Wednesday, 7 June 2017

ఈవారం కథా సమీక్ష:
జులై నెల స్వాతి మాస పత్రిక లో ఈసారి "అత్తలూరి విజయలక్ష్మి" గారి కథ "కొడుకు" మనసుకు హత్తుకుంది.. చాలా మంది చదివే ఉంటారు ఈపాటికి.. చదవని వారి కోసం...
ఇది ఓ అమ్మ కథ.. ఓ తల్లి వ్యథ..
భర్త చనిపోయిన దగ్గర్నుండీ కంటికి రెప్పగా కాపాడుకుంటూ వచ్చిన తన ఇద్దరు కొడుకులూ, రెక్కలొచ్చాక, తన బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడక, ఏవో సాకులతో, ఉన్నఊళ్ళోనే తనకు దూరంగా వెళ్ళిపోయాక, ఆ బాధ తట్టుకోలేక, ముందు మనోవేదన పడీ, తరువాత మంచాన పడీ... ఏనాటి ఋణమో పనిమనిషి లక్ష్మి సేవ-శుశ్రూషలతో కొద్దిగా కోలుకుని... జబ్బు పేరుతో నాలుగు గోడల మధ్య పడుకుని పడుకుని విసుగొచ్చి, ఒక్కసారి బయటిగాలి పీల్చుకోవాలనే ఆశతో, పనిమనిషి భయపడుతున్నా సరే, చేతికర్ర తీసుకుని, నడవగలనేమో చూస్తాను అని గుమ్మం దాటుతుంది నడివయసులో ఉన్న రమణి.. ఇన్నాళ్ళకి బయటకు వచ్చిన తనను ముందు ఓ చల్లని పిల్లగాలీ, తరువాత ఆ చుట్టుపక్కల ఉండే ఆత్మీయులు పరామర్శించగా, తాను ఆ చుట్టూ ఉన్న మొక్కా మోడును పలకరించి, ఎదురుగా ఉన్న పార్కులోకెళ్ళి చిన్నగా కొంత సేపు వాకింగ్ చేసి అక్కడె ఉన్న ఒక చెట్టు కింద చప్టా మీద కూర్చుని, పర్వాలేదు, నేను నడవగలను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అని ధైర్యం చెప్పుకుని , సేదదీరేంతలో-- పక్కనే తనకన్నా పెద్ద వయసు ఉన్న ఓ మహిళ ఒంటరిగా, కొంచెం బిడియంగా, కొత్తకొత్తగా ఉన్నట్టు గమనించి మాటలు కలుపుతుంది..
ఆమె తీరు, తరహా ఓ మంచి కుటుంబానికి చెందిన మహిళే అని చెప్తున్నప్పటికీ ఇక్కడ ఒంటరిగా ఎందుకు ఉందీ అనే ఆలోచన మనసును తొలిచేస్తూ ఉండగా, ఆమెతో మాటలు కలుపుతుంది.. నాలుగు నెలల క్రితం తన భర్త పోయాక, అన్నదమ్ముడు ఈమధ్యనే తీసుకొచ్చి కొడుకు దగ్గర దింపిపోయాడని, ఆ కొడుకు తనను ఇక్కడ కూర్చోపెట్టి ఏదో పని మీద బయటకు వెళ్ళాడనీ, తిరిగి వచ్చి తనను ఇంటికి తీసుకెళ్తాడనీ ఆమె నోట విన్నప్పుడు, తన కొడుకులు ఇచ్చిన అనుభవాలతో ఆ మహిళ మాటలను నమ్మలేక, ఆమె కొడుకుపై నమ్మకం ఉంచలేక ఆవిడ స్థితికి జాలిపడుతుంది రమణి.. మెల్లగా పొద్దు వాటారుతుంది.. తనకూ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి.. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాలి... పార్కులో అందరూ ఇళ్ళకి మళ్ళుతున్నారు.. ఓవైపు నీరసం, మరోవైపు ఒంటరిగా నగరానికి కొత్త అయి, తన కొడుకు ఉండే కాలనీ ఏదో తెలియక, కనీసం అతని ఫోన్ నంబర్ కూడా తెలియక అమాయకంగా కూర్చున్న ఈ మహిళ ను ఒంటరిగా వదిలి పోలేక, అసలు ఆమె కొడుకు వస్తాడా రాడా, లేక, ఈవిడను వదిలించుకోవడానికి ఇక్కడ వదిలి వెళ్ళాడా అనే అనేకానేక ఆలోచనలతో సతమతమవుతుంది.. తన ఇంటికి తీసుకెళ్ళచ్చు.. కానీ ఆవిడ ఎలాంటిదో.. లేదా ఏదో ఒక అనాధాశ్రమానికి పంపవచ్చు, ఎవరి సహాయమైనా తీసుకుని... ఇలాంటి ఎడతెగని సంశయాలతో, ఆఖరికి ఆమె కొడుకు రాడు అని తనకు తానే తీర్మానించుకుని ఆమె మీద ఎంతో జాలిపడుతుంది.. ఇక చేసేదేమీ లేక ఇంటికి వెళ్ళడానికి సిధ్ధం అవుతుంది.. ఆ మహిళ మాటల్లో తన కొడుకు పట్ల ప్రేమ, నమ్మకం స్థిరంగా ఉండడం చూసి, ఆమె అసహాయ స్థితికి బాధ పడుతుంది.. ఇంతలో పార్కు ముందు ఒక కారు ఆగడం , అందులోంచి ఒక వ్యక్తి దిగి వచ్చి, ఆమెను శ్రధ్ధగా, ప్రేమగా పొదివి పట్టుకుని నడిపిస్తూ,, "' రామ్మా !! ఇప్పటివరకూ ట్రాఫిక్ లో చిక్కుకున్నానమ్మా.. పాపం ఎంత టెన్షన్ పడి ఉంటావో!! ఆకలి కూడా వేస్తూ ఉండవచ్చు. నీకు ఇష్టమైన మిరపకాయ బజ్జీలు కార్లో ఉన్నాయి .. తిందువుగాని" అని ఎంతో అనురాగం తో తీసుకెళ్తున్న ఆమె కొడుకును చూసి అంతవరకు తన కొడుకులతో పోల్చుకుని అతనిని మోసగాడు అనుకుని ఆందోళన పడిన రమణికి... వీస్తున్న పిల్లగాలి కూడా వీపున ఛెళ్ళున చరచినట్లయింది"..
ఇదీ కథ.. కథ, కథనం, శైలి అత్యద్భుతంగా ఉండి.. ఒకసారి మొదలు పెడితే, ఆపకుండా చదివించే బలం ఉన్న కథ ఇది... చదువుతున్న ప్రతివ్యక్తీ ఉన్న రెండు పాత్రలలో తనను తాను ఐడెంటిఫై చేసుకునే కథ... చాలా బాగుంది.. ఒక్కసారి చదివితే సరిపోదు.. ఎందుకంటే కథ ముగింపు ఏమైందా అని ఆత్రంగా చదివేస్తాం మొదటిసారి.. ఆ కథ లో లీనమవ్వాలంటే మరోసారి సావధానంగా చదవాలి... అలా రెండో సారో, మూడో సారో చదివిన ఈ కథ జీవితాంతం మన మనసుల్లో చెరగని ముద్ర వేస్తుంది..
ఈ కథను అందించిన అత్తలూరి విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు...

6 june 2017

No comments:

Post a Comment