Saturday, 2 May 2015

 పుష్యమాస ప్రాశస్త్యం: (రెండవ భాగం )

దేవఋణం.
త్రిమూర్తి స్వరూపుడైన సూర్యనారాయణ భగవానుణ్ని ప్రపంచ పోషకుడిగా, వేడి-వెలుతురు-ఆరోగ్యం ప్రసాదించే వాడిగా, జ్ఞాన భాస్కరునిగా, యుద్ధాధిపతిగా భారతీయులు అనాదిగా ఆరాధిస్తున్నారు. ఇంద్ర, వరుణ, వాయుదేవతల సహాయంతో సూర్యుడు భూమిపై వర్షించడం వల్లనే మకర సంక్రాంతి పండుగానాటికి పంటలు పండి, మన చేతికి అందుతాయి. మన జీవన నిర్వహణ జరుగుతోంది. అందుకే సంక్రాంతి నాడు తలంటు స్నానం చేసి, సూర్యాది దేవతలను పూజించి, కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలను పొంగించి, సూర్యభగవానునికి భక్తితో, కృతజ్ఞతలతో నివేదించడం ఆచారం.

పితౄణం:

పితృతర్పణాలు, పిండోదక దానాలు, శ్రాధ్ధకర్మలు మొదలైనవి ఆచరించడం ద్వారా మరణించిన పితరుల ఋణం కొంతైనా తీరుతుందని విశ్వసిస్తారు. మకరరాశికి శని అధిపతి. శని వాతప్రధాన గ్రహం. వాతం తగ్గాలంతే సంక్రాంతినాడు తెలకపిండితో , నువ్వులు, బెల్లంతో చేసిన అరిశెలు మొదలైన పదార్థాలు సేవించాలి. నువ్వులు, బెల్లం, గుమ్మడికాయ మొదలైనవి దానం ఇస్తే శనిదోషం కొంత పోతుంది అంటారు.

భూతఋణం.

భూమి, నీరు, గాలి మొదలైన భూతాలు కరుణించడం వల్లనే పంటలు పండుతున్నాయి. అందుకే కృతజ్ఞతతో వాటిని కూడా పూజిస్తాం. పండిన పొలాల్లో పొంగలి మెతుకులు, పసుపు కుంకాలు చల్లి, ఎర్ర గుమ్మడికాయను పగలగొట్టి దిష్టి తీయడం ఆచారమైంది. పాడి పశువులు పాలిచ్చి మనల్ని పోషిస్తున్నాయి. ఎద్దులు వ్యవసాయంలో శ్రమిస్తున్నాయి. అందుకె కృతజ్ఞతా సూచకంగా కనుమనాడు పశువులను, పశుశాలలను శుభ్రం చేసి, అలంకరిస్తారు. ఇళ్ళ ముంగిట బియ్యంపిండితో రంగవల్లులు వేస్తారు. ఆ పిండి క్రిమికీటకాదులకు ఆహారం. ఇలా మూగజీవులకు, భూమి మొదలైన భూతాలకు మానవాళి కృతజ్ఞతలు తెలిపే ఆచారాలను ఈ పండుగలో నిబధ్ధం చేశారు.

మనుష్య ఋణం.

ఇతరుల సహాయ సహకారాలు లేనిదే సమాజంలో జీవనం కొనసాగించలేము. అందుకు కృతజ్ఞతగా ఈ పండుగ నాడు ధాన్యం, తిలలు, కర్రలు, చెరకు, గోవులు, పళ్ళు, వస్త్రాలు మొదలైనవి విరివిగా దానధర్మాలు చేస్తారు. అతిథులను ఆదరిస్తారు. వ్యవసాయంలో సాయం చేసిన వారికీ, గ్రామంలోని ఇతర వృత్తులవారికీ కొత్థ ధాన్యాన్ని పంచిపెట్టడం ఈ పండుగ లోని మరో ఆచారం.

ఋషిఋణం:

ఈ పండుగ సమయంలో ఆచరించే జపతపధ్యానాది ఆధ్యాత్మిక సాధనలూ, సద్గ్రంథ పఠనాదులూ శీఘ్రఫలాలిస్తాయని విశ్వసిస్తారు. ధాన్యం, ఫలాలు, అజినం, కంచు, బంగారం, దానం శ్రేష్టం.

