Wednesday, 5 February 2014

నిన్నటి భాగం తరువాయి:

హనుమాన్ ప్రశస్తి:

స్తాపయా మాస భూలోకే రామ భక్తిం కపీశ్వర:
స్వయం భక్తవరొ భూత్వా సీతారామ సుఖప్రద:
రుద్రావతారొ భగవాన్ భక్తోద్ధారక స్సవై
హనుమంస మహావీర్యో రామకార్య కరస్సదా
రామదూతాభిదో లోకే దైత్యఘ్నో భక్తవత్సల

(వానర శ్రేష్టుడగు హనుమంతుడు స్వయముగా భక్త శ్రేష్టుడై రామభక్తిని లోకమునందు స్థాపించెను. భక్తులను ఉద్ధరించుటకు రుద్రుడే హనుమంతుడుగా అవతరించెను. అతడు మహావీరుడు. రామ కార్ర్య దక్షుడు. రామదుతగా ప్రసిద్ధుడు. రాక్షస హంతకుడు. భక్తవత్సలుడు. )
        (శివపురాణం లోని శత రుద్రా సంహిత శ్లోకములు )

శ్రీమద్రామాయణం లో సుందరకాండము నందు హనుమంతుని తేజో బాల విభూతులు వర్ణింప బడినవి. సముద్రమును దాటు సమయమున జాంబవంతుడు హనుమను " ఓ వత్స, హనుమ, సముద్రమును దాటుట యందు నివు కూడా వాయు సమానుడవే " అని ప్రశంస నిచ్చెను.

సీతా మహాదేవియు, " ఓ కపిశ్రేష్టా! నేను నిన్ను సాధారణ వానరునిగా  తలచుట లేదు. నీకు రావణుని వలన భయము కానీ, ఆశ్చర్యము కానీ లేకపోవుట వలన నివు అసాధారణమైన వానివి అని తెలియుచున్నది. అని పలికెను.

ఇక రావణుడు హనుమను చూసి ఆశ్చర్యముతో " ఈ వానరుని తేజము ఇతర వానరముల వలె లేదు. ఆకారమున మాత్రమే ఇతడు వానరుడు. శివుని యొక్క నందీశ్వరుడే ఈ రూపమున రాలేదు కదా" అని తలపొసెను.

గాయత్రీ మంత్ర సహితమైన శ్రీమద్రామాయణ సుందరకాండము పారాయణ -- సర్వారిష్ట నివారణము, సకల సమ్పద్ప్రదము, సర్వకార్య విజయముగా పెద్దలు వచింతురు. ఆంజనేయుడు త్రిముర్త్యాత్మకుడు. మహాశక్తి సమన్వితుడు. వానినారాధించుట వలన మానవుని జీవితం సుఖమయ మగుతయె గాక మోక్ష ప్రాప్తి అనుటలో సందేహము లేదు.

Tuesday, 4 February 2014

ఆంజనేయ ప్రశస్తి:

సర్వారిష్ట నివారకమ్, శుభకరం పింగాక్ష మక్షాపహమ్
సీతాన్వేషణ తత్పరం, కపివరమ్ కోటి ఇందు సుర్యప్రభమ్
లంకా ద్వీప భయంకరం సకలదమ్ సుగ్రీవ సమ్మానినం
దేవేంద్రాది సమస్త దేవా వినుతం కాకుత్స దూతం భజే !

"  సకల అరిశ్తములను తొలగించు వాడు, శుభములు కలిగించు వాడు, పసుపు పచ్చని నేత్రములు కలవాడు, అక్షుని సంహరించు వాడు, సీతాన్వేషణ తత్పరుడు, కపి శ్రేష్టుడు,, కోటి సూర్య చంద్రుల సమ ప్రకాశము కలవాడు, లంకా ద్వీపమునకు భయంకరమైన వాడు, సర్వ అభిశ్తములను తీర్చువాడు, సుగ్రీవునిచే సన్మానింప బడిన వాడు, సమస్త దేవతలచే పొగడబడిన వాడు అయిన శ్రీరామ చంద్రుని దూత యగు హనుమంతునికి నమస్కరించు చున్నాను.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరనార్భవెత్
ఆయు: ప్రజ్ఞా యశో లక్ష్మీ: శ్రద్దా పుత్రా: సుశీలతా
ఆరోగ్యం దేహి సౌఖ్యంచ కపినాద నమోస్తుతే...

