Friday, 29 April 2016

"పుడితే ఆ భానుమతి లాగనో, ఇందిరాగాంధీ లాగానో పుట్టాలి.మనమూ ఉన్నాము ఎందుకూ? మా తరం ఎలాగూ దాటిపోయింది, మీరైనా ఆ ధైర్యం, తెలివితేటలు, తెగువా తెచ్చుకోండే...సుఖపడతారు జీవితంలో...."

ఇది చిన్నతనంలోనే భర్తను పోగొట్టుకుని, మా చిన్నతనం  నుంచీ మాఇంట్లోనే ఉంటున్న మా పెద్దమ్మ మాట.

ఇంట్లో మగవాళ్ళు అనవసరంగా మాట జారినా, దాష్టీకం చూపించినా, తన చిన్నతనాన్నీ, మా భవిష్యత్తుని గుర్తు తెచ్చుకుని అనే మాట.

మా ఇంట్లో ఇంకా ఉమ్మడి కుటుంబమే...పెదనాన్నగారు చాలా కాలం క్రితమే కాలం చేయడంవలన, నానమ్మ, తాతయ్య, చదువుకుంటున్న బాబాయిని తీసుకుని, మా ఇంటికే వచ్చేసార్ట. తలచెడిన మా పెద్దమ్మ కూడా మాఇంటికే వచ్చేసింది.

ఆ రోజుల్లో (మా అమ్మ చిన్నతనంలో, పెళ్ళయ్యి, కొత్తగా కాపురానికి నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినపుడు,) మా పెదనాన్నగారు, చండశాసనుడిగా ఉండేవారట. ఇంట్లో ఆడవాళ్ళు కాఫీ తాగడం నిషేధం....చాలా రోజులు ఆ రూలే సాగింది. మా అమ్మ పట్నం పిల్ల అవడంతో, పొద్దున్నే కాఫీ అలవాటు అని, ఆమె కోసం ప్రత్యేకంగా తెప్పించేవారట కాఫీ గింజలు..అంతకు ముందు ఆడవాళ్ళకు కూడా కాఫీలా అని చిరాకుపడ్డ మా పెదనాన్న. ..ఇంట్లోనే వేయించి పొడి కొట్టుకోవడం.

ఆవిడ ఇంకా తెల్లని సైనుపంచెనే ధరించేది. ఆవిడకి ఉన్న పెద్ద జడ చూసి, జుట్టు తీయించొద్దు అని మొత్తుకున్నా,తన ఆడపడుచులు వినలేదు అని ఎంతో బాధపడేది మా నానమ్మ.

తన, పర బేధాలు లేకుండా నన్ను, మా బాబాయి పిల్లల్ని తన పిల్లల్లాగానే పెంచింది ఆవిడ. రామాయణం, భారతం తోపాటు, పతివ్రతల కధలు, పురాణాలు చెప్పి,  "ఇదుగో ! అవి ఆ రోజులు, ఈ రోజుల్లో మరీ నోట్లో నాలుక లేకుండా ఉండకూడదు. పోట్లాడమని నేను చెప్పటంలేదు కాని, నోట్లో మాట నోట్లోనే కుక్కుకోకుండా కాస్త బయటికి రానీయండి ...." అని చక్కని సలహాలు చెప్పేది. మా నాన్నతో చనువుగా పోట్లాడి నన్ను డిగ్రీ వరకు చదివించినది ఆవిడే.

 "భానుమతి లాగా ఆ మాట చెణుకు, నొసటి విరుపు ఉండాలే తల్లీ, ఇందిరా గాంధీ లాగా మంచి చేసినా, ఏం  చేసినా ధైర్యంగా చేసే తెగువ నేర్చుకోండే అమ్మలూ...." అనేది...

ఆరోజుల్లో పల్లెటూళ్ళల్లో, కాస్త కలిగిన కుటుంబాలలో మధురవాణి మోజులు ఉండేవట...ఫలానా ఆడావిడ ఫలానా పంతులు గారి తాలూకా అని చెప్పుకోవటం కూడా ఓ గొప్పగా, స్టేటస్ గా ఉండేదట. అలా అన్ని రసాస్వాదనలు అయ్యాక ఇంటికి వచ్చి అలసిపోయి పడుకున్న పెద్దమ్మని కాలితో తన్ని, "అన్నం పెట్టు" అని లేపేవారట....."గొప్ప సరసుడేలే" అనేది ఆవిడ, తనని తక్కువగా చూసినందుకు వ్యంగ్యంగా అంటోందో, ఆయన గుణానికి అంటోందో తెలిసి చచ్చేది కాదు.

