడం అనేది కుటుంబ పెద్ద యొక్క సమర్ధత మిద ఆధారపడి ఉంటుంది. తండ్రి కానీ, పెద్ద కొడుకు కానీ అంత సమర్ధత లేని వాళ్ళైతే, ఆ కుటుంబాలలో వచ్చే గొడవల గురించి చెప్పలేము. అలాగే ఒక ఉమ్మడి కుటుంబం యొక్క అ పరువు ప్రతిష్టలు ఆ ఇంటి కోడళ్ళ మిద కుడా ఆధార పడి ఉంటాయి. ఏ ఇంట్లో అయినా సరే, ఆడవాళ్ళ మధ్య ఒక్కసారి గొడవలు వస్తే, ఇంక ఆ మగవాళ్ళ మధ్య కూడా బంధాలు పలుచబడతాయి. అందుకే ఇంటి కోడళ్ళకు "ఈ ఇల్లు, కుటుంబం మనది, వీళ్ళు అందరు మనవాళ్ళు " అనే భావం ఉండటం చాలా ముఖ్యం.

ఇప్పుడు ఉద్యోగాల బట్టి, చదువుల బట్టి అందరు వివిధ ప్రాంతాలలో ఉండవలసి వస్తోంది. మారుతున్నా కాలం, పెరుగుతున్న ధరల బట్టి స్త్రీలు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తోంది. ఇంట్లోను, బయట సమర్ధించడం అంటే ఎంత కష్టం? పనుల కోసం ఎంత మంది పని మనుషులు ఉన్నా, ఎన్ని మెషిన్లు ఉన్నా, ఇంటి బాధ్యత మనదేగా? ఈ తరం స్త్రీలు కష్ట పడుతున్నారా? సుఖ పడుతున్నారా అనే సందేహం వస్తు ఉంటుంది  నాకు. ముఖ్యంగా ఈ రోజుల్లో వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా, మనసులలో ఒంటరి తనమే అనుభవిస్తున్నారు. పైకి ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది నిష్టుర సత్యం. కాదంటారా?
ఆ రోజుల్లో ......3
ఇల్లు అలకగానే పండగ కాదు. .... ఇది సామెత. కానీ పూర్వపు రోజుల్లో అది నిజం, ఎందుకంటే పండుగ వస్తోంది అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇల్లు అలకడం తో సహా ఎన్ని పనులు? ఇల్లు అలకడం అంటే ఇప్పటి వాళ్ళకి తెలియదు. అప్పట్లో చాలా శాతం ఇళ్ళకు--- పెంకుటిల్లు అయినా సరే, నేలలు (ఫ్లోరింగ్) గోడలు, మట్టివే ఉండేవి. బంకమట్టి, పేడ కలిపి బాగా కాలితో తొక్కి మెత్తగా చేసి ఆ mixture తో నేలలు అలికేవారు. దానిమీద చక్కగా బియ్యపు పిండి తో కానీ, సుద్దతో కానీ ముగ్గులు పెట్టేవారు. బియ్యం బాగా నానపెట్టి దానిని మెత్తగా రుబ్బి (మిక్సి లో కాదండోయ్, రోట్లో ) దానిలో ఒక గుడ్డ ముంచి చేతిలో ఆ గుడ్డను పట్టుకొని, నెమ్మదిగా కావలసినంత పిండి (లిక్విడ్ ) మధ్య వేలు మీద పడేలా ఆ గుడ్డను పిండుతూ, ఆ వేలిమిదకు వచ్చిన పిండితో ఇల్లంతా ముగ్గులు పెట్టేవారు. అంటే ఇప్పుడు కలంకారి పెన్నులు ఉంటాయి కదా, అల్లాగ అన్నమాట. లేదా నాము సుద్దను నీటిలో నానబెట్టి దానితో చేతివేలితోనే ముగ్గులు పెట్టేవారు, ఏ విధమైన బ్రష్ లు, మరే ఉపకరణాలు లేకుండా.