కనుము:

సంక్రాంతి పండుగలో ఆఖరిది కనుము పండుగ. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను గౌరవించే పండుగ ఇది. ఎద్దులు, ఆవులు మున్నగువాటిని, స్నానం చేయించి, అలంకరించి, వాటి కొట్టాలను శుభ్రం చేసి, అలికి, అలంకరించి, అక్కడ పొంగళ్ళు వండుతారు. వ్యవసాయకూలీలను కూడా గౌరవించే పండుగ ఇది. ఈ దినం పూర్తిగా కర్షకులకు సంబంధించిన దినం.  

Friday, 1 May 2015

పుష్య మాస ప్రాశస్త్యం:

భారతీయ సంప్రదాయం ప్రకారం నెలకు రెండు పక్షాలు. శుక్ల పక్షం, కృష్ణ పక్షం. పక్షానికి 15 రోజులు. ఒక్కో రోజుకు ఒక్కో తిథి. అలా పదిహేను రోజులకు పదిహేను తిథులు. వాటిల్లో పదకొండో తిథి "ఏకాదశి:. ఒక్కొక్క తిథి నాడు ఒక్కొక్క దేవుడిని ఆరాధించడం అనాది కాలం నుంచి వస్తున్న ఆచారం. అయితే తిథులన్నింటిలోనూ, మన పురాణాలు అత్యంత పవిత్రమైనదిగా పేర్కొనబడిన తిథి "ఏకాదశి:.

వైకుంఠ ఏకాదశి:

మర్గశిర (ధను) మాసంలో వచ్చే ఈ ఏకాదశి పవిత్రమైనది. ఈరోజున ఉపవాసం, విష్ణు ఆరాధన, విశేష ఫలాన్ని ప్రసాదిస్తాఇ. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది. వైకుంఠ ద్వారాలు తెరచుకునే రోజుగా దీనిని భావిస్తాం. సౌరశక్తి ఉత్తరాయణంకి మారేముందు వచ్చే ఏకాదశి ఇది. దీనిని మహిమాన్వితమైన ఏకాదశిగా పురాణాలు వర్ణించాయి. ఏకాదశినాడు ఉపవసించి, షోడశోపచారాలతో నారాయణుని అర్చించి, ద్వాదశి నాడు తిరిగి పూజించి, అనాదికాలు నివేదించి పారణ చేయాలి.

సంక్రాంతి:

ఆంధ్ర ప్రజలకు పెద్దపండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులు జరుపుతారు. మొదటిది భోగి. రెండవది మకర సంక్రాంతి. మూడవది కనుము.

భోగి:

సంక్రాంతి మొదటి రోజును భోగి పండుగ గా జరుపుతారు. ఈరోజు తెల్లవారుజాముననే నిద్రలేచి, భోగి మంటలు వేసి, చిన్నా,పెద్దా అందరూ చేరుతారు. ఇండ్లలో పనికిరాని పాత చెక్క వస్తువులు, కర్రలు మొదలైన వాటిని భోగి మంటల్లో పడేస్తారు. చిన్న పిల్లలకు సూర్యుని ప్రతీకలైన రేగు పండ్లతో భోగి పండ్లు పోసి పెద్దల, ముత్తైదువల ఆశీస్సులు తీసుకుంటారు.

మకర సంక్రాంతి.

సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్య ఘడియలివి. ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. దేవమార్గం ప్రారంభం అయ్యే రోజు. ఈ సంక్రమణ వేళ స్నాన, దాన, జప తప, వ్రతాదులు శ్రేష్టం. గుమ్మడి, వస్త్రములు దానం చేయడం ఆచారం. పంట చేతికందిన ఈ పర్వం నాడు ప్రతి ఇంటా శోభ వెల్లివిరుస్తుంది.విష్ణు సరస్రనామ పఠనం ఈ రోజున విశేషమైన శుభఫలాలను ఇస్తుంది. దేవ, పితృదేవతలను ఉద్దేశించి చేసే తర్పణాదులు, దానాదులు పుణ్యప్రదం. పౌష్యలక్ష్మి గా జగదంబను ఆరాధించే కాలం ఇది.

