Thursday 4 February 2016

అబ్బ....చాలా రోజులయిపోయింది...ఓ మంచి  పెళ్ళి భోజనం తినాలని ఉంది అనేవాడు మా మామయ్య అప్పుడప్పుడూ... మా అత్తయ్య మంచి పాకశాస్త్ర నిపుణురాలు....అయినా ఇదేం కోరిక మావయ్యా, అత్త బాగానే చేస్తుందిగా అంటే, నవకాయ పిండివంటలూ మనవాళ్ళతో కూరుచుని నవ్వుతూ తుళ్ళుతూ తినే భోజనమే పెళ్ళి భోజనం అంటే అనేవాడు. తన కూతురి పెళ్ళికి నిజంగానే జిహ్వ లేచొచ్చేటట్టు పెట్టాడు భోజనాలు..... మారుతున్న కాలానికి తగ్గట్టు మారలేక బాధపడేవాడు...ఏమిటే పెళ్ళంటే సందడి ఉండాలి కానీ ఎందుకు ప్రతిదానికీ మీరిలా హడావిడి పడిపోతున్నారు అనేవాడు...మీరు వంటలు చేస్తున్నారా, వడియాలు పెడుతున్నారా,  అప్పడాలు వత్తుతున్నారా? సున్నుండలకి పిండి విసురుతున్నారా ? ఏదీ లేకపోయినా పట్టు చీరలు విప్పి కట్టడానికే అలసిపోతున్నారేమిటే అని ముద్దుగా మందలించేవాడు. మారుతున్న కాలం, మారుతున్న ప్రాధాన్యాలు, సొంతవారి పెళ్ళిళ్ళకు వెళ్ళడానికి కూడ సెలవులు లేని ఉద్యోగాలని చూసి బాధపడేవాడు...నీ చెల్లి పెళ్ళికి నువ్వు రెండు రోజుల ముందు రావడం ఏమిట్రా,,,పనులన్నీ ఎలా సాగుతాయి అని ఎవర్నైనా అడిగితే వాళ్ళు ఒక నవ్వు నవ్వేసి, అన్నీ కేటరింగ్ వాళ్ళే చూసుకుంటున్నారు కదా మావయ్యా అని సమాధానం చెప్పేవారు. కూలికి అప్పగిస్తున్నార్రా పనులు...డబ్బు ఎక్కువై, బంధాలు తగ్గిపోతున్నాయి అనేవాడు...సెలవులు లేవు మొర్రో అని మొత్తుకున్నా వినేవాడు కాదు....ఇంక బఫే భోజనం ససేమిరా చేయను అనేవాడు. ఎంగిలి పళ్ళాలు పుచ్చుకుని ఆ నిలబడి తినడం ఏమిట్రా ఖర్మా అని తెగ ఫీలైపోయేవాడు....గంభీరమైన కంఠస్వరం, అనేక విషయాల్లో అపారమైన జ్ఞానం మా మావయ్య సొంతం.....పెళ్ళి పందిట్లో కూర్చుని చిన్నపిల్లలకు ఎన్నో విషయాలు చెప్పేవాడు.....మా అందరి చిన్నతనాల కబుర్లు వాళ్ళకి చెప్పేవాడు..చెప్పేవాటిలో కించిత్తు అతిశయోక్తి కాని, అబధ్ధం కాని, వెటకారం కాని, వెక్కిరింత కాని లేకుండా వినేవారికి మంచి ఉత్సాహం కలిగేలా చెప్పేవాడు...మంచి మంచి సలహాలు, ఏ విషయం లో సందేహం వచ్చినా వెంటనే తీర్చేవాడు ....అసలు పెళ్ళిపందిరికి ఆయనో శోభ.... ఓ అలంకారం...5 రోజుల పెళ్ళిళ్ళ నుంచి, మూదు రోజులు, రెండు రొజులు, ఇంకా ఒకరోజు పెళ్ళిళ్ళకు కాలం మారినప్పుడు దిగులుపడ్డాడు. ఈ నార్త్ యిండియన్ స్టైల్ భోజనాలు మన ఫంక్షన్లలోకి కూడా చొచ్చుకువచ్చినప్పుడు జిహ్వను చంపేసుకోకండిరా అని మొత్తుకునేవాడు. పందిట్లో అలంకరించిన పువ్వులు నిజమైనవైనా నవ్వులు ప్లాస్టిక్ వి అయిపోయాయి కదరా అని బాధపడ్డాడు. ఇలా అందరూ ఒక్కళ్ళని, ఇద్దర్నీ కంటే ఏదైనా కార్యక్రమాలు జరిగితే అంగబలం ఎలా ఉంటుంది, బయటవాడు వచ్చి చేస్తాడా అనేవాడు.....ఈ లోకాన ఉన్నాడో, కందిపొడీ, ఆవకాయ, పనసపొట్టు కూరా, కందాబచ్చలి కూరా, బూరె, పులిహొర, మినపసున్ని, గోంగూర పచ్చడి ఇవన్నీ లేందే పెళ్ళి భోజనం ఏమిటి అనేవాడు...ఇవన్నీ చూసి, విని మావయ్యని గొప్ప చాదస్తుడు అనుకునేవాళ్ళం చిన్నతనాల్లో...ఈమధ్య మావాళ్ళింట్లోనే ఒకపెళ్ళికి వెళ్ళినపుడు అన్నిపక్కలా మావయ్య నుంచుని ఘోషిస్తున్నట్టే అనిపించింది. అటూ, ఇటూ ఇద్దరే పిల్లలు అవడం చేత అటు మగపెళ్ళివారు కాని, ఆడపెళ్ళివారు కాని పట్టుమని వందమంది లేరు అంతా కలిసి....ఇరుపక్షాల స్నేహితులు, ఇరుగుపొరుగు వాళ్ళే మించిపోయారు. ఇక డబ్బు ప్రవాహం గా మారింది కాని, వచ్చాక ఒక పెళ్ళికి వెళ్ళాము అన్న సంతృప్తి కలగలేదు. ఆ వెండి బంగారాలేంటి, ఆ పెట్టుపోతలేంటి, సంపదని, ఆస్తిని ఇచ్చిపుచ్చుకున్నారు రెండువైపులవాళ్ళు అనిపించింది...వెండి, బంగారం, పట్టుచీరల షాపుల్లో నడుస్తున్నట్టు అనిపించింది. అందరికీ హడావిడే...ఎవరో తరుముతున్నట్టు.....పలకరింపులు కూడా హాయ్, బై...ఇంతే.....భోజనాల దగ్గర కూడా ఏదో తొందర..తిన్నావా అని కాని,, పదార్ధాలు బాగున్నాయా అని కాని అడిగేవాడు లేడు...దూరాభారాల నుంచి వచ్చారు అని సంతోషించిన వారు లేరు...పలకరించిన వారు లేరు....అంతా ఏదో మాయలా అయిపోయింది....వచ్చిన బంధువులందరం మాలో మేము మాట్లాడుకుని, అక్షింతలు వేసి, కానుక చదివించుకుని, భోజనాలు చేసి బయటపడ్డాం. మారుతున్న కాలం, మనమూ మారి తీరాలి...కాలానికి ఎదురు వెళ్ళి నిలవలేము....కానీ ఇంకా ముందు ముందు ఎటువంటి పరిణామాలు చూడాలో అని బెంగ....నన్ను కూడా మా మావయ్యను అనుకున్నట్టు చాదస్తం అని అనుకుంటారేమో.....

