Friday, 14 March 2014

పేరులో ఏముంది:::

పేరులో ఏముంది? చాల ఉంది. ఒక వ్యక్తిని మనం పేరుతోనే గుర్తు ఉంచుకుంటాము. ఒక వ్యక్తీ యొక్క అస్తిత్వాన్ని తెలియచెప్పేది అతని పేరే. ఇదివరకు ఇంట్లో పిల్లలకి చక్కటి పేర్లు పెట్టేవారు. దేవుడి పేర్లు ఎక్కువ పెట్టేవారు. ఎందుకంటే ఆ పేరుతొ పిలిచిన ప్రతిసారి పుణ్యం వస్తుంది అని పూర్వుల నమ్మకం.  కొంతమంది ఇంట్లో పెద్దవారి (అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ) పేర్లు పెట్టుకునే వారు వారి గుర్తుగా. అటువంటప్పుడు పిల్లలను పేర్లతో పిలవకుండా, ఏవో ముద్దు పేర్లతో పిలిచేవారు. ఎందుకంటే, పెద్ద వాళ్ళ, దేవుళ్ళ పేర్లు పెట్టి, పొరపాటున పిల్లలను తిడితే అది పాపం అని భావించేవారు. ఒకప్పుడు మొక్కుల ప్రకారం, చేంతాడంత పేర్లు పెట్టేవారు. కాలక్రమేనా ఇపుడు 2,3 అక్షరాలకు పేర్లు కుదించుకుపోయాయి. అక్షరాల లెక్క ఎలా ఉన్నా, ఇపుడు కొన్ని పేర్లకు అర్ధాలు ఉండడం లేదు. రితిక, రిషిత, రీతు, ఇలా ఏవేవో పేర్లు... పేర్లు పెట్టేవారికి అర్ధం తెలియడం లేదు, పిలిపించుకునే వారికీ తెలియడం లేదు. ఈ మధ్య ఒక అబ్బాయి పేరు విన్నా. , వికల్ప్ అట. అంటే ఏంటో మరి.
ఇదివరకు విశ్వనాధ్ అని పేరున్న వాళ్ళని విషు, విశి అని చిన్నగా పిలిచేవారు. ఇపుడు విషు  అని కూడా పేరు పెడుతున్నారు. దయచేసి ఒకటి గమనించండి, మనం ఒక ముహూర్తం నిర్ణయించి, దాని ప్రకారం పుట్టిన బిడ్డకు వేడుక చేసి, అందరి ఆశీర్వచనాల నడుమ పిల్లలకు పేర్లు పెడతాము. అ పేరు యొక్క ప్రభావం, పిల్లల భవిష్యత్ మిద ఉంటుంది. పిల్లల జన్మ నక్షత్రాల బట్టి కూడా పేర్లు నిర్ణయిస్తాము. అందువల్ల పిల్లలకు ఫాషన్ పేరుతొ అర్ధం పర్ధం లేని పేర్లు పెట్టకండి. మన పురాణాల్లోను, సాహిత్యం లోను, వెతికితే ఎన్నో గొప్ప పేర్లు దొరుకుతాయి. ఎంతో అందమైన పేర్లు దొరుకుతాయి, అసలు ఆడపిల్లలకు పేర్లు పెట్టాలంటే లలిత సహస్ర నామం తిరగేస్తే సరిపోతుంది. మన తెలుగు సాహిత్యం లో చాల అందమైన పదాలు ఉన్నాయి. ఒకవేళ కొత్త పేర్లు పెట్టాలనుకుంటే, ఎవరినైనా అర్ధం తెలుసుకొని మరీ పెట్టండి.

నమస్కారం,

No comments:

Post a Comment