ఆంజనేయ స్వామీ సర్వదేవతా స్వరూపుడు. శీఘ్ర ఫల ప్రదాత. హనుమను స్మరించినందువలన ప్రతివారికి బుద్ది, బలము, కీర్తి, ధైర్యము, భయము లేకుండుట, రోగములు లేకుండుట, మంచి వాక్కు కలుగును. భూత ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షస , భేతాళ, శాఖిని, ధాకిని మొదలైన దుష్ట గ్రహములు దగ్గరకు రావు. సర్వ మతముల వారు సేవించవచ్చు. అనన్య భక్తితో సేవించిన వారికీ సర్వ కష్టములు తొలగి సత్ఫలితములు కలుగును అనుటలో సందేహము లేదు.

శ్రీ రామ నామము యొక్క గొప్పతనమును లోకమునకు చాటి చెప్పినవాడు హనుమంతుడు.

రామ్ తత్త్వొధికమ్ నామ ఇతి మన్యా మహెవయమ్
త్వయైకా తారితా యొధ్య నామ్నాతు భువనత్రయం!

(ఓ రామ! నీ కంటే, నీ నామము గొప్పదని మా నమ్మకము. ఏలన, నీవు అయోధ్య పురవాసులను మాత్రమె తరింప జేసితివి. కాని, నీ నామము మూడు లోకములను తరింప చేయుచున్నది.)

రామ నామము మిద గట్టి విశ్వాసము కలిగి తను తరించి లోకమును తరింప చేసినవాడు హనుమంతుడు.

యత్ర యత్ర రఘునాధ కీర్తనం,
 తత్ర తత్ర కృత మస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం,
మారుతిం నమత రాక్షసాంతకం

(ఎచ్చట శ్రీరామ కీర్తన జరుగునో, అచ్చట హనుమంతుడు తల వంచి అంజలి ఘటించి ఆనంద బాష్పములు రాల్చుచుండును.రామభక్తులకు హనుమంతుడు రక్షకుడు.)

నమస్తే వాయో, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మసి!
(హనుమంతుడు వాయు పుత్రుడు. వాయువును వేదములు పరమ శక్తికి ప్రతీకగా స్తుతించుచున్నవి.)

మహెశస్య తధాన్శెన భూత్వా పవన నందన:
హనుమానితి విఖ్యాతో మహాబల పరాక్రమ:

(మహెశుని యొక్క అంశ చే పవన నందనుడై పుట్టి హనుమంతుడు అని లోకమున మహాబల పరాక్రమ సంపన్నుడై విఖ్యాతి నొంది యున్నాడు.)

దుష్టానాం శిక్షనార్ధాయ  శిష్టానాం రక్షనాయచ
రామ కార్యార్ధ సిద్ధ్యర్ధం జాతశ్రీ హనుమాన్ శివ:

(దుష్టులను శిక్షించుతకు , శిష్టులను రక్షించుటకు రామ కార్య సిద్ది కొరకు శివుడే హనుమన్తునిగా అవతరించి యున్నాడు. )

ఆంజనేయం పూజత: శ్చేత్పుజితా సర్వ దేవతా:

( ఆంజనేయుని పూజించిన సర్వ దేవతలను పుజించినట్లే)-- పరాశర సంహిత.


to be continued....
24, ఏప్రిల్ 1973 న ముంబై లో జన్మించిన  ప్రముఖ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్ గురించి ప్రపంచం మొత్తం మిద ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం చేయక్కర లేదు. క్రికెట్ ఒక మతం అయితే, సచిన్ క్రికెట్ దేవుడు అని పలువురు ప్రశంసించారు అంటే అతని గురించి వేరే మాటలు చెప్పే అవసరం ఏముంది?

