Wednesday, 16 July 2014

ఎవరినైనా ఒదార్చ వలసి వచ్చినపుడు....
ఎపుడైనా మనకు ఆత్మీయులైన వారు కష్టాల పాలైతే ఎలా ఓదార్చాలో తెలియక ఇబ్బంది పడతాం. ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనే confusion లో ఉంటాము. ఈ క్రింది అంశాలను దృష్టిలో ఉంచుకుంటే, ఓదార్చడం కొంత సులువు అవుతుంది.
1. బాధలో ఉన్న వ్యక్తులను ఒక్కసారిగా ఆనందపరచాలి అని ప్రయత్నించకండి.
2. జరిగిన నష్టం చిన్నది అని, మర్చిపోండి అని తేలికగా మాట్లాడకూడదు.
3. బాధలో ఉన్న వారిని అకస్మాత్తుగా వేరే విషయాల మీదకు మళ్ళించాలి అని ప్రయత్నించకండి.
4. మనసు మార్చుకోవడం అంత సులువు కాదు. దానికి కొంత సమయం పడుతుంది.
5. బాధలో ఉన్న వారి మనసు మళ్ళించడానికి వ్యర్ధ ప్రసంగం, అసందర్భంగా మాట్లాడడం చేయకూడదు.
6. ఎవరైనా ఆత్మీయులు మరణించినపుడు ఒదార్చవలసి వస్తే, మరణించిన వ్యక్తీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి. కోలోపోయిన వ్యక్తీ గురించిన మంచి విషయాలు వినడం వారి సంబంధీకులకు ఆనందంగా ఉంటుంది.
7. మీరు వోదార్చేటప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకుంటే, వారిని స్వేచ్చగా ఏడవనివ్వండి. వేదన కన్నీళ్ళ రూపం లో బయటికి వస్తే, మనసు తేలికపడుతుంది.
8. పలకరించడానికి వెళ్ళినపుడు మీకు కూడా కన్నీళ్లు వస్తే రానివ్వండి. దానివల్ల అవతలి వారు మరింత దుఃఖ పడతారు అని సంశయించ వద్దు. వారి బాధలకు మీరు తోడూ ఉన్నారు అన్న ఫీలింగ్ వారిని తేలిక పడేలా చేస్తుంది.
8. బాధకు లోనైన వ్యక్తిని కూడా మాట్లాడనివ్వాలి. వారు ఏమి చెప్పినా ఓపికగా వినాలి. వారు ఒకటే మాట పది సార్లు చెప్పినా వినాలి.
9. ఓదార్చే సమయం లో వారితో కానీ, ఇతరులతో కానీ, అనవసర చర్చలు, అనవసర సంభాషణలు చేయకూడదు.
10. బాధ పడుతున్న వ్యక్తీ ఏమి చెప్పినా, అది మీకు అబద్ధం అనిపించినా, ఆ సమయం లో ఖండించకూడదు.
11. కష్టం వచ్చినపుడు అందరూ ఒక్కసారి కలుస్తారు. తరువాత ఎవరికీ వారె అన్నట్టు ఉంటారు. అలా కాకుండా, తరచూ కలుసుకో గలిగినంత దగ్గరలో ఉన్నట్టయితే, అవకాశం ఉన్నట్టయితే, తరువాత కొంత కాలం వరకూ తరచూ కలుస్తూ ఉండాలి.
12. బాధలో ఉన్న వ్యక్తీ భోజనం మానేయడం, బయటికి రావడం మానేయడం వంటివి చేస్తున్నపుడు వారిని ఒప్పించి నలుగురిలో తిరిగేల చేయాలి.
13. ఆత్మీయులను పోగొట్టుకున్నపుడు, అత్యంత వేదన అనుభవిస్తున్నపుడు, వారు ఆ బాధ నుంచి బయటకు రావడం ఒక్కోసారి చాల కష్టం అవుతుంది. అటువంటప్పుడు వారికీ ఉన్న హాబీలు ఇతరత్రా వాటి ద్వారా ఆ వేదన మర్చిపోయేట్లు చేయాలి.
14. ఇదేమంత పెద్ద విషయం? అందరికి ఉండేదే కదా! లోక సహజం కదా! అన్నట్లు మాట్లాడకూడదు. ఎవరి కష్టం వారికీ పెద్దగానే ఉంటుంది.
15. వారి బాధను పోగొట్టడానికి అన్నట్టు, వారికీ ఇష్టమైన విషయం మాట్లాడాలి. అలా అని, క్రికెట్ గురించో, సినిమాల గురించో మాట్లాడడం చాలా అసందర్భంగా ఉంటుంది.
16. వారి దారిలోనే వెళ్లి వారి మనసు మళ్ళించాలి తప్ప, మన దారిలోకి తెచ్చుకోవాలి అనుకోవడం హాస్యాస్పదం.
17. వారు పోగొట్టుకున్న వ్యక్తీ గురించి వివరాలు తెలుసుకోవాలని వినాలని అనుకుంటారు. అలా అని కోలోపోయిన వ్యక్తీ గురించి నెగటివ్ గా అసలు మాట్లాడకూడదు.
