Sunday, 1 March 2015

మా చిన్నతనాల్లో సంక్రాంతి.
మా చిన్నప్పుడు సంక్రాంతి పండుగ వస్తోంది అంటే అబ్బో... పెద్ద హడావిడి. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచి ముగ్గులు.. గొబ్బిళ్ళు....తెల్లవారే లేచి గుడికి వెళ్ళడం (ధనుర్మాసం ప్రసాదం మీద భక్తి, దేవుడి మీద కాదు. ) అసలు ధనుర్మాసం లో వైష్ణవ ఆలయాల్లో పెట్టె చక్కర పొంగలి, దద్ద్యోజనం రుచే వేరు. సత్యం శంకరమంచి గారు అమరావతి కధలలో చెప్పినట్టు, దద్ద్యోజనం లో వేసే కరివేపాకు కూడా మహా రుచిగా ఉంటుంది లెండి. ఇంటి ముందు పెట్టె ముగ్గులు మహా కుట్రలతో కూడుకొన్నవి. మేము ముగ్గులు రాత్రి పూట వేసేవాళ్ళం. ముందుగ పెట్టేస్తే, మా ముగ్గు ఎవరైనా కాపీ కొడతారేమో అని బాగా పొద్దుపోయాక వేసేవాళ్ళం. చుక్కలు ఎన్నో తెలియకుండా, ముగ్గులు పెట్టడం లో మా అక్క మహా నేర్పరి. ఉన్న ముగ్గుకి ఎన్నో సొగసులు అద్ది, చుక్కలు ఎన్నో తెలియకుండా చేసేది. మళ్లీ తెల్లవారే లేచి, గుడికి వెళ్తూ వెళ్తూ, ఎవరి ముగ్గు బాగుంది, ఎవరెవరు ఈ సంవత్సరం కొత్త ముగ్గులు వేసారు అని విశ్లేషణలు.....ఇంక ధనుర్మాసం చివర వచ్చే కనుమ, ముక్కనుమ రోజు వేసే రధం ముగ్గులు ప్రతి సంవత్సరం ఒక కొత్త రకంగా వేసేది మా అక్క. ఆ రధం తాడును ప్రతి ఇంటి ముందు రధం ముగ్గుకి కలిపి (మధ్యలో ఎవరైనా మాకు నచ్చకపోతే, వారి ఇంటి ముగ్గుకి కలపకుండా )వీధి చివర వరకు లాగే వాళ్ళం.
గొబ్బిళ్ళ కథలు వేరు. ఉదయాన్నే ఆవుపేడ తెచ్చి, గొబ్బెమ్మలు చేసి, పూజ చేసి, అప్పుడు స్కూల్ కు వెళ్ళవలసి వచ్చేది. సాయంత్రం ఎవరో ఒకరి ఇంట్లో సందె గొబ్బెమ్మల పేరంటాలు... ఆ గొబ్బెమ్మల చుట్టూ తిరిగుతూ పాటలు పాడడం, మంగళ హారతి పాటలు పాడడం, అదో మధుర జ్ఞాపకం. భోగి పండుగకు రెండు మూడు రోజుల ముందరే, మా వీధి లో మగపిల్లలు చెక్కలు, కట్టెల కోసం ఇల్లిల్లూ తిరిగి చందాలు వసూలు చేసేవారు. అప్పట్లో, స్నానానికి వేడి నీళ్ళు కాచుకోవడం కట్టెల పొయ్యి మీదనే కాబట్టి, ఇంట్లో చెక్క మొద్దులు, కట్టెలు సేకరించి ఉంచుకున్న వారు ఈ మగపిల్లలతో మిగిలిన ఏడాది అంత ఎలా ఉన్నా, ఈ భోగి రోజుల్లో మహా మంచిగా ఉండేవారు, వారి కట్టెల కి ఏఅపాయమూ రాకూడదు అని. మగపిల్లలు మహా టక్కరి వాళ్ళు. వాళ్లతో మంచిగా ఉంటూనే సగం కట్టెలు, దూలాలు ఎత్తుకోచ్చేసే వారు. ఇక భోగి రోజు నడిరాత్రి నుంచే భోగి మంటల సందడి. ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటున్నా వినకుండా అక్కడే తెల్లరేవరకు మా మకాం. తరువాత అమ్మతో సహస్ర నామార్చన ఎలాగు ఉండేది. సాయంత్రం భోగి పండ్ల పేరంటాలు. అప్పట్లో టీవీ ఉండేది కాదు కనుకా ఈ సరదాలు అన్నీ ఎంతో చక్కగా మనసారా ఆస్వాదిన్చాము.
