Wednesday 4 May 2016

అబ్బబ్బ....ఏం వంట? ప్రతి రోజూ, ప్రతి పూటా..రోజుకు ఉన్న 24 గంటల్లో 6 గంటలు  నిద్రకి మినహాయిస్తే, మిగిలిన 18 గంటలు  చేసే పనులు వంటకి, తిండికి సంబంధించినవేనాయే....రాత్రి పడుకునేటప్పుడు రేపు పొద్దున్న టిఫిన్ కి ఏంటి? వంటకి ఏంటి? అనుకోవటం,...తెల్లారి లేవగానే ఇవాళ ఏ పప్పు నానబెట్టాలి? ఏ పప్పు రుబ్బాలి? ఇదే రంధి.... అసలు ఇంట్లో చేసే పనుల్లో 70% పనులు తిండికి, వంటకి సంబంధించినవే....అసలు లోకం లో ఈ  తిండిగోల   లేకుండా ఉంటే ఎంత బాగుండేది? సరుకులు  తెచ్చుకోవక్కర్లేదు,కూరలు తెచ్చుకోవక్కర్లేదు,  వండుకోవక్కర్లేదు, గిన్నెలు తోముకోక్కర్లేదు, అందుకోసం ఓ పనిమనిషిని పోషించక్కర్లేదు, ఎంత డబ్బు మిగులో, ఎంత టైం మిగులో...హాయిగా ఆ టైం లో పుస్తకాలు చదువుకోవడమో, సంగీతం వినడమో చేయచ్చు...అహా. తలుచుకుంటేనే స్వర్గంలో ఉన్నట్టుంది.

ఉన్నవి 20 రకాల కూరలు, వాటిల్తో 60 రకాల వంటలు, వాటికి మళ్ళి 150 రకాల కాంబినేషన్లు.....అబ్బ...ఎంత శ్రధ్ధగా వండుకుని తింటున్నామో కదా....పనసపొట్టు, గుత్తివంకాయ కూర ఉన్నప్పుడు ముద్దపప్పు ఉండాల్సిందే...సాంబారు పెట్టినప్పుడు అప్పడాలు వేయించాల్సిందే...ఆవకాయకి గడ్డపెరుగు, కంది పచ్చడికి ఉల్లిపాయ పులుసు  జోడీ...ఇవి చేయని, చేయలేని ఇల్లాలికి ఉరికి సమానమైన శిక్ష వేసేయచ్చు...(మాలాంటి ఇళ్ళల్లో అయితే)...

రోజూ ఉండే టిఫిన్లు ఓ రకం...పిల్లలు ఉన్న ఇళ్ళల్లో అయితే, సాయంత్రం దవడ ఆడించడానికి మురుకులో, జంతికలో వాటికి తోడుగా సున్నుండలు, లడ్డూలు,...ఇవి ఇంకో రకం, పండగలు పబ్బాలకు సరే సరి...ఇక ఏడాదికోసారి పలకరించి ఒళ్ళు హూనం చేసే ఊరగాయలు, ఒడియాలది మరో ముచ్చట...ఆవకాయకి సన్న ఆవాలు తేవోయ్ ...(ఆఘాటుకి గొంతు మండుతున్నా, పెద్ద ఆవాలు వాడకూడదు....అదో ముచ్చట....) మార్చ్ వచ్చిందంటే చాలు, ఇంట్లో, ఎటొచ్చీ ఆవు కథ లాగా, ప్రతి సంభాషణా ఊరగాయలు , వడియాలమీదకే పోతుంది..(పగలైనా, రాత్రైనా)...మనిషి జన్మ మీద విరక్తి కలిగేటట్టు. ...హాయిగా జంతువులమైతే పచ్చగడ్డి ఒక్కటీ సరిపోయేది కదా..."ఏమో, ఇన్ని రకాల చెట్లు ఉన్నాయి కదమ్మా, అందులో దేనిది ఏ రుచో మనకేం తెలుసు, అవి కూడా సెలెక్టివ్ గా రుచుల ప్రకారం తింటాయేమో" ....పిల్లల సెటైర్లు ఇవి...

