Saturday, 23 April 2016

ఒక స్త్రీకి, లోకంలో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏమిటుంటుంది? అబ్బా...ఎవ్వరూ చెప్పలేరు...ఒక పెళ్ళికో, ఫంక్షన్ కో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆవిడ మనస్సులో జరిగే ఒకానొక సంఘర్షణను, ఇంట్లోని మగవాళ్ళు, మగపిల్లలు అస్సలంటే అస్సలు అర్ధం చేసుకోలేరు కాక చేసుకోలేరు. ఎవరి ఇంట్లో అయినా పెళ్ళికి పిలిస్తే, పిలిచేవాళ్ళదేముంది, చటుక్కున ఇలా వచ్చి, బొట్టు పెట్టి, ఓ కార్డు ఇచ్చి, ఓ కాఫీ తాగి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మొదలవుతాయి ఆడవాళ్ళ కష్టాలు....
ఇంతకీ పిలిచిన వాళ్ళు చుట్టాలా, ఫ్యామిలీ ఫ్రెండ్సా, కాలనీ వాళ్ళా, కొలీగ్సా,ఇన్ని కేటగిరీలు ఉంటాయి....పెళ్ళికో, సదరు ఫంక్షన్ కో ఎప్పుడెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి అనే సమస్య తో పాటూ---పెద్ద ప్రోబ్లెం అక్కడ మొదలవుతుంది. ఎన్ని చీరలు తీసుకెళ్ళాలి, అందులో పట్టువెన్ని, బనారసువెన్ని, ఫ్యాన్సీవెన్ని, జరీవెన్ని? సరే, రాత్రిపూట కట్టుకోవడానికి కాటన్ చీరలు ఎలాగూ తప్పవనుకోండి...పెళ్ళి అయితే, స్నాతకానికి ఒకటి, భోజనాలప్పుడు ఒకటి, సాయంత్రం ఎదురు సన్నాహాలకు ఒకటి, ముహూర్తానికి ఒకటి, వ్రతానికి ఒకటి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే మూడునిద్రలకు కొన్ని మంచి చీరలు...వీటికి తోడు, ప్రతి చీరకు మ్యాచ్ అయ్యే నగలు....అబ్బ ఎంత పని, ఎంత గడబిడ...
.పోనీ బీరువా అంతా తీసుకెళ్ళు....ఇంట్లో మగవాళ్ళ సెటైర్లు....ఇందులో ఒక్కటైనా మర్చిపోకుండా అన్నీ మళ్ళీ జాగ్రత్త గా తీసుకురాగలవా అమ్మా? మగపిల్లల అనుమానాలు....వాళ్ళకేం తెలుసు, మనం పెట్టుకునే నగలు, కట్టుకునే చీరల బట్టే మన విలువ ఉంటుందని, అందరూ మనవాళ్ళే అనుకునే అమాయకులు వాళ్ళు ....వాళ్ళకేంటి ఓ ప్యాంటు, షర్టు జతతో నాలుగు పెళ్ళిళ్ళు చేయించి, చూసేసి రాగలరు.....మనకు అలాక్కాదే.....ఒక్కసారి చుట్టాల చురుకు చూపులు, వెటకారాలు భరిస్తే తెలుస్తుంది వాళ్ళను టాకిల్ చేయడం ఎంత కష్టమో.....అరే, ఒక్కరైనా, నీ పిల్లలు బాగా చదువుతున్నారు, చక్కగా పెంచావు అనేవాళ్ళు ఉండరండీ, ఈ చీర ఎప్పుడు కొన్నావు? ఈ నగ ఎంతయింది? ఇదొక్కటే గోల....
సరే, ఎక్కడున్నాం మనం? ఇంట్లో బీరువా దగ్గర కదా...ఏ చీరలు తీసుకెళ్ళాలబ్బా? ఈ ఉప్పాడది కట్టుకో....తేలిగ్గా ఉంటుంది...నలిగినా పర్వాలేదు...శ్రీవారి సలహా....అబ్బా...ఎంతపెట్టినా ఉప్పాడ చీర వేల్యూ తెలియదండి..మరీ సింపుల్ గా ఉంటుంది ...మిగతావి కూడా చూద్దాం ఒకసారి....ఈ కంచి పట్టుది...అబ్బే...ఆకుపచ్చ ఇప్పుడు ఫ్యాషన్ కాదు...ఈ జరీది...ఊహు..మరీ పెద్దదానిలా ఉంటాను...ఈ బనారసుది....ఊహు...బరువెక్కువ....ఈకాలంలో మోయలేను....కుచ్చిళ్ళు, కొంగు ఇంకెవరైనా మోయాలి... ఈ వెంకటగిరి చీరకి గంజి లేదు. అయినా దీనికి నాదగ్గరున్న నగలేవీ మ్యాచ్ కావు....ఆ నీలంది ఇదివరకు కట్టేసుకున్నాను.....అబ్బ....తల బద్దలైపోతొంది కానీ, చీరల సెలెక్షన్ అవ్వటం లేదు.....
.ఇంతలో ఎవత్తో ఒక పిన్ని కూతురో అత్తకూతురో చేస్తుంది ఫోన్....ఏం కట్టుకుంటున్నావ్, ఏం తెచ్చుకుంటున్నావ్ అని...ఫలానాది అనగానే, అదా అది నీ ఒంటి రంగుకి అంతగా నప్పలేదు అక్కా....బాచిగాడి పెళ్ళిలో కట్టుకున్న కనకాంబరం రంగుది తెచ్చుకో.....దానికి కొత్తగా కొనుక్కున్న కెంపుల నెక్లెస్ బాగుంటుంది..ఓ సలహా మన మీదకు విసిరేస్తుంది....ఇప్పుడు అసలైన డైలెమా మొదలవుతుంది....శ్రీవారు చెప్పిన చీరా, చెల్లెలు చెప్పిన చీరా? ఆఖరికి పెళ్ళి పిలుపుల రోజు మొదలైన సెలెక్షన్, పెళ్ళికి బైల్దేరే ముందురోజు వరకు సా......గి, ఈ మధ్యలో కొన్ని ముఖ్యమైన పనులు మర్చిపోయి, హడావిడిగా బ్యాగ్ సర్దుకోవడంతో ముగుస్తుంది.
ఇప్పుడు చెప్పండి...ఇంట్లో ఆడవాళ్ళకు ఇంతకన్నా అంతర్జాతీయ సమస్య ఇంకోటి ఉందా అని? ఇంతటితో అవ్వలేదండోయ్.....ఇంకా చాలా ఉంది....తరువాత చెప్పుకుందాం...

No comments:

Post a Comment