18. మౌనప్రేక్షకుల లాగా ఉండటం కంటే, ఏదో ఒకటి సవ్యంగా మాట్లాడడం మేలు.
19. చివరిగా, మన ఓదార్పు వారికీ శక్తి నిచ్చేదిగా ఉండాలి. వారిలో స్థైర్యం పెంచాలి. ఇలా చేస్తే, వారు జీవితాంతం మనతో బంధం కోరుకుంటారు.
భారత దేశం లో ఆయుర్వేద వైద్య విధానం అనాదిగా పాటింపబడుతోంది. దీని ప్రాశస్త్యం గుర్తించి దీనిని పంచమ వేదం గా పరిగణించారు మన పూర్వులు. మన చుట్టూ ప్రక్రుతి ప్రసాదించిన మూలికలు, వేర్లు, వివిధ వృక్షాలకు , తీగలకు సంబంధించిన భాగాములతోనే పూర్తీ రసాయన రహితంగా తయారయ్యే ఈ ఆయుర్వేద ఔషధాలు ఒక వ్యాధి యొక్క మూలాన్ని గుర్తించి, ఆ వ్యాధిని సమూలంగా నాశనం చేసే విధంగా తోడ్పడతాయి. ఎన్నో రకాల ఆయుర్వేద ఔషధాలు మన మునులు, ఋషులు, ఎన్నో పరిశోధనలు చేసి, మానవాళికి వరంగా అందించ బడ్డాయి. వీటిలో మానవుని నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక ఆరోగ్య సమస్యలకు నివారిణి గా ఉపయోగపడే ఒక అపురూపమైన ఔషధం "త్రిఫల చూర్ణము".
ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ల మిశ్రమమే త్రిఫల చూర్ణం. విడివిడిగా ఈ ఫలాలలో ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, ఈ మూడు కలిసినపుడు ఇంకా మంచి ఫలితాలు ఇస్తాయి. వీటిని సమానమైన భాగాలలో తీసుకుని, గింజలు వేరు చేసి, పైన ఉండే బెరడును ఎండబెట్టి, దంచి మెత్తగా పొడి చేసి ఒక సీసా లో నిల్వ చేసుకొని రోజూ వాడుకోవచ్చు. పలుచని మజ్జిగలో, గోరువెచ్చని నీటితో, లేదా తేనెతో కలిపి వాడుకోవచ్చు. ఈ చూర్ణం కొద్దిగా వగరు రుచి కలిగి ఉంటుంది. కాబట్టి, మజ్జిగలో కొంచెంగా ఉప్పు వేసుకొని ఒక చెంచా పొడిని కలుపుకొని తాగితే మంచిది. సాధారణంగా దీనిని రాత్రిపూట భోజనం అయినాక పడుకునే ముందు తీసుకుంటారు.
ఉపయోగాలు.
1.జీర్ణ శక్తిని పెంచుతుంది.
2. అన్నవాహిక ను ఆరోగ్యంగా ఉంచుతుంది. తద్వారా గ్యాస్, త్రేనుపులు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు ఉండవు.
3. జీర్ణ కోశాన్ని పరిపుష్టంగా ఉంచుతుంది.
4. రక్తాన్ని శుద్ది చేస్తుంది.
5. జుట్టు రాలకుండా ఆపుతుంది.
6. జుట్టు తొందరగా తెల్లబడకుండా నివారిస్తుంది.
7. జుట్టు కుదుల్లను బలంగా చేస్తుంది.
8. శరీరం లోని అనవసరమైన కొవ్వును కరిగిస్తుంది.
9. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుతమైన ఔషధం.
10. రక్తపోటు ను నియంత్రించడంలో దోహదపడుతుంది.
11. కాలేయం, స్ప్లీన్ ల పనితీరు ను మెరుగు పరుస్తుంది.
12. కంటిలో శుక్లాలు, గ్లకోమ రాకుండా అడ్డుకుంటుంది .
13. ప్రేగులను శుభ్రం చేస్తుంది.
14. దీనిని క్రమం తప్పకుండా వాడితే చర్మం వయసుతో పాటు ముడుతలు పడకుండా నివారిస్తుంది.
త్రిఫల చుర్ణమును 1-2 చెంచాలు రాత్రి పూట అరగ్లాసు గోరువెచ్చని నీటిలో వేసి, రాత్రంతా అలాగే కదపకుండా ఉంచి, మరునాడు ఆ నీటితో కళ్ళు కడుక్కుంటే, కంటి బాధలు తొలగిపోతాయి.
ఇంతటి అద్భుతమైన ఔషధం ప్రతి వారి ఇంటిలోనూ ఉండవలసినది. వయసు నిమిత్తం లేకుండా అందరూ వాడవచ్చు. గర్భిని స్త్రీలు మాత్రం వాడకూడదు. వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి.* అన్ని రకాల రుగ్మతలకు పనిచేసే ఔషధం ఈ త్రిఫల