సంక్రాంతి పండుగకు ప్రతి సంవత్సరం పట్టు పరికిణీ, పూలజడ తప్పనిసరి. మాకే కాదు. మకర సంక్రాంతి నాడు మా కాంపౌండ్ లో ఉన్న ప్రతి ఆడపిల్లకు మా అమ్మ పూల జడ కుట్టేది. సాయంత్రం బొమల కొలువు పేరంటం. ఇక మా ఇంట్లో బొమ్మల కొలువు అంటే 10 రోజుల ముందు నుంచి తయారీ. పార్క్ కోసం ఆవాలు మొలకేత్తించడం, కొత్త కొత్త బొమ్మలు కొనడం, ఒక పల్లెటూరు, కొండ మీద ఒక గుడి, పార్క్, బడి, దశావతారాలు, పెండ్లి వారు, సీతా కళ్యాణం, ఈ బొమ్మలన్నీ పైనుంచి తీసి దులపడం, అమర్చడం, రోజూ ఉదయం సాయంత్రం హారతి ఇవ్వడం,ఇవన్ని ఒక ఎత్తైతే, పండగ సరదా తీరి, అలసిపోయిన తర్వాత అవన్నీ తీసి మళ్లీ పెట్టెల్లో పెట్టి దాచడం ఒక పెద్ద పని.
ఇక కనుమ రోజు పిల్లలకు పెద్దగా పని ఉండేది కాదు. గుడికో, లైబ్రరీ కో వెళ్లి వచ్చి అమ్మ చేసిన గారెలు తినడమే.
ఇక ధనుర్మాసం మొత్తం హరిదాసులు, గంగిరెద్దులు, బుడబుక్కల వాళ్ళు, కొమ్మ దాసరి వాళ్ళు, పిట్టల దొరలూ, ఇవన్ని మధురమైన జ్ఞాపకాలు. హరిదాసు చిడతలు వీధి చివరన వినబడగానే, పిల్లలందరూ బియ్యం పట్టుకొని వాకిళ్ళలో నుంచునే వారు. గంగిరేద్దులకు పాత బట్టలు ఇచ్చెవాల్లమ్. ఆ గంగిరెద్దు విన్యాసాలు చేస్తూ ఉంటె ఆశ్చర్య కరంగా ఉండేది. ఇక పిట్టల దొర కబుర్లకు ఆకాశమే హద్దు.
సంక్రాంతి పండుగలో అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ పండగ half yearly ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలవులు ఇచ్చేవారు. ఒక పక్క ముగ్గులు ఇతరత్రా హడావిడి, ఒక పక్క పరీక్షల టెన్షన్. అంతా అదో సందడి.... ఇవండీ మా సంక్రాతి కబుర్లు.....
సభ్యులందరికీ ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు....
