Thursday, 25 August 2016

వర్ధనమ్మ ఇల్లు తాళం వేసి ఎక్కడికో బైల్దేరబోతోంది. ఇంతలో ఢిల్లీ నుంచి కాంఫరెన్సుకు ఊళ్ళోకొచ్చిన  పెద్దకొడుకు ఆటో దిగుతూ కనబడ్డాడు. తాళం తీసి ఇంట్లోకి ఆహ్వానించింది...ఇంట్లో అతనికి పెట్టడానికి ఏమీ లేవు..కుశలప్రశ్నలు అయ్యాక భోజనానికి ఉండమంటుందని ఆశపడ్డాడు కొడుకు. తన భార్యకి ఒంట్లో బాగుండడంలేదు. అమ్మ ఒప్పుకుంటే నాలుగు రోజులు తీసుకెళ్ళచ్చు అనుకున్నాడు...తల్లిని చూడడానికి వట్టిచేతుల్తో వచ్చాడు తను. సంభాషణ ఎలా మొదలెట్టినా తల్లి క్లుప్తంగా జవాబులు చెప్పి మాట మధ్యలోనే తుంచేస్తోంది. ..అమ్మ బాగా మారింది అనుకున్నాడు...ఒక్కదానివి ఉండడం ఎందుకు? తమ్ముడు ఊళ్ళోనే ఉన్నాడు కదా, వాడి కుటుంబాన్ని దగ్గర పెట్టుకో....చేదోడువాదోడుగా ఉంటాడు అని సలహా ఇచ్చి, డబ్బులు ఇద్దామని తీయబోయిన పర్సు కూడా మళ్ళీ జేబులోనే పెట్టేసుకుని శెలవు తీసుకున్నాడు...

నాలుగు రోజుల తర్వాత ఊళ్ళో ఉటున్న చిన్నకొడుకు వచ్చాడు తల్లిని చూడడానికి...పెళ్ళి అయిన మొదట్లో భార్య మాటలకు తందానా పాడి విడికాపురం వెళ్ళిపోయాడు....ఆదాయం పెరగక, ఖర్చులు ఎక్కువై, ఎదిగిన పిల్లల్తో రెండు గదుల ఇంటి కాపురం చేయడంలో కష్టం తండ్రి పోయాక, తల్లి ఒంటరిగా ఉంటున్నప్పుడు తెలిస్తోంది...తల్లి ఇంట్లోనే అందరూ కలిసి ఉంటే అద్దె ఉండదు. పిల్లల మీద తల్లి అజమాయిషీ ఉంటుంది. తల్లి ఎలాగూ పని చేయకుండా కూర్చునే రకం కాదు కాబట్టి భార్యకు పనిలో కాస్త వెసులుబాటు ఉంటుంది. భార్య మెదడులోని ఆలోచన , అతని మనసులో రూపుదిద్దుకుంటోంది.
 
చిన్నకొడుకు ఎంత లౌక్యంగా మాట్లాడినా వర్ధనమ్మ తాను ఒంటరి జీవితానికే ఇష్టపడుతున్నాను అని అంతకన్నా గుంభనంగా చెప్పింది...అన్నయ్య డబ్బు పంపుతున్నాడు కాబట్టి, అమ్మ ఇలా మాట్లాడుతోంది..అనుకున్నాడు చిన్నకొడుకు కేశవ...అన్నగారు రెండుమూడు నెలలనుంఛీ డబ్బు పంపని విషయం తెలియక...తన మాట చెల్లకపోయేసరికి విసుక్కుంటూ ఇంటిదారిపట్టాడు...

ఒంటరిగా మిగిలిన వర్ధనమ్మ మనసులో ఏవేవో ఆలోచనలు...పదహారేళ్ళకు పెళ్ళి అయ్యి కాపురానికి వచ్చినదగ్గర్నుంచీ ఒకటే పని....చేసి చేసి అలసిపోయింది...దానికి తోడు భార్యను అజమాయిషీ చేయడం తప్ప  ప్రేమించడం పరువుతక్కువ అనుకునే భర్తతో ఆర్నెల్ల క్రితం వరకూ ఓ భార్యగా పక్కన కాకుండా, వెనకనే నడిచింది...తన మీదున్న బాధ్యతలన్నీ సంపూర్ణంగా తీర్చుకుంది...అందరికీ తలలొ నాలుకలా మెలుగుతూ....తండ్రి చనిపోయాక 12రోజుల కర్మలు చేసి అస్థి నిమజ్జనం తో సరిపెట్టుకున్నారు కొడుకులు. బతికున్నప్పుడు ప్రేమ చూపకపోయినా, భార్య పట్ల బాధ్యతగా తన పేరన ఒక ఇల్లు, కొంత బ్యాంకు బాలన్సూ ఉంచి వెళ్ళాడని ఆయన పోయినతర్వాతే తెలిసింది వర్ధనమ్మకు...లేని భర్తకీ, ఉన్నాడో లేడో తెలియని దేవుడికీ దణ్ణస్లుపెట్టుకుంది..ఆ పన్నెండు రోజుల్లోనే కొడుకుల, కోడళ్ళ అవకాశవాదాలు తెలిసొచ్చాయి...కాలం మహిమ అనుకుంది, కానీ ఎవరిని తప్పుగా అనుకోవడానికి మనస్కరించలేదు..

