Monday, 30 November 2015

మన జీవితం ఒక రైలు ప్రయాణం వంటిది. ఇందులో ఎన్నో స్టేషన్లు, ఎన్నో దారులు, కొన్ని ముచ్చట్లు, కొన్ని ప్రమోదాలు, కొన్ని ప్రమాదాలు... మనం పుట్టినప్పుడే ఈ జీవితరైలు ని ఎక్కుతాము. మన తల్లితండ్రులు మనకి టిక్కెట్టు కొని ఎక్కించారన్నమాట. వారు మనతో మన జీవితాంతం ఉంటారనుకొని మనం భ్రమపడతాం. కాని, మనలను ఒంటరిగా వదిలేసి, వారి సమయం వచ్చినపుడు వాళ్ళు రైలు దిగిపోతారు......ఇదంతా జరిగేలోపే మరికొంతమంది రైలు ఎక్కుతారు. అందులో కొంతమంది, మన తోబుట్టువులుగా, చుట్టాలుగా, స్నేహితులుగా, పిల్లలుగా గుర్తిస్తాం మనం....చాలామంది మన జీవితాలలో శాశ్వతమైన శూన్యాన్ని మిగిల్చి, వారు వారి గమ్యాలు వచ్చినపుడు రైలు దిగిపోతారు.... మరికొంతమంది, వారెప్పుడు ఖాళీ చేసారో కూడా మనం గుర్తించకుండానే వెళ్ళిపోతారు.... ఈ ప్రయాణంలో సంతోషం, దు:ఖం, ఆశ, నిరాశలు, పలకరింపులు, వీడ్కోళ్ళు, అన్ని కలగలిపి ఉంటాయి....తోటి ప్రయాణీకులతో సరదాగా ఉంటూ, వారికి అవసరమైన సహాయం చేస్తూ, ప్రేమగా, ఆదరణగా, వారికి సౌకర్యవంతంగా మెలిగినపుడు మన ప్రయాణం సాఫీగా జరిగింది అని చెప్పొచ్చు.... అటువంటి ప్రయాణీకులను అందరూ ప్రయాణమంతా గుర్తుపెట్టుకుంటారు కూడా...మన గమ్యం ఎంతసేపేట్లో వస్తుందో, ఎక్కడ మనం దిగిపోవాలో మనకు తెలియదు. ...ఇదే ఈ ప్రయాణంలోని రహస్యం..అందుకే మనం మనకు సాధ్యమైనంత సౌహార్ద్రత తో ప్రయాణించాలి......తోటి ప్రయాణీకులతో చిన్న చిన్న సర్దుబాట్లు, క్షమాపణలు---ఇవన్నీ తప్పనిసరి......మందగ్గరున్నది మనం పంచుకోవడం నేర్చుకోవాలి.....ఎందుకంటే, మనం వీడ్కోలు చెప్పవలసిన సమయం వచ్చినపుడు, మనం మన మధుర స్మృతులన్నిటినీ, వెనుక మిగిలిన వాళ్ళకు వదిలేసి, ఈ జీవితప్రయాణం లో సెలవు తీసుకుంటాం. ...మన జ్ఞాపకాలు మిగిలిన వారికి కూడా మధురంగా ఉండి, మనల్ని వారు గుర్తుపెట్టుకోవాలి కదా......
నా ప్రయాణంలో నాకు కలిసిన నా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు.....నా ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చినందుకు......
నమస్తే...