క్రికెట్ ఆట లో సమీప భవిష్యతు లో ఎవరు బద్దలు కొట్టలేనంతగా ప్రతి అంశం లోను రికార్డ్స్ నెలకొల్పి 16, నవంబర్ 2013 న ముంబై వాంఖడే స్టేడియం లో జరిగిన 200 వ టెస్ట్ మ్యాచ్ లో రిటైర్ అయిన సచిన్ ఇంతకు ముందే అర్జున అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, పద్మశ్రీ, పద్మ భూషణ్ వంటి ఎన్నో అవార్డు లు అందుకున్నాడు.

ఒక ఆటగాడిగా అతనిని ఎంతమంది అభిమానిస్తారో, ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కల వ్యక్తిగా కుడా అతనిని ఆరాధిస్తారు. అతని వ్యక్తిత్వం అందరు అనుసరించ తగ్గది.

అతని చివరి టెస్ట్ మ్యాచ్ పూర్తీ అయి, తానూ రిటైర్ అవుతున్నాను అని ప్రకటించిన కొన్ని గంటల లోపే భారత ప్రభుత్వం సచిన్ కు అత్త్యుత్తమ పౌర సత్కారం అయిన " BHARATA RATNA" ప్రకటించి గౌరవించింది. ఈ విషయమై తరువాత ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి.

ఈ రోజు ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ సి. ఎన్. అర్ . రావు గారితో పాటు సచిన్ టెండూల్కర్ కు కూడా భారత్ రత్న అవార్డు ప్రదానం చేసి భారత దేశం తనను తాను గౌరవించుకుంటున్నది.

ఇది యావద్భారత దేశానికే లభించిన గొప్ప సత్కారం.


Monday, 3 February 2014

facebook  కి పదేళ్ళు

mark  zuckerberg , facebook  కనిపెట్టి రేపటికి 10 సంవత్సరాలు. ప్రపంచ వ్యాప్తంగా 120 కోట్ల మంది దీనిని వాడుతున్నారు. మొదట్లో ఎక్కువ మంది teenagers దీనిని వాడినా, ఇప్పుడిప్పుడు వారి సంఖ్యా కొంచెం తగ్గుతోంది అని సర్వే లు చెపుతున్నాయి.

 facebook  వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమే కాని, మనం పాజిటివ్ గా చుస్తే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి.

facebook  మన స్నేహితులు, బంధువులు , కావలిసిన వాళ్ళు  ప్రపంచంలో ఏ మూలనున్నా మనతో కలుపుతోంది. నెలకు ఒకసారి కూడా ఫోన్ చేసి పలకరించని వాళ్ళు కూడా facebook లో ప్రతిరోజూ పలకరిస్తున్నారు. మనకు సంబంధించిన వాళ్ళ ఇళ్ళల్లో ఏ చిన్న celebration -- అది పండగ అయిన, పెళ్లి అయినా, ఫంక్షన్ అయినా, వాటి వివరాలు, ఫోటోలు మనకు వెంటనే అందుతున్నాయి. ఎప్పుడో విడిపోయిన స్నేహితులు, claasmates మళ్లీ కలుస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా, మెసేజ్ లు పంపుకోవచ్చు. ప్రపంచం లో ఏ మూల నున్నవారితోనైన చాటింగ్ చేసుకోవచ్చు. ఫోన్ బిల్ తగ్గుతుంది కూడా. .

facebook  ద్వారా ఎన్నో పేజిలు, ఎన్నో groups లో చేరే అవకాశం దొరుకుతోంది. ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి.  జీవిత గమనాన్ని మార్చే ఎన్నో quotations ,మనలో ఆత్మా విశ్వాసాన్ని నింపే  ఎన్నో హితోక్తులు రోజూ కనబడుతున్నాయి.

teenagers కన్నా, పిల్లలు చదువులకో, ఉద్యోగాలకో బయటికి వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉన్న నాలాంటి మధ్య వయస్కులకు ఈ facebook  ఎంతగానో ఉపయోగ పడుతోంది. మనం అందరం మార్క్ కు, facebook  కు రుణపడి ఉండాలి  అని నా అభిప్రాయం.
మరి మీరేమంటారు ఫ్రెండ్స్.......