ప్రతి రోజు మనం వార్తల్లో వింటూనే ఉంటున్నాం, దినపత్రికలలో చదువుతూనే ఉంటున్నాం. అయినా ప్రతి వీధికి ఒకరుగా వెలుస్తున్న దొంగ బాబాలను నమ్ముతూనే ఉన్నాం. మొన్ననే దేవిశ్రీ బాబా గారి గురించి వార్తల్లో విని ఆశ్చర్య పోయాను. అయన ఒక ప్రముఖ తెలుగు ఛానల్ లో జ్యోతిష్యం చెప్పడం నేను చూసాను. సామాన్యుల సంగతి సరే, ప్రముఖులు, రాజకీయ నాయకులూ, వ్యాపారవేత్తలు, సినీ నటులు, ఇలా ఎందరెందరో దొంగ బాబాల కు శిష్యులు అవుతారు. రాజకీయ నాయకులూ, సినీ నటులను పలుకుబడి కో, ప్రచారానికో ఉపయోగించు కుంటారు సరే, ఎంతో చదువుకుని, ఎంతో అనుభవం కలిగి, కోట్ల తో వ్యాపారం చేసే వ్యాపారస్తులకు, మరెంతమందో మేధావులకు ఈ బాబాల వలలో పడే అవసరం ఏముంది? ఏ వంచకుడి చరిత్ర చూసినా ఎక్కువ చదవుకోలేక పోవడం, అపరిమితమైన తెలివి తేటలు, ఎదుటివారిని బోల్తా కొట్టించా గల మాట చాతుర్యం ఇవి common గా కనిపిస్తున్న లక్షణాలు. వీరు ఆడవారిని కూడా వంచించి తమ శారీరిక అవసరాలకు వారిని బలి చేస్తున్నారు. మోసగాడు ఎప్పుడూ మోసగాడే.... మరి చదువుకున్న స్త్రీలు కూడా ఎలా వీరి వలలో పడుతున్నారో అర్ధం గాకుండా ఉంది. ప్రతి దొంగ స్వామీ, మహిళలను మోసం చేసి వారిని తరువాతే బెదిరించే వాడె. ఆ స్త్రీల ఇండ్లలో ఈ విషయం తెలియడం లేదా? అసలు, పూజలు చేయాలి, నువ్వు ఒక్కదానివే నా దగ్గరకు రా అని పిలిచే పరాయి మగవాడి ( వాడు స్వామి అయినా, బాబా అయినా సరే) దగ్గరకు కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా, వేరేవారి తోడూ లేకుండా మహిళలు ఇటువంటి వారి దగ్గరకు వెళ్ళటం మానుకోవాలి. ఒకవేళ వెళ్ళిన తరువాత ఏదైనా జరగకూడనిది జరిగితే, తప్పని సరిగా వారిని చట్టానికి పట్టించాలి. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు భయపడి మౌనంగా ఉండటం కాకుండా, బయటికి చెప్పటం నేర్చుకోవాలి.
అసలు ఈ ప్రపంచం లో పుట్టిన ప్రతివాడికి, వాడి స్థాయి, జీవితాన్ని బట్టి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ధైర్యం గా పరిష్కారం వెతుక్కోవాలి కాని ఈ దొంగ స్వాముల వెంట పడకూడదు. పిల్లల చదువు, వివాహం, ఆర్ధిక, ఆరోగ్య సమస్యలు అందరి ఇండ్లలో సామాన్యం. కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని సమస్యను పరిష్కరించు కోవాలి. లేదా పెద్దలను సలహా అడగాలి. అంతే కానీ పరాయి వారి దగ్గర మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనుకోవటం మూర్ఖత్వం.
అలాగే ఇంటి దగ్గరకు వచ్చి మీ సమస్యలకు సమాధానం చెప్తాము, మీ కోసం పూజలు చేస్తాము అనే వారిని కూడా లోపలి రానివ్వకూడదు. మన బలహీనతలే వారి పెట్టుబడి. అటువంటి వారిని ప్రోత్సహించ కండి. మన శాస్త్రాల్లో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయ్. పెద్దవారిని అడిగితె తెలుస్తుంది. నిజమైన స్వామి ఎవరూ కూడా భక్తులకు ఏకాంతంగా పూజలు చేయాలి అని చెప్పరు. వారి వద్ద నుండి పెద్ద మొత్తం లో డబ్బు వసూలు చేయరు. నిజమైన సన్యాసి, స్వామి దేవుడిని నమ్ముకో, లేదా ఫలానా దేవుడికి ఫలానా పూజ చేయి అంటారే కాని, నాకే పూజ చేయి, లేదా నేనే నీ తరఫున పూజ చేస్తాను, అని చెప్పడు.
