Friday, 7 March 2014


ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలు శారీరికం గా అబలలే కాని, మానసిక ద్రుధత్వం కలిగిన వారు. ఎన్నో రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. "ముదితలు నేర్వగా రాని విద్య గలదె ముద్దార నేర్పించినన్ " అన్నట్టు, ఒకప్పుడు కేవలం మగవారికి పరిమితమైన రంగాల్లో కూడా మహిళలు ముందంజ వేస్తున్నారు. ఇది చాల హర్షణీయమైన పరిణామం.అలాగే ఇంటికే పరిమితమైన గృహిణుల పాత్ర కూడా తక్కువ కాదు. గృహిణులు సమయానికి అన్నీ అమర్చిపెడితేనే ఇంట్లోని ఉద్యోగులు , విద్యార్థులు వారి పని సక్రమంగా చేయగలిగేది. అంటే దేశం యొక్క ఉత్పాదకతలో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ( క్షమించాలి.... కాంట్రిబ్యూషన్ కు తెలుగు మాట గుర్తు రావడం లేదు ) ఎంత ఉందొ, అందులో సగం గృహిణుల కాంట్రిబ్యూషన్ ఉన్నట్టే కదా.... నిజానికి ఒక మగ ఉద్యోగి కన్నా కుడా ఒక సాధారణ గృహిణి చేసే పనులు చాల ఎక్కువ. ఉదయం లేచిన దగ్గర్నుంచి, రాత్రి పడుకునే వరకు ఆమె పనులతో అష్టావధానం చేస్తుంది. పిల్లల పోషణ, పెద్దల సంరక్షణ, అందరి చదువులు, అవసరాలు, ఆరోగ్యం, ఇంటి పని, వచ్చే పోయే అతిథుల ఆదరణ.....అసలు ఇంట్లో ఆమె లేకపోతే క్షణం గడుస్తుందా....ఒక సర్వే ప్రకారం ఒక గృహిణి చేసే పనులకు విలువ కట్టి ఆమెకు డబ్బు రూపేణ చెల్లించాలి అంటే మగ వాళ్ళ జీతాలు సరిపోవు అని. ఆమె ఉద్యోగాస్తురాలు అయితే ఆమె ఓపిక గురించి చెప్పనే అక్కరలేదు. అటు ఉద్యోగం, ఇటు ఇల్లు సమర్ధవంతంగా నిర్వహించటం మాటలు కాదు.

కానీ మనం ఆమెకు తగిననత గౌరవం ఇస్తున్నామా అనే సందేహం కలుగుతుంటుంది. ఎవరికైనా పరిచయం చేసేటపుడు, నా భార్య, అని పరిచయం చేసిన వెంటనే, తను ఏమి జాబు చేయదండి, ఇంట్లోనే ఉంటుంది అని వెంటనే చెప్పేస్తారు. ఏదైనా పని పూర్తీ కాకపోతే, ఎం చేస్తున్నావ్, ఉదయం నుంచి ఖాళియే కదా అని వెంటనే అనేస్తారు. కొన్ని ఇళ్ళల్లో పిల్లలు కూడా ఇలాగె అంటారు. ఈ పధ్ధతి పోవాలి.

ఈ సందర్భం గా మహిళలకు కూడా ఒక మాట. ఇంటిని నిర్వహించుకునే హడావిడి లో మనలను మనం అంతగా పట్టించుకోము. ఆరోగ్యం, తిండి, అన్ని నిర్లక్ష్యం చేస్తాము. ఇంట్లో అందరికి కడుపు తడిమి పెట్టె మనం, మన తిండి విషయంకి వచ్చేసరికి ఉన్న దాంట్లో సరిపెట్టేసుకున్టాము. ఒంట్లో బాగోక పోయినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి బధ్ధకిస్తాము. చివరికి మందులు వేసుకోవడానికి కూడా మనలో చాలామంది మహిళలకు బద్దకమే.....

