Friday, 21 March 2014

దేవుడు ఉన్నాడా? లేడా? అసలు దైవ పూజ ఎందుకు చేయాలి? దేవుడికి అసలు ఇష్టమైన పదార్ధం అంటూ ఉందా? పులిహోర నైవేద్యం పెట్టేటప్పుడు బిర్యానీ ఎందుకు పెట్టకూడదు? కొంతమంది పిల్లలు, కొంతమంది మూర్ఖులైన పెద్దలనుంచి నేను అప్పుడప్పుడు ఎదుర్కొనే ప్రశ్నలు....

* ఏదో ఒక మానవాతీత శక్తి ఈ సృష్టిని నడిపిస్తున్నది అని నమ్ముతున్నపుడు ఆ శక్తిని దైవం అనే పేరుతో పిలవడానికి ఏమిటి అభ్యంతరం? అదీ కాక, ఒట్టి పురాణాల ప్రకారమే కాకుండా, సైంటిఫిక్ గా కుడా భారతం, రామాయణం నిజంగా జరిగాయి అని సాక్ష్యాలు దొరికినపుడు దేవుడు అనే కాన్సెప్ట్ ని నమ్మడానికి ఇంకా ఏమి రుజువులు కావాలి?

* దేవుడు అనే శక్తి ని నమ్మినపుడు, పాపం పుణ్యం అనే పదాలు కూడా నమ్ముతాము. మంచి చేయడానికి కృషి చేస్తాము. చెడు చేయడానికి భయ పడతాము. ఇది చాలదా మనిషి మంచి వైపు అడుగులు వేసి, ఒక స్వచ్చమైన సమాజాన్ని స్థాపించడానికి?

* దైవ పూజ ఎందుకు చేయాలి? క్రమశిక్షణ కోసం. పూజ చేయాలి అంటే, ఉదయాన్నే లేచి, శుద్ధి అయి, పూవులు తెచ్చుకొని, ఇల్లు , వాకిలి శుభ్రం చేసుకొని, అపుడు పూజ చేసుకొంటాము. పూజ అయిన తర్వాతనే ఏదైనా భుజిస్తాము. ఇది ఆరోగ్యకరం. ఎందుకంటే పైన చెప్పిన అన్ని పనులలోను మనకు ఒక వ్యాయామం మనకు తెలియకుండానే జరిగిపోతుంది. ఇక పూజలు లేని ఇల్లు ఉంటె, ఇల్లు, వాకిలి శుభ్రం చేసేది ఎపుడో, వాళ్ళు స్నానం చేసేది ఎప్పుడో, ఆ భగవంతునికే తెలియాలి. ఒక్కో చోట స్నానం లేకుండానే, వంటలు, టిఫిన్లు కానిచ్చేస్తున్నారు. ఇవన్ని అనారోగ్య కరం. మాకు అన్ని పనులు అయితేనే కానీ స్నానం కుదరదు అంటారు. మరి అన్ని కుదిరినపుడు స్నానం ఎందుకు కుదరదు? సాగుతోంది కనుక. అందుకని దైవం పేరుతో, ఒక క్రమశిక్షణ ను నేర్పారు మన పూర్వులు.

*దేవుడికి ఇష్టమైన పదార్ధం అంటూ ఏది ఉండదు. ఆయా కాలాలకి తగ్గట్టు, ఆయా పండగలలో, మనకు ఆరోగ్యాన్నిచ్చే పదార్థాలు మనం భుజించడం కోసం దేవుడి పేరు చెప్ప్పారు పెద్దలు. మన ప్రాచీన ఆయుర్వేద పధ్ధతి ప్రకారం  వాత, పిత్త, కఫ దోషాల వల్ల మనకు అనారోగ్యం ప్రాప్తిస్తుంది. ఆయా ఋతువులను బట్టి మన ఆహారంలో మార్పులు చేసుకోవలసి ఉంటుంది. అందుకని మనకు వాటికీ సరిపడా నైవేద్యాలు చెప్పారు పెద్దలు.

* మన శాస్త్రాల ప్రకారం మనిషి లో 3 రకాల తత్వాలు ఉంటాయి. సత్వ, రజో, తమో గుణాలు. వీటి ప్రకారమే, మనిషి యొక్క బుద్ది, నడవడిక ఉంటాయి. మనం సేవించే ఆహారం యొక్క ప్రభావం ఈ గుణాల మిద ఉంటుంది. సాత్విక మైన ఆహారం సేవించే వాడు సాత్వికంగానే ఉంటాడు. ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలు మనలో సాత్వికతను పోగొట్టి రజో గుణాన్ని పెంపొందిస్తాయి. అందువలననే మనకు ఉల్లి, వెల్లుల్లి నిషేధం. పులిహోర మొదలైన పదార్థాలలో ఉండే పోపు (తాలింపు) గింజలు ఆరోగ్యాన్ని పెంచుతాయి. గుడిలో నైవేద్యం అందరికి పంచుతారు కాబట్టి అందరికి ఆరోగ్యం చేకూరుతుంది అని మన పెద్దల ఆశయం.

* మన దేవాలయాలలో ప్రసాదం చేసి, నైవేద్యం పెట్టి అందరికి పంచె పదార్థాలను గమనించండి, అన్ని ఆకలి తీర్చేవే. అంటే సాలిడ్ గా ఉండి  కడుపు నిండుతుంది. అంటే దానిని అందరికి పంచడం ద్వారా, ఎవరూ ఆకలిగా ఉండకుండా, కొద్దో గొప్పో అందరికి కడుపు నిండాలి అనేది మన పూర్వుల ఉద్దేశ్యం.

* డబ్బున్న వాళ్ళని మీరు ఈరోజు అనాధలకు దానం చేయండి అంటే కొంత మంది చేయకపోవచ్చు. అదే మీరు గుడిలో నైవేద్యం కోసం డబ్బులు కట్టండి. మీ పేరు మిద అనాధలకు పంచుతాము. మీకు కూడా పుణ్యం అంటే ఎంతో మంది స్పందిస్తారు. అందుకే మంచి పనులు చేయడానికి, ఇతరుల చేత చేయించడానికి దేవుడుని వాడుకున్నారు మన పెద్దలు.

నాతో ఎంతమంది ఏకీభవిస్తారు?

No comments:

Post a Comment