Sunday, 21 September 2014

ఇది గురజాడ వారి స్వగృహం. వీధి వైపు నుంచి. అంటే సింహద్వారం ఇది. రెండవ ఫోటో లోపలి వైపు. మూడవ ఫోటో, ఇంటి లోపల ఉన్న బావి. అయన రోజు అక్కడే బావి నీటి తో స్నానం చేసి, ప్రక్కనే ఉన్న తులసి మొక్కకు పూజ చేసుకునేవారట. క్రిందటి సంవత్సరం ఈ ఇంటిలో రెండు చిన్న చిన్న దొంగతనాలు జరిగాయిట. ఆ తరువాత సరిగ్గా సంవత్సరం క్రితం, అయన జన్మదినం నాడు ఈ ఇంటిని ప్రభుత్వం వారు స్మారక చిహ్నంగా ప్రకటించారు. అయన పేరు మీద ఒక పోస్టల్ స్టాంప్ ను కూడా విడుదల చేసారు. ఇంకా అయన వాడిన కుర్చీ, కళ్ళజోడు, మిగిలిన వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. రాజా వారి కోట నుంచి చాలా దగ్గరగా ఉంటుంది గురజాడ వారి నివాసం.సెప్టెంబర్ 21.

ఈరోజు ప్రపంచ అల్జీమర్స్ డే. ఆధునిక ప్రపంచం లో చాల వేగంగా విస్తరిస్తున్న వ్యాధి అల్జీమర్స్. భారత దేశానికి ప్రస్తుతానికి ఈ ముప్పు లేకున్నా, మారుతున్న జీవన శైలి, మారుతున్న ఆహార విహార నియమాల వాళ్ళ భవిష్యత్తు లో ఈ ముప్పు పొంచి ఉంది అని మేధావులు చెప్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి  అభివృద్ది చెందిన దేశాలలో అధిక శాతం మరణాలు ఈ వ్యాధి వలన కూడా సంభవిస్తున్నాయి అని సర్వే లు చెపుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఈ వ్యాధి గురించిన అవగాహన తీసుకురావటానికి " అల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ " అనే సంస్థ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వాటిలో భాగంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 నాడు ప్రపంచ అల్జీమర్స్ డే ను జరుపుతున్నారు. ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ, ప్రజలలో ఈ వ్యాధి గురించి ప్రచారం చేస్తున్నారు.

సాధారణంగా తీవ్రంగా  జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆలోచనా శక్తి తగ్గిపోవడం వంటి లక్షణాలను అల్జీమర్స్ వ్యాధి లక్షణాలుగా పరిగణిస్తారు. ఏదైనా వస్తువు ఎక్కడ పెట్టామో మర్చిపోవడం, సమయానికి ఒక పేరు కానీ, ఒక పని కానీ గుర్తు రాకపోవడం, ఒక అడ్రెస్స్ ఏదైనా గుర్తురాకపోవడం ఇటువంటివి అందరికీ సామాన్యంగా ఉండే ఇబ్బందులే. ఇవి అల్జీమర్స్ వ్యాధి లక్షణాలు అనుకోలేము. అయితే., ఈ వ్యాధి తోలి దశలను మనం సులభంగా గుర్తుపట్టచ్చు. మన కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులలో కానీ ఈ క్రింది లక్షణాలు ఉంటె మనం వారిని వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకు వెళ్ళాలి.

1. రోజూ చూసే ప్రక్క ఇంటి వాళ్ళ పేర్లు మర్చిపోవడమే కాకుండా, మనకు బాగా తెలిసిన వారి , రోజూ చూసేవారి ముఖాలు కూడా గుర్తు పట్టలేక పోవడం.

2. పనులు చేసే క్రమాన్ని మర్చిపోవడం. ఉదాహరణకు, భోజనం చేసేటపుడు దేని తర్వాత ఏది తినాలో మర్చిపోవడం, బట్టలు కూడా దేని తర్వాత ఏది వేసుకోవాలో మర్చిపోవడం.

3.రోజువారీ సంభాషణలలో వచ్చే పదాలను మర్చిపోవడం, మాట తడబడడం, మాట్లాడుతున్నపుడు ఒక్కో సందర్భం లో అక్కడ ఎ మాట వాడాలో తెలియక పోవడం, ఎదుటివారి సంభాషణ అర్ధం చేసుకోలేక పోవడం.

