Wednesday, 18 February 2015

సాధారణంగా హిందువుల పండుగలు అన్నీ ప్రకృతి తో ముడిపడి ఉంటాయి. ఆ యా ఋతువులలో పూచే పూలు, పండే పంటలు , ఆ ఋతువు యొక్క నేపధ్యంతోనే చాలా వరకు మనం పండుగలు జరుపుకుంటాము. మన దేశం వ్యవసాయ ప్రధానమైన దేశం కనుక ఆ యా పంటలు ఇంటికి వచ్చేవేళ, వ్యవసాయ పనులు అయిపోయి, రైతులు ఖాళీగా ఉండే వేళ మనకు పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ అయ్యింది. ముఖ్యంగా తెలుగు వారికీ సంక్రాంతి, బతుకమ్మ పండుగలు, పంజాబీ వారికీ బైశాఖి, అస్సాం వారికీ బిహు పండుగలు ఇలా వచ్చినవే.
ఈ ఆశ్వయుజ మాసంలో దేశం అంతటా దసరా నవరాత్రులు ఎంత వైభవంగా జరుపుకుంటారో, తెలంగాణా ప్రజలు "బతుకమ్మ పండుగ" ను ఇంకా వైభవంగా జరుపుకుంటారు. వారికీ పెద్ద పండుగ ఇది. ఈ పండగ హడావిడి అంతా స్త్రీలదే. ఎక్కడెక్కడో దూర ప్రాంతాలలో ఉన్న, విదేశాలలో ఉన్న అడపడుచులందరూ కూడా పుట్టింటికి వస్తారు. చుట్టాలు, బంధువుల కలయిక తో అన్ని గృహాలు కళకళ లాడుతూ ఉంటాయి. ఈ సమయం లోనే జొన్న, మొక్కజొన్న, వంటి పంటలు చేతికి వస్తాయి. గునుగు, తంగేడు, వంటి పూలు పూస్తాయి. అటు ఎక్కువ చలి లేకుండా, ఎక్కువ ఎండా లేకుండా , ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది.
బతుకమ్మ పండుగను 10 రోజులు జరుపుతారు. పూర్వము దక్షిణ దేశాన్ని పాలించిన ధర్మాంగదుడు అనే ఒక చక్రవర్తికి సంతానం లేకపోతె, అయన ఎన్నో పూజలు నోములు చేశాడుట. చివరికి లక్ష్మి దేవి అనుగ్రహం తో అయన భార్య ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. చిన్న తనం నుంచీ ఆమె ఎన్నో గండాలు దాటింది. అందుకు ఆమెకు ఈ విధమైన గండాలు లేకుండా, చల్లగా బతకాలని , ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేసారుట. అందుకే ఈ పండుగ నాడు కన్నెపిల్లలు తమకు చక్కని భర్త, చక్కని సంతానం లభించి తమ బ్రతుకు చల్లగా సాగిపోవాలి అని ప్రార్ధిస్తారు.
ఈ పండుగను పితృ అమావాస్య నాడు ప్రారంభిస్తారు. రంగులు అద్దిన గునుగు పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి , గులాబి పూవులు, తో ఒక రాగి పళ్ళెం లో వరుసగా పూవులు పేర్చి ఒక గోపురం లా తయారు చేస్తారు. దానిపై ఒక చిన్న పళ్ళెం లో పసుపు ముద్దను ఉంచుతారు. అదే బతుకమ్మ. గౌరీదేవికి ప్రతీక. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. మహిళలు అందరూ సాయంత్రం బతుకమ్మను పేర్చి, తమ ఇంటివద్ద ఉన్న దేవాలయాలలో ఈ బతుకమ్మను పెడతారు. అలాగే ప్రతి రోజు చేస్తారు. ప్రతి రోజు సాయంత్రం బతుకమ్మను పేర్చి, ఇంటిలో పూజ మందిరం లో ఉంచి 9 రోజులు తొమ్మిది రకాల సద్దులు నివేదిస్తారు. జొన్న, రాగి, మొక్కజొన్న, వేరుసెనగ లాంటి గింజ ధాన్యాలను కొద్దిగా వేయించి , పొడి కొట్టి, వాటిని బెల్లం కలిపి ముద్దగా చేసిన పదార్ధాన్ని సత్తులు లేదా సద్దులు అంటారు. ఈ పండుగ లో ఈ సద్దులే ముఖ్యమైన నివేదన బతుకమ్మకు.
ఇక పండుగ చివరి రోజు అయిన సద్దుల బతుకమ్మ మొత్తం తెలంగాణలో అత్యంత మనోహరమైన పండుగ రోజు. స్త్రీలందరూ తమకు ఉన్నంతలో ఘనంగా అలంకరించుకొని, పట్టు చీరలతో కళకళ లాడుతుంటారు. ఈరోజు బతుకమ్మలను మిగిలిన రోజుల కన్నా వైవిధ్యంగా, పెద్దగా అమరుస్తారు. దగ్గర లోని దేవాలయం లలో కానీ, తోటలలో కాని, లేదా చెరువుల వద్ద ఉన్న ఖాళీ స్థలాలలో కానీ, మహిళలు పెద్ద సంఖ్యలో చేరి, వారి వారి బతుకమ్మలను అక్కడ ఉంచుతారు. మధ్యలో బతుకమ్మలను పెట్టి, స్త్రీలందరూ వాటి చుట్టూ తిరుగుతూ, చేతులు తడుతూ , బతుకమ్మ పాటలు పాడుతారు. బాగా రాత్రి అయినాక వాటిని పక్కన ఉన్న చెరువులలో, లేదా కుంటలలో నిమజ్జనం చేస్తారు. ఒకరి కొకరు తమ ఇంటివద్ద నుండి తెచ్చిన వివిధ రకాల సత్తులను వాయనంగా అందించుకుంటారు. మహిళలు అందరూ గొంతు కలిపి పాడే ఈ బతుకమ్మ పాటలు ఎంతో వినసొంపుగా ఉంటాయి.
ఈ పండుగ తెలంగాణా యొక్క వైభవానికి ప్రతీక. ఈ 10 రోజులూ మార్కెట్స్ అన్ని కిటకిట లాడుతుంటాయి. వెండి , బంగారం, వస్త్ర దుకానాలే కాక, పల్లెల నుంచి తెచ్చి అమ్మే గునుగు, తంగేడు, బంతి, చామంతి పూల అమ్మకం దారులతో, రంగు రంగుల పూవులతో, రోడ్లు అన్ని ఎంతో శోభాయమానంగా ఉంటాయి. ప్రజలు అందరూ ఒక్క క్షణం తీరిక లేకుండా ఉంటారు. ప్రతి ఒక్కరూ ఈ వైభవాన్ని చూసి తీరవలసినదే.
విజయ దశమి నాడు తమ తమ వాహనాలకు, పనిముట్లకు పూజలు చేస్తారు. దేవాలయ సందర్శన చేసిన తరువాత, జమ్మి ఆకులను సేకరించుకొని, పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి వద్ద నుండి, కానుకలు, ఆశీర్వచనాలు తీసుకొంటారు. పాలపిట్టను చూసి, మిత్రులను కలుసుకొని, పండుగను ముగిస్తారు. ఈ పండుగలో మగవారు కూడా అత్యంత శ్రద్ధా భక్తులతో పాల్గొంటారు. ఎక్కడెక్కడో స్థిరపడిన తమ పాత మిత్రులను, సావాసగాళ్ళను కలుసుకునే తరుణం ఇదే. ఈ పండుగ లో అందరూ పేద గొప్ప బేధాలను, కుల బేధాలను పక్కన పెట్టేస్తారు. ఎంత గొప్పవాళ్ళు అయినా, ఎంత ధనికులు అయినా అందరితో పటు బతుకమ్మను పేర్చి, పాటలు పాడతారు.

No comments:

Post a Comment