Thursday 21 July 2016

ఇవాళ ఇంట్లో మగపిల్లలు ఉండడానికి, ఆడపిల్లలు ఉండడానికి తేడా ఏంటి అనేదాని మీద చర్చ మొదలైంది ఇంట్లో.....మా ఉదయం కాఫీ టైము మా చర్చా సమయం...లోకాభిరామాయణాలు అన్నీ ఆ టైములోనే...అప్పుడు చర్చ కొంచెం సుదీర్ఘంగా సాగిందంటే వంటకు ఉరుకులు, పరుగులే.....మాకున్నది ఇద్దరూ మగపిల్లలే కాబట్టి మావారు చాలా జాలిగా, ప్రేమగా మగపిల్లల పక్షాన మాట్లాడుతుంటారు...నా మొహం.....ఇంట్లో ఒక్క ఆడపిల్లైనా లేకపోతే అందమా, చందమా...మగపిల్లలకి కొండానికి ఏముంటాయి? అవే పేంట్లు, షర్ట్లు, వాటిల్లో కూడా ఓ రంగు వేరియేషన్ ఉండదు...అవే నలుపు, నీలం...పెద్ద బోరు...అవే గళ్ళు, అవే చారలు...ఇంకా పెద్ద బోరు..అదే ఆడపిల్ల అయితే, రకరకాల వెరైటీ డ్రెస్సులు,రంగురంగుల చీరలు,  వాటికి మళ్ళి మ్యాచింగ్ గాజులు ఎట్సెట్రా, పువ్వులు, పండగలకి పూలజడలు, అసలు నట్టింట్లో ఆడపిల్ల తిరిగితే ఆ అందమే వేరు....పండగ సెలవు వస్తే మగపిల్లలు తుర్రుమని పారిపోతారు బయటికి...ఇంట్లో ఉండి కాస్త పూజ, పని చేసేది ఆడపిల్లే అని నా ఉద్దేశ్యం..."దానికి మా పెద్దవాడు గండి కొట్టేస్తాడు.."ఇప్పుడు ఏ ఆడపిల్లలు జడేసుకుంటున్నారే, పువ్వులు పెట్టుకోవడానికి, మా కన్న బెత్తెడు జుట్టు ఎక్కువ వాళ్ళకి అంతేగా...అందరూ విరబోసుకుని తిరుగేవాళ్ళేకదా....నువ్వు నీ కాలం కబుర్లు చెప్పకే" అంటూ...పండగ పూట ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటే నీకు బయట తిరిగేది ఎవరో ఎలా తెలుస్తుందే...ఆడపిల్లలు కూడా బైకులేసుకుని తిరిగేస్తున్నారు తెలుసా అంటాడు...పండక్కి కనీసం గడపకి పసుపు పూసి, పూజకు వస్త్రాలు, యజ్ఞోపవీతాలు చేసే దిక్కు లేదు, పిండివంటల్లో చేయి సాయం చేసే తోడు లేదు....ఇలా అనుకుంటే, "అమ్మా ...ఎక్కువ ఆశపడకే...ఇంకా మేమే నయం...నీకు హడావిడిగా ఉంటే అన్న కూరలు తరిగిపెడుతున్నాడు...నాన్న ఇల్లు సర్దిపెడుతున్నారు...ఆడపిల్ల ఉంటే ఇవన్నీ కూడా నువ్వే చేసుకోవలసివచ్చేది" అని చిన్నవాడి వకాల్తా...


అది నిజమే...కాస్త పువ్వులు కోసుకుని రావాలన్నా, కూరలు తరగాలన్నా, తలనెప్పిగా ఉంటే కాస్త కాఫీ నోట్లో పోయాలన్నా ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలు చేస్తారు....అందరి టిఫిన్లూ అయ్యాక, నాకు దోసెలు కూడా వేస్తారు...
 
రకరకాల నగలు చేయించాలన్నా, ఓ వెండి సామాను కొనాలన్నా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఇంట్రస్టు ఉంటుంది...మగపిల్లలకు ఏం చేయిస్తాం? మెళ్ళో ఓ గొలుసు, చేతికి నాలుగు ఉంగరాలు తప్ప.....ఆడపిల్లకయితే మన శక్తి కొద్దీ ఒంటినిండా చేయించచ్చు.... "నీకు పోటీ వచ్చేవారు లేరు కదా...సంతోషించవేం!" మావారి దెప్పిపొడుపు.....మెళ్ళో వేసుకునే నగలకీ, తల్లో పెట్టుకునే పువ్వులకీ కూడా పంచుకునే పిల్లలు ఇంట్లో  ఇంకోకరు లేకుండా అన్నీ నాకే అంటే పరమ బోరు కదూ...

ఇంకా సంక్రాంతికి వాకిట్లో ముగ్గులు పెట్టాలన్నా నేనే, ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలన్నా నేనే....శ్రావణ మాసం పూజ కూడా ఏకాకిలా నేనొక్కదాన్నీ చేసుకోవడమే కదా...మగవాళ్ళకు ఇవన్నీ అర్ధం కావు.....గుమ్మానికి పచ్చని తోరణం, ఇంట్లో పట్టు పరికిణీ, పూలజడతో ఓ అమ్మాయి తిరుగుతుంటే ఇంటికి ఎంత కళ?


ఇప్పుడు ఆడ, మగ అందరు పిల్లలూ ఈ ఐ.ఐ.టి ల వేటలో పడి, ఎనిమిదో క్లాసు నుంచే హాస్టల్ బతుకులైపోయాయి....ఆడపిల్లలకు కూడా ఓ టీ పెట్టడం చేతకావడంలేదు...అది వాళ్ళ తప్పు కాదు పాపం..అక్కడ చదివి చదివి వస్తారని, మనమే వాళ్ళకి పని చెప్పకుండా రెస్ట్ ఇచ్చేస్తాం...

మన ఇంటి ఆడపిల్లలు అయితే, కాస్త మన అలవాట్లు, సంప్రదాయాలు, పద్ధతులు మర్చిపోకుండా నేర్పించచ్చు అని నా పిచ్చి ఆశ...ఆ అలవాటు అలా తరతరాలు కొనసాగుతుంది కదా అని.....

"మగపిల్లలైనా ఆడపిల్లలైనా మన సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించాలి...మారుతున్న కాలంలో కొన్ని కుదరవు కూడాను...వాటికి మనమే సర్దుకుపోవాలి...ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి అమ్మాయి అని నలుగురూ గొప్పగా చెప్పుకోవాలి.....అదే కదా మనకు కావల్సింది...." ఇదంతా ఏంటనుకుంటున్నారు? గ్లాసుడు కాఫీ నింపాదిగా తాగడం అయిపోయిన తర్వాత మా వారు చెప్పే నీతిబోధ.....నాకు...ప్రతి నెలరోజులకూ ఒకసారి ఈ టాపిక్ మా ఇంట్లో రాకమానదు....వెర్రిదానిలా నన్ను వాగించి, ఆఖరికి చిదానందస్వామి వారిలా మా ఆయన చేసే ప్రవచనం ఇది....అక్కడికి ఏదో సర్దుకుపోవటం నాకు చేతకానట్టు....పాతికేళ్ళ నుంచి ఈయనతో సర్దుకుపోవడంలా....హతవిధీ.....

ఈ ప్రవచనం చెప్పేసి, ఇంక పేపరు చేతిలోకి తీసుకున్నారు అంటే, ఇంక వెళ్ళి నీ వంట పని చూసుకో అన్నట్టు అర్ధం....మళ్ళి నేను, నా వంటగది మామూలే....

