Thursday, 13 November 2014

ఈరోజు బాలల దినోత్సవం. బాలల ప్రగతికి, అభ్యుదయానికి, వారి హక్కుల సంరక్షణకు ఉద్దేశించిన రోజు. నెహ్రు గారి 125 వ జన్మ దినం జరుపుకుంటున్న మనం నిజంగా బాలలు ప్రగతి బాటలో నడుస్తున్నారా , వారి హక్కులు సంరక్షింప బడుతున్నాయ అని ఆలోచించ వలసిన రోజు. ప్రతి ఉదయం దిన పత్రిక తిరగేస్తే, ముక్కు పచ్చలారని ఆడపిల్లల మిద అత్యాచారాలు, లేదా మగపిల్లల కిడ్నాపులు  ఇవన్ని మనకు నిత్య కృత్యం అయిపోయాయి. వీటికి మనం ఎంతగా అలవాటు పడిపోయాము అంటే, ఇంక ఆ పేజీలు పక్కకు తిప్పేసి, ఇది మాములే అన్నట్టు, వేరే వార్తలు చదవడం లో నిమగ్నం అవ్తున్నాం. ఇటువంటి పెద్ద పెద్ద నేరాలు ఏదో మాఫియా వాళ్ళు, కరడు కట్టిన నేరస్తులు చేస్తున్నారు అనుకుంటే ప్రభుత్వం వారి సంగతి చూసుకుంటుంది అని సర్దుకుపోవచ్చు. కానీ చాలా కేసుల్లో ఇవి దగ్గర బంధువుల వల్లనే జరుగుతున్నాయి అని, ముఖ్యంగా లైంగిక వేధింపులు దగ్గర బంధువుల వల్లనే జరుగుతున్నాయి అని సర్వేలు చెపుతున్నాయి. మన చట్టాల్లో ఉన్న లొసుగుల వల్లనో, మరే ఇతర కారణం వల్లనో, విచారణకు ఎన్నో సంవత్సరాలు పట్టేసి, నిందితులకు శిక్ష వెంటనే పడడం లేదు. ఇది మరి కొన్ని నేరాలు జరగడానికి కారణం అవుతోంది. నేర ప్రవ్రుత్తి ఉన్నవాళ్ళ సంగతి పక్కన పెడితే, మరి విద్యా బుద్ధులు నేర్పవలసిన గురువులే కీచకులు అవుతున్నారు. ఆడపిల్లల మీదనే కాక, మగపిల్లల మిద కూడా వారి ప్రతాపం చూపిస్తున్నారు. లైంగిక వేధింపులే కాకుండా, మితిమీరిన దండన కూడా నిత్యకృత్యం అయిపోతోంది. మొన్న కాకినాడ లో అంధ విద్యార్ధుల మిద గురువు ప్రతాపం, నిన్న రాజమండ్రి లో గురువు గారి ఒళ్ళు తెలియని కోపం.... వీటన్నిటికీ  మగపిల్లలు పావులు అవుతున్నారు. లైంగిక వేధింపుల కన్నా ఇవి ఏమి తక్కువ కాదు. పిల్లలు ఎంతో భయభ్రాంతులకు గురి అవుతారు.

14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధ ఉచిత విద్య, బాల కార్మిక వ్యవస్థ రద్దు అనేవి కాగితాలకే కాని, వాస్తవం లో కార్య రూపం దాల్చడం లేదు. ఎంతో మంది బాల కార్మికులు ఎంతో ప్రమాదకరమైన బాణ సంచా తయారీ వంటి కర్మాగారాలలో నేటికీ పని చేస్తున్నారు. వారి వయసుకు మించిన బరువులు మోస్తూ ఇంటిలో సంపాదనకు ఓ చేయి వేస్తున్నారు. వారి తల్లితండ్రుల పేదరికం వలన వారు పని చేయవలసి వస్తోంది. ఇంకా కొంత మందిని మాఫియా ముఠాలు వారి అవసరాల కోసం యదేచ్చగా వాడుకుంటున్నాయి. వీటన్నిటి యొక్క మూల కారణాన్ని గుర్తించి,మూలాల  నుంచి సంస్కరిచుకుంటూ వస్తే, బాలల ప్రగతి మనం సాధించినట్టే.

