కోరికలు దు:ఖానికి హేతువులు....మహనీయులు చెప్పిన ఈ మాటలు అక్షరసత్యాలు. దేనిమీద అయితే కోరిక కలిగి ఉన్నామో దానిని సాధించలేనపుడు దు:ఖం వస్తుంది. అది ఆగ్రహం గా మారుతుంది. మనిషి ధర్మాధర్మ విచక్షణ కోల్పోతాడు. ఆక్షణంలో మరిన్ని తప్పులు చేస్తాడు. భగవద్గీతలో భగవానుడు బోధించినది కూడా ఇదే. కోరికలను జయించాలంటే జ్ఞానం కలిగి ఉండాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే అరిషడ్వర్గాలు జ్ఞాన సముపార్జనకు అడ్డంకులు అవుతాయి. కనుక ముందుగా అరిషడ్వర్గాలను జయించగలగాలి. అట్టి స్థితిని సాధించిన వారు జ్ఞాన సంపన్నులవుతారు. యుక్తాయుక్త విచక్షణ కలిగిఉండాలి. ఏది ఎంతవరకు మనకు అవసరమో గ్రహించగలిగి ఉండాలి. పరుల సొమ్మును ఆశించకూడదు. పరుల సొమ్ముపై మనకు హక్కు ఎందుకు ఉంటుంది? మనకు లభించిన దానితో సంతృప్తి చెందే లక్షణం అలవాటు చేసుకోవాలి... సంతృప్తి ఉన్న చోట ఆశలకు, కోరికలకు, స్థానం లేదు. ప్రశాంతమైన జీవితం గడపడానికి మార్గం ఇదే.
Thursday, 24 December 2015
సర్వేత్ర సుఖిన:స్సంతు , సర్వేస్సంతు నిరామయా, సర్వేభద్రాణి పశ్యంతు, మాకశ్చిద్దు:ఖమాప్నుయాత్....అందరూ సుఖంగా, ఆరోగ్యంగా, ఉండాలి, ఎవ్వరూ దు:ఖానికి లోను కాకూడదు అని భావించే గొప్ప బారతీయ సంస్కృతి మనది. సర్వజీవుల లోనూ భగవంతుడున్నాడని, కనుక ప్రతి ప్రాణినీ ప్రేమించాలని, ఏచిన్న ప్రాణికీ కీడు తలపెట్టరాదనీ బోధించాయి మన శాస్త్రాలు. దీనుల యెడ కరుణ కలిగి ఉండాలని, మానవసేవయే మాధవ సేవ అని కూడా మన సంస్కృతి మనకు చెప్తుంది. దయ, కరుణ కలిగిన వారు పరుల దు:ఖాలలో పాలుపంచుకుంటారు. భగవంతుడు మనలను సృష్టించినప్పుడు ఎంతో నిష్కల్మషంగా ఈ భూమి మీదకు పంపాడు. కానీ,మనం ఎదుగుతున్న క్రమంలో మానవతను కోల్పోతున్నాం...హృదయాలను పాషాణాలుగా మార్చేసుకుంటున్నాం. మనకు తరతరాలనుండీ వస్తున్న ఆస్థి మన పురాణాలు, ధర్మ శాస్త్రాలు. వాటిని నిర్లక్ష్యం చేయడం వలన మన సంస్కృతి గురించి మనం తెలుసుకోలేకపోతున్నాం. మన ఆదర్శదైవం శ్రీరాముడు 16 కళలతో విలసిల్లిన పూర్ణపురుషుడు. కరుణారస సాగరుడు. రామసేతు నిర్మాణంలో పాలుపంచుకున్న ఉడుత వంటి చిన్నప్రాణిని సైతం దయతో అనుగ్రహించాడు. ఇక శ్రీకృష్ణుడు ఎన్ని రకాలుగా దీనజనులను ఆదరించాడో లెక్కేలేదు..కుబ్జ, కుచేలుడు, వీరందరినీ కరుణతో బ్రోచినవాడు మాధవుడు. ఇంకా బలి, శిబి చక్రవర్తి, మనకు కరుణ, దయ గురించి తమ ప్రవర్తనల ద్వారా నేర్పించారు. ఈ కాలానికి వస్తే, క్రీస్తు, గాంధీజీ, రమణమహర్షివంటివారు దీనజన సేవను చేసి చూపించి మనకు ఆదర్శమూర్తులైనారు. అసహాయులను ఆదరించడంలో గొప్ప తృప్తి ఉంది. మనకు ఎంతో అదృష్టం ఉంటేనేకాని, దీనజన సేవాభాగ్యం లభించదు..అటువంటి సేవా అవకాశాల్ని లభించేలా చేయమని ప్రార్ధించడమే మానవజన్మకు సార్ధకత నిస్తుంది.
కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు...సాధించాలనే పట్టుదల, సత్సంకల్పం, అవిరామమైన కృషి ఉన్నప్పుడు విజయం తప్పక సిద్ధిస్తుంది..కార్యోన్ముఖులైనవారు మార్గమధ్యంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా కృంగిపోక తమ కృషిని కొనసాగిస్తారు....పరాజయం పాలైనా మరల మరల తమ ప్రయత్నాన్ని కొనసాగించే ధీరులను మాత్రమే విజయం వరిస్తుంది. ఈనాడు పేరుప్రఖ్యాతులు పొందినవారంతా వారి వారి రంగాలలో అవిరళ కృషిచేసిన ఫలితంగానే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం సాధించడానికి సంకల్పం, కృషితోపాటు దైవబలం కూడా అత్యవసరం....దైవకృపను పొందడానికి దర్మాచరణ ఒక్కటే మార్గం....దర్మమార్గం ద్వారా సాధించే విజయం శాశ్వతం గా నిలబడుతుంది...అర్జునుని వలే లక్ష్యం మీదనే చెడని ఏకాగ్రతతో దృష్టి నిలిపిన సాహసులే విజయానికి అర్హులు అని శాస్త్రవచనం.
Wednesday, 23 December 2015
ఎల్లప్పుడూ పెదవుల మీద చిరునవ్వుతో కనిపించేవాళ్ళు అందరి మనసులలో స్థానం సంపాదించుకుంటారు. ధర్మబధ్ధమైన జీవితం గడిపేవారిలో ఒక అలౌకికానందం వెల్లివిరుస్తుంటుంది. ఆ ప్రసన్నత , ఆ ఆనందం యొక్క కాంతి వారి వదనంపై ప్రతిఫలిస్తుంది. ఇటువంటి ఆనందం కలిగిన వెంటనే వారిలోని విరుధ్ధభావాలు తొలగిపోతాయి. పొరుగువారిని ప్రేమించే లక్షణం అలవడుతుంది. పాపకర్మలు చేయడం, ప్రాయశ్చిత్తం చేసుకోవడం అవసరం లేని ప్రశాంత జీవనం అలవాటు అవుతుంది. మనసా, వాచా, కర్మణా పాపకర్మలు చేయకుండా నియంత్రించుకోగలిగే సామర్థ్యం పట్టుబడుతుంది. నిర్మలమైన అంత:కరణ కన్నా మించిన జ్ఞాన సంపద మరొకటిలేదు... ఈ స్థితిని పొందినవారందరూ ముముక్షువులే....ఇది ఒక మహాయోగం,....ఇది సాధించినవారందరూ యోగసాధకులే....
లక్ష్మిదేవి అనుగ్రహం పొందడానికి మనం ఎన్నెన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తూ ఉంటాం. అష్టలక్ష్మి రూపాల్లో పూజలు అందుకునే లక్ష్మీదేవి ధనం, ధాన్యం, పాడి, పంట, విద్య, విజ్ఞానం, సద్బుధ్ధి, చల్లని సంసారం, అన్యోన్య దాంపత్యం, సత్సంతానం, కడుపునిండా తిన్నదాన్ని జీర్ణం చేసుకోగల ఆరోగ్యం --=ఈ అన్నిటి రూపాల్లోనూ విలసిల్లుతోంది. కేవలం, డబ్బు, బంగారమే కాక, వీటిలో ఏ కొన్ని మనకు లభించినా ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకు లభించినట్టే. అన్నిటినీ మించి "నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేను సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నాను, అందుకు భగవంతుడికి సర్వదా నేను కృతజ్ఞుడను." అని ఎవరు సంతృప్తిగా ఉంటారో వారికి లక్ష్మీ కటాక్షం మిక్కిలిగా లభించినట్టు అర్ధం. ఈ ఆత్మతృప్తి ఉన్నచోటును లక్ష్మీదేవి వదిలిపోదుట. ఆమే అనుగ్రహం పొందాలంటే కొన్ని అర్హతలు సంపాదించవలసి ఉంటుంది. ప్రియభాషణం, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, ప్రేమాభిమానాలు, వాత్సల్యం, అతిథుల పట్ల ఆదరణ, మితభోజనం, మితనిద్ర, ఇవన్నీ ...గట్టి గట్టిగా అరచుకోవడం, అందరితో పోట్లాటలు పెట్టుకోవడం, ఇతరులను చులకనగా చూడడం, ఆత్మస్తుతి, పరనింద ఇవన్ని మన గౌరవాన్ని దెబ్బతీస్తాయి. అటువంటి చోట లక్ష్మి నివసించదు అని పెద్దలు చెపుతారు. పూజలు, నోములు చేయలేకపోయినా, పై మంచి లక్షణాలను అలవరచుకుంటే, కావలసినంత మన:తృప్తి, అఖండమైన లక్ష్మీకటాక్షం లభిస్తాయి.
Monday, 30 November 2015
మన జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఇందులో ఎన్నో స్టేషన్లు, ఎన్నో దారులు, కొన్ని ముచ్చట్లు, కొన్ని ప్రమోదాలు, కొన్ని ప్రమాదాలు... మనం పుట్టినప్పుడే ఈ జీవితరైలు ని ఎక్కుతాము. మన తల్లితండ్రులు మనకి టిక్కెట్టు కొని ఎక్కించారన్నమాట. వారు మనతో మన జీవితాంతం ఉంటారనుకొని మనం భ్రమపడతాం. కాని, మనలను ఒంటరిగా వదిలేసి, వారి సమయం వచ్చినపుడు వాళ్ళు రైలు దిగిపోతారు......ఇదంతా జరిగేలోపే మరికొంతమంది రైలు ఎక్కుతారు. అందులో కొంతమంది, మన తోబుట్టువులుగా, చుట్టాలుగా, స్నేహితులుగా, పిల్లలుగా గుర్తిస్తాం మనం....చాలామంది మన జీవితాలలో శాశ్వతమైన శూన్యాన్ని మిగిల్చి, వారు వారి గమ్యాలు వచ్చినపుడు రైలు దిగిపోతారు.... మరికొంతమంది, వారెప్పుడు ఖాళీ చేసారో కూడా మనం గుర్తించకుండానే వెళ్ళిపోతారు.... ఈ ప్రయాణంలో సంతోషం, దు:ఖం, ఆశ, నిరాశలు, పలకరింపులు, వీడ్కోళ్ళు, అన్ని కలగలిపి ఉంటాయి....తోటి ప్రయాణీకులతో సరదాగా ఉంటూ, వారికి అవసరమైన సహాయం చేస్తూ, ప్రేమగా, ఆదరణగా, వారికి సౌకర్యవంతంగా మెలిగినపుడు మన ప్రయాణం సాఫీగా జరిగింది అని చెప్పొచ్చు.... అటువంటి ప్రయాణీకులను అందరూ ప్రయాణమంతా గుర్తుపెట్టుకుంటారు కూడా...మన గమ్యం ఎంతసేపేట్లో వస్తుందో, ఎక్కడ మనం దిగిపోవాలో మనకు తెలియదు. ...ఇదే ఈ ప్రయాణంలోని రహస్యం..అందుకే మనం మనకు సాధ్యమైనంత సౌహార్ద్రత తో ప్రయాణించాలి......తోటి ప్రయాణీకులతో చిన్న చిన్న సర్దుబాట్లు, క్షమాపణలు---ఇవన్నీ తప్పనిసరి......మందగ్గరున్నది మనం పంచుకోవడం నేర్చుకోవాలి.....ఎందుకంటే, మనం వీడ్కోలు చెప్పవలసిన సమయం వచ్చినపుడు, మనం మన మధుర స్మృతులన్నిటినీ, వెనుక మిగిలిన వాళ్ళకు వదిలేసి, ఈ జీవితప్రయాణం లో సెలవు తీసుకుంటాం. ...మన జ్ఞాపకాలు మిగిలిన వారికి కూడా మధురంగా ఉండి, మనల్ని వారు గుర్తుపెట్టుకోవాలి కదా......
మనందరికీ తెలిసిన "టైటానిక్" షిప్ సముద్రంలో మునిగిపోయేటప్పుడు అక్కడ మరో మూడు నౌకలు ఉన్నాయట...అందులో ఒక నౌక పేరు శంప్సన్....ఇది టైటానిక్ కు కేవలం 7 మైళ్ళ దూరంలో ఉందిట. ప్రమాదం జరిగునప్పుడు నౌక సిబ్బంది ప్రమాదానికి సంకేతంగా వదులుతున్న తెల్లటి మంటలను ఈ నౌకలోని సిబ్బంది గుర్తించారు...అయినప్పటికీ వారు దొంగతనంగా సముద్రంలో వేట చేస్తున్నందువలన వారు దగ్గరలోనే ఉన్నప్పటికీ సహాయం చేయటానికి జంకారు...తమ నేరం ఎక్కడ బయటపడుతుందో అని...అందుకే టైటానిక్ లొని వారు గుర్తించకుండా సరిగ్గా దానికి వ్యతిరేకదిశలో వెళ్ళిపోయారు. ...ఇక అక్కడ ఉన్న రెండవ షిప్ "కాలిఫోర్నియ"14 మైళ్ళ దూరంలో ఉందిట..ఈ నౌక సిబ్బంది కూడా ప్రమాద సంకేతమైన తెల్లని మంటలను చూసినప్పటికీ, చుట్టూ మంచుగడ్డలు ఉండడం వలన, అక్కడికి చేరలేమేమోనని సంశయించి, రేపు తెల్లారాక చూద్దాములే అని వెళ్ళి పడుకున్నాడట ఆ నౌక కేప్టెన్.....ఇక అక్కడ ఉన్న మూడో నౌక 58 మైళ్ళ దూరంలో ఉన్న "కార్పతియా"...టైటానిక్ నుంచి వెలువడుతున్న ఆక్రందనలను రేడియో లో విని, ఎదో ప్రమాదం శంకించి ఆ నౌక కేప్టెన్ వెంటనే తనకు అక్కడికి వెళ్ళే దిశను, మార్గాన్ని చూపమని దేవుడిని ప్రార్ధించి, మంచు గడ్డలు అడ్డం వస్తున్నా సరే వాటిని నేర్పుగా తప్పించుకొని, టైటానిక్ వద్దకు చేరుకుని అందులో ప్రమాదంలో ఉన్న 705 మందిని రక్షించగలిగాడు.
ఇది నిజంగా జరిగినదా లేదా కల్పనా అనే విషయం పక్కన పెడితే, ఈ నౌకల కేప్టేన్ల మాదిరిగానే మనలో కూడా మూడు రకాలైన మనుషులు ఉన్నారు. మొదటిరకం, ఎవరు అవసరంలో ఉన్నాకాని, తమ పని తాము చూసుకునే రకం...రెండవవారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవులే, ఇప్పుడు ఎలా సహాయం చేయడం, ఇప్పుడు కుదరదు, ఇంకోసారి చూద్దాంలే, అనుకుని తమకు తామే సర్ది చెప్పుకుని, సమస్య నుంచి తప్పించుకునే రకాలు....ఇక మూడవ రకం వారు, ఎట్టి పరిస్థితులలోనైనా అడిగిన వారికి తప్పకుండా సాయం చేసేవారు. ఈ కథలో మూడవ నౌక కేప్టెన్, పని పూర్తి అయ్యాక, వెనక్కి తిరిగి తాను వచ్చిన దారిలో ఉన్న మంచు గడ్డలను చూసి, ఈ కార్యం సఫలం అయిందంటే తానొక్కడి వలన కాదని, కనిపించని భగవంతుడే నాకు చేయూత నిచ్చి, అంతమంది ప్రాణాలు కాపాడాడని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుని మీద భారం వేసి, తాను చెయదలచుకున్న మంచి పనిని ఏమాత్రం సంశయం లేకుండా చేయడానికి ముందుకు దూకే వారికి ప్రతీక ఈ నౌక కేప్టెన్. అలాగే ఉత్తములు తాము ఇతరులకు చేసిన సహాయాన్ని తమ ప్రతిభ అని చెప్పుకోకుండా, భగవంతుడే తమను ఈ కార్యానికి ఎన్నుకున్నాడు అని వినయంతో ఉంటారు, తమ వలన కొంతమందికి అవసరాలు తీరాయి అని సంతృప్తి పడతారు....
మనమేమి చేసినా, మనస్సాక్షి గమనిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మెళకువతో, జాగరూకతతో వ్యవహరించటమే....
ఇది నిజంగా జరిగినదా లేదా కల్పనా అనే విషయం పక్కన పెడితే, ఈ నౌకల కేప్టేన్ల మాదిరిగానే మనలో కూడా మూడు రకాలైన మనుషులు ఉన్నారు. మొదటిరకం, ఎవరు అవసరంలో ఉన్నాకాని, తమ పని తాము చూసుకునే రకం...రెండవవారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవులే, ఇప్పుడు ఎలా సహాయం చేయడం, ఇప్పుడు కుదరదు, ఇంకోసారి చూద్దాంలే, అనుకుని తమకు తామే సర్ది చెప్పుకుని, సమస్య నుంచి తప్పించుకునే రకాలు....ఇక మూడవ రకం వారు, ఎట్టి పరిస్థితులలోనైనా అడిగిన వారికి తప్పకుండా సాయం చేసేవారు. ఈ కథలో మూడవ నౌక కేప్టెన్, పని పూర్తి అయ్యాక, వెనక్కి తిరిగి తాను వచ్చిన దారిలో ఉన్న మంచు గడ్డలను చూసి, ఈ కార్యం సఫలం అయిందంటే తానొక్కడి వలన కాదని, కనిపించని భగవంతుడే నాకు చేయూత నిచ్చి, అంతమంది ప్రాణాలు కాపాడాడని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుని మీద భారం వేసి, తాను చెయదలచుకున్న మంచి పనిని ఏమాత్రం సంశయం లేకుండా చేయడానికి ముందుకు దూకే వారికి ప్రతీక ఈ నౌక కేప్టెన్. అలాగే ఉత్తములు తాము ఇతరులకు చేసిన సహాయాన్ని తమ ప్రతిభ అని చెప్పుకోకుండా, భగవంతుడే తమను ఈ కార్యానికి ఎన్నుకున్నాడు అని వినయంతో ఉంటారు, తమ వలన కొంతమందికి అవసరాలు తీరాయి అని సంతృప్తి పడతారు....
మనమేమి చేసినా, మనస్సాక్షి గమనిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మెళకువతో, జాగరూకతతో వ్యవహరించటమే....
Subscribe to:
Posts (Atom)






