Friday, 31 July 2015

శరీరం సురూపం తథా వా కలత్రం, యశశ్చారు చిత్రం ధనం మేరు తుల్యమ్ |
మనశ్చేన లగ్నం గురోరఘ్రిపద్మే, తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ || 
అందమైన శరీరం, అంతే అందమైన జీవితభాగస్వామి, పిల్లలు, మంచి కీర్తి, శుభలక్షణాలు కలిగిన ఆలోచనా విధానం, మేరువంతా ధనం ఉన్నా, గురువు పాదాలయందు మనస్సు లగ్నం కాకపోతే, అవన్నీ ఉంటే ఎంత? లేకపోతే ఎంతా? అన్ని ఉన్నా, వ్యర్ధమే అంటారు గుర్వష్టకంలో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు. 
గురు శిష్యుల నుంచి ధనం కోరడు. అసలు గురువు డబ్బవసరమే లేదు. ఆయన అఖండ వైరాగ్య సామ్రాజ్యానికి అధిపతి. మరి గురువుకు దక్షిణంగా మనమేం ఇవ్వగలం? సహనం, శ్రద్ధలే మీరు నాకు దక్షిణగా సమర్పించండి అన్నారి సమర్ధ సద్గురు శ్రీ షిరిడీ సాయినాధుడు. గురువు అన్నీ ఇవ్వగలిగినా, శిష్యుడి పవిత్రతను చూస్తాడు. అతడి స్థాయి పెరగాలని భావన చేస్తాడు. అడ్డగ్గానే ఇవ్వకుండా అతనికి అనేక వ్యతిరేక పరిస్థితులు కల్పించి, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు. అవలక్షణాలు తొలగిస్తాడు. ఇవన్నీ తట్టుకోవాలంటే ముందు గురువు యెడల నమ్మకం ఉండాలి. దాంతో పాటు సహనం కూడా ఉండాలి. ఏం జరిగినా ఓర్పు వహించాలి. గురువు అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఉన్నదని తెలియడానికే సమయం పడుతుంది. దానికి సహనం అవసరం.
గురువు చెప్పినది సత్యము, అదే ఆచరణీయమని, మనసులో స్థిరంగా భావన కలిగి ఉండటం, గురువు చెప్పినదాన్ని ఆచరించడం, నిత్య జీవితంలో అనుష్టించడాన్నే శ్రద్ధ అంటారు. గురువు ఏదో తన పూట గడుపుకోవడం కోసం మాటలు చెప్పడు. ప్రేమ, కరుణా, దయా పొంగి ప్రవహించగా, శిష్యులను ఉద్ధరించడం కోసం, తాను ఉత్కృష్టమైన సమాధి స్థితి నుంచి క్రిందకు దిగి వచ్చి, బోధ చేస్తాడు. శిష్యులు తనను పూజించాలని గురువు భావించడు, తన బోధను ఆచరించాలని మాత్రమే కోరుకుంటాడు. గురుబోధను ఆచరించకుండా ఎన్ని పూజలు చేసినా, గురువు మెచ్చుకోడు. అందువల్ల గురువు చెప్పిన విషయాన్ని ఆచరించడమే శ్రద్ధ. అదే గురుదక్షిణ.
గురుపూర్ణిమ వేదవ్యాసమహర్షి జయంతి సందర్భంగా చేస్తారు. వ్యాసభగవానుని కారణంగానే మనకు ఇంక వాఙ్గ్మయం వచ్చింది. ఎవరు చెప్పినా, ఆయన చెప్పినదే చెప్పాలి కానీ కొత్తగా ఏమీ చెప్పలేరు. చెప్పడానికి ఏమీ లేదు కూడా. అందుకే ఈ రోజున తమ తమ గురువులలో వ్యాసమహర్షిని చూసుకుని పూజించాలి.