సంకార్తినాడు దేవతలకు, పితృదేవతలకు  పాత్రులకు ఏఏ పదార్థాలను దానం చేస్తామో అవి అత్యధికంగా జన్మజన్మలకీ లభిస్తాయి. ఉత్తరాయణ పుణ్య కాలానికి ఆరంభమిది. ఈరోజు నువ్వులనూనె తో దీపం వెలిగించుట చాలా శ్రేష్టం. శివునకు  ఆవునేతితో అభిషేకం శ్రేష్టం. సంక్రమణం నాడు ఒంటిపూట భోజనం చేయాలి. రాత్రి భుజించరాదు. మంత్ర జపాదులు, ధ్యానం, పారాయణం యొక్క ఫలాలను శీఘ్రంగా ప్రసాదించే మహిమ సంక్రమణానికి ఉంది.

పంచ ఋణాల నుండి గృహస్థుల విముక్తి పొందే మార్గాలను ఆచారరూపంలో నిక్షేపించి, నిర్దేశించింది ఈ మకర సంక్రాంతి.

(ఇంకా ఉంది ) 
మార్గశిర మాస ప్రాశస్త్యం:

ఈమాసం లో వచ్చే మొదటి షష్టిని సుబ్రహ్మణ్య షష్టి గా జరుపుకుంటారు. భారత దేశం అంతటా ఈ పండుగను ఎంతో భక్తిప్రపత్తులతో జరుపుకుంటారు. మార్గశిర పౌర్ణమి దత్తత్రేయ జయంతి. ఈ జయంతి, మృగశిర నక్షత్రం తో కాని, బుధవారం తో కానీ కలిసి వస్తే గొప్ప యోగం. త్రిమూర్త్యాత్మకమైన శ్రీ దత్తాత్రేయుల వారిది గురు సంప్రదాయంలో ప్రత్యేక స్థానం. దత్త నామమే మహిమాన్వితం. దత్తాత్రేయ ఆరాధనకు ఈ రోజు చాలా మంచిది. అత్రి అనసూయలకు కుమారునిగా త్రిమూర్తుల తేజం "దత్త" నామంతో అవతరించింది. భాగవతం ప్రకారం తనను తాను పుత్రరూపంగా ఇచ్చుకొని అలా ఇవ్వబడిన కారణంగా "దత్త" నామధేయుడు అయ్యాడు. అత్రి కుమారుడు కనుక "ఆత్రేయుడు" అయ్యాడు. ఈ రెండు నామాలు కలిసి దత్తత్రేయుడు. ఇది గురు స్వరూపం. జ్ఞాన స్వరూపం. ప్రధానంగా నారాయణుదై, తదుపరి బ్రహ్మరుద్రాత్మకుడై, త్రిమూర్తుల స్వరూపంగా ఆరాధ్యుడయ్యాడు. కరుణామయుడైన దత్తుని స్మరించితే చాలు అనుగ్రహిస్తాడని శాస్త్ర వచనం. అందుకే స్వామికి "స్మర్తృగామి" అని పేరు. దత్తజయంతి రోజున దత్తారాధన, స్మరణ ఆవశ్యక ధర్మాలు.

ధనుస్సంక్రాంతి:

ఈరోజు సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించే పుణ్యవేళ. ఈ సంక్రమణ కాలంలో విష్ణుపూజ, దానజపాదులు విశేష ఫలప్రదం. ఈరొజు నుండే ధనుర్మాసం ప్రారంభం. ఈరోజు నుండి వైష్ణవ సంప్రదాయ ఆలయాల్లో "తిరుప్పావై" పారాయణ ఆరంభిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసానికి ప్రత్యేక ప్రాధాన్యం. 
ద్వాదశి నాడు విడిచిపెట్టాల్సినవి.
పగటి నిద్ర, ఇతరుల ఇంట భోజనం, రెండోసారి భోజనం, మైథునం, తేనె, ఇత్తడిపాత్ర లేక కంచు పాత్రలలో భోజనం, తైలము అనేవి ద్వాదశి రోజున విసర్జించాలి. ఇవి ఉపవాస ఫలితాన్ని నశింపచేస్తాయి.

ఉగాది నాడు బ్రహ్మదేవుని ప్రార్ధించాలి. ఆయనను ప్రార్ధించే ఏకైక పండుగ ఇదే!
ఓం నమో బ్రహ్మణే తుభ్యం కామాయచ మహాత్మనే!
నమస్తేస్తు నిమేషాయ తృటయేచ మహాత్మనే!
నమస్తే బహురూపాయ విష్ణవే పరమాత్మనే!
                                               
శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ!
సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం!