ఇదంతా విని (చదివి) ఆడపిల్లలు ఉండడానికి, మగపిల్లలు ఉండడానికి లాభనష్టాల మీద చర్చా కార్యక్రమం (కామెంట్ల ద్వారా ) మొదలుపెట్టకండేం...పుణ్యం ఉంటుంది....ఏదో సరదాగా రాసినది, సరదాగా తీసుకోండి.....

Sunday 10 July 2016

జ్ఞానానందమయం దేవం
నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వ విద్యానాం
హయగ్రీవముపాస్మహే!!

సదాశివ సమారంభాం
శంకరాచార్య మధ్యమాం.
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం !!

వ్యాసాయ విష్ణురూపాయ
వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే
వాసిష్టాయ నమోనమ:!!

గురుర్బ్రహ్మ గురుర్విష్ణు:
గురూదేవో మహేశ్వర
గుర్స్సక్షాట్ పరబ్రహ్మ:
తస్మైశ్రీ గురవే నమ:

గురుపూర్ణిమ అనగానే వ్యాసుమహర్షి గుర్తొస్తాడు....మన సౌలభ్యం కోసం వేదాలను విభజించడంతో పాటు, మానవులకు ఉత్తమ ధర్మాలను బోధించి, వారి జీవనాన్ని సుఖమయంగా చేసుకునేందుకు తగిన సూత్రాలతో కూడిన మహాభారతాన్నీ, మానవులను సరి అయిన ఆధ్యాత్మిక మార్గంలొ నడిపి సద్గతి వైపుగా మరల్చేందుకు ఆ పరమాత్మ లీలావిశేషాలతో కూడిన  శ్రీమద్భాగవతాన్ని మనకు అందించిన మహాగురువు వ్యాసులవారు....లౌకికంగా, ఆధ్యాత్మికంగా కూడా మానవుల శ్రేయస్సును కోరిన ఉత్తమగురువు ఆయన...ఈ గురుపూర్ణీమ నాడు ఆయనను స్మరించుకుని పూజించుకోవడం మన కర్తవ్యం...

పూర్వకాలం లో పిల్లలను చిన్నవయసులోనే తగిన గురువు వద్ద వదిలి గురుకుల పధ్ధతిలో విద్య నేర్పించేవారు తల్లితండ్రులు...గురువు, శిష్యుల మధ్య గొప్ప అనుబంధం ఉండేది...తల్లి తండ్రుల తరువాత పిల్లలకు తమ గురువుతోనే ఎక్కువ అనుబంధం ఉండేది..అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ తరువాత, పూజించడానికి అర్హునిగా గురువునే చెబుతారు...శిష్యులకు వారికి తగిన చదువు నేర్పి, సమర్ధులుగా రూపొందించడం, వారిలోని చెడు గుణాలను తొలగించి, మంచి మార్గంలో నడిపించడం ఇవన్నీ ఒక సద్గురువు యొక్క బాధ్యతలు.....ఇప్పుడు అటువంటి గురుకులాలు లేకపోయినప్పటికీ మన భవిష్తత్తును తీర్చి దిద్దుతున్న గురువులను పూజించుకోవటానికి ఈ గురుపూర్ణిమ ఒక మంచి అవకాశం....

ఈసందర్భంగా అపర శంకర అవతారమై వెలిసి, జగద్గురువు అని పిలువబడిన శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని తప్పకుండా స్మరించుకోవాలి..దుష్టాచారములను నశింపచేసి, శ్రౌత, స్మార్త క్రియలను సుసంపన్నం చేసి, వైదిక మార్గాన్ని పున:ప్రతిష్టించడానికి ఆ నీలలోహితుడే (శంకరుడు--ఈశ్వరుడు) శంకరాచార్యుల వారి రూపంలో అవతరించారని కూర్మ పురాణం చెప్తుంది. సాక్షాత్తూ వ్యాసులవారే శంకరులు వ్రాసిన భాష్యాలన్నీ ఉత్తమమైనవి అని, బ్రహ్మసూత్రాలను కేవలం శంకరులే సరి అయిన మార్గంలో అర్ధం చేసుకోగలిగారని ప్రశంసించారు.... అంతటి ఉత్తమ గురువులను గురుపూర్ణిమ నాడు పూజించి వారి ఆశీ:బలం పొందడం మన అదృష్టం.

వీరే కాక, సమర్ధ సద్గురువుగా శ్రీ సాయిబాబాను నమ్మేవారు కూడా ఈరోజు ఆయనను తమ జీవితాలను సరి అయిన మార్గంలో నడిపిస్తున్న గురువుగా భావించి ఆరాధిస్తారు.....ఆయనను మనస్పూర్తిగా విశ్వసించే భక్తులకు ఆయన ముస్లిమా, హిందువా అనే సంకోచం ఉండదు...

గురువుకు భారతీయ సంస్కృతిలో ప్రముఖ స్థానం ఇవ్వబడింది... వ్యాస మహర్షి జన్మించిన  ఆషాఢ పూర్ణిమ ను " గురు పూర్ణీమ" గా జరుపుకోవడం మన సంప్రదాయం....అందరికీ "గురుపూర్ణీమ "  శుభాకాంక్షలు....

Saturday 9 July 2016

"ఏవండీ! నాకు ఈసారి ఊరు మారినప్పుడు ఓ ఉయ్యాల బల్ల కొనరా!" వంటింట్లోంచి అడిగాను నేను....

"ఏంటి! మిరియాల పాలు కావాలా? ఏం? ఇంట్లో మిరియాలు లేవా? తెస్తాలే!!" మావారి జవాబు...హాల్లోంచి...

అప్పుడే అనుమానం వచ్చింది నాకు...ఈయన గారు ఏంచేస్తున్నారా అని, ఇలా అవకతవక జవాబు ఆయన నోటినుంచి వచ్చిందీ అంటే ఖచ్చితంగా దినపత్రిక పఠనం లో ఉండి ఉంటారు...పేపరు చదువుతున్న పతిదేవుణ్ణి పలకరిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి...ఎన్నేళ్ళొచ్చినా, ఎన్నేళ్ళ నుంచో  ఇంట్లో జరుగుతున్న భాగోతమే అయినా నాకు బుధ్ధి రాదు...మిరియాల పాలు కావాలంటే నేను కలుపుకోనూ.....ఎప్పుడూ వంటింట్లోనే వేళ్ళాడుతూ ఉంటాను కదా, ఏదో పొద్దున్నే గుర్తొచ్చి  ఉయ్యాల బల్ల అడిగాను...

చెప్పాలంటే నావి కొంచెం పాత టేస్టులు...మండువా లోగిలి ఇల్లు...(అంత కుదరకపోతే, ఓ పెద్ద వసారా, పెంకుటిల్లు,) ముత్తైదువలు ఇంటికి వస్తే బొట్టు పెట్టి ఓ కొబ్బరిబొండాం ఇవ్వడానికి వీలుగా ఓ కొబ్బరి చెట్టు, దొడ్లో ఓ నుయ్యి, ఓ పెద్ద తులసి కోట...ఇంటికి ముందువైపో, వెనక వైపో ఎత్తరుగులు.....ఇవన్నీ నా ఊహల్లో కట్టుకున్న ఇంటి నమూనా.....నా పిచ్చికి నన్నొదిలేసి ఓ నాలుగు గోడల అపార్టుమెంటు కొనేసారు మావారు...ఇప్పుడు ఇది సులువై పోయింది...రెడీమేడ్ జీన్సు, చొక్కా కొనుక్కుని వచ్చేసినట్టు, డబ్బు పట్టుకెళ్ళడం, సంతకం పెట్టేసి మనది అని మమ అనిపించుకోవడం....ఇల్లు సొంతం అవ్వాలంటే కష్టం లేదు..ఇసుక మోయాలనే బాధ లేదు, దింపిన ఇటుకలు ఎన్నున్నాయో లెక్కెట్టుకోక్కర్లేదు...నాలాంటి పిచ్చోళ్ళని పక్కనపెడితే..... ఇందులో ఉండే లాభాలు ఇందులో ఉన్నాయిలెండి....