Sunday, 2 February 2014

అక్షయంబుగా కాశి లోపల అన్నపూర్ణ భవానివై
సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవీ
మోక్ష మొసగేడు కనకదుర్గవు మూల కారణ శక్తివీ
శిక్షజేతువు ఘోర భవముల శ్రీ గిరీ భ్రమరాంబికా

ఈ పద్యం ఇప్పటి వాళ్ళకు ఎవరికైనా తెలుసా? మీ ఇంట్లో అడగండి. మీ పెద్దవాళ్ళకి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది . ఇది భ్రమరాంబిక అష్టకం లోని పద్యం. పూర్వం వివాహాది శుభకార్యములలొ సహపంక్తి భోజనములు ఏర్పాటు చేసేవారు. అన్ని వడ్డించిన తరువాత అక్కడ ఉన్న పెద్ద వాళ్ళల్లో ఎవరో ఒకరు ఈ పద్యాన్ని గట్టిగా గొంతెత్తి పాడేవారు. ఇది చదివిన తరువాతనే భోజనం మొదలు పెట్టేవారు. మనకు అన్నం ప్రసాదించేది ఆ అన్నపూర్ణా దేవేనని నమ్మకంతో అలా చదివేవారు. అన్నపుర్నాష్టకం లో పద్యాలూ కూడా చదివేవారు.  ఆ పైన వడ్డింపులు కొసరి కొసరి జరిగేవి. ఈ లోపు ఆ శుభకార్యం చేసిన గృహస్తు కానీ, లేక అతని తరఫు నుంచి మరొకరు కాని భోజన సాల వద్దకు వచ్చి అన్ని అందరికి అమరుతున్నాయో లేదో, కనుక్కొని, వీలైతే తను కూడా కొంత సేపు వడ్డించి, అసలే సమయం మించిపోయింది, మెల్లగా భోజనం చేయండి, అని మర్యాద చేసి,  అన్ని వంటకాల రుచులు బాగున్నాయా లేదా అని విచారించుకొని వెళ్ళేవారు. భోజనం పూర్తీ అయిన తరువాత మళ్లీ ఎవరో ఒకరు "భోజన కాలే గోవింద స్మరణం " అని "గోవింద, గోవింద " అని ముమ్మారు స్మరణ చేసి పంక్తి నుండి లేచేవారు. పంక్తి భోజనములు చేసేటప్పుడు పంక్తి లో పెద్దవారు మొదలు పెట్టనిదే, చిన్నవారు భోజనం మొదలు పెట్టకూడదు. అలాగే పెద్దవారు లెవనిదె, చిన్నవారు భోజనం ముగించి లేవకూడదు. అలాగే విస్తరి లో వడ్డించిన అన్ని పదార్ధాలూ ఖాలీ చేయాలి కానీ, నిర్లక్ష్యం గా వదిలివేయరాదు. ఇలా అప్పటి భోజనాలు ఒక పద్ధతిలో జరిగేవి.

కానీ ఇప్పుడు కాలమహిమ అనుకున్న, మార్పు అనుకున్నా, భోజనాల పధ్ధతి మారిపోయింది. ఆడ, మగ ఉద్యోగస్తులు కావడం వలన ఇంట్లో ఏదైనా శుభ కార్యం చేయాలంటే అతిధులు వందల సంఖ్యలో వస్తున్నారు. వీరందరినీ పంక్తి భోజనాలు ఏర్పాటు చేయాలంటే స్థలాభావం తో పాటు సమయాభావం కూడా ఒక సమస్య. కార్యక్రమానికి వచ్చే వందలమందికి భోజనాలు ఏర్పాటు చేయాలంటే 4 గంటలు సమయం పడుతుంది. అంత సమయం పెళ్లికే ఉండడం లేదు. ఇంకా భోజనాలు ఎక్కడ? తొందరగా తిని, వధువరులను ఆశీర్వదించి మళ్లీ ఆఫీసులకు వెళ్లిపోవాలి. అదే రాత్రి ముహూర్తం అయితే తొందరగా హాజరు వేయించుకొని ఏదో తినేసి ఇంటికి వెళ్లి పడుకొని మళ్లీ మర్నాడు ఉద్యోగ సమరానికి సిద్ధం కావాలి. అందుకే శుభ కార్యం చేసేవారికి హడావిడి, వచ్చి చూసేవాళ్ళకి హడావిడి. దీనికి ప్రత్యామ్నాయంగా కనుగొన్నవి బఫే డిన్నర్లు.