ముఖ్యంగా ఇండ్లలో ఒంటరిగా ఉండే స్త్రీలు ఈ విషయాన్ని గమనించండి. సాధారణంగా కొంత మంది స్త్రీలు వాకిట్లో నుంచుని, పెద్ద పెద్దగ మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు గమనించక పోయినా, మీ కబుర్లు మోసగాళ్ళ దృష్టిలో పడితే, మీరే వారికీ సమాచారం ఇచ్చిన వారు అవుతారు. బయట ఉన్నప్పుడు ఫోన్ లలో మాట్లాడేటప్పుడు, ఏ విషయాలు మాట్లాడుతున్నారు, మీ విషయాలు ఎవరు వింటున్నారు , మీ చుట్టుపక్కల ఎవరైనా వింటున్నారా అనే విషయాలు గమనించు కోవాలి. లేదా ఫోన్ వచ్చినా ముఖ్యమైన విషయాలు బయట మాట్లాడకుండా, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడడం మేలు.
ఇవన్ని దృష్టి లో ఉంచుకుని మోసగాళ్ళ నుంచి దూరంగా ఉండండి.
Like · 
అమ్మా, అయ్యా, నేను చాలా ఇళ్ళల్లో చూసిన వాటిని, విన్న వాటిని, మరి కొన్ని ఇళ్ళల్లో అనుభవించిన వాటిని గర్హిస్తూ, పిల్లల పెంపకం లో పెద్దలు పాటించ వలసిన అంశాలను ప్రస్తావిస్తున్నాను. మీకు నచ్చితే ఒప్పుకోండి. నచ్చకపోతే, చదవడం మానేయండి. చర్చ ప్రారంభించ వద్దు.
1. పిల్లలు ఎంత చురుకైన వాళ్ళు అయినా, మేధావులు అయినా, ఆడ/ మగ పిల్లలు ఇద్దరికీ కొంచం అయినా ఇంటి పని తెలిసి ఉండాలి.
2. ఇంట్లో అమ్మకు కొంచెం తల నెప్పి వస్తే కనీసం ఒక టీ పెట్టి ఇచ్చే బాధ్యత తెలిసి ఉండాలి.
3. వాళ్ళు ఎంత బిజీ గా ఉన్నా సరే, కాలేజీ/ స్కూల్ నుంచి రాగానే ఒక అరగంట ఇంట్లో అమ్మతో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. జరిగిన రోజు గురించి, స్నేహితుల గురించి తల్లితో మాట్లాడే అలవాటు ఉండాలి.
4. ఇంట్లో తల్లితండ్రుల ముఖం చూసి, మాట తీరు చూసి, వాళ్ళు నీరసంగా /అలసటగా ఉన్నారా అని గ్రహించు కోవాలి.
5. ఇంటికి వచ్చిన బంధువులతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవాలి.
6. ఇంటి ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని వ్యవహరించాలి. విద్యార్ధి దశలో ఉండగా ఖరీదైన వస్తువులు, బట్టల కోసం పేచి పెట్టకూడదు.
7. *** ఇప్పటి పిల్లలకు చాలా ముఖ్యంగా నేర్పవలసినది ఏంటంటే, స్నేహితుల తోనూ, పెద్దలతోనూ, బంధువులతోనూ, ఒకేలా మాట్లాడకూడదు అని, ఎవరి స్థాయిని బట్టి వారితో సంభాషించాలి అని.
8. ఏ విషయం లో అయినా, నీకేం తెలుసమ్మా దీని గురించి, అని తల్లి తండ్రులను చిన్నబుచ్చే అలవాటును పిల్లలలో మొగ్గ లోనే తున్చేయండి.
పిల్లలు సరి అయిన మార్గం లో నడవాలి అంటే, పెద్దలు ముందు అలా ఉండడం అలవాటు చేసుకోవాలి. ఈ అన్ని కనీస మర్యాదలను మీరు పిల్లలకు నేర్పించాలి.

