Saturday, 5 September 2015

 ఈకథ తప్పకుండా చదవండి.

ఓరోజు ఉదయం నేను పేపర్ చదువుతుండగా నా భార్య కేకేసింది. "ఎంతసేపూ పేపర్ పట్టుకుని కూర్చోవడమేనా? మీ ముద్దుల కూతురు ఏమి తింటొందో చూస్తారా కొంచెం?"

ఏదో విషయం ఉంది అని నాకు అర్ధమై పేపర్ విసిరేసి వెళ్ళాను. అక్కడ నా గారాలపట్టి సింధు, బేల ముఖంతొ ఉంది. దాని ఎదురుగా ఒక చిన్న గిన్నె నిండుగా పెరుగన్నం...దాని కళ్ళల్లో నీళ్ళు. నా కూతురు అని చెప్పడం కాదు కానీ, సింధు చాలామంచి పిల్ల. తెలివైనది. చురుకైనది. ఒక స్పూన్ తో పెరుగన్నం తీసి ఆమె నోట్లో పెడుతూ, నా బుజ్జి కదూ, బంగారం కదూ...నాన్నకోసం ఒక్క ముద్ద తినమ్మా...అని బ్రతిమిలాడాను. సిందు కొంచెం మెత్తబడింది. కళ్ళ నీళ్ళు తుడుచుకొని  "సరే నాన్నా! ఒక్క ముద్ద కాదు. అంతా తినేస్తాను. మరి తిన్నాకా, నేను ఏది అడిగితే అది ఇస్తావా?" అండి. "తప్పకుండా. నువ్వు ఏది కావాలంటే అది." నేను నా చిన్నారి లేత చేతిలో నా చెయ్యి వేసి ప్రమాణం చేసాను.

అయితే నేను కొంచెం కంగారు పడ్డాను. "సింధు, మరి నువ్వు కంప్యూటర్ లాంటి ఖరీదైన వస్తువులు అడగకూడదు. మీ నాన్న దగ్గర అటువంటి ఖరీదైన బహుమతులు కొనేంత డబ్బు లేదు . సరేనా!" అని తనని అడిగాను. "లేదు నాన్నా, నేను అడిగేది ఖరీదైనదేమీ కాదు." అని చెప్పి, నెమ్మదిగా, కొంచెం కష్టంగా మెల్ల మెల్లగా ఆ గిన్నెడు పెరుగన్నం తినడం పూర్తి చేసింది. నాకు నా భార్యమీద, అమ్మమీద పిల్లకు ఇష్టం లేనిది పెట్టి తినమని బలవంతం చేసినందుకు కొంచెం కోపం కూడా వచ్చింది. సింధు నాదగ్గరికి వచ్చింది. తన గుండ్రమైన కళ్ళు ఒక ఆశతో నిండి ఇంకా పెద్దగా, గుండ్రంగా  కనిపిస్తున్నాయి. అది ఏమడుగుతుందా అని మేమందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. మా అందరికీ ఎక్సైటింగ్ గా ఉంది.

" నాన్నా! నేను ఈ ఆదివారం జుట్టు తీయించుకుంటాను. గుండు చేయించుకుంటాను." అని అంది సింధు. మేమందరం షాక్ అయ్యాం. " ఇంటి ఆడపిల్ల జుట్టు తీయించుకోవటమా? కుదరనే కుదరదు." అరిచింది నా భార్య. "ఈ దారుణం మన ఇంటా వంటా లేదు. టీవీ చూసి చూసి ఈ పిల్ల ఇలా తయారయింది, మన ఆచారాలు, సంప్రదాయాలు మంటగలుపుతోంది." మా అమ్మ కంగారు.