Wednesday, 29 July 2015

ఒకరోజు ఒక రైతు కు చెందిన ఒక గాడిద నూతిలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా గాని, దానిని రైతు పైకి తీయలేకపోయాడు. ఆ గాడిద సహాయం కోసం ఎంతో అరిచింది. కాని రైతు వల్ల కాలేదు. గాడిద కూడా ముసలిది అయిపోయింది, బావి కూడా పాడుపడినదే కదా అని ఆలోచించి ఆ రైతు గ్రామస్థులందరినీ పిలిచి ఆ బావిని కప్పేద్దాం అని చెప్పాడు. అందరూ పక్కన ఉన్న మట్టిని తవ్వి బావిలో వేయసాగారు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా, బావిలో పడుతున్న మట్టిని ఆసరా చేసుకుని , తనపైన పడుతున్న మట్టిని ఒక్కసారి విదిలించి దులిపేసుకుని, ఆ గాడిద ఒక్కో అడుగు పైకి రావడం మొదలుపెట్టింది. ఆఖరికి చక్కగా బావినుంచి పైకి వచ్చేసింది.
ఈ కథ కూడా మన జీవితం లాంటిదే. జీవితం మనకు ఎన్నో పరీక్షలు పెడుతుంది. ఇరుగుపొరుగు వాళ్ళు మనమీద ఎప్పుడూ బురద తవ్వి పోస్తూ ఉండదానికే ప్రయత్నిస్తారు. ఆ బురద భరిస్తూ, కడుక్కుంటూ అక్కడే ఉండాలా, లేదా ఆ బురదను దులుపుకుని ఒక్కసారి తల విదిలించి పైకి రావాలా అనేది మన చేతిలోనే ఉంది. జీవితం లో ఎదురయ్యే ప్రతి వైఫల్యాన్ని మనం ఒక్కో మెట్టుగా వాడుకొని పైకి రావాలి. ఎదగాలి.వాళ్ళు వేసే బురదను మనం మౌనంగా కడుక్కుంటున్నంత కాలం మనమీద బురద వేస్తూనే ఉంటారు. మన మీద బురద చల్లిన వాళ్ళకు ఆ బురద వారి మీదే పడినట్టు మన ఎదుగుదల ద్వారా సమాధానం చెప్పాలి.
సంతోషంగా జీవించడానికి పంచ సూత్రాలు.
1. మీ హృదయంలో ద్వేషానికి చోటు ఇవ్వకండి---శతృవులను క్షమించండి ( ఇది మీ శతృవులకు చేసె ఉపకారం కాదు. మన మనసు ప్రశాంతంగా ఉండడానికి మనం మనము చేసుకునే సహాయం)
2. మనం చాలా సాధారణంగా ఆందోళన చెందే విషయాలు ఎప్పటికీ జరగవు. అయినా మనం భయపడుతూ ఉంటాము. అటువంటి ఆందోళనలు మనసుని, ఆరొగ్యాన్ని బాగా దెబ్బతీస్తాయి. అటువంటి ఆందోళనలను పూర్తిగా మనసు నుంచి తొలగించండి
3. ఏదో లేదు అని బాధపడకుండా, ఉన్న దాంట్లో సంతృప్తిగా జీవించండి. జీవితంలో సంతౄప్తి వలన కలిగే లాభం అంతా ఇంతా కాదు.
4.ఉన్నదానిని నలుగురితో పంచుకోవడం అలవాటు చేసుకోండి. సంపదనైనా, సమయాన్నైనా...
5.ఎదుటివారి నుంచి తక్కువ ఆశించండి. ఎందుకంటే, మనం ఆశించినంత ఎప్పుడూ ఎదుటివారి నుండి పొందలేము. అది ప్రేమైనా సరే.....
ఏదైన వస్తువు కొనుక్కునేటప్పుడు మనం మరింత ఆకర్షణీయమైనది, మరింత మెరుగైనదే కొనుక్కుంటాము. మరి ఒకేఒక్కసారి లభించే ఈ జీవితాన్ని మరింత మెరుగ్గా ఎందుకు జీవించకూడదు? మరింత ఆకర్షణీయంగా ఎందుకు మలచుకోకూడదు? ఆలోచించంది.
సృష్టిలో ప్రతి చెట్టూ-పిట్టా, నీరూ-నిప్పు, జంతువులు, కీటకాలు అన్నీ ఏదొ ఒకరకంగా పర్యావరణానికి మేలు చేసేవే....ప్రకృతిని తన స్వార్ధం కోసం వాడుకుంటూ తనకు జీవమిచ్చిన ప్రకృతినే నాశనం చేసేది జంతువులలో అత్యంత తెలివైన మానవుడు ఒక్కడే.....మిగతా జంతువులకు పాపం చదువు లేదు, మెదడు లేదు, కాబట్టి వాటికి పొరుగువాడికి హాని చెయ్యడం తెలియదు. ఉన్నంతలో అవి పర్యావరణానికి సాయపడతాయి. నీరు, చెట్లు, పక్షి, పిట్ట అన్నీ మనకు సహాయపడేవే....మరి మనం ఎంతవరకు ప్రకృతికి సహాయపడుతున్నాం?
