Wednesday 7 June 2017

ఈ గ్రూపు లో రాధిక శ్రీ గారు, శివరామకృష్ణ గారు తొలిప్రయత్నం లోనే చక్కటి చిత్రాలు గీసేస్తున్నారు. వాళ్ళు ఏమి వెయ్యాలనుకుంటున్నారో, ఆ బొమ్మలు అలాగే వస్తున్నాయి. అదేం చిత్రమో, నాకు ఎప్పుడూ అలా వచ్చేవి కావు..భయపడకండి..వాళ్ళని చూసి నేను బొమ్మలు వేయనని సభా (గ్రూపు) ముఖంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను.సరే, మన "భావుక" బాపు గారు రామకృష్ణ వంగల గారు బాపు బొమ్మలని అచ్చుగుద్దినట్టు వేసేస్తున్నారనుకోండి..(వారు ఈమధ్య కనబడడంలేదు. తెలిసినవాళ్ళెవరైనా ఆయన క్షేమసమాచారాలు కనుక్కొని, గ్రూపులో పోస్ట్ చేయవలసినదిగా సూచన). చిన్నప్పటి నుండి మా అక్క బొమ్మలు చాలా బాగా వేసేది, పెన్సిల్ స్కెచ్ లూ, పెయింటింగులూ అన్నీ, అందరూ మెచ్చుకునేవారు....ఆ బొమ్మల్లో ముఖకవళికలు చక్కగా ఉండేవి..శివాజిని గీస్తే అచ్చం శివాజీలాగే ఉండేది..ఆ స్పూర్తితో నేను కూడా గీసేద్దామని డిసైడ్ అయ్యాను. ఓ బొమ్మ వేసా....మొట్టమొదట మా అక్కకే చూపించా...ఇది ఏంటే, అని అడిగింది....అప్పుడేం గీసానో నాకు కూడా ఇప్పుడు గుర్తు లేదు కాని, ఆ బొమ్మ చూడగానే మా అక్క మొహంలో ఎక్స్ప్రెషన్స్ మాత్రం బాగా గుర్తున్నాయి.అది ఒక జంతువు బొమ్మ..దాన్ని ఫలానా అని గుర్తుపట్టడానికి ఇంట్లో వాళ్ళకి కొంచెం టైం పట్టింది...మొదట్లో ఎంతో క్లారిటీ తో వేసాను కానీ, చూడగా, చూడగా నాకు కూడా అది, కోతా, కుక్కా, పిల్లా, సింహమా, అసలు సాధుజంతువా, కౄరమృగమా అన్నది అర్ధం కాలేదు. ఇలా కాదని ఓ వారం గేప్ ఇచ్చి (ఇంట్లోవాళ్ళు తేరుకోవడానికి ఆమాత్రం టైం కావాలిగా) ఈసారి మనిషి బొమ్మ, ఒన్లీ మొహం ఒక్కటే వేసి చూపించా,..ఈసారీ మా అక్కకే...భలే వేసావే, మన తెలుకుల పైడమ్మని (మా ఇంటికి గానుగ నూనె తెచ్చేదిలెండి) ఒకట్రెండు సార్లు చూసినా చక్కగా వేసావు అంది సంతోషంగా....నాకు నోట్లోంచి మాట రాలేదు...మెల్లగా నోరు పెగల్చుకుని, అది పైడమ్మ బొమ్మ కాదక్కా...స్మితా పాటిల్ బొమ్మ అన్నా.....మా అక్క కిందపడబోయి నిలదొక్కుకుంది. ఆఖరికి, ఇద్దరికీ చుట్టరికం ఏమన్నా ఉందేమో కనుక్కుందాం ఉండు అని పక్కకి వెళ్ళిపోయింది....కాసేపటికి కానీ అది వ్యంగ్యం అని నాకు అర్ధం కాలేదు....ముందు చిన్న చిన్న బొమ్మలు ప్రాక్టీస్ చేయవే ...పోర్ట్రయిట్ లు తరువాత వేద్దువుగాని అంది...ఆహా....అంత చిన్న చిన్న వాటినుంచి మొదలెట్టడం ఎలాగా..పరువు తక్కువ అని మొత్తానికి చిత్రకళకి స్వస్తి పలికాను....దేశానికి నీ వంతు సాయం నువ్వు చేసావు సుమీ అని ఓ వంకర నవ్వు నవ్వింది...ఇదీ నా చిత్రకళాభ్యాసం కథ...