ఉయ్యాలబల్ల మీద పడుకుని ఓ శ్రీపాద వారి కథలో, అమరావతి కథలో చదువుకుంటుంటే ఆ మజాయే వేరు...పక్కన సన్నగా జేసుదాసు గారి పాటలు వినిపిస్తుంటే, ఆక్షణాన్న ఊపిరి ఆగిపోయినా ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తామన్న నమ్మకం నాకు...


 ఏమిటో జీవితంలో చిన్న చిన్న సరదాలే తీరవు....పెద్ద పెద్ద కొరికలు వెంటనే తీరతాయి....ఇదేం రహస్యమో తెలియదు.....లక్ష రూపాయలు పట్టుకెళ్ళి ఓ నెక్లెస్ కొనుక్కోవడం అవుతుంది..స్టీలు సామాను కొట్లో 10 రూపాయలకు దొరికే బుజ్జి గుండుచెంబు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు పడుతుందో...అద్దాల్లోంచి ఊరిస్తూ ఉంటుంది బుజ్జి తల్లి......అక్కడ ఆగి కొనుక్కోవడమే అవ్వదు ఎప్పుడూనూ....నా సొంత ఇల్లు కూడా అలాగే కలలా మిగిలిపోయింది....

ప్చ్....కొన్ని కలలు అంతే...ఏం చేయలేం.....