అంటే సర్వారిష్టాలు, (గ్రహదోషాలు, ప్రమాదాలు, ఇబ్బందులు, అనారోగ్యం మొదలైనవి) నివారించబడి, సర్వసంపదలు కలిగి దీర్ఘాయువు, వజ్రము వంటి దేహము (రోగాలు లేకుండా అరోగ్యవంతమైన దృఢమైన దేహము ) లభిస్తాయని చెప్పబడింది.

ఈ ఉగాది పచ్చడి ఆరోగ్య రీత్యా చక్కటి ఫలితాలను ఇవ్వడమే కాకుండా గ్రహాలకు ఆధిపత్యం గల రుచులతో మిళితం కావడం వలన ( వేప రుచికి బుధుడు, బెల్లం గురునకు, మామిడి ముక్కల రుచి శుకృనకు, నెయ్యి చంద్రునకు) గ్రహ దోషాలను నివారిస్తుందని చెబుతారు.

ఉగాది పండుగ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేయడం, దేవతారాధన, ఉగాదిపచ్చడి సేవనం, పంచాంగ శ్రవణం తో పాటు మనకు వీలయితే చేయవలసిన మహత్కార్యం ఇంకొకటి ఉంది. అదే ప్రపాదానం. అనగా చలివేంద్రం స్థాపించడం.


 శ్రీరామభక్తుడైన హనుమంతుడు, చైత్ర పౌర్ణమి నాడు జన్మించినట్లు పలుచోట్ల చెప్పబడింది. ఉత్తర భారతం లోనూ, దక్షిణ భారతం లోని కొన్ని ప్రాంతాలలోనూ  ఈనాడే హనుమజ్జయంతి ని జరుపుకుంటారు. కొంతమంది మాత్రం పరాశర సంహిత లో చెప్పబడినట్లు వైశఖ బహుళ దశమి నాడు హనుమజ్జయంతి ని పాటిస్తారు. ఈరోజు హనుమంతుని పూజించడం వలన గ్రహదోషాలు నివారించబడతాయి. ఇంకా భూత, ప్రేత పిశాచాల వంటి పీడలు తొలగి, గాలిచేష్టలవంటి మానసిక రుగ్మతలు కూడా తొలగిపొయి, ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పబడింది. హనుమజ్జయంతి రోజున సుందరాకాండ, హనుమాన్ చాలీసా లను పారాయణం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ పారాయణను గ్రుహములో చేసినా, దేవాలయములో చేసినా,మంచి ఫలితాలను పొందుతారు. ఇక కదళీ వనము నందు పారాయణ చేసినట్లయితే,  ఆ ఫలము, వేయి రెట్లుగా ఉంటుంది అని పెద్దలు చెపుతారు.
కార్తీక మాస ప్రాశస్త్యం (నాలుగవ భాగం)

ఉత్థానైకాదశి:

విష్ణుమూర్తి పాలకడలిలో  ఆషాఢ శుక్ల ఏకాదశినాడు యోగనిద్రలో శయనించిన విష్ణుమూర్తి కన్నులు విప్పి యోగనిద్రను చాలించి లేచిన రోజె ఈ" ఉత్థాన ఏకాదశి. ఉత్థానం అంతే లేచుట, మేల్కొనుట అని అర్ధం. యోగ సాధన చేయువారికి ఆకాశములోని నక్ష్త్ర మందలము నుండి భగవద్భక్తి తరంగాలుగా క్రిందకు దిగి శరీరములో ప్రవేశించి ఆత్మను మేల్కొలుపు కాలమిది..

