Friday, 31 July 2015

శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 
అందమైన శరీరం, అంతే అందమైన జీవితభాగస్వామి, పిల్లలు, మంచి కీర్తి, శుభలక్షణాలు కలిగిన ఆలోచనా విధానం, మేరువంతా ధనం ఉన్నా, గురువు పాదాలయందు మనస్సు లగ్నం కాకపోతే, అవన్నీ ఉంటే ఎంత? లేకపోతే ఎంతా? అన్ని ఉన్నా, వ్యర్ధమే అంటారు గుర్వష్టకంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. 
గురు శిష్యుల నుంచి ధనం కోరడు. అసలు గురువు డబ్బవసరమే లేదు. ఆయన అఖండ వైరాగ్య సామ్రాజ్యానికి అధిపతి. మరి గురువుకు దక్షిణంగా మనమేం ఇవ్వగలం? సహనం, శ్రద్ధలే మీరు నాకు దక్షిణగా సమర్పించండి అన్నారి సమర్ధ సద్గురు శ్రీ షిరిడీ సాయినాధుడు. గురువు అన్నీ ఇవ్వగలిగినా, శిష్యుడి పవిత్రతను చూస్తాడు. అతడి స్థాయి పెరగాలని భావన చేస్తాడు. అడ్డగ్గానే ఇవ్వకుండా అతనికి అనేక వ్యతిరేక పరిస్థితులు కల్పించి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు. అవలక్షణాలు తొలగిస్తాడు. ఇవన్నీ తట్టుకోవాలంటే ముందు గురువు యెడల నమ్మకం ఉండాలి. దాంతో పాటు సహనం కూడా ఉండాలి. ఏం జరిగినా ఓర్పు వహించాలి. గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఉన్నదని తెలియడానికే సమయం పడుతుంది. దానికి సహనం అవసరం.
గురువు చెప్పినది సత్యము, అదే ఆచరణీయమని, మనసులో స్థిరంగా భావన కలిగి ఉండటం, గురువు చెప్పినదాన్ని ఆచరించడం, నిత్య జీవితంలో అనుష్టించడాన్నే శ్రద్ధ అంటారు. గురువు ఏదో తన పూట గడుపుకోవడం కోసం మాటలు చెప్పడు. ప్రేమ, కరుణా, దయా పొంగి ప్రవహించగా, శిష్యులను ఉద్ధరించడం కోసం, తాను ఉత్కృష్టమైన సమాధి స్థితి నుంచి క్రిందకు దిగి వచ్చి, బోధ చేస్తాడు. శిష్యులు తనను పూజించాలని గురువు భావించడు, తన బోధను ఆచరించాలని మాత్రమే కోరుకుంటాడు. గురుబోధను ఆచరించకుండా ఎన్ని పూజలు చేసినా, గురువు మెచ్చుకోడు. అందువల్ల గురువు చెప్పిన విషయాన్ని ఆచరించడమే శ్రద్ధ. అదే గురుదక్షిణ.
గురుపూర్ణిమ వేదవ్యాసమహర్షి జయంతి సందర్భంగా చేస్తారు. వ్యాసభగవానుని కారణంగానే మనకు ఇంక వాఙ్గ్మయం వచ్చింది. ఎవరు చెప్పినా, ఆయన చెప్పినదే చెప్పాలి కానీ కొత్తగా ఏమీ చెప్పలేరు. చెప్పడానికి ఏమీ లేదు కూడా. అందుకే ఈ రోజున తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని పూజించాలి.