గత ఆదివారం సాక్షి దినపత్రిక అనుబంధం పుస్తకం లో ఒక కధ చదివాను. చాల మంది మిత్రులు చదివే ఉంటారు. ఆ కధ సారాంశం క్లుప్తంగా....పేదరికంతో రోజు గడవక, పిల్లల చదువు మాట అలా ఉంచి, అన్నం కూడా పెట్టలేని పరిస్థితులలో, వాళ్ళ ప్రాణాలు కాపాడటానికి ఒక తల్లి తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి కూలి పని కోసం సౌది వెళ్తుంది. అక్కడ చాకిరీ చేయగా వచ్చిన జీతంలో తను కొద్దిగా ఖర్చు పెట్టుకొని, మిగతా అంతా భర్తకు పంపుతుంది, అప్పులు తీర్చడం కోసం, ఉన్న పొలం సాగు చేయడం కోసం, పిల్లల ప్రస్తుత చదువుల కోసం, వారి భవిష్యత్ కోసం దాచమని భర్తకు చెప్తుంది. తీరా కొన్నేళ్ళు కష్టపడిన తర్వాత, అక్కడి రూల్స్ మారటం వల్ల ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి ఇండియా కి వెళ్ళిపోవలసిన పరిస్థితులు వస్తాయి. అపుడు టికెట్ కొనుకోవడానికి కూడా డబ్బు లేక, భర్తకు డబ్బు పంపమని ఉత్తరం రాస్తుంది. దానికి భర్త ఏమి చెప్తాడు అంటే====నువ్ పంపిన డబ్బు నేను ఏదో కొద్దిగానే అప్పులు తీర్చాను. పొలం సాగులో లేదు. పిల్లల భవిష్యత్ గురించి కూడా ఏమి దాచలేదు, అంత డబ్బు ఒక్కసారిగా చూసేసరికి నాకు జల్సాలు ఎక్కువ అయినాయి, వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఫలితంగా రోగాల బారిన పడ్డాను, నీకు పంపడానికి నా దగ్గర ఏమి లేదు అని....
ఈ కధ నేను ఇక్కడ వ్రాయటానికి సందర్భం ఏమిటంటే, ఇది వట్టి కధ కాదు. నిజ జీవితం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. భార్య సంపాదించడానికి వెళ్తే, భర్తలకు లేనిపోని వ్యసనాలు అంటుకుంటున్నాయి. ఒక ఇంటిలో మగవాడు సంపాదించడానికి విదేశాలకు వెళ్తే, ఆ ఇంటిలోని పిల్లలకు చెడు అలవాట్లు అవుతున్నాయి. అక్కడ సంపాదించే వాడికి కష్టం తెలుస్తుంది కాని, ఆ డబ్బు అనుభవించే వాడికి కష్టం తెలియదు. ఇక్కడ పిల్లలు మాత్రం (అందరు కాదు, చాల మంది) బైకులు, పార్టీలు, ఖరీదైన ఫోనులు, ఇలా బాధ్యత తెలియకుండా జల్సా చేస్తున్నారు. కొంత మంది ఆడవాళ్లు కూడా మితి లేకుండా , బాధ్యత లేకుండా ఖర్చు పెడుతున్నారు.
ఊరికే వచ్చే డబ్బు, కష్టం తెలియనీయని డబ్బు ఎప్పుడూ అనర్ధాలకే దారి తీస్తుంది. మీ జీవిత భాగస్వాములు విదేశాలకు వెళ్లి సంపాదిస్తున్నారు అంటే, ఇక్కడ వచ్చేది చాలదు, ఇక్కడి కన్నా మీకు మెరుగైన , సౌకర్య వంతమైన జీవితం ఇవ్వాలి అనేది వాళ్ల ఉద్దేశ్యం. రుచికరమైన భోజనం లేక, తినీ తినక, సరియైన వాతావరణ పరిస్థితులు లేక, అయిన వాళ్ళు దగ్గర లేక, కేవలం డబ్బు కోసం దూరాన ఉండి, వారు జీవిస్తున్నారు. పేస్ బుక్ లు, చాటింగ్ లు, స్కైపులు, మనసులను దగ్గర చేయలేవు. మనసులోని ఒంటరితనాన్ని దూరం చేయలేవు. వారి కష్టాన్ని గమనించుకోండి.
వారు పంపే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి.
చివరగా ఒక విషయం. "డబ్బును మన గుప్పెట్లో పెట్టుకున్నంత వరకే అది మన మాట వింటుంది. మన గుప్పిట దాటిందో, మనలను ఆడిస్తుంది.".
కధ వ్రాసిన రచయిత కు ధన్యవాదములు. శతకోటి నమస్సులు.
ప్రతి గర్భిణి స్త్రీ కి ఒక మొబైల్ ఫోన్ ఉచితం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యోచన.