ఇంకో వైపు చుస్తే, చదువుకునే పిల్లలను కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీ లు, పోటీ పేరుతొ ఎంత అవస్థ పెడుతున్నారో చుసిన వాళ్ళకు తెలుస్తుంది. ఈ నేరం లో సగం పాపం తల్లితండ్రు లదే. చదువు పేరుతొ వారికీ వేరే వ్యాపకం లేకుండా, రాంకుల పోటీలో లోకజ్ఞానం తెలియకుండా, కనీసం చుట్టాలు, స్నేహితులు అనే బంధాలు కూడా లేకుండా పెరుగుతున్న బాలల వర్గం ఇంకొకటి. ఇంతంత ఫీజులు పోసి చదివిస్తున్నాం, రాంక్ రాకపోతే నలుగురిలో తలెత్తుకోలేము, అనిపక్క వాళ్లతో పోల్చి  పిల్లల మనసులపై ప్రెస్టేజ్ అనే ముద్ర వేసి వారిని మానసికంగా క్రుంగ దీయడం వేధింపు కాదా?

మరోవైపు పిల్లలను ఆల్రౌండర్లు చేయాలనే సంకల్పంతో వారిని ఊపిరి తీసుకోకుండా చేసి, రియాలిటీ షో లకు పంపడం, అక్కడ వారిని TRP  రేటింగ్స్ కోసం నవ్వుతూ ఉన్న వాళ్ళను కూడా ఏడ్పించి వినోదం చూసే ప్రేక్షకులు, వివిధ ఛానల్స్ వాళ్ళు నేరస్తులు కారా? 9థ్  క్లాసు అయిన వెంటనే, సెలవులు కూడా ఇవ్వకుండా, 10 థ్ పాఠాలు మొదలుపెట్టేసి, అలాగే, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అవకుండానే, రెండవ సంవత్సరం పాఠాలు మొదలు పెట్టె నేటి విద్యవ్యవస్తకు ఏమి శిక్ష వేయాలి? సంవత్సరం అంతా చదివి పరీక్షలు వ్రాసిన పిల్లలకు ఒక నెల రోజులు అయినా విశ్రాంతి అక్కరలేద? మండు వేసవి లో క్లాసులకు అటెండ్ అయి శ్రమ పడే పిల్లలకు ఆరోగ్యం మిద శ్రద్ధ వహించవలసిన అవసరం లేదా? పిల్లలు సరే, ఏడాది అంతా సూర్యుని కన్నా ముందు లేచి వారికీ బాక్స్ లు కట్టిపెట్టే తల్లులకు కనీసం వేసవి లో అయినా విశ్రాంతి వద్దా? ఇటువంటి వన్నీ మనం కోరి తెచ్చుకుంటున్న సమస్యలు. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు? పిల్లల శక్తి తెలుసుకోకుండా IIT  క్లాసుల్లో చేర్చేసి, సీటు రాలేదు అని వేధించే తల్లితండ్రులు కూడా నేరస్తులే నా దృష్టి లో.

పిల్లలకు వారి ఆలోచనలు వికసించేలా కొంత స్వేచ్చ ఇవ్వండి. వారి మనోవికాసానికి చదువే కాకుండా, ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యం. ఈ విషయాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి. పేదరికం కారణం గానో, సమాజం కారణంగానో, నిరక్షరాస్యత కారణం గానో, ఏ ఒక్క చిన్నారి కంటి లోను నీరు కనబడని రోజునే మనకు నిజమైన బాలల దినోత్సవం. దీని కోసం "స్వచ్చ భారత్ " లాగా "స్వచ్చ బాల్యం, స్వేచ్చా బాల్యం" అనే కార్యక్రమాలు కూడా చేపట్టాలేమో!


No comments:

Post a Comment