ఇదివరకు కూర్చొని భోజనం చేసేవారి వద్దకు వడ్డించేవాళ్ళు వచ్చేవారు. ఇప్పుడు వడ్డించే వాళ్ళు ఒక చోట ఉంటారు. మనం ప్లేట్లు తీసుకోని వారి దగ్గరకు వెళ్లి వేయించుకొని రావాలి. వండే వారెవరో తెలియదు, వడ్డించే వారెవరో తెలియదు, ఇక కార్యక్రమం చేసిన వారికి మనలను పలకరించే తీరిక ఉండదు. మనము తిన్నామో లేదో అడిగే వారుండరు. మనమే వెళ్లి, మనమే భోజనం చేసేసి, మనమే వెళ్లి వాళ్ళని పలకరించి తెఛ్చిన బహుమతి వారి చేతిలో పెట్టేసి, ఒక shakehand  ఇచ్చేసి బయట పడడమే.  ఆ రద్దీ లో ఒకరి ప్లేట్లు ఒకరికి తగులుతూ అదో హడావిడి. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావిస్తాము. కానీ చెప్పులు విడిచే స్థలం ఉండదు. చెప్పులు వేసుకొనే భోజనం చేయడం. వడ్డించే పదార్ధాలు బోలెడు. తినే తీరిక ఎవరికీ ఉండదు. అందరి ప్లేట్లల్లో సగానికి సగం వదిలి వేయబడి ఉంటాయి. ప్రాణం ఉసూరుమనేలాగా.

ఇదంతా కాల మహిమ అని సర్దుకోవాలేమో. మళ్లీ పూర్వపు రోజులు వస్తే ఎంత బాగుంటుంది?



  శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర ప్రశస్తి:

భారతీయ సంస్కృతికి మూలమైన మహా గ్రంధాలు రామాయణం, భారతం, భాగవతం. శ్రీ మద్భగవతానికి రెండిటి వల్లనే గౌరవం అని పెద్దల యొక్క సూక్తి. మొదటిది కృష్ణ భగవానుడు అర్జునునికి అనుగ్రహించిన శ్రీ మద్భగవద్గీత , రెండవది భీష్ముడు లోకానికి ప్రసాదించిన శ్రీ విష్ణు సహస్ర నామం.

రెంటిలో మొదటి దానిని శ్రీ కృష్ణుడు అర్జునునకి ఉపదేశం చేసి సంజయుని ద్వారా లోకానికి అందించారు. రెండవది భారత సంగామం అనంతరం అంపశయ్యపై పది ఉన్న భీష్మ పితామహుని ద్వారా శ్రీ కృష్ణ పరమాత్మ పాండవులకు ఉపదేశం చేయించాడు.

 ఈ రెండిటిలో భగవద్గీత కంటే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం వల్లనే సులభంగా తరించవచ్చని శ్రీ కృష్ణుని అభిమతం. కృష్ణుడు భారత సంగ్రామ అనంతరం పాండవులందరినీ తీసుకోని అంపశయ్యపై నున్న భీష్ముని దగ్గరకు వస్తాడు. ధర్మరాజుకు కలిగిన ధర్మ సంశయములను తీర్చమని కృష్ణుడు భీష్ముని కోరుతాడు. తనకు అవేవి జ్ఞాపకం లేవు, చెప్పే శక్తి లేదు అంటాడు భీష్ముడు. అతనికి తెలిసినవన్ని జ్ఞాపకం వచ్చేటట్లు, పూర్వపు శక్తి కలుగునట్లు, దేహబాధ తెలియకుండా వరాలిస్తాడు కృష్ణుడు. భీష్ముడు ఆశ్చర్యముతో " అన్ని వరాలు నాకు ఇచ్చి, నాచేత చెప్పించడం ఎందుకు? నివే చెప్పవచ్చు కదా కృష్ణా" అని ప్రశ్నిస్తాడు. " లోకంలో ఎక్కడైనా తనను గూర్చి తనే చెప్పుకోకూడదు.ఎదుటివారు గుర్తించి పొగిడితే, లోకం కూడా ఆ గొప్పతనాన్ని గుర్తిస్తుంది.ఒక తత్వాన్ని గురించి తత్త్వ దర్శనం చేసినవారు చెప్పాలి కనీ, తత్త్వము తనను గూర్చి చెప్పుకొరదు కదా, భీష్మ పితామహా! నివు తత్త్వ దర్శనం చేసిన ఆచార్యుడవు. ని నుంచి తెలుసుకోవాలని పాండవులు కోరుతున్నారు. వారికీ హితమును ఉపదెశించుము. అని అంటాడు కృష్ణుడు.

