Sunday 6 April 2014

                                               /// శ్రీరామ ///

రామాయణం గురించి, రాముడి గురించి తెలియని భారతీయులు ఉండరు. కానీ, శ్రీరామ నవమి సందర్భంగా నాకు తెలిసిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.

ధర్మ స్థాపన కొరకు ఎన్నో అవతారాలు ఎత్తిన శ్రీ మహావిష్ణువు ఒక మానవుడిగా పుట్టి ఒక సామాన్య మానవుడు అనుభవించే కష్టాలు అన్ని అనుభవించాడు ఎందుకు, తను స్వయంగా దేవుడే కదా, అ కష్టాలు లేకుండా చేసుకోలేడా? చేసుకొగలడు కానీ, . మానవుడు తన కష్టాలన్నిటికీ భయపడకుండా, దేవుడైన రాముడే అన్ని కష్టాలు పడగా లేనిది మనం ఎంతవాళ్ళం అనే నిబ్బరాన్ని సమకుర్చుకోవడానికి తను ఒక సామాన్య  మానవుడిగా జీవించాడు. రామాయణం జరిగి కొన్ని వేల ఏళ్ళు ఆయినా రాముడిని మనం ఒక ఆదర్శ పురుషుడిగా గౌరవిస్తున్నాం అంటే అయన మనకు చూపించిన జీవన విధానమే అందుకు కారణం. తల్లి తండ్రులు, పెద్దల యెడల భక్తీ, తమ్ముల మిద ప్రేమ, స్నేహితులు, దాసులు, సహచరుల మిద అనురాగం, ప్రజల మిద మమకారం, ధైర్యం, శౌర్యం, వీరం, క్షమా, సత్యం, వాక్పరిపాలన, నిబద్ధత ఇవన్ని కలబొసిన మూర్తి రాముడు. మనం ఈరోజుకు కూడా ఒక కుమారుని, లేదా భర్త యొక్క సుగుణాలు చెప్పడానికి రాముడితో పోల్చడానికి కారణం అదే.

ఒక రాజవంశం లో పుట్టి, తన తండ్రి తరువాత రాజ్యం తనదే అని తెలిసీ, ఇక పట్టాభిషేక ముందు ఘడియలలో  కైక వనవాసానికి ఆజ్ఞ ఇచ్చినపుడు రాముడు కించిత్ కుడా క్రోధపడలేదు. వెంటనే అంగీకరించాడు. తన కన్నతల్లి కాకుండా కైక అజ్ఞాపించినపుడు నా కన్నతల్లి చెప్పలేదు కదా, ఈవిడ మాట పట్టుకుని నేను ఎందుకు వనములకు వెళ్ళాలి అనుకోలేదు. అక్కడ తండ్రి కైకకు ఇచ్చిన మాట రామునికి ముఖ్యం. కైక వద్ద తండ్రి వరం అబద్ధం కాకూడదు. ఒక కొడుకుగా తండ్రి మాట నిలబెట్టడం తన బాధ్యత. అందుకనే మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు.

అలాగే సమాజంలో ఒక నిమ్న వర్గానికి చెందిన చాకలి మాట పైన సీతమ్మవారిని అడవులకు పంపాడు. భార్యను, పైగా గర్భవతిని వనవాసం చేయించాడు. అంటే రామునికి జాలి లేదా? లేక కాదు. సీత మిద పూర్తీ నమ్మకం ఉన్నవాడు రాముడు. కానీ, తను పరిపాలించే రాజ్యంలో ఇక ముందు ఇటువంటి ఘటనలు జరిగితే తను ఏమని తీర్పు ఇస్తాడు? ఒక మచ్చ తనమీద ఉంటె తనకు తీర్పు ఇవ్వగలిగిన అర్హత ఏముంది? అందుకనే తనకు నమ్మకం ఉన్నా కూడా, ప్రజలకు సీత యొక్క సచ్చీలతను నిరూపించడం ఒక రాజుగా తనకు ముఖ్యం. అందుకనే సీతను అడవులకు పంపి తన ఆదర్శాన్ని నిరూపించుకున్నాడు. రావణ వధ తరువాత సీతను అగ్ని ప్రవేశం చేయించడానికి కూడా అదే కారణం.

శత్రు వర్గం లోని వాడు అయినప్పటికీ, రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణు కోరిన వెంటనే ఆదరించాడు. తనను శరణు జొచ్చిన శత్రువు నైనా ఆదరించే నిర్మల హృదయుడు రామ చంద్రుడు.

ఇంటికి వచ్చిన భరతుడు రాముని వనవాస దీక్ష తెలుసుకొని స్వయంగా తనకు రాజ్యం వద్దు అని, రాముడినే ఏలుకొమ్మని ప్రార్ధించినా, కైకకు ఇచ్చిన మాటకు కట్టుబడి తమ్ముని సౌమ్య వచనాలతో అనునయించిన ప్రేమమూర్తి.

ఇంతగా ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టే, ఈరోజుకి కూడా రాముణ్ణి తలచు కుంటున్నాం. మన దేశం లో రాజ్యం అంటే రామ రాజ్యమే, రాజు అంటే రాముడే. ప్రతి ఊరులోను, ప్రతి పేట లోను రాముడికి గుడి కట్టి పూజిస్తున్నాం. కష్టాల్లో ఉన్నపుడు రామా! ఎక్కడున్నావయ్యా అని స్మరించు కుంటున్నాం. రామ కథ చదివి అందులో లీనమైపోయినపుడు రాముడంతటి వాడికే తప్పలేదే అని కన్నీరు పెట్టుకుంటున్నాం.

భార్య అయిన సీతను అడవులకు పంపినప్పటికీ, అగ్ని ప్రవేశం చేయించి నప్పటికీ, ఈ దేశం లో పుట్టిన ప్రతి ఆడపిల్లా తనకు రాముడి లాంటి భర్తే కావాలి అని ప్రార్ధిస్తుంది. ఎందుకంటే రాముడు సుగుణాల రాశి. అటువంటి వాడు భర్త అయితే తన జీవితం నిర్విచారంగా సాగిపోతుంది.

రాముడిని మనం ఎంతగా సొంతం చేసుకున్నామంటే, రాముడి పెళ్లికి ఊరంతా సందడి.
ఊరంతా పందిళ్ళు,  మా రాముడు, మా సీతమ్మ అనే పిలుపులు తప్పితే దేవుడి పెళ్లి అని అనరు. ఎక్కడెక్కడినుంచో తలంబ్రాలు కానుకగా వస్తాయి. కళ్యాణం అయిన తర్వాత ఆ తలంబ్రాలే ఊరూరా, వాడవాడలా రాముని ఆశీర్వచనంగా పంచి పెట్ట బడతాయి.

రాముడు మనవాడు. మన ఇంటి వాడు, మన కంట నీరు తుడిచే వాడు. కష్టాల్లో మనకు తోడుగా ఉండే వాడు. ఆ రాముని పెళ్ళికి అందరు సిద్ధం కండి.

సర్వే జనా సుఖినో భవంతు.

                                    /// శ్రీ రామ ///

No comments:

Post a Comment