ఒకళ్ళు నూనె వస్తువులు తినద్దంటారు, ఒకరు ఉప్పు తగ్గించమంటారు, ఒకరు నెయ్యి, స్వీట్లు తినద్దంటారు, ఒకరు కారం, పులుపు నిషేధించాలంటారు. మరొకాయన అయితే, ఉప్పు, కారం, నూనె, నెయ్యి, తీపి, పులుపు అన్నీ మానేసి పచ్చి కూరలు, పండ్లు తిని బతికేయమంటాడు. (ఇంతకీ ఈయన ఉగాది పచ్చడి ఎలా చేస్తాడో చూడాలని ఉంది ఒకసారి )  అంతదానికి వెయ్యేళ్ళు బతికి ఏంచేయ్యాలో తల బద్దలుకొట్టుకున్నా  అర్ధం కాదు. సుబ్బరంగా అరిసెలు, సున్నుండలు తిని అరాయించుకున్నప్పుడే ఆరోగ్యం బాగుంది....అవి మానేసి, ఇవి మానేసి డైట్ ప్రకారం  తింటుంటే అన్నం మానేసి, ఆ వంతుకి మందులు మింగాల్సొస్తోంది....ప్రతివాళ్ళకి, చిన్నా పెద్దా తేడా లేకుండా రోజుకి అరడజను మందులు..మందుల కంపెనీలకి మహరాజ పోషకులం....

ఇంటి తిండి అయితే కొంచెం నయం...చాటో, పానీ పూరీయో,  సమోసావో, ఉత్తరమో, తూర్పో ఏదో ఒకటి మన దేశం తిండే తింటున్నాం అనే ఓ తృప్తి...డబ్బులు పెట్టి కొన్నందుకు ఏదో కొంత కడుపు నిండడం.....ఇప్పుడు కొత్తగా ఇటలీ తిండిట...పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, ....అబ్బబ్బ.....చూడడం వరకూ అక్కర్లేదు, తలుచుకుంటేనే వెలపరం వచ్చేస్తోంది....పైగా కళ్ళు తిరిగే రేట్లు....కడుపు నిండదు.....బైట ఫేషన్ గా తిని ఇంటికొచ్చి పెరుగన్నం తింటేనే కాని, ఆ వెలపరం పోదు.

ఇవేవీ లేకుండా మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు.....ఇవన్నీ ఒక్క కాఫీలోనే ఉండి, రోజుకి 16 కప్పులు కాఫీ తాగినా మీ ప్రాణానికి హాని లేదు, మాదీ గ్యారంటీ అని ఎవరైనా చెప్తే ఎంత బాగుండును? ఎంత పని తగ్గుతుంది? తెల్లారే చక్కని, చిక్కని డికాషన్ తీసుకుని, వేడిగా నురగలు కక్కే కాఫీని పెద్ద గ్లాసులో తెచ్చుకుని (ఇంట్లో ఝూలా ఉంటే ఇంకా బెటరు)  ప్రశాంతంగా తాగుతూ ఉంటే...మరుక్షణం చచ్చిపోయినా పర్వాలేదు అన్నంత తృప్తి ఉండదూ...అబ్బే,,,,,ఆ తృప్తి ఎక్కడ మిగులుస్తారు మనకీ.....పొద్దున్న లేస్తూనే కాఫీ తాగద్దు,అందులొ కెఫిన్ ఉంటుంది, ఇంకోటుంటుంది అని ఒకటే భయపెట్టడం. నాకు తెలియక అడుగుతా...ప్రపంచంలోని సైంటిస్టులందరికీ ఒక్క కాఫీయే దొరుకుంతుందా అండీ రిసెర్చ్ చేయడానికి, మన ప్రాణాలు  తోడేయ్యడానికి కాకపోతే...తాగే మూడు కప్పుల కాఫీని కూడా వంటపట్టనివ్వరు వెధవ భయాలు కల్పించేసి....

సరి .....నాకు కూడా భోజనం టైం అయ్యింది...వంటల్లో రకాల గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. 

No comments:

Post a Comment