గర్భిణి స్త్రీలకూ ఉచితంగా ఒక మొబైల్ ఫోన్ అందజేసి, సంక్షిప్త సందేశాల ద్వారా, ఆమె తీసుకోవలసిన టీకాలు, బలవర్ధక మైన ఆహారం వంటి వివరాలు అందజేయాలి , తద్వారా దక్షిణ భారతం లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా నమోదు అయిన రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో గర్భిణి స్త్రీల ఆరోగ్యం విషయం మిద శ్రద్ధ పెట్టి, మాతా శిశు మరణాల రేటు తగ్గించాలి అని ప్రభుత్వ యోచన. ఇది ఈనాడు దినపత్రిక లో నిన్న అనగా 16 జూలై నాడు ప్రచురింపబడిన వార్త.

1.ఈరోజున గ్రామీణ ప్రాంతాలలో కూడా 90 శాతం ప్రజలు మొబైల్స్ వాడుతున్నారు. స్త్రీలకూ కూడా మొబైల్స్ ఉంటున్నాయి.
2. గర్భిణి లకు సూచనలు , సలహాలు అందజేయాలి అంటే, ఇంట్లో ఎవరో ఒకరికి మొబైల్ ఉంటె చాలదా? ప్రత్యేకించి ఆ స్త్రీకి ఉండాలా?
3.ఒక మాదిరి ఆర్ధిక పరిస్థితి, చదువు, ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్నవారికి వైద్యులు ఇచ్చే సూచనలు సరిపోతాయి, ప్రత్యేకించి వారికీ మొబైల్ కొత్తగా ఈ విషయమై ఇవ్వవలసిన పనిలేదు.
4. అంతగా చదువు లేకుండా, మారుమూల పల్లెటూళ్ళలో ఉన్న స్త్రీలకూ మొబైల్ ఇచ్చినా కూడా అది వారి దగ్గర నిలుస్తుంది అని నమ్మకం లేదు. అది ఇతర అవసరాలకు పనికి రావచ్చు. (పేదల సంక్షేమం కోసం ప్రవేశ పెట్టిన రేషన్ కార్డులు 90 శాతం తాకట్టు లోనే ఉంటాయి ఎప్పుడూ).
5. బాగా విద్యాధికుల దగ్గరే కొండొకచో, మొబైల్స్ వల్ల ఎన్నో అనర్ధాలు జరుగుతున్నాయి. ఇంకా నిరక్షరాస్యులైన వారికీ ప్రత్యెక మొబైల్స్ అవసరమా?
6.  నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటె, ఈ పధకం కింద ఖర్చు పెట్టె కోట్ల రూపాయలను, గర్భిణి స్త్రీల పోషకాహారానికి నేరుగా ఖర్చు పెట్టవచ్చు.
7. ప్రతి గ్రామం లో ఉన్న గ్రామా సేవికలు, అంగన్వాడి కార్యకర్తల ద్వారా, గర్భిణి స్త్రీల పేర్లు, నమోదు చేసి, ప్రతి వారం , లేదా ప్రతి రోజు వారికీ పోషకాహారం నేరుగా అందివ్వవచ్చు. ప్రతినెలా వారి యొక్క ఆరోగ్యం పరీక్షించడానికి పరీక్షలు చేసి, టీకాలు ఉచితంగా ఇవ్వవచ్చు.
8. మన రాష్ట్రం లో ఎన్నో చోట్ల, ఎన్నో కుటుంబాలు స్వచ్చందంగా వేసవి కాలంలో అంబలి సెంటర్లు తెరిచి బీదలకు అంబలి పంచి పెడుతున్నారు. ఆ విధంగా ప్రభుత్వం తలచుకుంటే ప్రతి గ్రామం లోను, ప్రజా వైద్య శాలల్లో గాని, అంగన్వాడి సెంటర్లలో కాని, ప్రతి రోజు గర్భినులకు ఆహారం అందజేసే కార్యక్రమం చేపట్టవచ్చు.
9. దీనికి కావలసినది అధికారులలో, చిత్తశుద్ది. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ. వారి వారి కర్తవ్యమ్ పట్ల నిబద్ధత.
10, అసలు చెప్పుకోవాలంటే, మారుమూల గ్రామాలనుంచి గర్భినులకు ప్రసవ సమయం లో ఆసుపత్రికి చేరటానికి సరిఅయిన రహదారులు లేవు. ఏజెన్సీ ప్రాంతాలలో అయితే, వారి పరిస్థితి మరీ దుర్భరం. అక్కడ గర్భిణి స్త్రీ ప్రాణాలకు ఏ విధమైన గారంటీ లేదు.
11. ముందు గ్రామాలలో ఉన్న ప్రభుత్వ వైద్య శాలల్లో సౌకర్యాలు మెరుగు పరచండి. వైద్యులు అక్కడే ఉండి, ఏ సమయం లో నైనా వైద్యం అందించే పరిస్థితి కల్పించండి.
12. ఉచిత మందులు, ఉచిత టీకాలు ప్రజలకు అందే ఏర్పాట్లు చేయండి.
13. ఇవి అన్నీ లేనపుడు మీరు మొబైల్స్ ఉచితం గా ఇవ్వడం ఎంతవరకు సబబు?
14. మొబైల్స్ ఉచితంగా ఇస్తే పై సమస్యలు అన్నీ తీరిపోతాయ?
15.మాతా శిశు మరణాలు రేటు తగ్గడానికి ముందు గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను educate  చేయండి. వారు తీసుకోవలసిన జాగ్రత్తలు, పోషకాహారం వీటి పట్ల అవగాహనా కల్పించండి.
16. పల్స్ పోలియో కార్యక్రమం లాగా ఈ అవగాహనా కార్యక్రమం కూడా ఏళ్ళ తరబడి నిరంతరాయంగా సాగేలా చుడండి.
17, ప్రజలు educate  అవనంత వరకు మీరు ఎన్ని మొబైల్స్ ఉచితంగా ఇచ్చినా ప్రయోజనం ఉండదు.
18. పైగా, మొబైల్స్ ఉచితంగా ఇవ్వడం వల్ల ఇంకా అనర్ధాలకు దారి తీసిన వారు అవుతారు. ఎందుకంటే టెక్నాలజీ రెండు వైపులా పదును ఉన్న కత్తి కాబట్టి. దాని విలువ తెలుసుకోలేని వారి దగ్గర అది ఎప్పుడూ దుర్వినియోగం అవుతుంది.