నేను కూచిపూడి నేర్చుకుంటాను మొర్రో అని మొత్తుకుంటే కాదు సంగీతం నేర్చుకో అన్నారు ఇంట్లోవాళ్ళు.. అయితే వీణ నేర్పించండి అన్నా (ఇప్పుడు వసంతశ్రీ గారికి పోటీ అయ్యుండేదాన్ని ) కాదు, నీ గొంతు బాగుంటుంది, గాత్రం నేర్చుకో అన్నారు.....నా ప్రాణానికి పట్టుబడితేనా, అదేమిటో ఇప్పటికీ స్వరస్థానాలు అన్నీ ఒకలాగే ఉంటాయి నాకు. ఎప్పుడూ ఎందుకొచ్చిందిరా దేవుడా అనుకుంటూనే క్లాసులో కూర్చునేదాన్ని.. అయితే ఒకవిషయం ఇక్కడ గమనించాలి..సొంతంగా స్వరం పాడలేకపోయినా, మాస్టారు చెప్పినది అచ్చుగుద్దినట్టు పాడేసేదాన్ని....చిలక పలికినట్టు.. ఇంటర్మీడియెట్ లో చేరాకా మా క్లాసులో అమ్మాయి సినిమా పాటలకి కూడా రాగాలు చెప్పేసేది....ఇప్పుడు మన గ్రూపులో కృష్ణమూర్తిగారు చెప్తున్నట్టు...అది విన్నాక, నాకే తొందరగా జ్ఞానోదయం అయింది....శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఆ విధంగా నేర్చుకోవాలి, నాకు ఇంకో రెండు జన్మలు ఎత్తితేనే కానీ పట్టుబడదు అని....ఈలోపు మా అక్క పెళ్ళి అయి వెళ్ళిపోవడం, మా నాన్నగారికి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం....నా సంగీతసాధన అటకెక్కడం జరిగినాయి...బతుకుజీవుడా అని సంగీత సరస్వతికి ద్రోహం చేసే పాపం ఈజన్మకి అంటుకోకుండా నన్ను నేను కాపాడుకోగలిగాను...

నా తొలివంట ప్రయోగం గురించి, లలితసంగీతం గురించి, హిందీ పాటలగురించి, సిలోన్ రేడియో ముచ్చట్ల గురించి మరోసారి....)

may 30 2016

గమ్యం లేని బాటసారులు
ఎంతోమంది అనామకులు ఈ లోకంలో..
లక్షలుగా.. కోట్లుగా...
పుట్టినందుకు బతుకుతున్నారు ..
బ్రతకడానికి తింటున్నారు..
తినడం కోసమే బతుకుతున్నారు..
విశ్వమంతా వ్యాపించిన
కోటానుకోట్ల జీవరాశులతో పాటే వీరూను...
చీమల్లా, దోమల్లా, మిడతల్లా..
ఏ ప్రయోజనమూ లేకుండా. .
ఏ లక్ష్యమూ , ఏ ఆశయమూ లేకుండా. ..
గాలికి ఎగిరే ఎండుటాకులు..
గమ్యం లేని బాటసారులు. .
నిలువెల్లా నిస్సారం, నిర్లిప్తత,
ముందు చూపు లేని అసమర్థత..
రోజు కు ఇరవైనాలుగు గంటలు. .
నెలకు ముప్పై రోజులు. .
ఏళ్ళకేళ్ళు గడుస్తాయి ఏ మార్పు లేకుండా ..
ఏ ప్రత్యేకత లేకుండా. .
ఆయువున్నంతకాలం నిరర్ధకంగా బతికి
ఈ జీవులన్నీ చివరికి చేరేది చితికి..

may 
లోకంలో ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్నవారు ఉంటారు... కానీ కొంతమందిని చూస్తే నవ్వొస్తుంది. . వాళ్ళు, వాళ్ళ పిల్లలు మాత్రమే చాలా అందంగా ఉన్నట్టు, రోడ్డు మీదకి రాగానే లోకం అంతా వాళ్ళనే చూస్తున్నట్టుగా, ఒక ఫీలింగ్. . మరి కొంతమంది ఆడవాళ్ళకి మగవాళ్ళందరూ వాళ్ళని చూడడానికి, వాళ్ళతో పరిచయం పెంచుకోవడానికే పుట్టారని ఓ భయంకరమైన అపోహ.. వయసులో ఉన్నవాళ్ళే కాకుండా. . నడివయసులో ఉన్న ఆడవారు కూడా ఇలా ఆలోచిస్తున్నారని ఈ మధ్యనే తెలిసింది. . వాస్తవం ఏంటంటే.. ఇల్లు వదిలి రోడ్డు మీదకి వచ్చాక.. ఎవడి ఆలోచనలు వాడివి.. ఎవడి పని వాడిది.. రోడ్డు మీద పెరిగే ట్రాఫిక్, అడుగడుక్కీ పడే సిగ్నల్స్, పొల్యూషన్.. వీటన్నిటినీ తప్పించుకుని పని ముగించుకుని ఇంటికొచ్చి పడడం మీదనే అందరి దృష్టీను.. పక్కన ఎవరున్నారు, అందంగా ఉన్నారా లేదా, ఏ డ్రస్ వేసుకున్నారు అని ఆలోచించే తీరిక ఎవరికీ ఉండదనుకుంట.. మరీ అందంగా ఉంటే ఓసారి చూస్తారేమో.. అంతేకానీ ఇంటికెళ్లాక కూడా వాళ్ళ గురించే ఆలోచించే జనాలు ఉంటారని నేనయితే అనుకోను.. ఎవరెలా అనుకున్నా నాకేం బెంగ లేదు కానీ.. అటువంటి మాటలు వినేటప్పుడే.. ఎండాకాలం ఎడారిలో నడుస్తున్నట్టు ఉంటుంది. ..
