Sunday, 10 January 2016

అరిషడ్వర్గాల ప్రభావం వలన, మనసా వాచా కర్మణా మనం చేసే పాపాలకు నివృత్తి దానం వలనే జరుగుతుందంటారు. దానము వలన పూర్వజన్మల నుంచి వస్తున్న పాపాలను కూడా పోగొట్టుకోవచ్చు. అయితే దానము ఎప్పుడూ పాత్రుడైన వాడికే ఇవ్వాలి. మన ఇచ్చిన దానాన్ని దుర్వినియోగం చేసేవాడికి ఇచ్చిన దానం మనకు సత్ఫలితాలను ఈయదు. అలాగే ఎవరైనా మన సహాయం కోరి వచ్చినపుడు, వారికి నిజంగా అవసరమేనా అని ఆలోచించాలి. మనం చేసిన దానము వలన గ్రహీత చెడు మార్గాన్ని పడితే ఆ దోషం మనలను అంటుకుంటుంది. కీర్తిని ఆశించో, అహంకారం వలననో చేసే దానాలు దాతకు మంచి చేయకపోగా చెడును కలుగజేస్తాయి. దానము చేసి దానిని ప్రచారం చేసుకోవడం, దానము పుచ్చుకున్న వారి దగ్గర్నుంచి ప్రతిఫలాన్ని ఆశించడం పనికి రాదు. అందుకే కుడిచేతితో చేసే దానం ఎడమ చేతికి తెలియరాదు అన్నారు. అలాగే ఒకసారి దానము చేయాలి అని నిర్ణయించుకున్న తరువాత ఆ ఆలోచన నుండి విరమించుకోరాదు. విద్యా దానం, భూం,గో, సువర్ణ దానాలు, అవయవదానం ఎన్ని ఉన్నా, అన్నిటిలో అన్నదానం గొప్ప మహత్యం కలది. ఎందుకంటే, మిగిలిన దానాలన్నిటిలోను గ్రహీత ఇంకాకొంచెం దక్కితే బాగుండును అని తలచే అవకాశం ఉంది. అలా ఆశించినప్పుడు దాతకు దానాం పూర్తి ఫలితాలను ఇవ్వకపోవచ్చు. అన్నదానం లో మాత్రం ఒకసారి కడుపు నిండిన తరువాత ఇంక ఏమి పెట్టినా తినలేడు. దాన గ్రహీత సంతృప్తి చెందుతాడు. మరింత ఆశించే వీలుండదు. ఇది దాతకు శ్రేయోదాయకం. దేశ కాల పరిస్థితులననుసరించి ఉత్తమ గ్రహీతకు చేసిన పాత్రమైన దానం దాతకు అన్నివేళలా శుభాలను చేకూరుస్తుంది.

No comments:

Post a Comment