దాహం కలిగిన వానికి సముద్రం తనలో నీరు నిండా ఉన్నా ఇవ్వడానికి వీలులేదు. ఇచ్చినా త్రాగడానికి పనికిరావు. ఆ నీటినే మేఘము గ్రహించి వర్షంగా కురిపిస్తెనె త్రాగడానికి వీలవుతుంది. కృష్ణుడు సముద్రము వంటి వాడు. అతని గుణ ప్రవాహాన్ని భీష్ముడు మేఘంలాగా గ్రహించాడు. కనుక కృష్ణుడు అతఃనిని ప్రోత్సహించాడు. అంతే కాక,"లోకం లో నన్ను జ్ఞానిగా గుర్తించడం గొప్ప కనే కాదు, భీష్ముడిని జ్ఞానీ గా , తత్త్వ దర్శిగా గుర్తించడం అవసరం, అని భీష్ముని ప్రేరేపిస్తాడు.

జన్మమెత్తిన ఏ జివి అయినా ఈ సంసార చక్రము నుండి బయట పడాలంటే తెలియ వలసిన తత్త్వమెది? ఈ జీవులు ఎక్కడకు చేరుతారు, ఆ చేరడానికి ఏమి చేయాలి? ఎవరిని స్తుతిస్తె, అర్చిస్తే మానవులు కోరిన సుఖాలు అన్నీ పొందుతారు అని, భవత: పరమో మత: " నీవు ఏది భావిస్తున్నవొ దానిని అనుగ్రహించు అని ధర్మరాజు ప్రశ్నిస్తాడు. సర్వ జగత్కారణమైన శ్రీమన్నారాయణుని "స్తువన్" స్తోత్రము చేయుచు "త్వమేవ చ అర్చయన్" అతనినే ప్రేమతో పూజిస్తే "సర్వ దు:ఖాతిగో భవేత్" అన్ని దు:ఖములని దాటి పోవచ్చు. ఆ పున్దరికాక్షుని అర్చించదమె "ఏషమే అధిక తమో మత:" అన్ని ధర్మాలలొకి శ్రేష్టమైన ధర్మమూ అని నా అభిప్రాయం. అతని నామములను కీర్తిస్తే సకల పాపాలు పోతాయి. పవిత్రులౌథారు. ఏ కోరిక కోరినా, అవన్నీ లభిస్తాయి. దీనిని మించిన గొప్ప మంత్రము మరొకటి లేదు, వేయి నామాలు కల మూలా మంత్రము ఈ స్తోత్రము. "

ఈ వేయి మంత్రాలూ ఎక్కడివో తెలుసా? నేను కల్పించలేదు, " యని గౌణాని విఖ్యాతాని ఋషిభి: పరి గీతాని" ఋషులచే గానము చేయబడినవి. శ్రీమన్నారాయణుని గుణములను అనుభవించిన ఋషులు ఆ అనుభవముతో ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని కీర్తించి ఆనందించారు. అక్కడక్కడా గల ఆ ఋషుల వాక్ అమృతం కలిసి పరీవాహమై లోకములో మనం కుడా పాడగలిగేటట్లు శ్రీ వ్యాస భగవానుడు సేకరించి కృప చేయగా నేను దర్శించాను . నివు అడిగావు కనుక సర్వ జీవులు ఉద్ధరించ బడడానికి చెప్పుచున్నాను అని భీష్ముడు ఉపదేశిస్తాడు.