ఇదో రకం obsession అనుకోవాలో.. హిపోక్రసీ అనుకోవాలో...
కృష్ణ వ్యధ
జాబిల్లి వెన్నెల ని ఒంపేస్తోంది ధారాళంగా ..
చెట్టు పిట్ట నిశ్శబ్దంగా నిదురలోకి జారుకున్నాయి..
నిశి మౌనంగా వీక్షిస్తోంది నువ్వెప్పుడొస్తావా అని.. 
యమున అలల్లాడకుండా నిలచి చూస్తోంది
మన సరాగాలు మొదలవ్వడం కోసం ..
నీ అడుగుల సవ్వడి కోసం ఎద ఎదురుచూస్తోంది..
నీతో ఊసులు కలబోసుకోవాలని
నవ్వే నీ పెదవుల అరుణిమలు పంచుకోవాలని
హృదయం ఆరాటపడుతోంది...
ఏడనున్నావు రాధా ..
ఏల జాగేల రాధా. ...
నీవు అరుదెంచిన వేళ
గాలిలో నీ పరిమళం తేలివచ్చి
నను తాకుతుంది
నీ చిరుపాదాల అందెల సవ్వడి
నా మనో వేదికపై ఘల్లుమంటుంది..
జీరాడే కుచ్చిళ్ళ చిరు సందడి
సన్నని రవమై చెవులకు సోకుతుంది ..
నను చేరాలని తొందరపడే
నీ శ్వాసల బరువు
శబ్దమై నా హృదయానికి చేరుతుంది. .
పరిసరాలు నిన్ను చూసి పరవశమొందుతాయి..
ప్రకృతి నీకు పాదాక్రాంతమౌతుంది..
నీ సుతిమెత్తని నడకలతో
నాదరికి రావా!!
జాము జారిపోయేలోగా
జతను చేరవా! !

 2 june 2017
అబ్బా..
అబ్బబ్బా...
ఎండలు..
అలసట..
తలనొప్పి ..
( ఏంటీ తల ఉన్న వాళ్ళకే కదా
తలనొప్పి, నీకెందుకొచ్చింది అంటారా!!
నాకూ ఎప్పట్నుంచో అదే డౌటు..
కానీ నాకూ అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది.)
నడుము నొప్పి..
మందుల్లేని బాధలు..
మందులేసుకోని మొండితనం..
అన్నట్టు ఇది కూడా ఓ రోగమే..
మందు లేని రోగం..
మా అమ్మమ్మ అనేది..
మొగుడు నాలుగు వడ్డిస్తే
 తగ్గే రోగం అని..
పాపం ఇప్పటి మొగుళ్ళకి అంతటి
ధైర్యం ఎక్కడిదీ..
నడిస్తే ఆయాసం..
తినకపోతే నీరసం..
కాళ్ళు నొప్పులు..
ఒక్కోసారి వాపులు..
లేస్తే కూచోలేము..
కూచుంటే లేవలేము..
ఇదేం కేటగిరీ యో అర్ధం కాదు..
డాక్టరు దగ్గరకెళ్తే
మందుల కన్నా ముందు
బరువు తగ్గమంటారు...
ఇంకా ఏవేవో చెప్తారు..
మనకి బొత్తిగా పడనివి..
ఉదయపు నడకకు ఆమడ దూరం...
వ్యాయామం అంటే ఇంకా దూరం..
తిండి తగ్గిస్తే ఒకటే నీరసం..
మిరియాలు తింటే,
పిప్పళ్ళు తింటే,
తాంబూలం వేసుకుంటే,
దాల్చిన చెక్క తింటే,
సబ్జాలు తాగితే,
నిమ్మరసం+తేనే తాగితే,
త్రిఫల చూర్ణం తాగితే...
బరువు తగ్గుతారట...
ఎన్ని సలహాలో..
ఎన్ని చిట్కాలో..
హమ్మయ్య!! శ్రమలేని పని..
సులువుగా బరువు తగ్గచ్చు...