Wednesday, 29 July 2015

ఒకరోజు ఒక రైతు కు చెందిన ఒక గాడిద నూతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా గాని, దానిని రైతు పైకి తీయలేకపోయాడు. ఆ గాడిద సహాయం కోసం ఎంతో అరిచింది. కాని రైతు వల్ల కాలేదు. గాడిద కూడా ముసలిది అయిపోయింది, బావి కూడా పాడుపడినదే కదా అని ఆలోచించి ఆ రైతు గ్రామస్థులందరినీ పిలిచి ఆ బావిని కప్పేద్దాం అని చెప్పాడు. అందరూ పక్కన ఉన్న మట్టిని తవ్వి బావిలో వేయసాగారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, బావిలో పడుతున్న మట్టిని ఆసరా చేసుకుని , తనపైన పడుతున్న మట్టిని ఒక్కసారి విదిలించి దులిపేసుకుని, ఆ గాడిద ఒక్కో అడుగు పైకి రావడం మొదలుపెట్టింది. ఆఖరికి చక్కగా బావినుంచి పైకి వచ్చేసింది.
ఈ కథ కూడా మన జీవితం లాంటిదే. జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఇరుగుపొరుగు వాళ్ళు మనమీద ఎప్పుడూ బురద తవ్వి పోస్తూ ఉండదానికే ప్రయత్నిస్తారు. ఆ బురద భరిస్తూ, కడుక్కుంటూ అక్కడే ఉండాలా, లేదా ఆ బురదను దులుపుకుని ఒక్కసారి తల విదిలించి పైకి రావాలా అనేది మన చేతిలోనే ఉంది. జీవితం లో ఎదురయ్యే ప్రతి వైఫల్యాన్ని మనం ఒక్కో మెట్టుగా వాడుకొని పైకి రావాలి. ఎదగాలి.వాళ్ళు వేసే బురదను మనం మౌనంగా కడుక్కుంటున్నంత కాలం మనమీద బురద వేస్తూనే ఉంటారు. మన మీద బురద చల్లిన వాళ్ళకు ఆ బురద వారి మీదే పడినట్టు మన ఎదుగుదల ద్వారా సమాధానం చెప్పాలి.
సంతోషంగా జీవించడానికి పంచ సూత్రాలు.
1. మీ హృదయంలో ద్వేషానికి చోటు ఇవ్వకండి---శతృవులను క్షమించండి ( ఇది మీ శతృవులకు చేసె ఉపకారం కాదు. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం మనము చేసుకునే సహాయం)
2. మనం చాలా సాధారణంగా ఆందోళన చెందే విషయాలు ఎప్పటికీ జరగవు. అయినా మనం భయపడుతూ ఉంటాము. అటువంటి ఆందోళనలు మనసుని, ఆరొగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అటువంటి ఆందోళనలను పూర్తిగా మనసు నుంచి తొలగించండి
3. ఏదో లేదు అని బాధపడకుండా, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించండి. జీవితంలో సంతౄప్తి వలన కలిగే లాభం అంతా ఇంతా కాదు.
4.ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం అలవాటు చేసుకోండి. సంపదనైనా, సమయాన్నైనా...
5.ఎదుటివారి నుంచి తక్కువ ఆశించండి. ఎందుకంటే, మనం ఆశించినంత ఎప్పుడూ ఎదుటివారి నుండి పొందలేము. అది ప్రేమైనా సరే.....
ఏదైన వస్తువు కొనుక్కునేటప్పుడు మనం మరింత ఆకర్షణీయమైనది, మరింత మెరుగైనదే కొనుక్కుంటాము. మరి ఒకేఒక్కసారి లభించే ఈ జీవితాన్ని మరింత మెరుగ్గా ఎందుకు జీవించకూడదు? మరింత ఆకర్షణీయంగా ఎందుకు మలచుకోకూడదు? ఆలోచించంది.
సృష్టిలో ప్రతి చెట్టూ-పిట్టా, నీరూ-నిప్పు, జంతువులు, కీటకాలు అన్నీ ఏదొ ఒకరకంగా పర్యావరణానికి మేలు చేసేవే....ప్రకృతిని తన స్వార్ధం కోసం వాడుకుంటూ తనకు జీవమిచ్చిన ప్రకృతినే నాశనం చేసేది జంతువులలో అత్యంత తెలివైన మానవుడు ఒక్కడే.....మిగతా జంతువులకు పాపం చదువు లేదు, మెదడు లేదు, కాబట్టి వాటికి పొరుగువాడికి హాని చెయ్యడం తెలియదు. ఉన్నంతలో అవి పర్యావరణానికి సాయపడతాయి. నీరు, చెట్లు, పక్షి, పిట్ట అన్నీ మనకు సహాయపడేవే....మరి మనం ఎంతవరకు ప్రకృతికి సహాయపడుతున్నాం?
పుష్కరాలకు మేము వెళ్ళలేకపోయినా హైదరాబాదు నుంచి మా అక్కా వాళ్ళు వెళ్ళారు. పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, రాజమండ్రి వాసుల ఆదరణ, ఆప్యాయత గురించి చాలా బాగా చెప్పారు.మొదటి రోజు జరిగిన విషాదానికి అందరూ బాధపడుతున్నా, అక్కడ ఉన్న సౌకర్యాల గురించి అందరూ చాలా బాగా చెప్పుకుంటున్నారు. నదీజలాల్లో భక్తులు వేస్తున్న పూలు, దొప్పలు ఇవన్నీ వెంటవెంటనే జల్లించి, తీసేస్తున్నారుట. మా ఇంట్లొ ఒక కోడలు రాజమండ్రి అమ్మాయే....నిజంగా వారి ఇంట్లో మర్యాదలు చాలా బాగా చేస్తారు. ఇక వివిధ స్వచ్చంద సంస్థలు కూడా యాత్రికులకు ఆహారం విషయం లో ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నాయట. రాజమండ్రి కుర్రాళ్ళు కూడా యాత్రికులకు దారి చెప్తూ, ఇంకా ఎన్నో రకాల సహాయం చేస్తున్నారుట. పుష్కరాలకు వెళ్ళలేకపోయామే అనే బాధ కన్నా, అటువంటి ఆదరణ ప్రత్యక్షంగా చూడలేకపోయామే అని ఎక్కువ బాధ కలిగింది. మా ఊరుకు వచ్చిన వారు మాకు అతిధులే కదండీ అని వారు చేస్తున్న సేవల్లో భాగం పంచుకోలేకపోయామే అనుకున్నాం. దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు....ఇందుకే...
whatsapp లో నాకు అందిన ఒక గజల్ కి అనువాదం. ఉర్దూ సాహితీ ప్రక్రియ లో "నజ్మ్" అంటారు. "నజ్మ్ " అంటే అందులో విషయం ఒక కథ రూపంలో చెప్పబడుతుంది. గీత రచయిత "జఫర్ గోరఖ్పురి ". మానవ జీవన పరిస్థితులు తర తరానికీ ఎలా మారుతున్నాయో, హృద్యంగా వర్ణించారు.. ప్రముఖ గజల్ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ గారి గళం నుంచి వెలువడిన గీతం ఇది. నాకు తెలిసినంత వరకు అనువాదం చేశాను.
ఏ కాలం అయినా, సుఖ దుఖాలు, కష్ట నష్టాలు మనవారికైనా, పరాయి వారికైనా ఒకటే. కాని ఇప్పటి కాలం కన్నా ఆ కాలం బాగుందేమో!
అప్పటి ఇళ్ళు మట్టివైనా, పూరిల్లైనా గాలి ధారాళంగా వచ్చేది. దొంగలు, బందిపోట్ల భయం ఉండేది కాదు, నాలుగు వేళ్ళు నోట్లోకి పోకపోయినా ( కడుపు నిండా తిండి లేకపోయినా) సుఖమైన నిద్ర పట్టేది. మధ్యాహ్నాలు ప్రశాంతంగా, సాయంకాలాలు సందడి సందడిగా గడిచేవి. అందరి హృదయాలు సంతోషం తో నిండి ఉండేవి. మనస్సుల్లో కల్మషం లేదు, కళ్ళల్లో కపటం లేదు. ప్రజలు అమాయకంగా, మనసులలో ప్రేమతో ఉండేవారు. కానీ, వారందరూ ఈ ప్రపంచాన్ని త్వరగా వీడి పోయారు. ( ఆ తరం త్వరగా కనుమరుగైంది.)
మా నాన్నగారి కాలం వచ్చింది. ( కొంచెం తర్వాతి కాలం) కొత్త చదువులు వచ్చాయి. కొత్త చదువులతో పాటు కొత్త ఆలోచనలు వచ్చాయి. మట్టి ఇళ్ళు పోయి, పక్కా ఇళ్ళు వచ్చాయి. ఆఫీసు ఉద్యోగాలు మొదలై, జీతమే ఆధారం అయింది. భగవంతుని నమ్ముకుని జీవితం సాగించారు. సరిపడేంత డబ్బు లేకపోయినా, జీవితం సుఖం గానే ఉంది. పేదింటి భోజనం అయినా ( విందు భోజనం కాకపోయినా ) సంపూర్ణం గానే ఉంది.
ఇప్పుడు నా తరం వచ్చింది. ఇక్కడ ఎవరికీ ఎవరూ కారు. ప్రతివారు ఒంటరి వారే.ప్రతి ముఖమూ అపరిచితమే. కన్నీళ్ళూ లేవు, చిరునవ్వులూ లేవు. (మనసులు భావ రహితం అయిపోయాయి ) మన వాళ్ళ సంగతే పట్టించుకోని ఒక మాయ కమ్మేసింది. ఆస్తులు, భూములు, బంగళాలు, కార్లు, నౌకర్లు, చాకర్లు, పదవులు, పరువు, ప్రతిష్ట, అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి అనే భ్రమలో, ఉన్నది ఏమి పోగొట్టుకుంటున్నామో గ్రహించుకోవడం లేదు.
రాబోయే తరం వాళ్ళందరికీ ఒక వినతి. మేము ఏ ఏ కష్టాలు అనుభవించామో, ఏ ఏ దుఖాలు సహించామొ అవి మీ దగ్గరకు కూడా రాకూడదు. మేము ఏ ఏ కష్టనష్టాలు పడ్డామో అవి మీరు పడకూడదు. అందరిలో గుమిగూడి ఉన్నా, మేము అనుభవించిన ఒంటరి తనం మీకు వద్దు. మీరు వెళ్ళే దారిలో వెలుగులు పూయాలి. 21 వ శతాబ్దపు ( ఆధునిక కాలపు ) ఫలాలు మీకు అంది రావాలి. మా తరం వారం, మనశ్శాంతిని కోసం పరితపించాం. మీకు ఆ పరిస్థితి రాకూడదు. మీ మనస్సులలో ఆనందం వేల్లివిరియాలి. జీవితం సుఖమయం కావాలి.
ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను వృద్ధాశ్రమాలాలో చేర్పిస్తున్న కొడుకుల గురించి పత్రికలలో, టీవీల్లో, సామాజిక మాధ్యమాలలో వేలకొద్దీ వ్యాసాలు, కథనాలు వచ్చాయి. సమాజంలో కూడా ఎవరి తల్లితండ్రులనైనా ఆశ్రమాలలో ఉంచుతున్నారు అని వినగానే, వారికి సలహాలు ఇచ్చే పెద్దమన్షులు వేలాదిమంది. వారికి వచ్చే సలహాలు లెక్కలేనన్ని. కావాలని తల్లితండ్రులను ఆశ్రమాలకు పంపించే పిల్లలు చాలా తక్కువమంది ఉంటారు. ఏకారణం లేకుండా కేవలం, వాళ్ళ సౌఖ్యం, సౌకర్యంకోసం, తల్లితండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు అనుభవించడం కోసం అందరూ ఆశ్రమాలలో పెద్దవాళ్ళని వదిలేస్తారు అనుకోవడం చాలా తప్పు. అలా ఎవరైనా వదిలేశారు అంటే, బయటి ప్రపంచానికి తెలియని ఏవొ బాధలు, కష్టాలు వాళ్ళు పెద్దవాళ్ళతో అనుభవిస్తున్నారు అని అందరూ తెలుసుకోవాలి. పెద్దవాళ్ళని ముసలి వయసులో చూడడం ధర్మం, పెద్దవాళ్ళకి చేసిన సేవ మనలను, వంశాన్ని కాపాడుతుంది--కన్నవాళ్ళకే కదా సేవ చేస్తున్నది---ఇటువంటి మాటలు చెప్పడం చాలా తేలిక. ఇవి అందరికీ తెలిసినవే. కాని అన్నీ తెలిసి కూడా ఆ నిర్ణయం తీసుకున్నారంటే, వారు ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎంత సంఘర్షణ పడి ఉంటారు అనేది అందరూ గుర్తించాలి. కొన్నిచోట్ల, ఇటువంటి సందర్భాలలో కేవలం ఇంటిలోని కోడలిదే తప్పు అన్నట్టు, కొడుకు ఎంతో ఉత్తముడైనట్టు మాట్లాడతారు. పెద్ద పెద్ద నిర్ణయాలు అనేవి భార్యభర్త కలిసి తీసుకునేవె అయి ఉంటాయి సాధారణంగా. ఈ పోస్ట్ వ్రాసినందుకు ఈ సమూహం లోని సభ్యులు అందరూ ముక్కున వేలు వేసుకుని, అఔరా, ఎంతకు తెగించింది అని నామీద విమర్శల సుదర్శన చక్రాలు సంధిస్తారు అని నాకు తెలుసు. కొంతమంది పెద్దలు ఇంట్లో, వాళ్ళకు ఏమీ పట్టనట్టు, ఇంట్లో వాళ్ళు పనితో ఎంత సతమతమవుతున్నా, ఏదో లాడ్జ్ రూం లో ఉన్నట్టు ఉంటారు. కోడలో, కూతురో ఎవరైనా కానీ, పనితో అలసిపోతున్నా, పట్టనట్టు ఉంటారు. వారికి అన్నివేళలా, అన్నీ అందిస్తూ ఉండాలి. మంచం పట్టిన వాళ్ళైతే చేయడం లో అర్ధం ఉంది. కానీ, చేయించుకోవడం మా జన్మహక్కు అన్నట్టు ఉండేవారితోనే అవస్థలు. కొంతమంది అన్ని విషయాలలోనూ తల దూరుస్తూ ఉంటారు. అవసరమైనంత వరకే సలహాలు ఇవాలి కానీ, అయిన వాటికీ, కాని వాటికీ జోక్యం కలుగచెసుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వారికి ఎంత చెప్పినా అర్ధం కావు. కొంతమంది పెద్దలకు వారి డబ్బు అంటే ఎంత ప్రాణమో! ఇవతల వారి సంతానం ఎంత ఖర్చుల్లో ఉన్నా , కొంచెం కూడా చేయూత అందివ్వరు. కొంతమంది అయినవారికి ఆకుల్లోనూ, కానివారికి కంచాల్లోనూ అన్నట్టు ఉంటారు. కొంతమంది వయసులో ఉన్నన్నాళ్ళూ ఆస్తిపాస్తులు అర్ధం లేని విషయాలకి తగలేసి, అంతా అయిపోయినతర్వాత వారసుల ఇళ్ళకి వస్తారు. అక్కడ కూడా రాజసం వదలకుండా ప్రవర్తిస్తారు. మరికొంతమందికి అల్లుడు/కోడలు వైపు బంధువులు వస్తే సుతరామూ ఇష్టం ఉండదు. వారిని ముప్పుతిప్పలు పెట్టాలి అని చూస్తారు. కొంతమంది వారికి కేటాయించిన గదులు, బాత్రూంలు ఎంత అసహ్యంగా ఉంచుకుంటారో! వాటిని శుభ్రం చేయడానికి పనిమనుషులు కూడా ఒప్పుకోరు. ఇద్దరు ముగ్గురు వారసులు ఉన్నవాళ్ళు, ఒకరి దగ్గర ఉన్నప్పుడు మరొకరిని, లేదా మరొకరి వారసులని పొగుడుతూ ఉంటారు. వారు చెప్పేవి నిజాలే అయినప్పటికీ, పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. కొంతమంది అల్లుడు/కోడలు చేసే పనులను, ప్రతినిముషం విమర్శిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఆరోగ్య రీత్యా కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోరు. ఇక ఏకైక సంతానం కలవారికి పెద్దవాళ్ళను ఇంట్లో ఉంచి ఏ ఫంక్షన్ కైనా, ఊరైనా వెళ్ళాలంటే ఎంతో కష్టం. ఇవన్నీ వినడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ అనుభవించేవాళ్ళకు తెలుస్తుంది అందులో బాధ. ఇవన్నీ కూడా భార్యా భర్త మధ్య రోజూ పోట్లాటలు పెంచేవే. రోజూ పడే నరకయాతన కన్నా ఎవరో ఒకరు దూరంగా ఉంటే సమస్య తీరుతుంది అనుకున్న నిమిషాన పెద్దవాళ్ళను ఆశ్రమాలలో ఉంచాలి అనే నిర్ణయం జరుగుతుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా ఉండరు అని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళకు ఒక మనవి---మీరు అదృష్టవంతులు కాబట్టి, మీ తల్లితండ్రులు మీ మనసు ఎరిగి ప్రవర్తిస్తున్నారు. మీరు మీ పెద్దవాళ్ళని ఆశ్రమంలో పెట్టలేదు అంటే, అది వారి సర్దుబాటుతనం, మంచితనం. సర్దుబాటుగా ఉండే పెద్దవాళ్ళను దూరం చేసుకోవాలి అని ఎవరూ అనుకోరు. అందరం కలిసే కలో, గంజో తాగుదాం అనే అనుకుంటారు. ఇంకా పిల్లలకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చి పెద్దలను ఎవరూ చూసే అవకాశం లేకపోతే, కూడా ఆశ్రమాలు ఆదుకుంటాయి. అంతమాత్రాన, పిల్లలను అనాగరికులుగా, సంస్కారం లేనివాళ్ళుగా, పాలు తాగిన రొమ్మునే గుద్దేవాళ్ళుగా ముద్రవేయకండి. పెద్దవాళ్ళు కూడా కొంచెం సర్దుబాటుగా ఉంటే, ఏ సమస్యలూ ఉండవు. పెద్దవాళ్ళు అన్ని విషయాలలోను, చిన్నవాళ్ళకు ఆసరాగా ఉండాలి అంతే కాని ఎందుకీ లంపటం నాకు అని మీ పిల్లలు అనుకునే విధంగా ఉండకూడదు.
సభ్యులు, పెద్దలు కృష్ణప్రసాద్ ఆలూరి గారు ఒక గ్రూప్ లొ పోస్ట్ చేసిన లేపాక్షి గారి కార్టూన్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఇది. నిజమే కదా, మనం మనకోసం కన్నా, ఎదుటివారి కోసమే ఎక్కువ బతికేస్తున్నాం. పెళ్ళిళ్ళకి వెళ్ళెటప్పుడు, " ఇది ఒకసారి కట్టేసుకున్నాను వాళ్ళ ఇంటికి, ఇప్పుడు కూడా అదే కట్టుకుంటే నవ్వరూ" అనే డైలాగ్ చాలా మంది దగ్గర విన్నాను నేను. పక్క వాళ్ళ కన్నా పెద్ద టీవీ మన ఇంట్లో ఉండాలి. పొరుగు వారింట్లో కారు ఉంటే మనమూ కొనేయ్యాలి, లేకపోతే "కారు కూడా లేదు అనుకుంటారేమో", కొంత మంది మరీ చనువుగా, ఇంకా కారు కొనలేదా, ఈపాటికి ఉండాల్సిందే మీ ఇంట్లో...అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ఎంత వేసవి కాలం లో అయినా, ఎంత ఉక్కపోతలో అయినా, గరగరలాడుతూ పెద్ద జరీ అంచు పట్టు చీరలే కట్టుకోవాలి., మన సౌకర్యం కోసం నేత చీరలు కట్టుకుంటే, "ఏమనుకుంటారో అందరూ"? ---- మన ఆలోచనలు ఇంతవరకే పరిమితం. దీనిని మించి ఆలోచించలేము. ఒక విధంగా మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పట్టుచీరల, నగల ప్రదర్శన వేదికలు. కొంచెం తక్కువగా ప్రదర్శించిన వాళ్ళకి తరువాతి ఫంక్షన్ లో విలువ ఉండదు. వాళ్ళను పన్నెత్తి పలుకరించరు... ఆఖరికి మన పిల్లల చదువుల విషయం లో కూడా ఇలాగె ప్రవర్తిస్తున్నాం మనం. ఇంజినీరింగో, మెడిసినో తప్ప, ముఖ్యంగా తెలుగు ప్రజలకు వేరే ఏదీ ఉన్నత చదువు కాదు. బయట ప్రపంచం లో ఎంత పోటీ ఉన్నా సరే, ఉద్యోగాలు దొరకక పోయినా సరే, మనకు చదువు అంటే ఆ రెండు కోర్సులే. మన పిల్లవాడికి చదివే మేధ ఉందా లేదా మనకు అనవసరం. పక్కవాళ్ళు అదేదో కార్పొరేట్ కాలేజ్ లో చేర్పిస్తే, మనం స్తోమత ఉన్నా, లేకపోయినా, అప్పు చేసి మరీ అదే కాలేజ్ లొ జాయిన్ చేస్తాం. తీరా వాళ్ళు ఎంట్రన్స్ లు పాస్ అయ్యి, ప్రొఫెషనల్ కాలేజ్ కి వెళ్ళాకా అ చదువు బుర్రకు ఎక్కక, మధనపడి, మానసిక సంఘర్షణ పడిన విద్యార్థులు ఎందరో....పుట్టినరోజు పార్టీలు, ఆఖరికి శ్రావణ మంగళవారం నోములలోకి కూడా ఈ కార్పొరేట్ కల్చర్ చొచ్చుకు వచ్చేసింది. వచ్చిన పేరంటాళ్ళకు జ్యూసులు, టిఫిన్లు, కాఫీలు, అంతా అదో వేలం వెర్రి అయిపోయింది. ఇంక మన ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మన డబ్బు, దర్పం, హోదా ప్రదర్శించడానికి అవి ప్రధానమైన వేదికలు. ఒక్కో పెళ్ళికి 20 నుంచి 25 లక్షల వరకూ ఖర్చు అవుతోంది అంటే, జీవితాంతం సంపాదించినది అంతా ఒక్క పెళ్ళి ఖర్చుతో సరి అన్నమాట. ఒకళ్ళు 40 ఆధరువులు, మరొకరు 60, మరొకరు 100, ఇంకొకరు 150.....60 వంటకాలలో ఎంతమంది ఎన్ని తింటారు? 60 ముద్దలు తినడానికి పొట్ట పడుతుందా అసలు....అవసరమైన చోట ఖర్చు పెట్టడం లో తప్పు లేదు. మండపం అలంకరణకి విదేశీ పూవులు, ఇన్నిన్ని ఆహార పదార్థాలు అవసరమా? ఉత్తర భారతం లోని వేడుకలు అయిన మెహెందీ, సంగీత్ మన పెళ్ళిళ్ళలో కూడా చోటు చేసుకుంటున్నాయి. డబ్బు ఉన్నది ఖర్చు పెట్టుకోవడానికే కదా అని సాగతీతలు. డబ్బు ఉన్నవారు ఖర్చు పెట్టుకొంటున్నారు సరే, లేనివాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడుతోందిగా...ఇప్పుడు పెళ్ళికూతురే, అలా చేయకపోతె బాగుండదు, నా ఫ్రెండ్స్ నవ్వుతారు అంటే ఎం చేయాలి? అలాగే జరుగుతోంది కూడా. మనం మనలాగా, మన కుటుంబ పధ్ధతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం జీవించడం మర్చిపోయాము. మన జీవితం పక్కవాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి నడుస్తోంది. మనకు ఉన్న డబ్బు, సంపద హోదా మీద ఆధారపడి నడుస్తోంది.