పుష్కరాలకు మేము వెళ్ళలేకపోయినా హైదరాబాదు నుంచి మా అక్కా వాళ్ళు వెళ్ళారు. పుష్కరాలకు ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, రాజమండ్రి వాసుల ఆదరణ, ఆప్యాయత గురించి చాలా బాగా చెప్పారు.మొదటి రోజు జరిగిన విషాదానికి అందరూ బాధపడుతున్నా, అక్కడ ఉన్న సౌకర్యాల గురించి అందరూ చాలా బాగా చెప్పుకుంటున్నారు. నదీజలాల్లో భక్తులు వేస్తున్న పూలు, దొప్పలు ఇవన్నీ వెంటవెంటనే జల్లించి, తీసేస్తున్నారుట. మా ఇంట్లొ ఒక కోడలు రాజమండ్రి అమ్మాయే....నిజంగా వారి ఇంట్లో మర్యాదలు చాలా బాగా చేస్తారు. ఇక వివిధ స్వచ్చంద సంస్థలు కూడా యాత్రికులకు ఆహారం విషయం లో ఏ రకమైన ఇబ్బంది కలుగకుండా చూసుకుంటున్నాయట. రాజమండ్రి కుర్రాళ్ళు కూడా యాత్రికులకు దారి చెప్తూ, ఇంకా ఎన్నో రకాల సహాయం చేస్తున్నారుట. పుష్కరాలకు వెళ్ళలేకపోయామే అనే బాధ కన్నా, అటువంటి ఆదరణ ప్రత్యక్షంగా చూడలేకపోయామే అని ఎక్కువ బాధ కలిగింది. మా ఊరుకు వచ్చిన వారు మాకు అతిధులే కదండీ అని వారు చేస్తున్న సేవల్లో భాగం పంచుకోలేకపోయామే అనుకున్నాం. దేనికైనా పెట్టి పుట్టాలి అంటారు....ఇందుకే...
whatsapp లో నాకు అందిన ఒక గజల్ కి అనువాదం. ఉర్దూ సాహితీ ప్రక్రియ లో "నజ్మ్" అంటారు. "నజ్మ్ " అంటే అందులో విషయం ఒక కథ రూపంలో చెప్పబడుతుంది. గీత రచయిత "జఫర్ గోరఖ్పురి ". మానవ జీవన పరిస్థితులు తర తరానికీ ఎలా మారుతున్నాయో, హృద్యంగా వర్ణించారు.. ప్రముఖ గజల్ గాయకుడు శ్రీ పంకజ్ ఉధాస్ గారి గళం నుంచి వెలువడిన గీతం ఇది. నాకు తెలిసినంత వరకు అనువాదం చేశాను.
ఏ కాలం అయినా, సుఖ దుఖాలు, కష్ట నష్టాలు మనవారికైనా, పరాయి వారికైనా ఒకటే. కాని ఇప్పటి కాలం కన్నా ఆ కాలం బాగుందేమో!
అప్పటి ఇళ్ళు మట్టివైనా, పూరిల్లైనా గాలి ధారాళంగా వచ్చేది. దొంగలు, బందిపోట్ల భయం ఉండేది కాదు, నాలుగు వేళ్ళు నోట్లోకి పోకపోయినా ( కడుపు నిండా తిండి లేకపోయినా) సుఖమైన నిద్ర పట్టేది. మధ్యాహ్నాలు ప్రశాంతంగా, సాయంకాలాలు సందడి సందడిగా గడిచేవి. అందరి హృదయాలు సంతోషం తో నిండి ఉండేవి. మనస్సుల్లో కల్మషం లేదు, కళ్ళల్లో కపటం లేదు. ప్రజలు అమాయకంగా, మనసులలో ప్రేమతో ఉండేవారు. కానీ, వారందరూ ఈ ప్రపంచాన్ని త్వరగా వీడి పోయారు. ( ఆ తరం త్వరగా కనుమరుగైంది.)