ఓ వారం గడిచినా
చటాకు బరువు తగ్గలేదు..
ఇది కాదు పని అని అన్నీ మానేసా..
నూనెలో వేయించినవి..
స్వీట్లు..
పెరుగు..
ఇవన్నీ కూడా మానేసా..
ఇంతలో ఇంట్లో పుట్టినరోజులు..
పండగలు..
మా పెళ్ళిరోజు..
ఒక్క స్వీటు ..
ఒక్కటే ఒక్కటి అనుకుంటూ..
నాలుగైదు .. లెక్కకి.. అంతే..
చాన్నాళ్ళ క్రితం చూసిన ఫ్రెండు..
అప్పటికీ ఇప్పటికీ
నువ్వు ఏం మారలేదు అని కితాబిస్తే,
పొంగిపోయి, పర్వాలేదులే అనుకుని
తనతో పాటు ఒక ఐస్ క్రీం...
ఏంటమ్మా అప్పటికన్నా చిక్కిపోయావు
అని ఆర్నెల్ల తర్వాత
ఇంటికొచ్చిన కొడుకు ఆరా తీస్తే,
వాడితో పాటు మంచూరియా, పనీర్ కుర్మా..
కాజూ బర్ఫీ.. మలయ్ కోఫ్తా..
మధ్య మధ్యలో పిజ్జాలు, బర్గర్లు,
సమోసాలు, చాట్ లు,
రారమ్మని పిలిచే
 అమూల్ మరియు ఐబాకోలు..
ఏదో పిల్లల కోసం...
ఆరోజుకి ప్రశాంతంగా పడుకున్నా..
తెల్లారే మళ్ళీ భయం మొదలు..
నిన్న తిన్న 100 గ్రాముల టిఫిన్,
యాభై గ్రాముల స్వీటుకి,
ఎన్ని గ్రాముల బరువు పెరిగానా అని..
ఏదో ఓ మంచి రోజు చూసి
వాకింగ్ మొదలెట్టాల్సిందే..
దృఢ నిశ్చయం..
కేలండర్ చూస్తే ఏకాదశి
ఐదారు రోజుల తర్వాత..
ఎలాగూ అప్పట్నుంచి వాకింగ్ చేస్తాం కాబట్టి
ఈలోపు ఒక్క స్వీటు..
పర్వాలేదు..
ఒక్కదానికి పెద్ద బరువు పెరగరు..
నాకు నేనే చెప్పుకున్న ధైర్యం..
ఈలోపు శ్రావణమాసం,
ఆ పై మాసం ఆశ్వయుజం..
నాకు కాకపోయినా
అమ్మవార్లకి పెట్టాలి నైవేద్యం..
అదే తలోకాస్తా ఫలహారం..
అటుపై కార్తీకం..
ఉపవాసాల సమయం..
హమ్మయ్య..
ఇక అక్కర్లేదు..
ఏ వాకింగు, ఏ వ్యాయామం,
తెరిపిన పడే ప్రాణం..
ఇలా ఒక ఏడాది గడుస్తుంది
హాయిగా..
జనవరి ఫస్టుకి
మళ్ళీ సరికొత్త నిర్ణయం..
ఈ ఏడాది ఎలాగైనా బరువు తగ్గాలి..
( గమనిక : ఇది కవిత కాదు... కవిత అనుకుని పొరపడితే నా తప్పు కాదు... పేరాలో రాసేదాన్ని తీసుకొచ్చి, ముక్క ముక్కలుగా చేసి.. వెరైటీగా .. విరిచి... మీ ముందు ప్రదర్శించాను.. ( ప్రదర్శించినది కవిత కాదు, నా అతితెలివి అనుకుంటున్నారా?? అనుకోండి ..నేను మిమ్మల్ని ఆపలేను కదా.. అనుకోకుండా... )

6 june 2017
ఈవారం కథా సమీక్ష:
జులై నెల స్వాతి మాస పత్రిక లో ఈసారి "అత్తలూరి విజయలక్ష్మి" గారి కథ "కొడుకు" మనసుకు హత్తుకుంది.. చాలా మంది చదివే ఉంటారు ఈపాటికి.. చదవని వారి కోసం...
ఇది ఓ అమ్మ కథ.. ఓ తల్లి వ్యథ..
