Tuesday, 8 April 2014

ఓం శ్రీ రామాయ నమః
8-4-2014, మంగళవారం, శ్రీరామనవమి
ఎవరైన ఒక వ్యక్తిని అతని మిత్రులు పొగుడుతుంటారు. కానీ, అతని చేతిలో దెబ్బలు తిన్నవారు, శతృవులు పొగిడితే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడు.
మారీచుడు దగ్గరకు రావణుడు వచ్చి రాముడు గురించి చాలా చెడ్డరీతిలో రాముడి మీద లేనిపోనివన్నీ మాట్లాడుతాడు. అప్పుడు మారీచుడు "రావణ! నువ్వు వీరుడు, గుణవంతుడైన రాముడిని పొగడకపోవచ్చు, కానీ రాముడు నీలాగా చపలుడు కాదు, తొందరపడి మాట్లాడేవాడు అంతకన్నా కాదు. ఇంద్రుడు, వరుణ దేవుడికి సమానమైనవాడు.
రాముడు తన తండ్రి చేత అడవులకు వెళ్ళగొట్టబడ్డాడు అని అనుకుంటున్నావా? కాదు. రాముడు మర్యాద లేనివాడనుకుంటున్నావా? కాదు. శీలవంతుడు కాదంటావా? పచ్చి అబద్ధం. స్వార్ధపరుడు అనుకుంటున్నావా? కాదు. అల్పమైన క్షత్రియుడు అనుకుంటున్నావా? కానేకాదు. ధర్మహీనుడు, గుణహీనుడు అసలేకాదు. తనకంటే చిన్నవైన జీవులను బాధిస్తాడు అనుకుంటున్నావా? కాదు. రాముడు సర్వ జీవుల మేలు కోరేవాడు.
తన తండ్రిమాటను కైకేయి ద్వారా విని, "మా నాన్నా మాటను నిజం చేస్తా" అని వనవాసానికి బయలుదేరాడు. కైకెయి కోరిక తీర్చడం కోసం సమస్త రాజభోగాలను వదులుకుని వనవాసానికి వెళ్ళాడు. భరతుడు రాజ్యం ఇస్తానని చెప్పినా, తండ్రి మాట నిలబెట్టడం కోసం భరతుడి విన్నపాన్ని తోసిపుచ్చాడు.
రాముడు కర్కషుడు కాదు. అవిద్యావంతుడు అంతకంటేకాదు. ఇంద్రియాలను జయించనివాడు కాదు. రాముడు గురించి వినకూడనివి, ఊహించలేని మాటలను మాట్లాడ్డం నీకు తగదు రావణ.
"రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవి వాసవః"
ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే రాముడు, సాధుపురుషుడు, పరాక్రమవంతుడు, సర్వలోకాలకు, దేవతలకు ప్రపంచానికి రాజు.
విశ్వామిత్రుడి యాగాన్ని పాడుచేయడానికి నేను వెళ్ళినప్పుడు రాముడు 12 ఏళ్ళ బాలుడు. సరిగ్గా ఆయుధాలు వాడడం కూడా రానివాడు. ఈ పిల్లవాడేం చేస్తాడులే అనుకున్నా. రాముడికి నా మీద వేసిన బాణానికి వందయోజానాల దూరంలో సముద్రంలో పడ్డాను. నన్ను చంపద్దు అనుకున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నాను.
అప్పటినుంచి ఏ చెట్టు పక్కన రాముడు ఉన్నాడో, ఎటునుంచి వస్తాడో అని భయపట్టుకుంది. ఎవరిని చూసిన రాముడే కనిపిస్తున్నాడు, కలలో రాముడు వచ్చిన హడలిపోతున్నా. నీకో విషయం చెప్పనా రావణా! "ర"తో మొదలయ్యే ఏ పేరు విన్నా గుండెలు జారిపోతున్నాయి" అంటాడు.
ఎక్కడైనా శతృవును ఎదుటివారి తిడుతుంటే తెగ సంతోషపడతారు. కానీ, రాముడు చేతిలో చావుదెబ్బ తిన్న మారీచుడు రావణాసురుడు రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సహించలేకపోయాడంటే రాముడు ఎంత గొప్ప వాడు. అటువంటి శ్రీ రామచంద్రుడిని మనం ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాముడిలా గొప్పగా బ్రతకాలి.
ఓం శ్రీ రామాయ నమః

No comments:

Post a Comment