"అత్తగారు నాలుగు మాటలు అన్నా, సర్దుకుపోండి, ఏదో ఆవేశంలో అన్నా, కొడుకు నొచ్చుకుంటే ఆవిడమాత్రం భరించగలదా, పండక్కో పబ్బానికో వస్తే, ఇక్కడ కూడా అన్నావదినల్లో మర్యాద కాని, చీటికీ మాటికీ వచ్చి చిన్నతనం పడకండి...నువ్వు నాలుగు చీరలు కొనుక్కుంటే, మీ అత్తగారికి ఓ రెండు, మీ నాలుగు సరదా మాటల్లో ఆవిడ మాటలు రెండు, ఇవే అత్తగారిని గెలుచుకునే మార్గాలు" అత్తారింటికి వెళ్తుంటే పెద్దమ్మ చెప్పిన సలహాలు.

ఈరోజున పెద్దమ్మ లేని ఇంటికి వెళ్ళాలంటే ఏదో వెలితి. జీవితాన్ని ఏమీ అనుభవించకపోయినా, మమ్మల్ని తీర్చిదిద్దిన తీరు అద్భుతం. "తామరాకు మీద నీటిబొట్టు అంటే, ఏది పట్టనట్టు ఉండడం కాదు, పొగడ్తలు, చీవాట్లు మనసుకు తీసుకోకుండా నీ కర్తవ్యం నువ్వు చేయటం.....ఇంతకన్నా సులువుగా గీతాసారం బోధించగలరా ఎవరైనా?" మాకు మా పెద్దమ్మ అమ్మ కన్నా ఎక్కువ, అమ్మలగన్నయమ్మ. మాపాలిటి గీతాచార్యుడు..కృష్ణభగవానుడు..