పెళ్ళిళ్ళల్లో, శుభ కార్యాల్లో, మన బరువు, బాధ్యత కొంత తగ్గించుకోవడానికి " event managers " ప్రవేశించారు. మరి ఆప్యాయతలు, మమకారాలు, బంధుత్వాలు ----ఇవి కూడా బరువేనా? అందరూ తగ్గించేసు కుంటున్నారు ?పలకరింపులు కూడా ఉండటం లేదు. వధూవరుల ముఖాల్లో ఒక సిగ్గు, కొత్తదనం ఉండడం లేదు. భోజన ఏర్పాట్లు ఎలాగో ఎక్సిబిషన్ గ్రౌండ్ లాగా ఉంటోంది. ఉన్న అన్ని స్టాల్స్ లో ఎక్కడ ఏ భోజనం కావాలంటే అది వడ్డించుకుని తినటం. తేడా ఏంటంటే, బయట డబ్బులిచ్చి తినాలి. ఇక్కడ డబ్బులు ఇవ్వక్కరలేదు. అయిన వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళినా, గుడిలో కల్యాణానికి వెళ్లినట్టు, ఏదో పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్లినట్టు ఉంటోంది కాని, కడుపూ నిండటం లేదు, మనసూ నిండటం లేదు. 15, 20 లక్షలు ఖర్చు పెట్టినా, పెండ్లి చేసిన వారికీ కాని, చూసిన వారికీ కాని, తృప్తి సంతోషం ఉండడం లేదు. భారత దేశం లోని అన్ని ప్రాంతాల సంప్రదాయాలు కలబోసి, పెళ్లి చేస్తున్నారు కాని, మన పధ్ధతి ఇది అని చెప్పేవాళ్ళు లేరు. ఇలా నేనొక్కదాన్నే అనుకుంటున్నానా? నాలాగా ఇంకా ఎవరైనా బాధ పడుతున్నారా? దయచేసి చెప్పండి ప్లీజ్,
ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ స్వార్ధం కోసం,మన సంస్కృతిని నాశనం చేసారు. ఇంగ్లీష్ చదువులు ఇండియా లో ప్రవేశ పెట్టారు. అందులో మనకు కూడా కొంత ఉపయోగం ఉంది కాబట్టి, మనం కూడా ఇంగ్లీష్ చదువులు నేర్చుకుని, మన పరిశోధనలకు ఊతం ఇచ్చుకున్నమ్. అలా అని, మన సంస్కృతీ సంప్రదాయాలను మనం మర్చిపోవటం లేదు. మూలాలను విమర్శించడం లేదు. కాని కాలం గడిచే కొద్ది మనుషులలో మార్పు వచ్చింది. ఈ మార్పు క్రమం లో మన సంస్కృతీ సంప్రదాయాలు మన చేజారిపోయాయి. ఇంచుమించు ఒక దశాబ్దం తర్వాత మన సంస్కృతీ కి జరుగుతున్నా హాని గమనించు కున్నాము. ఇప్పడు అయినా కళ్ళు తెరిచి, మన పిల్లలకు, ఈ తరానికి మన పురాణాలు , సంస్కృతీ, సంప్రదాయాలను గురించిన అవగాహనా కల్పించడానికి పూనుకున్నాము. మన కన్నా పెద్దలు, రిటైర్ అయి కృష్ణా, రామా అనుకోవలసిన వయసులో ఉన్నవారు కూడా నడుం కట్టి, మనకు, మన పిల్లలకు ఈ టెక్నాలజీ నేర్చుకుని, గ్రూప్స్ ద్వారా ఎన్నో విలువైన విషయాలు అందచేస్తున్నారు. అలాగే, ఈ తరం పిల్లల్లో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్ళకు ఉన్న విజ్ఞానంతో, వాళ్ళకు అందుబాటులో ఉన్న టెక్నాలజీ తో నిజాలు తెలుసుకుని, గతం అంతా వాస్తవం గా జరిగినదే అని ఆధారాలతో సహా నమ్ముతున్నారు. ఇటువంటి సమయం లో మళ్లీ మన సంస్కృతీ మీద, పురాణాల మిద గ్రూప్స్ లో ఒక పోస్ట్ రాగానే, దానిని వ్యతిరేకించడం, దాని మిద చర్చలు జరగడం, పాయింట్ లేకుండా, కేవలం హిందూ ధర్మం మీద వితండం గా వ్యాఖ్యలు చేయడం, ఇవన్ని మంచిది కాదు. మన సంస్కృతిని మన బలం అనుకోవాలి. అంతే కానీ, బలహీనత అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. హిందూ ధర్మం ఏ మతాన్ని ద్వేశించలేదు. ప్రతి వ్యక్తికీ తను నమ్మే దైవాన్ని పూజించే, తన ఇష్టమైన మతాన్ని పాటించే స్వేచ్చ ఇచ్చింది. అందుకని, ప్రతి వాడికీ మనను విమర్శించే అవకాశం మనం ఇవ్వకూడదు. ఇతర మతాల వారి లాగా, బాహ్యంగా కనిపించే మత చిహ్నాలు మనకు లేవు. చూడగానే, వీడు హిందువు అని తెలిసే గుర్తులు మనం పెట్టుకోవడం లేదు. అయ్యా, అమ్మా , , హిందూ ధర్మం లో పుట్టి, శాస్త్రాలు, పురాణాలు తెలుసుకోవడం మీ కనీస బాధ్యత. ఒకవేళ మీ ఇంట్లో ఎవరూ మీకు చెప్పలేక పోతే, ఈ విషయాల మీద ఎన్నో గ్రంధాలు ఉన్నాయి. గూగుల్ ఉంది. మీకు సందేహాలు తీర్చడానికి ఎంతో మంది చక్కటి గురువులు ఉన్నారు. వీలైతే నేర్చుకోండి. లేదంటే, మాట్లాడకుండా కూర్చోండి. దయచేసి, మన శాస్త్రాలను, పురాణాలను హేళన చెయ్యొద్దు. అటువంటి వారికీ ప్రోత్సాహం ఇవ్వద్దు. నమస్కారం
మాకు మా అమ్మమ్మ ఎంతో స్పూర్తి. ఆవిడ ఎంతో తెలివైనవారు. జివితంలో ఎన్నో కష్టనష్టాలు చూసినవారు. మా అమ్మగారికన్నా ఒక విధంగా ఆవిడ దగ్గర్నుంచే ఎక్కువ నేర్చుకున్నామేమో! ఆవిడ మాట్లాదే ప్రతి మాటా ఒక పాఠం. ఒడియాలు పెట్టేటప్పుడు అన్నీ ఒక లైన్ లో ఉండాలి అనేవారు. కొబ్బరి పీచును ఒక చివర బాగా నలగ్గొట్టి, దానితో చెక్క బల్లలకు, కుర్చీలకు గాస్ స్టవ్ కి రంగులు వేసేసేవారు. బ్రష్ కొనుక్కుని వస్తాను కదా అంటే, నువ్వు తెచ్చేవరకు పని ఆగిపోవడంలేదా అని దెబ్బలాడేవారు. చేసిన పని పూర్తి అయినాకనే కాకుండా, చేసేటప్పుడు కూడా చూడడానికి బాగుండాలి అంటూ ఉండేవారు. ఎంత పెద్ద వయసు వచ్చినా, ఎవరి ఇంటికి వచ్చినా, ఖాళీగా ఉండేవారు కాదు. ఆవిడ కు ఎన్నో కుట్లు, అల్లికలు వచ్చు. అవి చేస్తూ ఉండేవారు. ఇంకా ఖాలీ దొరికితే, పిల్లలకు నీతిపద్యాలు చెప్పడమో, కథలు చెప్పడమో చేసేవారు. ఇప్పుడు "ఆల్మనాక్" అని మనం అనుకునేదాన్ని ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఆవిడ మైంటెయిన్ చేసారు. అందులో, ప్రతి కూతురు, అల్లుడు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాలు, మళ్ళీ, వాళ్ళ పిల్లలు, ---ఇలా మొథ్థం ఓ 70 మందికి సంబంధించిన పుట్టినరోజు తేదీలు, పెళ్ళిరోజు తేదీలు, వారి వారి జన్మనక్షత్రాలు, పుట్టిన టైము, ఇవన్నీ ఒక పుస్తకం లో వ్రాసుకునేవారు. ఆవిడ సంతానం లో ఎవరికైనా దూర ప్రాంతాలు ట్రాన్స్ఫర్ అయితే, వాళ్ళు కలిసినపుడు, ఆవిడ అడిగె మొదటి ప్రశ్న, అక్కడా కొత్త కొత్త కూరలు ఏమి దొరుకుతాయి, అక్కడ వాటిని ఎలా వండుకుంటారు? కొత్త కొత్త కుట్లు ఏమి ఉంటాయి? అవి ఎలా చేస్తారు? ఈసారి నువ్వు నేర్చుకుని, వచ్చి నాకు నేర్పించు. ఆరోజుల్లో, మార్కెటింగ్ విషయాలు తెలియక గానీ, లేకపోతే, ఆవిడకున్న ఆర్ట్ కి పెద్ద బిజినెస్ చేసేదేమో ఆవిడ. పెద్దవారి మాట చద్ది అన్నం మూట అనే నానుడిని చక్కగా నిరూపించింది మా అమ్మమ్మ. మరి మీకు కూడా ఇలాంటి పెద్దవాళ్ళతో ఏమైనా జ్ఞాపకాల్లు ఉంటే పంచుకోండి.
ఇటువంటి జనసమ్మర్దం ఎక్కువగా ఉండే రోజుల్లో, ప్రాంతాల్లో అది సినిమా రిలీజ్ అయినా, పండుగ అయినా, మరింకే ఉత్సవం అయినా, అందరికన్నా ఎక్కువ ఇబ్బంది పడేది పోలీసులు. ఆ యా జిల్లాల్లో ఉండే సిబ్బంది చాలక, వేరే జిల్లాల నుండి కూడా నియమిస్తారు. వారికి సరి అయిన వసతి, భొజన సౌకర్యాలు ఉండవు. ఎండైనా, వానైనా వారికి డ్యూటీ తప్పదు. వారి నియమిత స్థానం నుంచి ఒక్క క్షణం ప్రక్కకు తప్పుకునే అవకాశం ఉండదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ స్పందించడానికి కుదరని పరిస్థితులలో, ఇటు ప్రజలు, మీడియా ముందు దుమ్మెత్తిపోసేది వారినే. తీరా ఆ వేడుక గడిచాక వారికి రావలసిన ప్రోత్సాహకాలు కూడా ఎన్నో నెలలు గడీస్తేనే కాని రావు. ఒకవేళ డ్యూటీలో ఉండగా ఏదైనా తప్పు జరిగితే ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి వారిది. మంత్రుల పర్యటనలు, గొడవలు, ఘర్షణలు, ఉత్సవాలు, ప్రత్యేక దినాలు---ఈ అన్ని సందర్భాలలో ప్రజల కోసం ఎక్కువ కష్టపడేది పోలీసులే...
ఒక మంచి కథ;
ఒక యువకుడు తన తండ్రిని ఒక హోటల్ కు తీసుకువచ్చాడు. తండ్రి పెద్దవయసు వాడు అయినందువల్ల, బలహీనత వల్ల అతను ఆహారం తీసుకునెటప్పుడు కొంచెం కొంచెం అతని బట్టల పైన, నేల మీద పడిపోతోంది. ఆ హోటల్ లొ ఉన్న మిగిలిన వారు ఆ పెద్దాయనను కొంచెం చికాకుగా చూస్తున్నారు. కొడుకు మాత్రం మౌనంగా తింటున్నాడు.
తండ్రి తినడం అయిన తరువాత, కొడుకు ఆయనను మెల్లిగా వాష్ రూం కి తీసుకెళ్ళి, ఆయనను శుభ్రం చేసి, బట్టల మీద పడిన అన్నం, ఆహార పదార్థాలను దులిపి, శుభ్రం చేసి, జుట్టు దువ్వి, కళ్ళజోడు సరిచేసి, ఇవతలికి తీసుకువచ్చాడు. ఆ హాల్ లో ఉన్న అందరూ వారి వైపు విచిత్రంగా చూస్తున్నారు. కొడుకు బిల్ చెల్లించి, మౌనంగా తండ్రిని వెంటపెట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఆ సమయం లో, ఆ హాల్ లో ఉన్న వారిలో ఒక పెద్దాయన ఆ కొడుకును పిలిచి "నువ్వు ఇక్కడ ఏమైన వదిలేశావా బాబూ.." అని అడిగాడు. "లేదండీ, నేను ఏమి వదల్లేదు " అని జవాబిచ్చాడు ఆ యువకుడు. అప్పుడు ఆ పెద్దాయన " లేదు బాబూ... నువ్వు వదిలావు, నీ ప్రవర్తనతో, ప్రతి కొడుకుకూ ఒక పాఠాన్ని, ప్రతి తండ్రికీ ఒక ఆశను, ధైర్యాన్ని వదిలి వెల్తున్నవు". అని చెప్పాడు ఆనందంతో.