మనందరికీ తెలిసిన "టైటానిక్" షిప్ సముద్రంలో మునిగిపోయేటప్పుడు అక్కడ మరో మూడు నౌకలు ఉన్నాయట...అందులో ఒక నౌక పేరు శంప్సన్....ఇది టైటానిక్ కు కేవలం 7 మైళ్ళ దూరంలో ఉందిట. ప్రమాదం జరిగునప్పుడు నౌక సిబ్బంది ప్రమాదానికి సంకేతంగా వదులుతున్న తెల్లటి మంటలను ఈ నౌకలోని సిబ్బంది గుర్తించారు...అయినప్పటికీ వారు దొంగతనంగా సముద్రంలో వేట చేస్తున్నందువలన వారు దగ్గరలోనే ఉన్నప్పటికీ సహాయం చేయటానికి జంకారు...తమ నేరం ఎక్కడ బయటపడుతుందో అని...అందుకే టైటానిక్ లొని వారు గుర్తించకుండా సరిగ్గా దానికి వ్యతిరేకదిశలో వెళ్ళిపోయారు. ...ఇక అక్కడ ఉన్న రెండవ షిప్ "కాలిఫోర్నియ"14 మైళ్ళ దూరంలో ఉందిట..ఈ నౌక సిబ్బంది కూడా ప్రమాద సంకేతమైన తెల్లని మంటలను చూసినప్పటికీ, చుట్టూ మంచుగడ్డలు ఉండడం వలన, అక్కడికి చేరలేమేమోనని సంశయించి, రేపు తెల్లారాక చూద్దాములే అని వెళ్ళి పడుకున్నాడట ఆ నౌక కేప్టెన్.....ఇక అక్కడ ఉన్న మూడో నౌక 58 మైళ్ళ దూరంలో ఉన్న "కార్పతియా"...టైటానిక్ నుంచి వెలువడుతున్న ఆక్రందనలను రేడియో లో విని, ఎదో ప్రమాదం శంకించి ఆ నౌక కేప్టెన్ వెంటనే తనకు అక్కడికి వెళ్ళే దిశను, మార్గాన్ని చూపమని దేవుడిని ప్రార్ధించి, మంచు గడ్డలు అడ్డం వస్తున్నా సరే వాటిని నేర్పుగా తప్పించుకొని, టైటానిక్ వద్దకు చేరుకుని అందులో ప్రమాదంలో ఉన్న 705 మందిని రక్షించగలిగాడు.

ఇది నిజంగా జరిగినదా లేదా కల్పనా అనే విషయం పక్కన పెడితే, ఈ నౌకల కేప్టేన్ల మాదిరిగానే మనలో కూడా మూడు రకాలైన మనుషులు ఉన్నారు. మొదటిరకం, ఎవరు అవసరంలో ఉన్నాకాని, తమ పని తాము చూసుకునే రకం...రెండవవారు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవులే, ఇప్పుడు ఎలా సహాయం చేయడం, ఇప్పుడు కుదరదు, ఇంకోసారి చూద్దాంలే, అనుకుని తమకు తామే సర్ది చెప్పుకుని, సమస్య నుంచి తప్పించుకునే రకాలు....ఇక మూడవ రకం వారు, ఎట్టి పరిస్థితులలోనైనా అడిగిన వారికి తప్పకుండా సాయం చేసేవారు. ఈ కథలో మూడవ నౌక కేప్టెన్, పని పూర్తి అయ్యాక, వెనక్కి తిరిగి తాను వచ్చిన దారిలో ఉన్న మంచు గడ్డలను చూసి, ఈ కార్యం సఫలం అయిందంటే తానొక్కడి వలన కాదని, కనిపించని భగవంతుడే నాకు చేయూత నిచ్చి, అంతమంది ప్రాణాలు కాపాడాడని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. భగవంతుని మీద భారం వేసి, తాను చెయదలచుకున్న మంచి పనిని ఏమాత్రం సంశయం లేకుండా చేయడానికి ముందుకు దూకే వారికి ప్రతీక ఈ నౌక కేప్టెన్. అలాగే ఉత్తములు తాము ఇతరులకు చేసిన సహాయాన్ని తమ ప్రతిభ అని చెప్పుకోకుండా, భగవంతుడే తమను ఈ కార్యానికి ఎన్నుకున్నాడు అని వినయంతో ఉంటారు, తమ వలన కొంతమందికి అవసరాలు తీరాయి అని సంతృప్తి పడతారు....

