Thursday 7 January 2016

విజయం సాధించాలి అనుకున్నప్పుడు గట్టి సంకల్పమే కాకుండా కఠిన పరిశ్రమ కూడా ఎంతో అవసరం...మన లక్ష్యం పెద్దది అయినపుడు సాధించే మార్గంలో ఎన్నో అవరోధాలు వస్తాయి. వాటిని అన్నిటినీ తట్టుకుని నిలబడగలిగితేనే అమృతం వంటి విజయం మనకు సిధ్ధిస్తుంది. మన దేశం ఎన్నో పురాణాలకు పుట్టిల్లు. ఈ ఉత్తమ గ్రంధాలన్నీ మనకు మరే ఇతర వ్యక్తిత్వ వికాస గ్రంధాలూ బోధించనివెన్నో బోధిస్తున్నాయి. పైన చెప్పిన మాటకు మంచి ఉదాహరణ మనందరికీ తెలిసిన క్షీరసాగర మథనం. అమృతం కోసం దేవదానవులు చేసిన మథనం లో ముందు హాలాహలం పుట్టుకొచ్చింది. ఆ తరువాత మిగిలినవెన్నో ఉద్భవించిన తరువాతే అమృతం చివరికి లభించింది. హాలాహలం వచ్చిన వెంటనే ప్రయత్నం ఆపివేసి ఉంటే అమృతం దొరికేది కాదు. క్షీరసాగర మథనం మనకు ఇంకో విషయాన్ని కూడా చెపుతుంది. అదే సమిష్టి కృషి. ఒక బృహత్కార్యం సాధించాలి అనుకున్నపుడు ద్వేషభావం మాని ఇష్టం లేకపోయినా సరే, శతృవులనైనా కలుపుకుపోవాలి. ఆ కృషి ఫలితాలు ధర్మం ఉన్న వైపే నిలుస్తాయి.  క్షీరసాగరాన్ని చిలకడానికి శ్రీమహావిష్ణువును వేడుకొని ఆయన కూర్మావతారంలో ఉండి మందర పర్వతాన్ని  పైకెత్తి ఉంచగా మాత్రమే సాగరాన్ని మధించడం పూర్తి అయింది. అంటే ఒక కార్యాన్ని సంకల్పించినప్పుడు మహనీయుల అవసరం కూడా మనకు ఉంటుంది. వారిని ప్రసన్నం చేసుకొని వారి సూచనలు సలహాలు పాటిస్తే విజయం సాధించగలం. అలాగే మొదట హాలాహలం ఉద్భవించినప్పుడు సృష్టినంతటిని నాశనం చేయగల ఆ మహా కాలకూటాన్ని శివుడు తన గరళమందు నిలిపి లోకులను రక్షించాడు. ఆ తరువాతే అమృతం దేవదానవుల సొంతం అయింది. అనగా మన సంకల్పానికి కృషి మాత్రమే కాకుండా దైవబలం కూడా అవసరం. దైవానుగ్రహం తోడున్నప్పుడు సత్కార్యాలను సాధించడంలో ఎన్నటికీ విఫలం కాము.

No comments:

Post a Comment