మరునాడు వచ్చె ద్వాదశిని బోధన ద్వాదశి, హరిద్వాదశి , చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈరోజున ఉసిరి చెట్టుకు, తులసి మొక్కకు శ్రధ్ధాభక్తులతో పూజలుచేసి, చలిమిడి దీపాలు వెలిగించి, అవి కొండెక్కిన తర్వాత ఆ చలిమిడిని ప్రసాదంగ తీసుకుంటారు. ఈరోజున చేసే దీపదానం, వస్త్ర దానం విశేష ఫలితాలను ఇస్తాయి. ద్వాదశినాటి సాయంత్రం లక్స్మీదేవికల్యాణం చేస్తారు. పాల సముద్రము చిలికిన సమయములో లక్ష్మి ఉద్భవించినపుడు ఆమెకు విష్ణువుతో వివాహం జరిగిన రోజు ఇదే అని అంటారు. కార్తీకమాసంలో ఉసిరి చెట్టు క్రింద శుచిగా వండిన వివిధ వంటల్ని కేశవారాధనతో నివేదించి బంధుమిత్ర సహితంగా ఆరగించడం అనేది "కార్తీక వన సమారాధన" గా నేటికీ ఆచరణలో ఉంది.

కార్తీక పూర్ణిమ:

చంద్రుడు మనసుకు ప్రశాంతతను ఇస్తాడు. తమోగుణాన్ని హరిస్తాడు. అతడిని శివుడు తన జటాజూటంలో ధరించాడు. అందుకే అతని పేరుతో ఏర్పడిన సోమవారం ఈ నెలలో విశిష్టమైనది. పూర్ణిమ నాటి వెన్నెల ఆరోగ్యకరం కనుక కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం వండుకుని పూజాదికాలు నిర్వహంచి ప్రసాదాలు స్వీకరించే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది. పూర్ణిమ నాడు తెల్లవారి నాలుగయిదు గంటల మధ్య కృత్తికా నక్షత్రం కనిపిస్తుంది. ఆ సమయంలో నదీస్నానం పుణ్యప్రదం అని, ఆరోగ్యదాయకం అని పెద్దలు చెబుతారు.

కార్తీక పూర్ణిమ శ్రేష్టమైనది. ఈరోజున ఉపవాసం, దానం, అర్చన, స్నానం విశేష ఫలదాయకం. పూర్ణిమ నాడు విశేషంగా దీపారాధన చేయడం మంచిది.

నరకచతుర్దశి..

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు తెల్లవారుజమునే నరక భయ నివారనార్ధం నువ్వుల నూనె తొ అభ్యంగన స్నానము చేయవలెను. దీపావళి పర్వదినాల్లో లక్ష్మీదేవి తిలతైలంలో (నువ్వులనూనె) ఉంటుందిట. కాబట్టి తిలతైలంతో తలస్నానం లక్ష్మీప్రదం అని చెప్తారు. చతుర్దశినాదు నీటిలో గంగాదేవి సమాహితమై ఉంటుంది. ఒకరోజు ముందుగానే నీటిని పట్టి పాత్రలలో నిలువ ఉంచి ఆ నీటితో స్నానం చేయాలి. ఆ పాత్రలలో ఉత్తరేణి, తుమ్మ, తగిరస చెట్ల కొమ్మలను నానబెత్తడం వలన వాటిలోని అఔషధ గుణాలు ఆ నీటిలోకి వచ్చి చేరుతాయి.

నరక చతుర్దశినాటి వంటకాల విషయములో కూడా కొన్నినియమాలు ఉన్నాయి. నువ్వులు, మినుములు,బెల్లం తో చేసిన పదార్ధాలు తప్పక తినాలి అని శాస్త్రం. ఇవన్నీ ఋతువులు మారిన కాలంలో ఆరోగ్యం కాపాడుకోవడానికి పెట్టిన నియమాలు. నరక చతుర్దశి నాడు సంధ్య వేల కాగడాలు చేత పట్టుకొని పితరులకు దారి చూపాలట. దాని నిమిత్తం ఇంటి వెలుపల ద్వారం వద్ద దీపాలు వెలిగించాలి.

 ధనత్రయోదశి:

త్రయోదశి నాటి సాయంకాలము ఇంటి వెలుపల యముని ప్రీత్యర్ధం దీపములు వెలిగించాలి. దీనివలన అపమృత్యువు నశిస్తుంది అని స్కంద పురాణమున చెప్పబడింది. ఈ రోజున పితృదేవతలు సూక్ష్మ రూపాలలో ఇళ్ళకు వస్తారు అని, దీపములు వెలిగించి వారిని సత్కరించాలి అని నమ్ముతారు. ఈరోజున కొంతమంది లక్ష్మీదేవి అనుగ్రహం కొరకు బంగారం ఆభరణములు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.