"సింధు, ఎందుకు అలా అంటున్నావు? ఇంకోటేదైనా కోరుకో. మేము నిన్ను జుట్టు లేకుందా చూడలేమమ్మా...మమ్మల్ని అర్ధం చేసుకొ. " బాధగా అన్నాను నేను. "నాన్నా! నేను ఇష్టం లేకపోయినా ఆ పెరుగన్నం ఎంత కష్టపడుతూ తిన్నానో చూసావు కదా  నాన్నా.....నువ్వే కదా, ఆ అన్నం తింటే నేను అడిగినది ఇస్తాను అన్నావు. ఇప్పుడు మాట తప్పుతావా? నువ్వే కదా నాన్నా, నాకు హరిశ్చంద్రుడి కథ చెప్పావు. ఎన్ని కష్టాలు పడినా చేసిన ప్రమాణం నిలుపుకోవడమే కదా నాన్నా అందులో నీతి?" అని అడిగింది. "సరేనమ్మా! నేను కూడా నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను." ధృఢంగా పలికాను. "మీకేమైనా మతి పోయిందా, చిన్న పిల్ల ఏదో అడిగితే చేయడమేమిటి" నా భార్య, అమ్మ ఒకేసారి  అరిచారు.

"లేదు, ఇప్పుడు మాట మారిస్తే, అది ఎప్పుడూ మనలను నమ్మదు. సింధు, నీ కోరిక తప్పకుండా తీరుతుంది." ఆదివారం జుట్టు తీయించాక, అసలే గుండ్రంగా ఉండే సింధు మొహం జుట్టులేకుందా మరింత గుండ్రంగా, అందులో పెద్ద పెద్ద కళ్ళతో ఇంకా ముద్దొస్తోంది.

మరునాడు  సోమవారం ఉదయం సింధును స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని వెళ్ళాను. తను నాకు బై చెప్పి, క్లాస్ లోకి వెళ్తోంది. వెనుక నుంచి ఒక అబ్బాయి గొంతు. " సింధుజా, నేను కూడా వస్తున్నా ఆగు!" అంటూ. నేను వెనుకకు తిరిగి చూసాను. తలమీద ఒక్క వెంట్రుక కూడా లేకుండా ఒక అబ్బాయి. "ఓహో! ఇదా కారణం!" అనుకున్నాను. ఆ కారులోంచి ఒక మహిళ దిగి నాదగ్గరికి వచ్చింది. "మీ అమ్మాయి సింధుజ చాలా గొప్ప హృదయం కలది. తనతో పాటు ఉన్నవాడు మా అబ్బాయి. అతను లుకేమియా తో బాధపడుతున్నాడు." ఆమె తన దు:ఖం దాచుకోవడానికి అన్నట్టు కొంతసేపు ఆగింది.

"మా అబ్బాయి అనారొగ్యం కారణంగా క్రిందటి నెల అంతాస్కూలుకి రాలేదు. కీమోథెరపీల వల్ల అతని జుట్టు అంతా రాలిపోయింది. తోటివారు ఏడిపిస్తారనే భయంతో తను స్కూలుకి రావడానికి ఇష్టపడటం లేదు. మీ అమ్మాయి క్రిందటి వారం మా ఇంటికి హరీష్ ని చూడడానికి వచ్చింది. మా బాబు సంగతి తను చూసుకుంటాను అని, నన్ను బెంగపడవద్దని చెప్పింది."

అయితే, మా అబ్బాయి బాధపడకుండా ఉండటం కోసం, అంత అందమైన జుట్టుని త్యాగం చేస్తుంది అని నేను ఊహించలేకపోయాను. అంత నిర్మలమైన హృదయం కలిగిన బిడ్డను కన్నారు.మీరు మీ భార్య అదృష్టవంతులు."

నేనేమీ మాట్లాడలేకపోయాను. కళ్ళల్లో నీళ్ళతో వెళుతున్న నాకూతురివైపు అలాగే చూస్తూ ఉండిపోయాను. చిట్టితల్లీ, నిస్వార్ధమైన ప్రేమ అంటే ఏంటో నువ్వు నాకు చెప్పావు తల్లీ!...

ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఉండేవారెవరు అంటే, తనకున్న దాంట్లో జీవించేవారు కాదు, పరులకోసం జీవించేవారు.......


