Sunday, 10 August 2014

మిత్రులకు వందనం...

ఈ మధ్య నేను ఒక మంచి పుస్తకం చదివాను. పుస్తకం పేరు, రచయిత్రి పేరు ఇక్కడ అప్రస్తుతం . అందులో విషయం ఏమిటంటే, సమాజం లో ఎంతో అట్టడుగు వర్ణం బాలికలు, ఆర్ధికం గా చాల వెనుకబడిన కుటుంబాలకు చెందిన వాళ్ళు, ఎంత అంటే కనీసం రెండు రోజులకు ఒకపూట కూడా తినడానికి దొరకని పరిస్థితి. కుటుంబంలో ఆడపిల్ల కన్నా, మగపిల్లవాడు ఎక్కువ అనే నేపధ్యం నుంచి వచ్చిన బాలికలు, ఎవరి స్పూర్తి లేకుండా, వారి స్వంత ఆలోచనలతో, మనకు ఇటువంటి జీవితం వద్దు, మనం కూడా ఏదైనా సాధించాలి అనే తపనతో, పుస్తకాలు కూడా లేకుండా, కేవలం చదువు మీద, భవిష్యత్తు మీద ఉన్న నమ్మకంతో నానా కష్టాలు పడి చదువుకుని, సంఘం లో ఉన్నతమైన స్థితిలో నిలిచినా మహిళల గాధలు అవి. అందులో ఒకరు అమెరికాలో సైంటిస్ట్ గా, ఒకరు డాక్టర్ గా,కవయిత్రిగా , ఒకరు ప్రొఫెసర్ గా ప్రసిద్ధి పొందారు. వాళ్ళ జీవితాల గురించి చదువుతుంటే ఒక్కోసారి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి, మనుషులు ఇంత దుర్భర పరిస్థితులలో కూడా జివిస్తారా? అనిపించింది. ఉన్న ఒక్క ముద్ద కోసం కొట్టుకునే బ్రతుకులు కూడా ఉంటాయా? అనిపించింది. అటువంటి ప్రతికూల  పరిస్థితులలో, ఎందుకురా ఈ జీవితం అనుకోకుండా, చదువుకుని అంత ఉన్నత స్థాయికి వెళ్ళిన మహిళలకు జోహార్లు చెప్పకుండా ఉండలేకపోయాను. అటువంటి వారిని ప్రతి బాలికా, ప్రతి స్త్రీ స్పూర్తి గా తీసుకోవాలి. అన్నీ అమర్చి పెట్టినా, చిన్న చిన్న విషయాలకే చికాకు పడడం, ఏంటి ఈ వెధవ జీవితం అనుకోవడం, ఉన్న సౌకర్యాలలో ఏమాత్రం కొరత వచ్చినా ఆందోళన పడిపోవడం ఈ తరం పిల్లలకు బాగా అలవాటు అవుతున్నాయి. దీనికి కారణం, మానసిక స్థైర్యం లేకపోవడం, తల్లి తండ్రుల ఆలోచనా ధోరణి, సంపాదన ఎక్కువై, పెద్ద పెద్ద సమస్యలు లేకపోవడం వలన, బ్రతుకును గడపడానికి ఎక్కువ సంఘర్షణ అవసరం లేకపోవడం వలన, చిన్న చిన్న సమస్యలే, పెద్ద పెద్ద విషయాలుగా పరిగణించి అనవసర ఆందోళన పడుతున్నారు. ఈరోజుల్లో పిల్లలకు ఒక పార్టీకి వెళ్ళలేక పొతే బాధ, అనుకున్న రోజున పిజ్జా తినలేక పోతే బాధ, స్నేహితుల పుట్టిన రోజుకి బహుమతి ఇవ్వలేకపోతే బాధ, వేసుకునే డ్రెస్ పైకి మాచింగ్ జెవేల్లరీ లేకపోతే బాధ. మనకన్నా డబ్బు ఉన్నవాళ్ళను చూసి వాళ్ళలా మనం ఉండలేక పోతున్నాం అనే బాధ. దీనికి కారణం జీవితం పైన సరి అయిన అవగాహనా లేకపోవడమే. ఇందులో తల్లితండ్రుల తప్పు కూడా ఉంది. నిజానికి చాల శాతం తల్లితండ్రులు ఈ రోజున మంచి స్థితిలో ఉన్నా కూడా, వారు జీవితం మొదలు పెట్టిన తోలి రోజుల్లో, ఆర్ధికంగా, ఇతరత్రా కష్టాలు పడినవారే. వారు ఏమనుకున్తున్నారంటే, మేము కష్టాలు పడ్డాము కాబట్టి, మా పిల్లలు ఆ కష్టాలు పడకూడదు అని ముద్దుగా, గారాబంగా చూస్తూ అడిగిన వన్నీ అందజేస్తున్నారు. దానితో, పిల్లలకు అసలు బాధ్యత తెలియకుండా పోతోంది. చిన్న చిన్న విషయాలకే ధైర్యం కోల్పోతున్నారు. వివాహానంతర జీవితం లో కూడా సమస్యలకు ఇదే కారణం అవుతోంది. ప్రతి చిన్న విషయానికి అవగాహనా లేకుండా గొడవలు పడడం, నీతో నాకు సరిపడదు, విడిపోదాం అనే నిర్ణయానికి రావడం. ఫలితంగా జీవితం లో అంతులేని అశాంతి.

పరిష్కారం లేని సమస్యలు ఉండవు. సమస్య యొక్క మూలాన్ని వెతుక్కొని, నిదానంగా, సహనంతో ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక్కటి గమనించుకోండి. తిండికి కూడా లేని వారు, సరి అయిన ఆరోగ్యం లేనివారు, సరి అయిన రవాణా సౌకర్యాలు కూడా లేని మారుమూల గ్రామాల వాళ్ళు , వికలాంగులు ఎంతోమంది చదువులోనే కాక, వివిధ రంగాలలో రాణిస్తున్నారు. వారందరిదీ జీవన పోరాటం, ఎంతో శ్రమించి  వారి గమ్యాన్ని చేరుకుంటున్నారు. దానిలో విజయం సాధిస్తున్నారు. వారితో పోలిస్తే చాల మంది జీవితం అమర్చి పెట్టినట్టు ఉంటోంది. దానిని గౌరవించండి.  జీవితాన్ని ప్రేమించండి. సమస్యల నుంచి పారిపోకుండా పోరాడండి. విజయం సాధించండి.

No comments:

Post a Comment