Friday, 21 March 2014

మన పెద్ద వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఏ వయసుకు ఆ ముచ్చట అని...వాళ్ళు ఏ అర్ధం , సందర్భం లో అన్నారో కాని, కొంతమందిని చూస్తుంటే నాకు ఆ మాటే గుర్తు వస్తుంది. ప్రపంచీకరణ ఫలితమో ఏమో, విదేశీ వస్తువులు అన్ని మన ముంగిట్లోకి వచ్చేసాయి. రోడ్ మీదకి వెళ్తే చాలు, పెద్ద పెద్ద మాల్స్, మనని రా రమ్మంటూ ఆహ్వానిస్తుంటాయి. ఇక ఫర్నిచర్, gadgets  సంగతి చెప్పనే అక్కర్లేదు. అదివరకు ఉద్యోగం చేసే ఆడవాళ్ళు అక్కడక్కడా కనిపించినా, క్రిందటి తరం నుంచి అందరు ఆడపిల్లలు చక్కగా చదువుకొని, (పక్క రాష్ట్రాలకో, వీలైతే విదేశాలకో వెళ్లి ) పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. చక్కటి సంపాదన. ఉద్యోగం వచ్చీ రాగానే, సొంత ఇల్లు, కారు, సరదాగా సేద దీరటానికి విదేశీ విహార యాత్రలు, ఇంతవరకు బాగానే ఉంది. కానీ, వీళ్ళందరూ ఈ లక్ష్య సాధనలో పడి జీవితాన్ని అనుభవిస్తున్నారా అనేది నాకెప్పుడూ సందేహమే. నేను ఈ మధ్య చాల మంది దగ్గర వింటున్నాను రెండేళ్లలో మంచి అల్ట్రా మోడరన్ ఫ్లాట్ కొనుక్కోవాలి, తరువాత ఏడాది విదేశాలకు వెళ్ళాలి. ఇది నా టార్గెట్ అని. ఇవన్ని సమకూర్చుకునే క్రమంలో వయసు, ఆరోగ్యం దెబ్బతినడం లేదా? ఇన్ని లక్ష్యాలు కష్టపడి సాధించిన తరువాత, జీవితాన్ని అనుభవించే రోజులు తగ్గిపోవటం లేదా? కొన్ని చోట్ల ఈ లక్ష్య సాధన కోసం మాతృత్వాన్ని కూడా వాయిదా వేస్తున్నారు కొందరు. ఇవన్ని అనారోగ్య కారణాలు కాదా? పరుగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్ళు తాగడం అనే పధ్ధతి మంచిదేమో.... లేదా నా ఆలోచనే తప్పంటారా? ఎవరైనా నొచ్చుకుంటే క్షమించండి.

No comments:

Post a Comment