************

ఒకసారి బుధ్ధుడు తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇంటలో ఒక శిష్యుడిని పిలిచి, "నాయనా, దాహంగా ఉంది, ఆ కనబడే చెరువునుంచి కొన్ని నీళ్ళు తీసుకురా" అని చెప్పాడు. అప్పుడే ఒక ఎద్దులబండి ఆ చెరువులోంచి వెళ్ళడం మూలంగా నీరు అంతా మురికిగా తయారయింది. శిష్యుడు ఆ నీరు తేరుకొనేంతవరకు అలాగే కూర్చున్నాడు. అరగంట సమయం గడిచింది. చూస్తే నీరు ఇంకా మురికిగానే ఉంది. మరో అరగంట సమయం వేచి చూసాడు. నీరు తేరుకున్నాయి. ఆ పైన ఉన్న నీరు తీసుకెళ్ళి బుధ్ధుడికి ఇచ్చాడు శిష్యుడు. అప్పుడు బుధ్ధుడు, శిష్యునితో, " ఈ నీరు అంత మురికిగా ఉన్నా, ఎలా తేరుకుండి? నువ్వు కాసేపు దాని మానాన దాన్ని కదపకుండా ఉంచావు. అది నెమ్మదిగా మురికి కిందకుపోయి, స్వచ్చమైన నీరు పైకి తేరుకుంది. మన మనసు కూడా అంతే. ఒకసారి మనసులో ఆందోళన కలిగినపుడు దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా కొంతసేపు వదిలేయాలి. కొంతసేపు గడిచేటప్పటికి చింత అనే మురికి అంతా అడుగుకు వెళ్ళీపోయి, మనసు స్వచ్చంగా మారుతుంది. నీ మనసు తేలిక అవ్వడానికి నువ్వు ఏ ప్రయత్నమూ చేయవలసిన పనిలేదు. కొంతసేపు అలా వదిలేస్తే, దానంతట అదే సద్దుమణుగుతుంది. చక్కబడుతుంది. మనశ్శాంతి పొందడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. మన ప్రయత్నం లేకుందానే జరిగిపోతుంది."

మీకు ఇష్టమైన వాళ్లను ఎప్పుడూ వదులుకోకండి. వారు తప్పులు చేసారు అనుకుంటే, ఒక్క క్షణం వారితో మీరు గడిపిన అద్భుతమైన, ఆనందకరమైన క్షాణాల గురించి ఒక్కసారి తలుచుకోండి. ఎందుకంటే, పరిపక్వత కన్నా, అభిమానం ముఖ్యం. మిమ్మల్ని మీరు కౌగలించుకోలేరు. మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి.

జీవితం అంటే ఒకరి కొసమ ఒకరు బ్రతకటమే. మీకు ఇష్టమైన వారి కోసం, మిమ్మల్ని ప్రేమించేవారికోసం బ్రతకండి. స్నేహం, ప్రేమ , బంధుత్వాలు అనేవి డబ్బు భాష మాట్లాడే వారికి అర్ధం కావు. ఎందుకంటే కొన్ని పెట్టుబడులు మనకు కనిపించే లాభాలను ఇవ్వలేకపోవచ్చు, కాని మనలను సంపన్నుల్ని చేస్తాయి.కుటుంబం, స్నేహితులు అలాంటి గొప్ప పెట్టుబడులు.....