ఈ చరాచర సృష్టిని ఏ అంతరాయము లేకుండా నడిపిస్తున్న ఒక మహాశక్తి పేరే దైవము. పవిత్రమైన హిందూ ధర్మం దైవశక్తిని ఒక రూపానికి మాత్రమే పరిమితం చేయ లేదు. కోట్లాదిమంది మానవుల భావనలకు తగినట్టుగా దైవశక్తి కోట్లాది రూపాలను సంతరించుకున్నది. అఖండమైన ఆ శక్తి, సృష్టి, స్థితి, లయ కారకులుగా శ్రీ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా, జ్ఞానమునకు అధిదేవతగా సరస్వతి దేవి, ధనానికి అధిదేవతగా లక్ష్మి, ధైర్యము, సాహసమునకు ప్రతీకగా హనుమంతుని ఇలా ఎన్నెన్నో రూపాలు కలిగి భక్తుల మనోభీష్టాలను నేరవేరుస్తున్నది. జీవుడు పుట్టిన దగ్గర్నుంచి, దేహం విడిచే వరకు ఎన్నో కర్మలు (పనులు) చేస్తాడు. వాటన్నిటి కారణంగా అతనికి పాపపుణ్యాలు కలుగుతాయి. అవి అతని జీవన క్రమానికి బాటలు వేస్తాయి. మంచి పనులు చేస్తే, మంచి జీవితము, చెడు పనులు చేస్తే చెడు జీవితము ప్రాప్తిస్తుంది అనేది పెద్దల మాట. ఒక మానవుని యొక్క ఆజన్మాంతం ఎన్నో విధాలుగా సహకరిస్తున్న ఆ దైవానికి మనం ఏ విధంగా ఋణం తీర్చుకుంటున్నాం? మన వేదాలు, పురాణాలు, శాస్త్రాలలో చెప్పిన పూజలు, వ్రతాలు ఆచరించటం ద్వారా... అయితే అందుకు ఆశక్తులైన వారు ఏమి చేయాలి? భగవంతుడు మనలను కష్టపెట్టి తాను పూజలు జరిపించుకోవాలి అని ఆశించడు. ఎవరి శక్తి కొలదీ వారు తనను ఆరాధించమనే భగవంతుడు చెప్పాడు. భగవంతుని తృప్తి పరచడానికి ఒక సులభమైన మార్గం, భగవంతుని నామ స్మరణ. నవ విధ భక్తీ మార్గములలో ఒకటి అయిన ఈ దైవ నామ స్మరణ తో భగవంతుని సులభంగా దర్శించవచ్చు. నడుస్తున్నా, తిరుగుతున్నా, ప్రయాణం లో ఉన్నా, అనారోగ్యం తో ఉన్నా, మనసులో కాని, పైకి ఉచ్చరిస్తూ కాని, భగవంతుని నామ జపం చేయవచ్చు. ఎవరి ఇష్ట దైవమును వారు మన: పూర్వకంగా భక్తీ తో స్మరించు కోవచ్చు.
ఓం నమో నారాయణాయ.
ఓం శ్రీ రామ...
ఓం నమ: శివాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం సాయి రామ్
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి
ఓం హనుమతే నమ:
ఓం శ్రీ సరస్వత్యై నమ:
భగవంతుడు స్మ్రుతి మాత్ర ప్రసన్నుడు. మనం నిండు మనసుతో, అయన నామాన్ని నిరంతరం స్మరిస్తే, ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనలను రక్షిస్తాడు.
శుభం...

Wednesday, 18 February 2015

రథసప్తమి - విశేషాలు
ఓం ఆదిత్యాయ నమః
జనవరి 26, సోమవారం ‪#‎రథసప్తమి‬
ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారయణ స్వామిని విశేషంగా ఆరాధించే పర్వదినం. ఈ రోజు చేసే మాఘస్నానానికి చాలా విశేషత ఉంది. రథసప్తమి నాటి ఉదయం సూర్యోదయానికి ముందే 7 ‪#‎తెల్లజిల్లేడు‬ ఆకులను, రేగు ఆకులను తలపై ఉంచుకుని స్నానం చేయడం ఆరోగ్యకరం.