హాల్ మొత్తం నిశ్శబ్దం అయిపోయింది.
ఇది అంతర్జాలంలో చాలా ప్రాచుర్యం లో ఉన్న కథ. ముసలివాళ్ళను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే విషయాన్ని, ఈరోజుల్లొ పెద్దవాళ్ళను పిల్లలు ఎలా చూస్తున్నారు అనే దానికి ఒక మంచి ఉదాహరణ ఈ కథ.
— with Venkateswara Rao Goteti.
అహా. ఇవాళ న్యూస్ చానల్స్ అన్నిటికీ పండగే పండగ. అన్నిట్లోనూ ఒకటె టాపిక్. "తాళి తెంచుడు" కార్యక్రమం మీద. ఓ గంటో, గంటన్నరో, ఈ చర్చ నడుస్తుంది. టి ఆర్ పి రేటింగ్స్ బాగుంతే, వారం లొ రెండు మూడు సార్లు ఇదే ప్రోగ్రాం ని చూపించెస్తారు. కొతికి కొబ్బరికాయ దొరికినట్టు, వారానికో, రెండు వారాలకో, ఇటువంటి వార్తలు దొరికితే చాలు. తాళి ఎందుకు తీసేస్తున్నారు, అది మహిళలకు ఏ విధంగా అడ్డం అని అడిగితే, తాళి బానిసత్వాన్ని సూచిస్తుందట. అదండీ వారి సమర్ధన. ఈ చర్చల్లో ఒక "మానవతా వాది " కూడా ఉన్నాడండోయ్. ఆయనకు తాళి ఒక్కటే కాకుండా, కన్యాదానం, సంస్కౄత మంత్రాలు కూడా అభ్యంతరమేనంట. కన్యాదానం అంటే, తండ్రి చేతుల్లొ నుంచి, భర్త చేతుల్లొకి, తరువాత కాలక్రమేణా ఆ భర్త గారు చనిపోతే, మరల అన్నదమ్ముల చేతుల్లోకి ఆ స్త్రీ సంరక్షణ బాధ్యత మారడం అనెది ఆయనకు కేవలం వస్తు మార్పిడి లాగా ఉందంటండీ. పెళ్ళి తంతు కేవలం బ్రాహ్మణులే జరిపించాలి అనుకోవడం కూడా ఆయన మనసుకు నచ్చలేదట. వేల వేల దండాలు మీకు "మానవతా వాది " గారు... సెలవ్.
ఒక మంచి పుస్తకం చదివినపుడు వచ్చే సంతృప్తిని మాటల్లో వర్ణించలేము. అన్ని చికాకులకూ, ఒంటరి తనానికీ చక్కటి పరిష్కారం మంచి పుస్తకాన్ని ఎంపిక చేసుకుని చదవడమే. మంచి పుస్తకం ఒక స్నేహితుని వంటిది అని ఎందుకు అంటారో, పుస్తక ప్రియులకే తెలుస్తుంది. చదివడం పూర్తీ అయిన తర్వాత కలిగే మాటలకు అందని ఆ అనుభూతి లో ఒకసంతోషం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది. ఒక కొత్త ఉత్సాహం, ఒక నూతన శక్తి తో శరీరం, మనసు, ఉరకలు వేస్తూ ఉంటుంది. ఒక్కొక్క పుస్తకం పూర్తీ అయినపుడల్లా, కొన్ని కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మెదడులో కొత్త కొత్త కవాటాలు తెరుచుకుంటాయి. పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు పుస్తకాల తోనే తప్ప, మనుషులతో స్నేహం చేయలేరు అని చాల మంది అంటూ ఉంటారు. అది నిజమే నేమో! చక్కటి పుస్తకాలతో చేసే స్నేహం తో ఇహలోక విషయాల మీద ఆసక్తి తగ్గుతూ ఉంటుది అని నా అభిప్రాయం. ఇంటా, బయటా, మనుషులలో, మనసులలో పేరుకుని ఉన్న కాలుష్యాల బారిన పడకుండా మనలను మనం రక్షించుకోవడానికి మన దగ్గర ఉన్న గొప్ప ఆయుధం "మంచి పుస్తకం". ఏమంటారు ఫ్రెండ్స్, మీకు నచ్చిన పుస్తకాల పేర్లు చెప్పండి. ఇక ముందు నేను చదవడానికి హెల్ప్ అవుతుంది.
అనగనగా ఒకసారి ఒక తాబేలు, ఒక కుందేలు ఎవరు వేగంగా పరుగేత్తగలరు అని వాదించుకున్నాయి. ఒక పరుగు పందెం పెట్టుకున్నాయి. అవి రెండూ పందేనికి ఒక దారి నిశ్చయిన్చుకున్నాయి. పందెం ప్రారంభించాయి. కుందేలు కొంతసేపు వేగంగా పరుగెత్తింది. తానూ తాబేలు కన్నా చాలా ముందు ఉన్నాను అని అనుకోని, ఒక చెట్టు కింద కూర్చుని అలసట తీర్చుకుని మళ్లీ పరుగేడదాం అనుకొంది. ఒక చెట్టు క్రింద అలాగే నిద్రపోయింది. తాబేలు మెల్ల మెల్లగా వచ్చి కుందేలు నిద్ర లేచేలోపు గమ్యానికి చేరుకొంది. కుందేలు నిద్ర లేచి, తాను పందెం ఓడిపోయాను అని గ్రహించింది.ఇది మనం చిన్నతనాల్లో నేర్చుకున్న కథ. తెలివి, పట్టుదల ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం, అతి విశ్వాసం వాళ్ళ విజయం చేజారుతుంది అని నీతి.
దీనికి కొనసాగింపు ఎలా ఉంటుందో చూద్దాం.
కుందేలు ఓడిపోయినందుకు నిరుత్సాహ పడి ఏమి చెయ్యల అని ఆలోచించింది. తాను కేవలం నిర్లక్ష్యం, అధిక ఆత్మ విశ్వాసం, వల్లనే ఓడిపోయాను అనుకుని, తను అలా ఉండకపోతే, తాబేలు ఎన్నటికీ గెలిచేది కాదు అని, తాబేలుకు గెలిచే అవకాశం తనే ఇచ్చాను అనుకుని బాధపడింది.మళ్లీ తాబేలును పందేనికి పిలిచింది. తాబేలు ఒప్పుకుంది.ఈసారి కుందేలు మధ్యలో ఎక్కడా ఆగకుండా ఒక్కబిగిన పరుగెత్తింది. తాబేలు కన్నా ఎంతో ముందు గమ్యం చేరి పందెం గెలిచింది. ఇందులో నీతి ఏంటంటే, పట్టుదల, పరిశ్రమ ఉన్నవాడు ఎప్పుడూ నెమ్మదిగా ఉండేవాడి పైన విజయం సాధిస్తాడు.
ఈ కధకు మరింత కొనసాగింపు...
పందెం ఇదేవిధంగా ఉంటె తాను ఎప్పటికీ కుందేలును గెలవలెను అని తాబేలు అనుకుంది.
ఇలా అలోచించి, కుందేలు తో ఇంకో దారిలో పందెం వేసుకుందాం అని పిలిచింది. కుందేలు ఒప్పుకుంది.
పందెం మొదలయ్యింది. ఈసారి కూడా గెలవాలి అనే పట్టుదలతో, కుందేలు ఎప్పట్లాగే వేగంగా పరుగెత్తింది. అయితే మధ్యలో ఒక నది అడ్డువచ్చింది. ఆ నదికి ఆవలి వైపున రెండు కిలోమీటర్లు దాటితే, వాళ్ళ గమ్యస్థానం వస్తుంది. కుందేలు కుదేలయ్యి, నదిని ఎలా దాటడమా అని ఆలోచిస్తూ ఉండగానే, తాబేలు మెల్లగా వచ్చి నదిలోకి దూకి, నదిని దాటి ఆవలి వొడ్డుకు వెళ్లి, పందెం ముగించింది. ఈ కధలో నీతి, ముందు మన ప్రత్యర్ధి శక్తి ని అంచనా వేసి, మనకు సరిపోయే విధంగా యుద్ధ క్షేత్రాన్ని , వ్యూహాన్ని మార్చుకోవాలి.
ఈసారి కుందేలు, తాబేలు మంచి స్నేహితులు అయ్యాయి. అంతకు ముందు వేసుకున్న పందెం ఇంకా కొంచెం బాగా చేద్దాము అనుకున్నాయి. ఈసారి ఒక్కొక్కరు కాకుండా, ఇద్దరూ కలిసి ఒక టీం గా ఏర్పడి లక్ష్యాన్ని సాధించాలి అనుకున్నాయి. నది ఒడ్దు వరకు, కుందేలు తాబేలును మోసుకుని వెళితే, నదిని దాటడంలో కుందేలుకు తాబేలు సహాయం చేసింది. నది దాటాక, మళ్లీ కుందేలు తాబేలును వీపు మిద ఎక్కించుకుని గమ్యస్థానం వరకు మోసుకెల్లింది. ఈసారి కుందేలు తాబేలు, పందెం ముగిసిన తర్వాత రెండూ గెలిచినందుకు చాలా తృప్తి పడ్డాయి, ఆనందించాయి.
ఈకథలో నీతి, : వ్యక్తిగతంగా ఒక్కొక్కరు ఒక్కో రంగం లో ప్రావీణ్యులే. పందెం అనగానే, ఒక గమ్యం చేరుకోవాలి అనగానే, ఎవ్వరూ వారి వారి బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించుకోలేరు. లక్ష్యం పూర్తీ చేయడం లో ఒత్తిడికి గురి అవుతారు. అయితే, బలమైన ప్రత్యర్ధి తో కలిసి వారి బలాన్ని, తెలివితేటలను సామర్ధ్యాన్ని కూడా ఉపయోగించుకుని ఒక బృందంగా కలిసి పని చేసినపుడు విజయాన్ని సాధించగలరు. అయితే, బృందం లో నాయకత్వ లక్షణాలు ఉన్నవారిని, పరిస్థితులకు తగ్గట్టు ఆలోచన చేయగలవారిని నాయకుడుగా ఎన్నుకున్నపుడు ఫలితాలు ఎప్పుడూ సంతృప్తికరంగానే ఉంటాయి.
ఈ కథ మన చుట్టూ ఉన్న పరిస్థితులకు చక్కగా అన్వయిస్తుంది. ఈ కథ చదవగానే, మనకు ప్రస్తుతం నడుస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుర్తొస్తారు. రాజకీయాల్లో చుస్తే, ప్రస్తుతం పరిస్థితి ఇలాగె ఉంది. ;చక్కటి సమన్వయము తో పని చేయవలసిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే అవగాహనా లేకుండా ఉంది. ఒక రాష్ట్రం అభివృద్ది సాధించాలంటే, ఒక బలమైన నాయకునితో పాటు కేంద్ర సహకారం కూడా ఉండాలి. భారత దేశం లో ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉందా అంటే కొంచెం ఆలోచించాలి. కేంద్రం రాష్ట్రాలకు సహాయం చేయవలసింది పోయి, తన బలాన్ని అన్ని రాష్ట్రాలలోను పెంచుకోవడం గురించి ఆలోచించటం తప్పు. కుందేలు తాబేలు లాగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే రాష్ట్రాలు, దేశాలు కూడా అభివృద్ది సాధిస్తాయి.
కుటుంబ విషయాలలో వస్తే, ఒకప్పుడు మనకు ఈ నీతి కధలో వలె ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కష్టం సుఖం అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెళ్ళిళ్ళు, చదువులు, పండుగలు అన్నిటికీ ఖర్చులు అందరూ పంచుకునే వారు. సలహాలు, సంప్రదింపులు అన్నీ పెద్దవాళ్ళే చూసుకునే వారు. ఎవరికీ ఏ ఖర్చులో తలకు మించిన భారంగా తోచేవి కావు. ఎవరికీ ఏ పనిలోనూ, ఏ విషయం లోను ఒత్తిడి ఉండేది కాదు. అసలు ఉమ్మడి కుటుంబం కన్నా మించిన "టీం వర్క్ " ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అంతా వ్యక్తిగతం. ఒకరి విషయాలు ఒకరికి తెలియవు. ఒకరికి మించి ఒకరికి సంపాదన ఉండాలి, ఆస్తులు సమకూర్చుకోవాలి అనే ఆత్రం. ఒకరికి మించి ఒకరికి వత్తిడి,