మనకంటూ ఒక వ్యాపకం, ఒక కాలక్షేపం సృష్టించుకోవాలి అని కూడా మనలో కొందరికి తెలియదు. అందరి పనుల లోను మనం కాలక్షేపం చేస్తాము. కానీ మనకంటూ మనం కొంత సమయం కేటాయించు కోవాలి, ఆ సమయం లో కేవలం మన కోసమే మనం బ్రతకాలి. బుక్స్ చదవటం, సంగీతం వినడం, సమస్యలను ప్రక్కన పెట్టి కొంత సేపు రిలాక్స్ అవ్వడం., లేదా చిన్నపుడు వదిలేసినా మన ఆసక్తులు మళ్లీ మొదలుపెట్టడం ,....... ఇవన్ని మనకు ఎవరూ చెప్పరు... ఎందుకంటే ఒక గృహిణికి తనకంటూ కొంత సమయం కావాలి అని ఎవరు గమనించరు కనుక. ఈసారి నుంచి ఎవరికైనా పరిచయం చేసుకునేటప్పుడు హౌస్ వైఫ్ అని కాకుండా హోం మేకర్ అని చెప్పుకుందాం.

మహిళగా పుట్టినందుకు గర్వపడదాం... స్త్రీయే సర్వ జగతికి ఆధారం. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఉహించుకొలేనట్టే స్త్రీ లేని ప్రపంచాన్ని కూడా ఉహించుకొలెము. తల్లి, చెల్లి, భార్య , కూతురు .... ఇలా ఏదో ఒక రూపం లో స్త్రీ పురుషునికి ఆధారం అవుతోంది. ఇది గమనించుకోలేని వాళ్ళు దాదాపు 2,3 దశాబ్దాల క్రితం వరకట్నం పేరుతొ, మహిళలను హింసించారు. దాని ప్రభావంతో తల్లితండ్రులు కొన్నాళ్ళ వరకు ఆడపిల్లలు పుడతారంటే భయం వేసి పురిట్లోనే వారికీ సమాధి కట్టారు.... ఫలితం.. ఇప్పుడు మగపిల్లల జనాభా కంటే, ఆడపిల్లల జనాభా తక్కువ ఉండడం.

ఇక నాణానికి మరోవైపు అన్నట్టు, మనిషి ఎంత ప్రగతిని సాధించినా, మహిళలపై అత్యాచారాలు ఆగటం లేదు. కుల , జాతి, ప్రాంత భేదం లేకుండా స్త్రీలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. రోజు మనం వార్తల్లో వింటూనే ఉన్నాము. మగవారితో సమానంగా చదువుకొని, సమానంగా సంపాదిస్తున్న మహిళలకు బయట రక్షణ ఉండడం లేదు. వారి వర్క్ ప్లేసెస్ లో కూడా ఎంతో వివిక్షకు గురి అవుతున్నారు. ఈ ధోరణి మారాలి. ఉద్యోగులు తమ సాటి మహిళా ఉద్యోగులను గౌరవించాలి, వారికీ సహాయంగా ఉండాలి. సాటి మనిషిని నమ్మలేకపోతున్న ఈ రోజుల్లో మహిళా ఉద్యోగులకు ఒక భరోసా కలిగించాలి. స్కూళ్ళ, కంపెనీల యాజమాన్యాలు, ప్రభుత్వం కూడా ఈ వైపుగా అలోచించి మహిళా ఉద్యోగుల, విద్యార్ధుల రక్షణకు చర్యలు తీసుకోవాలి. వారికీ వీలైన , క్షేమకరమైన పని గంటలు కేటాయించాలి. ముఖ్యంగా స్కూళ్ళలో విద్యార్ధినుల ఆరోగ్యానికి శ్రద్ధ తీసుకోవాలి. ఎన్నో స్కూళ్ళల్లో ఆడపిల్లలకు సరియైన వసతులు ఉండటం లేదు. అటువంటి చోట అక్కడ ఉండే టీచర్లు చొరవ తీసుకోని సమస్యలు పరిష్కరించాలి.


No comments:

Post a Comment