************
ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 1
మనలో చాలామందికి ఆదాయానికి తగ్గ పొదుపు, మదుపు ఉండదు. ఎంత పెద్ద ఉద్యోగమైనా సరే, ఎంత పెద్ద జీతమైనా సరే, అదే సమయంలో చిన్న చిన్న జీతగాళ్ళు కూడా సౌకర్యవంతంగా బ్రతుకుతున్నారు అనిపిస్తుంది ఒక్కోసారి. పెరిగే ధరలతో, రోజురోజుకీ మార్కెట్లో వచ్చే ఆకర్షణలతో, ఆదాయానికి, వ్యయానికి పొంతన కుదరడంలేదు. ఫలితం అప్పులు. ఇక్కడ వారెన్ బఫెట్ చెప్పిన సూత్రం గుర్తు తెచ్చుకోవాలి. ముందు పొదుపు, తరువాతే ఖర్చులు అని చెప్తారు ఆయన. ప్రతినెలా జీతం రాగానే, ఎంతో కొంత పొదుపు చేసి, ఆ తరువాతే మన ఖర్చుల గురించి ఆలోచించాలి. నెలకు 500 లేద 200 తో మొదలుపెట్టినా, ఆ పొదుపు రాబోయే రోజుల్లో పెద్ద మొత్తం అవుతుంది.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 2
ఆదాయానికి, ఖర్చుకి పొంతన కుదరడం లేదు అనుకున్నప్పుడు, తెలియకుండానే అనవసర ఖర్చులు పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు, ముందు మనం పెట్టే ఖర్చులకు ఒక జాబితా తయారుచేసుకోవాలి. ఏ ఒక్క చిన్న ఖర్చునూ వదలకుండా చిట్టా తయారుచెయ్యాలి. ఎక్కడెక్కడ, ఎప్పుడెప్పుడు అనవసర ఖర్చులు చేస్తున్నామో దీనివల్ల తెలుస్తుంది. వాటిని తగ్గించుకుంటే పొదుపు చేసే సొమ్ము పెరుగుతుంది. వ్యక్తిగత బడ్జెట్ వ్రాసుకోవటం మొదట్లో కష్టంగా, విసుగ్గా అనిపించినా, దీర్ఘకాలంలో దాని ప్రభావం తెలుస్తుంది. ఖర్చులను అదుపు చేసుకోవడం తెలుస్తుంది.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 3
ఇంటి అద్దె, వెచ్చాలు, పిల్లల ఫీజులు, కొన్న వస్తువుల వాయిదాలు ఇటువంటివి ప్రతినెలా తప్పని ఖర్చులు. వైద్య ఖర్చులు, తీర్థయాత్రలు, పండుగలు, సినిమాలు, రెస్టారెంట్లు ఇటువంటివి రెండో కోవకి చెందినవి. ఇవి ప్రతినెలా ఉండవు కానీ, అప్పుడప్పుడు పలకరించి పోతాయి. ఇందులొ వైద్యఖర్చులు తప్పించుకోలేము కానీ, మిగతావి తప్పించుకునే వీలు ఉంటుంది. మూడో రకం ఖర్చులు అనుకోకుండా వచ్చే చుట్టాలు, శుభకార్యాలు వంటివి. ఈ రకం ఖర్చులకు రిజర్వ్ గా కొంత డబ్బు పెట్టుకోవడం మంచిది. లేదంటే, వాటికోసం అప్పులు చేయవలసివస్తుంది. మొదటి రకం ఖర్చులకు చెల్లించగా, మూడవ రకం ఖర్చులకు ప్రక్కకు తీసి పెట్టుకోగా మిగిలిన డబ్బులో ఇంకా కొంచెం పొదుపు చేసి, మిగిలిన సొమ్ములో రెండవ రకం ఖర్చులకు ఖర్చుపెట్టుకోవాలి.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 4
మొదట్లో కొంచెం కష్టం అయినప్పటికీ, అనవసర ఖర్చులు తగ్గించుకుని, చేతికొచ్చే ఆదాయంలో కనీసం 10 నుంచి 15 శాతం పొదుపు చేయగలగాలి. ఇదివరకే పొదుపు చేస్తున్నవారు దాని శాతాన్ని మరికొంచెం పెంచుకునే ప్రయత్నం చేయండి. పొదుపు చేస్తున్న సొమ్ములో 20-25 శాతం పిల్లల చదువు, పెళ్ళిళ్ళు వంటి దీర్ఘకాల లక్ష్యాలకు, 25-30 శాతం స్వల్పకాలిక లక్ష్యాలకు మిగిలిన 45-55 శాతం మలి వయసు ఖర్చులకు,సొంత ఇల్లు వంటి లక్ష్యాలకు పొదుపు చేయాలి.