Wednesday 6 July 2016

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం!!
పెళ్లి ఆలస్యము అవుతున్న అబ్బాయిలకు - సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం
పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు పరిష్కార మార్గాలు ఏంటి ?ఎందుకంటే నేటి కాలంలో అమ్మాయిలకు డిమాండు ( డిమాండు అనడం ఇక్కడ తప్పుగా భావించకండి )ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది. అందునా మంచి భార్వ లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి.
. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న మగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.
సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ !
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||
ఓ గ్రూప్ లో కొచ్చెర్లకోట జగదీష్ గారి కూరల కొనుగోలు కష్టాలు పోస్ట్ చూసాక, నా కష్టం కూడా మిత్రులతో పంచుకోవాలనిపించింది.
ఏమన్నా అంటే అన్నాం అని బాధపడతారు కానీ, శ్రీవారు కూరలకెళ్ళేటప్పుడు నేను పక్కన లేకపోతే, నాకే పనిష్మెంట్... ఏదో బధ్ధకించి ఆయనొక్కరినీ పంపామా, కూరకుంటే, పచ్చడికి ఉండదు, పచ్చడికి ఉంటే పప్పుకి కావల్సిన కూర ఉండదు. ఉండేది ఇద్దరం......ఈ దోండకాయలు అమ్మేవాడు ఎంతబాగా మట్లాడాడో, ఎంత మంచివాడో, ఓ కిలో వేసుకోండి లేతగా ఉన్నాయి అంటే, కిలో తెచ్చాను అని చెప్తే, వాటన్నిటినీ ఏం చేయను నేను? వారం అంతా కుదరదు కదా అని, ఆకుకూరలన్నీ ఒకరోజే తెచ్చేస్తే, అవి వలిచేందుకు దుంప తెగుతుంది...వంటలోకి స్పెషల్సే చేయ్యాలా? ఇవి వలుచుకుంటూ కూర్చోవాలా? ఆదివారం వస్తోందంటే ఏడుపు వచ్చేస్తుంది....కూరలు తెచ్చి పడేసిన మహానుభావుడు హల్లో అడ్డంగా పోసేసి, ఈ వంకాయలు ఎంత లేతగా ఉన్నాయో చూడు, అల్లం పచ్చిమిర్చి వేసి వండు...ఈ బెండకాయలు వేపుడు చేసి తగలెయ్యకు, చక్కగా పోపునెయ్యి...అని వర్ణిస్తూ చెప్తూ ఉంటే వంట మొదలెట్టేందుకు వేళ 11...రోజూ తీసే చిన్న కునుకు కూడా కరువే ఆదివారం.....ఆయనకేం? మూడు పేపర్లు తెచ్చుకుని అంత:పురంలోకి వెళ్ళి చదువుకుంటూ శేషశాయి లాగా సీనేస్తారు...వంటింట్లోంచి వచ్చే ఘుమఘుమలు ఆస్వాదిస్తూ...మధ్యమధ్యలో ఓసారి తొంగిచూసి, పోపులో మెంతులు వేసావా? అని అడిగితే చేతిలో ఉన్న గరిటుచ్చుకుని రెండు మొత్తాలనిపిస్తుంది....ఇవాళా, నిన్నా కాపురానికొచ్చానా? పాతికేళ్ళ నుంచి ఈయనకి తగ్గట్టు వండుతూనే ఉన్నానాయె...ఉద్యోగంలో ఉండగానే ఇలా ఉంది..రేపు ఈయన కాస్తా రిటైర్ అయితే నా పరిస్థితి?...ఇకప్పుడు అన్నీ ఆదివారాలేగా......బాబోయ్...తలుచుకుంటేనే భయం వేస్తొంది...
కూరలతో పాటు పళ్ళో...ఛప్పన్న రకాల పళ్ళూ ఆరోజే కొని తగలేయడం....తినేవాళ్ళు ఎంతమంది అని చూసుకోవడం లేదు...అవన్నీ ఎక్కడ దాచను? ఎంతమందికి పంచను? అన్నీ కలిపి ఫ్రిజ్ లోకి తోసేస్తే, మర్నాడు పొద్దున్న ఫ్రిజ్ డోర్ తీయగానే అన్ని రకాల వాసనల కలగలుపు,...కడుపులో
.దేవేస్తూనూ...అందులో మళ్ళి ఓ బొగ్గు ముక్కో, ఇంత వంట సోడాయో పెట్టడం....అబ్బ...ఇవన్నీ పైకి చెప్పుకోలేని కష్టాలు....మీకేమమ్మా? అన్నీ అయ్యగారే తెచ్చి పడేస్తారాయే అని పని అమ్మాయి సన్నాయి నొక్కులు....బుర్ర రామకీర్తన పాడించాలనిపిస్తుంది...
ఇక కిరాణా సరుకుల ప్రహసనం ఇంకో తీరు...సబ్బులు అని రాసావు, ఏం తేవాలి అని అక్కడినుంచే ఓ ఫోను..గోధుమ నూక అని రాసావు, తెల్లదా ఎర్రదా అని అడుగుతున్నాడు అని ఇంకో ఫోను. టూత్ పేస్టు క్లోస్ అప్ లేదట ఏం తీసుకురాను , అని మూడోది...ఇంటికొచ్చేయండి, వేప్పుల్ల పెట్టి తోముకుందాం అన్నా ఒకసారి..దానికో ఇంత పొడుగు రోషం....లిస్టులో నెయ్యి రాసావు, మనం ఎప్పుడూ కోనం కదా అని అక్కడినుంచే ఫోన్ చేస్తే షాపు వాడి మొహం చూడాలి..ఇదివరకు కొనలేదు...నిజమే..ఎప్పుడు? ఎప్పుడో బతికున్నరోజుల్లో, ఇంట్లోనే వెన్న తీసి కాచుకున్న రోజుల్లో...ఇప్పటి ముచ్చటా అది?ఏదో సినిమాలోలాగా, ఈ మధ్య ఉన్న సంవత్సరాలన్నీ ఈయన మిస్ అయ్యారేమో అనిపిస్తుంది....ఈ గోల అంతా పడలేక, ఓ బ్యాగు భుజాన వేసుకుని నేను కూడా పోతుంటాను ప్రతిచోటకీ....చూసేవాళ్ళు అబ్బ! ఎంత అన్యోన్య దంపతులో? ప్రతి చోటికీ కలిసేవెళ్తారు చిలకల్లాగ అని అనుకోవడం....ఇంట్లో కాకుల్లాగా ఎంత కొట్టుకుంటామో వాళ్ళకేం తెలుసు? ఏ ఏ కారణాల చేత నేను కూడా పడి పోతున్నానో తెలిస్తే మూర్చ వస్తుంది వాళ్ళకి...
నాన్నంటే ఓ గొడుగు...
నాన్నంటే ఓ నీడ..
నాన్నంటే ఓ సరదా...
నాన్నంటే ఓ భరోసా..
నాన్నుంటే ఓ ధైర్యం. ..
నాన్నంటే ఓ బలం...
నాన్నంటే ఓ సినిమా హాల్..
నాన్నంటే ఓ షాపింగ్ మాల్...
నాన్నుంటే ఓ నిశ్చింత...
నాన్నంటే ఓ విజ్ఞానం..
కానీ ఈరోజు ...
నాన్నంటే కేవలం ఓ జ్ఞాపకం.....
పిలువకు కృష్ణా! నీ నోటితో 
నాపేరు పలకకు కృష్ణా!!
పిలుపు వినగానే 
కొత్తగా ఏదో 
మత్తుగా గమ్మత్తుగా
ఎందుకో ఈ మైమరపు!!
హృదయనాదము హెచ్చి, అడుగులు తడబడి
చిరు చెమటల తడిసిన
ముంగురులు ముడివడి
పెదవులు వణీకి, మేను కంపించి
వలపు ధారల తడిసి కన్నులు సోలి
ఎదురుచూసిన క్షణము ఎదుటపడగానే
ఎదురుచూపుల గడియ ముగిసిపోగానే
ఏల నాలో ఈ కలవరము!
ఎందుకింత పరవశము !!
జన్మజన్మల నుండి ఉన్నదేగా
మన బంధం!
ఎన్నో జన్మల పుణ్యమేగా
నాకు ఈ వరం!!
నీ ప్రతి తలపున వివశనై
ప్రతి పిలుపున పరవశనై
నన్ను నేను మరచిపోదును
రాధా హృదయ విహారీ!!
నీ పలుకు విన్న ప్రతిసారీ...
చిన్నపిల్లలు చూడండి....ఎవరిని చూసినా స్వచ్చంగా నవ్వుతారు..నిష్కల్మషమైన హృదయంతో ప్రేమిస్తారు....మనందర్నీ భగవంతుడు అలాగే సృష్టించాడు. పెరుగుతున్నకొద్దీ మనలో స్వార్ధం, అసూయ, ద్వేషాలు ఎక్కువ అయిపోతున్నాయి...ఎందుకలా? చిన్నపిల్లల్లాగా మనం ఎందుకు స్వచ్చంగా ఉండలేకపోతున్నాము? ఎదిగేకొద్దీ, మనలో మనకు తెలియకుండానే అహంకారం పెరుగుతుంది. మనం మాట్లాడే మాటలకో, ఇతరులకు చేసే సేవలకో, సహాయాలకో మనం వారి దగ్గర్నుండి మనకు తెలియకుండానే ఒక మెప్పునో, పొగడ్తనో, కనీసం ఓ గుర్తింపునో కోరుకుంటాం..అది దొరకనపుడు మనం బాధపడతాం..అదే పనిగా ఆ విషయమే ఆలోచిస్తూ ఉంటే క్రమంగా అది ఎదుటివారిపట్ల కోపంగానో, కొంచెం స్థాయి పెరిగి ద్వేషంగానో మారుతుంది...ఈ భావనలనుంచి మనన్లి మనం దూరం చేసుకోలేము...చిన్న పిల్లలు అలా కాదు..వారి ప్రపంచం వేరు..వారు ఎవరి దగ్గర్నుండి ఏదీ ఆశించరు..వారి ఆటలేంటో, వారి లోకం ఏంటో...అందుకే వారు అంథ స్వచ్చంగా ఉండగలుగుతారు...మనం అలా ఉండలేమా? మనలోని అహంకారాన్ని దూరం చేసుకుని, ఎదుటివారినుండి ఏదీ ఆశించనపుడు మనలో కూడా ఏరకమైన ఈర్ష్యాద్వేషాలు ప్రవేశించవు..ఈ విషయంలో మనం చిన్నపిల్లలనుంచి నేర్చుకోవలసింది చాలా ఉంది...గీతాకారుడు కూడా ఇదే చెప్పాడు...ఏ పని అయినా చేసేటప్పుడు ప్రతిఫలాన్ని ఆశించి చెయ్యకు..నీ బాధ్యత నువ్వు సక్రమంగా నిర్వర్తించినప్పుడు ప్రతిఫలం ఖచ్చితంగా వచ్చితీరుతుంది అని...ఇదంతా కేవలం యోగుల కొరకో, జ్ఞానుల కొరకో చెప్పినది అనుకుంటే పొరపాటే...వ్యక్తిగత జీవితంలోనూ, ప్రతి సమస్యకూ పరిష్కారం "గీత" లో దొరుకుతుంది....ఒక్కసారి ప్రతిఫలం ఆశించకుండా మన కర్తవ్యాన్ని నెరవేర్చడం అలవాటు చేసుకుందాం....అప్పుడు చిన్నపిల్లల్లాగా ఏ చింతలూ లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతాము.....
"అమ్మోయ్" ! నాన్న పిలుస్తున్నారు....చిన్నవాడి గావుకేక....
"ఆయనకేం! పిలుస్తూనే ఉంటారు...ఇక్కడ ఖాళీ ఉండద్దూ రావడానికి"
"అప్పుడే పిలవకురా!" వచ్చిందంటే ఇద్దరికీ కలిపి పెడుతుంది....." మా ఆయన ఉవాచ...
"నన్ను ఇన్వాల్వ్ చేయకు నాన్నా.." చిన్నవాడి చెణుకు..