భార్యా భార్తలైనా, కుటుంబ సభ్యులైనా ఎవరైనా సరే, కలిసి కట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలం. ఒకరిపై ఒకరు పోటీ పడి సాధించేది ఏమి లేదు.
(whatsapp లో స్నేహితులు పంపిన ఒక వీడియో కి అనువాదం.)
నిజమే. మనదేశంలోనూ ఎన్నో హత్యలు, ఇంకా ఘోరమైన నేరాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి...అందరికీ శిక్ష కూడా పడటంలేదు. అది కూడా నిజమే....కానీ ఉగ్రవాదుల విషయం వేరు. వారు నీ దేశంలోని వ్యక్తులు కారు. మన నాశనాన్ని సర్వదా కోరుకునే పొరుగు దేశం వారు. మన దేశం మీద దాడి చేసి పొరుగు దేశంలో తలదాచుకుంటున్నవారు. నీ సోదర సోదరీమణులను 250 మందిని పొట్టనపెట్టుకున్న కిరాతకులు. అమాయకులైన నీ సొంత వాళ్ళని ఊచకోత కోసినవాడి మీద నీకు జాలా? వాడి శిక్ష రద్దు చేయాలా? నీ తల్లుల కడుపుకోత నీ కంటికి కనబడలేదా? 21 సంవత్సరాలు వాడిని మేపడానికి మన జేబుల్లోంచే పెట్టుబడి పెట్టాం. నేరం చేసిన వాడికి కాస్త ఆలస్యంగానైనా శిక్ష పడిందని సంతోషించక టీవీలకెక్కి చర్చలు జరుపుతారా? నేరస్థులకు మద్దతుగా మాట్లాడుతున్నావంటే, నీ దేశం పట్ల, నీ ప్రజల పట్ల నీకెంత ప్రేమ అభిమానం ఉన్నాయో అర్ధం అవుతోంది. నువ్వు తీవ్రవాది కంటే ఏమి తక్కువ? మీలాంటి కుక్కలందరూ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దేరకాలు.
అందరికీ తిక్క కుదిరింది....ఇన్నాళ్ళూ ఎంతమంది ఫాస్ట్ ఫుడ్స్ తినద్దు మొర్రో అని చెవికి ఇల్లు కట్టుకుని పోరినా వినని వాళ్ళు ఇప్పుడు మ్యాగీ మీద నిషేధం వచ్చాక నాలుక కొరుక్కుంటున్నారు. మ్యాగీ ఒక్కటే కాకుండా రెడీమేడ్ గా దొరికే ఏ ఆహారపదార్థం లో అయినా ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలు తప్పనిసరిగా ఉంటాయి అని అందరూ గమనించు కోవాలి. పిల్లల శారీరిక మానసిక ఆరోగ్యాలు కుటుంబం లో తల్లి మీదనే ఆధారపడి ఉంటాయి. శారీరికంగా ఆరోగ్యంగా లేని పిల్లలు చదువు మీద, ఇతర వ్యాపకాల మీద దృష్టి పెట్టలేరు. ఇక ఆటలు, వ్యాయామం సంగతి సరే సరి. పిల్లలు ఆరోగ్యకర వాతావరణం లో పెరగకపోతే, ఒక తరం నిర్వీర్యం అయిపోతుంది. ఇది దేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తుంది. దేశం వరకూ ఎందుకు? కుటుంబం లోనే, ఒక్కరు అనారోగ్యం పాలైనా కూడా ఆ కుటుంబం యొక్క ఆర్ధిక వ్యవస్త మీద ఎంతో ప్రభావం ఉంటుంది. అందుకె మాతౄమూర్తులు అందరూ పిల్లల ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. బయట దొరికే రెడీమేడ్ ఫుడ్ మీద ఆధారపడకుండా, మన తరతరాల సంప్రదాయ వంటలు అయిన సున్నుండలు, నువ్వుల ఉండలు, వేరుశెనగ చిక్కీలు వంటివి పిల్లలకు తినిపించాలి. వీటన్నిటిలో పిల్లల ఎదుగుదలకు పనికి వచ్చే ఎన్నో పోషక పదార్థాలు ఉన్నాయి. మీకు చేయడం రాకపోయినా, చేసేందుకు సమయం లేకపోయినా, ఇవి కూడా బయట దొరుకుతాయి కాబట్టి అవి కొని పెట్టచ్చు. బయట కొన్నవి అయినప్పటికీ, వీటిలో ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉండవు. ప్రతి ప్రాంతం యొక్క ఆహారపు అలవాట్లు ఆ ప్రాంతం యొక్క వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. విదేశీ తిండి అయిన ఈ నూడుల్స్, అలూ చిప్స్, కుర్‌కురే వంటివి మన ప్రాంత ఆహారపదార్థాలు కానేకావు. తినడానికి పనికి వచ్చే పదార్థాలు ఎప్పుడైతే నిలువ ఉండేలా ప్యాకెట్స్ లో వస్తాయో, నిలువ ఉండేందుకు అందులో ఏవో కొన్ని రసాయనాలు కలుపుతారు, అటువంటి రసాయనాలు అన్నీ ఆరొగ్యానికి తప్పకుండా హాని చేస్తాయి అనే ఆలోచన ఎవ్వరికీ రాదు ఎందుకని? మన పిల్లల ఆరోగ్యం గురించి మనం ఆలోచించడానికి, జాగ్రత్తలు తీసుకోవడానికి, ఎవరో కోర్టుల్లో దావాలు వేసి, కోర్టు నిషేధిస్తేనే కానీ, మనకు స్పృహ రాదన్నమాట. ఎవరో చెప్తేనే వింటాము, మనకు సొంత ఆలోచన ఉండదన్నమాట. మళ్ళీ అందరూ చదువుకున్నవాళ్ళే....ఇకనైనా కళ్ళు తెరిచి, ప్యాకింగ్ లో వచ్చే ఆహారాన్ని పిల్లలకు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇవాళ మ్యాగీ....కొన్నీళ్ళ తరువాత ఇంకోటి....తీరా నిషేధించిన తరువాత, అప్పటివరకు జరిగిన హానిని మనం తీసివెయ్యలేము. తల్లులందరూ ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
చిన్నప్పుడు, మా అత్తా వాళ్ళింట్లో, వక్కపొడి స్వయంగా తయారు చేసుకునేవారు. వక్కలు తెచ్చి, నేతిలో వేయించి, ఏలకులు, పచ్చకర్పూరం, జాజికాయ, ఇవన్ని మెత్తగా పొడి చేసి కలిపేవారు. అందులొ సారపప్పు, దోస గింజలు, వెయించి వేసేవారు. ఆ వక్కలను కత్తిరించడానికి "అడకత్తెర" అని ఒక పనిముట్టు ఉండేది. దాన్ని చాలా జగ్రత్తగా వాడాల్లి. లేకపోతే వేళ్ళు తెగుతాయి. ఇప్పటిలాగా దోస గింజలు సూపర్ మార్కెట్లొ దొరికేవి కాదు. 
ఓపికగా ఆ గింజలు ఎండబెట్టి, తొక్కతీసి, వేయించి, వక్కపొడిలో కలిపేవారు. వాళ్ళ అత్తగారికి పళ్ళు లేవు. అయినా ఆవిడకు ప్రాణం వక్కపొడి అంటే. అందుకని ముక్క చెక్క లా కాకుండా, గోధుమ రవ్వ మాదిరి మెత్తగా కొట్టుకునే వారు. ఆ వక్కపొడి ఎంత ఫ్రెష్ గా ఉండేదంటే, వాళ్ళ 10 గదుల ఇంట్లో, ఏ గదిలో డబ్బా మూత తీసినా, అన్ని గదుల్లోకీ ఆ సువాసన విరజిమ్మేది. ఇంతకీ వక్కపొడితో ఆరొగ్యపరంగా లాభాలు ఏవైనా ఉన్నాయా? అనేది నాకు చిన్నతనం నుంచి సందేహం. తాంబూలం అయితే అరోగ్యానికి మంచిది అని విన్నాను. ఇవాళ ఒక గుడిలో మారేడు వృక్షాన్ని చూసాను. ఆ మారేడు కాయలు చూడగానే, ఇదివరకు బ్రాహ్మలు సొంతంగా తయారు చేసుకునే ముక్కుపొడెం డబ్బా గుర్తొచ్చి, దాన్నుంచి మా అత్తా వాళ్ళ వక్కపొడి తయారీ విధానం కూడా గుర్తొచ్చింది. అన్నట్టు వాళ్ళ ఇంట్లో వక్కపొడి పెట్టుకోడానికి చక్కటి నగిషీలు కల రంగురంగుల చెక్క డబ్బా, ఒక అద్భుతమైన పనితనం కల వెండి డబ్బా కూడా ఉండేవి. ఆ వెండి డబ్బాకి మూతపైన ఒక పెద్ద కెంపు, మూతకు, డబ్బాకు కలిపి ఒక గొలుసు ఉండేవి, ఎంత సొగసుగా ఉండేదో అది....ఆ పనితనం ఇప్పుడు ఉందో లేదో మరి. మరి ముక్కుపొడి,(నశ్యం) ఏవిధంగా నైనా ఆరొగ్యానికి ఉపయోగపడుతుందా? నా సందేహాలు తీర్చండి. కేవలం అలవాటుగా తీసుకోవడమేనా? వక్కపొడి, ముక్కుపొడి (నశ్యం) అలవాట్లు ఇప్పుడు ఎవరికీ లేవనుకుంటాను.
మనుషుల మధ్య బంధాలు నిలవాలి అనుకున్నప్పుడు (అది స్నేహమైనా, బంధుత్వమైనా ) కొన్ని విషయాలు మెదడుతో కాక, మనసుతో ఆలోచించగలగాలి. అప్పుడే బంధం బలపడుతుంది
కుల మతాలకు అతీతమైన ప్రేమ, అభిమానం, మనోవేదన.....వయసు బేధం లేదు, చిన్న పిల్లల నుంచి వృధ్ధుల వరకూ...శోకమూర్తులవుతున్నారు.....ఒక వృత్తి, ఒక ఉద్యోగం, ఒక వర్గం అనే తేడాలేదు....అన్ని వర్గాల వారు కన్నీరు పెడుతున్నారు....సోషల్ మీడియాలో సంతాప సందేశాలు లెక్కకు మిక్కిలిగా పోస్ట్ అవుతున్నాయి. రామేశ్వరం జనసంద్రమైంది. అక్కడికి ఫలాన కులం వారే రావాలి, ఫలానా మతం వారే రావాలి అనే నిబంధనలు లేవు. మీరు మా మతానికి చెందిన వారు కాదు కదా, మీరెందుకు బాధపడుతున్నారు అని ఎవరూ అడగడంలేదు. మీరు మా రాష్ట్రం వారు కాదు కదా, మీరెందుకు నివాళులర్పిస్తున్నారు అని ఎవరినీ ప్రశ్నించడంలేదు. దేశ ప్రజ మొత్తం కుల , మత, రాష్ట్ర, భాషా బేధాలకు అతీతంగా ఆయన ఆత్మశాంతి కోసం ప్రార్ధిస్తున్నారు. చెమర్చని కన్ను లేదు. స్పందించని హృదయం లేదు. మరో పక్క అదే మతానికి చెందిన ఉగ్రవాదికి శిక్ష పడటం పట్ల ఇదే ఐకమత్యంతో భారత ప్రజ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిని బట్టి ఏం అర్ధమయ్యింది? సామాన్య ప్రజకు కుల మత బేధాలు లేవు. కష్టంలోను, సంతోషంలోనూ అందరూ ఒకేలా స్పందిస్తున్నారు. ఒకరికి ఒకరం అనే భావన అందరిలోనూ ఉంది. ఆంధ్రాలో తిరుపతిని, ముంబాయి లో గణపతి ఆలయాన్ని, శబరిమలను, షిరిడి సాయిని, మెదక్ చర్చిని, కడప దర్గాని, అజ్మీర్ దర్గాను అందరూ దర్శించుకుంటున్నారు. మేమందరం మాలో మేము ఐకమత్యంగానే ఉన్నాము. మీ ఓట్ల కోసం , మీ పదవుల కోసం మమ్మల్ని విడదీయకండి. మా మధ్య ఘర్షణలు పెట్టకండి. మా హృదయాలను చీల్చకండి. రాజకీయనాయకులారా! మీ స్వార్ధం కోసం మా బ్రతుకులతో ఆడుకోకండి.
భావుక