ఈ స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని చెప్పుకోవాలి
యద్యజ్జన్మకృతం పాపం మయాసప్తమ జన్నసు
త న్మే రోగం చ శోకం చ మాకరీ హంతు సప్తమీ
ఏ తజ్జన్మ కృతం పాపం యచ్చ జనాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః
ఇతి సప్తవిధం పాపం స్నానాన్మే సప్త సప్తికే
సప్తవ్యాధి సమాయుక్తం హర సప్తమి మే హరః ||
ఏతన్మంత్రమయం జప్త్వా స్నాత్వా పాదోదకే నరః
కేశవాదిత్య మాలోక్య క్షణా న్నిష్కల్మషో భవేత్ ||
అంటే జన్మ మొదటి నుండి చేసిన పాపం, జన్మాంతరాలలో చేసిన పాపం, రోగ రూపంలో, శోక రూపంలో వేదించే పాపమంతా మకరంలో ఉండే సప్తమి హరింపజేయాలనీ, సూర్య ప్రియమైన ఈ మకరసప్తమి ఈ జన్మలోనూ, జన్మాంతరాలలోనూ మనసుచేత, వాక్(మాట) చేత, ఇంద్రియాల చేత తెలిసీ తెలియక చేసిన పాపమంతా ఈ స్నానంతో నశించాలనేది అర్ధం.
ఈ రోజు స్నానం చేసే ముందు ఆకులను దొన్నెలుగా చేసి అందులో దీపాలను వెలిగించి, సూర్యున్ని ధ్యానిస్తూ ఆ దీపాన్ని నీటిలో వదలాలి.
సాధారణంగా పుణ్యస్నానం సూర్యోదయానికి గంటన్నర ముందు చేస్తాం. కాని మాఘస్నానం ప్రత్యేకత ఏమిటంటే సూర్యోదయానికి కొద్ది సమయం ముందు స్నానం చేయాలి. ఆరోగ్యం సహకరించని వారు వేడి నీటి స్నానం చేయచ్చు. స్నానం చేయగానే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి.
రాగి చెంబులో నీరు తీసుకుని అందులో ఎర్రని పూలు, ఎర్ర గంధం, ఎర్రని అక్షతలు, లేత జిల్లేదు ఆకులు, గరిక ఇవన్నీ కొద్దిగా ఆ నీటిలో వేసి సూర్య భగవానుడికి చూపించి వదలాలి. దీనిని అర్ఘ్యం అంటారు. నీరు వదులుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి.
సప్తసప్తివహ ప్రీత సప్తలోక ప్రదీపన
సప్తమీ సహితో దేవ గృహాణార్ఘ్యం దివాకర
ఈ విధంగా చేయడం వలన ఆరోగ్యం చేకూరుతుంది. తర్వాత సూర్యభగవానుడికి నమస్కరించాలి. మాఘస్నానానికి కార్తీక స్నానానికి ఉన్నంత విశేషం ఉంది. ఈ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యం, పదిమంది ఈ మాఘస్నానం గురించి చెప్పడం వలన కూడా పుణ్యం లభిస్తుందని శాస్త్రం చెప్తోంది. ఈ మాఘస్నానం ఈ మాఘమాసమంతా చేయాలి.
రధసప్తమి రోజు శ్రీ సూర్యనారాయణ మూర్తికి ‪#‎దేశీ‬ ఆవుపాలతో చేసిన పరమాన్నం నివేదన చేస్తారు. ధనుర్మాసంలో ప్రతి రోజు ఇంటిముందు పెట్టిన గోబ్బెమ్మలను పిడకలుగా చేసి, ఆ పిడకలను ఉపయోగించి పరమాన్నం చేయాలి. ఇంటిలో చిక్కుడుచెట్టు ఉంటే దాని దగ్గర సూర్యబింబానికి ఎదురుగా కూర్చుని పరమాన్నం వండాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం మొదట పాలు పొంగించాలి. పాలు పొంగు వచ్చిన తరువాతే పరమాన్నం వండాలి
courtesy : Eco Ganesh.