ఖర్చులు తగ్గించుకోవడం ఎలా??? 5.
మహిళలు సాధారణంగా చేసే అనవసర ఖర్చులు...చీరలు, ఆర్టిఫిషియల్ నగలు, షాపింగ్, స్టీలు సామాను, ఇంటికి కావలసిన సామాను. ఇంక మగవారు చేసే ఖర్చులు, సిగరెట్లు వంటి అలవాట్లు, ఫర్నిచర్, సినిమాలు, రెస్టారెంట్లు, ఎలెక్ట్రానిక్ గాడ్జెట్స్ వంటివి. వీటిలో కొంచెం నిదానంగా ఆలోచిస్తే, ఎక్కువ అనవసర ఖర్చులే ఉంటాయి. అంటే అది ఆరోజు కొనకపోయినా పెద్ద నష్టమేమి ఉండదు. అలాంటిఖర్చులు తగ్గించుకుంటే మంచిది. కొన్ని షాపుల్లో సరుకులు ఎక్కువ మొత్థంలో కొంటే కొంత డిస్కౌంట్ ఇస్తారు. పాడవని సరుకులు అలా తీసుకోవచ్చు. ఇంక ఇంట్లో వాడే విద్యుత్ విషయంలో ఆదా చేయ్యవచ్చు. ఇలా ఆలోచించడం మొదలుపెడితే, చినుకు చినుకు కలిసి వరద అయినట్టు, రూపాయి, రూపాయి కలిసి పెద్ద మొత్తం లో పొదుపు అవుతుంది.

