Tuesday, 9 August 2016

విదురనీతి: 58

ప్రభూ! ఉత్తమల్క్షణాసమ్న్వితుడైన ధర్మరాజు త్రిలోకాధీశుడు కాగలడు. అటువంటివాడు మీ ఆజ్ఞలను సర్వదా శిరసావహిస్తున్నాడు. ఆ విషయం విస్మరించి మీరు వానిని అడవులకు పంపారు. మీరు ధర్మాత్ములూ, ధర్మజ్ఞులూ అయినా అంధులు కావడంవల్ల వానిని గుర్తించలేక విపరీతమార్గాన ప్రవర్తిస్తూ వారి రాజ్యభాగం కూడా వారికివ్వలేకపోతున్నారు. ధర్మజుడు సత్యపరాక్రముడు, ధర్మనిష్ఠుడు, మీయంది గురుభావం కలవాడు. ఇన్ని సద్గుణాలు వానిలో ఉన్నాయి కనుకనే ఎటువంటి క్లేశానైనా నిర్లిల్ప్తంగా సహిస్తున్నాడు. మీరు దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని ప్రభృతి అయోగ్యులపై విశ్వాశముంచి రాజ్యభారం వారికప్పగించి శాంతిని వాంఛించడం వివేకం కాదు. సాత్వికస్వభావమూ ఉద్యోగ యత్నమూ దు:ఖసహనమూ నిశ్చల ధర్మస్థితీ కల పురుషుడు ఎన్నడూ వంచితుడు కాడు. వానినే విద్వాంసుడని మనీషులంటారు. దుష్కర్మలకు దూరంగా ఉంటూ ఆస్తిక బుధ్ధితో, శ్రధ్ధాసక్తులతో సత్కర్మలను అనుష్టించడమే పండితలక్షణం.

క్రోధము, లజ్జ, గర్వము, హర్షము, ఆత్మస్తుతి ఎవనిని వంచించవో వాడే విద్వాంసుడు. ప్రజలు ఎవని సలహాలను గ్రహిస్తారో వాడే విద్వాన్సుడు. ధర్మార్ధాలనుసరిస్తూ లోకవ్యవహారం గ్రహిస్తూ భోగచింతలేక పురుషార్ధాన్ని సాధిస్తూ శక్త్యనుసారం కృషిచేస్తూ, విషయాలను స్వల్పకాలంలో గ్రహిస్తూ అప్రస్తుత ప్రసంగాలు చెయ్యకుండా దుర్లభవస్తువులను కోరకుండా పోయిన వాటికోసం శోకించకుండా విపత్తులో ధైర్యం పోగొట్టుకొనకుండా ఆరంభించిన కార్యాలను మధ్యలో ఆపకుండాఅ సోమరియై కూర్చోకుండా మనస్సును వశపరచుకొని చరించువారు పండితులు. వారెప్పుడూ మంచిపనులే చేస్తారు. కృతజ్ఞులై చరిస్తారు. ఆదరిస్తే ఆనందమూ, అనాదరిస్తే ఆగ్రహమూ పొందరు. గంభీర గంగా ప్రవాహ సదృశ హృదయంతో ఉంటారు. పదార్ధాల యదార్ధస్వరూపం వారికి తెలుస్తుంది. ఒకానొక కార్యం నిర్వహించడానికి ఉత్తమసాధనాలు వారెరిగి ఉంటారు.

ఉపాయాలలో అపాయంలేని విధానాలు వారికి తెలుస్తాయి. వారి వాక్కుకు అనరోధముండదు. వారి ప్రతిభ గ్రంధ విషయాలను అవలీలగా గ్రహిస్తుంది. తార్కిక శక్తి వారి సొమ్ము. వారి బుధ్ధి విద్యను అనుసరిస్తుంది. వారి విద్య బుద్ధి యొక్క అదుపులో ఉంటుంది. శిష్టాచారాలను వారుల్లంఘించరు. విద్యావివేకం లేనిదే గర్వంతో చరించేవాడూ, దరిద్రుడై తీవ్రమనోరధాలు కలవాడూ మూర్ఖుడే...

(ఇంకా ఉంది )  

No comments:

Post a Comment