మనమేమి చేసినా, మనస్సాక్షి గమనిస్తూనే ఉంటుంది. మనం చేయాల్సిందల్లా మెళకువతో, జాగరూకతతో వ్యవహరించటమే....


ఇంకో చిన్న కథ....

ఒకరోజు ఒక కుక్క పూర్తిగా అద్దాలతో కట్టిన ఒక మ్యూజియం లోకి వచ్చింది. అక్కడ ఎవ్వరూ లేరు...ఆ హాలు నిండా అద్దాలు ఉండడం వలన, ఆ కుక్కకు చుట్టూ ఎన్నో కుక్కలు ఉన్నట్టు కనిపించింది. నిజంగానే చాలా ఉన్నాయి అనుకుని, వాటిని భయపెట్టటానికి పళ్ళు బయటపెట్టి అరిచింది....చుట్టూ ఉన్న దాని ప్రతిబింబాలన్నీ అలాగే చేసాయి. గట్టిగా అరిచింది...అద్దాలలో కూడా అలాగే కనిపించింది. ఖాళీ గా ఉండడం వల్ల శబ్దం మరింత ప్రతిధ్వనించింది. అద్దాల దగ్గరికి వెళ్ళేసరికి ఆ కుక్కలు కూడా తన మీదకు వస్తున్నట్టు భ్రమించింది. రాత్రంతా అలాగే గడిచింది. తెల్లవారి ఆ మ్యూజియం కాపలావాళ్ళు వచ్చి చూసే సరికి ఆ కుక్క చాలా దీనంగా, ఒంటి నిండా దెబ్బలతో లేవలేని స్థితిలో, దాదాపు చనిపోవటానికి సిధ్ధంగా ఉంది. కాపలావాళ్ళు ఆశ్చర్యపోయారు, ఎవ్వరూ లేని చోట కుక్కకు దెబ్బలు ఎలా తగిలాయి, ఎవ్వరు దీనిమీద దాడి చేసారు అని....

ఆకుక్క తన ప్రతిబింబాలతో తనే పోట్లాడింది....వాటిపై దాడి చేస్తున్నాను అనుకుని, తనకు తనే భయంకరంగా గాయాలు చేసుకుంది.

ఈ ప్రపంచం కూడా సరిగ్గా అలాంటిదే.....అది మనకు మంచి కాని, చెడు కాని, చేయదు. మన ఆలోచనలు, మన మనస్తత్వమే మన మంచి చెడులను నిర్ణయిస్తుంది. మన చుట్టూ జరుగుతునది అంతా మన ఆశలు, కోరికలు, ఆలోచనల ఫలితమే. ఈ ప్రపంచం ఒక పెద్ద దర్పణం వంటిది, మనం మంచిగా ఉంటే అందరూ మంచిగానే కనపడతారు...ఈ దర్పణం ముందు ఆనందంగా పోజు ఇవ్వండి....అంతా ఆనందంగానే ఉంటుంది.

Saturday, 28 November 2015

ఇక వినాయక చవితి సందడే వేరు...ఇల్లిల్లూ తిరిగి బోలెడు పత్రి సేకరించుకొని వచ్చేవాళ్ళం. పాలవెల్లిని అలంకరించడం ఎంతో సరదా అయిన పని. ఆరోజు 9 మంది వినాయకులను చూడాలి అనే వంకతో ఇల్లిల్లూ తిరిగేసేవాళ్ళం...అప్పుడు బయట ఇన్ని పందిళ్ళు, ఇంత రచ్చ ఉండేది కాదు. కార్తిక మాసం పెద్దవాళ్ళతో సమానంగా ఉపవాసాలు, తెల్లారే లేచి స్నానలు చేసేసేవాళ్ళం...ఆ అలవాటు మార్గశిరం లో కూడా కంటిన్యూ చేసి, గుడికి వెళ్ళి ప్రసాదం తెచ్చుకునేవాళ్ళం. ఇక సంక్రాంతి కి భోగిపళ్ళ పేరంటాలు, బొమ్మల కొలువులు, గొబ్బెమ్మలు, ముగ్గులు, పట్టుపరికిణీలు, పూలజడలు....ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే...