Friday, 4 September 2015

సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని పాడుకున్న సంస్కృతి మనది. రాజ్యం అంటే రామ రాజ్యం, కొడుకు అంటే రాముడిలా ఉండాలి, ప్రభువు అంటే రాముడిలా ఉండాలి, అని నమ్మే సంప్రదాయం. ఆఖరికి ఎవరి మంచితనాన్నైనా చెప్పవలసి వచ్చినప్పుడు, రాముడు మంచి బాలుడు అనే చెప్తాము. ప్రతి భారత యువతీ రాముని లాంటి భర్తనే కోరుకుంటుంది. విష్ణువు యొక్క ఎన్నో అవతారాలు ఉన్నా, కష్టం వచ్చినప్పుడు " రామా! ఎక్కడున్నావయ్యా ? " అనో, " రామచంద్ర ప్రభూ" అనో రాముణ్ణే స్మరిస్తాము. ఇక సీతమ్మవారి విషయానికి వస్తే, సహనానికి మారుపేరు సీతమ్మ, భర్తను ప్రేమించడానికి, భర్త అడుగుజాడల్లో నడవడానికి, భర్త కోసం, రాజ్యాన్ని, సంపదనూ తృణప్రాయంగా వదిలేసిన మహాసాధ్వి ఆమె. భారత స్త్రీలందరకూ ఆమె ఆదర్శం. మరి ఈరోజున ఈ తరం వారందరూ "రాముడు సీతమ్మకు ఏమి చేసాడు? కడుపుతో ఉన్న భార్యని అడవులకు పంపడమేనా? శీలపరీక్ష కోసం అగ్నిలో ప్రవేశపెట్టడమేనా? మహాసాధ్విని అనుమానించడమేనా ఆయన గొప్పతనం? ఒక చాకలి వాని మాట పట్టుకుని భార్యను అనుమానించాడే?" ఇటువంటి మాటలు క్రిందటి తరం నుంచి వినబడబట్టి కదా, నేడు ఈ తరంలో భారతీయ వివాహ వ్యవస్థ ముక్కలైపోతోంది!
రాముడు శ్రీ మహావిష్ణు అవతారం అని అందరికీ తెలిసినదే...అవతారం అనగా లోకంలో చెడు పెచ్చుమీరినప్పుడు, భగవంతుడు ఆయా కాలాలకు అనుగుణంగా రూపం ధరించి, ఆ చెడును అంతమొందించడానికి పూనుకుంటాడు. ఇక్కడ రావణుడు, మహాశివభక్తుడు. అత్యంత ధైర్యశాలి. ప్రజలు ఆరాధించే ప్రభువు. శక్తిసంపన్నుడు. అటువంటివాడి దగ్గర పరస్త్రీ వ్యామోహం అనే ఒక దుర్గుణం ఉంది. పైగా, నరులు, వానరులు తప్ప మరెవ్వరి వలన చావు రాకూడదు అని వరం పొందినవాడు. అందువలన భగవానుడు నరుని అవతారం ఎత్తాలి. అన్ని నీతినియమాలు ఉన్న రావణునితో యుద్ధం రావాలి అంటే, అతను ఏదో ఒక తప్పు చేయ్యాలి. అది అతని బలహీనత కారణంగా సీతమ్మవారిని ఎత్తుకెళ్ళాలి. వానరుల వలన కూడా చావు రాకుండా కోరుకున్నాడు కాబట్టి ఈ క్రతువులో వానరులు కూడా భాగం పంచుకోవాలి. రావణుడు సీతాసాధ్విని ఎత్తుకెళ్ళాలంటే రాజభవనం లో ఉంటే కుదరదు. ఆవిడ ఏకాంతంగా ఉండాలి. అందుకే వనవాసం. అందుకు కైకమ్మ వరాల ప్రహసనం. మామూలుగా దశరథుడు అనుకున్నట్టు రాజ్యాభిషేకం జరిగిపోతే, ఇవన్నీ జరగవు. రాజ్యాభిషేకం తెల్లారి అనగా కైక భర్తను వరాలు అడుగుతుంది. ఇంకా ముందు అడిగి ఉంటే, సమయం ఎక్కువ దొరుకుతుంది కాబట్టి, రాజ్యాభిషేకం ఎలాగో అలాగ జరిగిపోయి ఉండేది. లేదా, రాముణ్ణి చిన్నతనం నుంచి పెంచిన ప్రేమ కారణంగా తన మనసే మారిపోయి ఉండేది. అలా జరిగినప్పుడు అవతార లక్ష్యం నెరవేరదు. అయోధ్యా ప్రభువైన దశరథునికి ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా కైక సమయం మించిపోయిన తరువాత దశరథుణ్ణి వరం అడిగి మారుమాట్లాడకుండా దిగ్బంధనం చేసింది. పాపం ఈ అవతార లీలలో తన వంతు పాత్ర పోషించినప్పటికీ, మొత్తం రామాయణంలో చెడ్డపేరు మిగిలినది కైకమ్మకే. రాముడు సీతమ్మను శీలపరీక్ష కోరినది కూడా ఒక భర్తగా కాదు. ఒక ప్రభువుగా. ఈరోజు తాను ధర్మ ప్రకారం నడుచుకుంటే, రేపు ప్రజలకు తీర్పు చెప్పగలడు. శిక్షలు విధించగలడు. ఈరోజు ధర్మం తప్పితే, రేపు ప్రజలే ప్రశ్నిస్తారు. ఆ అవకాసం ప్రభువన్నవాడు