4. రోజూ వెళ్ళే ప్రదేశాలు -- గుడి, పార్క్, మార్కెట్, ఇటువంటి వాటిని గుర్తు పట్టలేకపోవడం, ఎక్కడికైనా వెళ్లి మళ్ళీ ఇంటికి దారి మర్చిపోవడం, ఫలానా ఇల్లే, తమ ఇల్లు అని గుర్తు పట్టలేక పోవడం,

5. వస్తువులను సరి అయిన జాగా లో పెట్టలేకపోవడం. ఉదాహరణకు పెన్నును ఫ్రిడ్జ్ లోను, కూరగాయలను బెడ్ రూం లోను, దుస్తులను బాత్ రూం లోను పెట్టడం.

6. తొందర తొందరగా మూడ్స్ మారిపోవటం, సంతోషం గా ఉన్న వ్యక్తీ అంతలోనే కోపం తెచ్చుకోవడం, అందరి మీదా అరవడం, తమ భావాలను స్పష్టంగా వ్యక్తీకరించలేక పోవడం, అందర్నీ అనుమానించడం, ఎక్కువ చికాకు పడడం,


7.కూర్చున్న చోటనే అదే పనిగా కూర్చోవటం, గంటల కొద్దీ టీవీ ముందు కూర్చున్నా, దృష్టి దాని మిద లేకపోవడం, గంటల కొద్దీ నిద్రపోవడం,

ఇటువంటి వన్నీ ఈ వ్యాధి లక్షణాలు. పని లోను, వ్యాపార వ్యవహారాలలోను, తీవ్రంగా అలిసిపోయిన వారు, జీవితం లో ఎక్కువ సంఘర్షణ పడిన వారు సాధారణంగా ఈ వ్యాధికి గురి అవుతారు అని సర్వే లు చెపుతున్నాయి. కొన్ని నాడీ సంబంధిత రుగ్మతల వలన కూడా ఈ వ్యాధి రావచ్చు.

అయితే దురదృష్ట వశాత్తు, ఈ వ్యాధిని నిర్ధారించేందుకు స్పష్టమైన పరీక్షలు, ఇతర మార్గాలు లేవు. అల్జీమర్స్ కు గురి అయ్యారని భావిస్తున్న రోగి బంధువుల నుంచో, దగ్గరి స్నేహితుల నుంచో సమాచారం సేకరించి, వారి జీవన విధానాన్ని తెలుసుకుని ఈ వ్యాధిని నిర్ధరించడమే. అలాగే ఈ వ్యాధికి నిర్దిష్టమైన చికిత్స కూడా ఏమి లేదు. ఈ వ్యాధిని రాకుండా ముందుగ  నివారించడానికి కానీ, వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మూలించ లేకపోయినా, కనీసం వ్యాధి తీవ్రత తగ్గించడానికి కానీ, మందులు లేవు.

ఈ వ్యాధిని నివారించడానికి కుటుంబ సభ్యుల, సన్నిహితుల, స్నేహితుల మద్దతు, ప్రేమ, సహకారం ఎంతో ముఖ్యం.  ఈ రోగులతో రోజు గడపటం చాలా కష్టమే, అయినప్పటికీ, వ్యాధి గురించి మాట్లాడకుండా, వారిని ప్రేమతో ఆదరించి, సహకారం అందించినపుడు వారికీ కొంచెం ప్రశాంతం గా ఉంటుంది. అంతకు మించి మనం వారికీ అందించే చికిత్స ఏమి లేదు. మనం వారిని ప్రేమిస్తున్నట్టు వారికీ తెలియచేయడం ఇక్కడ ముఖ్యం.

చిన్నతనం నుండీ పిల్లల చేత పజిల్స్ పూర్తీ చేయించడం, సు డో కు వంటివి, లేక క్రాస్ వర్డ్ పజిల్స్ వంటివి చేయించడం, పుస్తకాలూ చదివించడం, మెదడుకు పదును పెట్టె పొడుపు కథల వంటివి, నేర్పించడం వలన, మెదడుకు బలం చేకూర్చే, బాదం, అన్జీరా వంటివి తినిపించడం వలన, విటమిన్ లోపాలు లేకుండా మంచి పౌష్టిక ఆహారం ఇవ్వడం వలన, భవిష్యత్ లో వారు ఈ వ్యాధి కి గురి కాకుండా ఉంటారు.