కార్తీక మాస ప్రాశస్త్యం: మూడవ భాగం :

కార్తీకం లో ఉన్ని, ఇంగువ, పుట్టగొడుగులు, గంజాయి, ముల్లంగి, ఆనపకాయ, మునగకాడలు, వంకాయ, గుమ్మడికాయ, వాకుడు, పుచ్చకాయ, వెలగపండు, నూనె, చద్ది మొదలైనవీ, రెండుమార్లు వండిన అన్నం, మాడిన అన్నం, మినుములు, పెసలు, సెనగలు, ఉలవలు, కందులు మొదలైన ధాన్యాలు వాడరాదు.

శివుడు "ఆశుతోషుడు". అంటే వెంటనే సంతోషించే స్వామి. ఆయనకు అలంకారాలతో, నైవేద్యాదులతో రాజోపచారాలతో పనిలేదు. జిల్లేడు, ఉమ్మెత్త మొదలైన విలువ లేని పువ్వులే శివుడికి ప్రీతి. ఇటువంటి అశుతోషి శివానుగ్రహానికి, విష్ణువు అనుగ్రహానికీ ఈ మాసం శ్రేష్టం. అయితే శివుడు అభిషేక ప్రియుడు. అందుచేత, రకరకాలా సంబారాలతో శివాభిషేకం చేయడం అన్ని దోషాలను పోగొట్టి, సకల శుభాలను కలిగిస్తుంది.  కార్తీక మాసం అంతా కార్తీక పురాణం పఠనం, శ్రవణం చేయాలి.

ఈ మాసం లో వచ్చె మొదటి పండుగ దీపావళి. ఈ పండుగను చాలా మంది 4 రోజులు చేస్తారు. ఆస్వయుజ అమావాస్యకు ముందుగా వచ్చే చతుర్దశిని "నరక చతుర్దశి" గాను, అమావాస్య నాదు దీపావళి లక్ష్మీ పూజ గాను, మరుసటి రోజు బలి పాద్యమి గాను, 4వ రోజు "యమ విదియ"గాను జరుపుకుంటారు. లోకులను హింసిస్తున్న తన పుత్రుడి బారి నుంచి లోకులను రక్షించడానికి భూదేవి విష్ణువుతో మొర పెట్టుకోగా, శ్రీక్రిష్ణావతారం లో తన ప్రియ పత్ని సత్యభామతో కూడి నరకుడిని సంహరించిన రోజుగా "నరక చతుర్దశి" ని చెప్తారు. నరకుడి పీడ వదిలిన కారణంగా ఆరోజు, మరుసటి రోజు ఆనందోత్సాహాలతో, దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఈ రోజున యముడు తన సోదరి యైన యమున గృహమందు ఆమె వండి వడ్డించగా భోజనం చేసాడు కనుక దీనికి "యమ ద్వితీయ" అని పేరు. ఈరోజున అక్కచెల్లెని చేతి వంట తిని ఆమెకు వస్త్రాలంకారాలు సమర్పించాలి. దీనివల్ల ఉభయులకూ ధనధాన్యాలు ప్రాప్తిస్తాయి. సోదరునకు చిరంజీవనము, దీర్ఘాయుష్షు, మరియు సోదరికి అఖండ సౌభాగ్యము సిధ్ధిస్తుంది.

కర్తీక మాసం లో ఏ మంత్ర దీక్షను తీసుకున్నా గొప్ప ఫలితాన్నిస్తుందని ధర్మ శాస్త్రాలు చెపుతున్నాయి. ముఖ్యంగా ఏకాదశి నుండి పూర్ణిమ వరకు -- ఈ ఐదు రోజులు శివమంత్రం కానీ, విష్ణు మంత్రం కానీ ఉపదేశం పొందడం, దీక్షగా జపించడం ఉత్కృష్ట ఫలప్రదాలు.