ప్రజలకు ఇవ్వకూడదు. ప్రభువు ఎట్టి పరిస్థితులలోనూ ధర్మం వీడకూడదు. తన భార్య, సహధర్మచారిణి, ఎటువంటి తప్పు చేయదని ఆయనకు తెలుసు. ఆ మాట అగ్నిహోత్రుడంతటివాడు చెప్తే ఆ మాటకు విలువ ఎక్కువ. అందుకనే ఆమె మీద ఉన్న నమ్మకం కారణంగానే, అగ్ని ప్రవేశం చేసినప్పటికీ ఆమె సురక్షితంగా ఇవతలికి రాగలదు అన్న నమ్మకంతోనే రాముడు కేవలం ప్రజల తృప్తి కోసం, తన ధర్మాచరణ కోసం సీతను అగ్ని పరీక్షను కోరాడు. తన భర్త తన శీలపరీక్షను కోరినప్పుడు కాని, గర్భిణిగా ఉన్న సమయములో అడవులకు పంపినప్పుడు కానీ, సీతమ్మ మారుమాట్లాడలేదు. గంగా నది ఒడ్డున సీతారోదనం విన్న భూదేవి రాముడిని శపించబోతే, నన్నేమైనా అను కానీ రాముడిని మాట్రం ఏదైనా అంటే సహించను అని సమాధానం ఇస్తుంది. ఆమెకు లేని అభ్యంతరం మనకెందుకండీ? ఏదో వితండవాదం చేయటం తప్ప. మన ఇతిహాసాలు, గ్రంధాలు, ఎప్పుడూ మన మంచిని కోరే వ్రాయబడినాయి. వాటిని నమ్మి ఆచరించిన రోజున మన ధర్మం నిలుస్తుంది. "ధర్మో రక్షతి రక్షిత:" అనే వాక్యానికి అర్ధం ఇదే..ధర్మాచరణ తప్పిననాడు మానవుడు అధోగతి పాలవుతాడు. అటువంటి వ్యక్తులతో కూడిన సమాజం కూడా నాశనమైపోతుంది.
జీవితాన్ని సరిదిద్దుకునేందుకు తగిన మార్గాన్ని చూపించేదే "ధర్మం." మనిషి ధర్మబధ్ధంగా ఎలా జీవించాలో చూపేందుకే భగవంతుడు, రాముని రూపంలో మానవునిగా అవతరించాడు. తండ్రిపట్ల కుమారుల కర్తవ్యం, సోదరుల పట్ల అగ్రజుని ప్రేమాతిశయాలు, భార్య పట్ల ఒక భర్త వ్యవహరించవలసిన తీరు, అన్నిటినీ మించి, ఒక ప్రభువు ప్రజలను పాలించవలసిన పధ్ధతినీ, అంతేకాక, బలవంతుడైన, గుణవంతుడైన ఒక శత్రువుతో ఎలా మెలగాలో కూడా శ్రీరాముడు ఆచరించి చూపాడు. కనుకనే రామాయణం--రాముడు నడచిన మార్గం మనకు మార్గదర్శకమైంది. ఎన్ని శతాబ్దాలు గడిచినా మాయని, మరపురాని ధర్మసూక్ష్మాలను రాముడు మనకోసం వదిలివెళ్ళాడు. ఆ మాటలతో తరించి, ఆ బాటలో నడిచి, మన జీవితాలకు ధన్యత చేకూర్చుకుందాం...
జై శ్రీ రాం.
భగవంతుడిని మనం ఫలానా కావాలి అని కోరుకోకూడదు. ముఖ్యంగా ధనం కావాలి అని అస్సలు కోరుకోకూడదు. కావలసినంతడబ్బు ఉండీ, అది మన దగ్గర నిలవక పోతే? లేదా, డబ్బు ఒక పరిమితిని మించి ఉండీ, మనకు దానిని అనుభవించే ఆరోగ్యం లేకపోతే? లేదా, ఆ డబ్బు వలన మనకు శతృ బాధలు కలిగితే? లేదా పిల్లలు డబ్బు ఎక్కువై, చెడుమార్గాలు పడితే? ఆ డబ్బు కారణంగా అన్నదమ్ములతోనూ, ఇతర బంధువులతోనూ గొడవలు వస్తే? గృహంలో అశాంతి పెరిగితే? ఎంత డబ్బు , అధికారం ఉన్నప్పటికీ ఒక్కోసారి పట్టెడన్నం దొరకక బాధపడతాం. కంటినిండా కునుకు లేక బాధపడతాం. మనశ్శాంతి కోల్పోతాం. అందుకే భగవంతుడిని ఎప్పుడూ సుఖమయమైన, సౌకర్యవంతమైన, సంతృప్తి కలిగిన జీవితాన్ని కోరుకోవాలి. మనం తినడమే కాకుండా, పదిమందికి సహాయం చేయగల బుధ్ధిని, వీలునీ కల్పించమని వేడుకోవాలి. అనాయాస మరణం కోరుకోవాలి. బ్రతికినన్నాళ్ళూ ఒకరి దగ్గర చేయి చాచకుండా బ్రతికే వరాన్ని కోరుకోవాలి. కష్టాల్లో మనలను ఓదార్చే పదిమంది స్నేహితులను, మన సంతోషంలో పాలుపంచుకుని, మన అభివృధ్ధికి ఆనందించే ఇరుగుపొరుగును, బంధువర్గాన్నీ కోరుకోవాలి. ఎప్పుడూ ధర్మం తప్పకుండా నడవగలిగే ఆత్మస్థైర్యాన్ని కోరుకోవాలి. ధర్మ మార్గాన నడిచేవారికి భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు.

