Friday 4 April 2014

అబ్బా, ఎండలు మండిపోతున్నాయి, సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు.... ఈ ఎండలు అసలు భరించలేకుండా ఉన్నాము..... ఇప్పుడు అందరి నోటా ఇవే మాటలు....నిజమే ఎండలు మండిపోతున్నాయి. మరి దీనికి కారణం ఎవరు?
ఆధునికత పేరుతొ చెట్లు కొట్టేసి ఫ్లాట్స్ కట్టేస్తున్నాం. రెండు చేతులా సంపాదిస్తున్నాం కదా అని ఒకటికి నాలుగు ఇళ్లు కోనేస్తున్నాం, లేదా కట్టేస్తున్నాం. సౌకర్యం పేరుతొ వాన నీరు భూమి లోకి ఇంకే వీలు లేకుండా ఇంటి పరిసరాలన్నీ సిమెంట్ చేయిన్చేస్తున్నాం. కనీసం ఇంటికి ఒక ఇంకుడు గుంత కట్టించాలి అనే ధ్యాస లేకుండా ఉంది మనకు. శుభ్రత పేరుతొ నీళ్ళను అడ్డు అదుపు లేకుండా వాడేస్తున్నాం. అంతగా నీరు సరిపోకపోతే, 700, 800 అడుగుల లోతుకి భూమిని తవ్వేస్తున్నాం.
ఒకప్పుడు గ్రామాల్లో ఉండే తాగునీటి చెరువులను కూడా కలుషితం చేసేసి అవి కూడా కనీసం వాడుకోవడానికి కుడా ఉపయోగపడకుండా చేసేసాం. ఫాషన్ మోజుతో మినరల్ వాటర్ కొనుక్కొని ఎముకలు పొడి పొడి చేసేసుకున్తున్నాం. పల్లెల్లో కూడా ఇదే పరిస్తితి. పల్లెలు పట్టణాలు తేడా లేకుండా చెరువులని పాడు పెట్టేస్తున్నాం. అవసరానికి చెట్లు కొట్టేసినా మళ్లీ మరిన్ని మొక్కలు పెంచాలి అనే ధ్యాస లేదు మనకు.
నీరు అనేది ఫ్యాక్టరీలలో తయారు చేసేది కాదు, పోనీ అష్టకష్టాలు పడి ఎక్కువ ఉత్పత్తి చేయడానికి. పంటలాగా పండించేది కాదు, ఎరువులో, మందులో వేసి ఎక్కువ పండించడానికి. పూర్తిగా భూమినుంచి రావలసినదే కదా... మరి ఏళ్ళ తరబడి అవసరానికి మించి వాడేసుకుంటే రాబోయే తరాల మాట ఏమిటి? పరిస్తితి ఇలాగె ఉంటె ముందు తరాల వాళ్ళు నీటి కోసం యుద్ధాలు చేసుకోవాలేమో? అప్పుడు కూడా డబ్బు ఉన్న వాడికే నీళ్లు అనే పధ్ధతి వస్తుంది. డబ్బు పెట్టినా భూమిలో నీరు ఉండాలి కదా?
నీరు నిత్యావసరం. నీరు లేకుండా రోజులో ఒక్క పని కూడా గడవదు. ఈ విషయం తెలిసినప్పటికీ మనం కొంచెం కూడా జాగ్రత్త తీసుకోవటం లేదు. ప్రభుత్వాలకు మన సంక్షేమం ఎలాగు పట్టదు సరే, మనకైన మన భవిష్యత్ పట్ల జాగ్రత్త ఉండాలి కదా! పెరిగే ఎండలు, వాతావరణ మార్పులు మనం చేతులారా చేసుకోన్న పాపాలే. మన దేశానికి పెట్టని గోడలుగా ఉన్న హిమాలయాలు కూడా కరిగి పోతున్నాయి అంటే మనం ఎంత ప్రమాదకర పరిస్తితులలో ఉన్నామో గమనించు కోవాలి.
నీటి వాడకం తగ్గించండి. వాననీరు భూమి లోకి ఇంకే ఏర్పాట్లు ప్రతి ఇంటిలోనూ చేసుకోండి. ఇప్పుడు ఇంకే నీరు మీ వారసులకి నీటి ఎద్దడి రానివ్వదు. వీలైనన్ని ఎక్కువ చెట్లు పెంచండి. ప్రభుత్వం మిద ఆధారపడకుండా స్వచ్చంద సంస్థల సాయం తో మీ ఊరిలోని చెరువులను, ప్రక్షాళన చేయండి. చేయి చేయి కలిపితే సాధించలేనిది ఏది లేదు. ఈనాడు నాటిన విత్తనం చెట్టై పెరిగి మీ వారసులకు ఫలాలను ఇచ్చినట్లే, మీరు ఈనాడు జాగ్రత్త చేసే ప్రతి నీటి బొట్టు మీ వారసుల అవసరాలు తీరుస్తుంది.

No comments:

Post a Comment