అప్పుడే ఏదో కనబడడం లేదు అని అర్ధం అయింది నాకు...నేను గాక ముగ్గురు..అందరూ ఎదిగిన వాళ్ళే....మూడు జతల ఆరు కళ్ళు...అందులో ఇద్దరికి "ఉప"నయనాలు....వెరసి 10 కళ్ళు...కానీ ఎదురుగా ఉన్న వస్తువు కనబడదు ఎవ్వరికీ...ఈ "ప్రత్యేకమైన " చూపు భగవంతుడు మా ఇంట్లో వాళ్ళకే ఎందుకిచ్చాడో అర్ధం కాదు...చిన్న పిల్లలు లేరు కాబట్టి, ఉన్న పిల్లలు ఇంట్లో ఉండడం లేదు కాబట్టి పెట్టిన వస్తువు పెట్టినచోటే ఉంటుంది...ఉండాలి కూడా...అలా ఉన్నా కూడా మా వాళ్ళెవరికీ నేను వస్తేనే కానీ అది కనబడదు...నేను వచ్చేవరకు అది అదృశ్య రూపంలో ఉంటుందో ఏమిటో జానపద సినిమాల్లో హీరో లాగా..
ఇంతా చేసి అది స్టేప్లరో, కత్తెరో, సెల్లొఫిన్ టేపో ....ఈ బాపతు వస్తువన్న మాట...మా ఇంట్లో ఇంకో విడ్డూరం....పక్కవాళ్ళు ఎవరైనా వచ్చి ఖర్మం జాలక థర్మామీటరు లాంటివి అడిగితే,
"మా ఇంట్లో ఉందో లేదో ఆవిణ్ణి అడగాలండి" ....ఇదీ వెధవ జవాబు మా ఆయన వాళ్ళకిచ్చేది...వాళ్ళకు ఆ జవాబు చేరిన తర్వాత నేను ఓ వెర్రి నవ్వు నవ్వి వాళ్ళకి కావల్సింది ఇవ్వడం జరుగుతుంది..
అక్కడికీ సూపర్ మార్కెట్ లో లాగా అడిగినవన్నీ వెంటనే తీసి ఇస్తూనే ఉంటాను ...ఇలాంటి అత్యవసరమైనవి అయితే, ఒకటికి రెండు కొని పడేస్తాను...మా వాళ్ళ కంటిచూపు గురించి క్షుణ్ణంగా తెలిసినదాన్ని కాబట్టి...
వాషింగ్ మెషీన్ లాంటి పెద్ద వస్తువులు కొన్నప్పుడు, బిల్లు, గ్యారంటీ కార్డు లాంటి వన్నీ ఒక ఫోల్డర్ లో పెట్టి ఒక బ్రీఫ్ కేస్ లో పెడతాను...ఇంట్లో నన్ను కప్పెట్టినన్ని వస్తువులు, ఫోల్డర్ లో వాటిని మించిన కాగితాలు, ఓ సోమవారం మధ్యాహ్నం కూచుని, వేటికవి విడదీసి చక్కగా సర్దితే, మంగళవారమే ఆయనకేదో కాగితం అవసరం అవుతుంది....మళ్ళీ...పద్మా.....పిలుపు...
"అన్నీ అందులోనే ఉన్నాయి మహానుభావా! వెతుక్కుని తీసుకోండి" వంటింట్లోంచి నా కేక....
"ఫలానాది ఇందులోనే పెట్టాను..ఇప్పుడు కనబడడంలేదు...." కంప్లైంట్...
తీరా పొయ్యి ఆర్పి వచ్చి చూస్తే ఏముంది, గదినిండా కాగితాలు...మధ్యలో ఈయన...చుక్కల్లో చంద్రుడిలాగా....(నన్ను కిర్రెక్కించడానికి ఆయన్ని ఆయన అలా పోల్చుకుంటారులెండి ) అన్ని ఫోల్డర్స్ లో కాగితాలు కలగలిపేసి....మరి మండిందంటే మండదూ...హతవిధీ అనుకుంటూ వెతికి ఇవ్వడమే....సో, మంగళవారం మధ్యానం కూడా సర్దుళ్ళు తప్పవు నాకు...
"ఈ సంసారం, ఈ మనుషులతో నేను వేగలేను, సన్యాసం తీసుకుని హిమాలయాలకు వెళ్ళ్లిపోతాను ఎప్పుడో"....నా నిట్టూర్పు....
"అమ్మా! సన్యాసం తీసుకుంటే కాఫీ తాగడానికి ఉండదేమోనే...ఆలోచించి మరీ నిర్ణయించుకో...." నా కాఫీ పిచ్చి తెలిసిన పెద్దవాడి విసురు..
"సన్యాసం లేకుండా ఉట్టినే హిమాలయాలకు వెళ్ళే ఆఫర్ ఏదీ లేదా"? చిన్నవాడి అతి తెలివి..
"నువ్వెళ్ళిపోతే ఇక్కడ వంట ఎలాగా? ఇంట్లో నీలా మాట్లాడేవాళ్ళు ఉండకపోతే మాకు తోచద్దూ...." వంట కోసమే నేను పుట్టినట్టు మా వారి భావం...
"వంటమనిషిని ట్రై చేద్దాం నాన్నా...అమ్మని వెళ్ళనీ...అమ్మ కోరిక మాత్రం ఎప్పుడు తీరుతుందీ" ..ఇవో రకం సన్నాయి నొక్కులు..
"వంటమనిషి ఉన్నా సరే...బెండకాయ వేపుడు మాత్రం అమ్మే చేయాలి...చెన్నై లో నాకు దొరకదు..."
" ఆలూ ఫ్రై కూడా"..
"అప్పడాల పిండి మాత్రం అమ్మే కలపాలి నాన్నోయ్...ముందే చెప్పేస్తున్నా.....అన్నీ ఆలోచించుకుని పంపు అమ్మని...."
ఇంకా నాకు సన్యాసం తీసుకునే తీరికెక్కడా, హిమాలయాలకు పోయే భాగ్యమెక్కడా?
"అసలు హిమాలయాల్లో మిర్చి బజ్జీ చేసుకుని తింటే ఎలా ఉంటుందంటావ్? చల్లని మంచు కొండలు..వేడి వేడిగా అమ్మ చేసిన బజ్జీలు...ఒక్కసారి ఊహించుకోండర్రా పిల్లలూ...." మావారి బజ్జీ బులబాటం
భగవంతుడా! అయిపోయింది...నేను ఏ టాపిక్ రాకూడదని అనుకున్నానో అదే వచ్చింది..ఇంక నన్ను ఆ బ్రహ్మ కూడా రక్షించలేడు...మా ఇంట్లో వాళ్ళకి పై నుంచి కింద తరం దాకా మిర్చి బజ్జీలు అంటే ఓ రకంగా విటమిన్ ట్యాబ్లెట్లు....మార్కెట్ లో బజ్జి మిరపకాయల్ని చూసినప్పుడు మా వాళ్ళ కళ్ళు "మాస్క్" సినిమాలో హీరో కళ్ళల్లాగా గుండ్రంగా తిరుగుతూ, రెండుసార్లు బయటికొచ్చి, అప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాయి....నెలకో ఆదివారం మాకు బజ్జీల ఆదివారం పోలియో ఆదివారం లాగా... ఇంటికి చుట్టాలు ఎవరొచ్చినా అవి చేయడం తప్పనిసరి...పెళ్ళయ్యి పాతికేళ్ళయినా, బజ్జీలకి మిరపకాయల్లో వాము పెట్టాలని చెప్తూనే ఉంటారు మావారు...చాదస్తం అనుకోవాలో, జాగ్రత్త అనుకోవాలో తెలియక బుర్ర పగలకొట్టుకుంటాను నేను...
ఆదివారం అందరికీ సెలవు అంటారు...మా లాంటి ఇళ్ళల్లో ఆదివారం ఎక్స్ట్రా పని, ఎక్స్ట్రా వంట...హు...ఏంటో ఇంటింటి రామాయణం..
అన్ని మతాల లాగే ఇస్లాం కూడా తోటివారిని ప్రేమించమని చెప్తుంది..మన చుట్టూ ఉన్న దీనుల, బీదసాదల బాధలలో పాలు పంచుకోమంటుంది..హింసను ప్రేరేపించే పనులు, కనీసం ఆలోచనలు కూడా చెయ్యద్దంటుంది....దేవుడు ఇచ్చిన సంపద అంతా అందరిదీను, కాబట్టి, దు:ఖాలలో ఉన్న పేదలను ఆదుకునేందుకు, వారి జీవితాలలో సంతోషం నింపేందుకు పండుగ రోజులలో విధిగా "జకాత్" ఇవ్వమని ఇస్లాం చెప్తుంది. ఆస్తిలో, ఆదాయంలో తప్పనిసరిగా కొంత భాగాన్ని పేదలకు దానం చేయటమే "జకాత్"..అలా అని, అదేదో ఎదుటివాళ్ళను ఉద్ధరిస్తున్నట్టు కాక, సమాజం పట్ల మన విధిని నిర్వర్తించడమే అని బోధిస్తుంది...ఆఖరికి మనం ఏదైనా తింటున్నప్పుడు ఎవరైనా వస్తే, వారికి కూడా పంచాలి కాని, దాచుకుని తినడం పాపం అని చెప్తుంది...మనం ఈ లోకంలో చేసిన పాపపుణ్యాల లెక్క ఏదో ఒకరోజు భగవంతుని ఎదుట చెప్పుకునే రోజు ప్రతివారికీ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ చేసే కర్మలలో జాగురూకులై ఉండమని హెచ్చరిస్తుంది. ...మరి ఇంత మంచిని బోధించిన మతంలోంచి ఇంతమంది ఉగ్రవాదులు పుట్టి, ప్రపంచంలో ఇంత హింసను నింపుతున్నారే!! ప్రతిరోజూ ఏదో ఒక చోట హింస...బాంబులు, ఉన్మాదం, మారణహోమం, అదికూడా అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో.... ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో, వారికైన ఒక స్పష్టత ఉందా? ఎంతమంది యువత ఈ ఉగ్రవాదానికి ఆకర్షితులై ఆ మార్గంలో పయనిస్తున్నారో...ఇది వ్యవస్థలో లోపమా? పెంపకంలో లొపమా? ప్రకృతి లోని వనరులు అన్నీ, అందరికీ సమానంగా అందకపోవటం వలన తలెత్తిన అసంతృప్తా?
నలుగురితో పరిచయం చేసుకోవడానికి, స్నేహం లేదా బంధం పెరగడానికి కావలసిన మొట్టమొదటి లక్షణం మంచి మాట, మంచి పలకరింపు...మాట మంచితనం లేకపోతే ఏ బంధమైనా ఎక్కువకాలం నిలవదు, అది స్నేహమైనా, బంధుత్వమైనా....ఒక్కోసారి కొంతమంది మాటలు వింటుంటే, దేవుడు మనుష జాతికి మాటలు ఎందుకిచ్చాడా అనిపిస్తుంది. మాటలతో మనసులని గాయపరచడంలో ఒక్కోక్కరిది ఒక్కో పధ్ధతి...నలుగురికీ మన గురించి చెడుగా చెప్పడం కొంతమంది నైజం అయితే, ఏదో అనుమానం మనసులో పెట్టుకుని సాధించేవాళ్ళు మరో రకం...ఆయుధం కన్నా పదునైన మాటలు వాడి మనిషిని నిలువునా చంపేసే వారు ఇంకో రకం...ఇందులో ఎవరి స్టైల్ వాళ్ళది. అలాంటి మాటలకి బాధపడి జవాబు ఇచ్చేకన్నా, మౌనంగా ఊరుకోవడం ఉత్తమం...తమలపాకుతో నువ్వొకటంటే, తలుపు చెక్కతో నేను రెండిస్తా అన్నట్టు కాకుండా ఎవరి నైజం వాళ్ళది అని ఊరుకున్నంత మంచి పని ఇంకోటి లేదు. కానీ చాలా మందికి తెలియంది ఏంటంటే, ఈరోజు ఒకరిని మాటలనగానే సరికాదు, ఆ మాటల వల్ల, మన సంస్కారం ఏంటో మనమే బైటపెట్టుకున్నట్టు అవుతుంది. "కేయూరాణి న భూషయంతి పురుషం......వాగ్భూషణం భూషణం" అని భర్తృహరి ఏనాడో చెప్పాడు....కనీసం ఆ మాటలనైనా గౌరవిద్దాం.....మెదడులో, మనసులో మంచి ఆలోచనలు కలిగి మంచి మాటలతో ప్రశాంతంగా జీవిద్దాం.