ధనుర్మాసం మా ఇంటి దగ్గర వేంకటేశ్వరస్వామి గుళ్ళో తిరుప్పావై చదివేవారు.మాకు దానిమీద అంత శ్రధ్ధ లేకపోయినా తరువాత పెట్టే ప్రసాదం మీద భక్తి బాగా ఉండేది. ఆ రుచి ఇంట్లో చేసుకునె దద్దోజనం, చక్కెరపొంగలి కి వచ్చేది కాదు ఎందుకో...బాదం ఆకుల్లో వేడివేడిగా పెట్టి ఇచ్చేవారు....పూజార్ల ఇళ్ళల్లో పుడితే చక్కగా అన్ని తినచ్చు అనుకునేవాళ్ళం. హరిదాసులు, కొమ్మదాసరి వాళ్ళూ, గంగిరెద్దుల వాళ్ళు, పిట్టల దొరలు, బుడబుక్కల వాళ్ళు, అందరూ వచ్చేవారు...గంగిరెద్దుల వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళం, హరిదాసుకు ఒక వీధి తిరగగానే గిన్నె బియ్యంతో నిండిపోయేది...ఇప్పుడు వాళ్ళెవ్వరూ ఎక్కువ రావటంలేదు. బుడబుక్కల వాడు డమరుకం వాయించుకుంటూ వచ్చేవాడు...తలమీద ఇన్ని పక్షి ఈకలు పెట్టుకొని, నల్ల అంగీ తొడుక్కుని, అతన్ని చూస్తేనే భయం వేసేది....ఇంత పొడుగ్గా ఉండేవాడు...పిట్టలదొర మాటలు వింటుంటే కడుపుబ్బ నవ్వు వచ్చేది.....మాటలు కోటలు దాటించేసేవాడు. భోగిరోజు వస్తోందంటే ఇంటి వసారాలో ఉన్న చెక్కా ముక్కాకి కాపలా కాయవలసి వచ్చేది. ఎప్పుడొచ్చేవారో మగపిల్లలు చటుక్కున ఎత్తుకుపోయేవారు. అందరిళ్ళల్లో డబ్బులు అడిగి పెద్ద పెద్ద దుంగలు కొని తెచ్చి మంటలు వేసేవారు. ఆ చిరుచలిలో నులివెచ్చని భోగిమంట వేడిలో చలి కాచుకోవటం భలే సరదాగా ఉండేది.....సెలవులు కూడా పదేసి రోజులు ఇచ్చేవారు. పండుగ వస్తోందంటే పెద్ద పెద్ద డబ్బాల నిండుగా జంతికలు, సున్నుండలు, అరిసెలు, కజ్జికాయలు అవీ చేసి ఉంచేవారు. అందరూ అవన్నీ తిని అరాయించుకోగలిగేవారు. ఇప్పుడు ఇవాళ వండితే మర్నాటికే ఎవరూ తినడంలేదు.
