Friday 4 September 2015


అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం....

ధర్మానికి ముప్పు ఏర్పడినప్పుడు తాను అవతరించి ధర్మ రక్షణ చేస్తానని విష్ణువు  చెప్పాడు. తను ఇచ్చిన మాట ప్రకారేమే, ధర్మానికి హాని కలిగినప్పుడల్లా వివిధ అవతారాలు ఎత్తి జ్ఞానులను, యోగులను, శిష్టులను రక్షించాడు. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఎత్తిన అంశావతారాలు కొన్ని అయితే, సంపూర్ణ జీవితాన్ని (జననం, మరణం) అనుభవించిన అవతారాలు రెండే రెండు. ఒకటి శ్రీరామావతారం, రెండు శ్రీ కృష్ణావతారం.

కృష్ణుడు ఒక సాధారణ మానవునిలా జన్మనెత్తి, అలాగే పెరిగాడు. ఈక్రమంలో దుష్టశిక్షణకై ఎన్నో కార్యాలు చేసాడు. ఎన్నో లీలలు చేసాడు. వెన్న తిన్నాడు, మన్ను తిన్నాడు, సర్పాలపై నాట్యం చేసాడు. గోపికల ఇళ్ళల్లో కుండలు పగలకొట్టాడు. అత్తకు, కోడలికి తగవులు పెట్టాడు. తన ప్రాణాలను హరించుటకై రకరకాల రూపాల్లో వచ్చిన రాక్షసులను సమ్హరించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్ళాడు.  చివరకు దూర్వాస ముని శాపానికి గురై సాధారణ మానవుని లాగే అవతార సమాప్తి గావించాడు. ఇవన్నీ పైకి అల్లరిచేష్టలుగా కనపడినా, వాటి వెనుక ఎంతో లోతైన అంతరార్ధం ఉంది.

కొంచెం పెరిగిన తరువాత, తనను ఎంతగానో ప్రేమించిన రుక్మిణిని పెండ్లి చేసుకొన్నాడు. ద్రౌపది మానసమ్రక్షణ చేసాడు. రాధతోకలిసి పరిపూర్ణ ప్రేమకు అర్ధంగా నిలిచాడు. పాండవుల పక్షాన నిలిచి అర్జునుని రథసారథియై కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి మార్గదర్శి అయ్యాడు. యుధ్ధక్షేత్రంలో దౌర్బల్యం ఆవహించిన అర్జునునకు గీతోపదేశం చేసి ఆచార్యుడైనాడు. . ఈరోజున ప్రపంచాన్ని నడుపుతున్నదీ, ప్రపంచ ప్రజలకు ఆలంబనగా నిలుస్తున్నదీ ఆ భగవద్గీతే....అష్టభార్యలు, 16 వేల మంది గోపికలు ఇంతమంది ఉన్నా ఎన్నడూ స్థితప్రజ్ఞునిగానే వ్యవహరించాడు. పాండవులు, కౌరవులు-అన్నదమ్ముల మధ్య అంత భీకర యుధ్ధం జరిగినా, ధర్మ పక్షపాతియై, తామరాకు మీద నీటిబొట్టులా నిలిచాడు. ధర్మం ఉన్నచోటే తానూ ఉంటానని లోకానికి చాటి చెప్పాడు. అసలైన సిసలైన వ్యక్తిత్వానికి గొప్ప ఉదాహరణ శ్రీకృష్ణుడు. ఆకృఇష్ణ  చరితామృతమును పఠించి, ఆయన బోధనలను అర్ధం చేసుకున్నప్పుడే మానవాళికి నిజమైన కృష్ణాష్టమి.

ఈపండుగ నాడు పగలు ఉపవసించి, సాయంత్రం కృష్ణ పూజ చేసి, చిన్ని కృష్ణుని ఊయలలో ఊపుతారు. వెన్న, అటుకులు మొదలైనవి నైవేద్యం పెడతారు. ఈ పూజ చేసుకున్నవారికి అన్నిటా జయం లభిస్తుందని పురాణోక్తి.

No comments:

Post a Comment