Saturday, 23 April 2016

ఒక స్త్రీకి, లోకంలో అన్నిటికన్నా పెద్ద సమస్య ఏమిటుంటుంది? అబ్బా...ఎవ్వరూ చెప్పలేరు...ఒక పెళ్ళికో, ఫంక్షన్ కో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆవిడ మనస్సులో జరిగే ఒకానొక సంఘర్షణను, ఇంట్లోని మగవాళ్ళు, మగపిల్లలు అస్సలంటే అస్సలు అర్ధం చేసుకోలేరు కాక చేసుకోలేరు. ఎవరి ఇంట్లో అయినా పెళ్ళికి పిలిస్తే, పిలిచేవాళ్ళదేముంది, చటుక్కున ఇలా వచ్చి, బొట్టు పెట్టి, ఓ కార్డు ఇచ్చి, ఓ కాఫీ తాగి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు మొదలవుతాయి ఆడవాళ్ళ కష్టాలు....
ఇంతకీ పిలిచిన వాళ్ళు చుట్టాలా, ఫ్యామిలీ ఫ్రెండ్సా, కాలనీ వాళ్ళా, కొలీగ్సా,ఇన్ని కేటగిరీలు ఉంటాయి....పెళ్ళికో, సదరు ఫంక్షన్ కో ఎప్పుడెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలి అనే సమస్య తో పాటూ---పెద్ద ప్రోబ్లెం అక్కడ మొదలవుతుంది. ఎన్ని చీరలు తీసుకెళ్ళాలి, అందులో పట్టువెన్ని, బనారసువెన్ని, ఫ్యాన్సీవెన్ని, జరీవెన్ని? సరే, రాత్రిపూట కట్టుకోవడానికి కాటన్ చీరలు ఎలాగూ తప్పవనుకోండి...పెళ్ళి అయితే, స్నాతకానికి ఒకటి, భోజనాలప్పుడు ఒకటి, సాయంత్రం ఎదురు సన్నాహాలకు ఒకటి, ముహూర్తానికి ఒకటి, వ్రతానికి ఒకటి, ఒకవేళ వెళ్ళాలనుకుంటే మూడునిద్రలకు కొన్ని మంచి చీరలు...వీటికి తోడు, ప్రతి చీరకు మ్యాచ్ అయ్యే నగలు....అబ్బ ఎంత పని, ఎంత గడబిడ...
.పోనీ బీరువా అంతా తీసుకెళ్ళు....ఇంట్లో మగవాళ్ళ సెటైర్లు....ఇందులో ఒక్కటైనా మర్చిపోకుండా అన్నీ మళ్ళీ జాగ్రత్త గా తీసుకురాగలవా అమ్మా? మగపిల్లల అనుమానాలు....వాళ్ళకేం తెలుసు, మనం పెట్టుకునే నగలు, కట్టుకునే చీరల బట్టే మన విలువ ఉంటుందని, అందరూ మనవాళ్ళే అనుకునే అమాయకులు వాళ్ళు ....వాళ్ళకేంటి ఓ ప్యాంటు, షర్టు జతతో నాలుగు పెళ్ళిళ్ళు చేయించి, చూసేసి రాగలరు.....మనకు అలాక్కాదే.....ఒక్కసారి చుట్టాల చురుకు చూపులు, వెటకారాలు భరిస్తే తెలుస్తుంది వాళ్ళను టాకిల్ చేయడం ఎంత కష్టమో.....అరే, ఒక్కరైనా, నీ పిల్లలు బాగా చదువుతున్నారు, చక్కగా పెంచావు అనేవాళ్ళు ఉండరండీ, ఈ చీర ఎప్పుడు కొన్నావు? ఈ నగ ఎంతయింది? ఇదొక్కటే గోల....
సరే, ఎక్కడున్నాం మనం? ఇంట్లో బీరువా దగ్గర కదా...ఏ చీరలు తీసుకెళ్ళాలబ్బా? ఈ ఉప్పాడది కట్టుకో....తేలిగ్గా ఉంటుంది...నలిగినా పర్వాలేదు...శ్రీవారి సలహా....అబ్బా...ఎంతపెట్టినా ఉప్పాడ చీర వేల్యూ తెలియదండి..మరీ సింపుల్ గా ఉంటుంది ...మిగతావి కూడా చూద్దాం ఒకసారి....ఈ కంచి పట్టుది...అబ్బే...ఆకుపచ్చ ఇప్పుడు ఫ్యాషన్ కాదు...ఈ జరీది...ఊహు..మరీ పెద్దదానిలా ఉంటాను...ఈ బనారసుది....ఊహు...బరువెక్కువ....ఈకాలంలో మోయలేను....కుచ్చిళ్ళు, కొంగు ఇంకెవరైనా మోయాలి... ఈ వెంకటగిరి చీరకి గంజి లేదు. అయినా దీనికి నాదగ్గరున్న నగలేవీ మ్యాచ్ కావు....ఆ నీలంది ఇదివరకు కట్టేసుకున్నాను.....అబ్బ....తల బద్దలైపోతొంది కానీ, చీరల సెలెక్షన్ అవ్వటం లేదు.....
.ఇంతలో ఎవత్తో ఒక పిన్ని కూతురో అత్తకూతురో చేస్తుంది ఫోన్....ఏం కట్టుకుంటున్నావ్, ఏం తెచ్చుకుంటున్నావ్ అని...ఫలానాది అనగానే, అదా అది నీ ఒంటి రంగుకి అంతగా నప్పలేదు అక్కా....బాచిగాడి పెళ్ళిలో కట్టుకున్న కనకాంబరం రంగుది తెచ్చుకో.....దానికి కొత్తగా కొనుక్కున్న కెంపుల నెక్లెస్ బాగుంటుంది..ఓ సలహా మన మీదకు విసిరేస్తుంది....ఇప్పుడు అసలైన డైలెమా మొదలవుతుంది....శ్రీవారు చెప్పిన చీరా, చెల్లెలు చెప్పిన చీరా? ఆఖరికి పెళ్ళి పిలుపుల రోజు మొదలైన సెలెక్షన్, పెళ్ళికి బైల్దేరే ముందురోజు వరకు సా......గి, ఈ మధ్యలో కొన్ని ముఖ్యమైన పనులు మర్చిపోయి, హడావిడిగా బ్యాగ్ సర్దుకోవడంతో ముగుస్తుంది.
ఇప్పుడు చెప్పండి...ఇంట్లో ఆడవాళ్ళకు ఇంతకన్నా అంతర్జాతీయ సమస్య ఇంకోటి ఉందా అని? ఇంతటితో అవ్వలేదండోయ్.....ఇంకా చాలా ఉంది....తరువాత చెప్పుకుందాం...