అప్పుడు సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక టిఫిన్ తినేసి చీకటి పడేవరకు ఆడుకునేవాళ్ళం. వీధిలో ఉన్న పిల్లలందరూ స్నేహితులే...అందరం కలిసి ఆడుకునేవాళ్ళం....ఇక అట్లతద్ది ముచ్చట్లైతే చెప్పనే అక్కర్లేదు. అదో సందడి.....ఆ రోజు మాకు స్కూల్ ఓ గంట లేటుగా మొదలయ్యేది.అట్లతద్ది ఆటలు, సంక్రాంతి ముగ్గులు, కార్తీకమాసం కాలువల్లో దీపాలు వదలడాలు.. (పెద్దవాళ్ళు వదులుతుంటే మేము చూసేవాళ్ళం ), ధనుర్మాసం గుళ్ళో ప్రసాదం, వేసవికాలం సెలవుల్లో ఫిల్మ్ లతో సినిమాలు వేసుకోవడం....అబ్బాయిలతో సమానంగా గోళీలాటలు, దీపావళికి చిచ్చుబుడ్లు, మతాబులు,సిసింద్రీలు, తారాజువ్వలు కూరడం, శ్రావణమాసం.. వానల్లో పేరంటాలు, వినాయక చవితి పత్రి ఏరుకొని తెచ్చుకోవడం, ఆషాఢమాసం గోరింటాకు కోసుకుని, రుబ్బుకొని పెట్టుకోవడం, శ్రీరామనవమి పందిళ్ళు, పానకం, పందిట్లో సినిమాలు, ఎండాకాలం మామిడిపళ్ళు తెచ్చి ఇంట్లోనే కావేయడం, సంక్రాంతి గొబ్బెమ్మలు, పండక్కి పట్టుపరికిణీలు, పూలజడలు, రథసప్తమి చిక్కుడు ఆకుల్లో ప్రసాదం, ఎన్ని మధురానుభూతులో....గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అన్నట్టు ఆ రోజుల జ్ఞాపకాలే వేరు....నాలుగైదేళ్ళ నుంచి మార్కెట్లో దీపావళికి మతాబులు కనబడడంలేదు. గుల్లలు (గొట్టాలు) విడిగా, మందు విడిగా అమ్మేవారు...ఆ మందులో ఆముదం కలిపి కూరేవాళ్ళం...ఇప్పుడు అవి కాల్చటమే లేదు. మా పక్కింటివాళ్ళ అబ్బాయి తారాజువ్వలు చేసి అమ్మేవాడు...వాళ్ళ తమ్ముడు సిసింద్రీలు చేసి అమ్మేవాడు....మేమందరం సరదాగా అవి తయారుచేసేవాళ్ళం. చేసినందుకు వాళ్ళు మాకు ఏమీ ఇచ్చేవారు కాదు కాని, వాళ్ళు అర్ధికంగా కొంచెం తక్కువ వాళ్ళు అని మా అమ్మ మేము కొనుక్కున్న వాటిల్లో కొన్ని టపాకాయలు వాళ్ళకు ఇచ్చేసేది...మాకు ఎంత కోపం వచ్చేదో....
మా చిన్నప్పుడు కూడా మా అమ్మగారు హోటల్ కి వచ్చేవారు కాదు. చాలా కాలం తరువాత అలవాటు అయ్యింది అమ్మకి. మాకు స్కూల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేవారు కాదు. అందరి ముందూ భోజనం చెయ్యకూడదు అని. మా ఇంట్లో కొత్తగా డైనింగ్ టబిల్ కొన్నప్పుడు కూడా అన్నం గిన్నెలు దానిపైన పెట్టినప్పుడు, ఊరగాయలు, నెయ్యి, నూనె గిన్నెలు పెట్టేవారు కాదు. మా నానమ్మ కచిక తో పళ్ళు తోముకునే వారు. మాకు "గోపాల్" పళ్ళ పొడి వచ్చేది చిన్న బ్రౌన్ కలర్ ప్యాకెట్లో...10 పైసలు దాని వెల....