మనం పుడుతూనే ఏడుస్తూ ఈ భూమ్మీదికి వ్స్తాం. అందులో మనకు చాయిస్ లేదు. కానీ బతికినంతకాలం నవ్వుతూ బతకచ్చు. ఇక్కడ మనకి చాయిస్ ఉంది. కొంతమంది ఏడుస్తూ, ఏడిపిస్తూ బతుకుతూ ఉంటారు. నవ్వుతూ బతికేవాళ్ళు, స్వర్గానికి పోతారో లేదో తెలియదు కాని, వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోతారు. 

దేవుడు కోటానుకోట్ల జీవరాసుల్లో ఒక్క మనిషికి మాత్రమే నవ్వే శక్థినిచ్చాడు. మన శక్తిని మనం గుర్తించలేక , నవ్వలేక, "నవ్వు నాలుగు విధాల చేటు" అని మనకి మనమే అనేసుకుని సర్దుకుపోయాం. అన్నిటినీ కల్తీ చేసినట్టే, మనం నవ్వుని కూడా కల్తీ చేసి పారేసాం. పసిపాపలకు, పరమయోగులకు మాత్రమే సొంతమైన స్వచ్చమైన నవ్వుని, మన ఈర్ష్యాసూయల వెనక దాచేసాం.

మనసారా నవ్వేవాడికి ప్రతిరోజూ నవ్వుల దినోత్సవమే....నవ్వనివాడికి ఇలాటి దినాలు వంద వచ్చినా ప్రయోజనం లేదు..ఈ ప్రపంచంలో అందరూ పోయేవాళ్ళే..కానీ నవ్వుతూ బరికినోళ్ళు ఎప్పటికీ బతికే ఉంటారు. ఏడుస్తూ బతికేవాళ్ళు ఉండగానే పోయుంటారు.....

( "సాక్షి" ఆదివారం పత్రికలోని వ్యాసంలో కొన్ని పంక్తులు..బాగున్నాయని షేర్ చేసాను. ఇది నా సొంతం కాదు. )
ఈ గ్రూపు లో రాధిక శ్రీ గారు, శివరామకృష్ణ గారు తొలిప్రయత్నం లోనే చక్కటి చిత్రాలు గీసేస్తున్నారు. వాళ్ళు ఏమి వెయ్యాలనుకుంటున్నారో, ఆ బొమ్మలు అలాగే వస్తున్నాయి. అదేం చిత్రమో, నాకు ఎప్పుడూ అలా వచ్చేవి కావు..భయపడకండి..వాళ్ళని చూసి నేను బొమ్మలు వేయనని సభా (గ్రూపు) ముఖంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను.సరే, మన "భావుక" బాపు గారు రామకృష్ణ వంగల గారు బాపు బొమ్మలని అచ్చుగుద్దినట్టు వేసేస్తున్నారనుకోండి..(వారు ఈమధ్య కనబడడంలేదు. తెలిసినవాళ్ళెవరైనా ఆయన క్షేమసమాచారాలు కనుక్కొని, గ్రూపులో పోస్ట్ చేయవలసినదిగా సూచన). చిన్నప్పటి నుండి మా అక్క బొమ్మలు చాలా బాగా వేసేది, పెన్సిల్ స్కెచ్ లూ, పెయింటింగులూ అన్నీ, అందరూ మెచ్చుకునేవారు....ఆ బొమ్మల్లో ముఖకవళికలు చక్కగా ఉండేవి..శివాజిని గీస్తే అచ్చం శివాజీలాగే ఉండేది..ఆ స్పూర్తితో నేను కూడా గీసేద్దామని డిసైడ్ అయ్యాను. ఓ బొమ్మ వేసా....మొట్టమొదట మా అక్కకే చూపించా...ఇది ఏంటే, అని అడిగింది....అప్పుడేం గీసానో నాకు కూడా ఇప్పుడు గుర్తు లేదు కాని, ఆ బొమ్మ చూడగానే మా అక్క మొహంలో ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా గుర్తున్నాయి.అది ఒక జంతువు బొమ్మ..దాన్ని ఫలానా అని గుర్తుపట్టడానికి ఇంట్లో వాళ్ళకి కొంచెం టైం పట్టింది...మొదట్లో ఎంతో క్లారిటీ తో వేసాను కానీ, చూడగా, చూడగా నాకు కూడా అది, కోతా, కుక్కా, పిల్లా, సింహమా, అసలు సాధుజంతువా, కౄరమృగమా అన్నది అర్ధం కాలేదు. ఇలా కాదని ఓ వారం గేప్ ఇచ్చి (ఇంట్లోవాళ్ళు తేరుకోవడానికి ఆమాత్రం టైం కావాలిగా) ఈసారి మనిషి బొమ్మ, ఒన్లీ మొహం ఒక్కటే వేసి చూపించా,..ఈసారీ మా అక్కకే...భలే వేసావే, మన తెలుకుల పైడమ్మని (మా ఇంటికి గానుగ నూనె తెచ్చేదిలెండి) ఒకట్రెండు సార్లు చూసినా చక్కగా వేసావు అంది సంతోషంగా....నాకు నోట్లోంచి మాట రాలేదు...మెల్లగా నోరు పెగల్చుకుని, అది పైడమ్మ బొమ్మ కాదక్కా...స్మితా పాటిల్ బొమ్మ అన్నా.....మా అక్క కిందపడబోయి నిలదొక్కుకుంది. ఆఖరికి, ఇద్దరికీ చుట్టరికం ఏమన్నా ఉందేమో కనుక్కుందాం ఉండు అని పక్కకి వెళ్ళిపోయింది....కాసేపటికి కానీ అది వ్యంగ్యం అని నాకు అర్ధం కాలేదు....ముందు చిన్న చిన్న బొమ్మలు ప్రాక్టీస్ చేయవే ...పోర్ట్రయిట్ లు తరువాత వేద్దువుగాని అంది...ఆహా....అంత చిన్న చిన్న వాటినుంచి మొదలెట్టడం ఎలాగా..పరువు తక్కువ అని మొత్తానికి చిత్రకళకి స్వస్తి పలికాను....దేశానికి నీ వంతు సాయం నువ్వు చేసావు సుమీ అని ఓ వంకర నవ్వు నవ్వింది...ఇదీ నా చిత్రకళాభ్యాసం కథ...

