Wednesday, 10 September 2014

 ఈమధ్య చాల మంది తల్లితండ్రులను చూస్తున్నాను. పిల్లలను ఎక్కువ గారాబం చేసి, వాళ్ళలో మొండితనాన్ని ఇంకా పెంచుతున్నారు. పిల్లలు చాల తెలివైన వారు. మనం ఎలా పెంచితే, అలాగే పెరుగుతారు. మన బలాలను, బలహీనతలను అంచనా వేయడం లో వాళ్ళు ఘనులు. ఇప్పటి తల్లితండ్రులు చాల మంది ఒకలాగే ఆలోచిస్తున్నారు. మనకు ఉద్యోగం వచ్చేవరకు సైకిల్ నే ఉపయోగించాం కదా, పిల్లవాడు అడుగుతున్నాడు కదా, పోనీ బైక్ కొని ఇద్దాం, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇద్దాం. మనం మన చిన్నతనం లో ఏమి సుఖాలు అనుభవించలేదు కదా, పిల్లలను అయినా అనుభవించనీ అనే ఆలోచనాలో ఉన్నారు. మనం అనుభవించలేని సుఖాలు వాళ్ళకు ఇద్దాము అనే ఆలోచన చాలా తప్పు. వారికీ ఏది అవసరమో అది కొని ఇయ్యండి. మనం కొని ఇచ్చిన వస్తువును వారు సరి అయిన మార్గం లో ఉపయోగించుకొనే సామర్ధ్యం వారికీ ఉందా లేదా అని ఆలోచించండి. వయసును బట్టి వారి కోరికలకు మీరు ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే, చిన్నతనం నుంచి, ఈ పని చేస్తే నీకు ఈ బహుమతి ఇస్తా అని చెప్పటం తప్పు. పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుంటే ఈ బహుమతి ఇస్తా అని చెప్పకండి. మంచి మార్కులు తెచ్చుకోవడం వారి విధి. అది వారికీ తెలిసేలా చేయండి. ఒక పని చేసిన తరువాత, మంచి మార్కులు తెచ్చుకున్న తర్వాత, నువ్వు కష్టపడ్డావు కాబట్టి, నువ్ ఒక మంచి పని చేసావ్ కాబట్టి నీకు ఈ బహుమతి అని చెప్పండి. ఈ రెండింటికీ తేడాను దయచేసి అర్ధం చేసుకోండి. ఇంట్లో పిల్లలకు ప్రతి పనిలోనూ, ప్రతి విషయం లోను వారి బాధ్యతను వారికీ తెలియచేయండి. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా, ఆ పని మనది కాదులే అని వాళ్ళ పని వాళ్ళు చూసుకునే పిల్లలు చాలా మంది ఉన్నారు. అలా కాకుండా, కాస్త వారిని పలకరించి, మందులు ఇచ్చి, కాస్త టీ యో, కాఫీ యో చేసి ఇవ్వడం అలవాటు చేయండి. ఇంట్లో హడావిడిగా ఉన్నపుడు, పని చాల ఉండి, మీ ఒక్కరి వల్ల అవనపుడు,  పనిలో సహాయం చేయడం అనే పధ్ధతి పిల్లలకు నేర్పండి. దానివల్ల మీకు పని సులువు అవుతుంది. వారికీ బాధ్యత తెలుస్తుంది. కొంత వయసు వచ్చిన పిల్లలకు వారి పని వారు చేసుకోవడం, ప్రయాణాల సమయంలో వారి బాగ్ లు వారు సర్దుకోవటం అలవాటు చేయండి. 10, 12 సంవత్సరాల పిల్లలు చక్కగా చేయగలరు ఈ పనులు. వారికీ సరదాగా ఉంటుంది కూడాను. మీకు పని తగ్గుతుంది. ఒకటి రెండు సార్లు వాళ్ళు చేస్తున్నపుడు మీరు పర్యవేక్షిస్తే, తరువాత వాళ్ళు సొంతగా చేసుకోగలుగుతారు.

( మరికొన్ని సూచనలు వచ్చేసారి )

No comments:

Post a Comment