తియ్యతియ్యగా ఉండేది. అందులో ఉండేది కూడా కచికేనేమో.....సర్ఫ్ ఇప్పట్లా పోలిథీన్ ప్యాకెట్లో కాకుండా, గట్టి అట్టపెట్టెలో వచ్చేది....కొన్నాళ్ళు "జాలీ " ఫేస్ పౌడర్ వచ్చేది. చిన్న అట్టపెట్టెలో...దాని వెల కూడా రెండు రూపాయలే...బసంత్ మాలతి తరువాత అందరూ ఎక్కువగా వాడిన క్రీం ల్యాక్టో కాలమైన్....ఆ పరిమళం ఇప్పటికీ గుర్తే... వీధికి ఒక టీవీ....సాయంత్రం అయ్యేసరికి అర్ధం అయినా, కాకపోయినా ఆ హిందీ ప్రొగ్రాములే చూసేవాళ్ళం. అప్పట్లో లైఫ్ బాయ్,లక్స్ మధ్యతరగతి వాళ్ళ సబ్బులు. ఎర్ర కాగితం ప్యాక్ లో వచ్చే సింథాల్ సబ్బు కొంచెం ఉన్నవాళ్ళ సబ్బు. ఇప్పుడు దాదాపు అన్ని ఒకే ధరలో ఉన్నాయి. ఆ లైఫ్ బాయ్ సబ్బు యాడ్ సినిమాహాల్ లో తప్పకుండా వేసేవారు. ఎంతకీ అరిగేది కాదు....నెలంతా వాడుకునేటట్లు ఉండేది పెద్దగా, బరువుగా....సినిమా హాల్ అంటే గుర్తొచ్చింది. సినిమా మొదలయ్యే ముందు ఫిలంస్ డివిజన్ వాళ్ళ డాక్యుమెంటరీ వేసే వారు ఒక పావుగంట. బాగుండేది...అది వేయడం మానేసిన తరువాత కొన్నాళ్ళు సినిమా చూసినట్లు ఉండేది కాదు. అందులో వాయిస్ ఓవర్ ఇచ్చిన వారి గొంతు ఎంతో గంభీరంగా ఉండేది. (ఎవరైనా ఆయన పేరు తెలిస్తే చెప్పండి)
అప్పుడు రేషన్ లో గుడ్డముక్కలు కూడా ఇచ్చేవారు...బాగా చిన్నప్పుడు. అందుకని ఆ వివరాలు మాకు తెలియవు.
మా చిన్నతనంలో మద్రాసు నుంచి మార్కెటింగ్ కి ఒక PONDS టీం వచ్చారు. ఒక కూపన్ ఇచ్చి, ఆన్సర్ వ్రాసి పోస్ట్ చేసి, డ్రా ద్వారా గెలిచిని ఒక్కరికి మొదటి బహుమతి 365 చీరలు, నలుగురికి 52 చీరలు, 10 మందికి 30 చీరలు, 50 మందికి 7 చీరలు చొప్పున బహుమతి అని అనౌన్స్ చేసారు...తీరా కూపన్ తీసుకున్నాక, క్రీం తీసుకోవాలని చెప్పారు. అప్పట్లో ఆ క్రీములు అవీ మన సౌత్ వాళ్ళకు కొత్త. ఈ డ్రా లు అవీ కూడ కొత్తే...అలా అప్పుడు అసలు ఫేస్ క్రీ అంటే ఏంటో తెలిసింది. అప్పట్లో అప్సర నెయిల్ పాలిష్ వచ్చేది ధర 2 రూపాయలు. ఒక్క ఎర్ర రంగు లోనే దొరికేది. ఈ షాంపూ లు, అవీ అప్పుడు తెలియదు. చక్కగా మందార ఆకులు వేసి, కుంకుడు కాయతో తలంటుకోవడమే..అప్పుడు జుట్టు బాగుండేది....అంతవరకూ వాడే సర్ఫ్ ( వాషింగ్ పౌడర్ పేరు సర్ఫ్...