అందరికీ శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు...

యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం....

ధర్మానికి ముప్పు ఏర్పడినప్పుడు తాను అవతరించి ధర్మ రక్షణ చేస్తానని విష్ణువు  చెప్పాడు. తను ఇచ్చిన మాట ప్రకారేమే, ధర్మానికి హాని కలిగినప్పుడల్లా వివిధ అవతారాలు ఎత్తి జ్ఞానులను, యోగులను, శిష్టులను రక్షించాడు. ఒక ప్రయోజనాన్ని ఆశించి ఎత్తిన అంశావతారాలు కొన్ని అయితే, సంపూర్ణ జీవితాన్ని (జననం, మరణం) అనుభవించిన అవతారాలు రెండే రెండు. ఒకటి శ్రీరామావతారం, రెండు శ్రీ కృష్ణావతారం.

కృష్ణుడు ఒక సాధారణ మానవునిలా జన్మనెత్తి, అలాగే పెరిగాడు. ఈక్రమంలో దుష్టశిక్షణకై ఎన్నో కార్యాలు చేసాడు. ఎన్నో లీలలు చేసాడు. వెన్న తిన్నాడు, మన్ను తిన్నాడు, సర్పాలపై నాట్యం చేసాడు. గోపికల ఇళ్ళల్లో కుండలు పగలకొట్టాడు. అత్తకు, కోడలికి తగవులు పెట్టాడు. తన ప్రాణాలను హరించుటకై రకరకాల రూపాల్లో వచ్చిన రాక్షసులను సమ్హరించాడు. గోపికల చీరలు ఎత్తుకెళ్ళాడు.  చివరకు దూర్వాస ముని శాపానికి గురై సాధారణ మానవుని లాగే అవతార సమాప్తి గావించాడు. ఇవన్నీ పైకి అల్లరిచేష్టలుగా కనపడినా, వాటి వెనుక ఎంతో లోతైన అంతరార్ధం ఉంది.

కొంచెం పెరిగిన తరువాత, తనను ఎంతగానో ప్రేమించిన రుక్మిణిని పెండ్లి చేసుకొన్నాడు. ద్రౌపది మానసమ్రక్షణ చేసాడు. రాధతోకలిసి పరిపూర్ణ ప్రేమకు అర్ధంగా నిలిచాడు. పాండవుల పక్షాన నిలిచి అర్జునుని రథసారథియై కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి మార్గదర్శి అయ్యాడు. యుధ్ధక్షేత్రంలో దౌర్బల్యం ఆవహించిన అర్జునునకు గీతోపదేశం చేసి ఆచార్యుడైనాడు. . ఈరోజున ప్రపంచాన్ని నడుపుతున్నదీ, ప్రపంచ ప్రజలకు ఆలంబనగా నిలుస్తున్నదీ ఆ భగవద్గీతే....అష్టభార్యలు, 16 వేల మంది గోపికలు ఇంతమంది ఉన్నా ఎన్నడూ స్థితప్రజ్ఞునిగానే వ్యవహరించాడు. పాండవులు, కౌరవులు-అన్నదమ్ముల మధ్య అంత భీకర యుధ్ధం జరిగినా, ధర్మ పక్షపాతియై, తామరాకు మీద నీటిబొట్టులా నిలిచాడు. ధర్మం ఉన్నచోటే తానూ ఉంటానని లోకానికి చాటి చెప్పాడు. అసలైన సిసలైన వ్యక్తిత్వానికి గొప్ప ఉదాహరణ శ్రీకృష్ణుడు. ఆకృఇష్ణ  చరితామృతమును పఠించి, ఆయన బోధనలను అర్ధం చేసుకున్నప్పుడే మానవాళికి నిజమైన కృష్ణాష్టమి.

ఈపండుగ నాడు పగలు ఉపవసించి, సాయంత్రం కృష్ణ పూజ చేసి, చిన్ని కృష్ణుని ఊయలలో ఊపుతారు. వెన్న, అటుకులు మొదలైనవి నైవేద్యం పెడతారు. ఈ పూజ చేసుకున్నవారికి అన్నిటా జయం లభిస్తుందని పురాణోక్తి.