పేడతో అలకడం వలన బాక్టీరియా ఉండదు. కింద మట్టి నేల, పైన పెంకుల కప్పు, ఇల్లు ఎండ ప్రభావం పడకుండా చల్లగా ఉండటానికి ఇంకా ఏమి కావాలి? అందుకే అప్పుడు ఏ.సి. ల అవసరం రాలేదు. ఈ ఇల్లు అలికె ప్రక్రియ పూర్తీ అయిన తరువాత పండుగ కు కావలసిన పిండివంటలు తయారీ మొదలు. పాపం ఆ కట్టెల పొయ్యి మీదా ఇత్తడి, ఇనుప మూకుళ్ళలో చెమటలు కక్కుకుంటూ బోలెడు పిండివంటలు చేసేవారు ఆ తరం ఇల్లాళ్ళు. ఇప్పట్లాగా స్వీట్లు ఒకటి రెండు అని లేక్కపెట్టుకొని తినడం కాదు కదా అప్పుడు. అటు వచ్చి ఒకటి, ఇటు వచ్చి ఒకటి నోట్లో వేసుకోవడమే, లెక్కా పత్రం ఉండేదికాదు తినడానికి. సున్నుండలు, లడ్డులు, కాజాలు జంతికలు, చక్కిలాలు, అరిసెలు, ఇటువంటివి నిలువ పిండివంటలు డబ్బాల్లోకి ఎత్తేవి అయితే, పండుగ నాడు ఏరోజు కారోజు చేసే బొబ్బట్లు, గారెలు, పులిహోర వంటివి మళ్లీ వేరే. ఈరోజున నలుగురు సభ్యులు ఉన్న కుటుంబానికి స్వగృహ ఫుడ్స్ లో ఆర్డర్ ఇస్తే పావుకిలో స్వీట్లతో పండుగ అయిపోతోంది. ఎన్ని రోజుల పండుగ అయితే అన్ని పావుకిలోలు. షాంపూ తలంట్లు, స్వగృహ పిండివంటలు. ఇంటికి వచ్చే కొడుకులు, కూతుర్లు కుటుంబాలు, ఇంతమందికీ వంటలు, పిండివంటలు....తిన్నవి తినడం కాకుండా తిరిగి ఊళ్ళకి వెళ్ళేవాళ్ళకి ఇచ్చేందుకు మళ్లీ వేరే డబ్బాలు. ..... ఇంట్లో ఆడపిల్లలు ఉంటె వాళ్ళకు పట్టు పరికిణీలు, కాలాన్ని బట్టి మల్లెలు కానీ, చేమంతులు కానీ, మొగలి రేకులతో కానీ పూల జడలు కుట్టటం ..... దసరాకి బొమ్మల కొలువులు, సంక్రాంతి రోజుల్లో భోగిమంటలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, బుడబుక్కల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, పిట్టల దొరలూ, మగపిల్లలకు గాలిపటాల పందేలు, విల్లమ్ములు, ఇలా ఎన్నో సరదాలు, సందడులు ....ధనుర్మాసం నెలరోజులు రోజూ హరిదాసుకు బియ్యం వెయ్యటం అలవాటు అయినాక, సంక్రాంతి పండుగ తర్వాత రోజు హరిదాసు రాలేదు అంటే ఏదో బెంగగా ఉండేది. ఇక శ్రావణ మాసం అయితే, ఇంట్లో నోములు, బయట పేరంటాలు, ముత్తైదువల పట్టు చీరల గరగరలు, వర్షంలో తడుస్తూ పేరంటాలకు వెళ్ళే ఇల్లాళ్ళు, .... కొంచెం ఆధ్యాత్మికత కలసిన ఆనందాలు, .......అబ్బో, ఆ రోజులే వేరు. ఇపుడు పండగ అంటే టీవీ లో స్పెషల్ ప్రోగ్రాములు, బ్లాక్ బస్టర్ సినిమాలు, బయట హోటల్ డిన్నర్లు. ... కాలం మారుతోంది.... మన సరదాలు మారుతున్నాయి. మన ప్రాధాన్యతలు మారుతున్నాయి. మాతరం వాళ్ళు మారుతున్న విధానాలు చూసి బలవంతంగా సరిపెట్టుకుంటున్నారు. మా పై తరం వాళ్ళు సర్దుకోలేక పోతున్నారు. అదే విషాదం. అక్కడే తరాల అంతరం బయట పడుతోంది.
మా రోజుల్లో......