అట్టి మహాభారత సారము, పరమ ఋషులచే దర్శితము, శ్రీ భీష్మ పితామహుని అభిమతము, శ్రీ వేద వ్యాస్సుని ఉపదేశము, భగవద్గిత కంటే శ్రేష్టము అయినది శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము. ఎందఱో ఆధునికులు కూడా దీనిని సకల అభిష్ట సిధ్ధిదము అని పొగిడినది అయిన ఈ స్తోత్రాన్ని మనం నిత్యమూ పఠించి కోరినవన్నీ పొందుదాము.

ఓం నమో భగవతే వాసుదేవాయ....


Saturday, 1 February 2014

నామ జపము ఎందుకు చేయాలి? నామ జపము యొక్క మహిమ ఏమిటి?

కలియుగములో యజ్ఞ యాగాదులు చేయుట , నిర్వహించుట కష్టము. పూజ విధి విధానములు తెలుసుకొని ఆచరించుట అందరికి సులభము కాకపోవచ్చు. విధివిధానా పూర్వకముగా చేయ లేక పోవుట  వలన కర్తకు దోషము కలుగవచ్చు. అందువల్ల భగవంతుడు నామ జపము ను భగవంతుని చేరుటకు ఒక మార్గముగా చెప్పియున్నాడు.

ఇందులో ఎటువంటి విధి విధానము లేదు. పిల్లలు, స్త్రీ, పురుషులు, వృద్ధులు, రోగులు కూడా చేయవచ్చు. అన్ని పరిస్తితులలొను, అన్ని సమయములలోనూ చేయవచ్చు. నడుస్తూ, తింటూ, పనులు చేసుకుంటూ, కూడా నామ జపము చేయవచ్చు.

నామజపము మూడు రకాలుగా చేయవచ్చును. 1. మనసుతో ( స్వరము పైకి వినబడకుండా లోలోపల మనసులోనే ధ్యానించు కొనుట. ) 2. వాక్కుతో ( నామము నోటితో పైకి వినబడేలాగా స్మరణ చేయుట)3. కీర్తనము ( గట్టిగా భగవంతుని అనెకవిధములైన కృతులు, భజనలతో కీర్తించుట).

భగవన్నామము భక్తి తో జపించు వారికీ భగవంతుని అనుగ్రహము కలుగును. దుష్ట శక్తుల నుండి విముక్తి లభించును. ఏకాగ్రతతో, అనన్య భక్తితో నామ జపము చేసిన వారికీ భగవద్దర్శనము కలుగును. అవసాన కాలమున ఆర్తితో నామ స్మరణ చేయు వారికీ ఈ జన్మము నందలి పాపములు నశించును.
పాపులకు నామస్మరణ రుచించదు. కానీ, శ్రద్ధ భక్తులతో జపము చేసిన వారికీ పాపమూ క్రమముగా నశించి, నామ జపము నందు అభిరుచి కలుగును.

నామ జపము చేయు సాధకుడు భగవంతుడు తన ఎదుటే ఉన్నాడు అను భావనతో చేయవలెను. క్రమముగా అందరిలోనూ భగవంతుడే ఉన్నాడు అను భావము మనసున నెలకొల్పుకొనవలెను. అందరు ఈ విధముగా ఆలోచించుట వలన సమాజములో శాంతి నేలకోనును.

భగవంతునినామము  భక్తీ, శ్రధ్ధలతొనె కాక, హేళనగా, పరిహాసముగా, యాద్రుచ్చికముగ పలికినను ఫలమును పొందుదురు. అజామీళుని కథ అందరికి తెలిసినదే కదా. భక్తులు అందరు ఏ విధమైన ప్రయాస లేకుండా,వారి వారి ఇష్ట దైవములను నామ జపము చేసుకోన వచ్చును.

1. ఓం నమ: శివాయ
2. ఓం నమో భగవతే వాసుదేవాయ.
3. ఓం నమో నారాయణాయ
4. శ్రీ మాత్రే నమ:
5. హరే రామ హరే రామ రామ రామ హరే హరే,
    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే.