Saturday, 10 May 2014

మా రోజుల్లో......
అప్పట్లో ఇంట్లో ఉన్న మగపిల్లలకి, ఆడపిల్లలకి ఇంటి పనుల పంపకం వేరు వేరుగా ఉండేది. ఆడపిల్లలు ఇంట్లో పనులు .. అంటే, అప్పుడు పెద్ద పెద్ద ఇండ్లు, పెద్ద పెద్ద లోగిళ్ళు, ఉండేవి కదా, తెల్లవారే లేచి ఆ పెరళ్ళు, వాకిళ్ళు ఊడ్చి , కల్లాపి జల్లి, ముగ్గులు వేయడం, బట్టలు ఉతకడం, ఇంటి పనిలో అమ్మకు , నానమ్మకు సహాయం చేయడం ఇవి ఆడపిల్లల పనులు. ఇంకా ముందు రోజుల్లో, ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ లేని రోజుల్లో కాలువలు, చెరువులకు వెళ్లి బట్టలు ఉతకడం, కాలువల నుండి మంచి నీరు తేవడం ఇటువంటివి. మగపిల్లలు అయితే ఇంట్లో బావి లేకపోతే ఇంటికి కావలసిన నీళ్ళు అన్ని కావిళ్ళు వేసుకొని ఇంటిలో ఉండే గుండిగ లలో నింపేవారు. గుండిగలు అంటే ఈ తరం వాళ్ళకి తెలియదు బహుశ.... ఒక 30, 40 బిందెల నీరు పట్టే పెద్ద పెద్ద పాత్రలు ఇత్తడి తో తయారు చేసినవి. వీటిని గుండిగలు అంటారు. వాటిలో అడుగున చక్కగా శుభ్రం చేసి కడిగిన 2 బకెట్ల ఇసుకను పోసి అందులో కాలువల నుంచి నీరు తెచ్చుకొని నిలువ చేసి ఉంచుకునేవారు. కాలువ నీరు మంచి నీరు అన్నమాట. అవి తాగడానికి ఉపయోగిస్తాయి. కింద ఇసుక వేయడం వలన బాక్టీరియా ఇబ్బందులు ఉండవు. మరి ఈ రోజుల్లో లాగా అప్పుడు వాటర్ ఫిల్టర్ లు లేవు కదా. అయిన నీటి వలన వచ్చే జబ్బులు ఏవి వచ్చేవి కావు అప్పుడు మరి. జాగ్రత్తలు ఎక్కువ అయిన కొద్దీ జబ్బులు కూడా ఎక్కువ అవుతున్నాయి.
వాస్తవం చెప్పాలంటే అప్పుడు ఆడపిల్లలు ఒక వయసు దాటినా తర్వాత ఇంటిపనులకే పరిమితం అయ్యేవారు. ఆడపిల్లలకు చాకలి పద్దు వ్రాసుకొనే చదువు వస్తే చాలు అనుకునేవారు. చదువు లేకపోయినా సంసారం గుట్టుగా నడుపుకునే వారు ఆ రోజుల్లో, భర్త చాటున , అత్తా మామల చాటున జీవితం వెళ్ళిపోతే చాలు అనుకునేవారు. చదువు ఎక్కువైనా కొద్దీ సమానత్వం, స్వేచ్చ, స్వాతంత్ర్యం అనే భావాలు ఎక్కువ అవుతాయి అని పూర్వులు గ్రహించారేమో. ఇలా చెప్తున్నందుకు నన్ను కొందరు తిట్టుకోవచ్చు కానీ నెమ్మదిగా ఆలోచిస్తే ఇందులో వాస్తవం మీకే బోధ పడుతుంది.
మొదట్లో వంట చేయడానికి కట్టెల పొయ్యెలు ఉండేవి. తరువాత వచ్చినవి పొట్టు పొయ్యిలు. అంటే ధాన్యం ఆడించిన తర్వాత వచ్చే పొట్టు ను తెచ్చుకొని అది పోయ్యిలలో కూరుకొని దాని మిద వంట చేసేవారు. పొట్టు పొయ్యిలో పొట్టు కూరడం కూడా ఒక పద్దతిగా జరగాలి. ఈ మాత్రం లూజుగా ఉన్నా పొయ్యి సరిగా మండదు. ఈ పోయ్యిలలో పొట్టు కూరడం, కట్టెల పోయ్యిలకు వంట చెరకు చీరడం ఇవన్ని మగ పిల్లల పనులు. ఈ పనులన్నీ వాళ్ళు చదువుకుంటూనే చేసేవారు. మధ్యలో బొగ్గుల కుంపట్లు కూడా వచ్చాయి. అంటే ఇనుముతో చేసిన పొయ్యి లో బొగ్గులు సహాయంతో వంట చేసేవారు. అవి పదునుగా మండటానికి అంటే కావలసిన స్థాయి ప్రకారం మంట రావడానికి బోలెడు కసరత్తు చేయాల్సి వచ్చేది. కట్టే పొయ్యిలు, బొగ్గుల కుంపట్ల వలన బోలెడు పొగ. పాపం ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఈ కష్టాలన్నీ పడ్డారు. ఈ కట్టెలు కానీ, పొట్టు కానీ, బొగ్గులు కానీ బస్తాలలో నిలువ ఉంచుకునేవారు . వర్షాకాలం అవి తడవకుండా చూసుకోవడం, ఆ బస్తాల కింద పురుగు, పుట్రా చేరకుండా చూసుకోవడం ఇవన్ని ఇంకోరకం ఇబ్బందులు.
గుండిగ , కుంపటి చిత్రాలను క్రింద చూడండి.
(సశేషం)
మా రోజుల్లో.....
మా అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు మా చిన్నతనంలో మాతో ఎన్నో కబుర్లు చెప్పేవారు. ఆ కబుర్ల మధ్యలో మాటమాటకీ మా రోజుల్లో అయితేనా....అని వాళ్ళ చిన్నతనం లో సంగతులు చెప్తూ ఉండేవారు. బంగారం ఖరీదు ఆ రోజుల్లో తులం 60 రూపాయలు ఉండేదిట. ఇప్పట్ల లాకర్లు అవి లేకపోవడం చేత, ఇంట్లో నే ఏదో ఒక మూల గొయ్యి తీసి అందులో నగలన్నీ మూటకట్టి పెట్టేవారుట. మా తాతగారు వైద్యుడు. అప్పట్లో వైద్యం చేసినందుకు ఏమి ఫీసు తీసుకోకపోగా, పక్క గ్రామాల నుంచి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు వారి ఇంట్లోనే భోజన సదుపాయం చేసేవారుట. ఇక ఆదాయం అంటే పంటల మిద వచ్చేదే. అందులోనే, పాలేర్లు, చాకలి వాళ్ళు, పని మనుషులు అందరికి ధాన్యం కొలవడం. ఇప్పట్లా పని వాళ్ళకు డబ్బు రూపేణా ఇచ్చే వారు కాదుట. అందరికీ ధాన్యం కొలవడమే. కాలక్రమేణా పొలాలు అన్ని అమ్మేసుకున్నారనుకోండి. ఇక వచ్చిన రోగులు కూడా డబ్బు తీసుకోరు కదా అని ఉత్త చేతులతో రాకుండా వాళ్ళ పొలాల నుంచి ఏదో, పండో, కాయో తెచ్చేవారుట. అవి మళ్లీ అశ్రితులకే ఇచ్చేసేవారు. అలాగే మామిడి పండ్లు, సీతాఫలాలు అటువంటి పండ్లు కొనుక్కొనే పని లేదుట. తెలిసిన వారు బుట్టలతో తెచ్చి ఇవ్వటమే. మా చిన్నతనాలలో 100 లెక్కన కొనేవారు మా నాన్నగారు. ఇపుడు డజన్లు లోకి దిగిపోయాం. కొన్నాళ్ళు పొతే మన పిల్లలు 2,3 లెక్కన కొనుక్కోవాలో ఏమిటో.
మా నానమ్మగారు 82 సం. జీవించారు. అంతవరకూ వంటింటి అధికారం కోడళ్ళకు ఇవ్వకుండా తన అజమాయిషీ లోనే ఉంచుకున్నారు. నా పిల్లలకు నేనే వండి పెట్టుకుంటాను అనేవారు. మా అమ్మమ్మగారు 75 ఏళ్ల వరకు కుట్లు అల్లికలు చక్కగా చేసేవారు. ఒక్క క్షణం కూడా ఖాళీగా కూర్చునేవారు కాదు. కడుపు నిండుగా తిని చేతినిండా పని చేసుకునే వారు ఆరోజుల్లో, నెయ్యి, స్వీట్స్, ఊరగాయలు, అన్నీ చక్కగా లిమిట్ లేకుండా తినేవారు. తినే వాటి మీద ఏ ఆంక్షలు ఉండేవి కావు. ఇప్పుడు నెయ్యి తినకూడదు, స్వీట్స్ మానేయాలి, ఉరగాయలు మానేయాలి అని కెలోరీలు లేక్కపెట్టుకొని తినడం వచ్చాకనే అసలు రోగాలు ఎక్కువ అయ్యాయేమో. ఇపుడు 30 ఏళ్ల వాళ్ళకి కూడా రక్తహీనత, కాల్షియమ్, విటమిన్ లోపాలు. ఈ అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చాక విటమిన్ డి. కూడా తక్కువ అయిపోతోంది అందరికి. కూరలు, పండ్లు, పాలు అన్ని కల్తీ. తినేవాటిలో సారం ఉండటం లేదు. తిన్నది వంటపట్టడం లేదు. అన్నిటికి మందుల మీద ఆధారపడడమే. ఇవి కాకుండా మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ ఇవి మళ్లీ కొసరు మనకి.
(సశేషం)
Like ·

Monday, 14 April 2014

హనుమంతుడి సందేశం
హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీటన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం. సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.
హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది తథ్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ' అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘నీ వెవరివీ' అని ఎవరైనా అడిగితే హనుమంతుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేంద్రుడి దాసుడి'ని. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా…. మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుంది' అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బృందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కాదు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూలమయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా!
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదు'. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.
హనుమత్ జయంతి శుభాకాంక్షలు

Tuesday, 8 April 2014

ఎన్నికల వేళ అన్ని పార్టీలు ప్రజల మీద వరాల జల్లులు కురిపిస్తున్నాయి. కొండొకచో అవి వడగల్లై జనాలకే తగులుతున్నాయి. ప్రతి పార్టీ మేనిఫెస్టో చూసిన సామాన్యుడు ఇప్పుడు నిజంగానే నాయకుల బుట్టలో పడి ఎన్నికలయ్యాక ఒడ్డున పడ్డ చేపలా గిలగిలా తన్నుకుంటాడు. అసలు  ఈ మేనిఫెస్టో లు పార్టీలకు కాకుండా వోటు వేసే వోటరుకు ఉండి ఉంటె..... నా మేనిఫెస్టో లో నా ఓటు అడిగే పార్టీలను నేను ఇలా అడుగుతాను. :

1. మాకు ఉచిత బియ్యం, సరుకుల సంచులు వద్దు. మొత్తంగా అన్ని సరుకుల ధరలు కొద్దిగానైనా తగ్గించండి.

2. మాకు రిజర్వేషన్స్ వద్దు, చదువుకున్న ప్రతి యువతీ, యువకులకు ఉద్యోగ/ఉపాధి కల్పించండి. ఉద్యోగ భద్రతా కూడా కల్పించండి.

3. మాకు కార్పొరేట్ స్కూల్స్, కాలేజీ లు వద్దు. ప్రభుత్వ విద్య సంస్థలలో ప్రైవేటు యాజమాన్యాలకు దీటుగా ప్రమాణాలు పెంచండి.

4. విద్యాసంస్థలలో ఆడపిల్లలకు కావలసిన ప్రత్యెక సదుపాయాలు కల్పించండి.

5. హేమమాలిని బుగ్గల్లాంటి నున్నటి రహదారులు కాకపోయినా, రాష్ట్రం లోని ప్రతి ఏజెన్సీ, గిరిజన ప్రాంతం నుంచి, గ్రామాల నుంచి రవాణా వ్యవస్థ మెరుగు పరచండి.

6. సాంఘిక సంక్షేమ హాస్టళ్ళ లోని విద్యార్థులు ఆతీ గతీ పట్టించుకోండి.

7. మాకు డబల్ డెక్కర్ బస్సులు, బులెట్ రైళ్ళు వద్దు, ఉన్న రైళ్ళలో బోగీలు పెంచి, రైలు మార్గాలు పెంచి, టికెట్లు సులభంగా అందరికి దొరికేలా చూడండి. బస్సుల సంఖ్యా  పెంచి, వాటి నిర్వహణ లోపాలు అరికట్టండి.

8. ఆడపిల్లల రక్షణకు ప్రత్యెక విభాగం ఏర్పాటు చేసి, నిందితులకు వెంటనే శిక్ష విధించడం ద్వారా బాధిత ఆడపిల్లలకు న్యాయం చేయండి. ఆడపిల్లలకు, మహిళలకు, ధైర్యాన్నివ్వండి.

9.రైతులకు ఉచిత విద్యుత్ తరువాతి మాట, ముందు నాణ్యమైన నిర్ణీత సమయాల్లో విద్యుత్, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, అందించండి.

10. మారుమూల ప్రాంతాలకు కుడా మంచి నీటి సరఫరా ఇవ్వండి.

11. కోతలు లేని కరంటు సరఫరా చేయండి.

12. సంప్రదాయేతర ఇంధన వనరులను అన్ని రంగాల్లో ప్రోత్సహించండి.

13. రాష్ట్రం అంతటా పోరంబోకు స్థలాలు ( ఉపయోగం లో లేనివి) ఎన్నో ఉన్నాయి. వాటిని సరి అయిన విధానం లో  ఉపయోగం లోకి తీసుకు వచ్చి, ప్రజలకు మేలు చేయండి.

14. మీ మీ నియోజక వర్గాల్లో చెత్త పేరుకు పోకుండా వారానికి ఒకసారి అయినా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టండి.

15. మీ మీ నియోజక వర్గాల్లో ఉన్న చెరువులు, కాలువలు శుభ్ర పరచి, ఉపయోగకరంగా తీర్చి దిద్దండి.

16. ఆరోగ్యశ్రీలు, బంగారు తల్లులు పధకాలు తర్వాత.   చేతిలో పైసా లేని పేదల వైద్యానికి వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల ప్రమాణాలు పెంచండి. ప్రభుత్వ వైద్యులలో జవాబుదారీ విధానాన్ని తీసుకురండి.

17. వయసు అయిపోయి ఎటూ కదలలేని పేద కుటుంబాలలోని వృద్ధులకు జీవన భ్రుతి ఏర్పాటు చేయండి.

18. నడుములు విరిగె గుంటలు, వర్షాకాలం లో మనుషుల ప్రాణాలు తీసే manholes లేకుండా రహదారులను మరమ్మత్తు చేయండి..

19. మీరు మా సొమ్ము స్వాహా చేస్తే చేసారు, మాకు కుడా కొంత లాభం చేకూరే పనులు చేపట్టండి.

20. ముఖ్యంగా రాజకీయ స్వార్ధంతోనో, లేదా పార్టీల మధ్య సమన్వయము కొరవడడం తోనో, లేదా ఎవరికో పేరు, హోదా దక్కుతుందేమో అనే దుర్బుద్దితోనో మన రాష్ట్రానికి రావలసిన కంపెనీలను ప్రక్క రాష్ట్రానికి పోనివ్వకండి. మనకు ప్రతిభా వంతులైన యువత ఎంతోమంది ఉన్నారు. వారి మేధస్సును ఉపయోగించుకోండి.

మిత్రులారా, మీలో ఎంతమంది నాతొ ఏకీభవిస్తారు? మీ మీ మేనిఫెస్టో లలో ఏ ఏ అంశాలు చేరుస్తారు?

మిత్రులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు:--
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర మాసంలో, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రములో, త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం జరుపుకున్నది ఈ రోజునే. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు ఆంధ్రప్రదేశ్ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.
భద్రగిరి పర్వతరాజు తపస్సువల్ల, అక్కమాంబ త్యాగంవల్ల, భక్తరామదాసు పట్టుదలవల్ల త్రేతాయుగం నాటి అయోధ్యరాముడు మళ్ళీ మనకు ఈ కలియుగంలో భద్రాచలరామునిగా అవతరించాడు. కానీ త్రేతాయుగం గుర్తులు నేటికి భద్రాచలంలో పవిత్ర గోదావరీ తీరాన ఒడ్డున, పంచవటి వద్ద మనకు దర్శనమిస్తున్నాయి. అక్కడ రావణుడు... సీతమ్మను అపహరించిన వైనం, మాయలేడి, సీతమ్మతల్లి ఆరవేసిన నారచీరల ఆనవాళ్ళు, సీతమ్మ స్నానమాచరించిన గుండము మొదలగునవి, మనం చూడవచ్చును.
సీతారాముల కళ్యాణం అనగానే మనకు ముందుగా భద్రచలమే గుర్తుకువస్తుంది. ఆకాశమంత పందిళ్ళుతో, ఎటుచూసినా విసినకర్రలతో సందడి చేసే జనం, మనఇంటి పెళ్ళివలె సందడితో, అందరూ ఎంతో ఆనందంగా ఎదురుచూసే సీతారామ కళ్యాణం చూడటానికి ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఈ రోజు రామయ్య పెళ్ళికొడుకై, సీతమ్మ పెళ్ళికూతురై మనందరికీ కనువిందు చేస్తున్నారు.
సీతారామ కళ్యాణ రహస్యాలని కొన్నిటిని మనం తెలుసుకుందాము. ఒకానొక రోజున దశరధుడు తన నలుగురు కొడుకులకు వివాహము చేయదలచి, ఒక సమావేసము ఏర్పాటు చేసాడు. సరిగ్గా అదే సమయానికి విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చాడు. దశరధుడు-- విశ్వామిత్రునికి సకల మర్యాదలు చేసి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. విశ్వామిత్రుడు దశరధునితో "నేను రాముణ్ణి అడవులకి తీసుకుపోవటానికే వచ్చాను" అనెను. కొంతసమయం దశరధునితో వాదన జరిగింది. పిమ్మట వశిష్ట మహర్షి దశరధునిని ఒప్పించి, రామలక్ష్మణులని .... విశ్వామిత్రునితో అడవులకి పంపెను. అసలు రహస్యం ఇక్కడే ఉంది.
శ్రీ మహావిష్ణువు రామునిగాను---లక్ష్మీదేవి సీతమ్మగాను ఈ భూమిపై అవతరించారనే రహస్యం---దేవతలకి, మహర్షులకి మాత్రమే తెలుసు. దశరధునికి తెలియదు. అందుకే ఆటను అందరిలాగే తన నలుగురి పిల్లలికి వివాహం జరిపించాలని సమావేశం ఏర్పాటు చేసాడు.
దేవలోకంలో ----- సీతారాముల కళ్యాణము జరిపించే బాధ్యత విశ్వామిత్రునిదే అని శ్రీ మహావిష్ణువు అధ్యక్షతన జరిగిన సమావేశంలోదేవతలంతా తీర్మానించారు. అందుకే రామలక్ష్మణుల వివాహ సమావేశం జరుగుతుంది అని తెలియగానే విశ్వామిత్రుడు వచ్చి, సభని ఆటంకపరిచి, రాముణ్ణి తనతో తీసుకెళ్ళి, సీతమ్మతో వివాహం జరిపించేవరకు రాముణ్ణి విడిచిపెట్టకుండా, అంటిపెట్టుకుని కళ్యాణము జరిపించి అయోధ్యకు తీసుకువచ్చాడు.
ఎవ్వరూ ఎత్తలేని విల్లుని సునాయాసంగా కదిపిన సీతమ్మకి---- ఆ ధనుస్సుని ఎత్తుతూనే వంచి, విరగకొట్టిన రామునికి పెళ్లి అనగానే, అందరు ఈడు --జోడు కుదిరింది అని అనుకున్నారు.
రాముడు పుట్టింది, సీతమ్మ జన్మించింది రావణ వధ కోసం మాత్రమే. ఆ రావణుణ్ణి సంహరించాలి అంటే, శివుడూ--శక్తీ ఏకం కావాలి. ఇక్కడ రాముడు శివ స్వరూపము అయితే, సీత శక్తి స్వరూపం. ఈ రెంటినీ ఏకం చేసినవాడు-- విశ్వామిత్రుడు.
ఇన్ని మహత్యాలు ఉన్న రామాయణాన్ని చదివిన, విన్న, సీతారాముల కళ్యాణాన్ని చూసిన మన జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి.
శ్రీరామ జయరామ జయజయ రామ.........
ఓం శ్రీ రామాయ నమః
8-4-2014, మంగళవారం, శ్రీరామనవమి
ఎవరైన ఒక వ్యక్తిని అతని మిత్రులు పొగుడుతుంటారు. కానీ, అతని చేతిలో దెబ్బలు తిన్నవారు, శతృవులు పొగిడితే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడు.
మారీచుడు దగ్గరకు రావణుడు వచ్చి రాముడు గురించి చాలా చెడ్డరీతిలో రాముడి మీద లేనిపోనివన్నీ మాట్లాడుతాడు. అప్పుడు మారీచుడు "రావణ! నువ్వు వీరుడు, గుణవంతుడైన రాముడిని పొగడకపోవచ్చు, కానీ రాముడు నీలాగా చపలుడు కాదు, తొందరపడి మాట్లాడేవాడు అంతకన్నా కాదు. ఇంద్రుడు, వరుణ దేవుడికి సమానమైనవాడు.
రాముడు తన తండ్రి చేత అడవులకు వెళ్ళగొట్టబడ్డాడు అని అనుకుంటున్నావా? కాదు. రాముడు మర్యాద లేనివాడనుకుంటున్నావా? కాదు. శీలవంతుడు కాదంటావా? పచ్చి అబద్ధం. స్వార్ధపరుడు అనుకుంటున్నావా? కాదు. అల్పమైన క్షత్రియుడు అనుకుంటున్నావా? కానేకాదు. ధర్మహీనుడు, గుణహీనుడు అసలేకాదు. తనకంటే చిన్నవైన జీవులను బాధిస్తాడు అనుకుంటున్నావా? కాదు. రాముడు సర్వ జీవుల మేలు కోరేవాడు.
తన తండ్రిమాటను కైకేయి ద్వారా విని, "మా నాన్నా మాటను నిజం చేస్తా" అని వనవాసానికి బయలుదేరాడు. కైకెయి కోరిక తీర్చడం కోసం సమస్త రాజభోగాలను వదులుకుని వనవాసానికి వెళ్ళాడు. భరతుడు రాజ్యం ఇస్తానని చెప్పినా, తండ్రి మాట నిలబెట్టడం కోసం భరతుడి విన్నపాన్ని తోసిపుచ్చాడు.
రాముడు కర్కషుడు కాదు. అవిద్యావంతుడు అంతకంటేకాదు. ఇంద్రియాలను జయించనివాడు కాదు. రాముడు గురించి వినకూడనివి, ఊహించలేని మాటలను మాట్లాడ్డం నీకు తగదు రావణ.
"రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవి వాసవః"
ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే రాముడు, సాధుపురుషుడు, పరాక్రమవంతుడు, సర్వలోకాలకు, దేవతలకు ప్రపంచానికి రాజు.
విశ్వామిత్రుడి యాగాన్ని పాడుచేయడానికి నేను వెళ్ళినప్పుడు రాముడు 12 ఏళ్ళ బాలుడు. సరిగ్గా ఆయుధాలు వాడడం కూడా రానివాడు. ఈ పిల్లవాడేం చేస్తాడులే అనుకున్నా. రాముడికి నా మీద వేసిన బాణానికి వందయోజానాల దూరంలో సముద్రంలో పడ్డాను. నన్ను చంపద్దు అనుకున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నాను.
అప్పటినుంచి ఏ చెట్టు పక్కన రాముడు ఉన్నాడో, ఎటునుంచి వస్తాడో అని భయపట్టుకుంది. ఎవరిని చూసిన రాముడే కనిపిస్తున్నాడు, కలలో రాముడు వచ్చిన హడలిపోతున్నా. నీకో విషయం చెప్పనా రావణా! "ర"తో మొదలయ్యే ఏ పేరు విన్నా గుండెలు జారిపోతున్నాయి" అంటాడు.
ఎక్కడైనా శతృవును ఎదుటివారి తిడుతుంటే తెగ సంతోషపడతారు. కానీ, రాముడు చేతిలో చావుదెబ్బ తిన్న మారీచుడు రావణాసురుడు రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సహించలేకపోయాడంటే రాముడు ఎంత గొప్ప వాడు. అటువంటి శ్రీ రామచంద్రుడిని మనం ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాముడిలా గొప్పగా బ్రతకాలి.
ఓం శ్రీ రామాయ నమః
రమ్యమైనది శ్రీరామ నామం!
"శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే"
రామ అనే శబ్ధం ఒకసారి పటిస్తే విష్ణుసహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము అంటారు. కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్నినామములలోకెల్లా శ్రేష్ఠమైనది. రామాయణంలో పవిత్రతకు సీతాదేవి, సోదరమైత్రికి లక్ష్మణుడు, వినయానికి భరతుడు, విశ్వాసానికి గుహుడు, స్నేహానికి సుగ్రీవుడు, భక్తికి శబరి, ప్రభుసేవ, వాక్చాతుర్యానికి హనుమంతుడు ఇలా ప్రతి పాత్రా మహోన్నత విలువలతో కూడుకుని ఆత్మీయత, అనుబంధం, అనురాగాలను గుర్తుచేస్తాయి. కులమతాలకు అతీతంగా ధనిక బీద తారతమ్యాలు లేకుండా అందరినీ సమానంగా ప్రేమించడం, సమానధర్మాన్ని ఆచరించడం ఒక్క రాముడికే సాధ్యమైంది. అందుకే ఆయన ప్రజల మనసులలో శాశ్వతంగా నిలిచిపోయాడు.
శ్రీ రామ నవమి శుభాకాంక్షలు!