Friday, 22 April 2016

అసలు రామాయణం, భగవద్గీత వంటి పుణ్యగ్రంధాలని వయసు అయిపోయిన తర్వాత చదివే పుస్తకాల లెక్కలోకి ఎందుకు వేస్తారో అర్ధం కాదు. వయసు అయిపోయినాక, ఒళ్ళు సహకరించక, కళ్ళు కనబడక, ఆరోగ్యం సరిగా లేక, ఇహ అప్పుడు చదివేదేమిటీ, అర్ధం చేసుకునేదేమిటీ? అప్పటికే జీవితంలో చేయవలసిన తప్పులన్నీ చేసేసి, మనసా, వాచా, కర్మణా దోషాలన్ని చేసేసి ఇక సరిచేసుకోవడానికి కూడా సమయం సరిపోని ఆ వయసులో ఇక చదవడం ఎందుకూ? ఇంట్లో ఒక వ్యక్తి చేసిన తప్పులు కానీ, వేసిన తప్పటడుగులు కానీ ఆ ఇంటిలోని వారందరి మీదా, తరతరాలపాటు  ప్రభావం చూపుతాయి. బాధ్యతలు కొన్ని తీరిన తరువాత, నడివయసులోనైనా ఇలాంటి సద్గ్రంధాలు చదవడం, చదివి అర్ధం చేసుకోవడం మొదలుపెడితే, అంతవరకు తెలిసో, తెలియకో చేసిన దోషాలన్నిటినీ సరిచేసుకుని, మునుముందు జీవితాన్ని శాంతిమయం చేసుకునే అవకాశం ఉంటుంది. రామాయణం చదివి ఏమి నేర్చుకోవాలో ఈ దేశంలో పుట్టినవారెవరికీ చెప్పక్కర్లెదు. భగవద్గీతా పఠనం, మనలను మనం తెలుసుకొవడానికి తోడ్పడుతుంది. మన గుణదోషాలను తెలుసుకోవడానికి , దానివలన మనలను మనం స్వచ్చపరుచుకోవటానికి ఎంతో సహాయపడుతుంది.ఈ పని చేయతగినదా, కాదా, ఈ మాట మాట్లాడతగినదా కాదా అని మంచి చెడూ విశ్లేషించుకోవడానికి ఉపయోగపడుతుంది. మనలను మనం సంస్కరించుకుంటే, అరిషడ్వర్గాలను పూర్తిగా జయించలేకపోయినా, (అలా పూర్తిగా జయించడానికి ఎంతో సాధన కావాలి, మానవమాత్రుల వలన దాదాపు అసాధ్యం ) కొంతవరకు నియంత్రించుకోగలిగితే, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా మనలను ఇష్టపడతారు. మనసు మీద, మాటమీద, ఆలోచనల మీద నియంత్రణ సాధించడానికి భగవద్గీతా పఠనం ఎంతో ముఖ్యం. దయచేసి భగవద్గీతను శోకానికి మారుపేరుగానో, చావు ఇంట్లో పాడుకొనేదిగానో తలవకండి...అది మానవులకు కృష్ణ భగవానుడు అందించిన అత్యుత్తమమైన కానుక....
"అమ్మయ్య! నేనే గెలిచాను, ఇవాళ ఒక్కసారైనా కళ్ళుమూసుకోకుండా, చెవులు మూసుకోకుండా, ఒక్క సీన్ కూడా మిస్ చేయకుండా హారర్ సినిమా మొత్తం చూసేసా....అనుకున్న ప్రకారం, నా పార్టీ నాకిచ్చెయ్యండి" పిల్లలతో ఒక హారర్ మూవీ చూసిన తర్వాత నేనన్న మాటలు. హారర్ సినిమాలు అంటే చచ్చేంత భయం నాకు. దెయ్యాలు అవీ వచ్చినప్పుడు కళ్ళు మూసేసుకుంటాను. పిల్లల దగ్గర లోకువ అవ్వకూడదని, (వాళ్ళు ఇంటికి వచ్చిన దగ్గర్నుండి నన్ను పిరికి అని ఏడిపిస్తారని)  సాధారణంగా దెయ్యాల సినిమాలకు వాళ్ళతో వెళ్ళడం తప్పించుకుంటాను. "నా మొహంలా ఉంది, నువ్వు చూసింది థియేటర్ లో కాదు, ఇంట్లో, అది కూడా సౌండ్ తగ్గించుకుని, దీనికి పార్టీ ఇవ్వడం కుదరదు," అని ఖరాఖండీ గా చెప్పేసాడు మా చిన్నవాడు. నిజమే కదా, థియేటర్ లో సౌండ్ ఎక్కువ పెట్టడం వల్లనే మనకు హారర్ సీన్లు వచ్చినప్పుడు ఎక్కువ భయం వేస్తుంది. పిల్లలకు కూడా అంతేనట. మనం వాళ్ళను తిట్టేటప్పుడో, కేకలేసేటప్పుడో, మనం గొంతు పెంచి గట్టిగా మాట్లాడడం, మన ముఖ కవళికలు చిరాగ్గా పెట్టడం వలననే వాళ్ళకు అవసరమైన దానికన్నా ఎక్కువ భయం వేస్తుందట. ఆ భయం ఒక్కోసారి మన మీద వాళ్ళకు నిరాసక్తతను కూడా కలుగచేస్తుంది అని ఒక సర్వే లో తెలిసింది. అంటే పిల్లలు కూడా ఆ టైం లో మనల్ని దెయ్యాలను చూసినట్టు చూస్తారేమో అని నాకు అనుమానం వచ్చింది.

