Wednesday 27 August 2014

అందరికీ "వినాయక చవితి" శుభాకాంక్షలు...

భారతీయులు అనాదిగా ప్రకృతిని పూజిస్తున్నారు. చెట్లు, చేమలు, నీరు, నిప్పు, నదులు, సముద్రాలు వీటన్నిటినీ పూజించడం మన సంప్రదాయం. దీని వెనుక పర్యావరణాన్ని, ప్రకృతిని కాపాడే గొప్ప ఆలోచన ఉంది. దేవుడి పేరు చెప్తేనే కానీ మనుషులు వినరు అనే ఉద్దేశ్యంతో పెద్దలు దేవుడికి, ప్రకృతికి , పర్యావరణానికి లింక్ పెట్టి ప్రకృతిని పూజించే అలవాటు చేసారు. రాను రాను మనిషికి తెలివి తేటలు( మూర్ఖత్వం), స్వార్ధం పెరిగి తను కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టు, తను నివశిస్తున్న భూమిని, తన చుట్టూ ఉన్న ప్రకృతిని తనే నాశనం చేసుకుంటున్నాడు.

మనం జరుపుకునే పండగలు అన్నీ పర్యావరణానికి ఎంతో కొంత దోహదం చేసేవే. మరీ ముఖ్యంగా వినాయక చవితి. ఇది పిల్లలకు, పెద్దలకు కూడా ఎంతో ఇష్టమైన పండుగ. ఈ పూజ విధానం పత్రీ పూజ ఎంతో ముఖ్యం. వానలు కురిసే ఈ ఋతువులో చెట్ల ఆకులను ఈ పత్రిపూజ పేరుతొ కోయడం వల్ల చెట్లు మళ్లీ చక్కగా చిగురించి చక్కగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ పూజలో చెప్పే 21 రకాల పత్రాలు ఎంతో ఔషధ గుణాలతో కూడి ఉన్నవి కనుక, అవి స్వయంగా సేకరించి పూజ చేయడం వలన చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది.

 ఈ పండుగ నాడు వినాయకుడికి, ఎక్కువ పులుపు, కారం లేకుండా, నూనె లేకుండా కేవలం నెయ్యి తోనే వండే పదార్థాలు నివేదించి, మనం ఆ ప్రసాదాన్ని సేవించడం ద్వారా, ఎండలు తగ్గి, వానలు పడుతూ ఉన్న ఈ సమయం లో వాతావరణ మార్పుల ద్వారా వచ్చే అనారోగ్యాలు దూరం అవుతాయి. కొత్తగా జబ్బులు వచ్చే అవకాశాలు ఉండవు.

ఈ పండుగకు మొట్ట మొదటగా సామాజిక గుర్తింపును తెచ్చి ప్రజలందరినీ ఏకం చేయడానికి, ఒక్క తాటి మిద నడపడానికి శ్రీ బాలగంగాధర తిలక్ గారు వీధులలో పందిళ్ళు వేసి, వినాయక విగ్రహాలు నెలకొల్పి సాముహిక పూజలు చేసుకునేలా ప్రజలను ప్రోత్సహించారు. దీనివల్ల ప్రజలలో ఐక్యత సిద్ధిస్తుంది.

అన్నిటి కన్నా ముఖ్యంగా మనం పూజించే వినాయక విగ్రహాలను కేవలం మట్టితోనే తయారుచేయడం వెనుక ప్రకృతి పరంగా గొప్ప ఆలోచన ఉంది. చెరువుల లోని మట్టితో అందరికీ కావలసిన వేల వేల వినాయక ప్రతిమలను తయారు చేయడం వల్ల చెరువులలో మట్టి పూడిక తీసినట్టు అవుతుంది. చెరువులు శుభ్రపడతాయి. ఇది పర్యావరణానికి గొప్ప మేలు చేస్తుంది.

కానీ మనం ఈనాడు ఏమి చేస్తున్నాం? గొప్పలకు పోయి పోటాపోటీగా ఒకరి కంటే ఒకరు గొప్ప అని నిరూపించుకోవాలని పెద్ద పెద్ద విగ్రహాలను మట్టి తో కాకుండా, ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారుచేసి, వాటికీ రసాయన రంగులు వేసి వాటిని ఊరి చెరువులలో నిమజ్జనం చేస్తున్నాం. దాని ద్వారా నీటి కాలుష్యనికీ, నీటిలో నివశించే అనేక జీవుల మరణానికి కారణం అవుతున్నాం. ఆ రసాయన రంగులు నీటిలో కరగకుండా అవి వెదజల్లే వాయువుల ప్రభావానికి గురి అవుతున్నాం. ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. ప్రకృతి సమతుల్యతను దెబ్బ తీస్తున్నాం. మన నాశనాన్ని మనమే ఆహ్వానిస్తున్నాం. ఇలా మరికొన్ని సంవత్సరాలు జరిగితే వచ్చే ఆపదను మనం గ్రహించలేక పోతున్నాం.

ఈ ఆపద నుంచి బయట పడాలి అంటే అందరూ దయచేసి మట్టి విగ్రహలనే పూజించండి. స్థానిక కళాకారులను ప్రోత్సహించండి. మన ఊరి చెరువులను మనం కాపాడుకుందాం. పర్యావరణాన్ని కాపాడుదాం.....

వక్రతుండ మహాకాయ, సూర్యకోటి సమప్రభా,
నిర్విఘ్నం కురుమే దేవా, సర్వ కార్యేషు సర్వదా.....

No comments:

Post a Comment