(ఇంకా ఉంది )
కార్తీక మాస ప్రాశస్త్యం: ( రెండవ భాగం )

కార్తీక మాసంలో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము. దీపము దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు, అన్నదానము మొదలైనవి చేయాలి. దానమిచ్చుటవలన స్త్రీలకు ఐదవతనము వృధ్ధి అగుట, మంగళ ప్రదము, సఔభాగ్యకరము. తాను ఉపవసించి బీదలకు అన్నదానము చేసిన యెడల గొప్ప పుణ్యము లభించును. సూర్యాస్తమయము అయిన వెంటనే "సంధ్యా దీపము" వెలిగించుట, ముగ్గుపెట్టి ఇంటి ముందు దీపము పెట్టుట, తులసికోటలో దీపము పెట్టుట,  ఉదయము తులసిపూజ, గౌరీపూజ చెసిన వారికి ఆర్ధిక బాధలు తొలగుతాయి.

సూర్యోదయానికి పూర్వము తలపై చన్నీటి స్నానము చేయడం వలన జీవితములో దు:ఖములు నశిస్తాయి. ప్రతి రోజు చేయ్లేక పొయినా, ప్రధాన తిథులలో (ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలు ) నైనా చేయాలి. నది, సముద్రం లభ్యం కాకపోతే, లభ్యమైన జలాలతోనే చేయాలి. కార్తీక దామోదర అనే స్మరణతో స్నానం చేయాలి. అరుణోదయ సమయంలో విష్ణ్వాలయం లో కాని, శివాలయం లో కాని గడపాలి. విష్ణు, శివాలయాల్లొ భగవత్ ధ్యానం, స్తోత్రం, జపం చేయడం వలన వేల గోవుల్ని దానం చేసిన ఫలం లభిస్తుంది. విష్ణు, శివ ఆలయాలు లభించని పక్షం లో మరి ఏ దేవాలయంలో లేదా, రావిచెట్టు మొదట్లో కానీ, తులసీవనం లో కానీ, భగవత్ స్మరణ చేయాలి. ఈ మాసం దీపారాధనకు విశిష్తమైనది. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటిలో కానీ, దేవాలయం లో కానీ "ఆకాశదీపం" పెట్టే సంప్రదాయం ఉంది.

తులసి దేవతా వృక్షం. తులసీ సన్నిధిలో, దీపారాధన చేయడం విశిష్టం. తులసి దళాలతో విష్ణువును పూజించడం, తులసి సన్నిధిలో ఆరాధించడం, పారాయణ, జపం వంటి సత్కర్మలు చేయడం భగవదనుగ్రహాన్ని కలిగిస్తాయి.

ఉభయ సంధ్యలలో శివ కేశవ మందిరాలలో, తులసి సన్నిధిలో దీపాలను వెలిగించడం మహోత్క్రుష్టమైన సత్కర్మ. అన్ని దానాలు ఒకవైపు, దీపదానం ఒకవైపు అని శాస్త్ర వచనం. తెలిసి గానీ, తెలియక గానీ ఈ మాసంలో దీపం వెలిగిస్తే ఇహపర ఐశ్వర్యాలు లభిస్తాయి.  ఆలయాలలో, తులసి వనాలలోనే కాక, అరటి దొప్పల వంటి వాటిలో దీపాన్ని పెట్టి తటాక నది ఆదులలో విడిచిపెట్టి, భగవదర్పణం చేయడం ఎంతో ఉత్తమం. ఉసిరికాయపై వత్తిని పెట్టి దీపం విలిగించడం విష్ణు ప్రీతికరం. నియమంగా ఈ నెల్లాళ్ళూ దైవ సన్నిధిలో దీపారాధన చేయడం సర్వశ్రేష్టం. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలోనూ దీపాలు వెలిగించేవారికి దివ్య శుభ ఫలాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ మాసంలో పాడ్యమి, చతుర్థి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమా తిథులు అత్యంత మహిమాన్వితమైనవి.

కార్తీక మాసంలో స్వగృహంలోనూ, తులసి సన్నిధిలోనూ, దేవాలయం లోనూ దీపం వెలిగించేవారికి అఖండైశ్వర్యం లభిస్తుంది. పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివార్చన లేదా విష్ణు పూజ చేసుకొని, నక్షత్ర దర్శనం చేసుకొని భగవంతునికి నివేదించిన అహారాన్ని స్వీకరించడాన్ని "నక్త వ్రతం" అంటారు. ఈ నెలంతా "నక్తం" ని నియమంగా చేయడం సంప్రదాయం.నెలంతా కుదరక పోయినా సోమవారాలు ఈ వ్రతం ఆచరించడం శ్రేష్టం.


(ఇంకా ఉంది  )