దెయ్యాలంటే భయం ఎందుకమ్మా, అంతకు మించి హాని చేసేవాళ్ళు మనుషుల్లోనే ఉన్నారు, కంటికి కనబడని దెయ్యాల గురించి భయమేమిటీ అని సాగదీస్తాడు పెద్దవాడు. అసలు దెయ్యాలు అంటే చేస్తే మంచి చేస్తాయి, లేదంటే తప్పుకుని వెళ్ళిపోతాయి అంతే కాని చెడు చెయ్యవు కదా....వాడి ఉవాచ.  వాడు దెయ్యాలకు వీరాభిమాని. వాడు చదివే పుస్తకాలు, చూసే వీడియోలు అన్నీ దెయ్యాల గురించే....వీలైతే దెయ్యాల గురించి రిసర్చ్ చెయ్యాలని ఉంది అంటాడు. విదేశల్లో అలా దెయ్యాల గురించి రిసర్చ్ చేసే గ్రూపులు ఉంటాయిట. వెళ్ళి వాటిల్లో చేరిపోతాను అంటాడు కాసేపు, దెయ్యాల మీద ప్రేమ ఎక్కువైనప్పుడు...చేస్తే చెయ్యి కాని, ఇంటికి మాత్రం తీసుకురాకు నాయనా, ఇప్పటికే మీ అందరితోనూ వేగలేకపోతున్నాను ...ఇది నా జవాబు...వేపుకుతినడంలో నిన్ను మించినదెవరూ  తల్లి...మావారి సన్నాయి నొక్కులు.

నిజమే! మనుషుల కన్నా ప్రమాదకారులు, భయంకరమైన ఆలోచనలు ఉన్నవాళ్ళు లోకంలో ఎవరూ లేరేమో...ఒక్కోసారి కౄరమృగాలే నయం, వాటి జోలికి వెళ్ళకపోతే , అవి కూడా మనలని ఏమీ చెయ్యకుండా వాటిదారిన అవి పోతాయి. మనుషులు అలా కాదే! పక్కవాడి ఉన్నతిని, సుఖాన్ని, సౌఖ్యాన్ని సహించలేరు. పక్కవాళ్ళని విమర్శించడంలో, వారి చెడు కోరుకోవడంలో కొంతమందికి ఎంత ఆనందమో...అటువంటి వారు, గతంలోనూ, వర్తమానం లోనూ కూడా జీవించలేరు. భవిష్యత్తు అగమ్యగోచరమే కదా!

భగవంతుడు ఎవరికి తగిన సుఖాలు వారికి ఇచ్చాడు. ప్రపంచం లో ఎవ్వరికీ పూర్తి సుఖాన్ని కాని, పూర్తి దు:ఖాన్ని కాని ఇవ్వలేదు. అందరికి కష్ట సుఖాలను కలిపే ఇస్తాడు. దాసరి నారాయణ రావు సినిమాలో లాగా, ఉన్న సుఖాన్ని దు:ఖంగా, వచ్చిన కష్టాన్ని సుఖంగా  మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది. మన బుధ్ధి సవ్యంగా ఉండి, మనసు ప్రశాంతంగా ఉంటే సరి అయిన ఆలోచనలు వస్తాయి, మన ప్రస్తుత పరిస్థితిని మెరుగుపరుచుకుని, జీవితాన్ని హాయిగా గడపగల అవకాశం మనకుంది. దెయ్యాల కన్నా చెడుగా ఆలోచించి, పక్కవాడి నాశనమే ఎప్పుడూ కోరుకునేవాళ్ళకి ఎప్పుడూ సుఖం ఉండదు.