రాధాకృష్ణుల ప్రేమ అజరామరం...అమలినం...వారిరువురి బంధం మనసుకే పరిమితం.....కృష్ణుడు రాధ యొక్క ప్రేమతత్వం అయితే, కృష్ణుని యొక్క సర్వగత చైతన్యం రాధ....రాధా కృష్ణుల రాసలీలలు మోక్షానికి ఉద్దేశించినవే... ఆమె హృదయ స్పందనలోనూ, ఆమే మనసంతా నిండిన నందబాలుడే గోచరమవుతాడు...విరహం వేధిస్తున్నా రాధమ్మ తన కృష్ణుణ్ణి బాధించదు.....ఆమెకు తెలుసు, కన్నయ్య తనకే కాక, ఈ సర్వ జగత్తుకూ నాథుడని, జగన్నాధుడని...ఒకరిలో ఒకరు లీనమైన ఆ జంటకు విరహమనేదే లేదు....ఎందుకంటే, వారిరువురిదీ ఒకటే తత్వం...ఏకత్వం..... కృష్ణుని స్మృతుల్లో రాధకు మనసు పులకాంకితమైతే, రాధను తలచుకున్న వెన్నదొంగకు మేను రోమాంచితమవుతుంది.....పొన్నలు నిండిన బృందావనం , వెన్నెల రాత్రులు, మురళీ నాదం, యమునా తీరం.....వారి నిర్మలమైన ప్రేమకు సాక్ష్యాలు..
కృష్ణుని యశోదా తనయునిగా, వ్రేపల్లే ముద్దుబిడ్డగా, పాండవోద్ధారకునిగా, రాయబారిగా, అర్జునుని మార్గదర్శకునిగా, రథసారధిగా, మహామహిమాన్వితమైన గీతోపదేశకునిగా ,,, ఎన్ని తీరుల్లో మనం ఆరాధించినా, కృష్ణ ప్రేమ అనగానే మనకు గుర్తొచ్చే ప్రేమిక "రాధ." వారి ప్రేమ తత్వం జగతికి ఆదర్శం....తరతరాలకూ మరువలేని కావ్యం...
శ్రీకృష్ణ శ్శరణం మమ
No comments:
Post a Comment