శ్రీ కృష్ణుడు అర్జునుని వంక పెట్టి ప్రపంచానికి అందించిన ఒక మహత్తర బోధ "శ్రీ మద్భగవద్గీత". ఇది కేవలం హిందువు లదే అని భావించే వారు ఒట్టి మూర్ఖులు. విజ్ఞానం ఒకరి కోసమే పరిమితం అవుతుందా? విజ్ఞానం అనేది అందరికీ ఉద్దేశించినది. భగవద్గీతను వయసు మళ్ళిన వారి కోసం, అనుకునే వారు, గీతను చదివితే, సన్యాసం పుచ్చుకున్నట్లే అనుకునేవారు వెర్రివాళ్ళు. నిజం చెప్పాలంటే, గీతను, చిన్న వయసు నుంచే చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, యవ్వనము, గృహస్తాశ్రమము, వానప్రస్తము అనే ఈ బాధ్యతలను ఎంతో సమర్ధవంతంగా నిర్వహించ వచ్చును.
మానవుని జీవితం లో కలిగే అన్ని సందేహాలకు సమాధానం ఇచ్చేది గీత. ప్రత్యక్షం గా కాకపోయినా, మానవుడు తనను తాను తెలుసుకొని, తన లోపలికి తొంగి చూసుకుని, తన అంతరంగాన్ని విశ్లేషించుకొని, తను చేసే తప్పొప్పులను కనుగొనడానికి 'గీత' ఎంతగానో తోడ్పడుతుంది. పొగడ్తలకు పొంగిపోయి, విమర్శలకు కుంగిపోకుండా, సుఖాలలో ఒళ్ళు మరచిపోయి, దుఖాలలో మనో వేదనకు గురికాకుండా, ఒక స్థిరమైన మన:స్థితిని "గీత" మనకు నేర్పిస్తుంది. దీనినే "స్థితప్రజ్ఞత" అంటారు.
మన బుద్ధిని పక్క దారులు పట్టనీయకుండా, మనలను మనము నియంత్రించుకునే పాటవం మనకు గీత చదవడం వలన లభిస్తుంది.
తాను చేసే కర్మలు అన్నీ, తన కోసం కాకుండా, భగవంతుని కోసమే అనే భావనలో, సర్వ ప్రాణి మనుగడను, సర్వ లోక హితాన్ని, బోధిస్తుంది భగవద్గీత. అరిషడ్వర్గాలను జయించి, ప్రశాంత చిత్తమును కలిగి ఉండడం ఎలాగో గీత నుంచి మనం తెలుసుకోవచ్చు.
ఇవన్నీ ఒక ధర్మనికో, మతానికో పరిమితం కాదు కదా, ఒక వయసుకు పరిమితం కాదు కదా, అటువంటప్పుడు భగవద్గీత ఒక్క హిందూ ధర్మానికే ప్రతీక అని ఎందుకు భావించాలి? ఎన్నో వ్యక్తిత్వ వికాసా గ్రంధాలు, నిపుణుల వలన పొందలేని ప్రయోజనాలు కేవలం భగవద్గీతను పఠించి, అర్ధం చేసుకుని ఆచరించడం వలన పొందవచ్చు.
మానవాళి ప్రగతికి , మానవ జాతి యొక్క వికాసానికి, ధర్మ పరిరక్షణకు భూమి మిద అవతరించిన ఒక ఉద్గ్రంధం "శ్రీ మద్భగవద్గీత". దీనిని కేవలం ఒక మతానికో, ధర్మానికో పరిమితం చేయకండి. సంకుచితం గా ఆలోచించకండి.
బాల్యం నుంచి, పురాణాలు, శాస్త్రాలలోని విషయాలు మీ పిల్లలకు చెప్తూ ఉండండి. వారు పెరిగి పెద్దవారి సమజానికి , దేశానికి ప్రయోజకులుగా తయారు అయ్యేలా పిల్లలను పెంచండి. ఇది ఈ సమయం లో ఎంతో అవసరం.