**************ఈ పోస్ట్ చుసిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, జర్నలిస్టులు, లేక ప్రభుత్వం తో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులు ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సంతోషిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం వరకు ఈ పోస్ట్ చేరవేయాలి అంటే దాని process  నాకు తెలియదు.

Friday, 27 June 2014

అనగనగా ఒక మహానగరం లోని ఒక రద్దీ అయిన వీధిలో ఆకాశాన్ని అంటే అపార్టుమెంట్. అందులో ఒక ఇంట్లో 2,3 సంవత్సరాల ఒక పాప. పేరు మున్ని. మున్ని వాళ్ల అమ్మ ఇవాళ చాల హడావిడిగా ఉంది. ఆమె చాల అవసరంగా ఇవాళ బ్యాంకు కు వెళ్లి ఎక్కడో చదువుకుంటున్న మరిది కి డబ్బు పంపాలి. భర్తకు తీరిక లేదు. తనే తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే తనతో పాటు తీసుకెళ్ళడానికి మున్ని ని తయారు చేసి కిటికీలో కూర్చోపెట్టింది. ఇంతలో కింద నుంచి హాహాకారాలు, గొడవలు, గగ్గోలు, మత విద్వేషాలు, గృహ దహనాలు, లూటీలు, పోలీసులు, లాఠి చార్జీలు. షరా మామూలుగా నగరం లో కర్ఫ్యూ విధించారు. 3 రోజులు గడిచిపోయాయి. బ్యాంకు పని అవ్వలేదు. మతకలహలకు కారణం మొదట తెలియలేదు. తరువాత ఎవరో హిందూ కాలనీ లో నడచి వెళ్తున్న ఒక ముస్లిం మిద చెప్పు విసిరారు. అది ఇంత మరణ హోమానికి దారి తీసింది. పరిస్థితులు ఎలాగో సద్దు మణిగాయి.  ప్రశాంతత వచ్చింది. నగరం నివురు కప్పిన నిప్పులా ఉంది. మున్ని వాళ్ల అమ్మ మళ్లీ బ్యాంకు పనికి బయలుదేరింది. మున్ని ని తయారు చేసింది. చెప్పులు వేద్దామంటే కనబడలా... ఏమైనట్టు, ఈ నాలుగు రోజుల నుంచి ఎక్కడికీ వెళ్ళలేదే? అనుకుంటూ అంతా వెతికింది. ఎక్కడా లేదు. కోపం తో అసహనం తో మున్ని కి నాలుగు అంటించింది. మున్ని వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఆ ఏడుపు లోనే ఏదో చెప్తోంది. వెక్కిళ్ళ మధ్యలో తల్లికి ఏమి అర్ధం కాలేదు. కానీ కొట్టినందుకు తనే మళ్లీ బాధపడుతోంది. మున్ని ని దగ్గరకు తీసుకొని మళ్లీ చెప్పమ్మా అని అడిగింది, మున్ని చెప్పింది--" ఆరోజు నా చెప్పు కిటికీలోంచి బయటకు పడిపోయింది" -- అని.

అనగనగా ఒక చెత్త ఛానల్. అది దాని రేటింగ్స్ పెంచుకోవడానికి ఏ గడ్డైనా తింటుంది. ఆ నిర్వాహకులకు రేటింగ్ పెంచుకోవడం తప్ప వేరే పని లేదు. ఆ ఛానల్ ట్యాగ్ లైన్స్ మాత్రం కోటలు దాటుతాయి. మెరుగైన సమాజం కోసం అని చెప్పుకునే ఆ ఛానల్, మెరుగుగా ఉన్న సమాజాన్ని ముంచేసేందుకే పుట్టినట్టుంది.