2 comments:

  1. ఎందుకనుకుంటాం? మేంకూడా ఆ తానుముక్కలమేగా! మావయ్య పేరుతో భాషించినా అది మీ హృదయఘోష అని అర్ధమవుతూనేవుంది. మారింది కాలం కాదు. మనమే. వేపచెట్టు అరవైల్లో ఎలా పెరిగేదో ఇప్పుడు నాటినా అలానే పెరుగుతుంది. ఈకాలపు గేదెలన్నీ చిట్టూ తవుడూ తినడం మానేసి పిజ్జాలూ బర్గర్లూ తింటున్నాయా? కాలాన్ని తిట్టుకోడమేఁవిటో..కలికాలం!😜

    ReplyDelete
  2. ఎందుకనుకుంటాం? మేంకూడా ఆ తానుముక్కలమేగా! మావయ్య పేరుతో భాషించినా అది మీ హృదయఘోష అని అర్ధమవుతూనేవుంది. మారింది కాలం కాదు. మనమే. వేపచెట్టు అరవైల్లో ఎలా పెరిగేదో ఇప్పుడు నాటినా అలానే పెరుగుతుంది. ఈకాలపు గేదెలన్నీ చిట్టూ తవుడూ తినడం మానేసి పిజ్జాలూ బర్గర్లూ తింటున్నాయా? కాలాన్ని తిట్టుకోడమేఁవిటో..కలికాలం!😜

    ReplyDelete