మా నాన్నగారి కాలం వచ్చింది. ( కొంచెం తర్వాతి కాలం) కొత్త చదువులు వచ్చాయి. కొత్త చదువులతో పాటు కొత్త ఆలోచనలు వచ్చాయి. మట్టి ఇళ్ళు పోయి, పక్కా ఇళ్ళు వచ్చాయి. ఆఫీసు ఉద్యోగాలు మొదలై, జీతమే ఆధారం అయింది. భగవంతుని నమ్ముకుని జీవితం సాగించారు. సరిపడేంత డబ్బు లేకపోయినా, జీవితం సుఖం గానే ఉంది. పేదింటి భోజనం అయినా ( విందు భోజనం కాకపోయినా ) సంపూర్ణం గానే ఉంది.
ఇప్పుడు నా తరం వచ్చింది. ఇక్కడ ఎవరికీ ఎవరూ కారు. ప్రతివారు ఒంటరి వారే.ప్రతి ముఖమూ అపరిచితమే. కన్నీళ్ళూ లేవు, చిరునవ్వులూ లేవు. (మనసులు భావ రహితం అయిపోయాయి ) మన వాళ్ళ సంగతే పట్టించుకోని ఒక మాయ కమ్మేసింది. ఆస్తులు, భూములు, బంగళాలు, కార్లు, నౌకర్లు, చాకర్లు, పదవులు, పరువు, ప్రతిష్ట, అన్నీ ఉన్నాయి. కానీ మనశ్శాంతి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి అనే భ్రమలో, ఉన్నది ఏమి పోగొట్టుకుంటున్నామో గ్రహించుకోవడం లేదు.
రాబోయే తరం వాళ్ళందరికీ ఒక వినతి. మేము ఏ ఏ కష్టాలు అనుభవించామో, ఏ ఏ దుఖాలు సహించామొ అవి మీ దగ్గరకు కూడా రాకూడదు. మేము ఏ ఏ కష్టనష్టాలు పడ్డామో అవి మీరు పడకూడదు. అందరిలో గుమిగూడి ఉన్నా, మేము అనుభవించిన ఒంటరి తనం మీకు వద్దు. మీరు వెళ్ళే దారిలో వెలుగులు పూయాలి. 21 వ శతాబ్దపు ( ఆధునిక కాలపు ) ఫలాలు మీకు అంది రావాలి. మా తరం వారం, మనశ్శాంతిని కోసం పరితపించాం. మీకు ఆ పరిస్థితి రాకూడదు. మీ మనస్సులలో ఆనందం వేల్లివిరియాలి. జీవితం సుఖమయం కావాలి.
ఇంట్లో ఉండే పెద్దవాళ్ళను వృద్ధాశ్రమాలాలో చేర్పిస్తున్న కొడుకుల గురించి పత్రికలలో, టీవీల్లో, సామాజిక మాధ్యమాలలో వేలకొద్దీ వ్యాసాలు, కథనాలు వచ్చాయి. సమాజంలో కూడా ఎవరి తల్లితండ్రులనైనా ఆశ్రమాలలో ఉంచుతున్నారు అని వినగానే, వారికి సలహాలు ఇచ్చే పెద్దమన్షులు వేలాదిమంది. వారికి వచ్చే సలహాలు లెక్కలేనన్ని. కావాలని తల్లితండ్రులను ఆశ్రమాలకు పంపించే పిల్లలు చాలా తక్కువమంది ఉంటారు. ఏకారణం లేకుండా కేవలం, వాళ్ళ సౌఖ్యం, సౌకర్యంకోసం, తల్లితండ్రులు సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులు అనుభవించడం కోసం అందరూ ఆశ్రమాలలో పెద్దవాళ్ళని వదిలేస్తారు అనుకోవడం చాలా తప్పు. అలా ఎవరైనా వదిలేశారు అంటే, బయటి ప్రపంచానికి తెలియని ఏవొ బాధలు, కష్టాలు వాళ్ళు పెద్దవాళ్ళతో అనుభవిస్తున్నారు అని అందరూ తెలుసుకోవాలి. పెద్దవాళ్ళని ముసలి వయసులో చూడడం ధర్మం, పెద్దవాళ్ళకి చేసిన సేవ మనలను, వంశాన్ని