ఆరునెలలౌ గడిచింది...ఇంట్లో ఓ మూడు గదులు అద్దెకిచ్చింది..ఆ అద్దె, బ్యాంకు వడ్డీ...రోజు గడుస్తోంది లోటు లేకుండా... ఇంట్లో పనులు బాగానే జరుగుతున్నాయి...మరి బయటవాటి సంగతి? ఎవరి చేస్తారు? గుళ్ళ పేరు పెరిగిపోయింది...అతుకు పెట్టించాలి..భర్త ఉంటే ఏంచేసేవాడో ఆలోచించింది..ఆయన ఉండగా ఎప్పుడూ బయటికి వెళ్ళిన మనిషి కాదు...తలుపు తాళం వేసి ఆచారి దుకాణం పేరు చెప్పి రిక్షా మాట్లాడుకుని వెళ్ళి పని పురమాయించింది...మొదట ఎవరేమనుకుంటారో అని బెరుకు అనిపించింది. పని పూర్తయ్యాక ధైర్యం వచ్చింది... కొన్ని రోజులయ్యాక ఆమేకు సినిమా చూడాలనిపించింది..సినిమా చూసి కొన్నేళ్ళు అయింది...తోడు వచ్చేవాళ్ళు ఎవరూ లేరు...అయినా తనలాంటి ముసలి, ఒంటరి దానితో వేచ్చేవారెవరు? ఒక్కతే చూసి వచ్చింది..అందులో హీరోయిన్ తీసుకున్న నిర్ణయం సమాజ విరుధ్ధం అయినా ఆమె తెగువకి ముచ్చటపడింది....

ఈ పరిస్థితుల్లో తను కొడుకుల దగ్గరకు వెళ్తే జరుగుబాటు బాగానే ఉంటుంది? కానీ ఎణ్ణాళ్ళు? మళ్ళీ బాధ్యతల మడుగులో కూరుకుపోతుంది...కొంతకాలమైన తనకు దొరికిన ఈ స్వేచ్చ అనుభవించాలని ఉంది. ...సాయంత్రం పూట ఏమీ తోచలేదు...భర్త కాలక్షేపం ఏమిటో గుర్తు చేసుకుంది...దగ్గరగా ఉండే పార్కుకు వెళ్ళి కూర్చునేవాడు ఆయన...తను కూడా వెళ్ళింది..పిల్లలు, పెద్దలు, అందరితో సందడి సందడిగా ఉంది...వర్ధనమ్మకు ఊపిరాడినట్టయింది...మనసుకు రెక్కలు మొలిచినట్టు ఉంది....పిల్లల చేతుల్లో "పిడత కింద పప్పు" చూడగానే నోరూరింది...కాసేపు మడీ ఆచారం పక్కన పెట్టి, వాడు అడిగిన రూపాయిన్నర ఇచ్చి ఓ పొట్లం కొనుక్కుంది...బెంచి మీద కూర్చుని పొట్లం విప్పింది. ..పక్కనే ఉన్న ఏడెనిమిదేళ్ళ ముష్టి కుర్రాడు ఆశగా  తనకేసి చూస్తుంటే సగం వాడి దోసిట్లో పోసి, మిగిలినది తాను తింది. నోరు చుర్రుమంది..కాని కొత్త రుచి నోటికి తగిలింది...తన జీవితం మీద తనకి ఓ స్పష్టత వచ్చింది...భర్త కొంత ఆస్తి తనపేర వ్రాసి, తనకు కర్తవ్య బోధ చేసినట్టు తోచింది. ...ఆమె మనసు కొత్త రెక్కలు తొడుక్కున్నట్లయింది..

ఈ కథ ప్రముఖ రచయిత్రి అబ్బూరి చాయాదేవి గారు 1996 లో ఇండియా టుడే కోసం వ్రాసినది...ప్రత్యేకించి స్త్రీ స్వేచ్చ గురించి కాకపోయినా, భర్త, అత్తవారిల్లు, పిల్లలు, సంసారం వీటితోటే అలసిపోయిన స్త్రీలకు, కొంత వయసు తర్వాత బాధ్యతలు తీరిపోయాక, భర్త ఉన్నా, లేకపోయినా, తమకంటూ ఒక జీవితం ఉంది అని స్త్రీలకు స్పష్టంగా చెప్పిన కథ ఇది....ఇందులో మానవతా వాదం తప్ప స్త్రీవాదం లేదు...స్త్రీలు తమను తాము ఐడెంటిఫై చేసుకోవాలనే సందేశం తప్ప....

మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. దయచేసి మీ స్పందన తెలపండి. 

No comments:

Post a Comment