అయన ఒక పీఠాదిపతి. అయన పని హిందుత్వాన్ని, దశదిశలా వ్యాపింపచేయడం. ఆయనను అంతటి స్థానం ఇచ్చి గౌరవించారు అంటే ఆయనకు సమాజం పట్ల అంతో ఇంతో బాధ్యత ఉంది కదా. అది పాపం అయన మర్చిపోయారు. ఒక పీఠానికి అధిపతి అయి ఉంది, కాషాయం ఎప్పుడైతే కట్టాడో, అయన అరిషడ్వర్గాలను జయించి ఉండాలి. పాపం అది అయన చేతకాలేదు.ఆయనకు ఇష్టం లేని ప్రశ్నలు వేస్తె వారి చెంప చెల్లుమనిపిస్తాడు.  అటువంటి వారికీ వాక్సుద్ధి  ఉండాలి. నోరు, మాట మన్నించ దగినవిగా ఉండాలి. కానీ అయన నోరు విప్పితే కాంట్రవర్సీ లే. అన్నిట్లోనూ వివాదమే. పీఠాధిపతి గా అయన పొందలేని గుర్తింపు వివాదాల ద్వార పొందుతున్నాడు.

ఈ బుర్ర లేని ఛానల్, ఆ పని లేని పెద్దమనిషిని చర్చా కార్యక్రమానికి పిలిచింది. ఒక పక్క, రాష్ట్రం అడ్డుగోలు విభజన, ఒకరికి లోటు బడ్జెట్, ఒకరికి మిగులు బడ్జెట్, కరంటు, నీళ్ళు, అన్నీ వివాదాస్పదం, రెండు రాష్ట్రాల వాళ్ళు సతమతం అవుతున్నారు, మాటల ఈటెలు విసురుకుంటున్నారు. ఇంకో పక్క పసిఫిక్ సముద్రం లో ఎల్ నినో, ఋతుపవనాలు ఆలస్యం, రైతన్నకు నీరు లేదు, పంటలు పండవు, ఎక్కడ మళ్ళీ కరువు కాలం వస్తుందో అనే భయం, మరో ప్రక్క జాతి ఉపయోగానికి అంటూ, రైలు చార్జీల మోత, గ్యాస్ బండ గుదిబండై మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అనే భయం, --- ఇవన్ని ఇలా ఉంచి, ఆ బుర్ర లేని ఛానల్ కి ఆ చర్చకు టాపిక్ ఎవరు ఇచ్చారో తెలియదు, ఆ చర్చ వల్ల సమాజానికి ఏమి ఉపయోగమో తెలియదు కానీ, ఇప్పటికి సమాజం లో ఉన్న సంఘర్షణలు చాలవు అన్నట్లు, "శ్రీ షిరిడి సాయి బాబా దేవుడా ? కాదా?" అనే అంశం మీద ఆ సదరు పీఠాధిపతి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

1. అన్ని మతాలూ దేవుని చేరే వివిధ మార్గాలు అని అన్ని మతాలూ ఘోషిస్తున్నాయి. అందులోను,  హిందూ ధర్మం ఎంతో విశాల హృదయం తో అన్ని మతాలను ఆదరించింది. ఈనాడు, హిందూ ధర్మం, వారిని పూజించద్దు వీరిని పూజించద్దు, వీరినే పూజించాలి, ఈయనే దేవుడు అనే ఆంక్షలు పెట్టలేదు. అటువంటి హిందూ ధర్మానికి చెందిన ఒక పీఠాధిపతి, బాబా ముస్లిం, ఆయనను పూజించే వారు రాముని పూజించవద్దు అని అనటం ఎంతవరకు సబబు?

2. ప్రతి గ్రామం లోను, బాబాను పూజించే వారు ఎక్కువ అవడం వలన, షిర్డీ కి భక్తుల తాకిడి ఎక్కువ అవడం వలన, ఇదివరకు రాముని పూజించే వాళ్ళు కూడా ఇప్పుడు బాబాను పూజించడం వలన , రామునికి రావలసిన ఆదాయం అంతా బాబాకి వెళ్ళిపోతోంది అని అయన ఆక్రోశం. ఒక సన్యాసి కి డబ్బు గురించిన చింత ఎందుకండీ? రాముడి డబ్బు తగ్గిపోతే రాముడు చూసుకుంటాడు, ఆ ఆ దేవాలయాలు కట్టించిన ధర్మకర్తలు చూసుకుంటారు కదా?

3. ఒకవేళ ఈయన పూజించద్దు అని చెప్పినంత మాత్రాన బాబాను తమ దైవంగా, తండ్రిగా భావించే భక్తులు మానరు కదా? ఎవరిని పూజించాలి, ఎవరిని నమ్మాలి అనేది భక్తుల వ్యక్తిగత విషయం. దీనిని పబ్లిక్ చేయడం ఎంతవరకు సమంజసం.?