కాపాడుతుంది--కన్నవాళ్ళకే కదా సేవ చేస్తున్నది---ఇటువంటి మాటలు చెప్పడం చాలా తేలిక. ఇవి అందరికీ తెలిసినవే. కాని అన్నీ తెలిసి కూడా ఆ నిర్ణయం తీసుకున్నారంటే, వారు ఆ నిర్ణయం తీసుకోవడంలో ఎంత సంఘర్షణ పడి ఉంటారు అనేది అందరూ గుర్తించాలి. కొన్నిచోట్ల, ఇటువంటి సందర్భాలలో కేవలం ఇంటిలోని కోడలిదే తప్పు అన్నట్టు, కొడుకు ఎంతో ఉత్తముడైనట్టు మాట్లాడతారు. పెద్ద పెద్ద నిర్ణయాలు అనేవి భార్యభర్త కలిసి తీసుకునేవె అయి ఉంటాయి సాధారణంగా. ఈ పోస్ట్ వ్రాసినందుకు ఈ సమూహం లోని సభ్యులు అందరూ ముక్కున వేలు వేసుకుని, అఔరా, ఎంతకు తెగించింది అని నామీద విమర్శల సుదర్శన చక్రాలు సంధిస్తారు అని నాకు తెలుసు. కొంతమంది పెద్దలు ఇంట్లో, వాళ్ళకు ఏమీ పట్టనట్టు, ఇంట్లో వాళ్ళు పనితో ఎంత సతమతమవుతున్నా, ఏదో లాడ్జ్ రూం లో ఉన్నట్టు ఉంటారు. కోడలో, కూతురో ఎవరైనా కానీ, పనితో అలసిపోతున్నా, పట్టనట్టు ఉంటారు. వారికి అన్నివేళలా, అన్నీ అందిస్తూ ఉండాలి. మంచం పట్టిన వాళ్ళైతే చేయడం లో అర్ధం ఉంది. కానీ, చేయించుకోవడం మా జన్మహక్కు అన్నట్టు ఉండేవారితోనే అవస్థలు. కొంతమంది అన్ని విషయాలలోనూ తల దూరుస్తూ ఉంటారు. అవసరమైనంత వరకే సలహాలు ఇవాలి కానీ, అయిన వాటికీ, కాని వాటికీ జోక్యం కలుగచెసుకోకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు వారికి ఎంత చెప్పినా అర్ధం కావు. కొంతమంది పెద్దలకు వారి డబ్బు అంటే ఎంత ప్రాణమో! ఇవతల వారి సంతానం ఎంత ఖర్చుల్లో ఉన్నా , కొంచెం కూడా చేయూత అందివ్వరు. కొంతమంది అయినవారికి ఆకుల్లోనూ, కానివారికి కంచాల్లోనూ అన్నట్టు ఉంటారు. కొంతమంది వయసులో ఉన్నన్నాళ్ళూ ఆస్తిపాస్తులు అర్ధం లేని విషయాలకి తగలేసి, అంతా అయిపోయినతర్వాత వారసుల ఇళ్ళకి వస్తారు. అక్కడ కూడా రాజసం వదలకుండా ప్రవర్తిస్తారు. మరికొంతమందికి అల్లుడు/కోడలు వైపు బంధువులు వస్తే సుతరామూ ఇష్టం ఉండదు. వారిని ముప్పుతిప్పలు పెట్టాలి అని చూస్తారు. కొంతమంది వారికి కేటాయించిన గదులు, బాత్రూంలు ఎంత అసహ్యంగా ఉంచుకుంటారో! వాటిని శుభ్రం చేయడానికి పనిమనుషులు కూడా ఒప్పుకోరు. ఇద్దరు ముగ్గురు వారసులు ఉన్నవాళ్ళు, ఒకరి దగ్గర ఉన్నప్పుడు మరొకరిని, లేదా మరొకరి వారసులని పొగుడుతూ ఉంటారు. వారు చెప్పేవి నిజాలే అయినప్పటికీ, పిల్లల మనోభావాలు దెబ్బతింటాయి. కొంతమంది అల్లుడు/కోడలు చేసే పనులను, ప్రతినిముషం విమర్శిస్తూ ఉంటారు. ఇక కొంతమంది ఆరోగ్య రీత్యా కొంచెం కూడా జాగ్రత్తలు తీసుకోరు. ఇక ఏకైక సంతానం కలవారికి పెద్దవాళ్ళను ఇంట్లో ఉంచి ఏ ఫంక్షన్ కైనా, ఊరైనా వెళ్ళాలంటే ఎంతో కష్టం. ఇవన్నీ వినడానికి చాలా చిన్నవిగా ఉంటాయి. కానీ అనుభవించేవాళ్ళకు తెలుస్తుంది అందులో బాధ. ఇవన్నీ కూడా భార్యా భర్త మధ్య రోజూ పోట్లాటలు పెంచేవే. రోజూ పడే నరకయాతన కన్నా ఎవరో ఒకరు దూరంగా ఉంటే సమస్య తీరుతుంది అనుకున్న నిమిషాన పెద్దవాళ్ళను ఆశ్రమాలలో ఉంచాలి అనే నిర్ణయం జరుగుతుంది. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలా ఉండరు అని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళకు ఒక మనవి---మీరు అదృష్టవంతులు కాబట్టి, మీ తల్లితండ్రులు మీ మనసు ఎరిగి ప్రవర్తిస్తున్నారు. మీరు మీ పెద్దవాళ్ళని ఆశ్రమంలో పెట్టలేదు అంటే, అది వారి సర్దుబాటుతనం, మంచితనం. సర్దుబాటుగా ఉండే పెద్దవాళ్ళను దూరం చేసుకోవాలి అని ఎవరూ అనుకోరు. అందరం కలిసే కలో, గంజో తాగుదాం అనే అనుకుంటారు. ఇంకా పిల్లలకు విదేశాలకు వెళ్ళే అవకాశాలు వచ్చి పెద్దలను ఎవరూ చూసే అవకాశం లేకపోతే, కూడా ఆశ్రమాలు ఆదుకుంటాయి. అంతమాత్రాన, పిల్లలను అనాగరికులుగా, సంస్కారం లేనివాళ్ళుగా, పాలు తాగిన రొమ్మునే గుద్దేవాళ్ళుగా ముద్రవేయకండి. పెద్దవాళ్ళు కూడా కొంచెం సర్దుబాటుగా ఉంటే, ఏ సమస్యలూ ఉండవు. పెద్దవాళ్ళు అన్ని విషయాలలోను, చిన్నవాళ్ళకు ఆసరాగా ఉండాలి అంతే కాని ఎందుకీ లంపటం నాకు అని మీ పిల్లలు అనుకునే విధంగా ఉండకూడదు.
సభ్యులు, పెద్దలు కృష్ణప్రసాద్ ఆలూరి గారు ఒక గ్రూప్ లొ పోస్ట్ చేసిన లేపాక్షి గారి కార్టూన్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఇది. నిజమే కదా, మనం మనకోసం కన్నా, ఎదుటివారి కోసమే ఎక్కువ బతికేస్తున్నాం. పెళ్ళిళ్ళకి వెళ్ళెటప్పుడు, " ఇది ఒకసారి కట్టేసుకున్నాను వాళ్ళ ఇంటికి, ఇప్పుడు కూడా అదే కట్టుకుంటే నవ్వరూ" అనే డైలాగ్ చాలా మంది దగ్గర విన్నాను నేను. పక్క వాళ్ళ కన్నా పెద్ద టీవీ మన ఇంట్లో ఉండాలి. పొరుగు వారింట్లో కారు ఉంటే మనమూ కొనేయ్యాలి, లేకపోతే "కారు కూడా లేదు అనుకుంటారేమో", కొంత మంది మరీ చనువుగా, ఇంకా కారు కొనలేదా, ఈపాటికి ఉండాల్సిందే మీ ఇంట్లో...అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. ఎంత వేసవి కాలం లో అయినా, ఎంత ఉక్కపోతలో అయినా, గరగరలాడుతూ పెద్ద జరీ అంచు పట్టు చీరలే కట్టుకోవాలి., మన సౌకర్యం కోసం నేత చీరలు కట్టుకుంటే, "ఏమనుకుంటారో అందరూ"? ---- మన ఆలోచనలు ఇంతవరకే పరిమితం. దీనిని మించి ఆలోచించలేము. ఒక విధంగా మన పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, పట్టుచీరల, నగల ప్రదర్శన వేదికలు. కొంచెం తక్కువగా ప్రదర్శించిన వాళ్ళకి తరువాతి ఫంక్షన్ లో విలువ ఉండదు. వాళ్ళను పన్నెత్తి పలుకరించరు... ఆఖరికి మన పిల్లల చదువుల విషయం లో కూడా ఇలాగె ప్రవర్తిస్తున్నాం మనం. ఇంజినీరింగో, మెడిసినో తప్ప, ముఖ్యంగా తెలుగు ప్రజలకు వేరే ఏదీ ఉన్నత చదువు కాదు. బయట ప్రపంచం లో ఎంత పోటీ ఉన్నా సరే, ఉద్యోగాలు దొరకక పోయినా సరే, మనకు చదువు అంటే ఆ రెండు కోర్సులే. మన పిల్లవాడికి చదివే మేధ ఉందా లేదా మనకు అనవసరం. పక్కవాళ్ళు అదేదో కార్పొరేట్ కాలేజ్ లో చేర్పిస్తే, మనం స్తోమత ఉన్నా, లేకపోయినా, అప్పు చేసి మరీ అదే కాలేజ్ లొ జాయిన్ చేస్తాం. తీరా వాళ్ళు ఎంట్రన్స్ లు పాస్ అయ్యి, ప్రొఫెషనల్ కాలేజ్ కి వెళ్ళాకా అ చదువు బుర్రకు ఎక్కక, మధనపడి, మానసిక సంఘర్షణ పడిన విద్యార్థులు ఎందరో....పుట్టినరోజు పార్టీలు, ఆఖరికి శ్రావణ మంగళవారం నోములలోకి కూడా ఈ కార్పొరేట్ కల్చర్ చొచ్చుకు వచ్చేసింది. వచ్చిన పేరంటాళ్ళకు జ్యూసులు, టిఫిన్లు, కాఫీలు, అంతా అదో వేలం వెర్రి అయిపోయింది. ఇంక మన ఇళ్ళల్లో జరిగే పెళ్ళిళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మన డబ్బు, దర్పం, హోదా ప్రదర్శించడానికి అవి ప్రధానమైన వేదికలు. ఒక్కో పెళ్ళికి 20 నుంచి 25 లక్షల వరకూ ఖర్చు అవుతోంది అంటే, జీవితాంతం సంపాదించినది అంతా ఒక్క పెళ్ళి ఖర్చుతో సరి అన్నమాట. ఒకళ్ళు 40 ఆధరువులు, మరొకరు 60, మరొకరు 100, ఇంకొకరు 150.....60 వంటకాలలో ఎంతమంది ఎన్ని తింటారు? 60 ముద్దలు తినడానికి పొట్ట పడుతుందా అసలు....అవసరమైన చోట ఖర్చు పెట్టడం లో తప్పు లేదు. మండపం అలంకరణకి విదేశీ పూవులు, ఇన్నిన్ని ఆహార పదార్థాలు అవసరమా? ఉత్తర భారతం లోని వేడుకలు అయిన మెహెందీ, సంగీత్ మన పెళ్ళిళ్ళలో కూడా చోటు చేసుకుంటున్నాయి. డబ్బు ఉన్నది ఖర్చు పెట్టుకోవడానికే కదా అని సాగతీతలు. డబ్బు ఉన్నవారు ఖర్చు పెట్టుకొంటున్నారు సరే, లేనివాళ్ళ మీద కూడా ఈ ప్రభావం పడుతోందిగా...ఇప్పుడు పెళ్ళికూతురే, అలా చేయకపోతె బాగుండదు, నా ఫ్రెండ్స్ నవ్వుతారు అంటే ఎం చేయాలి? అలాగే జరుగుతోంది కూడా. మనం మనలాగా, మన కుటుంబ పధ్ధతి ప్రకారం, సంప్రదాయం ప్రకారం జీవించడం మర్చిపోయాము. మన జీవితం పక్కవాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి నడుస్తోంది. మనకు ఉన్న డబ్బు, సంపద హోదా మీద ఆధారపడి నడుస్తోంది.