Tuesday 8 April 2014

రాముడు సీతని ఎందుకు వదిలేసాడు?
ఇది మనిషి అంతరంగానికి వాల్మీకి వేసిన అనంతబ్రహ్మాండమైన చిక్కుముడి.
రామాయణ పరమార్ధం తెలియని, తెలుసుకోలేని ప్రతీ ఒక్క అజ్ఞాని లేవనెత్తే
మొదటి ప్రశ్న ఇది.
రామున్ని దేవుడిలా, రామాయణాన్ని పుస్తకం లా చూసినన్ని రోజులు ఈ చిక్కుముడిని
మనిషి విప్పలేడు.
సీత స్వయంవరంలో అందరు అనుకున్నట్టు రాముడు శివధనుస్సు విరచలేదు. అది
విరిగింది. తీగని లాగి ధనుస్సుని కట్టడం వరకే రాముడు అనుకున్నాడు. ఆ
సమయంలో ఒక్క క్షణం సీత గురించి ఆలోచిస్తూ, తన కనురెప్పలు చూస్తూ ఆ
ఎమరపాటులో బలం ఎక్కువై, అదుపు తక్కువై ధనుస్సు విరిగింది. రాముడు సీతని
గెలిచాడు అని అందరూ ఆనందంగా ఉంటే, రాముడు మాత్రం మళ్ళీ ఇంద్రియాల చేతిలో
ఓడిపోకూడదని నిర్ణయం తీసుకుంటాడు. దాన్నే ఒక సూత్రంగా మలుచుకుంటాడు.
అదే...ధర్మం కోసం కోరికలని వదిలెయ్యడం.
ఆ సూత్రమే రామాయణానికి పునాధి. రాముడి వ్యక్తిత్వానికి ఆయువుపట్టు.
బంధాలని త్యజించి బాధ్యతలని పూర్తి చేయడమే మనిషి కర్తవ్యం.
రామాయణంలో రాముడు ఇదే చేశాడు. గీతలో కృష్ణుడు ఇదే చెప్పాడు.
సీత మీద తన ప్రేమని ప్రపంచానికి చెప్పాల్సిన, నిరూపించాల్సిన
అవసరం రాముడికి లేదు.
చరిత్రలో భార్య కోసం యుద్దం చేసిన ఏకైక వ్యక్తి రాముడు.
వయసులో ఉండి కూడా 13 సంవత్సరాలు, ప్రతీ రాత్రి, తనకీ సీతకి మధ్యలో
కోదండం పెట్టి పడుకున్న వ్యక్తి రాముడు.
శత్రువులని కూడా చంపిన తరవాత తన చేతులతో గౌరవంగా దహన సంస్కారాలు చేసి
ఆత్మకు శాంతి కోరుకునే యోధుడు రాముడు.
అడుక్కునే వాడికి రూపాయి వేయడానికే వెయ్యి సార్లు ఆలోచించే వేదాంతులం మనం.
అలాంటిది మాట కోసం రాజ్యాన్ని, స్నేహం కోసం నియామాన్ని, ప్రజల
కోసం భార్యని త్యజించిన వాడు రాముడు.
ఇదే వాల్మీకి సమాజం నుండి కోరుకున్నది. ఇందుకే రామాయణంలో రామున్ని
తాను ఎక్కడా దేవుడు అని చెప్పలేదు. మనలాగే, మనిషిలాగే చూపించాడు.
బంగారు లేడిలా రామున్ని మోసం చేశాడు. సీతని ఎత్తుకెళ్ళి రామున్ని ఏడిపించాడు.
కుటుంబం నుండి దూరం చేశాడు. వర్షంలో తడిపించాడు. కానీ అక్కడే, ఆ ప్రయాణంలోనే,
సీత కోసం ఇద్దరితో మొదలైన వేటని ఒక అఖండ సేనగా, ప్రాణాలిచ్చే బంటులతో
దిగ్విజయంగా ముగించి ఒక మనిషి దేవుడు లా ఎలా మారుతాడో చూపించాడు.
రాముడిని శ్రీరాముడుగా మలచాడు.
దేన్ని దేని కోసం వదులుకోవచ్చో తెలుసుకొని పాటించిన రోజు...మనమే రాముడు, మన
ఆత్మే సీత, మన ఇల్లే అయోధ్య!

No comments:

Post a Comment