 మా తరం వాళ్ళం చాల అదృష్టవంతులం. (అంటే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా వయసు ఉన్నవాళ్ళు ) ఎందుకంటే, మేము ప్రయాణాలకు పాసెంజర్ రైళ్ళు, బొగ్గు రైళ్ళు, ఎక్స్ప్రెస్స్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ళు అన్నీ ఉపయోగించాము. అలాగే చిన్నతనాల్లో జనరల్ కంపార్ట్మెంట్ లు, తరువాత రిజర్వేషన్ , ఫస్ట్ క్లాసు కోచ్ లు, ఇప్పుడు AC కూడా ఎక్కుతున్నాం. ఇప్పటి వాళ్ళకి బొగ్గు రైళ్ళు తెలియదు, రాక్షసి బొగ్గు కాలుతుంటే వచ్చే ఆ కమ్మటి వాసనా తెలియదు. అలాగే మేము సమాచారం తెలియడం కోసం, ఉత్తరాలు, ఫోన్ అయితే, ట్రంక్ బుకింగ్, STD , ఇప్పుడు మొబైల్ ఫోన్, ఆండ్రాయిడ్, whatsapp అన్నీ వాడాము. ఇప్పటి వాళ్ళకు ఉత్తరాలు వ్రాసి మనసులో భావాలూ తెలియపరుచుకోవడం, మళ్లీ తిరుగు టపాలో జవాబు ఎప్పుడొస్తుందా అని ఎదురుచూడడం, అసలు postman అంటేనే ఒక చుట్టం లాగా ఫీల్ అవ్వడం తెలియదు. అలాగే పుట్టినరోజు పేరంటాలు, శ్రావణ మాసం పేరంటాలు, వినాయక చవితి కి పత్రీ స్వయంగా కోసుకుని రావటం, ఒక కాలనీ పిల్లలు అందరూ కలిసి ఆషాఢమాసం లో గోరింటాకు కోసం, ఉగాది ముందు రోజు వేపపువ్వు కోసం గుంపులు గుంపులు గా వెళ్లి స్వయంగా కోసుకునే ముచ్చట్లు ఏవి ఈ తరం వాళ్ళకు తెలియవు. ఏదో బజారుకు వెళ్లి 10 రూపాయలు పెట్టి కొనుక్కురావడమే కానీ, గుంపులుగా వెళ్తూ అల్లరి చేస్తూ వెళ్ళే మజా వీళ్ళకు తెలియదు.
ఈ తరం పిల్లలకు సూర్యోదయం, సూర్యాస్తమయం స్వయంగా చూసి అనుభవించడం తెలియదు. ఆరుబయట వెన్నెల్లో కథలు వింటూ పడుకోవడం, డాబా మిద వెన్నెల్లో భోజనం చేయడం, వేసవి సెలవులలో ఆరుబయట ఆడుకోవడం, సూర్యోదయం తో పాటు ఆహార వేటకు వెళ్ళే పక్షుల గుంపులు చూడడం, వీటిలోని అందాలు ఏ మాత్రం తెలియవు.
పక్కింటి వాళ్ళ జామ చెట్టునో, మామిడి చెట్టునో రాళ్ళతో కొట్టి కాయలు తినడం (ఎందుకో అలా తింటే చాలా రుచిగా ఉండేవి ), స్కూల్ కు నడిచి వెళ్తూ ఇల్లు కట్టుకోవడానికి ఎవరో తెప్పించుకున్న ఇసుక గుట్టలు, కంకర గుట్టలు ఎక్కుతూ, దిగుతూ వెళ్ళడం, ఇలాంటి తీపి జ్ఞాపకాలు ఈరోజుల్లో వాళ్ళకు తెలియదు.
ఇంకో విషయం ఏమిటంటే, మా తరం వాళ్ళకు ఉద్యోగాలు చిన్నవే, జీతాలు చిన్నవే. అయినా మాకు అసంతృప్తి లేదు. ఒక్కో రూపాయి దాచుకొని కొనుక్కున్న వస్తువులు మాకెంతో అపురూపం. పాత టీవీ అమ్మేసి, రిమోట్ కంట్రోల్ ఉన్న టీవీ కొనుక్కున్నపుడు పాత టీవీ ఎవరికో ఇచ్చేస్తుంటే ఎంతో విలవిల లాడిపోయాం. మా వస్తువులతో మాకు అంత attachment . సంవత్సరాల తరబడి ఉన్న ఇల్లు మారాలన్నా, transfer అయి, ఊరు మారాలన్నా, ఏదో ఎమోషన్. ఇపుడు ఉద్యోగాలు పెద్దవి, జీతాలు పెద్దవి. పాతిక సంవత్సరాలు రాకుండానే సొంత స్థలాలు, ఇల్లు కొనుక్కున్నా మీకు సంతృప్తి లేదు, వేటి మీదా మమకారం లేదు, ఇంకా ఏదో లేదు అనే వెలితి భావనే.
ఒకప్పుడు ఇంట్లో పెద్ద కొడుక్కు ఉద్యోగం, సంపాదన వస్తే, ఇంటి సమస్యలు అన్నీ తీరినట్టే అని భావించే వారు. తన కన్నా చిన్నవాళ్ళను పెద్ద కొడుకే చదివించేవాడు. తల్లితండ్రులు కూడా నిశ్చింతగా ఉండేవారు. ఇప్పుడు అన్నదమ్ముల సంగతి సరే,భార్యా భర్తల మధ్యనే నీది, నాది అనే బేధాలు. ఎవరి జీతం వారిది, ఎవరి లోన్లు వాళ్ళవి, ఎవరి ఖర్చు వారిది, ఎవరి బ్రతుకు వాళ్ళది. మనది అనే భావన లేదు ఇప్పుడు. ఇక ఇలాంటివాళ్ళు తల్లితండ్రులను, అన్న దమ్ములను, అక్క చెల్లెళ్ళను ఏమి చూస్తారు? నీ చుట్టాలు వస్తే నీ ఖర్చు. నా చుట్టాలు వస్తే నా ఖర్చు. ఇదీ ఇవాల్టి పోకడ.
మొత్తం మీద మేము కష్టపడినా జీవితం లో ఉండే ఆనందాన్ని అనుభవించాము. కష్టం వెనకాల ఉండే సుఖాన్ని చూసాము. అత్తమామలతో గొడవలు ఉన్నా, వారి నీడన ఉండే సౌఖ్యం చూసాము. గొడవలు వస్తాయి అని వాళ్ళను వద్దు అనుకోలేదు. ఆడపడుచులు, మరుదులు బాధ్యతలు తీర్చాము, ఇపుడు వాళ్ళ నుంచి గౌరవమూ పొందుతున్నాము. ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ బాధ్యతలు నావి అని అనుకోని నిర్వర్తిన్చాము.
ఇపుడు పుట్టుక తోనే అన్ని సౌఖ్యాలు అమరిపోతున్నాయి కాబట్టి ఈ తరం వాళ్ళకు కష్టం అంటే తెలియడం లేదు, దాని ద్వారా సుఖం యొక్క విలువా తెలియడం లేదు. అందుకే మీకు ఎన్ని ఉన్నా తృప్తి లేదు. మీరు డబ్బు విచ్చలవిడిగా సంపాదిస్తున్నారు. దానిని ఖర్చు పెట్టడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి మీకు. కానీ ఆ డబ్బు మీకు ఆనందాన్ని , తృప్తిని ఇవ్వడం లేదు. ఎందుకంటే మీ దగ్గర డబ్బు ఎక్కువ అయింది కాబట్టి. తల్లి తండ్రుల ప్రేమ కూడా మీకు ఎక్కువ దొరుకుతోంది కాబట్టి మీకు ఆ మమకారం యొక్క విలువ కూడా తెలియడం లేదు. మీకు పెద్ద పెద్ద సమస్యలు లేవు, బాధ్యతలు లేవు అందుకనే మీకు చిన్న చిన్న సమస్యలు చాలా పెద్దవిగా కనబడతాయి. అవి మీరు పరిష్కరిచుకో లేకపొతున్నారు. అందుకే ఈరోజుల్లో, ఆత్మహత్యలు, విడాకులు ఎక్కువ అయినాయి. ఈ విషయం మీద ఇంకోసారి చర్చించుకుందాం.
సెలవు.
కొత్తగా వివాహం అయిన ఒక ఆడపిల్ల తన తల్లికి వ్రాసిన ఉత్తరం ఇది....
అమ్మా! అందరు ఆడపిల్లలలాగే, నేను కూడా పెళ్ళి గురించి ఎన్నో అందమైన కలలు కన్నాను. ఒక అందమైన రాకుమారుడు నాకోసం వస్తాడు అని నా జీవితం అంతా అతనితో సంతోషంగా గడపాలని ఊహించాను.
కానీ, ఈరోజు, నా వివాహం అయిన తర్వాత, నాకు తెలిసింది, పెళ్ళి అంటే పూలపానుపు కాదు అని. కేవలం నాకు ప్రియమైన వాడితో సమయం గడపడం మాత్రమే కాదు అని నాకు అర్ధం అయింది. నేను ఊహించినదాని కన్నా ఇక్కడ భిన్నంగా ఉంది. ఇక్కడా నా కోసం నా వంతు, బాధ్యతలు, పనులు, త్యాగాలు, రాజీలు అన్నీ వేచి చూస్తున్నాయి.
నేను నా ఇష్టం వచ్చినప్పుడు నిద్ర లేవలేను. నేను ఇంట్లో అందరికన్నా ముందు లేచి, వాళ్ళకు కావలసినవన్నీ సిధ్ధం చేయాలి అని ఆశిస్తారు. మన ఇంట్లో లాగా, పైజామాలతో రోజంతా, ఇల్లంతా తిరగలేను. ఇక్కడ నాకంటూ ఉన్న కొన్ని పధ్ధతుల ప్రకారం నడుచుకోవాలి. ప్రతిక్షణం అందరి పిలుపులకీ సిధ్ధంగా ఉండాలి. నా ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేను. అందరి అవసరాలు తీరడం నా చేతిలోనే ఉంది. నీ దగ్గర ఉన్నప్పుడు పడుకున్నట్టు నా ఇష్టం వచ్చినప్పుడు నేను పడుకోవడానికి వీలు లేదు. నేను ప్రతిక్షణం హుషారుగా, ఉత్సాహంగా ఉండి ఎవరికి ఏమి కావాలన్నా చేసి పెడుతుండాలి. నన్ను ఒక యువరాణి లాగా శ్రధ్ధ తీసుకునేవారు ఇక్కడ లేరు కానీ, నేను అందరి గురిచి శ్రధ్ధ తీసుకోవాలి.
అప్పుడప్పుడు నీ దగ్గరే సుఖంగా హాయిగా ఉండక, నేను పెళ్ళి ఎందుకు చేసుకున్నానా అని ఏడుపు వస్తుంది. ఒక్కోసారి, మళ్ళీ నీ దగ్గరకు వచ్చేసి, నీ దగ్గర గారాలుపోవాలని అనిపిస్తుంది.
మన ఇంటికి వచ్చేసి, నాకు ఇష్టమైనవి అన్నీ నీ చేత వండించుకుని తినాలి అని, నా స్నేహితులతో ప్రతి సాయంత్రం బయటికి వెళ్ళాలి అని, ప్రపంచం లో నాకు ఇక ఏ బాధలు లేనట్టు నీ ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలి అని ఎంతో అనిపిస్తుంది.
కాని అప్పుడే నాకు గుర్తొస్తుంది....నువ్వు కూడా ఇలా పెళ్ళి చేసుకుని, ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వచ్చినదానివేగా అని....నువ్వు కూడా నీ జీవితంలో ఎన్నో త్యాగాలు చేసే ఉంటావు కదా...నువ్వు ఏవైతే గొప్ప సుఖాన్నీ, శాంతినీ, సౌకర్యాన్నీ మాకు అందించావో, వాటిని నేను మళ్ళి నేను అడుగు పెట్టిన నా మెట్టినింటికి ఇవ్వాలి కదా అని గుర్తొస్తుంది..
నేను చెప్తున్నా అమ్మ...కొంత కాలం గడిచేటప్పటికి నేను కూడా నీలాగే నా ఈ కొత్త కుటుంబాన్ని ప్రేమించడం తెలుసుకుంటాను. నువ్వు నీ జీవితం లో మాకోసం చేసిన త్యాగాలకు, రాజీలకు నా కృతజ్ఞతలు. అవి నాకు నా బాధ్యతలు సక్రమంగా నెరవేర్చడానికి నాకు కావలసినంత శక్తిని, స్థైర్యాన్ని ఇచ్చాయి. థాంక్ యూ అమ్మా...