నేను కూచిపూడి నేర్చుకుంటాను మొర్రో అని మొత్తుకుంటే కాదు సంగీతం నేర్చుకో అన్నారు ఇంట్లోవాళ్ళు.. అయితే వీణ నేర్పించండి అన్నా (ఇప్పుడు వసంతశ్రీ గారికి పోటీ అయ్యుండేదాన్ని ) కాదు, నీ గొంతు బాగుంటుంది, గాత్రం నేర్చుకో అన్నారు.....నా ప్రాణానికి పట్టుబడితేనా, అదేమిటో ఇప్పటికీ స్వరస్థానాలు అన్నీ ఒకలాగే ఉంటాయి నాకు. ఎప్పుడూ ఎందుకొచ్చిందిరా దేవుడా అనుకుంటూనే క్లాసులో కూర్చునేదాన్ని.. అయితే ఒకవిషయం ఇక్కడ గమనించాలి..సొంతంగా స్వరం పాడలేకపోయినా, మాస్టారు చెప్పినది అచ్చుగుద్దినట్టు పాడేసేదాన్ని....చిలక పలికినట్టు.. ఇంటర్మీడియెట్ లో చేరాకా మా క్లాసులో అమ్మాయి సినిమా పాటలకి కూడా రాగాలు చెప్పేసేది....ఇప్పుడు మన గ్రూపులో కృష్ణమూర్తిగారు చెప్తున్నట్టు...అది విన్నాక, నాకే తొందరగా జ్ఞానోదయం అయింది....శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఆ విధంగా నేర్చుకోవాలి, నాకు ఇంకో రెండు జన్మలు ఎత్తితేనే కానీ పట్టుబడదు అని....ఈలోపు మా అక్క పెళ్ళి అయి వెళ్ళిపోవడం, మా నాన్నగారికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం....నా సంగీతసాధన అటకెక్కడం జరిగినాయి...బతుకుజీవుడా అని సంగీత సరస్వతికి ద్రోహం చేసే పాపం ఈజన్మకి అంటుకోకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను...

నా తొలివంట ప్రయోగం గురించి, లలితసంగీతం గురించి, హిందీ పాటలగురించి, సిలోన్ రేడియో ముచ్చట్ల గురించి మరోసారి....)
అసలు ఇంట్లో చిన్నవాళ్ళ మీద పెద్దవాళ్ళు (అక్కలు, అన్నలు) బాగా రుబాబు చేస్తారు.....ఇంట్లో వాళ్ళదే ఆధిక్యం....వాళ్ళు వంట చేస్తే, మనం కూరలు తరగాలి....వాళ్ళు బట్టలు ఉతికితే మనం ఆరేయాలి....అందుకే చిన్నవాళ్ళకి ఏపనీ పూర్తిగా రాదు...వాళ్ళ వెనకాల అసిస్టెంట్లుగానే ఉండిపోతాము....మళ్ళీ పని బాగా చేస్తారని వాళ్ళకే పేరు....ఇక్కడే శ్రీశ్రీ గారి కవిత "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?" అన్న ముక్క గుర్తొస్తుంది నాకు.....కానీ మన ఘోష పట్టించుకునేదెవ్వరు? "మే డే" నినాదం లాగా "ప్రపంచంలోని చిన్నవాళ్ళందరూ ( అంటే ఐ మీన్, ప్రపంచంలో ఉండే ఇళ్ళన్నింటిలో ఉండే చిన్న/ఆఖరు సంతానం అన్నమాట.) ఏకం కండి" అని ఎలుగెత్తి అరవాలనిపిస్తుంది..... మా నాన్నగారు నాచేత చదివించిన మొట్టమొదటి పుస్తకం "శ్రీ శ్రీ గారి "మహాప్రస్థానం".."...(చందమామ పుస్తకాలు కాకుండా.....)పై డైలాగు నేను అంటుండగా విన్న మా నాన్నగారు ఆఖరికి ఆయన్ని ఇలా వాడేసుకుంటున్నావా? అని కేకలేసారనుకోండి...అది వేరే విషయం....

అలాగే నాన్నగారు నాకు పరిచయం చేసిన తొలి హిందీ పాట "చౌదవీ కా చాంద్ హో"....ఆ పదాల అల్లిక, ఆ భాషలో సొగసు చాలా నచ్చింది. హిందీ తో పాటు ఉర్దూ కూడా నేర్చుకోవాలనిపించింది....ఇక్కడే మళ్ళీ మా అన్న జోక్యం చేసేసుకున్నాడు.....పరాయిభాష ఉర్దూ నేర్చుకొనేటప్పుడు సంస్కృతం కూడా నేరుచుకోవచ్చు కదా అని...నిజానికి నాకు సంస్కృతం అంటే చాలా ఇష్టం...రెండిటికీ ముడెట్టేసరికి అదీ కుదరలేదు, ఇదీ కుదరలేదు....మొత్తానికి రెంటికీ చెడ్డ రేవడు అయ్యింది నా పని....ఈ పెద్దాళ్ళింతేనండీ....మన సొంతానికి, మన ఇష్టానికి ఏదీ చెయ్యనియ్యరు...

నాకు శాస్త్రీయ సంగీతం పట్టుబడకపోయినా, లలిత సంగీతం బాగా పాడేదాన్ని..ఇది మాత్రం అందరూ ఒప్పుకుని తీరాలి. మా వదిన (మేనత్త కూతురు....మా ఊళ్ళోనే ఉండేవారు )కు లలిత సంగీతం లో భావాలు అంతగా పలికేవి కావు. మా అత్త నా చేత బోలెడు పాటలు పాడించుకుని, కొసమెరుపుగా మా వదినకు "మంగళ హారతి" ఇచ్చేది....పద్మ గొంతులో భావాలు బాగా పలుకుతాయే అని....చూసి చూసి మావదిన నాకు చాటుగా వార్నింగ్ గట్టిగా ఇచ్చింది.....మా అమ్మ దగ్గిర ఆ వచ్చీ రాని సంగీతమే పాడు...లలిత గీతాలు పాడేటట్టయితే ఇంటికి రాకు అని.....ఏతావాతా తేలిందేంటంటే, మనకు (అంటే చిన్నవాళ్ళకి ఒక విద్య వచ్చినా ముప్పే, రాకపోయినా తప్పే..)