భర్త చనిపోయిన దగ్గర్నుండీ కంటికి రెప్పగా కాపాడుకుంటూ వచ్చిన తన ఇద్దరు కొడుకులూ, రెక్కలొచ్చాక, తన బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడక, ఏవో సాకులతో, ఉన్నఊళ్ళోనే తనకు దూరంగా వెళ్ళిపోయాక, ఆ బాధ తట్టుకోలేక, ముందు మనోవేదన పడీ, తరువాత మంచాన పడీ... ఏనాటి ఋణమో పనిమనిషి లక్ష్మి సేవ-శుశ్రూషలతో కొద్దిగా కోలుకుని... జబ్బు పేరుతో నాలుగు గోడల మధ్య పడుకుని పడుకుని విసుగొచ్చి, ఒక్కసారి బయటిగాలి పీల్చుకోవాలనే ఆశతో, పనిమనిషి భయపడుతున్నా సరే, చేతికర్ర తీసుకుని, నడవగలనేమో చూస్తాను అని గుమ్మం దాటుతుంది నడివయసులో ఉన్న రమణి.. ఇన్నాళ్ళకి బయటకు వచ్చిన తనను ముందు ఓ చల్లని పిల్లగాలీ, తరువాత ఆ చుట్టుపక్కల ఉండే ఆత్మీయులు పరామర్శించగా, తాను ఆ చుట్టూ ఉన్న మొక్కా మోడును పలకరించి, ఎదురుగా ఉన్న పార్కులోకెళ్ళి చిన్నగా కొంత సేపు వాకింగ్ చేసి అక్కడె ఉన్న ఒక చెట్టు కింద చప్టా మీద కూర్చుని, పర్వాలేదు, నేను నడవగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని ధైర్యం చెప్పుకుని , సేదదీరేంతలో-- పక్కనే తనకన్నా పెద్ద వయసు ఉన్న ఓ మహిళ ఒంటరిగా, కొంచెం బిడియంగా, కొత్తకొత్తగా ఉన్నట్టు గమనించి మాటలు కలుపుతుంది..
ఆమె తీరు, తరహా ఓ మంచి కుటుంబానికి చెందిన మహిళే అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉందీ అనే ఆలోచన మనసును తొలిచేస్తూ ఉండగా, ఆమెతో మాటలు కలుపుతుంది.. నాలుగు నెలల క్రితం తన భర్త పోయాక, అన్నదమ్ముడు ఈమధ్యనే తీసుకొచ్చి కొడుకు దగ్గర దింపిపోయాడని, ఆ కొడుకు తనను ఇక్కడ కూర్చోపెట్టి ఏదో పని మీద బయటకు వెళ్ళాడనీ, తిరిగి వచ్చి తనను ఇంటికి తీసుకెళ్తాడనీ ఆమె నోట విన్నప్పుడు, తన కొడుకులు ఇచ్చిన అనుభవాలతో ఆ మహిళ మాటలను నమ్మలేక, ఆమె కొడుకుపై నమ్మకం ఉంచలేక ఆవిడ స్థితికి జాలిపడుతుంది రమణి.. మెల్లగా పొద్దు వాటారుతుంది.. తనకూ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి... పార్కులో అందరూ ఇళ్ళకి మళ్ళుతున్నారు.. ఓవైపు నీరసం, మరోవైపు ఒంటరిగా నగరానికి కొత్త అయి, తన కొడుకు ఉండే కాలనీ ఏదో తెలియక, కనీసం అతని ఫోన్ నంబర్ కూడా తెలియక అమాయకంగా కూర్చున్న ఈ మహిళ ను ఒంటరిగా వదిలి పోలేక, అసలు ఆమె కొడుకు వస్తాడా రాడా, లేక, ఈవిడను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలి వెళ్ళాడా అనే అనేకానేక ఆలోచనలతో సతమతమవుతుంది.. తన ఇంటికి తీసుకెళ్ళచ్చు.. కానీ ఆవిడ ఎలాంటిదో.. లేదా ఏదో ఒక అనాధాశ్రమానికి పంపవచ్చు, ఎవరి సహాయమైనా తీసుకుని... ఇలాంటి ఎడతెగని సంశయాలతో, ఆఖరికి ఆమె కొడుకు రాడు అని తనకు తానే తీర్మానించుకుని ఆమె మీద ఎంతో జాలిపడుతుంది.. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళడానికి సిధ్ధం అవుతుంది.. ఆ మహిళ మాటల్లో తన కొడుకు పట్ల ప్రేమ, నమ్మకం స్థిరంగా ఉండడం చూసి, ఆమె అసహాయ స్థితికి బాధ పడుతుంది.. ఇంతలో పార్కు ముందు ఒక కారు ఆగడం , అందులోంచి ఒక వ్యక్తి దిగి వచ్చి, ఆమెను శ్రధ్ధగా, ప్రేమగా పొదివి పట్టుకుని నడిపిస్తూ,, "' రామ్మా !! ఇప్పటివరకూ ట్రాఫిక్ లో చిక్కుకున్నానమ్మా.. పాపం ఎంత టెన్షన్ పడి ఉంటావో!! ఆకలి కూడా వేస్తూ ఉండవచ్చు. నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు కార్లో ఉన్నాయి .. తిందువుగాని" అని ఎంతో అనురాగం తో తీసుకెళ్తున్న ఆమె కొడుకును చూసి అంతవరకు తన కొడుకులతో పోల్చుకుని అతనిని మోసగాడు అనుకుని ఆందోళన పడిన రమణికి... వీస్తున్న పిల్లగాలి కూడా వీపున ఛెళ్ళున చరచినట్లయింది"..