అప్పట్లో ఇంట్లో ఉన్న మగపిల్లలకి, ఆడపిల్లలకి ఇంటి పనుల పంపకం వేరు వేరుగా ఉండేది. ఆడపిల్లలు ఇంట్లో పనులు .. అంటే, అప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద లోగిళ్ళు, ఉండేవి కదా, తెల్లవారే లేచి ఆ పెరళ్ళు, వాకిళ్ళు ఊడ్చి , కల్లాపి జల్లి, ముగ్గులు వేయడం, బట్టలు ఉతకడం, ఇంటి పనిలో అమ్మకు , నానమ్మకు సహాయం చేయడం ఇవి ఆడపిల్లల పనులు. ఇంకా ముందు రోజుల్లో, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ లేని రోజుల్లో కాలువలు, చెరువులకు వెళ్లి బట్టలు ఉతకడం, కాలువల నుండి మంచి నీరు తేవడం ఇటువంటివి. మగపిల్లలు అయితే ఇంట్లో బావి లేకపోతే ఇంటికి కావలసిన నీళ్ళు అన్ని కావిళ్ళు వేసుకొని ఇంటిలో ఉండే గుండిగ లలో నింపేవారు. గుండిగలు అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు బహుశ.... ఒక 30, 40 బిందెల నీరు పట్టే పెద్ద పెద్ద పాత్రలు ఇత్తడి తో తయారు చేసినవి. వీటిని గుండిగలు అంటారు. వాటిలో అడుగున చక్కగా శుభ్రం చేసి కడిగిన 2 బకెట్ల ఇసుకను పోసి అందులో కాలువల నుంచి నీరు తెచ్చుకొని నిలువ చేసి ఉంచుకునేవారు. కాలువ నీరు మంచి నీరు అన్నమాట. అవి తాగడానికి ఉపయోగిస్తాయి. కింద ఇసుక వేయడం వలన బాక్టీరియా ఇబ్బందులు ఉండవు. మరి ఈ రోజుల్లో లాగా అప్పుడు వాటర్ ఫిల్టర్ లు లేవు కదా. అయిన నీటి వలన వచ్చే జబ్బులు ఏవి వచ్చేవి కావు అప్పుడు మరి. జాగ్రత్తలు ఎక్కువ అయిన కొద్దీ జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
వాస్తవం చెప్పాలంటే అప్పుడు ఆడపిల్లలు ఒక వయసు దాటినా తర్వాత ఇంటిపనులకే పరిమితం అయ్యేవారు. ఆడపిల్లలకు చాకలి పద్దు వ్రాసుకొనే చదువు వస్తే చాలు అనుకునేవారు. చదువు లేకపోయినా సంసారం గుట్టుగా నడుపుకునే వారు ఆ రోజుల్లో, భర్త చాటున , అత్తా మామల చాటున జీవితం వెళ్ళిపోతే చాలు అనుకునేవారు. చదువు ఎక్కువైనా కొద్దీ సమానత్వం, స్వేచ్చ, స్వాతంత్ర్యం అనే భావాలు ఎక్కువ అవుతాయి అని పూర్వులు గ్రహించారేమో. ఇలా చెప్తున్నందుకు నన్ను కొందరు తిట్టుకోవచ్చు కానీ నెమ్మదిగా ఆలోచిస్తే ఇందులో వాస్తవం మీకే బోధ పడుతుంది.
మొదట్లో వంట చేయడానికి కట్టెల పొయ్యెలు ఉండేవి. తరువాత వచ్చినవి పొట్టు పొయ్యిలు. అంటే ధాన్యం ఆడించిన తర్వాత వచ్చే పొట్టు ను తెచ్చుకొని అది పోయ్యిలలో కూరుకొని దాని మిద వంట చేసేవారు. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం కూడా ఒక పద్దతిగా జరగాలి. ఈ మాత్రం లూజుగా ఉన్నా పొయ్యి సరిగా మండదు. ఈ పోయ్యిలలో పొట్టు కూరడం, కట్టెల పోయ్యిలకు వంట చెరకు చీరడం ఇవన్ని మగ పిల్లల పనులు. ఈ పనులన్నీ వాళ్ళు చదువుకుంటూనే చేసేవారు. మధ్యలో బొగ్గుల కుంపట్లు కూడా వచ్చాయి. అంటే ఇనుముతో చేసిన పొయ్యి లో బొగ్గులు సహాయంతో వంట చేసేవారు. అవి పదునుగా మండటానికి అంటే కావలసిన స్థాయి ప్రకారం మంట రావడానికి బోలెడు కసరత్తు చేయాల్సి వచ్చేది. కట్టే పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల వలన బోలెడు పొగ. పాపం ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఈ కష్టాలన్నీ పడ్డారు. ఈ కట్టెలు కానీ, పొట్టు కానీ, బొగ్గులు కానీ బస్తాలలో నిలువ ఉంచుకునేవారు . వర్షాకాలం అవి తడవకుండా చూసుకోవడం, ఆ బస్తాల కింద పురుగు, పుట్రా చేరకుండా చూసుకోవడం ఇవన్ని ఇంకోరకం ఇబ్బందులు.