ఆ పేరు జనానికి ఎంత అలవాటు అయిందంటే, మార్కెట్లో కొత్త వాషింగ్ పౌడర్ లు వచ్చినపుడు వాటికి అలవాటు పడలెకపోయారు. ఇప్పటికీ కూడా బట్టలు ఉతికే పౌడర్ అది ఏ కంపెనీదయినా సరే, సర్ఫ్ అనె అనడం అందరికీ అలవాటు.) కేవలం నీలం రంగులోనే ఉండేది. నిర్మా వాషింగ్ పౌడర్ పసుపు రంగులో పోలిథీన్ పాక్ లో వచ్చినప్పుడు చాలా మంది దానిని శనగపిండి గా భ్రమపడేవారు...అప్పట్లో మిగిలిన అన్ని వాషింగ్ పౌడర్ ల కన్నా నిర్మా చవక...ధర ఎంతో గుర్తు లేదు. మా చిన్నతనం లో అయొడైజ్ద్ ఉప్పు లేదు. అందరికీ ఆర్. సి. ఆర్ అనే కంపెనీ ఉప్పే...ఎక్కడికెళ్ళినా అదే దొరికేది. వెల 15 పైసలు. లక్స్ సబ్బు ధర రూపాయిన్నర. చిన్నప్పుడు బళ్ళ మీద రాళ్ళ ఉప్పు తెచ్చి అమ్మేవారు. అదే ఎక్కువ వాడేవాళ్ళు..తరువాత, భారతీయులకు అయొడిన్ తక్కువగా ఉంటుంది, అందుకని రాళ్ళ ఉప్పు బదులు సాల్ట్ వాడాలి అని ఊదరగొట్టి, అమ్మకాలు పెంచుకున్నారు..మార్కెట్ మాయలో పడి అందరూ సాల్ట్ కి అలవాటుపడ్డారు. ఇప్పుడు మళ్ళీ రాళ్ళ ఉప్పే మంచిది అదే తినండి అంటున్నారు.....వెనకటి రోజుల్లో కచిక, బొగ్గు పొడితో పళ్ళు తోముకునేవారు...కొన్నాళ్ళకి అది అనాగరికం అయ్యింది, ఇప్పుడు టూత్ పేస్టుల్లో బొగ్గు వాడుతున్నార్ట మళ్ళీ....ఈమధ్యలో పాత అలవాట్లు మానేసుకుని మనం పిచ్చోళ్ళమయ్యాం.
ఇంకామా స్కూల్ ముచ్చట్లు చెప్పుకోవాలంటే, మాస్కూల్ దగ్గర ఒకతను చిన్న కొట్టు పెట్టుకుని ఉండేవాడు. అప్పట్లో ఇంక్ పెన్నులు వాడేవాళ్ళం కదా....పెన్ లో ఇంక్ అయిపోయిందంటే, టీచర్లు చితక్కొట్టేవారు.అలాంటి వారికి ఆపద్భాందవుడు అతను. 5 పైసలు తీసుకుని పెన్ను నిండా ఇంక్ పోసి ఇచ్చేవాడు. అప్పట్లో కేంలిన్ (Camlin )పెన్ వాడటం అంటే గొప్ప...20 రూపాయలు ఉండేది ఆ పెన్... ఇంక స్కూల్ దగ్గర ఇంటర్వెల్ లో ఊరవేసిన ఉసిరికాయలు, ఉప్పు, కారం వేసిన నారింజ బద్దలు, జీళ్ళు, నారింజ మిఠాయి అన్నీ అమ్మేవాడు.. మా ఇంట్లో అవి కొనుక్కోవడం నిషిద్ధం... వద్దు అన్న దానిమీద ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా....కానీ ఎప్పుడూ కొనుక్కోలేదు. ఇప్పటికీ ఆ కోరిక అలాగే ఉండిపోయింది...ఫ్రెండ్స్ తో కలిసి కొనుక్కుని తినడం, ఫ్రెండ్స్ తో కలిసి మధ్యాహ్నం కేరేజి తెచ్చుకుని తినడం....ఇంక ఇప్పుడు తీరవు కదా ఆ కోరికలు!