4. వేరే మతం వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు హిందూ సమాజం లో అంతర్గత కలహాలు తేవడానికి ఇదంతా చేస్తున్నారు అని ఆ స్వామిజి సెలవిచ్చారు. ఇందులో అర్ధం ఏమిటో ఆయనకే తెలియాలి.

5. ఈ చర్చ చూసిన/విన్న  సోదరులు కొందరు, సాయి భగవంతుడే కాదు, అయన ఒక గురువు మాత్రమే, ఆయనను దైవం తో సమానంగా చూడకండి, దైవం అనే హోదా ఇవ్వకండి అని మొత్తుకున్నారు. మరి చెట్టుకొకరు, పుట్టకొకరు పుట్టుకొస్తున్న స్వమీజిల గురించి ఎవరూ ఏమి మాట్లాడరే? వాళ్ళందరూ ఇంతంత బంగారాలు దిగేసుకుని, పట్టు పరుపుల మిద బంగారు సింహాసనాల మిద కుర్చుని, పడపూజకు లక్షలు లక్షలు రుసుము వసూలు చేస్తుంటే మాట్లాడరే?

6. కలియుగం లో బాబానే కాకుండా, రాఘవేంద్ర స్వామి, రమణ మహర్షి, ఇటువంటి మహానుభావులు ఎందఱో ఉన్నారు. ఎంతో మందికి మార్గ నిర్దేశం చేసారు. వాళ్ళందరి విషయం లో లేని దుగ్ధ బాబా విషయం లోనే ఎందుకు?

7. కొందరి ఉవాచ ఏమిటంటే, బాబా గురించి వేదాలలో లేదు కాబట్టి ఆయనను ప్రామాణికంగా తీసుకోలేము. బాబా నిన్న మొన్నటి వరకు మన మధ్యలో తిరిగిన వారు. కొన్ని యుగాల క్రితం పుట్టిన వేదాలలో అయన ప్రసక్తి ఎలా ఉంటుంది?

8. బాబా ను దైవంగా కొలిచినా, కొల్వక పోయినా, అయన నేర్పిన భక్తీ, క్రమశిక్షణ బాబా భక్తులందరికీ అలవాటు అయిపోయాయి. ఏ బాబా మందిరం లోను, ఏ పండగ నాడు కనీ, విశేష దినాలలో కనీ, ఎంత రద్దీ ఉన్నా, తొక్కిసలాట జరుగదు. భక్తులు ఎంతో నిదానంగా క్యు పాటిస్తూ నిశ్శబ్దం గా లైనులో కదులుతుంటారు.

9. అసలు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా తనను తానూ ఎప్పుడూ దేవుడిని అని చెప్పుకోలేదు. దేవుని బానిసను మాత్రమే అని చెప్పారు. నేను దక్షిణగా తీసుకునే ప్రతి పైసాకి నేను భగవంతునికి లెక్క చెప్పాలి అని చెప్పారు. నన్నే పూజించండి అని చెప్పలేదు. ఎవరు ఏ దేవుని పూజిస్తే వారికీ ఆ రూపం లో దర్శనం ఇచ్చారు. నాకు ఈ విధంగా పూజ చేయండి అని చెప్పలేదు. ఎవరి ఇష్టం అయినట్టు వారిని పూజించుకోమని చెప్పారు.

10. సదరు పీఠాధిపతి గారు ఇంకో విషయం సెలవిచ్చారు. బాబా ముస్లిం అయితే, ముస్లిములు ఎక్కువ బాబాను ఎందుకు పూజించడం లేదు అని? ముస్లిములకు నిర్గుణమైన ఆరాధన తప్ప, సగుణారాదన లేదు. ముస్లిములే కాదు, మార్వాడీలు, సిక్కులు ఎంతో మంది బాబాను పూజిస్తున్నారు. సామాన్య భక్తులు కేవలం భక్తీ తప్ప , బాబా మతాన్ని పట్టించుకోవటం లేదు. అందరికీ ఆదర్శం గా ఉండవలసిన ఆ స్వామి బాబా యొక్క మతం కులం అంటూ పిచ్చి వాగుడు వాగుతున్నారు.

అసలు సమాజానికి ఒక్క పైసా మేలు చేయని ఇటువంటి చర్చలను ప్రోత్సహించే చానల్స్ ను బాన్ చెయ్యండి. అక్కర్లేని విషయాలకు ధర్నాలు, స్త్రైకులు చేసే వాళ్ళు, ఇటువంటి చర్చలు బాన్ చ్యడానికి ధర్నాలు చేయండి.