గుండిగ , కుంపటి చిత్రాలను క్రింద చూడండి.
(సశేషం)
మా రోజుల్లో.....
మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు మా చిన్నతనంలో మాతో ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆ కబుర్ల మధ్యలో మాటమాటకీ మా రోజుల్లో అయితేనా....అని వాళ్ళ చిన్నతనం లో సంగతులు చెప్తూ ఉండేవారు. బంగారం ఖరీదు ఆ రోజుల్లో తులం 60 రూపాయలు ఉండేదిట. ఇప్పట్ల లాకర్లు అవి లేకపోవడం చేత, ఇంట్లో నే ఏదో ఒక మూల గొయ్యి తీసి అందులో నగలన్నీ మూటకట్టి పెట్టేవారుట. మా తాతగారు వైద్యుడు. అప్పట్లో వైద్యం చేసినందుకు ఏమి ఫీసు తీసుకోకపోగా, పక్క గ్రామాల నుంచి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు వారి ఇంట్లోనే భోజన సదుపాయం చేసేవారుట. ఇక ఆదాయం అంటే పంటల మిద వచ్చేదే. అందులోనే, పాలేర్లు, చాకలి వాళ్ళు, పని మనుషులు అందరికి ధాన్యం కొలవడం. ఇప్పట్లా పని వాళ్ళకు డబ్బు రూపేణా ఇచ్చే వారు కాదుట. అందరికీ ధాన్యం కొలవడమే. కాలక్రమేణా పొలాలు అన్ని అమ్మేసుకున్నారనుకోండి. ఇక వచ్చిన రోగులు కూడా డబ్బు తీసుకోరు కదా అని ఉత్త చేతులతో రాకుండా వాళ్ళ పొలాల నుంచి ఏదో, పండో, కాయో తెచ్చేవారుట. అవి మళ్లీ అశ్రితులకే ఇచ్చేసేవారు. అలాగే మామిడి పండ్లు, సీతాఫలాలు అటువంటి పండ్లు కొనుక్కొనే పని లేదుట. తెలిసిన వారు బుట్టలతో తెచ్చి ఇవ్వటమే. మా చిన్నతనాలలో 100 లెక్కన కొనేవారు మా నాన్నగారు. ఇపుడు డజన్లు లోకి దిగిపోయాం. కొన్నాళ్ళు పొతే మన పిల్లలు 2,3 లెక్కన కొనుక్కోవాలో ఏమిటో.
మా నానమ్మగారు 82 సం. జీవించారు. అంతవరకూ వంటింటి అధికారం కోడళ్ళకు ఇవ్వకుండా తన అజమాయిషీ లోనే ఉంచుకున్నారు. నా పిల్లలకు నేనే వండి పెట్టుకుంటాను అనేవారు. మా అమ్మమ్మగారు 75 ఏళ్ల వరకు కుట్లు అల్లికలు చక్కగా చేసేవారు. ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చునేవారు కాదు. కడుపు నిండుగా తిని చేతినిండా పని చేసుకునే వారు ఆరోజుల్లో, నెయ్యి, స్వీట్స్, ఊరగాయలు, అన్నీ చక్కగా లిమిట్ లేకుండా తినేవారు. తినే వాటి మీద ఏ ఆంక్షలు ఉండేవి కావు. ఇప్పుడు నెయ్యి తినకూడదు, స్వీట్స్ మానేయాలి, ఉరగాయలు మానేయాలి అని కెలోరీలు లేక్కపెట్టుకొని తినడం వచ్చాకనే అసలు రోగాలు ఎక్కువ అయ్యాయేమో. ఇపుడు 30 ఏళ్ల వాళ్ళకి కూడా రక్తహీనత, కాల్షియమ్, విటమిన్ లోపాలు. ఈ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక విటమిన్ డి. కూడా తక్కువ అయిపోతోంది అందరికి. కూరలు, పండ్లు, పాలు అన్ని కల్తీ. తినేవాటిలో సారం ఉండటం లేదు. తిన్నది వంటపట్టడం లేదు. అన్నిటికి మందుల మీద ఆధారపడడమే. ఇవి కాకుండా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ ఇవి మళ్లీ కొసరు మనకి.
(సశేషం)
Like ·