ఇంతకీ ఈ అక్కలు/అన్నలు ఉన్నారే, వాళ్ళకి ఇంట్లో ఉన్నంతసేపు మంచినీళ్ళు మనమే తెచ్చివ్వాలి, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చినా సరే, వాళ్ళకీ మంచినీళ్ళూ వగైరా సప్లైలు మనమే చెయ్యాలి....తరతరాల బానిసత్వం ఇది....అదేంటో దీనిని అమ్మ/నాన్నలు కూడా ఖండించరు...ఏదైనా అంటే, నేను పోతే, నీ బాగోగులు చూడవలసింది, నీ బాధ్యత మోయవలసింది వాళ్లే అంటూ ఓ stock dialogue ఉంటుంది అందరి ఇళ్ళల్లో.....అమ్మ/నాన్న నోళ్ళల్లో...అది విన్న తరువాత అక్క/అన్నల expression ఉంటుంది చూడండీ, ...బజార్లో బానిసలను కొనుక్కున్నప్పుడు చూసే చూపు.....ఛ......tragedy..... వాళ్ళ పుస్తకాలు మనమే సర్దాలి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇళ్ళకి మనమే సాయం వెళ్ళాలి....తీరా మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళే సందర్భాల్లో, "అస్తమానూ ఏం తిరుగుతావ్? మూసుకుని ఇంట్లో కూర్చో" అనేదీ వాళ్ళే...తరతరాలుగా చిన్నవాళ్ళకు జరిగే ఈ అన్యాయాన్ని అడ్డుకునే చట్టాలు ఏవీ రాలేదు.....అన్నట్టు ఇది కూడా ఒకరకమైన "గృహహింస " కిందకి వస్తుందా! రాదా! ఈసారి ఎవరైనా లాయర్లని అడగాలి....
తనువు, తలపు...
మనసు, వలపు..
అన్నీ నీవైతే ..
రాధకు వగపెందుకు?
విరహమెందుకు?
తన ప్రతి ఊపిరి నీవైతే
రాధకు వేరే శ్వాస ఎందుకు ?
ధ్యాసెందుకు ...
ఏడతానున్నాడో, రానే రాడూ,
ఎదురుచూసినంతసేపు ఎదుటపడడు..
రాతిరి చేసిన బాసలు రాత్రే మరిచీ..
కలలో కనబడి కలతే రేపీ..
క్షణమైనా నిదురపోనీయడూ..
రాధ వేదన తీర్చగలేడూ,
లోకనాధుడని వీనికి పేరూ..
నిందలు వేసీ, అలుక బూనితే,
కొంటెగ నవ్వీ, కురులను దువ్వీ,
కృష్ణమాయలో ముంచేస్తాడూ...

ఫేస్ బుక్ లో మనం ఏదైనా పోస్ట్ చేస్తున్నాం, లేదా కామెంట్ చేస్తున్నాం అంటే, పదిమంది మధ్యలో కూర్చుని మాట్లాడుతున్నట్టు......అందుకే మనం రాసేది ఏదైనా నలుగురూ మెచ్చేటట్లు ఉండాలి. పరస్పర ద్వేషాలు, వ్యక్తిగత దూషణలు, వెటకారాలు పనికి రావు...ఎవరినో మనసులో పెట్టుకుని అన్యాపదేశంగా వ్రాయడం కూడా మంచిది కాదు...ఎవరైనా, వారిగురించే అన్నారేమో అని భావించే అవకాశం ఉంది.. దానితో ఒకటికి రెండు మాటలు---చర్చలు...ఇవన్నీ అనవసరం కదా...అందుకే, ఫేస్ బుక్ లో మనం వ్రాసే వ్రాతలు సాధ్యమైనంత పారదర్శకంగా ఉంటే మంచిది...మన భావాలు ఎవరినీ నొప్పించకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం... కదా...
రాజరికాన్ని రోసి..
ఆరాధించిన దాసి..
"కృష్ణ ప్రేమ" రాశి.....



చారిత్రక ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథ రథ యాత్ర ఈరొజు మొదలయింది....జగన్నాధుడు తన సోదరి సుభద్ర,  కలిసి బలభద్రులతో ఊరేగింపుగా గుండీచా మందిరానికి వెళ్ళడమే రథయాత్ర....ఇందులో జగన్నథుడు కొలువుండే రథం పేరు "నందిఘోష".ఇది 45.6 అడుగుల ఎత్తుతో, 18 చక్రాలు కలిగిన రథం. బలభద్రుడి రథం 45 అడుగులు ఎత్తు  ఉండి 16 చక్రాలతో అలరారుతుంది..దీనిపేరు తాళధ్వజ..ఇక సుభద్రా దేవి ఊరేగే రథం పేరు దేవదళన...ఇది 44.6 అడుగుల ఎత్తు ఉండి 14 చక్రాలతో ఉంటుంది. ఇవన్నీ రథయాత్ర ఉత్సవానికి కొన్ని నెలల ముందే రంగురంగుల వస్త్రాలతో చాలా ఆకర్షణీయంగా అలంకరింపబడతాయి.

ఈ యాత్ర ఆషాఢ శుధ్ధ విదియనాడు మొదలవుతుంది. వారి పినతల్లి ఇంటికి ఊరేగింపుగా వెళ్ళిన ఈ దేవతలు, 9 రోజులు అక్కడ గడిపి మళ్ళి దేవాలయనికి  తిరిగివస్తారు.

"చేర పహరా" అనేది ఈ ఉత్సవంలో చెప్పుకోదగిన విధి...ఇందులో ఆలయ అనువంశిక ధర్మకర్తలైన గజపతి రాజులు బంగారు చీపురుకట్టతో, ఆ రథయాత్ర మొదలయ్యే ప్రదేశాన్నీ, రథాల చుట్టూను శుభ్రం చేసి, గంధపు నీరును, పొడిని చల్లి పవిత్రం చేస్తారు. భగవంతుని ముందు రాజు, సామాన్యుడు ఒకటే అనే అర్ధంలో ఈ విధిని జరుపుతారు.

9 రోజులను పినతల్లి ఇంట ఆనందోత్సాహాలతో గడిపిన బలరామ, కృష్ణ , సుభద్రలు మరల వెనుకకు పూరీ ఆలయానికి రావడంతో ఉత్సవం పూర్తి అవుతుంది. వారు వెనుకకు వచ్చే దారిలో "మౌసీ మా" గుడి దగ్గర ఆగినపుడు..."పోడి పీఠా" అనే పదార్ధాన్ని భక్తులకు పంచుతారు. ఈ రథయాత్ర పురాణాల కాలం నుంచీ జరుగుతోంది అని అంటారు. ఇందుకు సంబంధించిన వృత్తాంతాలు స్కాంద పురాణం , బ్రహ్మ పురాణం, పద్మ పురాణాల్లోను,  కపిల సమ్హిత లోను చెప్పబడ్డాయి. ఘుండీచా గుడి నుండి ఈ రథాలు ఈనెల 14 న వెనుకకు వస్తాయి..ఈ పది రోజులు ఒరిస్సా అంతా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి..దేశం నలుమూలల నుండే కాక, విదేశీయులు కూడ ఎంతోమంది ఈ ఉత్సవాల్లొ పాలుపంచుకుంటారు. పూరీ పట్టణం అంతా రంగురంగుల ఉత్సవ శోభలతో మునిగిపోతుంది..

జగన్నాధ రథ యాత్ర శుభాకాంక్షలు  ఎల్లరికీ.............................

జై జగన్నాథ !!

(సేకరణ)