Wednesday, 10 September 2014

 ఈమధ్య చాల మంది తల్లితండ్రులను చూస్తున్నాను. పిల్లలను ఎక్కువ గారాబం చేసి, వాళ్ళలో మొండితనాన్ని ఇంకా పెంచుతున్నారు. పిల్లలు చాల తెలివైన వారు. మనం ఎలా పెంచితే, అలాగే పెరుగుతారు. మన బలాలను, బలహీనతలను అంచనా వేయడం లో వాళ్ళు ఘనులు. ఇప్పటి తల్లితండ్రులు చాల మంది ఒకలాగే ఆలోచిస్తున్నారు. మనకు ఉద్యోగం వచ్చేవరకు సైకిల్ నే ఉపయోగించాం కదా, పిల్లవాడు అడుగుతున్నాడు కదా, పోనీ బైక్ కొని ఇద్దాం, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇద్దాం. మనం మన చిన్నతనం లో ఏమి సుఖాలు అనుభవించలేదు కదా, పిల్లలను అయినా అనుభవించనీ అనే ఆలోచనాలో ఉన్నారు. మనం అనుభవించలేని సుఖాలు వాళ్ళకు ఇద్దాము అనే ఆలోచన చాలా తప్పు. వారికీ ఏది అవసరమో అది కొని ఇయ్యండి. మనం కొని ఇచ్చిన వస్తువును వారు సరి అయిన మార్గం లో ఉపయోగించుకొనే సామర్ధ్యం వారికీ ఉందా లేదా అని ఆలోచించండి. వయసును బట్టి వారి కోరికలకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే, చిన్నతనం నుంచి, ఈ పని చేస్తే నీకు ఈ బహుమతి ఇస్తా అని చెప్పటం తప్పు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ బహుమతి ఇస్తా అని చెప్పకండి. మంచి మార్కులు తెచ్చుకోవడం వారి విధి. అది వారికీ తెలిసేలా చేయండి. ఒక పని చేసిన తరువాత, మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత, నువ్వు కష్టపడ్డావు కాబట్టి, నువ్ ఒక మంచి పని చేసావ్ కాబట్టి నీకు ఈ బహుమతి అని చెప్పండి. ఈ రెండింటికీ తేడాను దయచేసి అర్ధం చేసుకోండి. ఇంట్లో పిల్లలకు ప్రతి పనిలోనూ, ప్రతి విషయం లోను వారి బాధ్యతను వారికీ తెలియచేయండి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఆ పని మనది కాదులే అని వాళ్ళ పని వాళ్ళు చూసుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా, కాస్త వారిని పలకరించి, మందులు ఇచ్చి, కాస్త టీ యో, కాఫీ యో చేసి ఇవ్వడం అలవాటు చేయండి. ఇంట్లో హడావిడిగా ఉన్నపుడు, పని చాల ఉండి, మీ ఒక్కరి వల్ల అవనపుడు,  పనిలో సహాయం చేయడం అనే పధ్ధతి పిల్లలకు నేర్పండి. దానివల్ల మీకు పని సులువు అవుతుంది. వారికీ బాధ్యత తెలుస్తుంది. కొంత వయసు వచ్చిన పిల్లలకు వారి పని వారు చేసుకోవడం, ప్రయాణాల సమయంలో వారి బాగ్ లు వారు సర్దుకోవటం అలవాటు చేయండి. 10, 12 సంవత్సరాల పిల్లలు చక్కగా చేయగలరు ఈ పనులు. వారికీ సరదాగా ఉంటుంది కూడాను. మీకు పని తగ్గుతుంది. ఒకటి రెండు సార్లు వాళ్ళు చేస్తున్నపుడు మీరు పర్యవేక్షిస్తే, తరువాత వాళ్ళు సొంతగా చేసుకోగలుగుతారు.

( మరికొన్ని సూచనలు వచ్చేసారి )