Wednesday, 1 July 2015

విదురనీతి --1.

ధృతరష్ట్రుడు నిద్ర రాక రాత్రి, విదురుని పిలిపించగా ఆ విదురుడు అతని మనశ్శాంతి కోసం, ముందు ముందు హితవు, శ్రేయస్సు కలిగే నీతులు చెపుతాడు. భారతంలో అత్యంత ప్రాచుర్యం గలది విదుర నీతి. ఇది ఒక్కసారి కాదు--వందసార్లు చదివి తీరాల్సిన అపూర్వ మహోపదేశం. దేశదేశాలవారిన్ ఆకర్షించిన మహాభారతంలోని "విదురనీతులు" అనేకానేక భాషల్లోకి అనువదించబడ్డాయి. నిలక్షణమైనది విదురుని పాత్ర....ఇక విదురనీతులు--ఆచంద్ర తారార్కం శాశ్వత సత్యాలు.

ఇక చదవండి..

సాదువులు సత్కర్మల వల్ల, రాజు రాజ్యభోగాల వల్ల సుఖులఔతారు. పాపాత్ములతో సాంగత్యం గల సజ్జనులు కూడా దండనార్హులే అవుతారు. ఎండిన కట్టెతో కలిస్తే పచ్చికర్రకు కూడా అగ్నిబాధ తప్పదు కదా! అందుచేతనే దుర్జన సాంగత్యం మంచిది కాదు. ఇంద్రియలోలుని ఆ ఇంద్రియాలే ఆరగిస్తాయి. గుణగ్రహణమూ,సరళస్వబావమూ, పవిత్ర హృదయమూ, సంతోషబావమూ, మృదువచనమూ, సత్యవ్రతమూ, ఇంద్రియ సంయమనమూ, దుష్టుల దరిచేరవు. ఆత్మ జ్ఞానమూ, క్రోధరాహిత్యమూ,   సహనశీలమూ, వాగ్దాన రక్షణా, దానశీలమూ, ధర్మపరాయణతా అధములకు పట్టవు. విద్వాంసులని నిందిస్తూ మూర్ఖులు సంతోషిస్తారు. ఎదుటివానిని నింధించడమే స్వబావంగా కలవాడు మహాపాపి. నిందలను సహిస్తూ వారిని క్షమించేవాడు పుణ్యాత్ముడు. హింస దుష్టులకు బలం. దండనీతి రాజులకు బలం. సేవ స్త్రీలకు బలం. క్షమ గుణశీలికి బలం.

వాక్కును స్వాధీనములో ఉంచుకోవడం కంటె కష్టమైనది లేదు. చమత్కార యుక్తులతో, విశేషార్ధాలను ప్రతిపాదించగల మాట మితంగానే ఉంటుంది. సరస సంభాషణం కళ్యాణప్రదమే అవుతుంది. అదే విషయం కటూక్తులతో అంటే పరుషవాకులతో ఉంటే అనర్ధదాయకమవుతుంది. గొడ్డలి దెబ్బలు తిన్న అరణ్యం చిగిరించవచ్చు. కానీ కటువచనాలతో దెబ్బతిన్న హృదయం కోలుకోదు.

మాటే మంత్రమని పెద్దలు చేబుతారు. మహత్తరంగా మాట్లాడిన మన మాటలకు ఎదుటివారు మంత్రముగ్ఢులవుతారు. సమస్త చరాచర జీవరాశిలో "పలుకు" మానవుడికిమాత్రమే లభించిన ఒక అమూల్యమైన వరం. తన మనసులోని భావాన్ని ప్రకటించడానికి ఉపయోగపడే పరమాధ్బుత సాధనం. ఈ అసాధారణమైన అవకాశానికి మారుపేరు వాక్కు! వాక్కు అమోఘమైంది. పరమ పవిత్రమైంది. శక్తివంతమైంది. దుర్లభమైంది. అజ్ఞానాన్ని పారద్రోలేది. జ్ఞానమొసగేది. ఇది వాగ్దేవతకు ప్రతిరూపమైంది. సంస్కృతీ సంస్కారం వాక్కుపై ఆధారపడి ఉంటుందనేది అందరూ ఎరిగిన విషయమే!

(ఇంకా ఉంది)
ఓం గురుభ్యో: నమ:

మహాభారతంలో మహాత్మ్య పూర్ణ రత్నాలు మూడు ఉన్నాయి. ఉద్యోగ పర్వం లోని సనత్సుజాతీయం,భీష్మ పర్వం లోని భగవద్గీతా, అనుశాననిక పర్వంలోని విష్ణు సహస్రనామం. ఈ మూడూ పరమార్ధ విషయాలు. ఇవి మానవజాతికి అహర్నిశం జ్ఞానజ్యొతిని ప్రసాదించే ఆరని దివ్య దీపాలు.

ఈమూడింట్లో ఉన్న విశేషం: మొదటిదానికి వక్త సనత్సుజాతుడు. అతడు బ్రహ్మ మానసపుత్రుడు. జ్ఞానపు మొదటి అవతారం. శ్రోత--నిలువెల్లా అజ్ఞానమే అయి కళ్ళు మూసుకొని పోయిన ధృతరాష్ట్రుడు. జ్ఞానానికి రాగద్వేషాలు లేవు. శ్రోత నిమిత్తమాత్రుడే.

ఇక రెండవది భగవద్గీత..శ్రీకృష్ణపరమాత్మ అర్జునుణ్ణి నిమిత్తం చేసుకొని ఉపనిషత్తులన్నింటి సారాన్ని లోకానికి ఆ పేరుగా అందించాడు. ఇచట శ్రోత అర్జునుడు. అతనిది ధర్మపక్షమే. జ్ఞాన గంగను ఇముడ్చుకోవడానికి యోగ్య స్థానమే కానీ, ఉపదేశ సందర్భము కొంచెము క్లిష్టమైనది.

ఇక మూడవది విష్ణు సహస్ర నామము. ఇక్కడ వక్త శాంతనవుడు. శ్రోత ధర్మరాజు. "పలికించెడు వాడు రామభద్రుండట" అన్నట్టుగా భగవానుడు శాంతనవుడి నోటినుంచి పలికించాడు. ఇచట వక్తా, శ్రోత ఇద్దరు మిన్నులు  ముట్టిన జ్ఞానులే. సందర్భము కూడా పరమ ప్రశాంతమైనది.

పై మూడే కాక మరో రెండుమనోజ్ఞ రత్నాలు భారతంలో ఉన్నాయి. మొదటిది పరమార్ధానికి సంబంధించినవి కాగ, రెండవది ఇహానికి సంబంధించినదిగా చెప్పాలి. మొదటిది ఉద్యోగ పర్వంలోని విదురనీతి, రెండవది శాంతి అనుశాసనిక పర్వాలలోని భీష్మకృత ధర్మ బోధ.

(ఇంకా ఉంది)