ఇదీ కథ.. కథ, కథనం, శైలి అత్యద్భుతంగా ఉండి.. ఒకసారి మొదలు పెడితే, ఆపకుండా చదివించే బలం ఉన్న కథ ఇది... చదువుతున్న ప్రతివ్యక్తీ ఉన్న రెండు పాత్రలలో తనను తాను ఐడెంటిఫై చేసుకునే కథ... చాలా బాగుంది.. ఒక్కసారి చదివితే సరిపోదు.. ఎందుకంటే కథ ముగింపు ఏమైందా అని ఆత్రంగా చదివేస్తాం మొదటిసారి.. ఆ కథ లో లీనమవ్వాలంటే మరోసారి సావధానంగా చదవాలి... అలా రెండో సారో, మూడో సారో చదివిన ఈ కథ జీవితాంతం మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది..
ఈ కథను అందించిన అత్తలూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు...

6 june 2017

Friday 16 September 2016

శ్రీ రమణ గారు "మిథునం" కథ ద్వారా మనందరికీ పరిచయమే.... "నాకు నచ్చిన కథ" శీర్షికన ఆయన వ్రాసిన మరో ఆణిముత్యం "బంగారు మురుగు" కథ పరిచయం చేయబోతున్నాను...నేను ఎంతవరకూ న్యాయం చేయగలనో తెలియదు..ఎందుకంటే వారి కథలను క్లుప్తీకరించి వ్రాయడం సాహసమే...అచ్చతెలుగు కథలకు మరో ఉదాహరణ ఈ " బంగారు మురుగు"..
ఈయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయస్థాయి వివేకానందా వ్యాస రచన పోటీలలో వరుసగా ఆరుసంవత్సరాలు ప్రథమ బహుమతి అందుకున్నారట..బాపు రమణలతో కలిసి చిత్రపరిశ్రమలో 20 ఏళ్ళు పనిచేసారట...ప్రస్తుత కథ 1993 సంవత్సరంలో ఆంధ్ర జ్యోతి వార పత్రిక కోసం వ్రాసినది..ఈ కథకు "జ్యేష్ట లిటరరీ" అవార్డు లభించింది....
ఓ ఇంట్లో ఓ బామ్మకీ, మనవడికీ ఉన్న బంధం గురించి చెప్తుందీకథ. మడి, పూజ వంటివి లేకపోయినా, "మొక్కకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడన్నం పెట్టడం...ఇవే బామ్మకు తెలిసిన బ్రహ్మసూత్రాలు...గుడినీ, గుడిలో లింగాన్నీ మింగేసే ఓ స్వాములారి సేవలో కొడుకుకు ఉన్న మడులూ, మాన్యాలూ అంతరించిపోగా, మనవడికి అంతా తానై పెంచుతుంది...పెరట్లో ఉన్న బాదం చెట్టు ఇద్దరికీ ఆవాసం..రాలిపడిన బాదం కాయలూ, అమ్మకి తెలియకుండా, చెట్టుతొర్రలో మిఠాయిలూ, జీళ్ళూ దాచే బామ్మే మనవడికి తోడూ, నీడా, దైవం అన్నీనూ...పరువు తక్కువగా... బయటి చిరుతిళ్ళు మనవడికోసం కొని పెడుతోందని తెలిసిన కొడుకూ కోడలూ బామ్మ చేతికి డబ్బులు అందకుండా చూస్తే,....... బియ్యం ఎదురిచ్చి జీళ్ళు కొంది బామ్మ....ఆ తరువాత బియ్యం డబ్బాకి కూడా తాళం పడితే, మనవడి పీచుమిఠాయి కోసం దేవుడిగదిలో కంచు గంటకి కాళ్ళొస్తాయి...మిఠాయిలూ, జీళ్ళూ, పీచుమిఠాయి ఆరోజుకి ఇచ్చేసి, మరుసటి వారం సంతరోజు వాడొచ్చి ఇంకా బాకీ ఉన్నానని మరిన్ని జీళ్ళూ, వగైరా ఇచాకగానీ ఇంట్లో కంచుగంట ఆచూకీ తెలియలేదు...పూజలూ, పునస్కారాలూ, స్వాములోర్లూ, సత్కారాలూ, జప తప హోమాదుల్లో మడులూ మాణ్యాలూ కరిగిపోవడం ఎలా తెలియలేదో, అంత దాకా ఒకటే కంచం, ఒకటే మంచంగా బామ్మతో బ్రతికిన మనవడికి కంచం , మంచం వేరయ్యాక గానీ, తనకి వయసొచ్చిందని తెలియలేదు...పెళ్ళీడు వచ్చాక, వరస అయిన మనవరాలు (కూతురి కూతురు) ఉన్నా కూడా ఆమే గుణం తెలిసి బయట సంబంధం చూస్తుంది బామ్మ..నాలుగు కాసుల బంగారం దగ్గర సంబంధం చేజారుతుందంటే, ఏదో మాయ చేసి, సంబంధం ఖాయం చేస్తుంది..పెళ్ళి సమయం లోనూ, మరణ శయ్య మీద ఉన్నప్పుడూ ...అసలు మనవడికి గ్రాహ్యకం వచ్చినదగ్గర్నుండీ ఎన్నో జీవిత సయ్తాలు చెప్తుంది బామ్మ....విచారించకు వెర్రి నాగన్నా....ఇప్పుడు వెళ్ళి, అటూ ఇటూ కాస్త పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా అని మనవడికి భరోసా ఇచ్చి కన్ను మూస్తుంది...