Thursday, 26 June 2014

దాదాపు 20 సంవత్సరాల క్రితం నుంచి అంటే దాదాపుగా ఈ కార్పొరేట్ కాలేజీ లు మొదలు ఐన నాటి నుండి కేవలం రాంకులు, మెడిసిన్, ఇంజనీరింగ్ సీట్లు, అందుకోసం సైన్స్ సబ్జక్ట్స్ తప్పఇంగ్లీషు, తెలుగు భాషలకు విలువ, ప్రాధాన్యం ఇవ్వక పోవడం మూలాన ఇప్పుడు వాటి పరిస్తితి అధ్వాన్నంగా తయారయింది. మా తరం అంటే తెలుగు మీడియం లో చదువు కున్నం కాబట్టి ఇంగ్లీషు grammer మాకు సరిగా రాలేదంటే అర్ధం ఉంది. కానీ అంతంత డబ్బులు పోసి ఇంగ్లీషు మీడియం లలో చదివించినా కుడా ఒక పేరా వ్రాస్తే అందులో పది గ్రామర్ తప్పులు. దానికి తోడు ఇప్పుడు వచ్చిన ఈ దిక్కుమాలిన sms భాష ఒకటి. అన్ని పదాలు సగం సగం వ్రాయటమే. abt ,hw , u , r , thnx , ఇలా. పరీక్ష పేపర్లు దిద్దుతుంటే ప్రాణం పోతోందండి అని వాపోయింది ఒక ఇంగ్లీషు లెక్చరర్ ఆ మధ్య.
ఇక తెలుగు గురించి ఏమి చెప్పాలి? 20 ఏళ్ళ క్రితం నుంచి సరి అయిన బోధనా లేకపోవడం మూలంగా ఇపుడు ఏ signboard చూసినా, ఏ షాప్ ముందు నేమ్ బోర్డు చూసినా, అందులో సవాలక్ష తప్పులు. ఇంక టీవీ లో స్క్రీన్ అడుగు భాగం లో వచ్చే స్క్రోలింగ్ చుస్తే ప్రతి వాక్యానికి ఒక తప్పు తప్పనిసరి. ఇంక వార్తలు చదివే వాళ్ళు, ఎంకర్స్ సంగతి ..... అందరికి తెలిసినదే. మొన్న మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం నాడు ఒక ప్రముఖ ఛానల్ లో రాత్రి ప్రైమ్ టైం న్యూస్ చదువుతున్న అయన "భాద్యతలు" అంటుంటే "బాధితులు" అని వినపడింది. మొదట నేను తప్పు వింటున్నానా అని అనుకొన్నా. శ్రద్ధగా విన్నా అదే పరిస్థితి. పంటి కింద రాయిలా. anchors లో చాల మందికి "ళ", "ణ" పలకదు. వెల్లి. పెల్లి, గననీయం అని చదువుతుంటే వినడానికి చాలా బాధగా ఉంటుంది. దానికి తోడూ, కొత్తదనం పేరిట అన్ని భాషలు కలిపేసి ఏదో వెర్రి మొర్రి పదాలు, సంకర భాషాను.
ఇప్పటికీ డిడి నేషనల్ లో శుద్ధమైన హిందీ, డిడి సప్తగిరి లో శుద్ధమైన తెలుగు మాట్లాడతారు. ఇదివరకు ప్రైవేటు చానల్స్ లో కూడా ఇంగ్లీష్ మాటలు పరిమితంగా వాడేవారు. ఇప్పుడు తెలుగు పొదుపుగా వాడుతున్నారు అనిపిస్తుంది. ఈ ప్రైవేటు చానల్స్ లో తెలుగు తనం ఉట్టిపడే కార్యక్రమాలే ఉండవు. ఏదో సంక్రాంతి పండుగకో, ఉగాది పండుగకో మనం తెలుగు వాళ్ళం అనే సంగతి గుర్తు వస్తుంది వాళ్ళకు.
మా పిల్లలు చదువుకునే కాలంలో తెలుగు లో ఇచ్చిన అన్ని పద్యాలూ భావార్ధలతో సహా నేర్పించేవాళ్ళం. ఇపుడు తెలుగు, ఇంగ్లీషు సబ్జక్ట్స్ లో కేవలం పరీక్షకు వచ్చే పాఠాలు మాత్రమే చెప్పి, అందులో ప్రశ్నలు మాత్రమే చెప్పి మిగతావి వదిలేస్తున్నారు. ఇక పిల్లలకు తెలుగు గురించి ఏమి తెలుస్తుంది?
ఇపుడైనా మించిపోయింది లేదు. ఇంట్లో తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకొని పిల్లలకు తెలుగు గురించి, చెప్పండి. సామెతలు, పొడుపు కథలు , నీతి కథల ద్వారా తెలుగును పరిచయం చేయండి. నాకు తెలిసి తెలుగు ను మొదటి నుంచి నేర్చుకోవడానికి గొల్లపూడి వారి పెద్ద బాల శిక్ష బాగా పని చేస్తుంది. ముందు మీరు నేర్చుకొని, పిల్లలకు ఇంట్లో ఆడుతూ పడుతూ చెప్పండి. పద్యాలూ, చమత్కారాలు తెలుగులో చాల ఉన్నాయి. అవి చెప్పండి. లేదంటే, కొన్నాళ్ళకు ఈ భాష లోని అందమైన పదాలన్ని మనం మర్చిపోతాం. ఆఖరికి కొన్నేళ్ళకు తెలుగు మృత భాషల జాబితాలో చేరిపోతుంది.