స్థూలంగా ఇదీ కథ...అయితే, కథ ఆద్యంతం, తెలుగు భాష తీయదనం ప్రవహిస్తూ ఉంటుంది...బామ్మల దగ్గర బాల్యాన్ని గడిపిన అదృష్టవంతులందరూ ఈ కథలో తమ బాల్యాన్ని పోల్చుకుంటారు.
"పెద్దతనపు నస, అత్తగారి సాధింపులూ, వేధింపులూ బామ్మ దగ్గరలేవు"...
ఎవరైనా ఈ ముసలమ్మకి భయం భక్తీ రెండూ లేవు అంటే " దయ కంటే పుణ్యం లేదు..నిర్దయ కంటే పాపం లేదు...చెట్టుకి చెంబెడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్నవాడికి పట్టెడు మెతుకులు పెట్టడం,....నాకు తెలిసిందివే" ...
"మండువా లోగిలి పమిట కప్పుకు నిలబడ్డ పెద్ద ముత్తయిదువలా ఉండేది"...
"పిచ్చి సన్నాసీ! దేవుళ్ళు నిద్దరోతార్రా! దేవుడు నిద్దరోతే ఇంకేవైనా ఉందీ!! మేలుకొలుపులూ మనకోసమే, చక్కెర పొంగలీ మనకోసమే!!"
"బాదం చెట్టు భోషాణం"..
"విచ్చిన గులాబీలు కుక్కినట్టు డబ్బా నిండా పీచుమిఠాయిలు"...
"నాది అనుకుంటే దు:ఖం, కాదు అనుకుంటే సుఖం"...
"దేవుడు ఏడుస్తుంటే ఎంత భయం వేస్తుంది---దిక్కులేని వాళ్ళకి"...
"ఆ నవ్వు కొండంత ధైర్యమై నన్నావరించింది"..
"ఉపోషం ఉంటే పిల్లాడి వాతలు పోతాయా?"..
" పిల్ల పొందిగ్గా ఉంది...పచ్చగా దొరసానిలా ఉంది...కళ్ళు కజ్జికాయల్లా ఉన్నాయి...నాలుగు కాసుల బంగారం ఒక్క ముద్దుకి చెల్లు..."
"అరటి దూట కూరకీ, ముగ్గులకీ బోలెడు ఓర్పూ, నైపుణ్యం కావాలి...అలాంటి అమ్మాయి సంసారాన్ని చక్కదిద్దుగోగలదు.."
"ఆ పిల్ల గోరింటాకుతో పారాణి పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి.. నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడి నోరు పండాలి...అదీ ఇదీ అయి ఆనక మీ కడుపు పండాలి"...
ఇలాంటి మనసు నిండే వాక్యాలు ఇంకా ఎన్నో ఈ కథలో, అన్నీ చెప్పాలంటే మొత్తం కథ చెప్పాలి...ఈకథని ఈపాటికి మీరందరూ చదివే ఉంటారు. చదవకపోతే తప్పనిసరిగా ఒక్కసారైనా చదవండి....ఒక్క సారి చదివాక, ఆరోజే మరో నాలుగైదు సార్లు చదవకుండా ఉండలేరు...ఇంత మంచి కథను చదవడం మిస్ అయ్యరంటే మాత్రం జీవితంలో కొన్ని అనుభూతులను మిస్ అవుతున్నట్లే...
మీ స్పందనని తెలియపర్చడం మర్చిపోవద్దు...
చిన్నతనంలో మేము చదివిన స్కూల్ లో ప్రతిరోజూ మూడు భాషల్లోనూ, డిక్టేషన్ వ్రాయించేవారు....ఈ మూడు భాషల టీచర్లూ క్లాసులోకి రాగానే ముందు డిక్టేషన్ చెప్పవలసిందే..ఆ తరువాత హోం వర్కులు చూసి, అప్పుడు కొత్త పాఠం మొదలుపెట్టడం...మూడు భాషలోనూ డబల్ రూల్ పుస్తకాల్లో కాపీ రైటింగ్ వ్రాయాల్సిందే....అందువల్ల మాకు ఇప్పటికీ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా వ్రాయడం వస్తుంది. మిగిలిన గ్రూప్ సబ్జెక్ట్స్ కి ఎంత విలువ ఇచ్చేవారో, తెలుగు, హిందీ, ఇంగ్లీషు కీ అంత ప్రాధాన్యత ఇచ్చేవారు...ప్రతి సబ్జెక్ట్ లోనూ పాఠాలు వివరంగా చెప్పటం, పద్యాలు అయితే రాగయుక్తంగా పాడటం, పిల్లలచేత పాడించటం చేసేవారు మా టీచర్లు...మా హెడ్మిస్త్రెస్స్ పిల్లలతో ఎంత చనువుగా ఉండేవారో, తప్పు చేస్తే అంతగానూ శిక్షలు ఉండేవి...పిల్లల్తో చాల కలిసిమెలిసి ఉండేవారు ఆవిడ. ప్రతి విద్యార్థీ ఏ క్లాసు, ఏ సెక్షను అనేది ఆవిడకి ఎప్పుడూ గుర్తే...ప్రైవేటు స్కూల్ అయినా కూడా ఆవిడ మమ్మల్ని అన్ని పోటీలకూ పంపేవారు, అన్ని పరీక్షలూ వ్రాయించేవారు. ఏవో కేంద్ర ప్రభుత్వ పరీక్షలూ, తి.తి.దే. వారి పరీక్షలూ ..ఏమిటో చాలా చాలా వ్రాసేవాళ్ళం...ఒక్క చదువే కాకుండా చాలా ఇతర వ్యాపకాలలోనూ, ఆటల్లోనూ కూడా చాలా పోటీలకు వెళ్ళి, మా స్కూల్ పిల్లలు ఎన్నో బహుమతులు గెల్చుకునే వారు. ...మా హెడ్మిస్టెస్ టీచర్లను ఎలా సెలెక్ట్ చేసుకునేవారో కానీ, ఒక్కొక్కరూ ఒక్కో ఆణిముత్యం... పుస్తకాల్లో పాఠాలే కాక, ఎన్నో జీవిత పాఠాలు కూడా నేర్చుకున్నాం వారి దగ్గర...ఈరోజుకి, మేము ఉద్యోగాలు చేయకపోయినా, మా పిల్లలకు ట్యూషన్లు లేకుండా సొంతంగా ఇంట్లో చదువుచెప్పుకుని, వాళ్ళకు ఇంత క్రమశిక్షణ నేర్పగలిగాము అంటే అదంతా మా టీచర్లు, హెడ్మిస్ట్రెస్ చలవే...ఆ స్కూలు 1983 లో వదిలేసినా, ఈరోజుకి తలుచుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది నాకు...ఇప్పటికీ మా స్కూల్ మీద, మా టీచర్ల మీద గౌరవభావం , ప్రేమ అలాగే ఉన్నాయి నాకు..నాకే కాదు, మా స్కూల్ పిల్లలందరికీ అంతే బహుశా...
ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదూ..కాకినాడలో అప్పట్లో పేరెన్నిక గన్న స్కూల్....టాగూర్ కాన్వెంట్ హై స్కూల్...హెడ్ మిస్టెస్ పేరు శ్రీమతి సి.ఎం. ఇందిరా దేవి గారు. తెలుగుకి సుబ్బలక్ష్మి టీచర్, లెక్కలికి జోసెఫ్ మాస్టారు, సైన్స్ కి రాఘవలక్ష్మి టీచర్, పి.వి. శర్మ గారు, సోషల్ కి సావిత్రి మేడం, హిందీకి పద్మావతి టీచర్, పి.టి. సర్ సూర్యనారాయణ గారు, డ్రాయింగ్ కి సత్యనారాయణ సర్, ఇంగ్లీషుకి ఛార్లీ మాస్టారు...అబ్బబ్బ....అందరూ ఎంత బాగా చెప్పేవారో....
ఇవీ మా స్కూల్ విశేషాలు...ఉపాద్యాయ దినోత్సవ సందర్భంగా మా జీవితాలను తీర్చిదిద్దిన ఆ గురువులందరికీ పాదాభివందనాలు...
మీ అందరి స్కూల్ విశేషాలు కూడా పంచుకోండి మరి...